top of page

మార్పు - పార్ట్ 6

#SudhavishwamAkondi, #సుధావిశ్వంఆకొండి, #మార్పు, #Marpu, #TeluguSerials, #TeluguNovel, #TeluguDharavahika, #TeluguSerialEpisode


Marpu - Part 6/6 - New Telugu Web Series Written By Sudhavishwam Akondi

Published In manatelugukathalu.com On 12/04/2025 

మార్పు - పార్ట్ 6/6తెలుగు ధారావాహిక

రచన: సుధావిశ్వం ఆకొండి

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



జరిగిన కథ:

భాగవతంలోని పద్యాన్ని అపహాస్యం చేస్తాడు డైరెక్టర్ పరాక్రమ్.

అతని కొడుకు సాకేత్ వేగంగా కారు నడిపి యాక్సిడెంట్ కు గురై ఐ సి యు లో చేరుతాడు. పరాక్రమ్ లో కొంత మార్పు గమనించిన అతని తల్లి శారదమ్మ మంచి సినిమాలు తియ్యమని కొడుక్కి చెబుతుంది. ఆరోజే ఆమె మరణిస్తుంది. ఆమె మరణంతో పరాక్రమ్ లో కొంత మార్పు మొదలౌతుంది. పరబ్రహ్మ శాస్త్రి గారి మాటల ప్రభావం కూడా అతనిపైన పడుతుంది.

తన భార్య మాలిని ఆత్మహత్య చేసుకున్నట్లు చెబుతాడు రంగనాథ్. కానీ శవం కనిపించదు. మిత్రుడు అశోక్ సహాయం కోరుతాడు రంగనాథ్.



ఇక మార్పు ధారావాహిక పార్ట్ 6 చదవండి.


అశోక్ వెళ్ళిపోయాక, అలాగే సోఫాలో కూలబడిపోయాడు రంగనాథ్. జయంతి, పరాక్రమ్ అక్కడే కూర్చున్నారు.


"ఎవరు చేసి వుంటారు? అంతా గందరగోళం గా ఉంది" అన్నాడు పరాక్రమ్


"అవునండీ! మాలిని బ్రతికి ఉంటే బాగుండును. అన్నయ్యేమో తను చనిపోయింది చూసానంటున్నారు. అంతా అయోమయంగా ఉంది" అంది చెక్కిట చెయ్యి చేర్చి దీర్ఘాలోచన చేస్తూ


ఇంతలో...

పోలీసు కానిస్టేబుల్స్ తో ఎస్ ఐ రామబ్రహ్మం వచ్చాడు. అతడు ఆ ఏరియా ఎస్ ఐ. 


"సార్! మీ భార్య మాలిని గారిని మీరే హత్య చేసి, శవాన్ని మాయం చేసారని స్త్రీ సంఘం వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వచ్చాము" అన్నాడు


"అలా ఎవరండీ కంప్లైంట్ ఇచ్చింది. ఆవిడకు ఏమైందో అని మేము టెన్షన్ పడుతూ ఉంటే, ఈ గోల ఏంటి?" అన్నాడు కొంచెం తీవ్రంగానే పరాక్రమ్


"ఈయన ముద్దుగా 'లావెండర్' అని పిలుచుకునే హీరోయిన్ లావణ్య గారే కొందరు ఆ సంఘ సభ్యులతో వచ్చి, కంప్లైంట్ ఇచ్చారు. టీవీలో కూడా ఈయన గారి నిర్వాకాలు వినిపిస్తున్నారు" అన్నాడు అతడు


వెంటనే హాల్లో టివి ఆన్ చేశాడు పరాక్రమ్. 


అందులో ఏ ఛానెల్ లో చూసినా లావణ్య వ్యాఖ్యానాలు వస్తున్నాయి. 


'మీ టు' ఉద్యమం గురించి చెబుతూ తనను రంగనాథ్ ఎలా వాడుకున్నాడు? ఏం చేశాడు? ఒకటికి పది కలిపి, మసాలా జోడించి రెచ్చిపోయి చెబుతోంది ఆమె. 


