కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.
Video link
'Marriages Are Made With Business' New Telugu Story Written By A. Annapurna
రచన: ఏ. అన్నపూర్ణ
బళ్ళు ఓడలు , ఓడలు బళ్ళు కావడం అంటే ఇదేనేమో...
ఈ రోజుల్లో అబ్బాయి పెళ్ళికి ఎన్ని అవస్థలు పడాలో సరదాగా వివరించారు ప్రముఖ రచయిత్రి అన్నపూర్ణ గారు.
ఈ కథ మనతెలుగుకథలు. కామ్ లో ప్రచురింప బడింది.
మీకు చదివి వినిపిస్తున్నది మీ మనోజ్.
ఇక కథ ప్రారంభిద్దాం
''అమ్మా ! ఈ రోజు ఇంద్రాణి గారి ఇంటర్ వ్యూ వుంది. వెడుతున్నాను .''అన్నాడు మణిదీప్ .
''అవును గుర్తువుంది, జాగ్రత్త. పొగరుగా సమాధానం చెప్పకు. వినయంగా వుండు. తెలిసినవి సరిగా చెప్పు. తెలియనివి ఉంటే 'తెలుసుకుంటాను' అని చెప్పు. గుడ్ లక్!" అంది రత్నావతి .
''ఆల్ ది బెస్ట్ ''అన్నాడు తండ్రి పరశురామ్.
''ఇప్పటికి పదిహేను సంబంధాలు చూసాం. అనుభవం ఐతే బాగానే వచ్చింది. మరి అమ్మాయి మదర్స్కి ఎందుకు నచ్చటం లేదో! అసలు చేసుకునే అమ్మాయి వరకూ వెళ్ళడమే లేదు. '' మణి బయటకు వెళ్ళాక దిగులుగా అంది రత్నావతి.
''ఏమి చెప్పగలం? టైము రావాలి ''అన్నాడు పరశురామ్.
''ఇదైనా కుదరాలి. ఏ ఇంటికి అల్లుడు అవుతాడో.. వాడు చేసిన పూజలు ఫలించి ఈ ఇంద్రాణి ఎస్స్ అంటే బాగుండును. ''
''దానితో ఎక్కడ అవుతుంది? ఆతర్వాత అమ్మాయి ఇంటర్ వ్యూ ఉంటుంది... ''
''అదేలేండి. రెండు గండాలు గడచి పెళ్లిదాకా రావాలంటే మాటలా ఈరోజుల్లో. అబ్బాయికి పెళ్లిళ్లు కుదరడం అంత సులువుకాదు. అమ్మాయికి తల్లి తండ్రి అవడం చేసుకున్న పుణ్యం ''
''ఆ జోతిష్కుడు ఈ ఏడాది అవుతుంది అన్నాడు. దిగులుపడకు ''
''వాళ్ళు చెప్పడానికేం ....అలాగే చెబుతారు. అంతా బిజినెస్ ''.
మణిదీప్ ఇంద్రాణి ఇంటిముందు కారుదిగి ఓసారి జుట్టు, డ్రెస్ సర్దుకుని కాన్ఫిడెన్స్ తో గేటు తీసుకుని కాలింగ్ బెల్ ప్రెస్ చేసాడు. పదిహేను నిముషాలకి తలుపు తెరుచుకుంది. పనివాడు వివరాలు, id చెక్ చేసి సోఫాలో కూచో బెట్టాడు.
మరో పది నిముషాలకి ఇంద్రాణి మేడదిగి వస్తూ ''హాయి మణిదీప్.. హౌ ఆర్ యు ? ఏదైనా డ్రింక్ తీసుకుంటావా నాతోబాటు.. ఎటూ ఈవినింగ్ కదా !" అంది. సోఫాలో కూర్చుని అతన్నికూడా కూర్చోమని చెప్పింది.
''విత్ ప్లెజర్ ''అన్నాడు మణిదీప్ వినయంగా.
వెంటనే పనిపిల్ల గ్లాసులు, విస్కీ, సోడా బాటిళ్లు తెచ్చి పెట్టింది.
మణిదీప్ రెండు గ్లాసుల్లో అవి సర్ది చీర్స్ చెప్పాడు. (ఇలా చేసి ఇంప్రెస్స్ చేయచ్చు అని ఫ్రెండ్ ఒకతను చెప్పేడు సలహా).
