top of page

మంగరాజు మందు మహిమ

#KandarpaMurthy, #కందర్పమూర్తి, #MangarajuManduMahima, #మంగరాజుమందుమహిమ, #తెలుగుహాస్యకథలు, #TeluguComedyStories


'Mangaraju Mandu Mahima' - New Telugu Story Written By Kandarpa Murthy

Published In manatelugukathalu.com On 26/09/2024

'మంగరాజు మందు మహిమ' తెలుగు కథ

రచన: కందర్ప మూర్తి


 లేబర్ కాలనీలో రాత్రి ఎనిమిది దాటింది. ఊళ్లో రిక్షాలు నడిపేవారు, కూలిపనులకు పోయినవారు ఇళ్లకు చేరుకుంటున్నారు. 


మగాళ్లు మందేసుకుని మత్తులో జోగుతు ఇళ్లకు వస్తున్నారు. ఆడాళ్లు రాత్రికి కూడు వండుతున్నారు. స్కూలుకు పోయిన పిల్లగాండ్లు మద్యాహ్నం ఉన్న బువ్వ తిని నిద్రపోతున్నారు. 


 "అమ్మో, సంపేత్తున్నాడే. నడుం విరిచేసి కడుపు కుళ్లబొడిచినాడు" అంటూ లచ్చిమి గదిలోంచి ఏడుస్తు బయటికి పరుగు పెట్టింది. 


 "ఓలె, లచ్మీ ఏమైనాదే" అంటు కూతురు అరుపులు విన్న పక్క ఇంట్లో ఉన్న నర్సమ్మ పైకి వచ్చింది. వెంట భర్త వెంకటయ్య వచ్చాడు. 


 "నీ కేమైనాదిరా మంగా, లచ్చిని గొడ్డును బాదినట్టు కొడుతున్నావు. నీళ్లోసుకున్న పెళ్లాన్ని అలా కొట్టడానికి నీకు చేతులెలా వచ్చాయిరా" తమ్ముడు మంగరాజును నిలదీసింది నర్సమ్మ. 


 తాగిన మత్తులో జోగుతు పైకి వచ్చిన మంగరాజు " నా పెల్లాం, నా ఇస్టం. కొట్టుకుంటాను, సంపుకుంటాను. మీకేంటిది? నా యాల్ది కోడికూర వండవే అంటే వంకాయ ఇగురు చేసినాది. మొన్నేమో చింతచిగురు పప్పు వండమంటె చేపల పులుసు చేసినాది. నేను చెప్పినట్టు సెయ్యాల నేక దానిష్టం వచ్చినట్టు వండుతాదా, తోలు తీస్తాను. " తిట్లు మొదలెట్టాడు మందుమీదున్న మంగరాజు. 


 "ఒరే మంగరాజూ, నీకిది నాయమా సెప్పు. నీ చిన్నతనంలోనే మీ అమ్మ సచ్చిపోతే మీ అక్క చేరదీసి పెంచినాది. నిన్ను షావుకారు ధాన్యం మిల్లులో పనికి పెడదామంటె నువ్వేమో సదువులంటు, ఆనక మీ నాయనకి ఎనక సాయం లేకుండా సినేమాలంటు హైదరాబాదు పోయి ఏషాలు ఏసి ఈ తాగుడు అలవాటు చేసుకుని మీ నాయన్ని అప్పులపాలు చేసి ఆ ముసలోణ్ణి నీ మీద బెంగతో చంపేసినావు. 


అక్కడ తిండిలేక రోగాలతో పస్తులుంటున్నావని తెల్సి నీ దోస్తుగాళ్లను పంపి ఇక్కడికి తీసుకువచ్చి షావుకారు కాళ్లట్టుకుని రిచ్చా ఇప్పిస్తే సంపాదనలో బాడుగ డబ్బులు సరిగ్గా కట్టవు. సగం డబ్బులు తాగుడికే పోస్తున్నావు. లచ్చిని నీ కిచ్చి పెళ్లి చెయ్యొద్దన్నా మీ అక్క మాట కాదనలేక లచ్చితో నీ పెళ్లి జరిపినా. ఆ పిచ్చిది మావయ్యంటు నీమీద మోజు పెంచుకుని నిన్నే లగ్గం ఆడతా అంటె ఇష్టం లేకపోయినా మనువు చేసినా. 


