'Manushulu' Marali Episode 2' - New Telugu Web Series Written By Yasoda Pulugurtha Published In manatelugukathalu.com On 01/11/2023
'మనుషులు మారాలి ఎపిసోడ్ - 2' తెలుగు ధారావాహిక
రచన: యశోద పులుగుర్త (ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
జరిగిన కథ:
సుప్రజ, మాధవి, నీరజ ఒకే ఆఫీస్ లో పనిచేస్తూ ఉంటారు. మాధవి తప్ప మిగతా ఇద్దరు అత్తగారి ఇంట్లో తమ కష్టాల గురించి చెబుతారు.
మాధవి తన కష్టాల గురించి ఆలోచిస్తూ ఉంటుంది.
ఇక మనుషులు మారాలి - ఎపిసోడ్ 2 చదవండి.
ఆరోజు సాయంత్రం సుప్రజ ఆఫీస్ నుండి ఇంటికి వచ్చేసరికి ఆడపడుచు సరళ, ఆమె ఇద్దరు పిల్లలు వచ్చి ఉన్నారు. సరళ ఎందుకో సీరియస్ గా ముఖం గంటు పెట్టుకుని కూర్చుని ఉంది. అత్తగారి ముఖం కూడా సీరియస్ గా ఉంది. సుప్రజ భర్త మోహన్ కృష్ణ ఇంకా ఆఫీస్ నుండి రాలేదు. సుప్రజ మౌనంగా బాత్ రూమ్ లోకి వెళ్లి రిఫ్రెష్ అయి కాఫీ కలపడానికి వంటింట్లోకి వెళ్లింది. కాఫీ కప్పులు తీసుకుని అత్తగారి గదిలోకి వెళ్లబోతుంటే అత్తగారి మాటలు ఆమెను గది గుమ్మందగ్గరే నిలబెట్టేసాయి. సంస్కారం కాకపోయినా అత్తగారు సరళను కోపంగా మాట్లనడం సుప్రజ చెవిని పడ్డాయి.
“ఏమైనా నీవు తొందరపడకుండా ఉండ వలసిందే సరూ, మీ అత్తగారితో పోట్లాట పెట్టుకుని వచ్చేయడం సబబుగా లేదు. నీదంతా తొందరపాటు స్వభావమే. మీ ఆయనకు నెమ్మదిగా నచ్చ చెప్పు కోవాలేగానీ, ఇలా వచ్చేయడం ఏమంత బాగుందే. నీ తమ్ముడు మోహన్, సుప్రజ ఏమనుకుంటారు? ముఖ్యంగా సుప్రజ దృష్టిలో ఎంత లోకువైపోతావో ఆలోచించావా? అల్లుడికి అసలే పంతం ఎక్కువ. నిన్ను బ్రతిమాలడానికి వస్తాడనుకుంటున్నావా?”
సుప్రజకు పరిస్తితి చూచాయగా అర్ధం అయింది. ముందస్తుగా లేని దగ్గును తెచ్చుకుంటూ వేడి వేడి కాఫీ వాళ్లకు అందించింది.
అత్తగారు వరలక్ష్మి సుప్రజతో “ఉత్తి కాఫీయేనా, వేడి వేడిగా కాసిని ఉల్లిపాయ పకోడీలు వేయకపోయావా, సరళా పిల్లలు కూడా వచ్చారు”.
తనను చూసినా పలుకరించని ఆడపడుచు వైపు కనీసం తలెత్తి కూడా చూడకుండా అత్తగారి మాటలకు సమాధానమివ్వకుండా అక్కడనుండి వెళ్లిపోయింది సుప్రజ.
ఆ రోజు రాత్రి భోజనాల సమయంలో సుప్రజ అత్తగారు కొడుకుతో చెపుతుండగా వంటింట్లో ఉన్న సుప్రజ వింది.