ఇంద్రాణి కూడా చీర్స్ చెప్పి థాంక్స్ అంటూ సిప్ చేసింది.
''మేమ్... నా వివరాలు మీకు తెలిసినవే . ఇంకేమి అడుగుతారో అడగండి.'' అన్నాడు వినయంగా .
''నీకు కూడా కొంత అనుభవం వుంది. నా పధ్ధతి చెబుతాను.
ఇప్పుడు నువ్వు వర్క్ చేసే చోటు నుంచి మా కంపెనీకి మారాలి... ఈ పెళ్లి కుదిరితే.!
నువ్వు కావాలంటే మీ వాళ్ళ ఇంటికి వెళ్ళు. కానీ మేము ఎవరమూ రాము.
మా బంధువులు ఎవరో పెళ్లిళ్లు.. ఏవో ఫంక్షన్స్ అంటూ పిలిచారు.. వెళ్ళాలి..... అంటూ మమ్మల్ని విసిగించకూడదు.
మా బంధువులు స్నేహితుల ఇంట్లో ఫంక్షనకి మాత్రం తప్పనిసరిగా నువ్వు రావాలి.
నీ ఇంటిపేరు మార్చుకోవాలి. పెళ్లి కాగానే మా ఇంటిపేరు నీకు వస్తుంది.
మా అమ్మాయి కోసం నువ్వు కొన్నది ఫ్లాట్.. విల్లాయా ....ఎక్కడుంది?
ఇలా గుక్క తీసుకోకుండా అడిగింది ఇంద్రాణి.
''ఎస్ మేమ్ ....నేను మీ కంపెనీకి మారుతాను. మీ కండిషన్లకు ఒప్పుకుంటున్నాను.
నేను గచ్చిబౌలి ''భూజ్లో'' ఫోర్ బెడ్ రూమ్ ఫ్లాట్ కొన్నాను ప్రస్తుతానికి.(దానిఖరీదు 5 కోట్లు)
''ఓకే ! మీ డాడ్ నీకు ఇచ్చే ప్రాపర్టీ ఏమిటి? అది లాండా ? విల్లా నా ...మనీయా ఇంకేదైనానా!
దీనికి సమాధానం మణిదీప్కి తెలియదు. అమ్మ చెప్పిన విషయం గుర్తువచ్చి .."ఐ'యాం సారీ మేమ్...'తెలుసుకుంటాను'' అన్నాడు.
''పెళ్లి చేసుకోడానికి సిద్ధం ఐనప్పుడు ఈవివరాలు అడుగుతాం తెలియదా ? తెలుసుకోవాలి..మొదటే. ఇంటికెళ్లి అడిగివస్తాను. మా డాడీకి ఫోనుచేసి అడుగుతాను ... ఇలాంటి జవాబులు మాకు నచ్చవు.
నీ ఇంటర్వ్యూ ....ఫెయిల్ . కానీ నువ్వు నచ్చావు . నీ చొరవ ...నీ వినయ విధేయతలు నచ్చాయి. కనుక నీకు టైం ఇస్తున్నాను. నువ్వు నా వరకూ ఓకే.
మా అమ్మాయితో ఇంటర్వ్యూ డేట్ ఎప్పుడో ఫోన్ మెస్సేజ్ ఇస్తాను. అప్పుడు నేను అడిగిన ప్రాపర్టీ డీటైల్స్ ఇవ్వాలి. మైండ్ ఇట్. ఎనీ వె కంగ్రాట్యులేషన్స్ .'' అంటూ లేచి నిలబడి షేక్ హ్యాండ్ ఇచ్చింది ఇంద్రాణి.
మణిదీప్ సంతోషంతో ఇంటికి బయలుదేరాడు. వెంటనే గుడ్ న్యూస్ మెస్సేజ్ పెడదాం అనిపించినా ఇంటికెళ్లి పంచుకుందామని కంట్రోల్ చేసుకున్నాడు. ఆతృతగా ఎదురు చూస్తున్న అమ్మ నాన్నలకు ఇంటికి రాగానే చెప్పి ఆనందం పంచుకున్నాడు.
''హమ్మయ్య ! ఒక గండం గడిచింది. ఇంద్రాణిగారు ఏమి అడిగింది? అడిగాడు పరశురామ్.
''అక్కడ జరిగింది చెప్పాడు.
