top of page
Writer's pictureYasoda Pulugurtha

మనుషులు మారాలి ఎపిసోడ్ - 1

కొత్త ధారావాహిక ప్రారంభం

'Manushulu' Marali Episode 1' - New Telugu Web Series Written By Yasoda Pulugurtha Published In manatelugukathalu.com On 26/10/2023

'మనుషులు మారాలి ఎపిసోడ్ - 1' తెలుగు ధారావాహిక ప్రారంభం

రచన: యశోద పులుగుర్త (ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్

అది మధ్యాహ్నం లంచ్ సమయం. ఆఫీస్ లంచ్ రూమ్ లో ఒకే టేబిల్ మీద కూర్చుని కలసి కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేస్తారు సుప్రజ, మాధవి, నీరజ. లంచ్ టైమ్ అరగంటలో వాళ్ల మాటలు ఎక్కువగా తమ కుటుంబాలకి సంబంధించినవై ఉంటాయి. ముగ్గురివీ ఆఫీస్ లో వేర్వేరు విభాగాలైనా లంచ్ సమయంలో కలుసుకుంటూ విధిగా ఒకే టేబుల్ పై కూర్చుని భోజనం చేయడం దాదాపు పది సంవత్సరాల నుండి జరుగుతోంది.


“ఈ ఆదివారం మా ఆడపడుచు సరళ వస్తానని ఫోన్ చేసిందే” అంటూ సంభాషణ ప్రారంభించిన సుప్రజ వైపు చూసారు మాధవి, నీరజ.


“మీ ఆడపడుచు రావడంలో వింతేముందే సుప్రజా. ఒకే ఉర్లో ఉంటున్న మూలాన మీ ఆడపడుచు ప్రతీ ఆదివారం వచ్చి మీ అత్తగారి యోగక్షేమాలను శ్రధ్దగా విచారించి నీ నెత్తిమీద నాలుగు అక్షింతలు జల్లి వెళ్లడం పరిపాటేకదా. పాపం ఆవిడ ప్రాణాలన్నీ మీ అత్తగారిమీదే పెట్టుకుని జీవిస్తోందాయ్. ఈ సుప్రజ అనే రాక్షసి తన తల్లిని ఎంత హింసపెడ్తోందోనన్న ఆరాటమే కదా ఆమెకు ఎప్పుడూనూ”.


“అవునే, వచ్చిన ప్రతీసారీ మా అమ్మ ఇది తినదు, అది తినదు, ఈ చప్పిడ తిళ్లు ఎలా తింటుందంటూ తన అసహనాన్ని వ్యక్త పరుస్తుంది. మా అత్తగారికి బి. పి, సుగర్ ఉందని నేను జాగ్రత్తపడుతూ వంటలు చేస్తూంటే ఇలా ప్రతీదానికి వంకలు పెడ్తూ నేను మా అత్తగారికి తిండి పెట్టకుండా మాడ్చివేస్తున్నానని ఆవిడ ఉద్దేశ్యం.


మా ఆడపడుచు ఉన్నప్పుడు ఒకలాగ ఆమెగారు వెళ్లిపోయాకా వేరేవిధంగానూ ఉంటుంది మా అత్తగారి ప్రవర్తన. అప్పుడైనా ఒక్కమాట నా తరపున మాట్లాడవచ్చు కదా మా అత్తగారు. లేదు సరళా, సుప్రజ బాగానే చేస్తుంది, నన్ను బాగా చూసుకుంటుందని. ఏమీ అనరు సరికదా మౌనంగా ఉండిపోయేసరికి మా ఆడపడుచు మరింత రెచ్చిపోతూ బోల్డన్ని జాగ్రత్తలు చెప్పి మరీ వెడుతుంది.