అది చూసి హతాశులయ్యారు. అసలు రంగనాథ్ కు ఆమెతో ఎటువంటి సంబంధమూ లేదని పరాక్రమ్ కి తెలుసు. ఆమెనే అవకాశాల కోసం రంగనాథ్ ని ఆకర్షించేందుకు ఎంతో ప్రయత్నం చేసింది. ఇప్పుడు తను ఇటువంటి స్థితిలో ఉన్నాడని, అది అవకాశంగా తీసుకుని ఈవిడ ఇలా ప్రచారం చేస్తుందని అనుకున్నాడు పరాక్రమ్.


"కొంత ఎంజాయ్ మెంట్ లక్షణం ఉన్నమాట నిజమే కానీ! ఈవిడతో అలాంటి సంబంధం ఏమీ లేదు రంగనాథ్ కు" అన్నాడు పరాక్రమ్ స్థిరంగా ఆ ఎస్సై తో


"టీవీలో అంతే కదా ఇంకా జోడించి, చెబుతారు. ఛాన్స్ దొరికితే అవతలి వారిపై పగ తీర్చుకుంటారు" అన్నది జయంతి


"సార్! మీరు స్టేషన్ రావాలి. తర్వాత బెయిల్ అవి చూసుకోండి" అన్నాడు


"నా కూతురి బాధ్యత నీదేరా! నేను తండ్రి అనే బాధ్యతతో ఏమీ చేయలేక పోయాను. తల్లిదండ్రులను వృద్ధాశ్రమంలో ఉంచి కొడుకుగా చచ్చిపోయాను. భార్యను మనిషిగా కూడా చూడక భర్తగా చచ్చిపోయాను. భోగ లాలసుడనై పిల్లల్ని సరిగ్గా పెంచక తండ్రిగా చచ్చిపోయాను. నాలాంటి వాడు బ్రతకకూడదు. కానీ మీరు నన్ను చావనివ్వలేదు. జైలే నాకు సరైన శిక్ష" అంటుంటే అతడి కన్నుల్లోనుంచి నీళ్లు ధారాపాతంగా వర్షించాయి. ధైర్యంగా ఉండమని భుజం తట్టాడు పరాక్రమ్. రంగనాథ్ పోలీసుల వెంట నడిచాడు. 


    *****


 ఫ్లాష్ న్యూస్...


"ఇప్పుడే అందిన వార్త. స్టార్ రైటర్ రంగనాథ్ అరెస్ట్. భార్య మాలిని ని హత్య చేసి, శవాన్ని మాయం చేశాడని అభియోగంతో పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన పైన కంప్లైంట్ ఇచ్చి, అతని గురించిన రహస్యాలు విప్పిన హీరోయిన్ లావణ్య.


ఇంకా అప్ డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మా ఛానెల్..


ఇలా చెప్పుకుపోతోంది టివి యాంకర్. అందరూ ఒకేచోట కూర్చుని లంచ్ చేయడం అక్కడి వృద్ధుల అలవాటు. 


వృద్ధులు ఆయిపోయినా కొందరు మగవాళ్ళు ఎప్పటికప్పుడు వార్తలు చూస్తూ వుంటారు. అందరూ అలా కూర్చుని, చూస్తూ తింటున్నారు. 


ఆ న్యూస్ చూసిన రాఘవయ్య ముఖంలో రంగులు మారాయి. త్వరగా తినడం పూర్తి చేసి, తన గదిలోకి వచ్చాడు. 


"ఏమయ్యిందండీ! అలా వున్నారు?" అన్నది ఆందోళనగా జానకమ్మ


"ఏమీ లేదు జానకీ! ఓసారి మనం మనబ్బాయి దగ్గరకు వెళ్లి వద్దాం"


ఆ మాట విని హడలిపోయిన ఆవిడ..

"దేనికి? వాడు ఏమన్నాడు? డబ్బులు కావాల్సినంత కట్టేసాను. చచ్చేదాక ఇక్కడే ఉండండి. నా దగ్గరకు రావాలని చూడవద్దు అన్నాడుగా! మర్చిపోయారా?" 


"మర్చిపోలేదు. కానీ ఇప్పుడు మనం వెళ్లకపోతే వాడిని చూడలేమే!" అన్నాడు కన్నుల్లో నీళ్లు తిరుగుతుంటే


భర్తకు దగ్గరగా వచ్చి, భుజంపై చేయి వేసి...