'' ఇంతవరకు మనకు వచ్చిన సంబంధాలలో ఎవరూ నువ్విచ్చే ప్రాపర్టీ గురించి అడగలేదు. సారీ డాడ్..” అన్నాడు.
''దానికేం .మనం అన్నిటికి రెడీ కావాలి. నీ తమ్ముడికి చూసినపుడు పనికివస్తుంది కదా!
నేను ఇంతవరకు ఆలోచన చేయలేదు. ఇప్పుడే అన్ని రెడీ చేస్తాను. ''అన్నాడు పరశురామ్.
''మరి ఇంటిపేరు మార్చుకోడం సంగతి? మీకు బాధ కలిగిస్తున్నానా...?
''పర్వాలేదు. మనకి లెసన్..ఇలాకూడా జరగవచ్చు అని.! నీ పెళ్లి ఐతే అదే చాలు.'' అన్నాడు పరశురామ్.
మణి తన రూంలోకి వెళ్ళాక ,
''ఇన్నాళ్లు పెళ్లి కుదరలేదని బాధపడ్డాను.తీరా ఇప్పుడు ఆడపిల్లల తల్లులను చూస్తుంటే చాలా విచిత్రంగా వున్నారు. రోజులు ఇలా మారిపోయాయి ఏమిటో అర్థం కావడం లేదు. ఇంతకీ అన్నీ కుదిరిన తర్వాత ఏమి లాభం.. కోడలు మన ఇంటికి రాదు. మన మణి వాళ్ళ కుటుంబంలోకి వెడతాడు.''అంది రత్నావతి.
''తెలిసింది రత్నా ....పూర్వము ఎప్పుడో ఇల్లరికం అని పేదవారి అబ్బాయిలను ధనవంతులు వాళ్ళ అమ్మయి తో పెళ్లిచేసి వాళ్ళ ఇంటికే తీసుకు పోయేవారుట. మా తాతగారు చెప్పేవారు. ఇప్పుడు ఇంకా తెలివిమీరి ఇంటిపేరు కూడా మారుస్తున్నారు అన్న మాట. ఇప్పుడు రిచ్ పూర్ అనే తేడాలేదు. '' పరశురామ్ గొంతు రుద్ధమైంది.
''ఊరుకోండి. మణికి పెళ్లి ఐ, వాడు సుఖపడితేచాలులెండి. మనదేముంది....అంటూ మళ్ళీ సర్దుకుంది రత్నావతి .
మర్నాడే పరశురామ్ తన ఆస్తి పాస్తులు బ్యాంకు డిపాజిట్లు స్టాక్స్ పెట్టుబడి మొత్తం నాలుగు వాటాలు వేసాడు.రిజిస్టర్ చేసి పెట్టాడు.
పరశురాంకి తాతలనాటి స్థలం వుంది. అది జూబ్లీ హిల్స్లో ఉండబట్టి మంచి ధర వచ్చింది. నిజాయితీగా కష్టపడి లెక్చరర్గా సంపాదించాడు.ఇద్దరి కొడుకులకు మంచి చదువులు వచ్చాయి. రూపాయి డొనేషన్ కట్టలేదు.
మణిదీప్ CA చదివి ఆడిటర్గా పనిచేస్తుంటే రెండవవాడు సందీప్ డాక్టర్ అయ్యాడు. లండన్ లో వున్నాడు.
ఇంద్రాణి ఆలోచనతో ప్లాన్ చేసింది . తన కంపెనీకి ఆడిటర్గా ఇంటికి అల్లుడిగా మణిదీప్ను తెచ్చుకుంటే అడ్డువుండదు.
సంపదకు తోడు అవుతూనే ఉంటుంది కంపెనీ వృద్ధి చేయచ్చు తర తరాలకు తరగని ఆస్తి పెరుగుతూనే ఉంటుంది.ఒక్కటే కూతురు. ఇన్కమ్ టాక్స ఆఫీసర్.
భర్త ఐ పీ ఎస్ . ఆయన ఉద్యోగంలో అధికారం చలాయించ గలడు. కానీ ఇంటి దగ్గిర అధికారం ఇంద్రాణిదే!
తండ్రి దగ్గిర వ్యాపార మెళుకువలు నేర్చుకుంది. చదివింది డిగ్రీయే ఐనా అపారమైన తెలివితో ఎవరినైనా తన దారికి తెచ్చుకోగలదు.
