#మంచుతాకినప్రేమ, #ManchuThakinaPrema, #ChaithraShreeSaiJyothi Chinthakrindi, #చైత్రశ్రీసాయిజ్యోతిచింతక్రింది, #TeluguSerials, #TeluguNovel, #TeluguLoveStories, #తెలుగుప్రేమకథలు

Manchu Thakina Prema - Episode 15 - New Telugu Web Series - Written By - Chaithra Shree Sai Jyothi Chinthakrindi Published In manatelugukathalu.com On 11/03/2025
మంచు తాకిన ప్రేమ - ఎపిసోడ్ 15 - తెలుగు ధారావాహిక చివరి భాగం
రచన: చైత్ర శ్రీ సాయి జ్యోతి చింత క్రింది
కథా పఠనం: పెనుమాక వసంత
జరిగిన కథ:
శ్రీనగర్ కు కొంత దూరాన ఉన్న బని హాల్ ప్రాంతంలో సినిమా షూటింగ్ జరుగుతూ ఉంటుంది. అంతలో కొండ చరియలు విరిగి పడబోతున్నట్లు హెచ్చరిక వినపడుతుంది.
గతంలో ఇదే ప్రదేశంలో కాలేజ్ విద్యార్ధుల టూర్ లో రవి, హిమతో ఒక షార్ట్ ఫిలిం తీస్తూ ఉంటాడు. అందులో హిమకు ప్రపోజ్ చేస్తాడు. టూర్ లో ఉండగానే నిజ జీవితంలో కూడా హిమకు ప్రపోజ్ చేస్తాడు రవి. తమ ప్రేమ నిజమైతే మరో పది రోజుల్లో తిరిగి కలుస్తామని చెబుతాడు. హిమ, రవి క్లోజ్ గా ఉన్న ఫోటోలు చూసిన హిమ తలిదండ్రులు ఆమెను అనుమానిస్తారు. అరకు టూర్ వెళ్లిన హిమను రవి కలుస్తాడు.
అక్కడకు వచ్చిన హిమ తండ్రి హిమను ఇంటికి తీసుకొని వెళతాడు. హిమకు కాల్ చేస్తాడు రవి. హిమని ఇంటి దగ్గర కలిసివచ్చిన రవిని రౌడీలతో కొట్టిస్తాడు ప్రభాకర్. రవికాంత్ ని ఇక కలవనని చెబుతుంది హిమ. కెరీర్ పై దృష్టి పెడతాడు రవికాంత్. ప్రభాకర్ నిజ స్వరూపం తెలుసుకున్న హిమ తండ్రి ఆమె ప్రేమకు ఆమోదం తెలుపుతాడు. రవిని కలవడానికి వెళ్తుంది హిమ.
ఇక మంచు తాకిన ప్రేమ - ఎపిసోడ్ 15 ( చివరి భాగం) చదవండి.
జమ్మూ కాశ్మీర్ లోని బనిహాల్ ప్రాంతం ఆ సాయంత్రం వేళ మృత్యువుకు వేదికగా మారి ప్రకృతి విలయతాండవం చేస్తుంది.
ప్రేమ పరవశంలో మునిగిపోయిన ఆ జంటకి పరిస్థితి క్షణక్షణానికి ఎంత భయంకరంగా మారుతుందో గమనించుకోలేకపోతున్నారు..
“రవీ! చాలా నీరసంగా ఉంది. కళ్ళు తిరుగుతున్నాయి,
నిన్నటి నుండి నువ్వు ఇక్కడే ఉన్నావని, వస్తావని నమ్మకంతో ఇక్కడే ఎదురు చూస్తూ ఉన్నాను. ఇక నావల్ల కావడం లేదు. నాకు చాలా భయంగా ఉంది. మళ్లీ నీకు దూరం అయిపోతానేమో అని అనిపిస్తోంది.. ఈసారి మృత్యువు మనల్ని విడదీస్తుందేమో?”
