#SudhavishwamAkondi, #సుధావిశ్వంఆకొండి, #మార్పు, #Marpu, #TeluguSerials, #TeluguNovel, #TeluguDharavahika, #TeluguSerialEpisode

Marpu - Part 2/6 - New Telugu Web Series Written By - Sudhavishwam Akondi
Published In manatelugukathalu.com On 16/03/2025
మార్పు - పార్ట్ 2/6 - తెలుగు ధారావాహిక
రచన: సుధావిశ్వం ఆకొండి
జరిగిన కథ:
భాగవతంలోని పద్యాన్ని అపహాస్యం చేస్తాడు డైరెక్టర్ పరాక్రమ్.
అతని కొడుకు సాకేత్ వేగంగా కారు నడిపి యాక్సిడెంట్ కు గురై ఐ సి యు లో చేరుతాడు.
ఇక మార్పు ధారావాహిక పార్ట్ 2 చదవండి.
మేనేజర్ మాట వినగానే వెంటనే శారదమ్మ తన కోడలితో కలిసి హాస్పిటల్ కి పరిగెత్తింది. అక్కడికి వెళ్ళేసరికి మనవడు ఐసియూలో వున్నాడు. కొడుకు అక్కడే బయట వెయిటింగ్ ఏరియాలో అచేతనంగా కూర్చుని ఉన్నాడు.కొడుకును, మనవడిని ఆ స్థితిలో చూడగానే గుండె పిండేసినంత బాధ కలిగింది ఆవిడకు. కోడలు కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది.
"డాక్టర్ ఏమి చెప్పారురా? నా మనుమడికి పర్వాలేదు కదూ! దెబ్బలు ఎక్కువగా తగల్లేదు కదూ! రేపటికల్లా కోలుకుంటాడని చెప్పారు కదూ డాక్టర్లు" అని అడిగింది కొడుకును తన ఏడుపును లోపలే దిగమింగుకుని.
బలవంతంగా గొంతు పెగుల్చుకుని పరాక్రమ్...
" ఇపుడే ఏమీ చెప్పలేమని చెప్పారమ్మా! చాలా తీవ్రంగా తగిలాయిట దెబ్బలు. వాడు డ్రైవింగ్ చేస్తూ ఉన్నాడుగా! ఇంకా ఎక్కువ తగులుతాయి. నా కొడుకుని ఎలాగైనా రక్షించమని డాక్టర్లతో చెప్పి వచ్చాను. ఎంత ఖర్చు అయినా వెనకాడవద్దు అని చెప్పాను" అంటూ విపరీతమైన దుఃఖం ఆపుకోలేక ఏడ్చాడు అమ్మ ఒళ్ళో తలబెట్టుకుని.
పక్కనే కోడలిని కూడా కూర్చోబెట్టుకుని, కొడుకును ఊరడిస్తూ....
"ఏమీ కాదురా నా మనుమడికి దీర్ఘాయుష్షువు ఉంటుంది. ఆ ఈశ్వరుడు తప్పక కాపాడతాడు" అని ఊరడించి,
మనసులో...
" పరమేశ్వరా! నా మనుమని కాపాడు తండ్రీ! నా కొడుకు అజ్ఞానంతో చేసిన పనులను దయతో క్షమించి, వాడి కొడుకును రక్షించు! ఈ ముసలితనములో నాకు మరో క్షోభ కలిగించకు. నా ప్రార్థన మన్నించు" అని ప్రార్ధించింది.
ఆరోజు రాత్రి అలా భారంగా గడిచింది. మరుసటి రోజు ఉదయం సాకేత్ కళ్ళు తెరిచాడు.
నర్స్ వెళ్లి డాక్టర్ ని పిలుచుకొచ్చింది. పరాక్రమ్ ఫ్రెండ్ అయిన డాక్టర్ వచ్చి, చెక్ చేసి స్నేహితుని వద్దకు వెళ్ళాడు.
"హమ్మయ్య. గండం గడిచింది. ప్రమాదంలో నుంచి బయట పడ్డట్టే! నీ కొడుక్కి ఇంకేం భయం లేదు" అని చెప్పాడు
ఒక రెండురోజులు అబ్సర్వేషన్ లో పెట్టుకుని ఆ తర్వాత డిశ్చార్జ్ చేస్తూ డాక్టర్..
