top of page
Writer's pictureLakshmi Sarma B

మార్పు - పార్ట్ 1

వారం వారం బహుమతులలో ఎంపికైన కథ (Weekly prize winning story)


'Marpu Part 1/2' - New Telugu Story Written By Lakshmi Sarma Thrigulla

'మార్పు - పార్ట్ 1/2' తెలుగు పెద్ద కథ ప్రారంభం

రచన : లక్ష్మీ శర్మ త్రిగుళ్ళ

(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



“పద్మా! నేను ఊరికివెళ్ళి మా అమ్మను తీసుక వద్దామనుకుంటున్నాను, పాపం అక్కడ ఒక్కతే ఉండలేక పోతున్నది, మా నాన్న ఉన్నప్పుడంటే ఒకరికొకరు తోడుగా ఉండేవాళ్ళు. 


ఇప్పుడు ఒంటరిగా ఉండాలంటే కష్టం కదా! ఒక్కరోజు కూడా మా అమ్మ దేనికోసం బయటకు వెళ్ళిందేలేదు. అన్ని మా నాన్ననే తెచ్చిపెట్టేవాడు. ఏం ఇబ్బందిపడుతుందో

ఏమో.. మనం ఒక్కసారి కూడా వెళ్ళి చూసి రాలేదు, ” అన్నాడు బాధగా శేఖర్. 


“ఏమిటేమిటి.. మీ అమ్మను తీసుకవస్తావా? ఏం, ఇది నీకు పుట్టిన బుద్ధినా లేక మీ అమ్మ అడగమని చెప్పి లెటర్ ఏమన్న రాసిందా నీకు? ఏదో నిన్న మొన్ననే మీ నాన్న పోయినట్టు బాధపడుతున్నావు.. మూడేళ్ళవుతుంది. ఇన్నాళ్ళ నుండి లేనిది ఇవాళేంటి కొత్తగా అడుగుతున్నావు, ” భర్త మీదకు కస్సుమని లేస్తూ అడిగింది పద్మ. 


“అదికాదు పద్మా!  నేను ఎప్పటినుండో నిన్ను అడుగుదామని అనుకుంటున్నాను, కానీ నీ నోటికి భయపడి అడగలేక పోయాను. మా అమ్మంటే నీకు పడదు. ఆమె ఇక్కడకు వచ్చి ఇంకా ఇబ్బందిపడుతుందేమోనని కూడా అడగలేకపోయాను. మొన్న మా ఊరి పటేల్ కలిసాడు. అప్పుడు చెప్పాడు అమ్మ గురించి, పాపం ఒక్కతే ఉంటోంది నీతోపాటుగా

తీసుకుని రావచ్చు కదా అన్నాడు అతను. నాకు జాలేసింది. కొడుకును ఉండి కూడా అమ్మను ఒంటరిదానిలా వదిలేసానని బాధనిపించి ఇక్కడకు తీసుకవద్దామా అని నిన్ను అడుగుతున్నాను పద్మా!  ” అన్నాడు. 


“ఏం? నువ్వు నిర్ణయం తీసుకున్నావు కదా, నన్ను అడగడమెందుకు? ఆవిడ మీద అంతప్రేమ కారిపోతుంటే నువ్వు మీ అమ్మ కలిసి ఉండండి. నేను పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళతాను. ఎలాగు మా అమ్మ కూడా ఒంటరిగానే ఉంటుంది. మీ అమ్మకు లాగా మా అమ్మ ఎప్పుడు మా అన్నయ్యలను ఇబ్బందిపెట్టలేదు. తన కష్టమేందో తనే పడుతుంది. కనీసం నా దగ్గరకు రమ్మనమని అడిగినా రాదు. మీ అమ్మకెందుకుంటుందిలే అంత మంచి బుద్ధి? ఇక్కడ మనమేం సుఖపడిపోతున్నమోనని కుళ్ళు, ” అంది పెళపెళ

మాటలు విసురుతూ. 


