top of page

మరచిపోకుమా.. 

Writer's picture: Sathyanarayana Murthy M R VSathyanarayana Murthy M R V

#మరచిపోకుమా, #Marachipokuma, #MRVSathyanarayanaMurthy, #MRVసత్యనారాయణమూర్తి, #TeluguHeartTouchingStories


Marachipokuma - New Telugu Story Written By M R V Sathyanarayana Murthy

Published In manatelugukathalu.com on 17/12/2024

మరచిపోకుమా - తెలుగు కథ

రచన: M R V సత్యనారాయణ మూర్తి

(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)

కథా పఠనం: పద్మావతి కొమరగిరి




 

మా కొలీగ్ కొడుకు పెళ్ళికి విశాఖపట్నం వచ్చాను. హోటల్ లో దిగాను. ఉదయం కాఫీ కోసం, బెల్ కొట్టినా బాయ్ రాకపోవడంతో, అతని కోసం హోటల్ వరండాలో పచార్లు చేస్తున్నాను. రెండు నిముషాలు గడిచేసరికి ఇద్దరు అమ్మాయిలు ట్రాలీ సూట్ కేసులు లాక్కుంటూ నవ్వుతూ వస్తున్నారు. లైట్లు వెలుగులో వారి మొహాలు వెలిగిపోతున్నాయి. ఒక అమ్మాయిని చూడగానే నేను ఒక్కసారి ఆగిపోయి ఆమెకేసే చూస్తూ ఉండిపోయాను. నన్ను దాటుకుని ముందుకు వెళ్లి రూమ్ తలుపు తీసుకుంటున్నారు. ఏమీ ఎరగనట్టు నడుచుకుంటూ వెళ్తూ ఆ అమ్మాయిని మరోసారి పరీక్షగా చూసాను. అంతే. నా గుండె దడ దడా కొట్టుకుంది. 


నవ్వుతున్నప్పుడు ఎడం బుగ్గ సొట్ట పడటం, పై పెదవి మీద ఉన్న చిన్న పుట్టమచ్చ లైట్ల వెలుగులో కనిపించి నేను ‘షాక్’ అయ్య్యాను. వాళ్ళు తలుపు తీసుకుని రూమ్ లోకి వెళ్ళిపోయారు. బాయ్ రావడం నేను కాఫీ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. కాఫీ వచ్చాకా, ఫ్రెష్ అయి రిసెప్షన్ దగ్గర కూర్చున్నాను. 


 కాసేపటికి ఆ అమ్మాయిలు ఇద్దరూ వచ్చారు. నేను వాళ్ళ దగ్గరకువెళ్ళి “నా పేరు రామచంద్రం. శివపురం లో తహసిల్దార్ గా పనిచేస్తున్నాను. మీతో కొంచెం మాట్లాడాలి” అన్నాను. నా బట్టతల, నెరిసిన మీసాలు చూసి పెద్దాయన అని భావించి ‘అలాగే’ అంది ఒక అమ్మాయి. సోఫాలో కూర్చున్నాం. “మీ పేర్లు..” అన్నాను నేను నసుగుతూ. 


“నా పేరు ప్రమీల, దీని పేరు ప్రమద్వర” అంది ప్రమీల. 


నేను ప్రమద్వర కేసి తిరిగి “నేను చిన్నప్పుడు పాలకొల్లులో ఉండేవాడిని. మీ చుట్టాలు ఎవరైనా పాలకొల్లు లో ఉన్నారా?” అని అడిగాను. 


“మా అమ్మ వాళ్ళ ఊరు పాలకొల్లు. పెళ్లి అయ్యాకా హైదరాబాద్ వచ్చాం అని అమ్మ చెప్పింది” అంది ప్రమద్వర. ఆమె మాటలకి నా మొహం వెలిగిపోయింది. 


“మీ అమ్మగారి పేరు మణిమంజరి..” అని నేను అంటుండగానే, ప్రమద్వర “అవును అంకుల్. మా అమ్మ మీకు తెలుసా?” ఆసక్తిగా అడిగింది. 


“బాగా తెలుసు. బ్రాడీపేట ఒకటవ వీధిలో ఉండేవాళ్ళం మేము కూడా” అన్నాను నేను. 


ప్రమీల వాచీ చూసింది. ప్రమద్వర “అంకుల్! మాకు హోటల్ మేఘాలయలో మ్యూజిక్ ప్రోగ్రాం ఉంది. మేము వెళ్ళాలి. తర్వాత మాట్లాడదాం” అని లేచింది. 