నీకు గూడంటు ఈ గది కిరాయికి ఇప్పించినా. నువ్వేమో ఎప్పుడూ తాగుతు రిచ్చా సరిగ్గా నడపక బాడుగ డబ్బులు ఇంట్లో ఇవ్వకపోతే ఇల్లు ఎట్టా గడిచేది. లచ్చి షావుకారు దుకాణంలో చిల్లర పనులు చేస్తు ఇల్లు నెట్టుకొస్తోంది. నెల నెల గది కిరాయి కట్టాల. ఇంట్లోకి చూడాల. నువ్వేమో బాద్యత మరిచి ఉంటే ఎట్టారా " అని అల్లుడు మంగరాజుకు నచ్చ చెబుతున్నాడు మామ వెంకటయ్య. 


 "ఈ రోజుకు సర్దుకుపోరా మంగా, రేపు కోడి కూరతో బువ్వ వండుతాది" అని సర్ది చెప్పి పంపింది నర్సమ్మ. 


 

 "నేను మందు తాగితే మీకేంటంట? ఔను, నేను మందు తాగుతాను.. డాక్టరు రాసిన ఇంగ్లీసు మందు కాదు. సర్కారు తెరిచిన బెల్టు షాపుల మద్యం మందు. ఆమందు కిక్కే వేరు. 

క్వార్టర్ లోపలి కెళ్లినాదంటె స్వర్గం కనబడతాది. మందు బాబులం మేము, , మాకు మేమే మహరాజులం. ఎవరొచ్చినా లెక్కసెయ్యం. 


మందు బాబులం మేము, మందు లోపలికెళ్లినాక మేమే మహరాజులం. దేవదాసు మందు తాగి చరిత్ర కెక్కినాడు. ఉమర్ ఖయ్యం మదిర తాగి గాయకుడయ్యాడు. చుక్క చూస్తే చచ్చిన పామైనా బుస కొడతది. కల్లు తాగిన కోతి గుడి మెట్ల మీద గెంతులేస్తది. " ఇదీ తాగుబోతు మంగరాజు మందు ఎక్కువైతే చేసే వీరంగం. 


మంగరాజు పరువం మీద ఉండేటప్పుడు గిరజాల జుత్తు కోరమీసంతో ఎత్తుగా కండల శరీరంతో సినేమా హీరో శోభన్ బాబులా ఉండేవాడని స్నేహితులు చెబుతుంటే ఇంట్లో అద్దంలో మొహం చూసుకుంటు దువ్వెనతో తలని పదేపది దువ్వుతు, కోరమీసం మెలివేసేవాడు. ముసలితండ్రి మిల్లు పనుల్లో సాయపడరా అంటే వినకుండా జతగాళ్లతో గోదారి గట్టంట వచ్చేపోయే అమ్మాయిలకు బీటు వేసేవాడు. 


కాలేజీలకు పోయే అమ్మాయిలు కూడా వీర్రాజు చేసే వెకిలి వేషాలు చూసి నవ్వుకుంటు పోయేవారు. శోభన్ బాబు సోగ్గాడు సినేమా రిలీజైనప్పటి నుంచి ఊళ్లో మంగరాజు క్రేజ్ పెరిగిపోయింది. పట్నం నుంచి ఖరీదైన కాశ్మీర్ స్నో తెప్పించి గెడ్డం నున్నగా గీసి స్నోతో మాలిష్ చేస్తున్నాడు. కోరమీసాలకు నల్ల కర్రబొగ్గుతో మెరుగులు పెడుతున్నాడు. నల్ల కళ్లద్దాలతో లాంచీ రేవు దగ్గర పోజులు కొట్టడం మొదలెట్టాడు. ముసలితండ్రి మిల్లులో పనికి పెడతానంటె వినేవాడు కాదు. 


 గోదావరి నదిలో, పరిసరాల్లో సినేమా షూటింగులు జరిగితే  స్నేహితుల్తో ఎంజాయ్ చేసేవాడు. అప్పుడు కొంతమంది సినేమా వాళ్లతో పరిచయాలు కూడా ఏర్పడ్డాయి. వాళ్లకి మందు, చేపల కూర, బిర్యానీ బందోబస్తు చేసేవాడు. అలా సినేమా వాళ్ల పరిచయంతో తనూ సినేమాల్లో నటించి శోభన్ బాబులా హీరో అయి పట్నం టాకీసులో అందరి చేత సన్మానాలు సత్కారాలు పొందాలనుకున్నాడు. 