“పద్మా!  ఎందుకే మా అమ్మను అంతగా ఆడిపోసుకుంటావు, ఇందులో తన ప్రమేయమే లేదు. అసలు తనకు తెలియనే తెలియదు. నిన్ను అడిగిన తరువాతనే అమ్మకు చెబుదామని అనుకున్నాను. అమ్మ మన దగ్గరుంటుంది అంటే ఊరికే తిని కూర్చోదు. సమస్తం పని చేస్తుంది, పైగా తనకు వచ్చే పెన్షన్ డబ్బులన్ని మనకే ఇస్తుంది, తను దాచుకోదు మీ అమ్మలాగా” చురక అంటించాడు భార్యకు. 


“అబ్బో తల్లిని వెనకేసుకోవడం బాగానే ఉంది. మీ అమ్మ ఇచ్చే డబ్బుకోసం ఇక్కడెవరు నోరు తెరుచుకుని లేరు. ఆమెకొచ్చే డబ్బులతో అక్కడనే ఉండమని చెప్పు. నా ఇంటికి వచ్చి నాకు మనశ్శాంతి లేకుండా చేస్తే నేనూరుకోను ఏమనుకుంటున్నావో.. ఏమన్నావు.. 

మా అమ్మ గురించి నీకేం తెలుసని? మా అమ్మకు మీ అమ్మలాగా వేలకువేలు పెన్షన్ రాదు, వృద్ధాప్య పింఛను వెయ్యిరూపాయలు వస్తుంది. అది ఆమె ఖర్చులకు సరిపోతుంది. ఇంకా ఏమి మిగులుతుందని వాళ్ళకివ్వమన్నావు, ” మీద మీదకొస్తూ గట్టిగా అరిచింది

భర్తమీదకు. తల్లిని అనేసరికి రోషంతో రగిలిపోయింది పద్మ. 


“అవున్లే, మీ అమ్మనంటే ఎంత రోషంపొడుచుకొచ్చింది, మరి మీ అమ్మలాంటిది మా అమ్మకాదా, ” చిన్నగా తనలో తానే అనుకున్నాడు. కానీ పద్మ వి పాము చెవులంటారు కదా

అలా భర్త చిన్నగా అనుకున్నా వినిపించి. “మా అమ్మ.. కోడళ్ళను ఒక్కనాడు బాధపెట్టలేదు. కన్న కూతుర్లలాగా చూసుకుంది. వాళ్ళకే మాయదారి గుణాలతో మా అమ్మను దూరంపెడుతున్నారు. అలా మీ అమ్మ ఉంటే నేను నెత్తిలో పెట్టుకుని పూజించేదాన్ని, ” అంది. 


“అబ్బో మీ గురించి మీ అన్నావదినల గురించి నాకు తెలియనట్టే చెబుతున్నావు.. ఇంతకు మా అమ్మ నిన్ను రాచి రంపాన పెట్టిందెపుడు? నువ్వు మా అమ్మతో కలిసున్నదెపుడో

నాకు తెలియదు, అనవసరంగా మా అమ్మ మీద అభాండాలేస్తున్నావు. మన పెళ్ళి అయినప్పటినుండి ఇప్పటివరకు పట్టుమని పదిరోజులైనా మా అమ్మతో కలిసిలేము. 


నీకు కలిసి ఉండడం ఇష్టంలేకపోతే పోని అనవసరంగా మా అమ్మ మీద నిందలు వేస్తే భరించుకోలేను” మనసులో అనుకుంటూ బాధపడుతున్నాడు శేఖర్. 

భర్త నోరు మెదపకపోయేసరికి మనసంతా ఆనందంతో నిండిపోయింది పద్మకు. 


“పద్మా!  నీకో విషయం చెబుతాను నువ్వు వింటావా? మా అమ్మను తీసుకవస్తాను, నాలుగురోజులు ఉంటుంది. తరువాత నేనే మా అమ్మను ఊర్లో దింపివస్తాను. అందరూ మన గురించి ముఖ్యంగా నీ గురించి చెడుగా అనుకోవడం నాకిష్టంలేదు. అత్తను చూడడంలేదని నిన్ను అందరు ఆడిపోసుకుంటారు. ఒక్క కొడుకు తల్లిని తీసుకపోవద్దా అని నన్ను తిట్టుకుంటారు. అందుకని అమ్మను నాలుగురోజులుంచుకుని పంపిచేద్దాం. తనకు ఇక్కడ ఉండడం ఇష్టంలేదని ఊర్లో ఉండడమే ఇష్టమని మనము చెప్పుదాం ఎలా ఉంది, ” అడిగాడు. 


