మనుషులు మారాలి ఎపిసోడ్ - 9
- Yasoda Pulugurtha
- Dec 15, 2023
- 5 min read
Updated: Jan 2, 2024

'Manushulu' Marali Episode 9' - New Telugu Web Series Written By Yasoda Pulugurtha Published In manatelugukathalu.com On 15/12/2023
'మనుషులు మారాలి ఎపిసోడ్ - 9' తెలుగు ధారావాహిక
రచన: యశోద పులుగుర్త (ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
జరిగిన కథ:
సుప్రజ, మాధవి, నీరజ ఒకే ఆఫీస్ లో పనిచేస్తూ ఉంటారు. ఒకరి కష్టసుఖాలు మరొకరు షేర్ చేసుకుంటూ ఉంటారు.
సుప్రజ ఆడపడుచు సరళ, భర్త మీద అలిగి వచ్చేస్తుంది. సుప్రజ భర్త మోహన్, తన బావతో అక్క సరళ గురించి మాట్లాడతాడు. సరళ అత్తగారు ఇల్లు వదిలి వెళ్ళిపోతారు.
నీరజ వంటను ఇంట్లో అందరూ మెచ్చుకున్నా అత్తగారు మాత్రం మెచ్చుకోరు. భర్త వేణుకు ఆ విషయం చెబుతుంది నీరజ.
మాధవి మరిది రమేష్ తలిదండ్రులని తనతో తీసుకొని వెళతాడు. వెళ్ళినప్పటినుండి డబ్బులు చాలడం లేదని మాధవి భర్త శేఖర్ ని సహాయం అడుగుతూ ఉంటాడు. కొద్ది రోజులకే మాధవి విలువ తెలిసివచ్చింది ఆమె అత్తగారు ప్రసూనాంబకి. జరుగుతున్న విషయాల గురించి కొడుకు రమేష్ తో ఆవేశంగా మాట్లాడుతాడు ప్రసాదరావు.
తిరిగి మాధవి దగ్గరకే వస్తారు వాళ్ళు.
సుప్రజ విలువ తెలుసుకుంటుంది ఆమె అత్తగారు. సరళ కూడా తప్పు తెలుసుకుని అత్తగారిని క్షమాపణ కోరుతుంది.
ఇక మనుషులు మారాలి - ఎపిసోడ్ 9 చదవండి..
సుప్రజ సరళ కు మంచి పట్టుచీర, రాఘవ్ కు పేంట్, షర్టూ, అలాగే పిల్లలకు, రాఘవ్ తల్లికి చీర కొని తెచ్చింది. సరళకు బొట్టు పెట్టి తాంబూలం పట్టు చీర చేతిలో పెట్టి సరళకూ రాఘవ్ కూ నమస్కరించింది. సుప్రజను ఆప్యాయంగా కౌగలించుకుంది సరళ.
“సుప్రజా, నిన్ను చూసి చాలా నేర్చుకున్నాను. నాలో మార్పుకి పరోక్షంగా నీవే కారణం. ఉద్యోగస్తురాలివైనా ఏమాత్రం గర్వం లేకుండా ఎంతో ఓర్పుగా సంసారం చక్కదిద్దుకునే తీరు నన్ను ముగ్ధురాలిని చేసింది. నిన్ను ఎన్నో మాటలు అనేదాన్ని. ఏనాడూ నన్ను పల్లెత్తు మాట అనేదానివి కాదు. భర్తను వదిలేసి పిల్లలతో పుట్టింట్లో ఉన్నా ఎంతో గౌరవంగా చూసుకున్నావు. నీకు ఎలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో తెలియడం లేదు సుప్రజా.. నా కంటే చిన్నదానివైనా సంస్కారంలో నేను అందుకోలేనంత ఎత్తులో ఉన్నావు. నీవూ, మోహన్ హాయిగా సంతోషంగా ఉండాలి ఎప్పటికీ”.
“వదినా! కుటుంబాలలో సమస్యలు రావడం సహజం. మనిషి అన్న తరవాత రాగద్వేషాలు ఉండకుండా ఉండవు. మీలో ఒక మంచి మార్పు రావడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. అది ఎవరివలన వచ్చిందోనని కాదు. నన్ను మీరు అంతలా ఎత్తేయనవసరం లేదు. నేనూ సాధారణమైన స్త్రీనే.
మీరు ఇలా హాయిగా ఆనందంగా మా రాఘవ్ అన్నయ్యతో కలసి కాపురం చేసుకోవడం కంటే కావలసిఉంది ఏముంది?”
