top of page

మార్పు

Writer: Neeraja PrabhalaNeeraja Prabhala

#NeerajaHariPrabhala, #నీరజహరిప్రభల, #మార్పు, #Marpu, #TeluguKathalu, #తెలుగుకథలు


Marpu - New Telugu Story Written By Neeraja Hari Prabhala

Published In manatelugukathalu.com On 27/02/2025

మార్పు - తెలుగు కథ

రచన: నీరజ హరి ప్రభల 

(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)


వీరేంద్ర మంచం మీద పడుకున్నాడన్నమాటే గానీ అతనికి కంటిమీద ఏమాత్రం కునుకు రావట్లేదు. మాటిమాటికి పొలంలో ఆమె మాట్లడిన మాటే గుర్తుకు వస్తోంది. మనసంతా చాలా అల్లకల్లోలంగా ఉంది. 


"ఇవాళ ఆమె, రేపు మరొకరు..ఇలా ఎవరో ఒకరు విమర్శిస్తూనే ఉంటారు అని తనెందుకు మనసును నిబ్బరంగా ఉంచుకోలేకపోతున్నాడు. నాలో ఉన్న ధైర్యం అంతా ఏమైంది? లతను పెళ్లిచేసుకునేటప్పుడు చూపించిన ధైర్యం, తెగువ ఇప్పుడేవి? ఆమె మాటలకు తిరిగి సమాధానం ఎందుకు ఇవ్వలేకపోయాను ?" అని ఆలోచిస్తూ ఆత్మ విమర్శన చేసుకుంటున్నాడు వీరేంద్ర. 


పల్లెటూరివాడు, వ్యవసాయదారుడు అయిన తనకు పిల్లనిచ్చి పెళ్లి చేయటానికి ఎవరూ ముందుకు రాలేదు. పెళ్లిళ్ల పేరయ్య ద్వారా తనకు ఎన్నో సంబంధాలు చూశారు తన తల్లిదండ్రులు. కానీ వ్యవసాయదారుడు, పల్లెలో కాపురం, పైగా తల్లి తండ్రులను పోషించే బాధ్యత తన మీదే ఉన్నందున వీటన్నింటికీ సిధ్ధపడి తనను పెళ్లిచేసుకునేందుకు ఏ అమ్మాయి ఇష్టపడలేదు. వీటన్నింటికీ ఒప్పకుని మనస్ఫూర్తిగా ఇష్టపడి తనని పెళ్లి చేసుకుంది లత. 


చిన్నప్పుడే లతకు తల్లి తండ్రులు యాక్సిడెంట్ లో పోయారు. మేనమామ రామయ్య లతను చేరదీసి పెంచాడు. మేనమామ భార్య శాంతమ్మకు లతను చేరదీయడం ఏమాత్రం ఇష్టంలేదు కానీ లత తల్లితండ్రులకు సంబంధించిన ఇల్లు లతకే చెందుతుంది కనుక ఎలాగోలా లతనుంచి ఆ ఇంటిని తీసుకోవచ్చని దురాలోచనతో ఆవిడ సరేనంది. దానికి తోడు లత పెద్దయ్యాక ఆమెకు పెళ్లి చేసేవరకు తనకు చేదోడువాదోడుగా ఇంటిపని, వంటపని ఆమె చేత చేయిస్తే తనకు పనిమనిషి, వంటమనిషి అవసరం ఉండదని ఆమె భావన. 


దురదృష్టవశాత్తు కొన్నాళ్లకు లతకు పోలియో వచ్చింది. లత చాలా అందంగా ఉంటుంది. లత పెరిగి పెద్దవుతున్నకొద్దీ స్వతహాగా ఉన్న మంచితనానికి తోడుగా నిదానం, ఓర్పు ఆమెకు ఆభరణాలయ్యాయి. అత్తయ్య, మామయ్య చెప్పిన పనులన్నీ తూచా తప్పకుండా చేస్తూ ఎంతో ఒదిగి ఉంటున్నా శాంతమ్మకు ఏమాత్రం తృప్తి లేకపోగా ఇంకా ఇంకా ఏదోవిధంగా సాధించుకు తింటూ నానా ఈసడింపు మాటలు మాట్లాడేది. అవన్నీ వింటూ, వాటినన్నిటిని భరిస్తూ మౌనంగా తనలో తనే కుమిలిపోయేది. తను నమ్మిన దేవుడు తనకు ఎప్పటికయినా మంచి చేస్తాడు అని అనుకుని తన మనసులోనే ఆ భగవంతుడికి తన బాధలను మొరపెట్టుకుని ప్రార్ధించేది. రామయ్యకు తన భార్య గయ్యాళితనం తెలుసు కనుక మౌనం వహించి ఆవిడ కంటపడకుండా లతను ఓదార్చేవాడు. శాంతమ్మ కూతురు సరళకు కూడా తల్లి స్వభావమే వచ్చింది. ఆమె లతను చాలా హీనంగా చూస్తూ నిత్యం అన్నింటా ఆమెను అవమానిస్తూ మనసులో సంతోషపడేది. 


