top of page

మార్పు - పార్ట్ 3

Writer: Sudha Vishwam AkondiSudha Vishwam Akondi

#SudhavishwamAkondi, #సుధావిశ్వంఆకొండి, #మార్పు, #Marpu, #TeluguSerials, #TeluguNovel, #TeluguDharavahika, #TeluguSerialEpisode


Marpu - Part 3/6 - New Telugu Web Series Written By - Sudhavishwam Akondi

Published In manatelugukathalu.com On 23/03/2025 

మార్పు - పార్ట్ 3/6తెలుగు ధారావాహిక

రచన: సుధావిశ్వం ఆకొండి




జరిగిన కథ:

భాగవతంలోని పద్యాన్ని అపహాస్యం చేస్తాడు డైరెక్టర్ పరాక్రమ్.

అతని కొడుకు సాకేత్ వేగంగా కారు నడిపి యాక్సిడెంట్ కు గురై ఐ సి యు లో చేరుతాడు. పరాక్రమ్ లో కొంత మార్పు గమనించిన అతని తల్లి శారదమ్మ మంచి సినిమాలు తియ్యమని కొడుక్కి చెబుతుంది. ఆరోజే ఆమె మరణిస్తుంది. ఆమె మరణంతో పరాక్రమ్ లో కొంత మార్పు మొదలౌతుంది.


ఇక మార్పు ధారావాహిక పార్ట్ 3 చదవండి.


తల్లి మరణించినప్పటి నుంచి ఎప్పుడూ ఏదో ఆలోచనల్లో ఉండేవాడు స్టార్ డైరెక్టర్ పరాక్రమ్. ఇంకా కొత్త సినిమాల డైరెక్షన్ మొదలు పెట్టలేదు. ఇంట్లోనే వుంటూ ఎప్పుడూ ఏదో పోగొట్టుకున్నవాడిలా ఉంటున్నాడు. నిర్లిప్తంగా కాలం గడుపుతున్నాడు.


అలా ఉండగా ఒకరోజు సాయంకాలం బంగ్లా లాన్ లో కూర్చుని ఉండగా, అతని ఫ్రెండ్ ప్యారీ రంగనాధ్ వచ్చాడు. అప్పుడు శారదమ్మ కార్యక్రమానికి వచ్చాడు, కానీ తీరిగ్గా మాట్లాడే వీలుకాలేదు. అందుకే పరామర్శించి, అన్నీ మర్చిపోయి డైరెక్షన్ మొదలుపెట్టమని చెప్పడానికి వచ్చాడు. 


'తల్లి మరణం అంతా మర్చిపోయి, ఆ వెంటనే మామూలు మనిషి అయిపోతాడు. మళ్లీ డైరెక్షన్ మొదలు పెడతాడనుకుంటే ఇంకా మొదలుపెట్టడం లేదేంటి! ఎన్ని సినిమాలు ఆగిపోతాయి! ఎంత మనీ నష్టం!ఎలాగైనా అతని తన మాటలతో నార్మల్ గా, ఎప్పటిలా తయారు చేయాలి' అని అనుకున్నాడు. 


అందుకే పరామర్శ పేరుతో వచ్చాడు. మళ్ళీ డైరెక్షన్ చేయించడానికి వచ్చాడు. 


ఈ ప్యారీ రంగనాధ్ స్టార్ రైటర్ గా పేరు పొందాడు. వీళ్ళిద్దరూ కలిసి తీసిన మొదటి సినిమాలో హీరో ప్యారీ అనే ఊతపదం వాడుతుంటాడు, ప్యారీ అంటూ ఒక ఐటమ్ సాంగ్ కూడా ఉంది. ఈ డైలాగ్, సాంగ్ చాలా హిట్ అయ్యి, ఇవి రాసిన రచయిత రంగనాధ్ కాస్తా ప్యారీ రంగనాధ్ గా పాపులారిటీ సంపాదించుకున్నాడు. 