మీ అక్క అత్తగారు మరీ అంత రాక్షసేమిటిరా మోహన్. మీ బావగారు ఎల్. టి. సి పెట్టుకుని అక్కనూ పిల్లలనూ తీసుకుని ఉత్తరదేశ యాత్రలకు వెడదామనుకున్నారుట. సంగతి తెలిసిన దాని అత్తగారు నేనూ వస్తాను, కాశీ చూడాలని ఉందని చెప్పిందిట. మీ బావగారు మెతకకకదా, అలాగే వద్దువుగానన్నారుట. అక్కకేమో సరదాగా దాని కుటుంబంతో వెళ్లాలని సంబర పడుతుంటే మధ్యలో పానకంలో పుడకలా ఆవిడ తయారయ్యిందిట.
ఇదేమో ఊరుకోలేక ‘మీరు పెద్గవారు, మాతో రావడం ఏమిటి? ఎవరైనా కాశీ వెడుతుంటే వాళ్లతో పంపుతాములే’ అందిట.
‘అదీగాక ఇంటికి తాళం వేసి అందరం వెళ్లిపోతే అసలుకే రోజులు బాగాలేవు, ఆ మధ్య పక్కవీధిలో దొంగలుపడి మొత్తం అంతా దోచుకుపోయారు, మీరు రావద్ద’నేసరికి ఇంట్లో పెద్ద రాధ్దాంతం చేసిందిట. ఇద్దరికీ మాటా మాటా పెరిగిందిట. ఆవిడ తన తమ్ముడింటికి వెళ్లిపోతానని ఏడ్చి గోల చేస్తుంటే మీ అక్క తట్టుకోలేక ‘మీరే ఇక్కడ ఉండండి, నేను నా పిల్లలు మా తమ్ముడింటికి పోతాం’ అందిట.
అదంతా చూస్తున్న మీ బావగారు తన తల్లిని కోప్పడడం మాని మీ అక్కమీదే ఎగిరాడుట. మీ అక్కేనా ఎంతకని ఓర్చుకుంటుందిరా? ఉంటే మీ అమ్మగారేనా ఉండాలి, లేకపోతే నేనైనా ఉండాలి, తేల్చుకొండంటూ పిల్లలను తీసుకుని వచ్చేసింది”.
"అవునా, అక్కేది?” అంటున్న మోహన్ తో “పక్కింటి వాళ్లింటికి వెళ్లింది నీవు వచ్చే ముందే. వాళ్ల మ్మాయి పుట్టింటికి వచ్చిందని తెలిసి”.
“అయినా అమ్మా, బావగారు చెప్పింది కరెక్టే కదా. పెద్దావిడ, ఆవిడకూ కొడుకు కుటుంబంతో కలసి కాశీ వెళ్లాలనిపించదా? ఏం అక్కా వాళ్లతో వెడితే తప్పేమిటట? ఒక్కావిడని ఇంట్లో వదలడం భావ్యం అనిపించక బావగారు ఆవిడను కూడా తీసుకెడదామనుకున్నారేమో. మేము ఎక్కడికైనా వెడితే నిన్నుఎప్పుడైనా ఒంటరిగా వదిలి వెళ్లామా అమ్మా? నేను ఊరుకున్నా సుప్రజ ఊరుకోదు. అత్తయ్యగారిని కూడా తీసుకెడదామంటుంది. అక్క తొందరపడి వచ్చేయడం బాగాలేదు".
“ఏరా మోహన్! అక్క కుటుంబం మీమీద పడుతుందనా, మీకు భారమనా?” కాస్తంత నిష్టూరంగా మాట్లాడుతున్న తల్లి వైపు ఆశ్చర్యంగా చూసాడు.
“అమ్మా! మాకు భారం, బరువు అన్న దృష్టితో కాదు చెపుతున్నది. అక్క పిల్లలు పెద్దవాళ్లు అవుతున్నారు. తల్లీ తండ్రీ మధ్య నున్న విబేధాలు, పంతాలు వాళ్ల మనసులపై ఎటువంటి ప్రభావం చూపుతుందోనన్న భయం. రేపు వాళ్ల ముందే అందరూ ‘మీ అమ్మా నాన్నా విడిపోయారు కదూ’ అని అడుగుతుంటే వాళ్ల మనసు విలవిల్లాడదా?