ఆలా మణిదీప్ ఆమె దృష్టిలో పడ్డాడు. మణిదీప్ చదువులో తెలివిగలవాడే కానీ మనుషులను సరిగా అంచనా వేయలేడు.
అందులో ఈ సంబంధం పరశురామ్ చూసిందే. ఏ సంబంధమూ కలిసిరాక ఇంద్రాణి సంబంధానికి సిద్ధపడ్డాడు, ఆవిడ చాల పెద్ద పొజిషన్లో ఉన్నప్పటికీ.
ఇంద్రాణి ఇంటర్వ్యూ పూర్తి చేసిన వారానికి కూతురు రజిత నుంచి ఇంటర్వ్యూ కి పిలుపు వచ్చింది.
ఇక ఈ రజిత ధాటికి తట్టుకోవాలి. ఇంతవరకూ కుటుంబం చదువు ఇంద్రాణి చూస్తే మరి జీవిత భాగ స్వామిగా రజిత ఎలావుంటుందో అని అనుకున్నాడు మణిదీప్.
ఇప్పుడు రజితను కలుసుకుంటున్నాడు కాబట్టి ట్రిమ్గా తయారయ్యాడు.పెళ్లి చూపులకు వెళ్ళినపుడు అమ్మాయిలను కలుసుకునేటప్పుడు బిహేవియర్ ఎలా ఉండాలి.. ఎలా డ్రస్ అప్ అవ్వాలి.. మేకప్ హావభావాలు ఇలా మూడు నెలలు ట్రైనింగ్ ఇచ్చే సెంటర్ కి వెళ్లి నేర్చుకున్నాడు. అందులో కుటుంబాలనుబట్టి కూడా పద్ధతులు ఉంటాయి.
ఇలా ఎన్నో పాట్లు పడాలి అబ్బాయిలు. ఇంద్రాణిని వాళ్ళ ఇంట్లో కలిస్తే రజిత బయట గార్డెన్లో కలుద్దామంది. ఆమె పిలిచిన గార్డెన్కి వెళ్ళాడు.
''హలో నేను రజిత అని చేయి చాపింది.''
"నేను మణిదీప్" అన్నాడు ఆమె చేయి అందుకుని.
"రండి మిస్టర్ దీప్. ఇలా నడుస్తూ మాటాడుకుందాం...." అంటూ నడిచింది.
మణి "అలాగే ..." అంటూ అనుసరించాడు.
''మీ గురించి మాం చెప్పింది అనుకోండి... చాలావరకూ మామ్ కు నచ్చితే నాకూ ఓకే . ఇక మనకు సంబంధించి నేను చెప్పినట్టు వినాలి. నేను ఇలా వుంటాను.. నువ్వెలా ఉంటావు?.. నాకు ఆలా నచ్చదు .
ఇవే కదా తెలుసుకునేవి. ఈ పెళ్లి జరగడం కోసం మీరు నా కండిషన్స్ ఒప్పుకుంటారు.
ఇక పెళ్లి జరిగిన కొంత కాలానికిగాని రియల్ లైఫ్ ఏమిటో తెలుసుకోలేము.
ఇదంతా నాకు ఈ వయసుకే ఎలా తెలిసింది అంటారా ....నా ఫ్రెండ్స్ వలన.!
స్టేటస్ స్టామినా సెక్యూరిటీ మనీ ఉంటే జీవితం బాగా గడిచిపోతుంది....అనుకోలేం.
ఆలా అని ఆనాలుగు లేనివాళ్లు కూడా సుఖపడలేరు. మనిషి మనస్తత్వాన్ని బట్టి కూడా ఉండచ్చు. ఏమంటారు?"
రజితలో కొత్తకోణం కనబడుతోంది.
తల్లి ఇంద్రాణికి వ్యతిరేకంగా వుంది. బహుశా తండ్రిగారి పోలిక కావచ్చు.
''రజితా! మీరు కొత్త విషయాలు చెబుతున్నారు. నిజమే మనం ఇప్పుడు ఒకలా ఇద్దరం కలసి జీవితం ప్రారంభించినపుడు వేరొకలా ఉండవచ్చు. నాకోసం మీరు - మీ కోసం నేను సర్దుకుపోవచ్చు లేదా మనలో వేరుగా ఆలోచనలు రావచ్చు. అది ఇప్పుడు తెలియదు.
నౌ వాటీస్ యువర్ ఒపీనియన్ ?”