అప్పట్నుంచీ ఇద్దరూ కలిసి చేసిన సినిమాలు అన్నీ బ్లాక్ బస్టర్ లు అయ్యాయి. ఇద్దరి పేరు మారుమ్రోగిపోయింది. 


పరాక్రమ్ సినిమా ఛాన్సుల కోసం వచ్చినప్పుడు, ఈ రంగనాధ్ కూడా తన రచనలు పట్టుకుని ఆఫీస్ ల చుట్టూ తిరుగు తున్నాడు అపుడు. అలా అప్పుడు కలిశారు ఇద్దరూ. పరాక్రమ్ భార్య జయంతి, రంగనాధ్ భార్య మాలిని ఇద్దరూ ఒక్కఊరు వారని తెలిసి మరింత ఫ్రెండ్ షిప్ పెరిగింది. 


 రంగనాధ్ సినిమా రంగంలో క్లిక్ అయి కోట్లు సంపాదించి, లగ్జరీ లైఫ్ గడపాలని ఆలోచనతోనే ఈ రంగం ఎన్ను కున్నాడు. కానీ పరాక్రమ్ అలా అనుకోలేదు మంచి సినిమాలు తీయాలనే ఉద్దేశ్యంతోనే వచ్చాడు మొదట్లో. 


అయితే ఒకరోజు రంగనాధ్ 

పరాక్రమ్ తో.. 

"నువ్వు అనుకున్నట్టుగా మూవీ తీస్తే అసలు ఎవ్వరూ చూడరు, హిట్ కాదు. అడుక్కు తినాల్సి వస్తుంది మనం" అంటూ ఉదాహరణలు చెబుతూ.. 


"ఏ సినిమాలు తీసినా, సంపాదించాల్సింది డబ్బు. ఆ డబ్బు ఉంటే ఏమైనా చేయొచ్చు. ఎవడూ ఏమీ అనడు. మీకేమయినా రాంగ్ గా సంపాదిస్తున్నామేమో అనే ఫీల్ ఉంటే, వచ్చిన డబ్బులో కొంత తీసి అప్పుడప్పుడు ఏ దేవుని హుండీ లో అయినా వేయండి. ఎప్పుడైనా వరదలు వచ్చినప్పుడు కొంత దానం ఇచ్చి, గొప్పగా ప్రచారం చేసుకుంటే చాలు. అంతే నువ్వొక గొప్ప మానవతావాదిగా నిర్ణయించేస్తారు ప్రజలు. మిగతావి ఏవీ పట్టించుకోరు. 


పిల్లలు చెడిపోతారేమో అని అనుకుని వాళ్ళు చూడకుండా ఉంటారా? లేదే! ఎవరి విషయం వాళ్ళు చూసుకోవాలి అంతే! లేదంటే వాళ్ళ ఖర్మ! మనం ఏమి చేస్తాం? ఎవరైనా జర్నలిస్టు వాళ్ళ పేపర్ కోసమో!, ఛానల్ టీఆర్పీ కోసమో మనల్ని ఏమైనా అంటే, సినిమాను సినిమాలా చూసి ఎంజాయ్ చేయాలి అంతే! మీకిష్టముంటే చూడండి లేదంటే లేదు అని స్టేట్ మెంట్ ఇస్తే సరిపోతుంది. 


ఏదో ఒకటి అనాలి అనుకుని అనేవాళ్ళు ఎలాగైనా అంటారు. బాగా నేమ్, ఫేమ్ సాధించి సెలెబ్రిటీ అయిపోతే ఎవ్వడూ ఏమీ అనడు. అన్ని వ్యాపారాల్లాగే ఇదీ ఒక వ్యాపారం. వ్యాపారం అభివృద్ధి కోసం చేసే ప్రయత్నం అంతే. అందుకే ఇక అనవసరంగా ఆలోచించకు. మన సినిమా అనగానే ఏమీ ఆలోచించకుండా థియేటర్ కు వచ్చి సినిమా చూడాలి. అలాంటి ట్రెండ్ సృష్టించాలి మనం" అని దుర్భోధలు చేశాడు. 