“హిమా! పిచ్చిపిచ్చిగా మాట్లాడకు. ఇటు చూడు.. కళ్ళు మూయకు. నిన్ను నేను రెండోసారి దూరం చేసుకోలేను”
తన బ్యాగ్ లో ఉన్న స్వెటర్ తీసి హిమకు వేసి తలకు పెట్టి పాదాలకు షూ వేసి, హిమని రెండు చేతులతో ఎత్తుకొని మంచు పొగని చీల్చుకుంటూ వెలుగుని వెతుక్కుంటూ పరుగులు తీస్తాడు రవికాంత్.
పరుగులు తీస్తున్న రవి కాళ్లకు మంచుకొండ చెరియ విరిగి అడ్డం పడడంతో పరుగుని ఆపుకోలేక హిమబిందువుతో సహా కింద పడిపోతారు.
తలకి దెబ్బ తగలడంతో ‘రవీ!’ అని బిగ్గరగా అరుస్తుంది హిమబిందు.
“ఏమీ కాలేదు. నేను నీ పక్కనే ఉన్నాను. చూడు హిమా..” అంటూ హిమని దగ్గరగా తీసుకుని చెక్కిలిపై మృదువుగా తడుతూ “కళ్ళు తెరువు” అని పిలుస్తాడు..
మంచు నేల శరీరాన్ని మొద్దు బరుస్తుంది. రక్తం గడ్డకట్టేలా చేస్తుంది. ప్రకృతి ప్రళయం వలన విరిగిపడిన మంచుకొండ చెరియలు ఊపిరి ఆడనివ్వడం లేదు. మృత్యువు వలలో చిక్కుకున్న ఆ ఇద్దరు శక్తినంత కూడగట్టి ప్రాణాలను నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.
యమపాశం వారి ప్రాణాలను హరించడానికి గాలిలో చెక్కర్లు కొడుతూ వస్తుంది. రెండు గంటల నుండి ఎడతెరిపి లేకుండా విజృంభించిన ప్రకృతి విలయ తాండవం కొంత శాంతించింది. ఒకరి కౌగిలి నుండి మరొకరు వేడిని పొందుతూ, ఒకరి ఊపిరిని మరొకరు శ్వాసగా మార్చుకుని,
కొన ఊపిరితో ప్రాణాలతో కొట్టుమిట్టులాడుతూ, ఒకరికి ఒకరు ధైర్యం చెప్పుకుంటూ
“రవీ. ఒకటి అడగాలని ఉంది.”
“ఏంటి హిమ.. అడుగు.”
“నాకోసం ఒక జోల పాట పాడుతావా. ఒకవేళ మన జీవితంలో ఇదే ఆఖరి రాత్రి అయితే శాశ్వత నిద్రలోకి నీ పాట వింటూ వెళ్లడంలో నాకు ఎంతో ఆనందం ఉంటుంది. నీతో కలిసి జీవితాన్ని పంచుకో లేకపోయినా చావుని పంచుకుంటునందుకు చాలా చాలా సంతోషంగా ఉంది..”
“పాడుతాను హిమ.. కానీ నువ్వు శాశ్వత నిద్రలోకి వెళ్లడానికి కాదు. నీకు ధైర్యం ఇవ్వడానికి ఈ రాత్రి అంతా పాడుతూనే ఉంటాను..
నిదురపో ఓ నా చెలి నిదురపో నా ఒడినే పాన్పుగా చేసుకుని నా గుండె సవ్వడినే జోల పాటగా చేసుకుని నిదురపో
చందమామ చెంతకు చేరిన వేళ
జాబిలమ్మ జోల పాటలు పాడిన వేళ
నిదురపో నిదురపో నా ఊహల ఊయలలో..”
అంటూ రవికాంత్ పాడుతూ ఉండగా అతని మోముని చేతుల్లోకి తీసుకొని నుదిటిపై చుంబించి “రవికాంత్! ఐ లవ్ యు. ఐ లవ్ యు సో మచ్” అని చెప్పి హిమబిందు నిద్రలోకి జారిపోయి కళ్ళు మూతలు పడిపోతాయి.
