'Marananiki O Lekha' - New Telugu Article Collected By Surekha Puli
Published In manatelugukathalu.com On 16/08/2024
'మరణానికి ఓ లేఖ!' తెలుగు వ్యాసం
రచనా మూలం: శ్రీ రామకృష్ణ ప్రభ
సేకరణ : సురేఖ పులి
ప్రియ మరణమా !
ముందుగా నీ కార్యదీక్షకు నా నమస్సులను తెలియజేయనీ! నీ నిరలస సేవనిరతికి నేను అందించే హృదయపూర్వక అభినందనలు స్వీకరించు! నేనేవరని ఆశ్చర్యపోతున్నవా? నీ గొప్పతన్నాన్ని తెలుసుకున్న ఓ సామాన్య మనిషిని నేను. నీవు నా దగ్గరకు వచ్చే ముందు నీ కొక విన్నపం చేయాలనే కోరిక కలిగింది. అందుకే ఈ లేఖ! నువ్వు ఎప్పుడూ కర్తవ్య దీక్షలో ఉంటావని తెలుసు. నీకు సమయం ఉండదనీ తెలుసు. అయినా ఈ లేఖ చదవమని అర్థిస్తున్నాను.. ప్రార్ధిస్తున్నాను.
నీ పేరు వింటేనే భయం అందరికీ! ఎందుకంటే, నీవు కలిసిన మనిషి ఇక కనిపించడు. నీవు పలుకరించిన మనిషి ఇక మాట్లాడడు. నీవు ఎప్పుడు ఎలా వస్తావో తెలియదు. ఎక్కడ వస్తావో తెలియదు. ఎవరి దగ్గరకు వస్తావో తెలియదు. హటాత్తుగా వస్తావో, నీ రాయబారులతో నీ రాకను తెలియజేస్తూ వస్తావో తెలియదు. నీవు ఏ ఇంటికి వచ్చావో ఆ ఇంట్లో మాత్రం ఉత్సాహం క్షణకాలంలో నీరుగారిపోతుంది. ఆశలు అడియాసలైపోతాయి. అందుకే నువ్వంటే అందరికీ భయం. నీ బారిన పడకుండా ఉండటానికి అందరూ శతవిధాల ప్రయత్నించేది అందుకే! నీ రాకను ఎవరూ కాంక్షించరు. నీవూ ఎప్పటికీ, ఎన్నటికీ ఒక అనాహ్వానిత, అవాంఛిత అతిథివి!
నేను కూడా అందరిలా నీవంటే భయంతోనే పెరిగాను. మా ఇంటికి కూడా ఎప్పుడో ఒకప్పుడు నీవు వస్తావనే ఊహే నన్ను వణికించేది. ఆత్మీయులు నీవు అదృశ్యం చేస్తే ఎలా ఎదుర్కోవాలి? నీ బారి నుండి బయటపడడం ఎలా? ఈ ఆలోచనలతో ఎన్ని రోజులు గడిపానో? నీ నుండి ఎవ్వరూ, ఎంత గొప్ప వాళ్ళైన తప్పించుకోలేరు అనే చేదునిజం నా పసి హృదయాన్ని కుదిపేసింది. నీవు ఎవరింటికైనా వచ్చావని తెలిస్తే ఆ ఇంటి వైపు చూస్తే ఒట్టు! ఇలా నీ చిత్రవిచిత్ర రీతులు గమనిస్తూ బాల్యమంతా ఒక విధమైన భయంతోనే గడిచింది.
జీవిత యానంలో కొంచెం ముందుకు సాగిన తరువాత ఒక దశలో అదర్శలపట్ల ఒకటే ప్రీతి! ఆదర్శవంతులను చూడాలి, ఆదర్శవంతమైన జీవితం గడపాలి. నిత్యం ఇదే ఆలోచన. అదే అన్వేషణ! ఈ లోకంలో ధనిక, పేద; పెద్ద, చిన్న తరతమ భేదాలు చూపకుండా సమదృష్టి కల ఆదర్శవంతులు ఎవరైనా ఉన్నారా అనే నా అన్వేషణలో నీవే మొదటి స్థానంలో నిలిచావు. నీకు గొప్పవాళ్ళు, తక్కువ వాళ్ళు అనే భేదమే లేదు. అందరినీ సమానంగా పలకరిస్తావు. అందరి ఇళ్లనూ ఒకే మనసుతో సందర్శిస్తావు. నీ న్యాయస్థానంలో అందరికీ సమాన న్యాయం.