అలా మొదలైన వారి స్నేహం ప్రస్తుతం ఇంకా కొనసాగుతోంది. 


దిగులుగా కూర్చున్న పరాక్రమ్ తో.. 

"ఇంకా దిగులుపడుకుంటూ కూర్చుంటే పోయినవాళ్ళు వస్తారా చెప్పు? ఎవరి లైఫ్ వాళ్ళు ఎంజాయ్ చెయ్యాలి. ఇంత డీలా పడతావనుకోలేదు. ఇలా సెంటిమెంటల్ ఫూల్ గా ఉంటే చాలా కష్టం. చూడు నేను ఎలా ఉన్నానో? ఊరికే నస పెడుతున్నారని మా అమ్మానాన్నలని వృద్దాశ్రమానికి పంపించి, తలనొప్పి వదుల్చుకున్నా. 


ఇంట్లో వాళ్ళను చూసుకోడానికి ఎవరూ లేరు అని చెబితే, అదే అందరూ నమ్మారు. ఎలాగో మాలిని కూడా క్లబ్ తో బిజీ కదా! అందుకే మొదట నిరాకరించినా, సరేనని ఒప్పుకుంది. వాళ్ళు పోయాక తలకొరివి పెడితే అయిపోతుంది మనం బాధ్యత నెరవేర్చినట్టే అనుకుంటారు. 


నువ్వు మాత్రం నేను చెప్పింది వినకుండా మీ నాన్న పోగానే అమ్మను తెచ్చి ఇంట్లో పెట్టుకుని, ఆమె ఉన్నన్నాళ్ళూ ఆ నస భరించావు కదా! ఇప్పుడు నీకు ఆ బాధ తీరిపోయిందని ఆనందంగా ఉండాలి కానీ ఇలా ఉంటే ఎలా?


ఇప్పుడు నీ భార్యను మార్చడం చాలా సులువు. 'నేను చెప్పినట్లుగా ఉంటే సరేసరి లేదంటే విడాకులు ఇచ్చేసి, మంచి అందమైన హీరోయిన్ ను పెళ్లి చేసుకుంటా' అని బెదిరించావనుకో చచ్చినట్టు మారుతుంది. నేను మాలినిపై అదే ప్రయోగం చేశా కదా!" అంటూ కాస్త ఆగాడు. 


"బెదిరించావు సరే! ఆమె మారి, నువ్వు చెప్పినట్లుగా వింటోంది కదా! అయినా ఎందుకు చాలామందితో తిరుగుతున్నావు? ఆమెకు తెలియదా!" అన్న పరాక్రమ్ తో

పెద్దగా నవ్విన రంగనాధ్.


"అందుకే విడాకులు ఇవ్వలేదుగా! దేని దారి దానిదే! మన క్రేజ్ ఉన్నప్పుడే ఎంజాయ్ చేయాలి. తరువాత సినిమాలు తగ్గిపోతే, ముసలివాళ్ళం అయిపోతే ఎవరైనా వస్తారా మన దగ్గరకు?


నువ్వే ఇంకా చాలా మారాలి. అనవసర సెంటిమెంట్ పెట్టుకోకు. దానివల్ల ఒరిగేదేమీ లేదు. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టు కోవాలి అంటుంటారుగా! ఫీల్డ్ లో మన క్రేజ్ వున్నప్పుడే బాగా డబ్బు సంపాదించాలి, తద్వారా ఆనందం అనుభవించాలి" అన్నాడు.


"మా అమ్మ చెప్పినా వినకుండా అలా తీయడం వల్లనే, నా కొడుక్కి పెద్ద ఆక్సిడెంట్ అయ్యిందేమో! అనిపిస్తోంది. అందుకే ఫీల్ అవుతున్నా" అని అన్నాడు పరాక్రమ్. 


