#SudhavishwamAkondi, #సుధావిశ్వంఆకొండి, #మార్పు, #Marpu, #TeluguSerials, #TeluguNovel, #TeluguDharavahika, #TeluguSerialEpisode

మార్పు - ధారావాహిక ప్రారంభం
Marpu - Part 1/6 - New Telugu Web Series Written By - Sudhavishwam Akondi
Published In manatelugukathalu.com On 09/03/2025
మార్పు - పార్ట్ 1/6 - తెలుగు ధారావాహిక
రచన: సుధావిశ్వం ఆకొండి
(ప్రత్యేకించి ఎవ్వరినీ ఉద్దేశించి వ్రాసినది కాదు. తల్లిదండ్రులకు తెలిసీ, తెలియకుండా ఆవారా గా తిరుగుతూ నేరాలు చేసి, పోలీసులకు పట్టుబడ్డప్పుడు ఫలానా సినిమాల్లో చూసి చేశాం అని పొగరుగా కొందరు టీనేజ్ పిల్లలు చెప్పిన సమాధానం, అది చూసినప్పుడు కలిగిన ఆవేదన నుండి ఈ నవలిక రాయాలనే సంకల్పం కలిగింది. )
ఎవడు ఏమనుకుంటే నాకేంటి? నా ఇష్టమున్నట్టు జీవించే హక్కు నాకుంది. ఒకరి కోసం నా ఇష్టాలను చంపుకునే అవసరం నాకు లేదు. నా కోరిక కోసం అవతలివాడు ఏమైపోతే నాకేంటి? నేను ఎలాగైనా మనీ సంపాదించాలి, లైఫ్ ని ఎంజాయ్ చేయాలి, అంతే!
ఇలాంటి ఆలోచనలు సమాజములో చాలామంది వ్యక్తుల్లో సర్వ సామాన్యం. కానీ మనిషి సంఘజీవి. ఒంటరిగా జీవించడం లేదు కదా! అందుకే 'లివ్ అండ్ లెట్ లివ్' అనే సిద్ధాంతం ఉంది కదా! మనమూ జీవించాలి, ఇతరులనూ జీవించనివ్వాలి. అంటే మన నడవడిక ద్వారా ఇతరుల జీవితం నాశనం కాకుండా ప్రవర్తించాలి.
అదే సామాజిక బాధ్యత. నేరాలు, ఘోరాలు జరిగితే నేరస్తులను పట్టుకోవడం పోలీసుల బాధ్యత అయితే శిక్షలు వేయడం కోర్టులు చేస్తాయి. కోర్టులు ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇస్తాయి. ప్రభుత్వం చట్టాలు చేసినా, వాటి అమలులో సరియైన కట్టడి లేకపోతే సమాజంలో నేరాలు పెరుగుతూనే ఉంటాయి.
తమ ఓట్లు మాత్రమే చూసుకోకుండా ఎక్కడ ప్రక్షాళన జరగాలి? అని ఆలోచించి, సమాజము పైన అత్యంత ప్రభావం చూపే రంగాలపై చక్కని నియంత్రణ కలిగి ఉండాలి. అటువంటి రంగాలలోముఖ్యమైనది సినిమా. సమాజంలోని అన్ని వర్గాలనూ అత్యంత ప్రభావితము చేసే ముఖ్య సాధనం ఇది.
ఒక పుస్తకం చదవాలంటే అంతో ఇంతో అక్షరజ్ఞానం ఉండి తీరాలి. అదే సినిమా చూడడానికి అయితే! కొన్నిసార్లు ఆయా భాష రాకపోయినా ఫర్వాలేదు. చూసి అర్ధం చేసుకుంటారు తద్వారా దాని ప్రభావం పడుతుంది. 'సర్వేంద్రియాణాం నయనం ప్రధానం' అన్నారు. మిగతా ఇంద్రయాల కంటే కన్ను మిన్న. ఎలాగంటే, కన్నుతో చూసిన దృశ్యం మనసు ఆకర్షించి, ముద్రిస్తుంది. దాని ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. కన్నులు మూసినా అదే కనిపిస్తుంది.
