top of page

మంచు తాకిన ప్రేమ - ఎపిసోడ్ 2


#మంచుతాకినప్రేమ, #ManchuThakinaPrema, #ChaithraShreeSaiJyothi Chinthakrindi, #చైత్రశ్రీసాయిజ్యోతిచింతక్రింది, #TeluguSerials, #TeluguNovel, #TeluguLoveStories, #తెలుగుప్రేమకథలు


Manchu Thakina Prema - Episode 2 - New Telugu Web Series - Written By - Chaithra Shree Sai Jyothi Chinthakrindi Published In manatelugukathalu.com On 09/12/2024

మంచు తాకిన ప్రేమ - ఎపిసోడ్ 2 - తెలుగు ధారావాహిక

రచన : చైత్ర శ్రీ సాయి జ్యోతి చింత క్రింది  

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



జరిగిన కథ:

శ్రీనగర్ కు కొంత దూరాన ఉన్న బని హాల్ ప్రాంతంలో సినిమా షూటింగ్ జరుగుతూ ఉంటుంది. అంతలో కొండ చరియలు విరిగి పడబోతున్నట్లు హెచ్చరిక వినపడుతుంది. 

తన ప్రేమికుడు రవి కోసం వెతుకుతున్న హిమకి అతడు కనిపిస్తాడు. 



హిమబిందు, రవికాంత్ ల ప్రేమ ప్రయాణం ఎలా మొదలైందో మంచు తాకిన ప్రేమ ఎపిసోడ్ 2 లో తెలుసుకుందాం. 


పొగ మంచు మధ్యలో, మంచు కొండలకు దూరంగా 20 సంవత్సరాల అమ్మాయి, 23 సంవత్సరాల అబ్బాయి, ఒక్క అడుగు దూరంలో ఎదురెదురుగా నిలబడి ఉన్నారు.. 


అమ్మాయి వైట్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ ఉన్న లెహంగాలో ముత్యం వలె మెరిసిపోతోంది. తెల్లని ఆమె మోము పై నల్లని ముంగురులు అటు ఇటు కదులుతూ సందడి చేస్తున్నాయి... 


తేనె కళ్ళతో తన ఎదురుగా నిలబడి ఉన్న అబ్బాయి కళ్ళల్లోకి చూస్తూ చిరునవ్వుని చిందిస్తూ నిలబడింది. 


ఎదురుగా ఉన్న ఆ అబ్బాయి, బ్లూ కలర్ జీన్స్, వైట్ కలర్ షర్ట్ తో స్పెక్ట్స్ పెట్టుకుని ఎంతో స్మార్ట్ గా ఉన్నాడు. ట్రెండీ హెయిర్ స్టైల్ తో న్యూ లుక్ తో లవర్ బాయ్ లా కనిపిస్తున్నాడు.. 


చేతిలో తెల్లని మంచులో తడిచిన ఎర్రని గులాబీ ని పట్టుకొని ఆ అమ్మాయితో ఇలా చెప్తున్నాడు..

 

“ప్రియా! నీకు అబద్ధంలా అనిపించే ఒక నిజం చెప్పనా, 

నీవు నా అందమైన జాబిలి.. 

నీ కళ్ళే అందాల హరివిల్లు..

 నీ చూపులే నా పై కురిసే వెన్నెల..

 ఆ వెన్నెల రాక కోసం నేనో రాత్రిని అవుతా.. 

వెన్నెల లేని రాత్రి బాధ వర్ణనాతీతం..

 వెన్నెల తో కూడిన రాత్రి జీవితం ఎంతో ఆనంద మయం.. 

 

 ఓ చెలి..

 నువ్వో పసిపాప వైతే నీ చిట్టి చేతిలో ఒదిగిపోయే ఓ బుజ్జి ఆటబొమ్మ ను అవుతా.. 

 

నీ చిన్ని పాదాలకు స్వాగతం పలికే, ఓ మెత్తటి తివాచిని అవుతా..