 ఒకరోజు తండ్రి అప్పు డబ్బులు జమ కోసం ఉంచితే ఆ డబ్బు తీసుకుని ఎవ్వరికీ చెప్పకుండా హైదరాబాదు రైలు ఎక్కేసాడు మంగరాజు. 


 ముందుగా పరిచయమైన సినేమా మిత్రుల సాయంతో కృష్ణానగర్ సినేమా వాళ్ల బస్తీలో మకాం పెట్టేడు. ఒకరిద్దరు సినేమా దోస్తుల సాయంతో డైరెక్టర్ల చుట్టూ తిరిగాడు కాని ఎవరు సినేమా చాన్సు ఇవ్వలేదు. 


 ఇంటి దగ్గర నుంచి తెచ్చిన డబ్బులు కూడా ఖర్చయాయి కాని సినేమా చాన్సు రాలేదు. జూనియర్ ఆర్టిష్టుల సంఘంలో చేరినా ఫలితం లేకపోయింది. హైదరాబాదు వస్తే నీకు సినేమా చాన్సు ఇప్పించి పెద్ద యాక్టర్ని చేస్తామన్నవారు మొహం చాటేసారు.

 

తనలాగే సినేమాలలో యాక్టు చేసి పేరు డబ్బు సంపాదించాలని హైదరాబాదు చేరినవారిని అక్కడ చూసి నిజం తెలుసుకున్నాడు. దోస్తులతో కలిసి తాగుడుకు అలవాటు పడ్డాడు. ఊరికి వెళితే నవ్వుతారని హోటళ్లలో సర్వర్ గా పనిచేస్తు కాలం వెళ్లదీస్తున్నాడు. సరైన తిండి బట్టలు లేక చిక్కి శల్యమైపోయాడు మంగరాజు. 


సినేమాల్లో హీరో అవాలనుకున్న మంగరాజు చివరకు తాగుబోతుగా మారేడు. డబ్బుల్లేక కల్లు కాంపౌండ్ దగ్గర సప్లైయర్ అవతారమెత్తాడు. ఇంతలో ముసలితండ్రి జబ్బుతో కాలం చేసాడని తెలుసుకున్న మంగరాజు తిరిగి ఊరికి రాక తప్పలేదు. 


 "ఔను, నేను మందు తాగుతాను. నా డబ్బు నాఇష్టం. నిన్నేమైన పైసలడిగానా! మందుకు డబ్బులు లేకపోతే నా ఆలి లచ్చి తన తాలి తెచ్చి "మామా, ఈ తాలిబొట్టు తాకట్టు పెట్టి మందు తెచ్చుకో " అన్నది కలికాలం సాద్వి. దాని ముందు పురాణాలలోని ఏ పతివ్రతలు సరిపోతారు? మాట కోసం పెళ్లాం మెడలో తాళిబొట్టునే అడిగాడు సత్తె హరిచంద్రుడు. 


 నా ఆలి లక్కీ లచ్మి, దాని అయ్య నేను తాగుబోతునని నాకు కూతుర్ని ఇవ్వకుండా ఇంకొరికిచ్చి లగ్గం చెయ్యలనుకున్నా ఆడ్ని కాదని నన్ను ఇష్టం పడి లగ్గం సేసుకుంది నా బంగారం. 


కాయకష్టం చేసి చెమటోడ్చి కూడబెట్టిన పైసలు సర్కారు లిక్కర్ షాపులకు ఖర్చు చేసి సర్కారు ఖజానా నింపి సర్కారును నిలబెడుతున్న మాకు సమాజంలో ఏం ఇలువ ఇస్తన్నారు. తాగుబోతులమంటారు. ఎగతాళి చేస్తారు. మేము తాగితే మాలోకం మాది. నాయాళ్లు, క్వార్టర్ కి పైసలడిగితే లేదు పొమ్మంటారు. అదే ఫుల్ బోటిల్ దగ్గరుంటే ఈగల్లా ముసురుకొస్తారు. 


 మా దోస్తుగాడు మందు డబ్బు ఎక్కువైనాదని రెండు కే. జి. ల నాటు కోడిని అప్పు బదులుగా తెచ్చి ఇచ్చినాడు బెల్టు షాపు ఓనరుకి. బేవార్సుగా తిరిగే సైదులు పొలం భూమి అమ్మి బెల్టు షాపెట్టి వేలు సంపాదిస్తున్నాడట నాయాల్లు. 