లతకు పెళ్లి చేసి ఆమెకు ఈ నరకం నుంచి విముక్తి లభించాలని భావించి రామయ్య లతకు పెళ్లి సంబంధాలను చూశాడు. ఆయనకు వీరయ్య సంబంధం నచ్చడం, ముఖ్యంగా లత వాళ్లకి బాగా నచ్చడం, ఆమె శారీరక లోపాన్ని వాళ్లేమాత్రం ఎత్తిచూపకపోవడంతో చాలా సంతోషించి లతను వీరయ్య కిచ్చి పెళ్లి చేస్తే ఆ ఇంట్లో అన్నా లత సుఖపడుతుంది అని లతను వీరయ్య కిచ్చి పెళ్లిచేశాడు రామయ్య. లతకు సంబంధించిన ఇంటిని తను దక్కించుకుకోవాలన్న స్వార్థంతో ఇన్నేళ్లుగా లతను పోషించి, ఇప్పుడు ఆమెకు పెళ్లి చేస్తున్నందుకు లతను ఒప్పించి ఆ ఇంటిని తన పేరుకి మార్పించుకుంది శాంతమ్మ. ఇన్నేళ్లూ వాళ్లు తనని చూసినందుకు వాళ్లకు కృతజ్ఞతతో, తండ్రిలా రామయ్య మీద ఉన్న ప్రేమాభిమానాలతో అందుకు ఒప్పుకుని ఆ ఇంటిని శాంతమ్మ పేరుమీద మార్చింది. ఆ తర్వాత లత, వీరేంద్రల పెళ్లి జరగడం, లత అతనితో ఆ ఇంటికి కాపురానికి రావడం, భర్తతో అన్యోన్యంగా ఉండడం, ఎలాంటి పొరపొచ్చాలు లేకుండా ఆ ఇంట్లో అందరితో కలిసిపోవడం జరుగుతోంది. 


తన ఇంటివిషయాన్ని లత తన భర్తతో, అత్తమామలతో చెప్పగా మంచి మనసుగల వీరేంద్ర, అతని తల్లి తండ్రులు లత ఔదార్యానికి, మంచి మనస్సుని మెచ్చుకుని ప్రేమతో మరింత అక్కున చేర్చుకుని ప్రేమగా చూసుకుంటున్నారు లతని. 


ఏదో అలికిడి కాగా వీరేంద్ర తృళ్లిపడి తన ఆలోచనలకు స్వస్తి చెప్పి కళ్లు తెరిచి చూశాడు. గదిలోకి వస్తున్న లత కనిపించింది. నిర్మలమైన ఆమె అందమైన ముఖాన్ని చూశాడు. మనసంతా ప్రేమతో నిండగా ఇందాక తను ఆమెని విసుక్కున్న తీరుకి పశ్చాత్తాప పడ్డాడు. తన ప్రేమదేవత లత. అలాంటి లతని ఇవాళ పొలంలో ఆమె ఎవరో, ఏదో అన్నదని తను లతని విసుక్కోవడం ఎంతపిచ్చి పని? అనుకుని "లతా" అని ప్రేమగా పిలిచి చేయి చాపాడు వీరేంద్ర. భర్త ప్రేమపూర్వక పిలుపుకి మనసంతా వేయివీణలు మ్రోగగా సంతోషంగా నవ్వుతూ అతని కౌగిలిలో గువ్వలా ఒదిగిపోయిన లతను మరింత ప్రేమగా తన గుండెలకు హత్తుకుని ఇందాక తన చర్యకు మనస్ఫూర్తిగా లతకు క్షమాపణ చెప్పాడు వీరేంద్ర. నవ్వుతూ భర్తను ప్రేమగా హత్తుకుంది లత. 


ఇంక ఎప్పుడూ, ఏనాడూ లతని బాధపెట్టకుండా ఆమెని కడదాకా ప్రేమతో చూసుకోవాలని, ఆమెతో చక్కగా సంసారం చేసుకుంటూ బిడ్డలను కని, భవిష్యత్తులో తమ బిడ్డలను చక్కగా పెంచుకోవాలని మనసులో నిర్ణయించుకుని ఆరాత్రి హాయిగా నిద్రపోయాడు వీరేంద్ర. 


తెల్లవారగానే తన నిర్ణయాన్ని తన భార్యకు, తల్లిదండ్రులకు చెప్పాడు వీరేంద్ర. కొడుకు చెప్పినదానికి మనస్ఫూర్తిగా సంతోషించి ఆ భగవంతుడికి కృతజ్ఞతలు తెలుపుకున్నారు వీరేంద్ర తల్లితండ్రులు. భర్త చెప్పినది విని లత మనస్సులో ఆ భగవంతుడికి కృతజ్ఞతలు తెలిపి సంతోషం తో భర్త, అత్తమామల పాదాలకు నమస్కరించింది లత. వాళ్లు ప్రేమతో లతను గుండెలకు హత్తుకున్నారు. 


.. సమాప్తం .. 


-నీరజ హరి ప్రభల

Profile Link


Youtube Playlist Link









 
 
 

Comments


bottom of page