అటువంటి శక్తి వంతమైన దృశ్య మాధ్యమం సినిమా ఇండస్ట్రీ. అటువంటి ఈ రంగం ఎంత బాధ్యతతో కూడి ఉండాలి? అది లోపించినప్పుడు ఎన్నో ప్రమాదాలు జరుగుతాయి, కొన్ని జీవితాలే అతలాకుతలం అవుతాయి.
అశ్లీలమైన, హింసాత్మక మైన సినిమాలు చూస్తే పెద్దవారిలోనే వ్యగ్రత కలుగుతుంది కొన్నిసార్లు. అటువంటిది చిన్న పిల్లలు, టీనేజ్ పిల్లల విషయం వేరేగా చెప్పనక్కర్లేదు.
మరొక శక్తివంతమైన రంగం మీడియా. ఒకప్పుడు జర్నలిజం ఒక నిబద్ధతతో కూడి ఉండేది. కానీ ఇప్పుడు మనీ కోసం ఎంత దిగజారుడు స్థితికి అయినా దిగిపోయే వారున్నారు. టిఆర్పి కోసం ఏమైనా ప్రసారం చేస్తారు. పేపర్స్ లో వ్రాస్తారు. ఇక చెక్ పెట్టేవారు ఎవరు?...
మనీ సంపాదించవచ్చు కానీ మనుషుల జీవితాలను నాశనం చేస్తూ, సంపాదించడం ఎంత వరకు సబబు? మన వలన ఒకరు బాగుపడకున్నా పర్వాలేదు కానీ నాశనం కాకూడదు అని ఆలోచించాలి ప్రతి ఒక్కరూ. వారు ఏమి చేస్తున్నారో ఎప్పటికప్పుడు ఎవరికి వారు ఆత్మవిమర్శ చేసుకోవాలి.
అప్పుడే..
ఉన్నతమైన సభ్య సమాజం ఏర్పడుతుంది.
***
"అల వైకుంఠ పురములో నగరిలో ఆ మూలసౌధంబు దాపల..." పోతన భాగవతంలోని గజేంద్ర మోక్ష ఘట్టాన్ని కళ్ళకు కట్టినట్టుగా తన్మయత్వంతో చెప్పుకుంటూ పోతున్నారు పరబ్రహ్మ శాస్త్రి. అది వింటూ ఆనందతన్మయులు అవుతున్నారు శారదమ్మ, జయంతి.
అనుకోకుండా అప్పుడే ఇంట్లోకి వచ్చిన స్టార్ డైరెక్టర్ పరాక్రమ్ అది చూసి తల పట్టుకున్నాడు.
"అబ్బా! ఇంటికి వస్తే మనశ్శాంతి లేదురా బాబూ. వెధవ గోల" అనుకుంటూ
ఇతడు లోపలికి రావడం చూసిన పరబ్రహ్మ శాస్త్రిగారు చెప్పడం ఆపేశారు. దాంతో ఇహలోకం లోకి వచ్చిన శారదమ్మ..
"శాస్త్రి గారూ! ఏమైంది సడెన్ గా ఆపేశారు?" అంటూ ఆయన చూస్తున్న వైపు చూసింది. కొడుకు తల పట్టుకుని అక్కడే ఓ పక్కన సోఫాలో కూర్చున్నాడు.
"ఏరా! వచ్చావా? చాలా సంతోషం రా! ఇవ్వాళ త్వరగా వచ్చావు. తొందరగా ఫ్రెష్ అయి రా! నువ్వూ విందువు గానీ. చాలా అద్భుతమైన ఘట్టం రా!" అంది కొడుకుతో
కోడలితో...
