top of page

మార్పు - పార్ట్ 4

Updated: Mar 29

#SudhavishwamAkondi, #సుధావిశ్వంఆకొండి, #మార్పు, #Marpu, #TeluguSerials, #TeluguNovel, #TeluguDharavahika, #TeluguSerialEpisode


Marpu - Part 4/6 - New Telugu Web Series Written By Sudhavishwam Akondi

Published In manatelugukathalu.com On 29/03/2025 

మార్పు - పార్ట్ 4/6తెలుగు ధారావాహిక

రచన: సుధావిశ్వం ఆకొండి

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



జరిగిన కథ:

భాగవతంలోని పద్యాన్ని అపహాస్యం చేస్తాడు డైరెక్టర్ పరాక్రమ్.

అతని కొడుకు సాకేత్ వేగంగా కారు నడిపి యాక్సిడెంట్ కు గురై ఐ సి యు లో చేరుతాడు. పరాక్రమ్ లో కొంత మార్పు గమనించిన అతని తల్లి శారదమ్మ మంచి సినిమాలు తియ్యమని కొడుక్కి చెబుతుంది. ఆరోజే ఆమె మరణిస్తుంది. ఆమె మరణంతో పరాక్రమ్ లో కొంత మార్పు మొదలౌతుంది. పరబ్రహ్మ శాస్త్రి గారి మాటల ప్రభావం కూడా అతనిపైన పడుతుంది.



ఇక మార్పు ధారావాహిక పార్ట్ 4 చదవండి.

ఎన్నిసార్లు ప్రయతించినా 'స్పందించుట లేదు' అనే వస్తోంది మాలిని నెంబర్. రంగనాధ్ నెంబర్ కు కాల్ చేసాడు పరాక్రమ్. అదీ అంతే. 


"ఏమైందో? ఎలా ఉన్నారో? వాళ్ళింటికే వెళదామండీ" అంది జయంతి ఆందోళనగా.


సరేననుకుని వాళ్ళింటికి వెళదాం అనుకుంటుండగా కొరియర్ వచ్చింది. 


"సార్! నిన్న వచ్చాను కానీ ఇంట్లో ఎవరూ లేనట్టున్నారు. అందుకే మళ్లీ ఇప్పుడు తెచ్చాను" అంటూ ఇచ్చాడు.


"ఎక్కడికెళ్ళాం!" అనుకుంటే గుర్తొచ్చింది. నిన్న మధ్యాహ్నం ఎప్పటినుంచో రమ్మని పిలుస్తున్న జయంతి ఫ్రెండ్ ఇంటికి లంచ్ కి వెళ్లారు.

 

"ఓకే! అవునా! థాంక్స్ మళ్లీ తెచ్చి, ఇచ్చినందుకు" అన్నాడు మృదువుగా.


"భలేవారే! అది నా డ్యూటీ సార్! ఈ మధ్య మీ సినిమాలు రావట్లేదేంటి సార్! మీరు మొదట్లో తీసిన సినిమా చూసి, మీ అభిమానిని అయ్యాను సార్! కానీ రోజురోజుకీ మేము మా పిల్లలతో కలిసి, ఆనందంగా చూసే సినిమాలే కరువు అయిపోయాయి. అందుకే సినిమాలు చూడడమే మానేసాను. మా ఫ్రెండ్స్ పిల్లలు కొందరు మీ సినిమాల ప్రభావంతో భ్రష్టు పట్టిపోయారు. అది చూసి, నేను జాగ్రత్త పడుతున్నాను" అన్నాడు ఆవేదనగా.


ఇప్పుడు కోపం రాలేదు పరాక్రమ్ కు. ఎంతో ప్రశాంతంగా...

"నీ వంటి అభిమానిని నేను కోల్పోను. ఇక నుంచి నువ్వు నీ పిల్లలతో కలిసి చూసి, ఆనందించే. సినిమాలే తీస్తాను. పిచ్చి కామెడీ కానీ, వల్గర్ దృశ్యాలు ఏమీ లేకుండా అందరికీ ఉపయోగపడే సినిమాలు తీస్తాను. మా అమ్మకు ఇచ్చిన మాట తప్పను" అని దృఢంగా అంటూ అతని భుజం తట్టాడు.