"అదంతా నీ భ్రమ! మీ అమ్మ మాటల వల్ల నీకు అలా అన్పిస్తోంది. అందుకే అప్పుడే ఊళ్ళో వదిలేసి రా ఆవిడను అంటే వినలేదు నువ్వు. నేను కూడా నీతో తీస్తున్నా కదా! నాకూ భాగం ఉండాలి కదా! నాకు కానీ, నా పిల్లలకు కానీ ఏమైనా జరిగిందా? అందరం హాయిగా ఉన్నాం. వాళ్ళు జీవితాన్ని ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు. అలా జరిగితే ఎవ్వరూ ఇలాంటి సినిమాలు తీయడానికి ముందుకు రారు కదా! మనమే కాదూ ఇంకా చాలామంది మనలాంటి వారు ఉన్నారు. వాళ్లకేమైనా అయ్యిందా! నీ పిచ్చి భ్రమ!


నీకో విషయం చెప్పనా! మా బంగ్లాలో పని చేసేవాడు బషీర్ అని వున్నాడు కదా! వాడి కూతురిని ఎంజాయ్ చేసాడు మావాడు. వాళ్ళు వచ్చి నా వద్ద ఏడిస్తే, బాగా డబ్బులు ఇచ్చి పంపివేశాను. వేరే ఊరు వెళ్లి ఆ పిల్లకు పెళ్లి చేసేయ్యమని చెప్పాను. నోరు మూసుకుని వెళ్లిపోయాడు. చూశావా! డబ్బుంటే ఏమి చేసినా ఎవ్వడూ ఏమీ అడగడు. 


అందుకే ఇప్పటికైనా నా మాట విని ఈ వెధవ సెంటిమెంట్లు వదిలేసి, హాయిగా సినిమాలు తీసి జనాల పైకి వదిలి, వచ్చిన డబ్బుతో హాయిగా ఎంజాయ్ చేద్దాం. ఈ రాత్రికి మనం ఎప్పుడూ వెళ్లే పబ్ కి రా! అక్కడ నీ కోసం మంచి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాం ఎదురుచూస్తుంది. ఇంకేమీ ఆలోచించకు! ఓకే నా! బై మరి. రెడిగా ఉండు" అని చెప్పి వెళ్ళిపోయాడు ప్యారీ రంగనాధ్. 


ఈ సంభాషణ అంతా విన్న జయంతి 

మనసులో.. 

"అయ్యో! ఈయన మారతాడేమో అనుకునేలోపు ఇలా దుర్భోధ చేసివెళ్లాడు ఈ మహానుభావుడు. అప్పట్లో ఓ సారి మాలిని తనతో అన్నీ చెప్పుకుని బాధపడింది. కానీ ఇతడు ఇంత వెధవనా! కొడుకు చేసిన ఛండాలం పనిని ఘనకార్యంగా చెబుతున్నాడు. డబ్బుతో వాళ్ళ నోరు మూయించానని అనుకుంటున్నాడు. కానీ తన కొడుకు ఎంత పాడైపోయాడో ఇతనికి అర్ధం కావట్లేదు" అనుకుంది. 


అప్పట్లో మాలిని కలిసినప్పుడు చెప్పిన విషయాలు గుర్తుకువచ్చాయి ఆమెకు. 


"జయంతీ! నేనెంత మొత్తుకున్నా వినకుండా, కొడుకునూ, కూతురిని హీరో, హీరోయిన్లుగా పెట్టి ఒక సినిమా తీసాడు. మా బంగ్లాలో పనిచేసే బషీర్ తన కూతురికి జరిగిన అన్యాయం గురించి చెప్పి, ఏడ్చాడు. నేను కోపముతో ఈ బషీర్ కూతురి విషయం అడిగి కొడుకుని నిలదీస్తే వాడు నాతో అన్న మాటలు..