"జయంతీ! నువ్వెళ్ళి వాడికి కాస్త కాఫీ ఇచ్చి రా! వెళ్ళు!" అని కోడలిని పంపింది
"శాస్త్రిగారూ! మీరు చెప్పండి. మంచి ఘట్టంలో ఆపేశారు. లక్ష్మీసహితుడైన స్వామి వచ్చి గజేంద్రుడిని రక్షించిన ఘట్టం ఎన్ని సార్లు విన్నా తనివి తీరదు. శరణాగతితో ప్రార్థిస్తే ఎలా కరుణిస్తాడో కదా! "
"మీ అబ్బాయి వచ్చాడు కదమ్మా! ఏమంటాడో? తనకు ఇవి నచ్చవు కదా"
"శాస్త్రి గారూ! మీరు వాడిని చిన్నగా ఉన్నప్పటినించి చూస్తున్నారు. మీ బిడ్డగా భావించి, వాడి కోపాన్ని పట్టించుకోకండి. ఎప్పటికైనా వాడిలో మార్పు వస్తుందేమోనని ఎదురుచూస్తూ వున్నాను. నా మొర ఆ దేవుడు ఎప్పుడు వింటాడో? మీరు నాపైన దయతో ఇలా వచ్చి భాగవతం వినిపించి నన్ను ధన్యురాలిని చేస్తున్నారు. అదే తృప్తి గా ఉంది. ఈ భాగవతం వింటూ ప్రశాంతంగా చనిపోతే అంతే చాలు నాకు " అంది శారదమ్మ
"అయ్యో! ఎంత మాట అమ్మా! మీ మామయ్య కాలం నుండి మీవారు ఉన్నంతవరకూ కూడా మాకెంతో సహాయం చేసారు. ఇప్పటికీ మీరు మమ్మల్ని ఎంతో ఆదరిస్తున్నారు. భగవంతుని గురించి నాకు చెప్పుకునే అవకాశం ఇచ్చి నన్ను ధన్యుడిని చేస్తున్నారు. అంతకంటే ఇంకా ఏమి కావాలి తల్లీ!" అని గజేంద్ర మోక్షం కొనసాగించారు.
"అలా దీన స్థితిలో ఉన్న గజేంద్రుడు నాకు నువ్వు తప్ప వేరే దిక్కు లేడు అని ప్రార్ధించగా, అది విన్న పరమాత్మ వైకుంఠంలో నుంచి అకస్మాత్తుగా లేచి, లక్ష్మీదేవితో పరచికాలు ఆడుతున్నవాడు అలాగే ఆ తల్లి కొంగు పట్టుకుని పరుగెత్తుకుంటూ వస్తున్నాడు. ఎవరితో ఏమీ చెప్పకుండా అని చెబుతూ...
"సిరికిన్ జెప్పడు, శంఖ, చక్రమున్ చేదోయి సంధింపడు, ఏ పరివారమున్ జీరడు, ఆకర్ణికాంతరథమిల్లము జక్కనొత్తడు, అభ్రకపతిన్ మన్నింపడు, వివాదప్రోత్తిత శ్రీకుచోపరిచేలాంచలమైన వీడడు గజ ప్రాణావనోత్సాహియై" అని చెబుతుండగా ...
ఫ్రెష్ అయి వచ్చి, అక్కడే కూర్చుని వింటున్న స్టార్ డైరెక్టర్ పరాక్రమ్ భార్య ఇచ్చిన కాఫీ తాగుతూ...
"ఆహా హా! చాలా బావుంది. ఎందుకు అలా పరుగెత్తుకుంటూ రావడం శాస్త్రిగారు? అక్కడ మాయమై ఇక్కడ ప్రత్యక్షమవుతారు దేవతలు అంటారు కదా! అయినా ఏ ఆయుధాలు లేకుండా వచ్చి ఎలా రక్షిస్తాడు? మిగతా దేవతలను పట్టుకురాలేక పోయాడా?" అంటూ హేళనగా మాట్లాడాడు.