"ప్రమాదం గట్టెక్కినట్టే! కానీ జాయింట్ ప్రదేశాల్లో ఫ్రాక్చర్స్ అయ్యాయి. నీడ్ టు టేక్ ఫిజియోథెరఫీ. ఆల్సొ నీడ్ టు టేక్ రెస్ట్. ఒక నెలరోజులు రెస్ట్ తీసుకోవాలి. అప్పుడు అంతా నార్మల్ అవుతుంది " అని చెప్పి డిశ్చార్జ్ చేసి పంపాడు
*****
కొడుకు పైన ఉన్న అమితమైన ప్రేమ వల్ల తను ఇంట్లోనే వుండి చూసుకుంటున్నాడు. కొత్త సినిమాల డైరెక్షన్ వాయిదా వేసేశాడు.
ఒకరోజు రాత్రి కొడుకు నిద్రపోతుండగా, వాడి బెడ్ వద్దే కూర్చుని ఉన్నాడు. భార్య వంటగదిలో ఏదో పనిలో ఉంది.
అప్పుడు శారదమ్మ వచ్చింది అక్కడికి. మనుమడిని చూసింది. ప్రశాంతంగా నిద్రపోతున్నాడు సాకేత్.
"హమ్మయ్య గండం గట్టెక్కినట్టే" అనుకుంది.
ఆ తర్వాత అక్కడే కూర్చుని, కొడుకుతో
" ఏరా! ఇంకా పడుకోలేదు. నాలుగు రోజుల్లోనే లంకణాలు చేసిన వాడిలా అయిపోయావు. నువ్వెళ్ళి పడుకో! నేనిక్కడ వీడి దగ్గర ఉంటాను" అని కొడుకు తలపైన ప్రేమగా చేయి వేసింది.
"వద్దమ్మా! నేనిక్కడే ఉంటాను. నువ్వెళ్ళి పడుకో! వీడికి ఎలా వుందో అని మనసులో టెన్షన్ వస్తుంది" అన్నాడు
కొడుకు తలపైన నిమురుతూ...
"నాన్నా! ఎందుకురా అంత డీలా పడిపోతున్నావు? ఇప్పటికి వాడికి ప్రమాదం తప్పిపోయింది దేవుడి దయవల్ల. ఇక భయం లేదని డాక్టర్ చెప్పాడు కదా! త్వరలోనే వాడు పూర్తిగా కోలుకుంటాడు. పెద్ద గండం దాటాడు నా మనవడు" అని ఓ నిమిషం ఆగింది.
తిరిగి ఇలా అన్నది....
"వాడికి ఆక్సిడెంట్ అయ్యింది అని ఫోన్ రాగానే, విషయం నాకూ చెప్పలేదు, పక్కనే ఉన్న జయంతికి చెప్పకుండా, తింటున్న చేయి కడుక్కోకుండా పరుగెట్టావు కదా! ఎందుకురా? అంతగా అకస్మాత్తుగా వెళ్లిపోయావు. కనీసం జేబులో డబ్బులు ఉన్నాయో లేదో కూడా చూసుకోలేదు. అలా పరుగెత్తావు. బహుశా అక్కడ నీకు ఫ్రెండ్ అయిన డాక్టర్ వున్నాడు, నీ పేరును చూసి, అప్పుడే మనీ పే చేయమని బలవంతం చేయరు అనేది నీ మైండ్ లో ఫిక్స్ అయి ఉంటుంది. అందుకే ఎటువంటి ఆలోచన లేకుండా పరుగెత్తావు. కారణం నీలో ఉన్న పుత్రప్రేమ వల్లనే కదా!
అటువంటప్పుడు అపరిమితమైన ప్రేమ నీకు నీ కొడుకు పైన ఉన్నట్టే, భగవంతుడు అందరికీ తల్లి, తండ్రీ కూడా. తనను నమ్మి ఆర్తితో పిలిచిన భక్తులను రక్షించడానికి అలాగే పరుగెడతాడు. అందులో ఆశ్చర్యం ఏమున్నది? ఆయనకు ఆలోచించి జాగ్రత్తలు చూసుకొని వెళ్ళనక్కర్లేదు. ఈ చరాచర సృష్టి అంతా ఆయనది అయినప్పుడు, ఎలాగైనా రక్షించ గలడు.