"ఆడవాళ్లంటే ఒక క్రేజ్ అంతే! ఎంజాయ్ చేస్తే తప్పు ఏముంది? పొట్టి బట్టలు వేసుకుని ఎంజాయ్ చేయమని ఊరిస్తుంటే ఎంజాయ్ చేయడం తప్పేముంది? నాన్న తీసే సినిమాల్లో హీరో అంతే కదా! ఎంతమంది ఆడవాళ్ళో చుట్టూ ఉండి, డ్యాన్స్ చేస్తారు. హీరో చుట్టూ తిరుగుతారు. నేనూ కాబోయే హీరోనే కదా! నన్ను పెట్టి సినిమా తీస్తానన్నాడు నాన్న. తల్లి అయినా, చెల్లి అయినా ఇంకెవరైనా ఒకటే. అందరూ కూడా తమ అందాన్ని పొగడగానే ఏదంటే అది చేస్తారు. ఒక్కసారి నాన్న తీసే సినిమాలు చూడు! అప్పుడు తెలుస్తుంది. ఎప్పుడూ చూడవు నువ్వు" అని అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు" అని చెప్పి ఏడ్చింది మాలిని. 


"జయంతీ! అందుకే ఇక నేను ఆయన చెప్పినట్లుగా డ్రెస్ చేసుకోవడం మానేస్తా. విడాకులు ఇస్తే ఇచ్చుకోని! చావు రాకపోతే నా బ్రతుకు నేను బ్రతుకుతా!" అని బాధపడ్డ మాలినికి ఎన్నో విధాలుగా ధైర్యం చెప్పింది తను. 


ఇప్పుడు అత్తయ్య కూడా లేరు. ఈయన ఎలా మారతారో! పరమేశ్వరా! ఇక నీదే భారం" అనుకుంది. 


ఇంకా గందరగోళం అయిన మనస్సుతో కూర్చుని ఉన్నాడు పరాక్రమ్. సందిగ్ధావస్థలో పడిపోయాడు. 


కాసేపటికి పరబ్రహ్మ శాస్త్రిగారు వచ్చారు. ఆయన్ని వచ్చి కూర్చోమని ఆహ్వానించి, లేచి, నమస్కరించాడు పరాక్రమ్. జయంతి వచ్చి, మంచినీళ్లు, కాఫీ ఇచ్చి ఆయన్ని పలకరించి లోపలికి వెళ్ళింది. 


ఎప్పుడూ అంతటి గౌరవం ఇవ్వని పరాక్రమ్ ఇప్పుడు ఇలా ఆదరించేసరికి, ఆ తల్లి కోరిక ఫలించే తరుణం త్వరలోనే ఉందనే ఆశ కలిగింది ఆయనలో. తాను కూడా కొన్ని మంచిమాటలు చెప్పాలని అనుకున్నాడు. 


"బాబూ! ఏదో పెద్దవాడిని, ఎల్లప్పుడూ మీ క్షేమం కోరేవాడిని. అందుకే కొంచెం చనువు తీస్కుని కొన్ని మంచిమాటలు చెబుదామని వచ్చాను. మీ అమ్మ బ్రతికినన్నాళ్లు మీ క్షేమం కోసమే తాపత్రయ పడింది. మీరు మంచి కుటుంబ విలువలు కలిగిన కుటుంబంలో జన్మించారు. మీ తాతల కాలం నుండి మీది వ్యవసాయ కుటుంబం అయినప్పటికీ' ఊళ్ళో మంచి పేరు సంపాదించుకున్నారు. 


మీ తాతగారు మీ ఊరు, చుట్టుపక్కల ఊళ్ళల్లో ఎన్ని స్కూల్స్ కట్టించారో, ఎన్ని దేవాలయాలు నిర్మించారో చెప్పడం కష్టం, అదీ గుప్తంగా. 


అందరికీ మంచి చేయడం తప్ప, తన వల్ల ఇతరులకు ఏదైనా కొంచెం ఇబ్బంది కలిగినా సహించేవారు కాదు ఆయన. మీ నాన్నగారు కూడా అదేపేరు నిలబెట్టుకుంటూ వచ్చారు. మీ ఊళ్ళోని పెద్ద బంగాళాను స్కూలుకు ఇచ్చి వేశారు, స్కూల్ వాళ్ళు కాలేజీ పెడతామంటే. 