ఈలోగా రాఘవ్ అమ్మగారు “సరళ లో కొంచెం మొండితనం ఉన్న మాట వాస్తవమైనా మనసు వెన్నపూసే. ఒక్క సరళ మారడమే కాదు. నేను కూడా కొన్ని విషయాల్లో మారాలి. మనిషి అహాన్ని చంపుకున్నప్పుడే మహనీయుడౌతాడు. ఈ సంఘటన నాలోనూ పరివర్తన తెచ్చిం”దంటూ చీర చెంగుతో కళ్లు తుడుచుకున్నారావిడ.
ఆడపడుచు కుటుంబాన్ని సాదరంగా సాగనంపిన తరువాత అందరూ లోపలకు వచ్చారు.
“సుప్రజా! ఇలా వస్తావా తల్లీ ఒక్కసారి” అని అత్తగారు పిలిచేసరికి గబ గబా ఆవిడ గదిలోకి వెళ్లింది. ‘ఏం కావాలి అత్తయ్యా’ అంటూ.
“ఏం లేదమ్మా, ఒక్క ఐదు నిమిషాలు ఇలా కూర్చో” అంటూ తన మంచ మీదే కూర్చోమంది.
“నేను సరళకు కన్న తల్లిగా కొన్ని సందర్భాలలో దానినే వెనకేసుకు వచ్చేదాన్ని. ముందరనుండే ‘ఇలా కాదు, తప్పు సరళా..’ అని చెప్పి ఉంటే ఇంత ఉపద్రవం జరిగేది కాదేమో.. ఇంటికి లక్షణమైన కోడలు వస్తే ఇల్లంతా కళ కళ లాడుతూ శోభాయమానంగా ఉంటుంది. ఈ విషయంలో నేను అదృష్టవంతురాలిని తల్లీ. సరళ ఇకనుండైనా సవ్యంగా కాపురం చేసుకుంటే బాగుండును. పాపం దాని అత్తగారు తిరిగి రావడం అందరి అదృష్టమూ కూడా. నీకూ మోహన్ కు ఆ భగవంతుని ఆశీర్వాదాలు సదా ఉండాలని కోరుకుంటున్నాను. అందుకనే పిలిచాను సుప్రజా”.
“అయ్యో అత్తయ్యా, మీరు పెద్దవారు. ఇంక మీరు ఏమీ ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండం”డంటూ అక్కడనుండి బయటకు వచ్చేసింది.
ఆ రోజు రాత్రి మోహన్ సుప్రజ తో “మొత్తానికి మా సరళ అక్కలో మార్పు వచ్చింది. మా బావగారి ముఖంలోని ఆనందాన్ని గమనించావా సుప్రజా” అనేసరికి గమనించానని తల ఊపింది.
ఆ మరునాడు ఆఫీస్ లో మాటల సందర్భంలో సుప్రజ చాలా సంతోషంగా “మా ఆడపడుచు సరళ వాళ్ల అత్తగారు తిరిగి వచ్చా”రన్న విషయాన్ని అంతా చెపుతూ “సరళ వదినలో ఊహించని మార్పు వచ్చిందే” అంటూ మాధవికి నీరజకు చెప్పేసరికి ఇద్దరూ చాలా సంతోష పడ్డారు.
మాధవి కూడా వాళ్ల అత్తగారు, మామగారూ- మరిది ఇంటి నుండి తిరిగి వచ్చేసారని, అక్కడ వాళ్లకు ఎదురైన ఎన్నో చేదు అనుభవాలు చవి చూసిన మూలాన అక్కడ ఉండలేకపోయారని చెప్పింది. అత్తగారు మునుపటిలా లేరని తనతో ఎంతో ఆప్యాయంగా ఉంటూ పనుల్లో ఎంతో సహాయకారిగా ఉంటున్నారని చెప్పేసరికి సుప్రజా నీరజా ఆనందపడ్డారు.
“పోనీలేవే నీ కష్టాలు తీరాయి కదా, మరి పార్టీ ఇస్తావా లేదా, రేపు శెలవు తీసుకుని బయట రెస్టారెంట్ లో లంచ్ అక్కడ నుండి సినిమా కు, ఓకే నా” అని నీరజ అనేసరికి అందరూ ఒప్పుకున్నారు.