 

నీ పాద స్పర్శ కోసం ఎంతో పరితపిస్తా.. 

ఆ పాద స్పర్శలో ఎంతో పరవశిస్తూ పులకరిస్తా.. 


నీ చిరునవ్వు నాకోవరం 

అదే నా బలం 

ఎన్నడూ చూడ లేను నీ దీన వదనం 


నీ కన్నీటికి నేనో ఆనకట్టనవుతా 

నీ కష్టాన్ని కరిగించే ఉష్ణాన్ని అవుతా

నా జీవితంలోనికి అడుగుపెట్టబోయే నిన్ను

అడుగడుగునా కంటికి పాపల కాచుకుంటా.

 

మాట పెదవి దాటక ముందే మనసుని అర్థం చేసుకొని

సమయం ఏదైనా చుట్టూ సైన్యమై నిలుస్తా.. 


సరే అని ఒక్క సారి చెప్పు..”

 

అంటూ తన చేతిలో ఉన్న గులాబీని ఆమెకి అందిస్తాడు... 


ఆ మాటలకు అతని కళ్ళలోకి సూటిగా చూడలేక ఆమె కళ్ళు మౌనంగా కిందకి వాలిపోయాయి.. తెల్లని పాలబుగ్గ కాస్తా సిగ్గుతో ఎరుపెక్కింది. 


చిరునవ్వుని చిందించే పెదవి మాటని మరిచి మౌన గీతికగా మారింది. గుండె వేగం పెరిగింది. ఊపిరి బరువెక్కింది.. మనసు మెదడుకి ఏవేవో సంకేతాలు అందిస్తోంది.. 


ఒక్క క్షణం.. ఇంకొక్క క్షణం.. ఇక్కడ ఇలాగే ఉంటే, ఇద్దరి మధ్య ఉన్న ఒక్క అడుగు దూరం ఎక్కడ దగ్గరవుతుందో అని భయం వేసి, తన చిట్టి చేతులతో అతనిని దూరంగా నెట్టి హంస లాంటి ఆ అమ్మాయి జింక పిల్ల వలె పరుగులు తీస్తూ మాయమైంది... 


కింద పడిపోయిన ఆ అబ్బాయి, ‘నన్ను పడేసి పారిపోతున్నావేమో, నువ్వు నా ప్రేమలో పడిన విషయం నాకు అర్థం అయింది.. హిమబిందూ! ఐ లవ్ యు” అంటూ ప్రపంచానికే తన ప్రేమ వినిపించేంతలా బిగ్గరగా అరుస్తూ చెబుతాడు.. 


‘షాట్ ఓకే’ అంటూ ఒక చురుకైన గొంతు వినిపించగానే లవర్ బాయ్ క్యారెక్టర్ లో నుండి ఒరిజినల్ క్యారెక్టర్ లోకి వస్తాడు రవికాంత్.. 


అతని వయస్సు గల ముగ్గురు అబ్బాయిలు రవికాంత్ వద్దకు వచ్చి, “రేయ్ రవి! సూపర్ సూపర్ అంటే సూపర్.. నటించమంటే జీవించేసావుగా” అని ఒక అబ్బాయి, 


“ఆ అమ్మాయి అయితే తన ఎక్స్ప్రెషన్స్ తో యాక్టింగ్ ని ఇంకో లెవెల్ కి తీసుకు వెళ్ళింది..” అంటూ మరో అబ్బాయి చెప్తారు. 


చేతిలో కెమెరా పట్టుకున్న మరో అబ్బాయి “ఏం చేశాడు.. క్యారెక్టర్ పేరు ప్రియా అయితే లాస్ట్ లో హిమబిందు అని పిలిచేశాడు..” అన్నాడు. 

“దాందేముంది లేరా, ఎడిటింగ్ లో మార్చేస్కో. అయినా డైరెక్టర్ వి నువ్వా నేనా?” 