ముందైతే ఎలాగైనా ఒప్పించి తల్లిని తీసుకరావాలనే ఆలోచనతో చెప్పాడు. 


పద్మ కూడా ఆలోచించింది. నాలుగురోజులే అంటున్నాడు కదా. ‘సరే రాని వచ్చాక నేనే ఆమెను నాలుగురోజుల్లో పారిపోయేట్టు చేస్తాను’ అనుకుంది. 


“సరే లేండి మీ ఇష్టం. కానీ నాలుగురోజుల్లో మీ అమ్మను ఊరికి పంపించాలి మరి, ” అంది. 


“సరే అయితే. నువ్వన్నట్టుగానే పంపిస్తాను. వచ్చే ఆదివారం వెళ్ళి తీసుకవస్తాను, ” సంతోషంతో అన్నాడు. 

***


“పద్మా!  బాగున్నావుటే, కాస్త ఆటోవాడికి పైసలివ్వు, అబ్బాయి ఆగు.. నేను లోపలికి పోయి మా బిడ్డతో పంపిస్తాను, ” ఆటో దిగుతూనే కూతుర్ని కేకేసింది రుక్కమ్మ. 


తల్లి గొంతు వినిపించి గబగబా బయటకు వచ్చి చూసి ఆశ్చర్యపోయింది. “ ఏమిటమ్మా నువ్వు వస్తున్నట్టు మాట మాత్రంగానైనా చెప్పలేదు, ” తల్లిని గట్టిగా కావలించుకుంటూ అడిగింది పద్మ. 


“ముందు వాడికి ఓ పదిరూపాయలు ఇవ్వవే ఎలా చూస్తున్నాడు చూడు మిడిగుడ్లువేసుకుని, ” అంది. 


“ఇదిగో బాబు పదిరూపాయలు తీసుకో, ” అంటూ అతనికి ఇవ్వబోయింది పద్మ. 


“చాలుచాల్లేవమ్మా పదిరూపాయలకు ఎవరొస్తారు, నేను ముందే చెప్పాను ఈ ముసలావిడకు ముప్పదిరూపాయలు ఇస్తానంటే వస్తానని. అప్పుడేమో సరేనంది. ఇప్పుడు

పదిరూపాయలు ఇస్తుంది. ఉంచుకోండి నాకేం వద్దు. మా తల్లిలాంటిదాన్ని దిగబెట్టాననుకుంటాను. భలే బేరం దొరికింది పొద్దునపొద్దుననే, ” అంటూనే రిక్షా ఎక్కాడు. 


“ఏయ్ ఏం మాట్లాడుతున్నావు? నేను ముసలావిడనా.. మరి నువ్వు బాలాకుమారుడివా? ఇంత దూరానికే ముప్పది రూపాయలు అడుగుతావా, ఆశకు అంతుండాలే పో.. ఆ పదిరూపాయలు నా మనవరాలికి ఇస్తాను, నువ్వు రావే వాడి పోతాడు, ” అంటూ కూతురి చెయ్యిపట్టుకుని బరబరా ఈడ్చుకుపోతుంది. 


“అబ్బా నువ్వాగమ్మా.. అతనికి డబ్బులివ్వని, పాపం అంతదూరం నుండి రిక్షా తొక్కుకుంటూ నిన్ను తీసుకవచ్చాడు, పదిరూపాయలకు ఎవరొస్తున్నా రనుకున్నావు? నువ్వింకా నీ కాలంలోనే ఉన్నావు, ” అంటూ అతనికి ముప్పదిరూపాయలు ఇచ్చివచ్చింది. 


“ఆ ఇప్పుడు చెప్పమ్మా.. ఏమిటి నీకు నాదగ్గరకు రావాలని ఎలా అనిపించింది, నేను ఎన్నిసార్లు పిలిచినా రాననే దానవు ఇప్పుడేంటి చెప్పా పెట్టకుండా వచ్చావు, ” తల్లికి మంచినీళ్లు కాఫి అందిస్తూ అడిగింది. 


