'Marga Darsakulu' written by A. Annapurna
రచన : A. అన్నపూర్ణ
''రేవతీ ! పిల్లలకి అన్నీ రెడీ చేసి పెట్టాను . ఇదిగో తాళాలు. కాస్త కనిపెట్టి వుంటావుగా ! మేము వెడుతున్నాం... అంటూ తాళాలు ఇచ్చింది చిత్ర.
''మంచిది. అలాగే వెళ్లి రండి ... అంటూ బై చెప్పింది రేవతి.
పక్క ఫ్లాటులోవుండే చిత్ర, రమేష్లకు ఇద్దరు అబ్బాయిలు .పెళ్లి అయిన వెంటనే పిల్లలు పుట్టడం వలన రమేష్ చిత్రాలకు ఎక్కడికీ వెళ్లడం కుదిరేదికాదు. అటు ఇటు అమ్మ నాన్నలను వచ్చి కొన్నాళ్ళు ఉండమంటే వాళ్ళకి వీలుకాలేదు.
ఇప్పుడు పిల్లలు పెద్దవాళ్ళు ఐయ్యారు. రేవతి కూడా ప్రోత్సహించి ''నేను పిల్లలకు బేబీ సిట్టింగ్ చేస్తాను '' అనడంతో ప్రతివారం సరదాగా ఏటో వెళ్లి సినిమా చూసి వస్తూన్నారు .
రేవతి వయసులో చిత్రకంటే పదేళ్లు పెద్ద కనుక అర్థం చేసుకునేది. ఆలా నాలుగేళ్లు గడిచింది.
అప్పటికి సరదాలు తీరి కోరికలకు కళ్లెంవేసి పిల్లల చదువు భవిష్యత్తు చూసు కోవలసిన పరిస్థితి వాళ్ళది.
కానీ అదేమీ పట్టించుకోకుండా ప్రతివారం ప్రతి సినిమా చూడటం, ఏదో షాపింగ్ చేయడం, జల్సాలతో రోజులు గడిపేస్తుంటే శ్రేయోభిలాషిగా తన అనుభవంతో, వాళ్లతో ఉన్న చనువుతో హెచ్చరించాలనుకుంది రేవతి.
ఓరోజు ఇద్దరు మాటాడుకుంటూ వున్నప్పుడు అడిగింది.
''చిత్రా! పిల్లలు బాగా చదువుతున్నారా... మార్కులు ఎలా వస్తాయి? వాళ్ళని ఏమి చదివిద్దాం అనుకుంటున్నారు?''
'' మనం అనుకుంటే చదివేస్తారా? ఏదో ఒకటి చేస్తారు. మేము పట్టించుకోము. వాళ్ళు చదువుతున్న స్కూలు హెడ్మాస్టర్ రమేష్ కస్టమర్. ఇంటర్దాకా చూడక్కర్లేదు. ఆ తర్వాత డొనేషన్ కట్టేస్తాడు రమేష్. ఎలక్ట్రిసిటీ బోర్డ్ ఇంజినీరుకదా. ...." అంది నవ్వుతూ.
రేవతికి మతిపోయిన్ది. 'అంటే రమేష్ ది అక్రమ సంపాదన.....! అతను అవినీతి పరుడని ఇంతదాకా తెలియదు... కళ్ళముందే సైకిలుతో మొదలై స్కూటరు ఇప్పుడుకారు మైన్టైన్ చేస్తున్నారంటే అదన్నమాట అసలు విషయం !.'
ఏమి అనలేక '' కొంత మనంకూడా కేర్ తీసుకోవాలి. స్వంత తెలివి గలవాళ్ళు ఐతే మంచిది .
ఏమనుకోవద్దు చిత్రా ... మన దగ్గిర వున్నప్పుడే వాళ్ళని తీర్చి దిద్దాలి. ఎక్కడో హాస్టల్లో పెడితే ఏమో....... ఈరోజుల్లో డ్రగ్స్, ఆన్లైన్ గేమ్స్ పిల్లలకు శాపాలుగా మారాయి'' అంది రేవతి.
ఆమాట చిత్రకి నచ్చలేదు. కోపమొచ్చింది. మంచికోరి చెప్పడం రేవతి అపరాధం అయింది .
''మేము ఆనందంగా ఉండటం నీకు అసూయగా వుంది..... ఇప్పుడు నువ్వేమీ వాళ్ళని కనిపెట్టి ఉండాల్సిన అవసరం లేదులే! గొప్ప సలహా చెప్పేవు. మా పిల్లలు అందరిలాంటివారూకాదు. అన్నీతెలుసు. బుద్ధిగానే వున్నారు.''అనేసింది.
రేవతితో మాటాడటం తగ్గించింది.