ఒకసారి నిగ్రహించుకోలేక ‘నాకు తెలుసుకదా వదినా, అత్తయ్యను ఎలాగ చూసుకోవాలో’ అనేసరికి ఇంతెత్తున నా మీద ద్వజం ఎత్తుతూ ‘నాకే ఎదురు చెపుతావా సుప్రజా, నేను మా అత్తగారిని కళ్లల్లో పెట్టుకుని చూసినట్లుగా నీవు మా అమ్మని చూస్తున్నావా, నీవు సరిగా చూసుకోవడంలేదనే నేను ఇదంతా చెపుతున్నాను. మీ అత్తగారు మమ్మలని అందరినీ ఎంత కష్టపడి పెంచిందో తెలిస్తే నీవా మాట మాట్లాడ’వంటూ కళ్లెర్ర చేస్తూ తను అన్న మాటలు నన్నెంత కష్టపెడతాయో ఎవరికీ అర్ధం కా”దంటూ చెపుతున్న సుప్రజ గొంతు గద్గదమైందో క్షణం.


“అబ్బ బాధ పడకే సుప్రజా, నాకు మా అత్తగారితో లేవా బాధలు. నాకు నచ్చిన వంట చేసుకోడానికి పడనీయదు. ఎప్పుడూ ఒకేరకమైన వంటలు. పోపులు వేసే సమయానికి హడావుడిగా వచ్చేసి నన్ను పక్కకు లాగేసి వంట చేయనీయదు. ఇదిగో చూడు, ఈ వంకాయ కూర.. నీళ్ల నీళ్లగా ఎలా ఉందో..


మా శ్రీవారికి చెపితే వినీ విననట్టు ఉండిపోతారు. ‘అమ్మతో గొడవపెట్టుకోమంటావా నీరజా, నీవే నెమ్మదిగా చెప్పుకో’ అంటారు. ఎక్కడికక్కడ వదిలేసి ముందుకు సాగిపోవాలే, లేకపోతే బాధపడేది మనమే. మన ఆరోగ్యం పాడవడం తప్పించితే మనకు వచ్చేది ఏముందే. మీ ఆడపడుచు ఏమన్నా అలాగేనండీ అని తలూపేయ్ చాలు.


మన మాధవిని చూడు. దానికీ అత్తగారు మామగారూ ఉన్నా ఏనాడైనా వాళ్లమూలాన తనకు ఇబ్బందులు ఉన్నాయని చెప్పిందా? ఎందుకంటే దాని అత్త మామలు మంచి వాళ్లు కాబట్టి. అదృష్టవంతురాలు మన మాధవి. ఏమంటావే మధూ” అనగానే అవునంటూ తలూపింది మాధవి.


మాధవి పైకి అలా తలూపినా తన మనసులో చెలరేగుతునన్న అనేక భావాలను పైకి చెప్పుకోవడం ఇష్టం ఉండదు. పైకి చెప్పుకుంటే మనస్తాపం చల్లారుతుందా అనుకుంటుంది. రెండురోజులు క్రితం నాటి సంఘటన మనసులో మెదిలింది.


“ఎన్ని సార్లు పిలవాలి నిన్ను, ఇప్పటికి పదిసార్లు పిలిచినా వినిపించనట్లు ఎవరితోనో ఫోనులో అంతసేపా మాటలు?” అంటూ ఖంగుమన్న కంఠానికి ఉలిక్కిపడుతూ తలెత్తి చూసింది అత్తగారు ప్రసూనాంబ వైపు మాధవి.


“ఏమిటే ఆ మిడిగుడ్లు చూపులు? రాత్రి ఏడుగంటలకల్లా పలహారం రెడీ చేయమన్నాను. చేసావా? ఆ దిక్కుమాలిన గోధుమనూక ఉప్మా చేస్తావా ఏమిటి? మీ మామగారు తినలేక విసుక్కుంటున్నారు”.


“లేదత్తయ్యా, దోశెలు వేస్తాను. కొబ్బరి పచ్చడి అల్లం పచ్చడి చేసాను. మీకూ మామయ్యగారికి వేడిగా వేసి ఇస్తాను, ఒక్క నిమిషం” అంటూ హడావుడి పడుతూ దోశెలు వేయసాగింది.