రవికాంత్ ఎంత పిలుస్తున్నా పలకకుండా చలనం లేని బొమ్మలా పడుకుండిపోతుంది.
హిమను పిలిచి పిలిచి అలసిపోయి రవికాంత్ హిమబిందు హృదయం పై తల ఉంచి కళ్ళు మూసుకొని వెలుగుని కోల్పోయిన రవి కిరణం వలె ఒరిగిపోతాడు..
***
“మూవీ పాప్కాన్ కార్యక్రమానికి అందరికీ స్వాగతం.
సెలబ్రిటీస్ ల జీవితంలో జరిగే కొన్ని విషయాలను మీ ముందు పెట్టడం కోసం ఎప్పటిలాగే ఈ కార్యక్రమం మీ ముందుకు వచ్చేసింది..
ఈరోజు మనం మాట్లాడుకోబోయే సెలబ్రిటీ యంగ్ అండ్ ఎనర్జిటిక్ డైరెక్టర్ రవికాంత్..
చిన్న వయసులోనే డైరెక్టర్ అయ్యి, ఒక సినిమాతో సక్సెస్ ని తన ఖాతాలో వేసుకుని బెస్ట్ డెబ్యు డైరెక్టర్ గా అవార్డుని అందుకున్నారు రవికాంత్.
ఇవాళ డైరెక్టర్ రవికాంత్ తన బ్యాచిలర్ లైఫ్ కి గుడ్ బాయ్ చెప్పి ఫ్యామిలీ మెన్ గా కొత్త జీవితాన్ని స్టార్ట్ చేశారు. కాలేజ్ డేస్ లో తను ప్రేమించిన హిమబిందుని పెళ్లి చేసుకుని ఒకటయ్యారు..
అంతేకాకుండా ఆయన డైరెక్ట్ చేసిన రెండవ సినిమా కూడా ఈ రోజే రిలీజ్ అయ్యి మంచి సక్సెస్ రేట్ ని సాధించింది. తను ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయితో కలిసి రిలీజ్ రోజున సినిమా చూడడం అన్నది ఆయన డ్రీమంట,
మూవీని చూసి తిరిగి వస్తున్న రవికాంత్ గారు మన టీం అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చి కొంతసేపు ముచ్చటించారు. మరి ఆ ముచ్చట్లు ఏంటో మనం కూడా తెలుసుకుందాం రండి..
“సార్. మీరు రీసెంట్ గా మంచు ప్రమాదం నుండి బయట పడ్డారని విన్నాము. అసలు ఆ బనీహాలు ప్రాంతంలో ఏం జరిగింది.. ఎలా మీరు బయటపడ్డారు? ఆ ప్రమాదంలో మీతో పాటు ఉన్నది మీ భార్య హిమబిందువే అని తెలిసింది అది నిజమేనా?”
“ముందుగా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నా అభినందనలు. నా రెండో సినిమాని కూడా ఆదరించి నాకు సక్సెస్ తెచ్చి పెట్టినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు.
అలాగే నా వెడ్డింగ్ సందర్భంగా నన్ను విష్ చేసిన వాళ్లకు, గిఫ్ట్ పంపించిన వాళ్లకు మై హాట్ ఫుల్ థాంక్స్. ముందుగా మీరు అడిగిన రెండో ప్రశ్న జవాబు..
ఆ ప్రమాదంలో నాతోపాటు ఉన్నది నా భార్య హిమబిందునే. ఇద్దరం కలిసి ఆ రిస్క్ లో ఎన్నో సర్కస్లు చేశాము.
ఇప్పుడు మీ మొదటి ప్రశ్నకు నా జవాబు..