“నువ్వే లేరా బాబు డైరెక్టర్ వి, రైటర్ వి, హీరో వి.. ఈ షార్ట్ ఫిలిం కి అన్ని నువ్వేగా.. ఏదో కెమెరాలు ఫోన్లు పట్టుకొని మేం ముగ్గురు మీ వెనక తిరుగుతున్నాము..”

 

“ఏదో.. మనసులో ఉన్న అమ్మాయి ఎదురుగా ఉండడంతో తన పేరు తన మీద ఉన్న నా ఫీలింగు రెండూ బయటికి వచ్చేసాయి”


“అవునవును కానీ ఆ అమ్మాయి ఉన్నప్పుడు చెప్పి వుంటే బాగుండేది. ఆ అమ్మాయి వెళ్ళిపోయిన తర్వాత చెప్తే ఏం ఉపయోగం, చెప్పేసుంటే రెండు సంవత్సరాల నుండి మాకు ఈ కష్టాలు నీకు ఏ ఇబ్బందులు ఉండేవి కావు..”

 

అందుకు మరో అబ్బాయి ఇలా అంటాడు “ఒరేయ్ రవి.. నువ్వు అన్నిటిలో స్పీడు. ఏ విషయంలో భయపడవు. నీకు ఏది అనిపిస్తే అది చెప్పేస్తావు. మరి ఆ అమ్మాయి విషయంలో ఎందుకు ఇంతలా ఆలోచిస్తున్నావు.. నీ స్పీడ్ కి వెళ్లి డైరెక్ట్ గా ప్రపోజ్ చేసేయొచ్చు కదా”. అని అంటాడు.. 


“ఒరేయ్! నా లైఫ్ లో నాకున్నవి రెండే రెండు డ్రీమ్స్. 

డ్రీమ్ వన్.. మంచి ఫేమస్ డైరెక్టర్ అవ్వాలి. ప్రతి హీరో నా డైరెక్షన్లో ఒక్క సినిమా అయినా చెయ్యాలి అని అనుకోవాలి. 


 నా డ్రీమ్ టు.. నేను డైరెక్ట్ చేసిన ప్రతి సినిమా ను హిమబిందుతో కలిసి కూర్చొని చూడాలి. నా గెలుపుని చూసి ఆనందపడే అమ్మానాన్న కళ్ళలో సంతోషాన్ని నేను చూడాలి. 


దీనిలో డ్రీమ్ టు డిస్టర్బ్ అయిందనుకో దాని ప్రభావం డ్రీమ్   వన్  పై పడుతుంది అందుకే ఇంతలా ఆలోచిస్తున్న.. 


ప్రపోజ్ చేసే ధైర్యం ఉంది కానీ తను రిజెక్ట్ చేస్తే తట్టుకునే ధైర్యం లేదు. అందుకోసమే ఆగి ఆలోచించవలసి వస్తుంది. తనని టూ ఇయర్స్ నుండి అబ్జర్వ్ చేస్తున్నాను. తన ఇష్టాలు, తన అలవాట్లు తన ఫ్రెండ్స్, ఫ్యామిలీ.. 


అన్నీ నాకు తెలుసు అని అనుకునే,  ‘తెలివైన అమ్మాయిని నేను’ అని ఫీల్ అయ్యే క్యూట్ తింగరి. 


షార్ట్ ఫిలిం కోసం తనని ఒప్పించడానికి ఎంత బతిమిలాడాలో అని అనుకున్నా కానీ చాలా ఈజీగా ఒప్పేసుకుంది. ఈ టైంలో తనతో క్లోజ్ గా ఉండి తనకి ఇంకా దగ్గర అవ్వాలనునుకున్నాను. కానీ తను అంత అవకాశం ఇవ్వలేదు. ఎప్పుడూ షార్ట్ ఫిలిం గురించే మాట్లాడుతూ ఉండేది.. 