"అసలేం జరిగిందండీ?" అని అడిగింది


తను న్యూస్ లో చూసిన విషయం చెప్పాడు. 


అది విన్న వెంటనే గబగబా బయలుదేరడానికి రెడీ అయ్యింది. 


"పదండీ!" 


అక్కడివారికి రెండురోజుల్లో వస్తామని చెప్పి, బయలుదేరారు. 


   ***** 

ఒక్కసారిగా తన జీవితంలో వచ్చిన మార్పులు తలుచుకుని బాధపడుతూ వున్నాడు రంగనాథ్.

"దేవుడా! ఎప్పుడూ నిన్ను నేనేమీ కోరలేదు. అసలు నువ్వున్నావనే స్పృహనే లేకుండా, పశువులా బ్రతికాను. ఇప్పుడు మాత్రం ఒక కోరిక కోరుకుంటున్నాను. నా మాలిని బ్రతికేటట్టు చూడు! ఈ గండం నుంచి గట్టెక్కించు! ఇక జీవితంలో మళ్లీ ఇలా బ్రతకను. ముందుగా కన్నీటితో నా తల్లిదండ్రుల పాదాలు కడుగుతాను. మాలినిని క్షమించమని వేడుకుంటాను. కొడుకుకి కౌన్సిలింగ్ చేయించి, వాడు మంచిగా మారేటట్టుగా చూస్తాను. నువ్వు చెప్పినట్టుగా మంచిగా బ్రతికే ఒక్క ఛాన్స్ ఇవ్వు తండ్రీ!" అంటూ మనసులో దేవుడిని వేడుకుంటున్నాడు. 


"మిమ్మల్ని చూడాలని ఎవరో వచ్చారు. మీరు అటు వచ్చి నిల్చోవాలి" అని చెప్పి వెళ్ళాడొక పోలీస్.


పరాక్రమ్ వాళ్లే అయి వుంటారు అనుకున్నాడు. వెళ్లి చూస్తే తన తల్లిదండ్రులు.


"రంగా! ఎలా అయిపోయావురా!" అంటూ ఆ తల్లి దగ్గరగా వచ్చి, తల పైన చేయి వేసి ఏడ్చింది. ఆ వెంటనే తండ్రి.


తల్లిదండ్రుల ప్రేమకు సాటి లేదు. తాను చేసిన నికృష్టమైన పనికి ఎవరైనా తిడతారు. కానీ తల్లిదండ్రులు బాధ పడతారు. ఎప్పటికీ బుద్ధులే చెబుతారు. 


"అమ్మా!" అంటూ మనసుదీరా ఏడ్చాడు. 


"ఒరే రంగా! నువ్వు ఏ హత్యా చేసి ఉండవురా! లాయర్ పేరు చెప్పు. నేను వెళ్లి మాట్లాడుతాను" అన్నాడు రాఘవయ్య


ఇంతలో అక్కడికి పరాక్రమ్, జయంతి లాయర్ తో వచ్చారు. బెయిల్ పేపర్స్ పైన సంతకం చేయించుకున్నారు. 


అశోక్ చేత మాట్లాడించారు. ఎస్ ఐ బెయిల్ ఇచ్చి, వదిలిపెట్టాడు. 


 రంగనాథ్ తల్లిదండ్రులను తీసుకుని ఇంటికి వచ్చాడు. ఇంటికి వెళ్లేసరికి ఎదురుగా మాలిని నవ్వుతూ కనిపించింది. 


ఒక్కసారిగా ఆశ్ఛర్యం, ఆనందం తాండవించింది రంగనాథ్ లో. 


"నువ్వు... నువ్వు బ్రతికే ఉన్నావా మాలినీ! అసలు ఏం జరిగింది" అన్నాడు సంభ్రమంగా.


"ముందు ప్రశాంతంగా కూర్చొని, అందరూ ఈ చల్లని మజ్జిగ తీసుకోండి. అన్ని వివరంగా చెబుతాను" అని అందరికి ఇచ్చింది మాలిని. 


చెప్పడం మొదలుపెట్టింది. 