"పరాక్రమ్! అలా అవహేళనగా మాట్లాడకూడదు. ఆయన ఎలాగైనా కాపాడగలడు. ఘటనాఘటన సమర్ధుడు. ఒక మహా భక్తుడు ఈ భాగవత పురాణాన్ని అనువదించి, ఆ పరమాత్మ దర్శనం పొందిన ధన్యుడు. ఇది వింటే మన పాపాలు పోయి, మంచి జరుగుతుందిరా! ఎందుకు రా నీకీ పైత్యం? డబ్బు సంపాదనలో పడి పిచ్చి పిచ్చిగా సినిమాలు తీస్తూ యువతను చెడగొడుతున్నావు. దేవతల పైన అపహాస్యంతో సినిమాలు తీస్తున్నావు? ఆ పనులు మానేయ్యరా! నా మాటలు వినరా! దీని ఫలితం అనుభవించాల్సి వస్తుందిరా" అంటూ ఆవేదనగా అంది శారదమ్మ.
"అయితే రామాయణం, భాగవతం తీయమంటావా? తీస్తే నేను చిప్ప పట్టుకోవాలి. ఎవడైనా చూస్తాడా అవి?
నీ చాదస్తపు మాటలు చెప్పకు, ఇక నేను వినను. ఇదిగో! నీ మాటలు వినే దీన్ని మెడకు తగిలించుకున్నాను. నా తమ్ముడి కూతురును చేస్కోరా అని అన్నావని. ఇదీ నీ దారే. పెళ్లై 20 ఏళ్ళు అయ్యింది. ఒక్కరోజు సంతోషం లేదు నా బతుకులో. మంచి డ్రెస్ సెన్స్ లేదు. హాయిగా ఇలా పార్టీలకు బాలీవుడ్ హీరోయిన్స్ లా లాంగ్ ఫ్రాక్స్ అన్నా వేస్కోవే అంటే వినదు. అందుకే నా కొడుకన్నా మీకు దూరంగా ఉంటే, హాయిగా ఎంజాయ్ చేస్తాడని హాస్టల్ లో పెట్టి చదివిస్తున్నా. లేదంటే మీలా దద్దమ్మలా తయారు అవుతాడు.
అయినా 'ఇలా సినిమా తీసావు' అంటూ తిడుతున్నావు. నేను సినిమా తీసాను, కానీ ఎవరినైనా చూడమని నేను బ్రతిమిలాడానా? లేదే! సినిమాను సినిమాగా మాత్రమే చూడాలి. ఒక ఎంటర్టైన్మెంట్ మాత్రమే ఇది. ఇదొక బిజినెస్ అంతే. నేనొక్కడినే తీస్తున్నట్టు మాట్లాడుతున్నావు. ఇంతకుముందు కూడా తీసేవాళ్ళు తీశారు. వీలున్నప్పుడే డబ్బు సంపాదించాలి. డబ్బు ఉంటేనే సెలెబ్రిటీ హోదా ఉంటుంది. ప్రతి ఒక్కడూ మన దగ్గర చేతులు కట్టుకుని ఉంటాడు.
ఈ శాస్త్రి గారు చెప్పిన ఈ పద్యం ఏదో బాగానేవుంది. కానీ అది రాసినాయన గురించి చాలా గొప్పగా చెప్పావు. అతడూ నాలాంటి రచయితనే. కానీ సంపాదించే తెలివితేటలు లేనివాడు.