ఆ ప్రమాదంలో పోరాడి పోరాడి ఓడిపోయి మేము స్పృహ తప్పి పోయి పడి ఉన్నాము. ఆ రాత్రంతా ఎలా గడిచిందో మాకు తెలియలేదు. ఉదయం కాగానే కొద్ది కొద్దిగా సూర్య కిరణాలు ఆ ప్రాంతం పై పడుతూ ఉన్నాయి. నాకు కొంచెం మేల్కువ వచ్చింది. హిమబిందు మాత్రం చలనం లేకుండా అలాగే పడుకొని ఉంది.
ఆ వెలుగులో ఒక సాధువు మా దగ్గరకు వచ్చి ‘మీరు ప్రమాదాన్ని అధిగమించారు. వైష్ణవి మాత అనుగ్రహం మీరు పొందారు. ఆ అమ్మవారు నాతో ఈ రక్షణ మీకు కట్టమని పంపించారు..’ అని చెబుతూ అమ్మవారి అనుగ్రహంతో ఉన్న ఆ దారాలను మా ఇద్దరి చేతులకు కట్టి ‘నీకు ప్రమాదం ఏమీ లేదు. వైష్ణవి మాత సాక్షాత్తు మహాకాళి స్వరూపం. ఆవిడ అనుగ్రహం పొందిన వారు మృత్యువు ని సైతం జయిస్తారు. మీకు అంతా శుభమే జరుగుతుంది’ అని చెప్పి అక్కడి నుండి అదృశ్యమయ్యాడు..”
“సార్! మీ ప్రేమ కథ ఎక్కడ మొదలైంది?”
“చూసిన తొలి క్షణంలోనే ప్రేమించా. కాకపోతే జమ్ము కాశ్మీర్లోని బనిహళ్ ప్రాంతంలో మా ప్రేమ చిగురించింది.”
“మేడం సార్ ని మీరు ముద్దుగా ఏమని పిలుస్తారు?”
“నా మొహానికి అంత అదృష్టం కూడానా” అంటూ నవ్వుతాడు రవికాంత్.
హిమబిందు సిగ్గుపడుతూ “పేరుతోనే పిలుస్తాను. రవికాంత్.. రవి..” అనే చెప్తుంది..
“సార్! మేడమ్ ని మీరు ఏమని పిలుస్తారు?”
“తింగరి అని పిలుస్తాను.”
“మేడం, ఇంకో లాస్ట్ క్వశ్చన్. అంతే..
మేడం, సార్ లో మీకు బాగా నచ్చేవి?”
“తన కాన్ఫిడెన్స్, పాజిటివ్ థింకింగ్..”
“ఓకే, థాంక్యూ సార్.. థాంక్యూ మేడం.. మీరు త్వరలోనే మా ఛానల్ కి ఒక ఇంటర్వ్యూ ఇవ్వాలని కోరుకుంటున్నాము.”
“చూశారు కదా.. ఇది ఇవాల్టి మూవీ పాప్కాన్ కార్యక్రమం. మరో కార్యక్రమంలో మరో సెలబ్రిటీ కి సంబంధించిన విషయాలతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు టేక్కేర్. కీప్ స్మైలింగ్ బాయ్ బాయ్..”
***
“ఎక్సలెంట్ బబ్లు, కథ చాలా అంటే.. చాలా చాలా బాగుంది అంటూ 40 సంవత్సరాల వ్యక్తి క్లాప్ కొడుతూ నిలబడి ఎదురుగా ఉన్న అబ్బాయికి షేక్ హ్యాండ్ ఇచ్చి అప్రిషియేట్ చేస్తాడు.
“ఈ కథ ఒక్క సినిమాతోనే సక్సెస్ ని సొంతం చేసుకొని రెండో సినిమా షూటింగ్లో మంచు ప్రమాదానికి గురి అయ్యి, తన ప్రియురాలు హిమబిందువుతో కలిసి బని హాల్ ప్రాంతంలో ప్రాణాలు కోల్పోయిన డైరెక్టర్ రవికాంత్ ది కదా..