“అదేంటి బిడ్డా అట్లన్నావు.. నాకు నీమీద ప్రేమలేదన్నట్టు అంటున్నావు, ఆడపిల్ల ఇంటికి వచ్చి తింటూ కూర్చుంటే మంచిది కాదు, నేను నీకు పెట్టాలి కానీ నీ సొమ్ము తింటే ఎట్లా చెప్పు? మీ నాన్న నాకంటూ ఏమి మిగల్చకుండా పాయే, పండగకో పబ్బానికో తీసుకపోదామంటే నా చేతిలో చిల్లిగవ్వలేదాయే, మీ అన్నలకు మీ వదినలతోటిదే లోకం 

ఏం చెయ్యను, ” కూతురును అక్కున చేర్చుకుంటూ అంది. 


”పోనిలే అమ్మా! ఇప్పటికైనా నా దగ్గరకొచ్చావు నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు ఒకరు పెట్టే అవసరం లేదమ్మా. నీ అల్లుడు రెండుచేతులా సంపాదిస్తున్నాడు. మనకది

చాలు. పద ఎప్పుడనగా బయలుదేరావో ఏంటో.. కాళ్ళుచేతులు కడుగుకుని రా టిఫిన్ 

తిందువు, ” తల్లికి చెబుతూ వంటింటిలోకి దారితీసింది. 


అల్లుడు రమ్మన్నాడని ఇక నుండి తనను ఇక్కడే ఉండమన్నాడని చెబితే ఏమంటుందో. 

అయినా అల్లుడు పద్మతో ఏమి చెప్పకండి అన్ని నేను చూసుకుంటా అన్నాడు కదా. ఇది మాత్రం దాని అన్నలకు తక్కువేం కాదు. రాకరాక వచ్చాను కాబట్టి సంతోషంగా ఉంది

ఇక్కడే ఉండిపోతాను అంటే దాని గుండే కొట్టుకోవడమానేస్తుంది. అల్లుడే చెప్పుకుంటాడు

నేనేం మాట్లాడను ఆ విషయం అనుకుంది రుక్కమ్మ. 


“పద్మా!  అమ్మ వచ్చింది, వాకిట్లో నిలుచుంది వెళ్ళు. వెళ్ళి తీసుకురా, ” అన్నాడు తల్లి పెట్టే ఒకచేత్తో ఇంకో చేతిలో బ్యాగుపట్టుకుని. 


 ‘ఇదేమిటి నాలుగురోజులన్నాడు రెండు బ్యాగులతో ఊడిపడింది. అక్కడికి పోయాక ఏం మాట్లాడుకున్నారో తల్లికొడుకులు. రాని రాని నేను చూసుకుంటాను కదా మీ సంగతి’ అనుకుంటూ. 


“ఇంతదూరం వచ్చాక ఇంటిలోకి రాదటనా మీ అమ్మ, స్వాగతం పలికి తీసుకరావాలే కాబోలు, ” వ్యంగ్యం మాటలు విసురుతూ బయటకువెళ్ళింది. 


“అయ్యో అక్కడే నిలబడిపోయారేం అత్తయ్యా, రండి లోపలికి, ” అంది లేని నవ్వుతో నటిస్తూ. 


“ఏమ్మా పద్మా బాగున్నావా? పిల్లలు బాగున్నారా, ” ఆప్యాయత నిండిన గొంతుతో అడిగింది. 


“ఆ అందరం బాగున్నాము. ఇప్పటివరకు ఇక మీరొచ్చారు కదా బాగానే ఉంటాము, ”


“పద్మా!  ఏమంటున్నావు మా అమ్మతో? బాగా నవ్వుకుంటున్నావు నీలో నువ్వే, ” అడిగాడు భార్య నవ్వుతున్నది చూసి. 


“ఓహో మీకు అలా అర్ధమైందా, ఏం లేదు. మీ అమ్మను లోపలకు రమ్మని పిలుస్తున్నాను, బయటే నిలబడిపోయారు. ఇది మీ ఇల్లే అన్నాను, ” అత్తగారి వైపు చూస్తూ అన్నది. 


మనసు చివుక్కుమన్నది భారతమ్మకు కోడలు మాట్లాడే మాటలకు. 