''ఏమీలేదండీ....పెళ్లి తరువాత మనం ఎలా ఉంటామో తెలియనప్పుడు మీరు మా మదర్ కండిషన్స్ ఎందుకు ఒప్పుకోవాలి? మీరు మీరులా వుండండి. మా మదర్ తన రక్షణ కోసం కంపెనీకి నమ్మకస్తుడైన వ్యక్తి కోసం వెదికింది. అదే అల్లుడైతే మరింత సేఫ్
అనుకుంది. ఆవిడా కార్పొరేటర్. ఆవిడ కంట్రోలర్. ఆవిడ కమాండర్. మీరు ఆవిడకు నచ్చని మరుక్షణం మిమ్ములను నా భర్త ఐనా కూడా దూరం పెట్టగలదు.''
''నిజం చెప్పినందుకు మిమ్ములను మెచ్చుకుంటున్నాను. అదే పరిస్థితి వస్తే మీరు నాకు తోడు ఉండరా?''
అడిగాడు మణిదీప్.
''ఎలా? మనం మామ్ కంపెనీలో సర్వము పెట్టుబడి పెట్టినపుడు మనకంటూ ఏమి ఉంటుంది?"
''మరి కనీసం మీ డాడ్ మనతో ఉండరా?"
''ఇప్పటిదాకా మా ఆలోచనలు వేరుగా వున్నా అంతా కలిసే ఉంటున్నాం. ఈ పెళ్లితో విడిపోవాలి. అదీ మీ కారణంగా . అర్ధం కాలేదా?''
.''రజితా ...నాకేమీ అర్థం కావడంలేదు. ఎదో జరుగుతుందని భయంతో మీరిలా అంటున్నారు.అవునా ?''
''నేను మా మదర్ నేచర్ ఎలాటిదో చెప్పాను. ఆవిడ ఏమాత్రం తగ్గదు. ఆలోచించుకోండి. మరో విషయం మీరు మీ పెరెంట్స్కి దూరం అవుతారు.నేను అందరూ కావాలనుకుంటాను.''
మణిదీప్ ఇలాంటి పరిస్థితి వస్తుందని అస్సలు ఊహించలేదు. కొంత టైం తీసుకోడం మంచిది అనుకున్నాడు.
''ఓకే రజిత ఆలోచించి చెబుతాను. నైస్ టాకింగ్ టూ యు ...అంటూ బాయ్ చెప్పాడు.
ఇంటిదగ్గిర ఆత్రంగా ఎదురు చూసే పరశురామ్ రత్నావతి కొడుకు చెప్పిన వార్తకి హతాశులయ్యారు.
''ఆ అమ్మాయి చాలా మంచిది అనిపిస్తోంది. ఇంద్రాణి పధ్ధతి రజితకి భర్తకి కూడా నచ్చదన్నమాట. సరేఆలోచిద్దాం...." అనుకున్నారు.
వేరే సంబంధాలు చూడటం మొదలుపెట్టారు.
మరో ఆరునెలలు గడిచాయి.
సందీప్, అన్న పెళ్ళివిషయం ఏమైంది? అని అడిగితే జరిగింది చెప్పింది రత్నావతి.
''అసలు ఇంద్రాణి గారి కండీషన్స్కి ఎవ్వరూ ఒప్పుకోరు. కానీ రజిత మంచి మాట చెప్పింది. డాడ్ ఆస్తి పంచి ఇచ్చేసి అన్నని వదులుకోవలసిన అవసరం లేదు. నేను వెదుకుతాను...." అన్నాడు.
''పోరా నీవల్ల ఏమి అవుతుంది?" అన్నాడు పరశురామ్ నవ్వుకుంటూ.
ఒకరోజు పరశురామ్ చిన్న నాటి ఫ్రెండ్ - గోదావరి జిల్లాలో స్కూల్ టీచర్గా రిటైర్ అయిన విశ్వనాధ్ నుంచి ఫోను కాల్ వచ్చింది....."నా ఆరోగ్యం బాగాలేదు ...కేన్సర్. ఇక ఎంతో టైం లేదు. నిన్ను చూడాలనివుంది.రాగలవా....."అంటూ.
''అయ్యో ! నీది చాలా మంచి హెల్త్. మంచి అలవాట్లు. నిన్నుచూసి నేర్చు కోవాలను కునేవాళ్ళం. తప్పకుండా వస్తాను విస్సు ''అన్నాడు పరశురామ్.