"ఆ మాట చెప్పారు చాలు! చాలా సంతోషంగా ఉంది సార్! త్వరగా తీయండి సార్" అని తన ఆనందాన్ని వ్యక్తం చేసి, 

వెళ్ళాడు కొరియర్ బాయ్.


"ఇంతకీ ఈ కొరియర్ ఎక్కడినుంచి వచ్చింది?" అన్నాడు భార్యతో.


'ఎవరబ్బా'అనుకుంటూ విప్పి చూసింది జయంతి.కొరియర్ కవర్ పైన ఏమీ పేరు లేదు.


గబగబావిప్పి చూస్తే ఒక ఉత్తరం ఉంది. చదవకుండానే చివర లైను చూసింది. అక్కడ 'మాలిని' అని రాసి ఉంది.



మొదటి లైనులో జయంతి పేరుతో ఉన్న ఉత్తరం అది. 

అందులో విషయాలు పైకే చదివింది.


"జయంతీ! అన్ని విషయాలు నీకు చెప్పాలనే ఈ ఉత్తరం. దయచేసి పూర్తిగా చదువు! కానీ నన్ను అసహ్యించుకోకు! మొన్న సాకేత్ కి ఆక్సిడెంట్ అయిన రోజే, మా వాడు, వాడి ఫ్రెండ్స్ కలిసి, పబ్ లో ఎవరో అమ్మాయిని రేప్ చేసి, చంపేశారుట. అది తెలిసి పోలీసులకు లొంగిపొమ్మని నేను చెప్పాను. వాడి పొగరు సంగతి నీకు తెలుసు కదా! నా మాట ఖాతరు చేయలేదు.


ఈయనేమో... 

"ఎలాగైనా బెయిల్ తెప్పిస్తా వాడికి. కన్నతల్లివి అయివుండి వాడిని జైలుకు తోస్తావా? బుద్ధి ఉందా నీకు?" అని గొడవ. నాకు చచ్చిపోవాలన్నంత బాధ కలిగింది. 


'ఆ అమ్మాయిని అంత దారుణంగా చంపితే వీడిని ఇలాగే వదిలేస్తే? ఎలా?' ఇంకా ఏవేవో ఊహలు వచ్చి, మనసంతా ఆందోళన.


చివరకు వీడు, వీడి ఫ్రెండ్స్ కలిసి, నా కూతురును కూడా ఇలాగే చంపేస్తారేమో? సొంత చెల్లి కదా! అనే భావన ఉంటుందా! ఉండదు.ఎందుకంటే...

ఒకసారి దాంతో కూడా అసభ్యంగా ప్రవర్తించాడుట వీడు. 


"ఎందుకురా! అలా చేస్తున్నావు? బుద్ధి ఉందా నీకు?" అని ఇది అంటే..


"మనిద్దరం హీరో,హీరోయిన్స్ గా నటించాం కదా!ఇదీ అంతే! అలాంటి ఫీలింగ్స్ ఏమీ పెట్టుకోకు!" అన్నాడుట. 


"ఇలా పిచ్చిగా మాట్లాడితే అమ్మకూ, నాన్నకూ చెబుతాను" అన్నదట తను.


"చెప్పు! నాన్న ఏమీ అనడు. అలా అనే వాడైతే, అది తప్పు అయితే, నిన్నూ, నన్నూ హీరో, హీరోయిన్గా పెట్టి సినిమా తీస్తాడా?" అన్నాడట వ్యంగ్యంగా.


ఇది ఏమనాలో తోచక అప్పుడు అక్కడ్నుంచి వెళ్ళిపోయి, నాకు చెప్పింది తరువాత. 

వీడు ఇంతగా చేజారి పోతున్నాడని తెలిసి, వ్యధ చెందాను.


ఓసారి...