“అమ్మా చూసావా పద్మా!  మనసు ఎంతమంచిదో, పైకి అలా కఠినంగా మాట్లాడుతుందే కానీ నువ్వంటే తనకు చాలా ప్రేమ, ” అన్నాడు భార్యను వెనకేసుకోస్తూ. 


“మీరు కొత్తగా చెప్పాలేంటి మీ అమ్మకు తెలియదా నాగురించి, కదత్తయ్యా, ” అడిగింది. 


“ఆ అవునవును. పద్మ నాకు కొత్తేంటిరా.. తన మనసు ఎలాంటిదో నీకంటే నాకే బాగా తెలుసు. ఇంతకు పిల్లలేరి, ” అటూ ఇటు చూస్తూ అడిగింది. 


“ఏమిటి ఒదిన.. ఇప్పుడేనా రావడం, ఆరోగ్యం కులాసాగా ఉందా? ఎన్నాళ్ళైందో మనం కలుసుకుని, ” ముఖమంతా నవ్వు పులుముకుని అడిగింది అప్పుడే పూజ ముగించుకుని

బయటకు వస్తూ. 


“మీరెప్పుడు వచ్చారత్తా.. మా మీద ఇన్నాళ్ళకు దయ కలిగిందన్నమాట, పోనిలే మంచిపని చేసారు మా అమ్మకు తోడుగా ఉంటారు, పద్మ మీ అమ్మ వస్తున్నట్టు నాకు చెప్పనేలేదు, ” నిష్టూరమాడుతూ అడిగాడు భార్యను. 


“మా అమ్మ ఆటోదిగి ఇంట్లోకి వచ్చేవరకు నాకు తెలియదు, రాకరాక మా అమ్మ వచ్చినందుకు ప్రశాంతత లేకుండా పోయింది తనకు, నాకు తెలిస్తే రావద్దని కొన్నాళ్ళయ్యాక

రమ్మనేదాన్ని చెప్పాపెట్టకుండా ఎందుకొచ్చావే, ” అంది తల్లిని రుసరుసలాడుతూ. 


“అదేమిటి పద్మా!  అత్తమీది కోపం దుత్త మీది తీసినట్టు, మీ అమ్మను అలా అంటున్నావేంటమ్మ? పెద్దావిడా నిన్ను చూడాలనిపించిందేమో వచ్చింది, నేను రావడం వలన తనకు ఇబ్బందేమి ఉండదు. మీ అమ్మను నువ్వు ఎలా చూసుకుందామనుకున్నావో అలానే చూసుకో. నేను ఏమనుకోను, ” కోడలితో అంటూ కొడుకువైపు చూసింది భారతమ్మ. 


“చూసారా చూసారా.. నేను ఇప్పుడు తననేమన్నానని ఎలా అపార్థం చేసుకుందో చూసారా, అందుకే చెబుతూనే ఉన్నాను నేనంటే ఆవిడకు ఇష్టముండదని, మా అమ్మను చూసే సరికి ముఖం ఎలా బెట్టుకుందో చూడండి, ” భర్తతో చెప్పింది. 


“ పద్మా!  ఇప్పుడు మీ అత్త ఏమన్నదనే ఆమె మీద విరుచుకుపడుతున్నావు, మామూలుగానే అంది నువ్వే అనవసరంగా అపార్థం చేసుకుంటున్నావు నువ్వు.. లోపలకి వెళ్ళి మీ బ్యాగు పెట్టుకుని రండి. వేడి వేడి కాఫీ తాగుదురు, ” అంది బిడ్డను కోప్పడుతూ. 


“అమ్మా నువ్వొట్టి అమాయకురాలివి నీకేం తెలియదు పో, ” అంటూ కోపంతో లోపలకు వెళ్ళింది తల్లి తనను అలా అనే సరికి కోపంవచ్చింది పద్మకు. 