ఇప్పుడు నేను సంపాదిస్తాను చూడు! నేను ఈ పద్యంలోని మొదటి పదం "సిరికిన్ జెప్పడు" అని పేరుబెట్టి సినిమా తీస్తే నా సామిరంగా! అదిరి పోతుంది. ఇదేదో భక్తి సినిమానేమో అని నీలాంటి ముసలాళ్ళు వస్తారు చూడడానికి. తన లవర్ కి తెలియకుండా ఇష్టం వచ్చినట్లుగా తిరిగే పాత్రలో హీరోను పెడితే యూత్ ఆడియన్స్ వెర్రెక్కిపోతారు. దెబ్బకు సూపర్ హిట్ అయ్యి, కోట్ల లాభం వస్తుంది" అన్నాడు ఆనందంగా
"ఒరేయ్ తప్పురా! ఇంకా ఇలాంటి పనులు చేసి పాపం మూట గట్టుకోకురా!"
అని ఎంత చెబుతున్నా, తల్లి మాట వినిపించు కోకుండా, బయటకు వెళ్ళిపోయాడు.
"పరమేశ్వరా! నువ్వే నా కొడుక్కి మంచి బుద్ధి ప్రసాదించాలి" అంటూ ఏడుస్తూ భగవంతుని ప్రార్ధించింది శారదమ్మ.
****
ఆ తరువాత పరాక్రమ్ తీసిన "సిరికిన్ జెప్పడు" సినిమా అఖండ విజయం సాధించింది. హీరో ఆడవాళ్ళని చూసి వెర్రెక్కి పోవడం యూత్ కి నచ్చింది. ఇదేమి సినిమా ఇలా భాగవత పద్యాన్ని ఇట్లా పెట్టి తీసాడు అన్న పెద్దవాళ్ళతో..
"అలాగైనా పిల్లలకు ఆ పద్యం తెలుస్తుంది కదా! అదో పెద్ద నేరంగా మాట్లాడతారు" అంటూ భాగవతాభిమానం మాకూ ఉందంటూ చెప్పారు కొందరు మోడరన్ పేరెంట్స్. కానీ వాళ్లకు పద్యం కన్నా ఆ సినిమా, అందులోని హీరో, హీరోయిన్స్, వాళ్ళ రొమాన్స్ తెలుస్తుంది, గుర్తుంటుంది కానీ భాగవతం అని ఎలా తెలుస్తుంది? వీళ్ళు చెప్పనే చెప్పరు కదా!
అలా ఎలాగైతేనేమి పరాక్రమ్ అనుకున్న కోట్ల డబ్బు లాభంగా వచ్చి చేరింది.
ఆ ఆనందంలో సెలవులకు ఇంటికి వచ్చిన, తన 18 ఏళ్ల కొడుకు సాకేత్ కి లక్షలుపెట్టి మంచి స్పీడ్ ఉన్న కారు కొని పెట్టాడు. వాడు ఆనందంగా లాంగ్ జర్నీ పెట్టుకున్నాడు ఫ్రెండ్స్ తో.
****
స్పీడ్ గా డ్రైవ్ చేస్తున్నాడు కార్ ని సాకేత్. ఫ్రెండ్స్ ఎంకరేజ్ చేస్తున్నారు. ఇంతలో ఇంకో కారు దూసుకు పోయింది వాళ్ళ కారును దాటుకుని.
ఫ్రెండ్స్ లో ఉన్న అమ్మాయిలు....
"అదేంటి సాకేత్! గొప్ప కారు అన్నావు. అంత స్లో గానా డ్రైవ్ చేసేది? ఆ కార్ కంటే మనమే ముందు వెళ్ళాలి. అంత గొప్ప కార్ పెట్టుకుని ఇంత స్లో గా వెళితే ఎంత షేమ్" అన్నారు
"అమ్మాయిల ముందు పరువు పోతుంది రా! కారును ఇంకా స్పీడ్ గా పోనియ్!" అన్నారు మగ పిల్లలు.