“నేనూ అక్కడికే వచ్చాను” అని నేను కిందకి వచ్చి ఆటో ఎక్కి హోటల్ మేఘాలయకి వెళ్లాను.


మా కొలీగ్ ఎదురొచ్చి లోపలకు తీసుకువెళ్ళాడు. పెళ్ళికి ముందు పాటల ప్రోగ్రాం మొదలుపెట్టారు. 


ముందుగా ప్రమద్వర పాడింది. తెలంగాణా యాసతో ఉన్న ఆ పాటకి జనం ఊగిపోయారు. తర్వాత ప్రమీల పాడింది. దానికీ అదే స్పందన. రెండు పాటలు విన్నాక నేను కూడా వారిని మెచ్చుకోకుండా ఉండలేకపోయాను. ప్రోగ్రాం అయ్యాకా ప్రమద్వర అడ్రస్, ఫోన్ నెంబర్ తీసుకున్నాను. హైదరాబాద్ వచ్చినప్పుడు తప్పకుండా వాళ్ళ ఇంటికి రమ్మనమని చెప్పింది ప్రమద్వర. పెళ్లి అయ్యాకా హోటల్ కి వచ్చి రూమ్ ఖాళీచేసి, బస్సు స్టాండ్ కి వచ్చి బస్సు ఎక్కాను. సీట్ లో కూర్చుని, కళ్ళు మూసుకోగానే గతం కళ్ళ ముందు కదిలింది. 

********

మానాన్నగారికి ట్రాన్స్ఫర్ అవడంతో పాలకొల్లు వచ్చాము. బ్రాడీపేట మొదటివీధిలో డాబాలో ఉండేవాళ్ళం. ఇంటిముందు కుడివైపు పెద్ద బొగడచెట్టు, ఎడమవైపు వేపచెట్టు ఉండేవి. చాలా విశాలమైన వీధి అది. నేను పదో తరగతి, చెల్లాయి ఎనిమిదో తరగతి ఒకే స్కూల్ లో చేరాం. రోజూ బొగడపూల కోసం ఆడపిల్లలు మా ఇంటిముందు చేరేవాళ్ళు. అందులో మణిమంజరి కూడా ఉండేది. ఆమె నా క్లాస్మేట్. మా ఇంటికి నాలుగు ఇళ్ళ అవతల వాళ్ళ ఇల్లు.. మణిమంజరి రూపమే కాదు, పాట కూడా చాలా బాగుంటుంది. క్లాసులో ఆమె పాడుతుంటే కన్నార్పకుండా ఆమెనే చూసేవాళ్ళం. 


పదోతరగతి అయ్యాకా ఇంటర్మీడియట్ మేము ఇద్దరం ఒకే కాలేజీలో చేరాం. స్నేహం పెరిగింది. సైకిళ్ళ మీద కాలేజీకి వెళ్తూ చాలా కబుర్లు చెప్పుకునే వాళ్ళం. ఆమె నవ్వుతుంటే బుగ్గలు సొట్టపడి వింత అందాన్నిచ్చేవి. అలా ఆమెని చూడటం కోసం నేను తరుచూ జోకులు చెప్పేవాడిని. ఆమె నవ్వుతూ ఉండేది. 


రెండేళ్ళు యిట్టె గడిచిపోయాయి. ఇద్దరం డిగ్రీలో చేరాం. ఒకరోజు ప్రైవేటు క్లాస్ అయ్యాక చీకటివేళ ఇంటికి తిరిగి వస్తుంటే కౌన్సిలర్ గారి అబ్బాయి ప్రదీప్ మోటార్ సైకిల్ మీద అడ్డంగావచ్చి ఆపాడు. 


‘మణీ, ఐ లవ్ యు. రేపు సినిమాకి వెళ్దాం. వస్తావా?’ అని అడిగాడు. 


మణిమంజరి నిర్ఘాంతపోయింది. నేను వెంటనే వాడి చెంప మీద కొట్టాను. వాడు నన్ను కొట్టాడు. పొట్టలో బలంగా గుద్దాడు. ‘అమ్మా’ అని కూర్చుండిపోయాను. ఈలోగా ఎవరో మోటార్ సైకిల్ మీద రావడంతో వాడు వెళ్ళిపోయాడు. మణిమంజరి నా దగ్గరగా వచ్చి నన్ను లేవదీసింది. 


‘బాధగా ఉందా?’ అని అడిగింది. ఆమె అలా నన్ను పట్టుకోవడం నాకు థ్రిల్లింగ్ గా ఉంది. ఒక్క క్షణం నన్ను నేను మరిచిపోయాను. 