భారతమ్మ వచ్చి అప్పుడే నాలుగురోజులు గడిచిపోయాయి. వియ్యంకురాళ్ళిద్దరు ఒకే గదిలో పడుకోవటంతో ఇద్దరి మధ్య చనువు ఏర్పడింది. కబుర్లు చెప్పుకోవడం కలిసి భోంచెయ్యడం, పని ఉన్నప్పుడు పని చెయ్యడం చేస్తున్నారు. ఏదో ఒకదానికి అత్తను సాధిస్తూనే ఉన్నది పద్మ. తల్లి ఉండడంతో తన ప్రతాపం అత్త మీద ఎక్కువ చూపడానికి కుదరడంలేదు. ఈ మహాతల్లి ఇప్పుడే ఎందుకు వచ్చిందో నన్నడిగితే చెప్పేదాన్ని కదా! 


ఆవిడగారిని నాలుగురోజుల్లో పంపిద్దామనుకుంటే తను అడ్డంగా ఉంది. ఎలా అత్తను ఊరికి పంపాలో అనే ఆలోచనలో ఉంది పద్మ. శేఖరు చాలా సంతోషంగా ఉన్నాడు తల్లి తన దగ్గర ఉన్నందుకు. పద్మకు తెలియకుండా అత్తను పిలిచి మంచిపని చేసాననుకున్నాడు. శేఖర్ పిల్లలు భారతమ్మ వచ్చినప్పటినుండి ఒకసారి పలకరించారంటే

మళ్ళి దగ్గరకు కూడా రాలేదు. పెద్దవాళ్లు అవుతున్నారని సరిపెట్టుకుంది. 


“బాబు.. మనవడు మనవరాలు ఏం చదువుతున్నారు? వాళ్ళకు పెద్ద చదువులు.. క్షణం తీరడం లేదన్నట్టుంది, ఎప్పుడు చూసినా దాని ముందు కూర్చొని పని చేసుకుంటున్నారు, ” అడిగింది కొడుకును. 


“ఆ ఏముందమ్మ అందరు చదివే ఇంజనీరింగే, వీళ్ళకు చదువుమీద కంటే ఆ కంప్యూటర్లో ఏదో ఒకటి చూడడమే పని తప్పా చదువు మీద ధ్యాస ఉంటే కదా! ఏమి అనలేము పెద్దవాళ్ళవుతున్నారని చూసి చూడనట్టు ఊరుకోవడమే, ఏమన్నా అన్నామంటే వీళ్ళకంటే ముందే గయ్యిన లేస్తుంది మీ కోడలు నా మీదకు, అందుకే నోరు మూసుకుని చూస్తుంటాను నువ్వు చూస్తున్నావుగా వీళ్ళ వాలకం, ” తల్లి తోడమీద పడుకుని చెప్పాడు. 


“అయ్యో అలా అయితే ఎలాగు బాబు చెడిపొయ్యేది మన పిల్లలే కదా! సామరస్యంగా చెప్పి తోవకు తెచ్చుకోవాలి కానీ అలా వదిలెయ్యకూడదు, ” అంది కొడుకు తల నిమురుతూ. 


“అమ్మా.. నా మాట వినే పరిస్థితి ఎప్పుడో దాటిపోయారు ఇంక నేనేం చెయ్యలేను, ఆ తల్లిష్టం ఆ పిల్లలిష్టం. డబ్బు కావాలంటే ఇస్తాను ఏమన్న చేసుకోని. చూద్దాం వాళ్ళకు

ఏదైనా గట్టి తాకుడు తగిలితే కానీ తెలిసిరాదు, ” అన్నాడు బాధగా. 


“పద్మా!  మనోజ్ రెండురోజులనుండి కనిపించడం లేదు ఎక్కడకు వెళ్ళాడు, ” అడిగాడు. 


“అయ్యో మీకు చెప్పలేదు కదూ మరిచేపోయాను చెబుదాం అనుకుంటూనే ఉన్నా, ఇంట్లో మనశ్శాంతి కరువైంది అందుకే అన్ని మరిచిపోతున్నా, ” అత్తగారివైపు చూస్తూ

అంది. 


“సరే దానికి దీనికి సంబంధం ఏముంది ఏదో ఒకటి అనాలనుకుంటావు, ఇంతకు ఎక్కడకు వెళ్ళాడు నీ సుపుత్రుడు ఎప్పుడు వస్తున్నాడు, ” వ్యంగ్యంగా అడిగాడు. 