ఆ కబురు విని ''నేను వస్తాను . వర్ధని పాపం చాలా దిగులుపడివుంటుంది...." అంది రత్నావతి.
''మణీ! మేము విస్సు అంకుల్ వూరు వెళ్లివస్తాము..." అని , విషయం చెప్పి మరునాడే బయలుదేరి వెళ్లారు.
చాలాకాలంగా ఇద్దరికీ మధ్య ఫోను లేదు. ఎవరి గొడవల్లోవాళ్ళు కుటుంబ సమస్యల్లో ఇబ్బందులు వలన దూరంగా ఉండిపోయారు.
పదిహేనురోజుల తర్వాత విశ్వనాధ్ భార్య వర్ధనిని కూతురు హసితనీ వెంటబెట్టుకు వచ్చారు. వాళ్ళుఉండేది పల్లెటూరు. అర్ధం లేని ఆచారాలు ఇంకా ఆఊళ్లో వున్నాయి. హసిత ప్రయివేటుగా ఎం ఏ చదివింది. మేనరికం చేద్దామనుకుంటే అతను ఎవరినో లవ్ చేసాను అన్నాట్ట.
5 ఏళ్లుగా కేన్సర్తో బాధపడుతూ మరోపక్క వున్నా ఒక్క కూతురిపెళ్ళిచేయలేదని దిగులుపడేవాడట. వర్ధని చెప్పింది.
''అదేమిటి వర్ధని! మేము కావలసిన వాళ్ళం ఉన్నామని మర్చిపోయావా ..." అంది రత్న.
''మర్చిపోలేదు. మా బావగారు, మరది, ఆడపడుచు అంతా వున్నాం అంటూనే 'హసితనీ ఎవరు చేసుకుంటారు... నలుపు రంగు. చదువా ప్రయివేటుగా చదివింది. ఆస్తి అందరూ పంచుకుంటే వచ్చేది ఏమిలేదు' అంటూ చిన్న చూపు చూసేవారు.
ఆయన చూస్తే రోజు రోజుకి దిగజారి పోయారు. మీకు ఫోను చేద్దామని చూస్తే ఫోను నెంబర్ ఎక్కడ రాసారో మర్చిపోయారు. అలా రోజులు గడిచిపోయాయి. హసిత ఒకరోజు వాళ్ళ నాన్నగారి సామాను సర్దుతుంటే డైరీలో మీ నెంబర్ కనబడి ఫోను చేసాను...." అంటూ జరిగింది చెప్పింది వర్ధని.
''సరే! మీరు మొహమాట పడద్దు. మీ స్వంత ఇల్లు అనుకోoడి... హసితకి వుద్యోగం వేయిస్తారు మీ అన్నయ్య . అంతదాకా ఇక్కడే వుందురుగాని.'' అంది రత్న.
''మీకు శ్రమ కలిగిస్తున్నాం...." అంది వర్ధని.
''శ్రమలేదు ఏమిలేదు. ఆడపిల్లలేని ఇల్లు .ఇప్పుడు మాకు సందడి ..." అంటూ ఉండగా మణి ఆఫీసునుంచివచ్చాడు.
వాళ్ళని పరిచయం చేసి జరిగిన విషయాలు చెప్పేడు.
'హసితకి వుద్యోగం వచ్చేవరకూ మన ఇంట్లో వుంటారు' అన్నాడు పరశురామ్.
''మీ ఇష్టం డాడ్ ''అన్నాడు మణి. ఆవెంటనే అతనికి ఆలోచన వచ్చింది.
ఆఫీస్ వర్క్ ఎక్కువగా వుంది. హసితకి కంఫుటర్ నాలెడ్జ్ ఉంటే కొంత వర్క్ చేయిన్చుకోవచ్చు అని!
''హసితా నీకు కంప్యూటర్ వచ్చా ?
''ఫర్వాలేదు కొద్దిగా వచ్చును '' అంది.
''ఐతే ఇకనేం.. మా డాడ్ నేర్పుతారు. నాకు హెల్ప్ చేద్దుగాని. జీతం ఇస్తాలే వూరికే కాదు '' అన్నాడు.
''మీరు జీతం ఇవ్వడం ఏమిటి బాబూ ...మేమ్ మీ ఋణం ఇలాగైనా తీర్చుకోనివ్వండి ..." అంది వర్ధని.