అక్క క్షేమం కోరే తల్లిగా దానిని వెనకేసుకు రాక దానికి కాస్త జ్ఞానోదయం చేయి. చిన్న వాణ్ణి నేను చెపితే అది లెక్కచేయదు” అంటూ కాస్త కోపంగా చెయ్యి కడుక్కోడానికి వాష్ బేసిన్ దగ్గరకు వెళ్లిపోయాడు.
ఆవిడ కూతురికి జ్ఞానోదయం చేసిందో లేదో తెలియదు, ఒక వేళ చేసినా అసలుకే మొండిది సరళ. ఎవరి మాటనూ ఖాతరు చేయదు. అక్కడే ఉండిపోయింది.
వారం రోజులు చూసిన తరువాత మోహన్ ఒకరోజున బావగారిని ఆఫీస్ అయిన తరువాత కలిసాడు.
"బావగారూ మీ వ్యక్తిగత విషయాలలో కలగచేసు కుంటున్నానని అనుకోపోతే అక్క తరపున నేను క్షమార్పణ అడుగుతున్నాను. ఇద్దరూ పంతాలు, పట్టింపుల మీద ఎన్నాళ్లు కూర్చుంటారు"? మీరు వచ్చి అక్కా పిల్లలను తీసుకుని వెళ్లండి”.
"సారీ మోహన్. మీ అక్కకిది మొదటిసారి కాదు. అమ్మతో అనవసరంగా గొడవపెట్టుకుంటుంది. అలుగుతుంది, పుట్టింటికి వచ్చేస్తుంది. ఇన్నాళ్లూ నేనూ బ్రతిమలాడి తీసుకువెళ్లడం నీవు చూసావు.
అమ్మ పొడ కిట్టదు సరళకు. అమ్మని మాతో ఎక్కడకు తీసుకువెడదామన్నా సహించదు. అమ్మ అమాయకురాలు. కాస్త ఛాదస్తం ఉందేమో గానీ ఎవరినీ బాధపెట్టే స్వభావం కాదు. సరళ ని తీసుకురారా రాఘవా అంటూ నాలుగు రోజుల నుండి నా ప్రాణాలు తోడేస్తోంది. నేను మీతో రానులేరా, తరువాత ఎప్పుడైనా కాశీ వెడతానులే, నేనే ఊరుకోక అన్నాను సరదాపడి. సరళ తప్పేమీ లేదంటూ బాధపడుతోంది.
నీకు చెప్పుకోలేక సిగ్గు పడుతున్నాను మోహన్. సరళ వెడుతూ వెడుతూ నేనైనా ఉండాలి ఇక్కడ, లేకపోతే మీ అమ్మగారైనా ఉండాలి ఆలోచించుకోండి అంటుందా? అంటే.... అంటే సరళ కోసం మా అమ్మని ఏ అనాధాశ్రమానికో పంపేయాలన్న మాట.
ఇద్దరిలో ఎవరిని వదులు కోవాలా అన్న ఆలోచనలో ఉన్నాను. ఒక స్తిర నిర్ణయానికి వచ్చిన తరువాత ఏమి చేయాలో అది చేస్తాను.
నీవు ఏమీ అనుకోపోతే ఈరోజుల్లో ఒక కుటుంబం అదనంగా మీద పడితే ఎంత భారం అవుతుందో తెలుసు. ఫోన్ పే చేస్తుంటాను సరళకూ పిల్లల ఖర్చులకు. మీ అక్క అకౌంట్ లో నేనే డబ్బు క్రెడిట్ చేయచ్చు. కానీ సరళ ముందూ వెనకా ఆలోచించదు. తనకు నచ్చిన నగో, పట్టుచీరో కొనేస్తుంది. నీవే ఖర్చు చేస్తున్నట్లుగా అనుకోనీయ్”.
"బావా అదేమిటీ, అసలుకే అక్క చేసిన పనికి సిగ్గు పడుతున్నాను. ఇంకా ఇలా చేసి మరింత సిగ్గుపడేలా చేస్తావా బావా? అక్కలో మార్పు వస్తుంది తప్పకుండా. అదే మీకోసం పరుగెత్తుకొస్తుంది. తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకండి బావా”.