అయితే, నువ్వు ఈ కథలో వాళ్లు ప్రమాదం నుండి బయటపడినట్టు, పెళ్లి చేసుకున్నట్టు హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నట్టు చూపించావు ఎందుకు?”
“సార్! వాడు నా ప్రాణ స్నేహితుడు. వాడు కన్న కలని నేను నిజం చేయాలి అని అనుకున్నాను. వాడి సంకల్ప బలం ఓడిపోయిన వాడి నమ్మకం గెలవాలి అని అనుకున్నాను.
వాడు ప్రాణాలతో లేకపోయినా వాడి ప్రేమకు ప్రాణం పోయాలని అనుకున్నాను.
అందుకే మంచు తాకిన ప్రేమ అనే సినిమా రూపంలో వాడి కథను తెరకెక్కించి రవికాంత్ హిమబిందువుల పాత్రలు ఎప్పటికీ ప్రజల హృదయాల్లో నిలిచిపోవాలని రవికాంత్ హిమబిందువుల వాస్తవ కథను ఆధారంగా చేసుకుని ఈ కథను రాసుకున్నాను..”
అంటూ మంచు తాకిన ప్రేమ అని అందమైన డిజైన్ తో టైటిల్ ఒకపక్క, మరో పక్క హిమబిందు రవికాంత్ ఫోటోతో ఉన్న బుక్ ని ఆ వ్యక్తి చేతిలో పెడుతూ,
“సార్! మీరు ఎంతో అనుభవం ఉన్న దర్శకులు. ఈ సినిమాని మీ చేతుల్లో పెడుతున్నాను. దీనికి సంబంధించిన ఏ చిన్న ఇన్ఫర్మేషన్ కావాలన్నా మీరు నన్ను అడిగి తెలుసుకోవచ్చు..”
“అలాగే బబ్లు. తప్పకుండా అడుగుతాను. అయినా నువ్వు ఇచ్చిన కథలోనే చాలా ఇన్ఫర్మేషన్ ఉంది ఇంతకుమించి అవసరం లేదు.”
“ఓకే సార్! వెళ్లొస్తాను. మళ్లీ ఈ సినిమా సక్సెస్ మీట్ లో కలుస్తాను.”
“అలాగే యంగ్ బాయ్. ఎవరి స్వార్థం వాళ్లు చూసుకునే ఈ కాలంలో నీ స్నేహితుడి కోసం ఇంత సమయం వెచ్చించి స్క్రిప్ట్ రాసుకొని తన కధని సినిమా రూపంలో
తెరకెక్కించాలి అన్న నీ ఆలోచనకి హాట్సాఫ్. ఈ సినిమా మంచి హిట్ కొడుతుంది ఆ బాధ్యత నాది. మంచు తాకిన ప్రేమ అనే సినిమా ద్వారా ఒక మంచి రైటర్ సినీ ఫీల్డ్ కి రాబోతున్నాడు..”
=======================================================================
సమాప్తం
మంచు తాకిన ప్రేమ ధారావాహికను ఆదరించిన పాఠకులకు మనతెలుగుకథలు.కామ్ తరఫున, రచయిత్రి చైత్ర శ్రీ సాయి జ్యోతి చింత క్రింది గారి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము.
========================================================================
చైత్ర శ్రీ సాయి జ్యోతి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం: https://www.manatelugukathalu.com/profile/saijyothi
చైత్ర శ్రీ. సాయి జ్యోతి చింత క్రింది.
వృత్తి జూనియర్ అసిస్టెంట్ జిల్లా పరిషత్ నూతక్కి ఉన్నత పాఠశాల, గుంటూరు జిల్లా.
ప్రవృత్తి నవలలు, కథలు, కవితలు. వ్రాయడం.
సాంఘిక మాధ్యమాల ద్వారా రచనలను పోస్ట్ చేస్తూ ఉండడం...
Comments