కానీ ఇప్పుడు చేసిన సీన్ తర్వాత నాకు ఎక్కడో చిన్న నమ్మకం వచ్చింది తను నా ప్రపోజల్ ని యాక్సెప్ట్ చేస్తుంది అని. తనకి నేను తనని ఎంతలా ఇష్టపడుతున్నాను అన్న విషయము అర్థం అయింది.. రేపే ఈ రవికాంత్ హిమబిందుని ప్రపోజ్ చేయబోతున్నాడు..”


ఆ మాటకి ఒక అబ్బాయి ఇలా అంటాడు “ఇలా ఎన్నోసార్లు చెప్పావు. చూద్దాం ఏమవుతుందో.. కానీ మీ లవ్ స్టోరీ ఏమవుతుందో గానీ ఈ లవ్ స్టోరీ మాత్రం బాగా వచ్చింది. లొకేషన్స్ కూడా చాలా బాగున్నాయి. ఇంకొక్క సీను మిగిలింది రా. అదొక్కటి తీస్తే కనుక మన షార్ట్ ఫిలిం కంప్లీట్ అవుతుంది. రేపటితో మన ట్రిప్ అయిపోతుంది. ఆ తర్వాత ఎవరి గూటికి వారు చేరుకుంటారు. సో ఈలోపే ఆ చిన్న సీన్ కూడా చేసేద్దాం..” అనుకుంటూ అందరూ నడుచుకుంటూ వెళ్తారు.. 



“హిమబిందు..” అంటూ స్వీటీ పరుగున రావడంతో ఫోన్లో లొకేషన్ ని షూట్ చేస్తున్న హిమబిందు వెనక్కి తిరిగి చూసి “ఏంటి స్వీటీ ఏమైంది. ఎందుకు అలా పరిగెత్తుకుంటూ వస్తున్నావు..” అని అడిగింది.

 

“నీ అపాయింట్మెంట్ కోసమే తల్లి”


“అదేంటే అలా మాట్లాడుతున్నావు”


“మరి నువ్వు ఇప్పుడు చిన్న సైజు సెలబ్రిటీవి అయిపోయావు. షార్ట్ ఫిలింలో హీరోయిన్ వి. మేమందరం కాలేజ్ ట్రిప్ లో టూర్ ని ఎంజాయ్ చేస్తుంటే నీవేమో షూటింగ్ అంటూ బిజీ బిజీగా ఉంటున్నావు. మాతో అసలు టైం స్పెండ్ చేయడం లేదు.. అలా అని నేను అనట్లేదు, మన బ్యాచ్ అందరూ అనుకుంటున్నారు..” 


“నీ మనసులో ఉన్న అసూయను అందరూ అనుకుంటున్నారని అందరి మీదకి నెట్టేస్తావ్ ఎందుకు స్వీటీ.. అయినా నాకు తెలుసులే నా గురించి ఎవరెవరు ఏమేమి అనుకుంటున్నారో.. నా చుట్టూ ఏం జరుగుతుందో అంతా నాకు తెలుసు..”

 

‘అవునవును. నువ్వు అంతా నాకు తెలుసు, అని అనుకునే, ఏమీ తెలియని తింగరివి.. ఆ రవికాంత్ చెప్పింది నిజమే..’ అని మనసులో అనుకుంటుంది స్వీటీ. 


“ఏంటి స్వీటీ సైలెంట్ అయిపోయావు?”


“హిమ.. ముందా ఫోన్ పక్కన పెట్టి ఇట్రా. నీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి త్వరగా”


“ఏంటది..”


“నువ్వు రా.. ఇక్కడ కాదు. నేను నీకు చెప్తాను.. నువ్వు నాతో రా..” 


“స్వీటీ, హిమబిందు.. ఎక్కడికి వెళ్తున్నారు?” అంటూ ట్రిప్ లో వాళ్లతో పాటు వచ్చిన వాళ్ళ కాలేజ్ మేడం అడుగుతారు.. 