“ఏం నాకు సుపుత్రుడంటున్నారు మీకు కాదేంటి ? మీ అమ్మ రాగానే భేషజాలు ఎక్కువయ్యాయి, అవున్లే నేర్పేవాళ్ళుంటే అలాంటి మాటలే వస్తాయి మరి, ” అంది మూతివిరుస్తూ. 


“ఎటుపెట్టి నీకు మా అమ్మను అంటే గాని తృప్తి ఉండదు కాబోలు, సరే మరి డబ్బులిచ్చావా సరి పడా వాడక్కడేం ఇబ్బందిపడతాడో ఏమో, ” అడిగాడు. 


“ఇచ్చానండి మొన్న మీరు నాకు పదివేలు ఇచ్చారు తీసిపెట్టమని ఆ డబ్బులిచ్చాను, వెర్రి వెధవ అవి సరిపోవని ఒకటే గోల చేసాడు సరి పుచ్చుకోమ్మని చెప్పాను, ” అంది నవ్వుతూ గొప్ప పని చేసానన్నట్టు. 


“పద్మా!  ఎవరొ వచ్చారమ్మ నీకోసం, ” కోడలిని పిలుస్తూ తను లోపలికి వెళ్ళిపోయింది. అక్కడే ఉంటే మళ్ళి ఏం మాటలు వినాల్సి వస్తుందోనని. 


“బాగున్నావా శ్యామల రా కూర్చో, ” అంది కుర్చి చూపిస్తూ. 


“బాగున్నానే పద్మా!  తను మీ అత్తగారా ? ఎంత వినయంగా ఉంది కదా! అచ్చు మీ ఆయనలాగే ఉన్నట్టుంది, ” నవ్వుతూ అడిగింది శ్యామల. 


“ఆ అవును మీదికే అలాగే కనిపిస్తారు లోపలంతా కుళ్ళే మనిషికి, ఆ ఏంటి ఏదో పేరంటానికి చెప్పడానికి వచ్చినట్టున్నావు, ” స్నేహితురాలి చేతిలో కుంకుమభరిణ చూసి అడిగింది పద్మ. 


“అదేనే, మా మరిది పెళ్ళి అంతా మా చేతులమీదుగానే జరగాలని పట్టుబట్టింది మా అత్త. మా బావగారున్నారు కానీ ఆయనేం పట్టించుకోడు. సరేగానీ నేనింకా చాలామందికి చెప్పిరావాలి నువ్వు మీ ఆయన తప్పకుండా రావాలి. అలాగే మీ అత్తను కూడా తీసుకరావే. పెద్దావిడ కదా ఆశీర్వాదం చేస్తుంది, ” అంది బొట్టుపెడుతూ. 


శ్యామల మాటలను వింటే చెళ్ళున కొట్టినట్టనిపించింది. అత్తమాటలు వింటూ మరిదికి పెళ్ళి చేస్తుందంటే ఎంత ఓపికనే తల్లి నీకు. ఆ నాకెందుకులే ఎవరెట్లా పోతే నాకేంటి అనుకుంది అంతలోనే. పెళ్ళిరోజు బాగా ముస్తాబైంది అందరిలోకి తనే ప్రత్యేకంగా కనిపించాలన్న ఆరాటం ఎక్కువ పద్మకు. భర్తను అడిగితే నాకు వీలుకాదు నువ్వెళ్ళు అన్నాడు. 


సరేలే అనుకుని రవ్వలనెక్లెస్ కోసమని వెదుకుతుంది. అది ఈ మధ్యనే చేయించుకుంది అది వేసుకుని పెళ్లిలో అందరికి చూపించాలని చూస్తే దొరకడంలేదు. ఇల్లంతా గాలించింది తిట్లు శాపనార్థాలు పెడుతూనే ఉంది పిల్లి మీద కుక్క మీద పెడుతూ అత్త తగిలేలా అంటుంది. ఆమె తీసిందేమోనని అనుమానం. 


“ఏమైంది పద్మా! ఎందుకు అంత కంగారుపడుతున్నావు, ఇల్లంతా చిందరవందర చేస్తున్నావు? ఆ తిట్లేంటి.. ఎవరిని తిడుతున్నావు.. ఏం దొరకడంలేదో చెబితే కదా తెలిసేది, ”

ఆఫీసుకు తయారవుతూ అడిగాడు. 