ఈ సమదృష్టిని నీలో చూసిన తరువాత నీ పట్ల కొంచెం ప్రేమను పెంచుకున్నాను. అలాగే ప్రపంచంలో నీలాగా ఖాతాలను ఖచ్చితంగా చూసేవారు మరొకరు లేరు, నీ లెక్కలలో పొరపాటు ఎన్నడూ జరగదు, లోకుల కర్మగతిని అనుసరించే ఉంటుంది. నీ కార్యరీతి! చూపరులకు నీ కార్యాలన్నీ కఠినంగా, కఠోరంగా, కర్కశంగా కనిపిస్తాయి. కానీ నీవు వ్యక్తిగతంగా నిర్లిప్తత, నిరాస్తకలతో నిండిన నిర్వికారివి, నిరహంకారి! అసలు ఈ ప్రపంచం స్థిరంగా నిలిచి ఉన్నది నీ కార్యదక్షత వల్లనే! సృష్టికర్త అప్పగించిన గురతర బాధ్యతను నిరలసతతో, నిర్విరామంగా నిర్వర్తించే కర్మయోగివి నీవు. ఈ విధంగా నీవొక ఆదర్శ గనివి! నేర్చుకునేవారికి అసంఖ్యాక పాఠాలను నేర్పగలిగే నేర్పరివి నీవు!
నీవు ఎవరి వద్దకు వచ్చావో వాళ్ళ సుఖదుఃఖాలన్నీ కడదేరినట్లే! నీవు వాళ్ళను ఎక్కడికి తీసుకొని వెళ్తావో తెలియదు కానీ, ఇహలోకంలో మాత్రం వాళ్ళకు అంతా శాంతి, సుఖం కోసం ఇక ప్రాకులాటలు లేవు. దుఃఖం వస్తుందనే భయభ్రాంతులూ లేవు. అందుకే కృష్ణ పరమాత్మ గీతలో “మృత్యుః సర్వహరశ్చహంః” అన్నారు. హరించే వాటన్నిటిలో నేను మృత్యువును అని అర్థం, అంటే హరించే వాటన్నిటిలో మృత్యువు శ్రేష్టమైనది అని భావం. మృత్యువు లాగా ఎవరూ హరించలేరు. మృత్యువు ఆత్మీయులను, బంధుజనులను, సంపదలను, కీర్తిప్రతిష్టలను అన్నిటినీ ఒక్క నిమిషంలో మాయం చేస్తుంది. మనం సతమతమవుతున్న సమస్యలన్నీ మృత్యువుతో సమసిపోతాయి. చిరకాలంగా పట్టి పీడిస్తున్న బాధలన్నీ చిటికెలో కడతేరిపోతాయి. అనుభవిస్తున్న సుఖాలన్నీ కనురెప్పపాటులో ఆవిరైపోతాయి. అంతా శాంతి, శాంతి, శాంతి! ఈ అవిరామ కర్మభూమిలో ఒక రకంగా నీవు శాంతిప్రదాతవు!
మరణనేస్తమా! జీవనయానంలో ఇంకొంచం ముందుకు వెళ్ళాక తెలిసింది, అసలు జీవితరహస్యమంతా నీలోనే ఉందని! నిన్ను తెలుసుకుంటే జీవితం గురించి తెలుసుకున్నట్లే! అందుకే నీతో స్నేహం చేయడం ప్రారంభించాను. నా దగ్గరకు నిన్ను ఎలా ఆహ్వానించాలి అని ప్రణాళికలు వేయడం మొదలుపెట్టాను. నీతో ఒక ఒప్పందం చేసుకోవాలనే నీకు ఈ లేఖ!
నీవు నా దగ్గరికి ఎప్పుడు రావాలని నిర్ణయించుకున్నావో రా! కానీ కొంచెం సహాయం చేయి. నేను కర్మ సిద్ధాంతాన్ని. అక్షరాలా నమ్ముతాను. కానీ జన్మజన్మాంతరాలపై అవగాహన నాకు లేదు. ఎక్కడి నుండి వచ్చానో, ఎక్కడికి వెళ్తానో తెలుసుకోవాలనే కుతూహలం అసలు లేదు. నాకు కావలసినది, నేను ఆశించేది జీవించినన్నాళ్ళు భయం లేకుండా జీవించడం. శోకమోహలు అంటకుండా జీవించడం. జీవితకాలంలో రాగద్వేషాల నుండి ముక్తిని పొందడం. ఇక నీవు వచ్చినప్పుడు నిర్భయంగా నిన్ను ఆహ్వానించడం. శరీరాన్ని అనాయాసంగా కాలదన్ని, అంతిమ ఘడియల్లో అనంతత్వ, అనుభూతితో ఆనందాతిరేకం నీ చేయి పట్టుకోవడం. దీనికై నీ సహాయం కోసం అర్థిస్తున్నాను. ప్రార్థిస్తున్నాను!