###
నీరజ అత్తగారూ మామగారూ కాశీయాత్ర కు వెళ్లే సన్నహాలు చేసుకుంటున్నారు. వాళ్లు ఒక నెలరోజుల పాటు అక్కడ ఉండాలని అనుకుంటున్నారు. ఇంకో పది రోజులలో కార్తీక మాసం వస్తుందని ఆ మాసమంతా కాశీ విశ్వేశ్వరుని సేవలో గడపాలని, ప్రతీరోజూ గంగా హారతిని తనివితీరా చూడాలని ఉవ్విళ్లూరుతున్నారు. నీరజ వాళ్లకు అవసరమైన మందులూబట్టలూ అవీ దగ్గరుండి పేక్ చేస్తోంది. నీరజ అత్తగారు సరోజినికి బ. పి. సుగర్ ఉన్నాయి. నీరజ ఎట్టి పరిస్తితులలోనూ మందులు వేసుకోవడం మరచిపోవద్దని మరీ మరీ చెప్పింది.
నీరజా వేణూ స్టేషన్ కి వచ్చి ఇద్దరికీ బోలుడన్ని జాగ్రత్తలు చెపుతూ కాశీకి వెళ్లే ట్రైన్ ఎక్కించారు.
“హమ్మయ్య, ఎన్నేళ్ల నుండో అనుకుంటున్నాను. కాశీకి వెళ్లి రావాలని. ఇప్పటకి ఆ కాశీవిశ్వనాధుని దయ కలిగిందన్నమాట” అంటూ సరోజిని భర్తతో అంటూ ఆ కంపార్ట్ మెంట్ లో ఇంకా ఎవరు ఉన్నారో అనుకుంటూ ఇటూ అటూ చూసింది.
తమ సీట్ కు ఎదురుగా ఒక మయస్సు మళ్లిన జంట కనపడ్డారు. మాటల సందర్భంలో వాళ్లూ హైద్రాబాద్ నుండి కాశీ వెడుతున్నామని చెప్పారు. పోనీలే మంచి కంపెనీ దొరికిందని ఆనందపడుతూ ఆవిడతో మాటలు కదిపింది సరోజిని. వాళ్లుకూడా అక్కడ కార్తీకమాసం అయ్యేంతవరకూ ఉంటామని చెప్పారు. వాళ్లు కూడా శ్రీ శారదా పీఠమే ఎకామ్ డేషన్ కి బుక్ చేసుకున్నామనేసరికి భలే సంతోషం వేసింది సరోజిని దంపతులకు. ఒకరికొకరు తోడుగా ఉంటామని ఆనందపడ్డారు. ఆవిడ పేరు శ్రీలక్ష్మి అని ఆయన పేరు నారాయణ మూర్తి అని చెప్పారు.
ఆ రాత్రి డిన్నర్ కు ఎవరి పేకట్లు వారు విప్పుకుని తినడానికి ఉపక్రమించారు. శ్రీలక్ష్మి పేకట్ విప్పి వాసన చూస్తూ భర్తతో ఏదో మాట్లాడుతోంది. ‘పులిహోర వాసన వస్తోంది కదూ’ అన్న మాట సరోజిని చెవిన పడింది.
“పోనీలే, మెల్లిగా మాట్లాడు, పెరుగు అన్నం డబ్బా తీయి, అది తిందాం” అంటున్నాడు.
పెరుగు అన్నం కూడా పులిసిపోయి పుల్లటి వాసన వస్తోంది. సరోజిని ఒక కంట వారిని కనిపెడుతూనే ఉంది. వెంటనే ఒక పేపర్ ప్లేట్ లో కొంత పులిహోర, రెండు చపాతీలు, కూర పెట్టి తీసుకోమని ఇచ్చింది. మొహమాట పడుతూనే తీసుకున్నారు వాళ్లు. నువ్వుల పొడి వేసి బాగా పోపు వేసి పుల్లగా చేసిన పులిహోర ఘమ ఘమ లాడుతోంది. మెత్తగా నున్న చపాతీలు బంగాళా దుంపల కూర ఎంతో రుచిగా ఉన్నాయి.
ఎదురు సీట్ ఆవిడ తిన్నాక “చాలా బాగున్నాయి మీరిచ్చిన పదార్ధాలు సరోజిని గారూ” అనగానే మా కోడలు చేసిందన్న మాట సహజంగా నోట్లోనుండి వచ్చేసింది. నీరజే అవన్నీ చేసింది. ఇంకా జంతికలు, చెక్కలు, కారప్పూస లాంటి వెన్నూ చేసి సర్ది ఇస్తూ ఎప్పుడైనా ఏమీ తినడానికి దొరక్కపోతే ఉంటాయని ఇచ్చింది. సహజంగా సరోజిని మవస్తత్వం గొప్పతనం అంతా తనకే దక్కాలని ఆరాటపడుతుంది. కానీ నోటమ్మట నిజం పలికిందంటే అబధ్దం సిగ్గుపడిందన్నమాట.