తల అడ్డంగా ఊపాను. నెమ్మదిగా సైకిల్ ఎక్కి ఇంటికి వచ్చాను. ఆ మరుసటి రోజు బాల్ పెన్ తో ఆమె బొమ్మవేసి నా దగ్గర భద్రంగా దాచుకున్నాను. 


డిగ్రీ ఫైనల్ ఇయర్ లో ఉండగా ఆమె పుట్టినరోజు నాడు ఇద్దరం సైకిళ్ళమీద నర్సాపురం వెళ్ళాం. గోదావరి ఒడ్డున కూర్చుని ఉన్నప్పుడు ఆమెకి నేను వేసిన బొమ్మ ఇచ్చాను. అది చూసి మణిమంజరి చాలా సంతోషించింది. నాకు షేక్ హ్యాండ్ ఇచ్చి ‘థాంక్స్ చంద్రం” అంది. అంత ఆనందం ఆమె మొహంలో చూసి మైమరచిపోయాను. పడవ ఎక్కి గోదావరి దాటి వెళ్లి అక్కడ కాసేపు కూర్చుని మళ్ళీ పడవలో తిరిగి వచ్చాం. తర్వాత సైకిళ్ళు ఎక్కి ఇంటికి వచ్చేసాం. డిగ్రీ ఫైనల్ ఇయర్ ఫేర్ వెల్ పార్టీలో మణిమంజరి అన్నమయ్య కీర్తన పాడింది. నేను ఓ కవిత చదివాను. 


నీలాలసుందరిలా నవరసమయ మంజరిలా 

కదిలిరావే నా చెలీ, కమనీయ నెచ్చెలీ 

ప్రియతమా.. ప్రియతమా.. మరచిపోకుమా.. మరచిపోకుమా.. 


అందరూ చప్పట్లు కొట్టి అభినందించారు. 


పరీక్షలు అయ్యాక ఒకరోజు మణిమంజరి నా దగ్గరకు వచ్చి “చంద్రం! నిన్ను ఒక ఫ్రెండ్ లా చూసాను. నువ్వు వేరేగా అనుకుంటే, ఐ యాం సారీ” అని చెప్పి వెళ్ళిపోయింది. 


ఆరోజు నా మనసు దిగులుగానే ఉంది. చాలా అప్సెట్ అయ్యాను. ఆ తర్వాత నేను పీ. జీ. చేయడానికి విశాఖపట్నం వెళ్ళడం, మణిమంజరి పెళ్లి చేసుకుని హైదరాబాద్ వెళ్ళిపోవడం జరిగింది. ఇన్నాళ్ళకు మళ్ళీ ప్రమద్వరని చూడడంతో మణిమంజరి గుర్తుకు వచ్చింది. కండక్టర్ ‘శివపురం’ అని పిలవడంతో బస్సు దిగి, మా ఇంటికి వెళ్లాను. 


రెండు నెలలు గడిచాయి. మా ఆవిడ, ఫ్రెండ్ కూతురు పెళ్లి అని విజయవాడ వెళ్ళింది. రెండు రోజుల వరకూ రాదు. నేను మా ఫ్రెండ్ ని కలిసి వస్తానని చెప్పి హైదరాబాద్ వెళ్లాను. మర్నాడు ఉదయమే ప్రమద్వర చెప్పిన అడ్రస్ కి వెళ్లాను. కాలింగ్ బెల్ కొట్టగానే ప్రమద్వరే వచ్చి తలుపు తీసింది. లోపలకు వెళ్లి కూర్చోగానే వాళ్ళ అమ్మని తీసుకువచ్చింది. 


“అమ్మా, నీతో చెప్పడం మర్చిపోయాను. మొన్న వైజాగ్ వెళ్ళినప్పుడు ఈ అంకుల్ కనిపించారు. నువ్వు తెలుసు అని చెప్పారు” అంది. 


నన్ను చూడగానే మణిమంజరి ఆశ్చర్యపోయింది. తర్వాత నవ్వుతూ “బాగున్నావా చంద్రం? ఎక్కడ ఉంటున్నావు?” అని అడిగింది. 


“శివపురంలో తహసీల్దార్ గా పనిచేస్తున్నాను. నువ్వు బాగున్నావా?” అడిగాను ఆప్యాయంగా. 


ప్రమద్వర ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాలని బయటకు వెళ్ళింది. లోపలకు వెళ్లి కాఫీ పట్టుకునివచ్చింది. ఇద్దరం కాఫీలు తాగాం. 

“మీ వారు ఏం చేస్తారు? లోపల ఉన్నారా?” ఆసక్తిగా అడిగాను. నా మాటలకు దీర్ఘంగా నిట్టూర్చింది. 