నీవు నా దగ్గరకు వచ్చే ముందు నాలోని దేహాబుద్దిని, దాని చుట్టూ తిరుగులాడే అహంకారాన్ని, తద్వారా వచ్చే ప్రతిక్రియలను అన్నిటినీ ఉపశమింపజేయి. కీర్తికాంక్షను, భోగలాలసను పూర్తిగా త్రుంచేయి. నా మనసులోని ఆలోచనలు అతి పవిత్రంగా ఉన్నప్పుడు, నా కర్మేంద్రియాలన్నీ ఉత్సహంగా సత్కార్యదీక్షలో నిమగ్నమై ఉన్నప్పుడు, నా హృదయం ప్రేమపూర్ణమై ఉన్నప్పుడు నిన్ను నేను చిరునవ్వుతో ఆహ్వానిస్తుంటే నన్ను సమీపించు మరణమిత్రమా!
మరీ దురాశ అంటావా? సరే! నేను అంత అదృష్టానికి నోచుకోలేదనుకో! నీకు వచ్చేముందు నా శరీర అవయవాలు నిష్క్రియమై నేను అసహయంగా పడివున్నాననుకో! అప్పుడు మిధ్యా సానుభూతిపరులు నా దగ్గరకు రాకుండా చూడు. దేహమే సర్వస్వం అనుకునే భౌతికవాదులకు ఆమడ దూరంలో ఉంచు. వెంటీలేటర్ లో పెట్టి, యంత్ర సహకారంతో నా వద్దకు నీ రాకను తాత్కాలికంగా వాయిదా వేయాలనుకునే వాళ్ళ మస్తిష్కంలో ప్రవేశించి, సరైన గుణపాఠం చెప్పి, వాళ్ళను తాత్కార్యం నుండి విరమింపజేయి. అసహాయ శరీరానికి ఫోటోలు తీసి వాట్సాప్ లో షేర్ చేసుకునే ఉత్సహవంతులను అసలు దరిదాపులకు రానీయకు.
నా చుట్టూ ఆధ్యాత్మిక తరంగాలు ప్రసరిస్తూ ఉండాలి. భగవంతుని నామం వినిపిస్తూ ఉండాలి. ఆనంద ప్రవాహం వెల్లువలా సాగాలి. శోకదైన్యాలు దూరంగా ఉండాలి. నీవు ఠీవిగా నా దగ్గరకు వచ్చినప్పుడు, నా చుట్టూ భగవంతుని అమృతనామం మారుమ్రోగుతూ ఉంటే, ఆ నమాపానమత్తతలో, ఆ దివ్యభావ ఆవేశంలో నేను శీర్ణ శరీరాన్ని జీరవస్త్రం వలే వదిలి, సాగరంలో కలిసే నదివలె నా అస్తిత్వాన్ని అనంతత్వంలో సంలీనం చేస్తూ నీ వెంట చిరునవ్వుతో నడిచి వచ్చే ఏర్పాటు చేయి. ఈ సహాయం నీవు మాత్రమే చేయగలవు.
ప్రియ మరణ నేస్తమా! జీవిత రహస్యాలను నాకు బోధించి, జీవన సౌందర్యాన్ని నాకు చూపించి, నీ రాకతో జీవన సాఫల్యాన్ని వరంగా ప్రసాదించు. నా కోరికను మన్నిస్తావు కదూ! ఆశతో, ఆకాంక్షతో సదా నీ స్నేహశీలతను, ప్రేమాశీస్సులను కోరుకునే..
నీ నేస్తం!...
*****
సురేఖ పులి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సురేఖ పులి గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత్రి పరిచయం:
Profile Link:
Youtube Play List Link:
పేరు :సురేఖ ఇంటి పేరు: పులి
భర్త పేరు: స్వర్గీయ పి. అరుణ్ కుమార్
వయసు : 70 సంవత్సరాలు. పుట్టి, పెరిగింది హైదరాబాద్ లో.
మా అమ్మనాన్నలు స్వర్గీయ లక్ష్మి అర్జున్ రావు గార్లు నా మార్గదర్శకులు.
ప్రస్తుత నివాసం బెంగళూరు విశ్రాంత సీనియర్ సిటిజన్ ను.
ఎంఏ (సోషియాలజీ&ఇంగ్లీష్) చేశాను. స్కూల్, కాలేజీ మ్యాగజైన్ కు రాయడంతో నా రచనా వ్యాసంగం ప్రారంభమైంది.
HMT Hyd లో నా ఉద్యోగం, 2008 లో స్వచ్ఛంద పదవీ విరమణ.
చందమామ, యువ, స్వాతి, ఈనాడు, మన తెలుగుకథలుడాట్ కాం, నెచ్చెలి, ఉష పత్రిక, కెనడా డే లలో నా కథలు, కథానికలు ప్రచురితమయ్యాయి. కొన్నిటికి బహుమతులు కూడా వచ్చాయి. మూడు నవలలు మాత్రమే రాశాను. అందులో “కల్పతరువు” నవలకు మన తెలుగు కథలు డాట్ కాం వారి బహుమతి లభించింది. మరిన్ని రచనలతో పాఠకులకు దగ్గర కావాలన్నది నా ఆశయం.
Surekha Puli
Comments