మీ నాన్నగారు పోయాక, నువ్వు రమ్మంటున్నావని ఇక ఇక్కడ ఉండను కదా! అని ఆ ఇల్లు మీ తాతగారు కట్టించిన ఆలయంలోని అర్చకుడికి ఇచ్చి వేశారు మీ అమ్మగారు. మీరూ స్వతహాగా మంచి వ్యక్తి. స్నేహాన్ని బట్టి కొన్ని లక్షణాలు మారు తుంటాయి కొందరిలో. ఈ మాట నేను కాదు మీ అమ్మగారు బాధపడుతూ చెప్పగా విన్నాను. 


మీ అమ్మగారు ఒకసారి నాతో 

"శాస్త్రి గారూ! అనవసరంగా నా తమ్ముడి కూతురు అని వీడికి ముడి పెట్టి జయంతికి చేజేతులా అన్యాయం చేశాను. జయంతికి వేరే మంచి సంబంధం చూసి చేసి ఉంటే బావుండేది" అని బాధ పడుతుంటే అక్కడికి వచ్చిన జయంతి.

 

"అత్తయ్యా! అలా అనవద్దు. నాకిప్పుడు ఏమి తక్కువ అయ్యింది. తల్లి లా చూస్కునే అత్త ఉండగా! ఇక ఆయన అంటావా! చాలామంది కంటే ఎన్నోరెట్లు మంచివారు. ఈ సినీ ప్రపంచంలో ఎన్ని ఆకర్షణలు వున్నా, నేను తను చెపినట్టు డ్రెస్సింగ్ చేసుకోకున్నా లోపల ఎంత అసంతృప్తితోనో ఉండి కూడా ఇంట్లో విసుక్కునేవారు కానీ నాకు విడాకులు ఇచ్చి వేరే వాళ్ళను పెళ్లి చేస్కోవడమో, ఎవరితోనైనా అక్రమ సంబంధాలు పెట్టుకోవడమో ఎప్పుడూ చేయలేదు. తన కొడుకు పైన ఎంతో ప్రేమ ఉంది. అది చాలదా? తను నడిచేది తప్పు అని ఎప్పుడో ఒకప్పుడు తెలుసు కుంటారు. అది నా నమ్మకం. ఇంకెప్పుడూ ఇలా అనవద్దు" అన్నది స్థిరంగా. 


ఈ మాట విని నేనెంతో సంతోషించాను. ఈ విషయాలు మీకు ఎందుకు చెబుతున్నానంటే, మీ వారి కోసమన్నా మీరు మారాలని. 


మొన్న భగవంతుని గురించి హేళనగా మాట్లాడగానే బాబుకు అలా అయ్యింది, కొన్నిసార్లు మనిషిలో మార్పు రావడం కోసం కొన్ని కష్టాలు ఇస్తాడు భగవంతుడు. అంటే మారడానికి ఛాన్స్ అన్నమాట!


'ఇంకెవ్వరికి అలా ఏమీ జరగట్లేదు కదా! అదంతా కాకతాళీయం' అని అనవచ్చు మీరు. స్వామికి ఎవరిపైన ఎక్కువ దయ కలుగుతుందో వారికి తమ తప్పు తెలుసు కునేందుకు అవకాశంగా ఇలాంటివి జరుగు తుంటాయి. ఎవరు చేసిన తప్పులకు వారు ఆ ఫలితాన్ని ఎప్పుడో ఒకప్పుడు తప్పకుండా అనుభవిస్తారు. 


జీవితం అంతా బావున్నా, మరణ కాలం సమీపించినప్పుడు, ఎంతో హింస అనుభవించి ప్రాణాలు వదల వలసి వస్తుంది. కొన్నిసార్లు వారి పిల్లలూ అనుభవిస్తారు. పెద్దలు చేసిన మంచి పనులు వారి పిల్లలను కాపాడుతాయి. అలాగే చెడ్డపనులు ప్రమాదాలు తెచ్చిపెడతాయి. మిమ్మల్ని ఏదో రకంగా భయపెట్టాలని చెప్పట్లేదు బాబూ! వాస్తవం చెబుతున్నాను. 