“ఏమైందని అంత తీరుబడిగా అడుగుతున్నావు ఇంకేమౌతుంది, మొన్న నేను కొనుక్కున్నాను కదా రవ్వలనెక్లెస్ అది ఇప్పుడు పెళ్లికి వేసుకుందామని చూస్తే కనిపించడం లేదు, ఇది ఎవరి పనో నాకు బాగా తెలుసు. ఇన్నేళ్ళలో ఏనాడైనా చిన్న వస్తువు కూడా పోలేదు అంటే దీనికి కారణం ఎవరో నీకు అర్థం కావడంలేదా, ” గయ్యి గయ్యిమని అరుస్తూ అడిగింది భర్తను. 


“పద్మా, ఏంటి నువ్వంటున్నది ? నాలుగు లక్షలు పోసి మొన్ననే కొన్నావు కదూ, జగ్రత్తగా పెట్టుకోవాలని తెలివిలేకపోతే ఎలా పద్మా? ఇప్పుడు ఎవరినని ఏం లాభం మళ్ళి ఒకసారి బాగా గుర్తు తెచ్చుకుని వెతుకు ఎక్కడ పెట్టావో”.. తను వెతకడం మొదలుపెట్టాడు. 


“అంతా వెదికాను ఎక్కడా కనిపించడంలేదు ఇది ఎవరు తీసారో మర్యాదగా నాకు తెచ్చిస్తే మంచిది, లేకపోతే పోలీసులకు పట్టిస్తాను జన్మంతా చిప్పకూడు తింటూ కూర్చోవలసి వస్తుంది, అమ్మా ఆ మహాతల్లికి చెప్పు మర్యాదగా తెచ్చివ్వమని, లేకపోతే నేను రాక్షసి అవతారం ఎత్తకముందే నా వస్తువు నాకు తెచ్చివ్వమను, ” అంది తల్లితో. లోపల పూజ గదిలో ఉన్న భారతమ్మకు ఏంటో గొడవపడుతున్నారు నాకెందుకులే నేనొకటంటే దానికి ఇంకోటి అర్థం చేసుకుంటుంది అనుకుని బయటకు రాలేదు. 

========================================================================

ఇంకా ఉంది..

========================================================================

లక్ష్మీ శర్మ త్రిగుళ్ళ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ లక్ష్మీ శర్మ త్రిగుళ్ళ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం


ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం : లక్ష్మి శర్మ త్రిగుళ్ళ

నా గురించి కొన్ని విషయాలు ప్రస్తావిస్తాను, నేను సికింద్రాబాద్ లాలాపేటలో వుంటాను,

నాకు చిన్నప్పటి నుండి కథలు రాయడంమన్న చదవడంమన్న చాలా ఇష్టం, 1991 నుండి రాయడం మొదలుపెట్టాను, ఎక్కడ ఏ పేపర్ కనిపించినా రాసాను, కానీ ఎవరికి చూపలేదు చెప్పుకోలేదు, ఈమధ్యనే మా అమ్మాయిలు మావారు చూసి కథలు బాగున్నాయి కదా ఏదైనా పత్రికకు పంపమంటే పంపంస్తున్నాను, కర్నూలు గణేశ్ పత్రిక లో నేను రాసిన కవితలు కథలు చాలా వచ్చాయి.ఈ మధ్యలో నేను రాసిన కథలన్నీ ( మబ్బులు వీడిన ఆకాశం ) అనే కథల సంపుటి వచ్చింది, (కిన్నెర ఆర్ట్ పబ్లికేషన్స్) వారిచేత.


ఇంకా ముఖ్యంగా, (మన తెలుగు కథలు కామ్) యాజమాన్యం వారి ప్రోత్సాహం , నాకు ప్రశంసా పత్రాలు ఇవ్వడంతో నాలో ఇంకా ఉత్సాహం పెరిగింది.

మీకు చాలా కృతజ్ఞతలు తెలుపుతూ,

లక్ష్మి శర్మ

లాలాపేట సికింద్రాబాద్

30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి బిరుదు పొందారు. 



 


81 views0 comments

Comments


bottom of page