ఇదివరకు ఇంటో ప్రతి రూముకి తాళాలు వేసేది. ఇప్పుడు అవసరం లేదు. పిల్లలు హరి గిరి టీనేజీకి వచ్చారు మరి. వాళ్లే మా ఎంజాయ్ మెంట్ మాది. ... మీ ఎంజాయ్ మెంట్ మీది..... అంటున్నారు. వాళ్ళే ప్లాన్ చేసి పంపుతున్నారు .
'అవును మా అవసరం తీరింది. హరి గిరి పెద్దవాళ్ళు అయ్యారు . ఒకరికి సలహా చెప్పేటంత ఎదిగారు' అనుకుంది రేవతి.
రమేష్ ఆరేళ్ళు చుట్టుపక్కల వూళ్లకే ట్రాన్స్ఫర్ చేయిన్చుకుని గడిపేశాడు. ప్రమోషన్ రావడం వలన విశాఖనుంచి హైదరాబాదుకి వెళ్ళిపోయాడు.
వెళ్లేముందు చిత్ర చెప్పనేలేదు. ఆరేళ్ళు కలిసి ఉన్న స్నేహానికి ముగింపు చెప్పేసి వెళ్ళిపోయింది.
రమేష్ మాత్రం రేవతి, ఆమె భర్త సురేంద్రలకు కృతజ్ఞతలు చెప్పాడు.
చాలాకాలానికి ఒకసారి హైదరాబాదు వచ్చారు రమేష్ చిత్రలు.
గతాన్ని వదిలేసి అభిమానంతో ఆహ్వానించింది రేవతి. 'హరి గిరి ఏమిచేస్తున్నారు?' అని అడిగింది.
''హరి ఆస్ట్రేలియాలోను, గిరి అమెరికాలోను వున్నారు. మేము నాలుగుసార్లు వెళ్ళివచ్చాము'' అంది గర్వంగా చిత్ర.
''చాల సంతోషం. మా కంటిముందు ఎదిగారు. వాళ్ళ అల్లరి, ఆటపాటలు.. నాకు ఇంకా చిన్నపిల్లలుగానే అనిపిస్తోంది" అంది రేవతి.
''అంతేకాదు. వాళ్ళు ఇలా విదేశాలకు వెడతారని కూడా అనుకుని వుండవు'' అతిశయంగా చెప్పింది చిత్ర.
మాటకి మాట బదులు చెబితే లేనిపోని రాద్ధాంతము ఎందుకులే అని రేవతి.....
''అప్పటికి ఇప్పటికి చాలా తేడా ఉండటం సహజం. మా ఆలోచన అప్పటిలో వేరే ఉండేది.
ఇప్పుడు విదేశాలకు వెళ్ళడానికి చాల మార్గాలు అనుసరిస్తున్నారు. అప్పటి రోజుల్లో మెరిట్లో వెళ్లడం ఒకరిద్దరికే సాధ్యం ఐయ్యేది'' అంది.
''మా విషయంలో అన్నీ సాధ్యమే !" అంది చిత్ర. అసలు ఈ విషయమే చెప్పాలని వచ్చినట్టు.
''మంచిది. వాళ్ళకి పెళ్లిళ్లు అయ్యాయా? పిల్లలా...!" అడిగింది రేవతి.
''ఆ! కోడళ్ళు కూడా సాఫ్ట్వేర్ ఇంజినీర్లు. వాళ్ళకి ఇద్దరేసి పిల్లలు. మమ్మల్ని కూడా వచ్చేసి అక్కడే వుండమంటున్నారు. ఆ ప్రయత్నంలోనే వున్నాం.''
''చాలా బాగుంది. '' అంటూ మనస్ఫూర్తిగా సంతోషించింది రేవతి.
భోజనం చేసి వెళ్ళమంటే 'బంధువుల ఇంట్లో పెళ్ళికి వచ్చాం. .... మిమ్ములను చూసి వెళ్లాలని వచ్చాం' అని చెప్పి వెళ్లిపోయారు.
వాళ్ళు వెళ్ళిపోయాక ''పాపం చిత్ర పరిస్థితి బాగాలేదు. ట్రీట్మెంట్కి తీసుకువచ్చాట్ట రమేష్'' అన్నాడు సురేంద్ర.
''అదేమిటీ? నాతో చాలా బాగా మామూలుగానే మాటాడింది. దేనికి ట్రీట్మెంట్?" ఆశ్చర్యంగా అడిగింది రేవతి.
''మీరు లోపల గదిలో కూర్చుని మాటాడుకున్నారు. ఇక్కడ నాతో రమేష్ చెప్పేడు.
చిత్రకి మైండ్ సరిగా లేదుట. గతంలో తాను వూహించుకున్నవి చెబుతుందిట.