“చంద్రం, మనిషి జీవితం ఎప్పుడు, ఎలా మారుతుందో ఎవరూ చెప్పలేరని అంటారు. అది నా విషయంలో నిజం అయ్యింది. నా పెళ్లి గురించి కంగారుపడి మా అమ్మ తమ బంధువుల అబ్బాయి శేషగిరి తో, నాపెళ్లి జరిపించింది. ఆయన ఓ ప్రైవేటు కంపనీలో మేనేజర్. పెళ్లి అయిన కొంతకాలం బాగానే ఉన్నారు. ఆ తర్వాత ఆయనకు డబ్బు పిచ్చి పట్టుకుంది. దానికి నా ‘అందాన్ని’ వాడుకోవాలని చూసారు. 


‘మణీ, నీ అందం ఇలా వేస్ట్ అయిపోవడం నాకు ఇష్టం లేదు. మోడల్ గా చేయి, లేదా సినిమాలకు ప్రయత్నించు’ అని పోరు పెట్టేవారు. 


‘నాకు అటువంటివి ఇష్టం లేదు. సింగర్ గా ప్రయత్నిస్తాను’, అని చెప్పాను. 


‘దాని వలన లక్షలు వస్తాయే గానీ, కోట్లు రావు. మన అమ్మాయికి చాలా గొప్ప భవిష్యత్తు ఇవ్వాలి. దానికోసమైనా నువ్వు ఒప్పుకో’ అని అన్నారు. 


దానికీ నేను ఒప్పుకోలేదు. చివరకి నన్ను శారీరకంగా హింసించడం మొదలు పెట్టారు. ఆ దెబ్బలు భరించలేక విడాకులు తీసుకున్నాను. అప్పుడు ప్రమద్వరకి ఆరేళ్ళు. అప్పటినుండీ ఓ ప్రైవేటు స్కూల్ లో సంగీతం టీచర్గా పనిచేస్తూ ప్రమద్వరని పెంచాను. తనకి డిగ్రీ అయ్యింది, మ్యూజిక్ లో ఎం. ఏ. కూడా చేసింది. నా తండ్రి నా తల్లిని పెళ్లి చేసుకుంటానని మోసంచేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు నా పరిస్థితి ఇలా అయ్యింది. నా కూతురికి అటువంటి స్థితి రాకూడదని కోరుకుంటున్నాను” అంది బాధగా.


ఆమె కళ్ళ నుండి అశ్రువులు జల జలా రాలాయి. 

 నన్ను కాదన్నా, తను పెళ్ళిచేసుకుని సుఖంగా ఉంటుందని అనుకున్నాను. కష్టాలకు ఎదురీదు తోందని తెలుసుకుని, బాధపడ్డాను. “దిగులు పడకు మణి మంజరి, నీకు ఏ విధమైన సహాయం కావాలన్న నేను చేస్తాను” అన్నాను. 


‘మరచిపోవుగా’ అంది ఆమె, వేడికోలుగా. 


“మరిచిపోను’’ అన్నాను. ఆరాత్రే బయల్దేరి శివపురం వచ్చాను. 


ఒక ఏడాది గడిచింది. ఒక రోజు మా కెమిస్ట్రీ హెడ్ రాజారావు గారి నుండి ఫోన్, నీతో అర్జెంటు గా మాట్లాడాలి. వైజాగ్ రమ్మనమని. రాత్రే బయల్దేరి వైజాగ్ వెళ్లాను. నేను పి. జి. చదివేటప్పుడు ఆయన మా గురువు. మంచానికి బల్లిలా అతుక్కుని, నీరసంగా ఉన్నారు. నేను రాగానే పిల్లల్ని బయటకు పంపేసారు. 


“చంద్రం నువ్వు నాకో సాయం చేయాలి. గుంటూరులో లెక్చరర్ గా పనిచేసేటప్పుడు కమలని ప్రేమించాను. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. వైజాగ్ వచ్చి మా తల్లితండ్రులకి చెబితే కుదరదన్నారు. వెంటనే మా నాన్నగారి చెల్లెలు కూతురితో హడావిడిగా గుళ్ళో పెళ్లి చేసి ఆమెని నాతో గుంటూరు పంపారు. అప్పటికే గర్భవతి అయిన కమల ఈ విషయం తెలుసుకుని ఊరు వదిలి వెళ్ళిపోయింది. 