నువ్వు సినిమాల్లో పెడతావే హీరోలకు చిటికె వేస్తే అవతలివాళ్ళు చనిపోయేటట్టుగా. అది ఎంత అసహజం. ఏ నరమానవుడు అటువంటి పనులు చేయగలడా? కానీ భగవంతుడి విషయంలో సాధ్యాసాధ్యాల ప్రశ్నకు తావే లేదు. ఆయన సంకల్పమాత్రాన ఏదైనా చేయగలడు. అలా భగవంతుని అవహేళన చేస్తూ ఎప్పుడూ మాట్లాడొద్దు" అని ఆగింది ఒక్క నిముషం
కొడుకు వింటూ ఆలోచిస్తున్నాడు. 'ఇనుము కొలిమిలో వుండగానే తగిన షేప్ చేయాలి' అనుకుని మళ్లీ కొనసాగించింది...
"ఇక సాకేత్ విషయం. ఇంత చిన్నప్పుడు వాడికి కారు అవసరమా! ఓ సారి ఆలోచించు. వాడు అడిగాడని కొనిచ్చాను అంటావు. కానీ వాడు చదువు కంటే ఎక్కువ విలాసాలకు అలవాటు పడితే, వాడి భవిష్యత్తు ఏమవుతుంది? ఒక్కసారైనా ఆలోచించావా?
హీరో అనగానే ఒక మంచి బైక్ లేదా కారు ఉండాలి. తాగడం ఒక సామాన్య విషయం. సకల అవలక్షణాలు ఉండాలి అనేటట్టుగా సినిమాలు తీస్తున్నావు నువ్వేమో. యువత వెర్రెక్కి చూస్తే నాకేంటి డబ్బులు వస్తున్నాయిగా. వాళ్ళను నేను చూడమన్నానా? అంటున్నావు. కానీ ఆ యువతలోనే నీ కొడుకూ వున్నాడు.
చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు తర్వాత విచారిస్తే లాభం ఉండదురా. సంపాదించింది చాలు. ఇప్పటికైనా మారి సమాజానికి మంచి జరిగేవిధంగా సినిమాలు తీయరా! నేను బతికివుండగానే మారిన నిన్ను చూడాలని కోరికగా ఉందిరా! ఒక్కసారి నిన్ను చూసి ఇంతమంచి కొడుకును కడుపారా కన్నందుకు ఆ ఈశ్వరునికి మనస్ఫూర్తిగా నమస్కరించి, సంతోషిస్తానురా! అంతటి మహానుభావుడికి ఇటువంటి కొడుకు అని నేను వేదన పడేట్టుగా చేయకురా! నన్ను ప్రశాంతంగా మీ నాన్న వద్దకు వెళ్లిపోయేట్టుగా చేయురా!" అంటూ తన ఆవేదన వ్యక్తం చేసింది. ఆమె కన్నులలో నుంచి నీటి బిందువులు జారి పడ్డాయి.
అదంతా విని నిజంగానే బాధకలిగింది పరాక్రమ్ కి. తనెంత తల్లిని క్షోభ పెట్టాడో అనుకుంటేనే తనపైన తనకే కోపం వచ్చింది.
"నువ్వు ఇంత బాధపడుతున్నావు అనుకోలేదమ్మా! ఏదో చాదస్తం కొద్దీ అంటున్నావని సరిపెట్టుకున్నాను. ఇకనుంచి అలాగే ఉంటాను. నువ్వు చెప్పినట్టుగానే చేస్తాను. ఆ లోకం నుంచి నాన్న, ఇక్కడ నువ్వూ సంతోషించేట్టుగా ప్రవర్తిస్తాను. మనీ కోసం అంటూ పిచ్చి సినిమాలు తియ్యను. నువ్వు ప్రశాంతంగా ఉండు. వెళ్లి పడుకో. చాలా ఆలస్యం అయ్యింది" అని తన మాటలతో ఆమెకు ఆనందం కలిగించి, పడుకొమ్మని పంపించాడు.
ఎంతో సంతోషించిన శారదమ్మ, తన గదిలోకి వెళ్ళింది.