"ఇదంతా జయంతి, మన అమ్మాయి రాఘవి కలిసి చేసిన ప్లాన్. పరాక్రమ్ అన్నయ్యకు కూడా తెలీదు. మీ వద్దకు వచ్చేటప్పుడు చెప్పిందట జయంతి. బషీర్ సంఘటన జరిగిన తర్వాత వీళ్ళు ప్లాన్ చేద్దామనుకున్నారుట. కానీ ఈ లోపే ఈ హత్యా సంఘటన జరిగింది. నేను నిజంగానే మాత్రలు మింగాను చనిపోవాలని. 


కానీ రాఘవి వచ్చి సేవ్ చేసింది. అప్పుడు మీరు ఫోన్ గొడవలో వున్నారు. తన ఫ్రెండ్ సాయంతో వెనక డోర్ నుంచి నన్ను తీసుకెళ్లి, మీ అమ్మవాళ్ళ దగ్గర సహాయకురాలిగా ఉంచింది. వాళ్లకు అన్నీ చెప్పింది. నేను కోలుకున్నాక వాళ్ళ ప్లాన్ గురించి చెప్పి ఒప్పించింది. 


అంతే కాదు. మీ ఇద్దరి ఫ్రెండ్ అశోక్ కి కూడా తెలుసు. ఆయన ఎంక్వయిరీ చేస్తే మరొక విషయం తేలింది. మనవాడు తాగి పడిపోయాడట అప్పుడు. అందులో డ్రగ్స్ యూజ్ చేశారట! అందుకే వాడికి అసలేం జరిగింది తెలియదు. ఫ్రెండ్స్ చెప్పిందే నిజమని అనుకున్నాడు. విచారణ లో పబ్ కి వెళ్లిన వాళ్లలో మన వాడి మిగతా ఫ్రెండ్స్ లో ఒకబ్బాయి అసలు విషయం చెప్పాడుట. హీరోయిన్ లావణ్య అక్క కొడుకు వేరే గ్యాంగ్ తో అక్కడే ఉన్నాడట. 


వీళ్లంతా తాగి పడిపోయాక ఎవరో అమ్మాయిని రేప్ చేసి, చంపేసి, గుర్తులు కొన్ని వీరున్న చోట వేసి పోయాడట లావణ్య అక్క కొడుకు. వీడు కూడా మత్తులో తను కూడా ఆ నేరం చేశాడని అనుకుంటున్నాడు. మనవాడు కూడా విడుదల అవుతాడు అని చెప్పాడు అశోక్" అని చెప్పుకుపోతోంది సంతోషంగా.


"హే భగవాన్! నిజంగా ఆర్తితో ప్రార్థిస్తే నువ్వు ఎంతటి దుష్టులనైనా కాపాడుతావు. నేను మారడానికి నాకు ఒక అవకాశం ఇచ్చావు. ఇప్పుడు నా జీవితాన్ని సక్రమమైన దారిలో నడిపిస్తాను" అని మనసులో నమస్కరించాడు.


రాఘవి వచ్చి అమ్మను, నాన్నను పలకరించింది. 


"రాఘవీ! మా నాన్న పేరు నీకు పెట్టినందుకు, తండ్రివై నాకు బుద్ధి వచ్చేట్టు చేశావు తల్లీ! నువ్వు నాకు కూతురివి కాదు అమ్మవు కూడా" అంటూ కూతురిని దగ్గరకు తీసుకొని నుదుటిపైన ముద్దు పెట్టాడు. 


"చూశావా అమ్మా! నాన్న మారతారు అంటే నా మాట కొట్టిపారేశావ్! ఇప్పుడు చూడు! నేనే గెలిచాను" అంది


అందరూ సంతోషించారు. కాసేపటికి అశోక్ రంగనాథ్ కొడుకు రఘుని తీసుకుని వచ్చాడు. 