చాలాకాలం కమలకోసం వెదికాను. కానీ ఫలితం లేకపోయింది. ఇదిగో ఆవిడ ఫోటో. నీకు ఈవిడ కనిపిస్తే తప్పకుండా సాయం చెయ్యి. మరచిపోవుగా ” అని నా దగ్గర వాగ్దానం తీసుకుని ఒక ఫోటో నా చేతిలో పెట్టారు. నేను బయటకు వచ్చి ఆటో ఎక్కి బస్సుస్టాండ్కి వచ్చి శివపురం వెళ్ళే బస్సు ఎక్కాను. జేబులోంచి ఫోటో తీసి చూసాను. అది మణిమంజరి వాళ్ళ అమ్మగారి ఫోటో. నివ్వెరపోయాను నేను. ‘మణిమంజరి గురువుగారి కూతురా? ఎంత విచిత్రం?’ దారి పొడవునా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాను. 


మర్నాడు ఉదయమే చెన్నైలో ఉన్న మా మేనల్లుడికి ఫోన్ చేసాను. ”కార్తికేయా! నీకో సంబంధం చూసాను. అమ్మాయి ఫోటో పంపుతున్నాను. ఈ సంబంధం చేసుకోవాలి” అన్నాను. 


“అలాగే మావయ్యా, నీ మాట కాదనను” అన్నాడు కార్తికేయ. 


వాడు ఓ మల్టీ నేషనల్ కంపెనీలో మేనేజర్గా ఎనభై లక్షల పేకేజీలో ఉన్నాడు. ప్రమద్వర ఫోటో వాడికి పంపాను. ఇప్పుడు నా మనసు ప్రశాంతంగా ఉంది. 


సమాప్తం

******* 


M R V సత్యనారాయణ మూర్తి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం : సత్యనారాయణ మూర్తి M R V


ఎమ్. ఆర్. వి. సత్యనారాయణ మూర్తి. పెనుగొండ. పశ్చిమ గోదావరి జిల్లా. కవి, రచయిత, వ్యాఖ్యాత, రేడియో ఆర్టిస్టు. కొన్ని కథల పుస్తకాలు, కవితల పుస్తకాలు ప్రచురితం అయ్యాయి. కొన్ని కథలకు బహుమతులు కూడా వచ్చాయి. రేడియోలో 25 కథలు ప్రసార‌మయ్యాయి. 20 రేడియో నాటికలకు గాత్ర ధారణ చేసారు. కవితలు, కథలు కన్నడ భాషలోకి అనువాదం అయ్యాయి.

 30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.





 

55 views1 comment

1 Comment


mk kumar
mk kumar
Dec 19, 2024

కథా వస్తువు:

కథ "మరచిపోకుమా" భిన్నకాలాల్లో జరిగిన ప్రేమ, నమ్మకం, విడిపోవడం, జీవన సంఘర్షణలను నిశితంగా పరిశీలిస్తుంది. కథ ప్రధానంగా రామచంద్రం అనే వ్యక్తి, అతని యువకాలం, మణిమంజరి తోటి బంధం, వారిద్దరి జీవన మార్పులను చర్చిస్తుంది. జీవన ప్రయాణంలో ఎదురైన ఆనందకరమైన క్షణాలు, హృదయవిదారక సంఘటనలు, పాత స్నేహాల మళ్లీ కలయికను అందంగా ఆవిష్కరించింది. చివర్లో, రామచంద్రం మణిమంజరి కుమార్తె ప్రమద్వరకు మంచి భవిష్యత్తు అందించేందుకు తనవంతు సాయం చేసి, కథను సంతృప్తి కలిగించే ముగింపుతో పూర్తి చేస్తారు.

కథనం నాటి రోజులను తిరిగి నెమరువేసేలా చేస్తుంది. రచయిత వ్యక్తులు, సంఘటనలను వివరిస్తూ, పాఠకులను అందులో నింపుతాడు.

భావోద్వేగాల మేళవింపు: ప్రేమ, నమ్మకం, క్షమ, బాధ లాంటి భావోద్వేగాలను కథలో బలంగా కూర్చారు. అతి సాధారణమైన పదాలతో, సహజమైన సన్నివేశాలతో సాగుతుంది.


ప్రతిపాత్ర మనస్సులోని భావాలను అద్భుతంగా చూపించారు, ముఖ్యంగా మణిమంజరి, రామచంద్రం పాత్రల ద్వారా.


మొత్తం మీద, కథ హృదయానికి హత్తుకునే పాత ప్రేమకథను, జీవిత విజయాన్ని, బాధలను, సామాజిక బంధాలను చర్చిస్తూ పాఠకులను అలరిస్తుంది.


Like
bottom of page