“దేనికదే మోహన్. నా మాట కాదనకు. సరళలో మార్పు వస్తే అంతకంటే కావలసింది ఏముం”దంటూ శెలవు తీసుకుంటూ వెళ్లిపోతున్న బావగారి వైపు అలా చూస్తూ ఉండిపోయాడు.
మోహన్ అన్యమనస్కంగా ఇంటికి వచ్చాడు. హాల్ లో గోల గోలగా ఉంది. సరళ టి. వి. లో తెలుగు సీరియల్స్ చూస్తోంది. పిల్లలు గోల గోలగా ఏదో మాట్లాడుకుంటున్నారు. తను ఎప్పుడోగానీ టి. వి పెట్టనీయడు. అలాంటిది అక్క వచ్చినప్పటినుండి రాత్రి పదకొండుగంటల వరకు టి. వి అలా వాగుతూనే ఉంటుంది. అక్క పిల్లల స్కూల్ దగ్గరే కాబట్టి ఆటోలో స్కూల్ కి వెళ్లి వచ్చే సదుపాయం చేసాడు. బావగారు మరీ మరీ చెప్పారు. పిల్లల స్కూల్ కి, చదువులకీ ఆటంకం రాకుండా చూడమని.
నిజానికి బావ ఎంత సౌమ్యుడు. అక్క కి పెళ్లై పది సంవత్సరాలైంది. అక్కకి మాట దురుసుతనం ఎక్కువ. ఇలా ఎన్నో సార్లు పుట్టింటికి వచ్చేసిన అక్కను బ్రతిమాలో, బుజ్జగించో ఇంటికి తీసుకెళ్లేవాడు. ఈ సారి బావ మనస్సు చాలా బాధపడినట్లుగా ఉంది. ఉండదా మరి? అక్క సామాన్యమైన మాటలందా? నేనో మీ అమ్మో ఉండాలి నీ దగ్గర, తేల్చుకో అంటుందా?
========================================================================
ఇంకా వుంది..
========================================================================
యశోద పులుగుర్త గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం
Podcast Link:
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత్రి పరిచయం :
నా పేరు యశోద పులుగుర్త, మా వారి పేరు శ్రీ కైలాసపతిరావు ! నేను ఒక ప్రభుత్వరంగ సంస్తలో మార్కెటింగ్ విభాగంలో సీనియర్ మేనేజర్ గా 35 సంవత్సరములు పనిచేసి రిటైర్ అయ్యాను.. నా విద్యార్హతలు M.A (Pub. Admn.) & M.B.A (Marketing ). రిటైర్ అయ్యాక పూర్తిగా తెలుగు సాహిత్యం పట్ల , రచనల పట్ల ఆసక్తి కలిగింది.. చిన్నతనంనుండి మంచి మంచి రచయితలు, రచయిత్రుల కధలు, సీరియల్స్ చదువుతూ పెరిగినదాన్ని! నాకు చిన్నతనంనుండి మంచి మంచి కధలు వ్రాయడానికి ప్రయత్నించేదాన్ని.. కాని చదువు, ఉద్యోగం, పిల్లల పెంపకం బాధ్యతలలో నా కోరిక తీరలేదు.. ప్రస్తుతం మా అబ్బాయిలిద్దరూ వాళ్లు కుటుంబాలతో అమెరికాలో స్తిరపడ్డారు.. నేను ప్రస్తుతం రచనా వ్యాపకంలో ఉంటూ కధలూ, వ్యాసాలూ వివిధ పత్రికలకు పంపుతూ ఇలా అప్పుడప్పుడు పోటీలలో పాల్గొంటున్నాను.. నేను వ్రాసిన రెండుకధలు పుస్తక రూపంలో ప్రచురితమైనాయి.. ప్రస్తుతం హైదరాబాద్ లో నేనూ, మా శ్రీవారూ విశ్రాంతి జీవితాన్ని గడుపుతున్నాం.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి బిరుదు పొందారు.
Comments