మా అబ్బాయి ఓ ప్రైవేట్ స్కూల్ లో టీచర్ గా చేస్తున్నాడు మీకు తెలుసు కదా! అక్కడ ఒక 8th క్లాస్ పిల్లవాడు రోడ్డుపైన తన గ్యాంగ్ తో వేరే వాళ్ళతో గొడవపడి పోలీసు స్టేషన్ కు వెళ్లి వచ్చాడట. ఎందుకు స్కూల్ కు రాలేదని అడిగితే.. 

 ఎంతో పొగరుగా 'ఇదంతా మామూలే! సినిమాలు చూడరా సార్ మీరు? పోలీసులు వాళ్లే వదిలేస్తారు. గ్యాంగ్ మెయింటైన్ చేస్తేనే గొప్ప' అంటూ సమాధానం చెప్పాడట. ఆడపిల్లల్ని ఏడిపిస్తున్నాడట. చూసారా! ఈ కలియుగంలో చెడు తొందరగా ప్రభావం చూపిస్తుంది ఎవరిపైన అయినా. అదే మంచి ప్రభావం చాలా కష్టం. 


అందుకే ఎప్పుడూ మంచి భావనలే విస్తరింపజేయాలి. కత్తి కన్నా పదునైనది కలం. పుస్తకాలు చదవడం ఉండేది పూర్వం రోజుల్లో సినిమాలు రానప్పుడు. ఊహ కన్నా చూసే దృశ్యం మనిషి మనసు పైన తీవ్ర ప్రభావం చూపిస్తుంది. 

భాగవతంలో వేద, శాస్త్ర పారంగతుడైన అజామిళుడు ఒక్క వేశ్య, విటుల దృశ్యం చూసి తన జీవితాన్ని సర్వనాశనం చేసుకున్నాడు. భార్యను, తల్లిదండ్రులను వదిలివేసి, వేదనకు గురి చేసాడు. 


ఈ సినిమా రంగం మొదలైనప్పటి నుంచి వివిధ సాంఘిక, సామాజిక పరిస్థితులను వివరిస్తూ ఎన్నో సినిమాలు వచ్చాయి. అవన్నీ ప్రజలని ప్రభావితం చేసాయి. అంతెందుకు విజయశాంతి నటించిన "కర్తవ్యం" చూసి ప్రభావితం అయిన ఎంతో మంది ఆడపిల్లలు ఐపీఎస్ లో జాయిన్ అయ్యారని విన్నాను. అటువంటి వాటి వల్ల మంచి జరుగుతుంది. 


ఇప్పుడు ఎలా తీస్తున్నారు మీరు? ఇప్పటి సామాజిక అంశాలు తీస్కుని, ఏ సమస్య వచ్చినా ధైర్యంగా వుండే లాగా యువతను ప్రభావితం చేసే విధంగా తీస్తే ఎంత బావుంటుంది! ఆడపిల్లలను ఎంత గౌరవం గా చూడాలో చెప్పే విధంగా ఉంటే బావుంటుంది కదా!

మీరు ఒక్కసారి ఆలోచించండి బాబూ! మీ అమ్మానాన్నలు ఏ లోకంలో వున్నా సంతోషించి ఆశీర్వదించేటట్టుగా మారండి బాబు. మీకు నా మాటలు కష్టం అనిపించినా పెద్ద మనసుతో క్షమించేయండి" అని సుదీర్ఘంగా వివరించారు శాస్త్రిగారు. 


కళ్ళల్లో నీళ్ళు ధారపాతంగా కారుతుండగా ఆ స్టార్ డైరెక్టర్ ఆయన పాదాలపై పడి పోయాడు. 


"శాస్త్రిగారు! తల్లి, తండ్రి తరువాత గురువు జీవితాన్ని మంచి మార్గంలో పెడతాడు అంటారు. నా విషయంలో అదే జరిగింది. ఇన్ని విషయాలు వివరించి సున్నితంగా నా తప్పు నాకు తెలియజేశారు. ఇక నుంచి నేను మీరు చెప్పినట్లుగా నడుచుకుంటాను" అన్నాడు మనస్ఫూర్తిగా. 