దాంతో ఇంకా రెచ్చి పోయిన సాకేత్, మరింత ఫాస్ట్ గా నడుపుతూ ఓ మలుపు తిరుగుతూ సరిగ్గా హ్యాండిల్ చేయలేక పోయాడు కారును. దాంతో కార్ చాలా స్పీడ్ గా వెళ్లి పెద్ద చెట్టును ఢీ కొట్టింది. కార్ డోర్స్ ఊడి అందరూ బయటకు పడ్డారు. కారు అద్దాలు గుచ్చుకున్నాయి అందరికి. ఎక్కడివారు అక్కడే స్పృహ కోల్పోయారు.
ఇంతలో ఆ దారిలో పోతున్న పెద్దమనిషి 108 కి కాల్ చేసి, వెళ్ళి పోయాడు. త్వరగానే అంబులెన్స్ లో హాస్పిటల్ కి తరలించారు వారిని. వారి దగ్గర దొరికిన ఫోన్స్ బట్టి, ఎవరో తెలుసుకుని పోలీసులు అందరి తల్లిదండ్రులకు కాల్ చేయడం మొదలు పెట్టారు.
****
ఫోన్ మోగింది. అప్పుడే తనకిష్టమైన కూర వండినందుకు భార్యను మెచ్చుకుంటూ తింటున్నాడు సంతోషంగా పరాక్రమ్. ఎప్పుడో ఒకసారి అలా మెచ్చుకుంటుంటాడు
పక్కనే ఉన్న ఫోన్ ఎత్తి...
"హలో! ఆ! నేనే! ఎవరూ మాట్లాడేది?" అని అవతలవారు చెప్పిన విషయం వినగానే ....
"ఓ గాడ్! అవునా!ఎక్కడా? ఏ హాస్పిటల్?" అంటూ అలాగే లేచి బయటకు పరుగులు తీసాడు.
"ఏమైందండీ? అంత అర్జంట్ పనేంటి? తినకుండా మధ్యలోనే చెయ్యి కూడా కడుక్కోకుండా వెళుతున్నారు" అంటున్న భార్య మాట వినిపించుకోకుండానే కారులో తనే డ్రైవ్ చేసుకుంటూ బయలుదేరాడు.
ఇంతలో లోపలినుంచి శారదమ్మ వచ్చింది.
"ఎక్కడికి వెళ్ళాడు వీడు? తిన్నాడా? లేదా?" అని అడిగితే
"తెలియదు అత్తయ్యా! ఏమీ చెప్పకుండా, కనీసం తింటున్న చేయి కూడా కడుక్కోకుండా వెళ్తున్నారు అత్తయ్యా! ఏమిటో ప్చ్! ఈ సంపాదనలో పడి ఇలా తయారయ్యారు" అంది చింతిస్తూ
"ఇంకేదో ధనలాభం వచ్చిందేమోలే!" అంటుండగా మేనేజర్ పరాంకుశం వచ్చాడు.
"అమ్మా! సాకేత్ బాబుకు ఆక్సిడెంట్ అయ్యింది. హాస్పిటల్ లో వున్నాడు. పదండమ్మా! పోలీసులు నాకు కాల్ చేశారు. డైరెక్టర్ గారికి కూడా చెప్పారట" అన్నాడు.
ఆ మాట విని కుప్పకూలిపోయారు అత్తకోడళ్లిద్దరూ. కాసేపటికి తెప్పరిల్లి ఏడుస్తూ ఇద్దరూ మేనేజర్ వెంట బయలుదేరారు.
=======================================================================
ఇంకా వుంది..
మార్పు - పార్ట్ 2 త్వరలో..
=======================================================================
సుధావిశ్వం ఆకొండి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం:
కలం పేరు సుధావిశ్వం. పూర్తి పేరు అనురాగసుధ. వృత్తి లాయర్. ప్రవృత్తి రచనలు చేయడం. ట్రావెలింగ్ కూడా!
కొన్ని నవలలు, కథలు వ్రాయడం జరిగింది. ప్రస్తుత నివాసం ఢిల్లీ.
Comments