"నా మొర విని, నా కొడుకు మనసు మార్చావా తండ్రీ! మంచి కొడుకును కన్నాననే తృప్తిని కలిగించావు. ఇక నేను నిశ్చింతగా నీ పాదాల వద్దకు చేరుకుంటాను" అని కళ్ళల్లో ఆనందభాష్పాలు రాలుస్తూ ఆ భగవంతుడినే తలుచుకుని, ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ అలాగే అచేతనమైపోయి, ఆయన వద్దకే వెళ్ళిపోయింది.
ఆ మరునాడు అత్తయ్య ఇంకా లేవలేదని పిలువటానికి వచ్చింది జయంతి. నిద్రపోతున్నట్లుగా ఉన్నది ఆమె ముఖం. ముఖం ప్రశాంతంగా, కాంతివంతంగా ఉంది.
దగ్గరగా వెళ్లి తట్టి పిలిచింది. శరీరం చల్లగా తగిలింది. ఒక్కసారిగా భయం, బాధ కలిగాయి జయంతిలో
"ఏమండీ! ఓ సారి ఇటు రండి!" అని గట్టిగా కేకేసింది
"ఏమయ్యింది?" అని పరుగున వచ్చిన పరాక్రమ్ అలాగే నిస్తేజంగా నిలుచుండిపోయాడు కాసేపు.
అచేతనంగా ఉన్న తల్లిని చూసి లోలోపలే కుమిలి పోయాడు. తన కోసమే, తనే ప్రాణంగా బతికిన అమ్మ పోయిందగానే ఆ స్టార్ డైరెక్టర్ గుండెల్లో నుంచి దుఃఖం వరదలా ఉప్పొంగింది.
"అమ్మా! నేను మారిపోయాను. ఒక్కసారి లేచి చూడమ్మా!" అంటూ ఆక్రోశించాడు
ఈ వార్త విన్న అతని సన్నిహితులు, బంధువులు అందరూ వచ్చారు. ఆ మహతల్లిని చివరిగా చూసి పోదామని పరబ్రహ్మ శాస్త్రి గారు కూడా వచ్చారు.
ప్రతి ఒక్కరూ ఆ మహతల్లి ఎంత గొప్పదో, దయామతల్లి అంటూ వచ్చిన వాళ్ళల్లో చాలామంది కన్నీళ్ల పర్యంతమయ్యారు ఆమె తమకు చేసిన సాయం తలుచుకుంటూ.
ఎట్టకేలకు అంత్యక్రియలు పూర్తి చేయడం అయిపోయింది. బాధ దిగమింగుకుని బ్రాహ్మణులు చెప్పినట్టుగా కర్మకాండలు చేసాడు. అతనికి ఎటు చూసినా తన తల్లి రూపమే కనిపిస్తోంది.
ఏ పని మీదకూ మనసు పోవడం లేదు. ఎప్పుడూ అమ్మనే గుర్తు వస్తోంది అతనికి.
"అమ్మా! నేను నీ మనసు ఎంతగా బాధ పెట్టానో తలుచుకుంటే నాపై అసహ్యం వేస్తుంది." అని రోదించాడు
తను సినిమా రంగం లోనికి వెళతానని అన్నప్పుడు తనకెన్ని మాటలు చెప్పింది అమ్మ. అవన్నీ అప్పుడు విన్నాడు, కానీ తర్వాత అన్నీ విస్మరించి, అమ్మ మాటలు చాదస్తంగా కొట్టి పడేసాడు. అవన్నీ గుర్తుకు రాగా అమ్మను తలుచుకుని కుమిలిపోయాడు.
తల్లి మరణం ఆ స్టార్ డైరెక్టర్ లో మంచి మార్పు తెస్తుందా?
కాలమే సమాధానం చెప్పాలి.
=======================================================================
ఇంకా వుంది..
=======================================================================
సుధావిశ్వం ఆకొండి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం:
కలం పేరు సుధావిశ్వం. పూర్తి పేరు అనురాగసుధ. వృత్తి లాయర్. ప్రవృత్తి రచనలు చేయడం. ట్రావెలింగ్ కూడా!
కొన్ని నవలలు, కథలు వ్రాయడం జరిగింది. ప్రస్తుత నివాసం ఢిల్లీ.
コメント