"మీరేమో వాడికి ఏది అడిగితే అది కొనడం, ఏదంటే అది చేస్తున్నారు. వాడు గర్ల్ ఫ్రెండ్స్ అంటూ తిరుగుతున్నాడు. సర్వ నాశనం అయిపోతున్నాడు" అన్నాను ఆయనతో ఆవేదనగా.


"నీ భ్రమ! వాడి వయసు అలాంటిది. ఈ వయసులో కాకపోతే ఎప్పుడు ఎంజాయ్ చేస్తాడు?" అని నామాట కొట్టి పారేశారు.


"అది కాదు. చెప్పేది వినండి! వాడు సొంత చెల్లిలో కూడా ఆడదాన్నే చూస్తున్నాడు. నా మాట విని, పిచ్చి సినిమాలు ఆపేయ్యండి. నా కొడుకును నాకు దక్కించండి"


"ఏదో ఒకటి కల్పించి చెబుతున్నావు వాడి పైన. వయసుకు తగ్గట్టుగా ఎంజాయ్ చెయ్యనీ! పోయిన కాలం తిరిగి రాదు" అని నా మాట వినకుండా అక్కడ్నుంచి వెళ్లిపోయారు.


అందుకే ఏదో ఒకటి చెప్పి, కూతురిని హాస్టల్ లో పెట్టాను. అక్కడే బెటర్ అని.


జయంతీ!ఒకవేళ అది ఇక్కడికి వస్తానంటే రానివ్వొద్దు. ఇలాంటి వాడి తల్లిగా బతకడానికి అసహ్యం వేస్తోంది. బహుశా ఈ ఉత్తరం నీకు అందే టైం కి నేను ఈ భూమి పైన ఉండను. వాడిని చంపి, నేనూ చస్తాను. అందుకే నా కూతురు జాగ్రత్తలు నీకు అప్పజెబుతున్నా. వచ్చే జన్మ లో ఆ భగవంతుడు మనల్ని కలిపితే అప్పుడే నిన్ను కలిసి నీ రుణం తీర్చుకుంటా...

బై ఫరెవర్..


నీ

మాలిని


ఇదీ ఆ ఉత్తరం లోని సారాంశం.


వెంటనే కారులో బయలుదేరారు ఇద్దరూ. రంగనాథ్ ఇంటికి కారు పరుగులు తీసింది.


 ఆ బంగ్లాకు వెళ్లేసరికి...

మెయిన్ డోర్ దగ్గరగా వేసి ఉంది. ఎవ్వరూ లేరు. తలుపు తట్టారు. అది ఠక్కుమని తెరుచుకుంది. లోపలికి చూసారు.

అక్కడ హాల్ లో....


రంగనాథ్ ఒక్కడు కూర్చొని వున్నాడు. 

'ఒక్క రోజుకే ఎలా మారిపోయాడు!' అనుకుంటూ చూశారు.

ఇంతలోనే...

రంగనాథ్ తన లైసెన్సుడ్ రివాల్వర్తో కాల్చుకోబోతున్నాడు. సినిమాలోలాగా తలకు గురి పెట్టుకున్నాడు. 


ఇంకో క్షణం ఆగితే పేలిపోయేదే!..

కానీ...

అప్రమత్తం అయిన పరాక్రమ్ స్పీడ్ గా వెళ్లి అతని చెయ్యి లాగేసాడు. గుండు పక్కకు దూసుకుపోతూ, రివాల్వర్ దూరంగా పడింది.


అతని స్థితి చూసి, చాలా బాధపడింది జయంతి. 


"ఏంటి ఇది! రంగా! ఇలా ఇంతగా డీలా అయిపోయావు? మాలిని ఏది? నేను విన్న నీ కొడుకు విషయం నిజమేనా! అసలు ఏమి జరిగింది" అని అడిగాడు పరాక్రమ్


స్నేహితుని పట్టుకుని బోరుమన్నాడు రంగనాథ్.


"డబ్బుంటే ఏదైనా చేయగలను అనుకున్నాను. కానీ అది నిజం కాదని ఇప్పుడు, అంతా అయిపోయాక తెలిసింది. మావాడి గురించి ఎంతో దిగులుచెందింది మాలిని. నాతో ఎంత చెప్పినా నేను తన మాటలు పట్టించుకోలేదు. ఇక నాకు చెప్పడం అనవసరం అనుకుందేమో నిద్రమాత్రలు మింగి చనిపోయింది. నేను అదేమీ పట్టించుకోకుండా, పెద్ద క్రిమినల్ లాయర్ కి కాల్ చేసాను. 