"సంతోషం బాబు! మీ అమ్మానాన్న ఎంతో సంతోషిస్తారు. ఇక నేను వెళ్ళోస్తాను బాబు" అంటూ మనస్ఫూర్తిగా ఆశీర్వదించి వెళ్లిపోయారు శాస్త్రిగారు. 


ఇదంతా విని జయంతి సంతోషించింది. 


రాత్రి ప్యారీ రంగనాధ్ కాల్ చేశాడు రాలేదేంటి అని. తలనొప్పిగా ఉందని, తర్వాత కలుస్తానని ఫోన్ పెట్టేసాడు పరాక్రమ్. 


*****


మరుసటి లేచి ఫ్రెష్ అయి భార్య ఇచ్చిన కాఫీ తాగుతూ " జయంతీ! సాకేత్ కాలేజీ మార్పిస్తాను. ఇక్కడే చదువుకుంటాడు. నువ్వే చూసుకోవాలి. నేను అమ్మ ఆశించినట్టుగానే సినిమాలు తీయాలనుకుంటున్నా. రంగనాధ్ నాతో కలువకపోవచ్చు. నేను ఒక్కడినే చేసుకోవాలి. సెకండ్ ఇన్నింగ్స్ అనుకో నాకు. నీ సహకారం కావాలి" అన్నాడు. 


ఎంతో ఆనందంతో భర్త క్రాఫ్ లోకి చేయి పోనిచ్చి ప్రేమగా "తప్పకుండానండీ! మీ తోడుగా ఎప్పుడూ ఉంటాను. మీలో ఈ మార్పు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అద్భుతమైన సినిమాలు, అందరి ప్రశంసలు పొందేట్టుగా తీయగలిగే శక్తి మీలో ఉంది" అంది. 


వీళ్ళు ఇలా మాట్లాడుకుంటుండగా.. 


ఆ టైం లో మేనేజర్ పరాంకుశం వచ్చాడు సార్ అంటూ ఆందోళనగా. 


"ఏమైంది పరాంకుశం గారూ!" అంటూ హాల్ లో కి వచ్చాడు పరాక్రమ్. 


"సార్! మీ ఫ్రెండ్ ప్యారీ రంగనాధ్ గారి అబ్బాయిని పోలీసులు అరెస్టు చేశారుట రాత్రి. ఇప్పుడు ఇంకా పోలీస్ కస్టడీలోనే వున్నాడు. ఆ అబ్బాయి తన ఫ్రెండ్స్ తో కలిసి పబ్ లో ఎవరో అమ్మాయిని దారుణంగా రేప్ చేసి, చంపేశాడట. 

మీ బాబుకు ఆక్సిడెంట్ అయిన రోజేనట. పోలీస్ దర్యాప్తులో నిజం ఇప్పుడు బయటపడింది. బెయిల్ దొరకడం దుర్లభం అంటున్నారు. అసలు ఉరిశిక్షనే పడుతుంది అంటున్నారు. టీవీ లో చూపిస్తున్నారు. అది చూసి మీతో చెబుదామని ఇలా వచ్చాను సార్" అన్నాడు. 


టీవీ పెడితే అన్ని ఛానెల్స్ లో ఇదే న్యూస్. ఇది విని అయ్యో! అని మాలిని నెంబర్ కు కాల్ చేసింది జయంతి. నో రెస్పాన్స్. 


 మిగతా తరువాతి భాగం లో.. 

మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి. 

=======================================================================

ఇంకా వుంది..

మార్పు - పార్ట్ 4 త్వరలో..

=======================================================================

సుధావిశ్వం ఆకొండి  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం:

కలం పేరు సుధావిశ్వం. పూర్తి పేరు అనురాగసుధ. వృత్తి లాయర్. ప్రవృత్తి రచనలు చేయడం. ట్రావెలింగ్ కూడా!

 కొన్ని నవలలు, కథలు వ్రాయడం జరిగింది.  ప్రస్తుత నివాసం ఢిల్లీ.




 
 
 

Comentarios


bottom of page