ఈ లోగా ఆడపడుచు దుబాయ్ నుండి ఫోన్ చేసింది. అత్తగారు ఫోన్ కు అతుక్కుపోతూ కూతురితో కబుర్లాడుతూ పదిహేను నిమిషాలు సమయం అయిపోయింది. అప్పుడు మెల్లిగా వచ్చారు డైనింగ్ టేబిల్ దగ్గరకు.


“ఏం రాణీ గారు ఇప్పటికైనా మా ముఖాన దోశెలు పడేస్తారా” అంటూ డైనింగ్ కుర్చీ మీద చతికిలబడింది. పక్కనే మామగారు కూర్చున్నారు.


“ఇవా చల్లారిపోయిన దోశెలు?” అంటూ ప్లేట్ ని ఠపీ మని దూరంగా తోసేసింది. “ఏం మేము ఫోన్ లో మాటలాడుతున్నామని తెలుసు కదా, కాసేపు ఆగలేవా? గబ గబా పని ముగించుకోవాలనే ఆరాటం తప్పించితే పెద్దవాళ్లం అన్న ఆరాటమేమదైనా ఉంటేకదా” అంటూ ఇంకా ఏదో మాట్లాడబోతుంటే మామగారు “ఊరుకోవే, ఎప్పుడూ ఆ అమ్మాయిని ఆడిపోసుకోవడం తప్పించితే నీకు మరో పని లేదా? అయినా మనమే కదా, అమ్మాయితో ఫోన్ లో మాట్లాడుతూ ఉండిపోయాం. మాధవి తప్పు ఏముంది ప్రసన్నా?”


భర్త మాటలకు రుస రుస లాడిపోతూ నేనేమన్నానని అంతలా వెనకేసుకొస్తారంటూ మాట్లాడుతుండగా మాధవి మరల వేడి వేడి దోశెలు వేసి ఆవిడ ముందు ప్లేట్ పెట్టేసరికి ఆవిడ కాస్త చల్లబడింది.


ప్రతీ రోజూ ఇదే తతంగం ఇంట్లో. ఆఫీస్ నుండి అలసి పోయి ఇంటికి వస్తే కనీసం ఒక కప్పు కాఫీ అయినా చేసి ఇవ్వదు అత్తగారు. పిల్లలు స్కూల్ నుండి వస్తారు. వాళ్లకు కాస్త బట్టలు మార్పించడం, త్రాగడానికి ఏ బూస్టో, బోర్నావిటానో కలపి ఇవ్వాలన్న ఇంగితం కూడా లేదామెకు. మాధవి ఆఫీస్ నుండి ఇంటికొచ్చేసరికి ఇల్లు ఒక రణరంగంలాగే ఉంటుంది. ఇంటికి వచ్చానన్న ఆనందం ఆవిరిలాగ ఇగిరిపోతుంది. ఒక్కోసారి భర్త శేఖర్ తో మొరపెట్టు కుంటుంది. ఇంటిపని, ఆఫీస్ పని రెండింటినీ నిర్వహించడం తన వల్ల కావడంలేదని.


‘ఏం చేయమంటావు మధూ? మా అమ్మని మార్చడం నా తరం కాదు. నాన్నగారు కూడా చెపుతున్నారు. కానీ ఆవిడ లెక్క చేయడం లేదు. పోనీ విడిగా వెళ్లిపోదామా?’ నిర్ణయాన్ని తనమీదే వదిలేస్తాడు భర్త. ఉన్న ఒక్క మరిదీ కులాంతర వివాహం చేసుకుని బయటకు వెళ్లిపోయాడు. అదే ఊళ్లో ఉంటున్నారు. భార్యా భర్తలిద్దరూ కూడా సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు. ఆడపడుచు, ఆమె భర్త దుబాయ్ లో ఉంటారు. మరిది రమేష్ ఎప్పుడూ తల్లితండ్రులను తమ దగ్గరకు రమ్మనమవి అనడు. అటువంటప్పుడు పెద్ద కొడుకు దగ్గర హాయిగా సంతోషంగా ఉండవచ్చు కదా. ఎన్నాళ్లు తను అత్తగారి ఆరళ్లను భరించాలి? తనకూ సుఖ సంతోషాలు కావాలని అనిపించదా? ఆదివారం నాడు భర్త పిల్లలతో కలసి ఎక్కడికైనా వెళ్లి కాసేపు గడపి రావాలనిపిస్తుంది. ముందరే పసిగట్టేసి ఏదో వంకపెడుతూ వెళ్లనీయకుండా చేస్తుంది.