కానీ ఆయన చేతులెత్తేశారు. మీవాడికి బెయిల్ కష్టం అన్నాడు. పోలీసు అధికారులతో కూడా మాట్లాడాను. వాళ్ళు కూడా అదే చెప్పారు.


చనిపోయిన అమ్మాయి తరపున అశేష జనవాహిని నిరసన వ్యక్తం చేశారు వివిధ మాధ్యమాల ద్వారా. నిన్నటినుంచి అదే వార్త అన్ని ఛానెళ్లలో. అందుకని కేసు గట్టిగా బిగుసుకుంది, ఏమీ చేయలేమన్నారు.


వాడిని పోలీసులు తీసుకెళ్లారు.


ఇలాఒక్కడిని బంగ్లాలో పిచ్చివాడిలా కూర్చున్నా! డబ్బుంటే ఏమైనా చేయొచ్చు అనుకున్నాను. కానీ చేసిన పాపాలు శాపాలుగా మారి కాటు వేస్తాయనుకోలేదురా!" అంటూ విలపించాడు. 


అతన్ని ఓదార్చి,.."మాలిని ఎక్కడ రా" అని అడిగాడు.


"బెడ్ రూమ్ లో" అని అటు చూపించాడు.


జయంతి పరుగెత్తి, రూం వద్దకు వెళ్ళింది

తలుపు దగ్గరగా వేసి ఉంది. తలుపు తోయగానే ఓపెన్ అయ్యింది. అక్కడ బెడ్ ఖాళీ. అంతటా వెదికింది మాలిని కోసం. ఎక్కడా కనిపించలేదు.


"ఏమండీ!" గట్టిగా అరిచింది


"ఏమైంది జయంతీ!" అంటూ పరుగున వచ్చాడు పరాక్రమ్, వెనుకగా రంగనాథ్.


బెడ్ వైపు చూపించింది. అక్కడ ఎవరూ లేరు. 

"నిజం చెప్పరా! మాలిని ఏదీ"


"అయ్యో! ఇక్కడే పొద్దున్నే చనిపోయి, కనిపించింది. ఇదిగో ఈ ఉత్తరం కూడా అక్కడ టేబుల్ పైన ఉంది" అటు చూస్తే లెటర్ కూడా లేదు.


"వీడికి మతి పోయిందా!" అనుకున్నాడు పరాక్రమ్.


ఇన్ని సమస్యలు ఒక్కసారిగా చుట్టుముట్టేసరికి మెదడు దెబ్బతిన్నట్టుందని అనుకున్నాడు.


"సరే లే! కానీనువ్వు పదా!మా ఇంటికి వెళదాం రా! కొద్దిరోజులు అక్కడే వుండు" అని అతన్ని తీసుకుని, కారెక్కారు.


పక్కన ఔట్ హౌస్ లో ఉంటున్న ముసలి వీరయ్యను పిలిచి, బంగ్లా చూసుకొమ్మని చెప్పి, బయలుదేరారు.


మాలిని ఏమయ్యింది?


తరువాత భాగం లో...


ఈ పార్ట్ చదివి మీ అభిప్రాయాలను తెలియజేయండి.

సశేషం

సుధావిశ్వం


=======================================================================

ఇంకా వుంది..

మార్పు - పార్ట్ 5 త్వరలో..

=======================================================================

సుధావిశ్వం ఆకొండి  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం:

కలం పేరు సుధావిశ్వం. పూర్తి పేరు అనురాగసుధ. వృత్తి లాయర్. ప్రవృత్తి రచనలు చేయడం. ట్రావెలింగ్ కూడా!

 కొన్ని నవలలు, కథలు వ్రాయడం జరిగింది.  ప్రస్తుత నివాసం ఢిల్లీ.




Comments


bottom of page