హరి ఇక్కడే ఏదో వుద్యోగం చేస్తున్నాడు. కానీ వీళ్ళను పట్టించుకోడు. కోడలు రానివ్వదుట. గిరి పూర్తిగా చెడిపోయాట్ట. లేని అలవాట్లులేవు. ఇప్పుడు జైల్లో ఉన్నాట్ట. నాకు తెలిసిన మంచి లాయరు ఉంటే చెప్పమన్నాడు.''
''అయ్యో ..... వాళ్ళకి ఇంత కష్టం ఎందుకు వచ్చింది?"
''మన పక్కనే వున్నప్పుడు చూసాముగా.... వీళ్ళు, వీళ్ళ ఎంజాయ్ మెంటులో ఉంటే.. గిరి, హరి పక్కదారిపట్టారు. హరి తొందరగా బయట పడ్డాడు. కానీ గిరి చేయి దాటిపోయాడు. డ్రగ్స్ అమ్మే ముఠాలో చేరాడు. డబ్బు సులువుగా సంపాదించే మార్గం అదే అనుకున్నాడు. చివరికి పతనం అయ్యాడు.! కారణం..... పిల్లలను పట్టించుకోవలసిన టైంలో పట్టించు కోలేదు. డబ్బువుంది, అడ్డులేదు.. అనుకున్నారు" అన్నాడు సురేంద్ర.
''చిత్ర మాటలువింటే మతిలేనివాళ్ళు మాటాడినట్టు లేవు. చాలా కాన్ఫిడెంట్గానూ ఫర్ఫెక్ట్గానూ అనిపించాయి. ఏదో మాటవరసకు అప్పట్లో ఒకసారి పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పాను. కానీ ఇలా జరుగు తుందని అనుకోలేదు ''అని బాధపడింది రేవతి.
''అదే జబ్బు లక్షణం . డాక్టర్ ట్రీట్మెంట్ ప్రారంభించారు.... క్రమంగా తేరుకోవచ్చు.... కానీ నిజం తెలిసి తట్టుకోలేక సూ సైడ్ చేసుకునే ప్రమాదమూ వుంది. కనుక చాలా స్లోగా రికవరీ ఉండాలి.... అన్నారట. అందుకు రమేష్ చాలా శ్రద్ధ తీసుకోవాలి అన్నారట'.''
''ఇలాంటి జబ్బులు కూడా ఉంటాయా? అయ్యో ..... అనుకుంది రేవతి బాధగా! ఒకరకంగా ఇలాంటి ట్రాన్స్లో ఉండటమే బెటర్ కావచ్చు.
***శుభం ***
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.
రచయిత్రి పరిచయం : ఏ. అన్నపూర్ణ.
నాది కాకినాడ. పండితవంశంలో పుట్టుక, సాహిత్యం ఊపిరి- వంశపారంగా అబ్బిన వరం.
నా మొదటికథ చదివి రచనలను ప్రోత్సహించినది ''వసుంధర.R రాజగోపాల్గారు.'' నామొదటి నవల చదివి నా శైలిని మెచ్చుకుని ,చతురలో ప్రచురించడo గొప్ప అర్హతగా అభినందించిన '' శ్రీ యండమూరి.....''ఇంకా ఇప్పుడూ కొనసాగిస్తూ ఉండటానికి కారకులు.
అలాగే నా వ్యాసాలకు సుస్థిర స్థానం కల్పించింది డా. జయప్రకాశ్ నారాయణ్ LOKSATTA ఫౌండర్. నా కవితలకు గుర్తింపు తెచ్చిన ప్రముఖ జర్నలిస్ట్ ఐ.వెంకట్రావ్ గారు, (నా మొదటి కవిత వారి '' పత్రిక ''లో వెలుగు చూసింది.)
విచిత్రం ఏమిటంటే వీరిలో మహిళా రచయిత్రు లెవరూ లేకపోడం.
రచయితలో వుండే ప్రత్యేకతను గుర్తించిన గుణం వీరిది. మరో విషయం ''జనార్ధన మహర్షి'' గారి కవితలు చదివి చిన్న మార్పులు చేస్తే బాగుంటుందేమో అని చెప్పినందుకు కొత్తగా ఏమాత్రమూ కోపం తెచ్చుకోకుండా ఆయన కొత్తగా రాసిన కవితల సంపుటిని నాకుపంపి '' సరిచూసి ఇస్తే నేరుగా ప్రింటికి ఇస్తాను ''అని చెప్పడం వారి విజ్ఞతకు సహస్ర వందనాలు. వీరంతా నేను ఎన్నటికీ మరువలేని మహానుభావులు.
ఇంకా కొందరు వున్నారు. సమయం వచ్చినపుడు వారిని గురించి చెబుతాను.
Comments