ఆ ఆదివారం మధ్నాహ్నం రమేష్ వచ్చాడు. అందరినీ పలుకరించి తల్లీ తండ్రీ దగ్గర కూర్చుని కబుర్లు మొదలుపెట్టాడు. అతని రాకకు ముఖ్య ఉద్దేశ్యం తల్లీ తండ్రిని తనతో తీసుకువెళ్లాలని. అతని భార్య ప్రీతి మగపిల్లాడిని కనింది. నాలుగు నెలలు నిండాయి వాడికి. మెటర్నటీ లీవ్ అయిపోయింది. పిల్లాడిని డే కేర్ లోనో లేకా ఆయా చేతిలోనో పెట్టడం ఇష్టంలేదు. హఠాత్తుగా తల్లీ తండ్రీ గుర్తొచ్చారు. ఆయాను పెట్టుకునే ఖర్చులో తల్లీ తండ్రి ని పిలిపించుకుంటే పిల్లాడిని చూస్తారని వాళ్ల ఉద్దేశ్యం. ప్రీతి కి వాళ్లను పిలిపించడం ఇష్టం లేకపోయినా ఇంట్లో చాకిరీకి పనికివస్తారని సరేనంటూ భర్త సలహాను ఆమోదించింది.

========================================================================

ఇంకా వుంది..


========================================================================

యశోద పులుగుర్త గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


Podcast Link:


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం :

నా పేరు యశోద పులుగుర్త, మా వారి పేరు శ్రీ కైలాసపతిరావు ! నేను ఒక ప్రభుత్వరంగ సంస్తలో మార్కెటింగ్ విభాగంలో సీనియర్ మేనేజర్ గా 35 సంవత్సరములు పనిచేసి రిటైర్ అయ్యాను.. నా విద్యార్హతలు M.A (Pub. Admn.) & M.B.A (Marketing ). రిటైర్ అయ్యాక పూర్తిగా తెలుగు సాహిత్యం పట్ల , రచనల పట్ల ఆసక్తి కలిగింది.. చిన్నతనంనుండి మంచి మంచి రచయితలు, రచయిత్రుల కధలు, సీరియల్స్ చదువుతూ పెరిగినదాన్ని! నాకు చిన్నతనంనుండి మంచి మంచి కధలు వ్రాయడానికి ప్రయత్నించేదాన్ని.. కాని చదువు, ఉద్యోగం, పిల్లల పెంపకం బాధ్యతలలో నా కోరిక తీరలేదు.. ప్రస్తుతం మా అబ్బాయిలిద్దరూ వాళ్లు కుటుంబాలతో అమెరికాలో స్తిరపడ్డారు.. నేను ప్రస్తుతం రచనా వ్యాపకంలో ఉంటూ కధలూ, వ్యాసాలూ వివిధ పత్రికలకు పంపుతూ ఇలా అప్పుడప్పుడు పోటీలలో పాల్గొంటున్నాను.. నేను వ్రాసిన రెండుకధలు పుస్తక రూపంలో ప్రచురితమైనాయి.. ప్రస్తుతం హైదరాబాద్ లో నేనూ, మా శ్రీవారూ విశ్రాంతి జీవితాన్ని గడుపుతున్నాం.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి బిరుదు పొందారు.







68 views0 comments

Comments


bottom of page