 లేబొరోళ్లమని మమ్మల్ని తాగుబోతులని చీప్ గా మాట్లాడతారు జనం. అసలు సినిమా ఓళ్లు రాజకీయ నాయకులు బడాబాబులు విదేశాల ఖరీదైన మందు బార్లు నక్షత్రాల హొటళ్లు అవేవో రిసార్టులట, అలాగే బంగలాల్లో నైటు క్లబ్బుల్లో ఆడామగా తాగి చిందులేస్తారు. ఆళ్లు

పైసలున్న బడాబాబులు కనక ఏం చేసినా చెల్లుతాది. 


 దేశంలో మందుబాబుల వల్లే సగం ఆదాయం సర్కారుకు సమకూరుతోందని పేపరోళ్లు అంటున్నారు. కనక సర్కారే మాకు సిటింగులకి సదుపాయాలు కల్పించాలి. సరుకు మీద టేక్సులు తగ్గించాల. వైటు రేషను కార్డున్నోళ్లకి మందు మీద రాయితీ ఇవ్వాలి. పెన్సన్ తీసుకుంటున్న ముసలోళ్లకి వాలంటీర్ల ద్వారా మందు సప్లై సేస్తే బాగుంటాది. 


 జగమే మాయ.. బతుకే మాయ.. ఏదాలలో మజా లేదయా.. 

 అసలు సారం లేదయా.. అలక్ నిరంజన్, మందుబాబులం మేమే, . 


దేశ ప్రగతి చక్రాలం మేమే, చెమటోడ్చి సంపాదించిన పైసలతో పాటు అవుసరమైతే ఆలి పుస్తెలు, కోడీ మేకా ఆవూ ఏదైనా అమ్మి మందు కోసం సర్కారు కి సమర్పిస్తాం. మాకంటే త్యాగధనులెవరు చెప్పు, గురువా!


 నాయాల, నాను టెన్తు మూడుసార్లు పాసయినా. ఎందరి కాల్లు పట్టుకున్నా కొలువు దొరక లేదు. ఆడు అప్పిగాడు, ఎర్రినాయాళ్లు ఎనిమిది పాసయి యం. యల్య. ఎ గారి సిఫారసుతో సర్కారి ఆఫీసులో ఎటెండరు నౌకరీ కొట్టేసాడు. ఇదీ లోకం తీరు గురువా!"


సాయంకాలమైతే మందు మంగరాజు మత్తులో గుర్రమెక్కినప్పుడు రోజూ పాడే వీరంగమిది. ఆ దారంట పోయే పాతోళ్లకి ఇది అలవాటే కాని కొత్తోళ్లకి వింతే మరి. 


 అలా మందు కొట్టి వీధిలో అందరికీ కాలక్షేపం చేసే మందు మంగరాజు ఊరి చెరువులో పడిపోయాడన్న వార్త గుప్పుమంది. చెరువు గట్టుకి చెంబు పట్టుకెళ్లిన ఎవరో చూసి ఊళ్లో చెప్పాడట. 


 లబోదిబోమంటు మంగరాజు పెళ్లాం లచ్చి చెరువు కాడికి పరుగులంకించుకుంది. వెంట మామ వెంకటయ్య, అక్క నర్సమ్మ, ఊరి జనం చెరువు గట్టుకి చేరినారు. చెరువు నీటిలో బోరుగిల మంగరాజు పడిఉన్నాడు. వేసవి అయినందున అప్పటికే ఎండ బాగా ముదిరింది. ఊరి సర్పంచి పోలీసులకి ఫోన్ ద్వారా విషయం చెప్పాడు. 


 వెంటనే పోలీసులు అంబులెన్సును వెంటపెట్టుకుని ఊరి చెరువు గట్టుకు వచ్చారు. ఒకరిద్దరి సాయంతో నీటిలో పడిన మంగరాజును స్ట్రెచ్చర్ మీద పడుకోబెడుతుంటే టక్కున లేచి కూర్చున్నాడు. వచ్చిన ఊరి జనం, పోలీసులు అవాక్కయారు. 


 "ఏరా, చెరువులో పడినావని పోలీసులు నిలదీస్తే, "సారూ, ఎండ ఏడికి ఒల్లు ఏడెక్కిపోనాది. సల్లగుంటదని చెరువు నీటిలో తొంగున్నా. దరమ పెబువులు, గొంతెంది పోనాది. ఒక యాబై రూపాయలు ఇప్పించండి. క్వార్టరు మందు తెచ్చుకుంటాను" అన్నాడు మందు మంగరాజు. 