"పరాక్రమ్! నీకు చెప్పినట్టుగా నేనే దగ్గరుండి ఎంక్వయిరీ చేయించా! ఆ లావణ్య అక్క కొడుకు తన గ్యాంగ్ తో జైల్లో పడ్డాడు" అనీ


"రంగా! ఇప్పటికైనా మీ వాడిని ముందుగా మైండ్ కి ట్రీట్ మెంట్ ఇప్పించాలి. అప్పుడు బాగు పడతాడు" అన్నాడు


"అశోక్ నీ రుణం తీర్చుకోలేనిది. ఎంతో సాయం చేశావు" అన్నాడు చేతులు పట్టుకుని


"అయితే ఒక మంచి ఆహ్లాదకరమైన సినిమా తీసి, రుణం తీర్చుకో!" అన్నాడు హాస్యంగా


"తప్పకుండా! ఇకనుంచి నేను, పరాక్రమ్ కలిసి కొత్త సంస్థ పెట్టి అలాంటి మంచి సినిమాలే తీస్తాను" అన్నాడు దృఢంగా


అందరూ సరదాగా గడిపారు. రఘుకి ట్రీట్ మెంట్ ఇచ్చాక కొద్దిరోజులకు నార్మల్ స్టేజ్ కి వచ్చాడు. తాతయ్య, నానమ్మల కథలు వింటూ, ఎన్నో తెలుసుకుంటూ నెమ్మదిగా మారిపోయాడు. ఆ తర్వాత బషీర్ ఎక్కడున్నాడో తెలుసుకుని, వాళ్ళను ఇంటికి రమ్మన్నారు. ఆ బషీర్ కూతురుతో రఘు పెళ్లికి అంగీకరించాడు. వాళ్ళూ సంతోషించారు. 


పరాక్రమ్, రంగనాథ్ ల జంట జయంతి,మాలిని పేరుతో జే.ఏం ప్రొడక్షన్స్ స్థాపించి, మంచి విలువలతో కూడిన అద్భుతమైన సినిమాలు తీసి మళ్లీ స్టార్ డైరెక్టర్, స్టార్ రైటర్ స్థాయికి వెళ్లారు. 


వారికి సన్మానం చేయడానికి ఒక సాహితీ సంస్థ ఆహ్వానించింది. ముఖ్య అతిథిగా కళాతపస్వి కే. విశ్వనాథ్ గారు విచ్చేసారు. ఆయన చేత ఆశీర్వాదం పొందారు. 


ఆ సభలో రంగనాథ్ ఉద్వేగపూరితమైన ప్రసంగం చేసాడు.


"అభిమానులు ఎప్పుడూ కూడా మాకు చెక్ పెడుతున్నట్టుగా ఉండాలి. ఏది తీసినా చూసి, మా అభిమాన హీరో, డైరెక్టర్ అయితే చాలు ఎలా వున్నా సినిమా చూడాల్సిందే! అనే భావన వుండకూడదు. సినిమావాళ్ళం పిచ్చిగా తీస్తే, ప్రేక్షకులు తాట తీస్తారనే భయం మాకుండాలి ఎప్పటికప్పుడు. అలా మీరు అభిమానించాలి. 


అప్పుడు ఎవరూ కూడా చెత్త సినిమాలు తీయడానికి ముందుకు రారు. లేదంటే దాని పర్యవసానం.... టీనేజ్ లో ఉన్న పిల్లలు బలి అవుతారు. వాళ్లకు తెలిసీ తెలియని వయసు. చెడుకు తొందరగా అట్రాక్ట్ అవుతారు. 

 స్వానుభవంతో చెబుతున్నాను" అంటూ ముగించాడు. కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి అతనికి. 


అక్కడ అందరూ కరతాళధ్వనులు చేసి, తమ సమ్మతి తెలియజేసారు.


=======================================================================

 ***శుభం***

ఈ ధారావాహికను ఆదరించిన పాఠకులకు మనతెలుగుకథలు.కామ్ తరఫున, రచయిత్రి సుధావిశ్వం ఆకొండి  గారి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము.

=======================================================================

సుధావిశ్వం ఆకొండి  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం:

కలం పేరు సుధావిశ్వం. పూర్తి పేరు అనురాగసుధ. వృత్తి లాయర్. ప్రవృత్తి రచనలు చేయడం. ట్రావెలింగ్ కూడా!

 కొన్ని నవలలు, కథలు వ్రాయడం జరిగింది.  ప్రస్తుత నివాసం ఢిల్లీ.




Comments


bottom of page