ఆవిడ చూడడానికి స్టూడెంట్ లాగే అనిపించే యంగ్ లుక్ తో ఉంటారు. కానీ ఆవిడ వేషధారణ మాట తీరు కమాండింగ్ స్టూడెంట్ని భయపెట్టేలా మరియు ఆవిడకి గౌరవాన్ని ఇచ్చేలా ఉంటాయి.. 


“ఎక్కడికి లేదు మేడం” అంటూ ఇద్దరూ ఎంతో వినయంగా తడబడుతూ సమాధానం ఇస్తారు.. 


“హిమబిందు.. అందరికీ అనౌన్స్ చెయ్.. మరి కొద్ది సేపట్లో బస్సు వస్తుంది. అందరం ఈ లొకేషన్ ని ఖాళీ చేసి వేరే ప్లేస్ కి వెళ్ళాలి. అలాగే మరొక విషయం కూడా చెప్పు.. రేపటితో మన ట్రిప్ లాస్ట్ డే. రేపు అందరం తిరుగు ప్రయాణం అవుతాము”


“అదేంటే ఇంత సడన్గా.. ఇవ్వాల నైట్ కూడా ఇక్కడే స్టే చేస్తాం అని అనుకున్నాము. నైట్ టైం ఈ లొకేషన్ చాలా బాగుంటుందంట. రవికాంత్ చెప్పాడు” అని హిమబిందు మెల్లిగా స్వీటీతో చెబుతుంది. 


“అన్నీ ముందే మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తే అసలే మన వాళ్ల గురించి తెలిసిందేగా ఎవరెవరు ఏ ప్లాన్స్ వేస్తామో అని మేడం భయం. ఇంత మంది స్టూడెంట్స్ తో వచ్చినప్పుడు ఆ మాత్రం జాగ్రత్తగా ఉండాలి కదా” అని స్వీటీ సమాధానం ఇస్తుంది. 


“ఏంటి చెప్పింది వినిపించిందా? నాకు సమాధానం ఇవ్వకుండా మీలో మీరే మాట్లాడుకుంటారే” అంటూ వాయిస్ పెంచి పెద్దగ అడుగుతారు మేడం.. 


ఇద్దరూ ఒక్కసారిగా ఎస్ మేడం అంటూ చెప్పి వినయంగా నిలబడతారు.


“అటుగా వస్తున్న రవికాంత్ ని చూసి “చూడు రవికాంత్! నీకు పర్మిషన్ ఇచ్చింది మేము చెప్పినప్పుడే షూటింగ్ కి సంబంధించిన సీన్లు తీసుకోవాలని. అంతేకానీ నీ ఇష్టం వచ్చినప్పుడు కాదు. ఇలా 24 గంటలు హిమబిందు చుట్టూ తిరగడం కాదు. ఏదో ప్రిన్సిపల్ సార్ ని నువ్వు అంతగా రిక్వెస్ట్ చేయబట్టి ఆయన నీకు పర్మిషన్ ఇచ్చారు.. అదే నేనయితే అసలు నిన్ను ఈ ట్రిప్ కి ఎలో చేసేదాన్నే కాదు. 


చదువు పక్కన పెట్టి నీలా బాధ్యత లేకుండా తిరిగే స్టూడెంట్స్ అంటే నాకు చిరాకు, ముందు బ్యాక్ లాగ్స్ పూర్తి చెయ్యి. తర్వాత సినిమాలు తీద్దువు గాని. నా ముందు ఒక్క నిమిషం కూడా ఉండొద్దు వెళ్ళిపో..”

 

‘సారీ మేడం’ అంటూ రవి కాంత్ వెళ్ళిపోతాడు. 


“హిమబిందు.. మీకు కూడా చెబుతున్నా.. నా దగ్గర పర్మిషన్ తీసుకుని నువ్వు యాక్టింగ్ చేయడానికి వెళ్లాలి, అర్థమైందా..”