 వాడి తాగుడు అలవాటుకు నవ్వుకుంటూ పోయారు ఊరి జనం. 


మద్యపానం ఆరోగ్యానికి హానికరం


కందర్ప మూర్తి  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


 పూర్తి పేరు  :  కందర్ప వెంకట సత్యనారాయణ మూర్తి

   కలం పేరు :  కందర్ప మూర్తి

  పుట్టి పెరిగిన ఊరు : 02 జూలై -1946, చోడవరం (అనకాపల్లి జిల్లా)ఆం.ప్ర.

  భార్య పేరు:   శ్రీమతి  రామలక్ష్మి

 కుమార్తెలు:


శ్రీమతి రాధ విఠాల, అల్లుడు  డా. ప్రవీణ్ కుమార్

              

శ్రీమతి ఉషారమ , అల్లుడు వెంకట్

                  

శ్రీమతి  విజయ సుధ, అల్లుడు సతీష్

                   

  విద్యార్థి దశ నుంచి తెలుగు సాహిత్యం మీద అభిలాషతో చిన్న కథలు, జోకులు, కార్టూన్లు వేసి పంపితే  పత్రికలలో  ప్రచురణ జరిగేవి. తర్వాత హైస్కూలు  చదువులు,  విశాఖపట్నంలో  పోలీటెక్నిక్ డిప్లమో  కోర్సు చదివే రోజుల్లో  1965 సం. ఇండియా- పాకిస్థాన్  యుద్ధ  సమయంలో చదువుకు స్వస్తి  పలికి  ఇండియన్  ఆర్మీ  మెడికల్ విభాగంలో చేరి  దేశ సరిహద్దులు,  

వివిధ నగరాల్లో  20 సం. సుదీర్ఘ సేవల  అనంతరం పదవీ విరమణ  పొంది సివిల్  జీవితంలో  ప్రవేసించి 1987 సం.లో  హైదరాబాదు  పంజగుట్టలోని నిజామ్స్  వైద్య  విజ్ఞాన  సంస్థ  (నిమ్స్ సూపర్  స్పెషాలిటీ  హాస్పిటల్) బ్లడ్ బేంక్  విభాగంలో  మెడికల్ లేబోరేటరీ  సూపర్వైజరుగా  18 సం. సర్వీస్  చేసి  పదవీ  విరమణ  అనంతరం  హైదరాబాదులో కుకట్ పల్లి

వివేకానందనగర్లో  స్థిర  నివాసం.


సుదీర్ఘ  ఉద్యోగ  సేవల  పదవీ విరమణ  తర్వాత  మళ్లా  తెలుగు సాహిత్యం మీద  శ్రద్ధ  కలిగి  అనేక  సామాజిక కథలు,  బాల సాహిత్యం, సైనిక జీవిత అనుభవ కథలు, హాస్య కథలు, విశ్లేషణ వ్యాసాలు, కవితలు, గేయాలు రాయగా  బాలమిత్ర, బుజ్జాయి, బాలల చంద్ర ప్రభ, హాయ్ బుజ్జీ, 

బాలభారతం,  బాలబాట, మొలక,  సహరి,  సాక్షి ఫన్ డే, విపుల,చిన్నారి, హాస్యానందం, ప్రజాశక్తి,  గోతెలుగు. కాం, తపస్వి మనోహరం, సాహితీ కిరణం, విశాఖ సంస్కృతి, వార్త  ఇలా  వివిధ  ప్రింటు, ఆన్లైన్  మేగజైన్లలో ప్రచురణ జరిగాయి.


నాబాలల  సాహిత్యం  గజరాజే వనరాజు, విక్రమసేనుడి  విజయం రెండు  సంపుటాలుగాను, సామాజిక  కుటుంబ కథలు  చిగురించిన వసంతం,  జీవనజ్యోతి   రెండు  సంపుటాలుగా  తపస్వి మనోహరం పబ్లికేషన్స్  ద్వారా  పుస్తక రూపంలో  ముద్రణ  జరిగాయి.


 నా సాహిత్య  రచనలు  గ్రామీణ,  మద్య తరగతి,  బడుగు బలహీన   వర్గ ప్రజల, జీవన విధానం, వారి స్థితిగతుల గురించి రాస్తు  సమాజానికి  ఒక సందేశం  ఉండాలని  కోరుకుంటాను.

 


42 views0 comments

Comments


bottom of page