“నిజంగా మీరెంత అదృష్టవంతులండీ సరోజిని గారూ. నేను చేస్తానమ్మా వంట అంటే వినదు మా కోడలు. నేను వంట సామాన్లు ఎక్కడ ఎక్కువ వాడేస్తోనని భయం. అతి పొదుపుతనం. తనకా వంటలు చేయడం రాదు. ఇలా కాదమ్మా అని చెప్పినా వినదు. పులుపు, ఉప్పు, కారం ఏమీ ఉండవు వంటల్లో. అందుకే పులిహోర పాడయిపోయింది. మీ కోడలు చేసినవి పెద్దవాళ్లు చేసినట్లు ఎంతో రుచిగా ఉన్నాయి. మీరు అదృష్టవంతులండీ”.
మొదటి సారిగా ఆవిడ ప్రశంస కి అవునంటూ సమాధానమిచ్చింది.
ఆవిడకు సరోజిని ఆ సమయంలో ఒక ఆప్తమిత్రురాలిగా తోచింది. ఆవిడ మవస్సులో ఉన్న ఆవేదనంతా సరోజిని ముందు వెళ్లబోసుకుంది. కొడుకుకి తమ యందు ప్రేమ ఉన్నా కోడలు తమని గడ్డి పరక కంటే హీనంగా చూస్తుందని చెప్పింది. తన భర్తకు పెన్షన్ వస్తున్నా నెల నెలా ఆ పెన్షన్ మొత్తం అంతా తీసేసుకుంటుందని, ఇప్పుడు కూడా కాశీ యాత్ర అంత ముఖ్యమా, యాత్రలకయ్యే ఖర్చులు దాచుకుంటే రోగాలూ రొచ్చులకూ పనికివస్తాయి కదా అంటూ మా ప్రయాణాన్ని ఆపడానికి ప్రయత్నించింది. మా అబ్బాయి కాస్త గట్టిగా మాట్లాడేసరికి ఏమనలేక మా కోడలు ఏమనలేక ఊరుకుంది.
========================================================================
ఇంకా వుంది..
========================================================================
యశోద పులుగుర్త గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం
Podcast Link: https://spotifyanchor-web.app.link/e/VyFYBWA0qFb
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం :
నా పేరు యశోద పులుగుర్త, మా వారి పేరు శ్రీ కైలాసపతిరావు ! నేను ఒక ప్రభుత్వరంగ సంస్తలో మార్కెటింగ్ విభాగంలో సీనియర్ మేనేజర్ గా 35 సంవత్సరములు పనిచేసి రిటైర్ అయ్యాను.. నా విద్యార్హతలు M.A (Pub. Admn.) & M.B.A (Marketing ). రిటైర్ అయ్యాక పూర్తిగా తెలుగు సాహిత్యం పట్ల , రచనల పట్ల ఆసక్తి కలిగింది.. చిన్నతనంనుండి మంచి మంచి రచయితలు, రచయిత్రుల కధలు, సీరియల్స్ చదువుతూ పెరిగినదాన్ని! నాకు చిన్నతనంనుండి మంచి మంచి కధలు వ్రాయడానికి ప్రయత్నించేదాన్ని.. కాని చదువు, ఉద్యోగం, పిల్లల పెంపకం బాధ్యతలలో నా కోరిక తీరలేదు.. ప్రస్తుతం మా అబ్బాయిలిద్దరూ వాళ్లు కుటుంబాలతో అమెరికాలో స్తిరపడ్డారు.. నేను ప్రస్తుతం రచనా వ్యాపకంలో ఉంటూ కధలూ, వ్యాసాలూ వివిధ పత్రికలకు పంపుతూ ఇలా అప్పుడప్పుడు పోటీలలో పాల్గొంటున్నాను.. నేను వ్రాసిన రెండుకధలు పుస్తక రూపంలో ప్రచురితమైనాయి.. ప్రస్తుతం హైదరాబాద్ లో నేనూ, మా శ్రీవారూ విశ్రాంతి జీవితాన్ని గడుపుతున్నాం.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి బిరుదు పొందారు.


Comments