 

“ఎస్ మేడం”

“ఓకే అందరూ రెడీగా ఉండండి” అంటూ మేడం అక్కడి నుండి వెళ్ళిపోగానే, 


“అదేంటే ఆ మేడం రవికాంత్ ని అలా తిట్టారు.. అసలు తను ఎంత టాలెంటెడ్ తెలుసా..”


“ఎంత టాలెంట్ ఉన్నా కానీ, హిమా! చదువు లేకపోతే అందరూ ఇలానే అంటారు కదా..”


“అతనికి చదువు రాక కాదు, ఇంట్రెస్ట్ లేక అనుకుంటా. ఇంట్రెస్ట్ ఉంటే తను ఎంత కష్టమైనా ఆ పని కచ్చితంగా చేస్తాడు. తనతో నేను ట్రావెల్ చేస్తున్నాను కదా.. తన గురించి నాకు తెలుస్తుంది. పాపం ఎంత బాధ పడుతున్నాడో.. ఆగు ఒక్కసారి చూసి వస్తాను..”

 

“ఎక్కడికే వెళ్ళేది.. ఇంకోసారి మేడం నిన్ను చూశారనుకో.. ఇక మీ ఇంటికి కంప్లైంట్ వెళ్తుంది, నువ్వు ఇంటికి వెళ్ళకముందే.. అది గుర్తుంచుకో..” 

***


“చ.. ఏంట్రా.. ఇలా జరిగింది. ఇవ్వాళ లాస్ట్ సీన్ నైట్ టైం లో తీద్దామని అనుకున్నాము. అంతా ఆ మేడం వల్ల అప్సెట్ అయింది”

 

“రేయ్ రవి.. ఇందాకట్నుంచి నువ్వు ఫీల్ అయ్యేది షూటింగ్ క్యాన్సిల్ అయినందుకా..” 

“మరి మేడం తిట్టినందుకు అనుకున్నావా, అవును.. లైట్ రా. ఇలాంటి చిన్న చిన్న వాటికే ఫీలవుతూ కూర్చోడు ఈ రవికాంత్. అయినా ఇందులో మేడం తప్పేముంది.. ఆవిడకి నా గురించి తెలీదు. ఆవిడకి తెలిసినంత లో నేను బాధ్యతలేని బేవర్స్ గా తిరిగే ఒక స్టూడెంట్ ని. అలాంటి నన్ను తిట్టడంలో తప్పు లేదులే.. 


సరేగాని బబ్లు మనం అనుకున్నట్టుగానే ఈ నైట్ ఈ మంచి లొకేషన్ లో నువ్వు చెప్పినట్టుగా ఫైర్ పక్కన నుండి నేను, హిమబిందు నడుచుకుంటూ వచ్చే సీను షూటింగ్ ఇక్కడ జరుగుతుంది రాసి పెట్టుకో”

 

“ఎలా రా మనం ఇప్పుడు వెళ్ళిపోతాముగా?”


“చెప్తా....” 


=======================================================================

                                                ఇంకా వుంది

========================================================================

 

చైత్ర శ్రీ సాయి జ్యోతి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం: https://www.manatelugukathalu.com/profile/saijyothi

చైత్ర శ్రీ. సాయి జ్యోతి చింత క్రింది. 


వృత్తి జూనియర్ అసిస్టెంట్ జిల్లా పరిషత్ నూతక్కి ఉన్నత పాఠశాల, గుంటూరు జిల్లా. 

ప్రవృత్తి నవలలు, కథలు, కవితలు. వ్రాయడం. 

సాంఘిక మాధ్యమాల ద్వారా రచనలను పోస్ట్ చేస్తూ ఉండడం... 








86 views2 comments

2 Comments



@TummaSurekhadevi

2 days ago

Nice

Like


@ravich9545

48 minutes ago

Very nice sai Jyothi

Like
bottom of page