మెల్లిగా పరశురాం దగ్గిర నేర్చుకుంటూనే మణి చెప్పిన వర్క్ చేస్తూ ప్రావీణ్యం సంపాదించింది.
ఇంట్లో బాగా అలవాటు పడింది. బెరుకు తనం మొహమాటం తగ్గి అందరితో కలిసి పోయారు.
వర్ధని స్వంత చెల్లికంటే ఎక్కువ ఇంటిపని, వంటపనిలో రత్నకి సహాయపడేది.
వీళ్ళని శాశ్వతంగా ఇంట్లో ఉంచుకుంటే.... అనే ఆలోచన వచ్చింది రత్నకి.
భర్తని అడిగింది. ''వాడి పెళ్లి ఆలస్యం అయిపోయినది ....ఇందుకేనేమో..! ఇంకా ఆలోచన దేనికి? మణితో మాటాడు ''అన్నాడు.
''మీకు హసితకు నచ్చితే నాకు ఎలాంటి అభ్యంతరమూ లేదు.''అన్నాడు మణి.
''ఏమ్మా వర్ధని! మీ తల్లి కూతురు అంగీకరిస్తే హసిత మా కోడలు అవుతుంది....." అంది రత్న.
''అంతకన్నా ఏమికావాలి? నా కూతురు అదృష్టవంతురాలు ''అంది వర్ధని.
'మ్యారేజెస్ ఆర్ మేడ్ఇన్ హెవెన్''అంటారు. ఇదేనేమో' అనుకున్నాడు పరశురామ్ సంతోషంగా!
***శుభం***
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.
లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.
రచయిత్రి పరిచయం : ఏ. అన్నపూర్ణ.
నాపేరు అన్నపూర్ణ. నేను ఇరవై సంవత్సరాలు ఏక ధాటిగా కథలు నవలలు వ్యాసాలు కవితలు కాకుండా జనరల్ నాలెడ్జ్ బుక్స్ చదివిన తర్వాత కథలు రాయడం మొదలు పెట్టాను. అమెరికాలో స్థిరపడ్డాక వచ్చిన అవకాశాలు నా రచనకు మరింత పదును పెట్టాయి. నా రచనలు చాలా వరకు నేను చూసిన ఎదురుకున్న సంఘటనల ఆధారంగా రాసినవే. ''మంచి సందేశాత్మక రచన చేయాలనే '' తపన.... తప్పితే ఏదో ఆశించి రాయడంలేదు. ఆ దాహం తీరనిది. దీని నుంచే మంచి రచన వస్తుందని అనుకుంటాను. ఎందరో గొప్పవారు చెప్పినట్టు నేర్చుకోడానికి ఫుల్స్టాప్ వుండకూడదు. ఆలా తెలుసుకుంటూ ఉండటమే కర్తవ్యమ్. నాకు ప్రోత్సహం ఇస్తున్న పత్రికల వారికీ ధన్య వాదాలు. నాది కాకినాడ. పండితవంశంలో పుట్టుక, సాహిత్యం ఊపిరి- వంశపారంగా అబ్బిన వరం.
నా మొదటికథ చదివి రచనలను ప్రోత్సహించినది ''వసుంధర.R రాజగోపాల్గారు.'' నామొదటి నవల చదివి నా శైలిని మెచ్చుకుని , చతురలో ప్రచురించడo గొప్ప అర్హతగా అభినందించిన '' శ్రీ యండమూరి.....'' ఇంకా ఇప్పుడూ కొనసాగిస్తూ ఉండటానికి కారకులు.
అలాగే నా వ్యాసాలకు సుస్థిర స్థానం కల్పించింది డా. జయప్రకాశ్ నారాయణ్ LOKSATTA ఫౌండర్. నా కవితలకు గుర్తింపు తెచ్చిన ప్రముఖ జర్నలిస్ట్ ఐ.వెంకట్రావ్ గారు, (నా మొదటి కవిత వారి '' పత్రిక ''లో వెలుగు చూసింది.)
విచిత్రం ఏమిటంటే వీరిలో మహిళా రచయిత్రు లెవరూ లేకపోడం.
రచయితలో వుండే ప్రత్యేకతను గుర్తించిన గుణం వీరిది. మరో విషయం ''జనార్ధన మహర్షి'' గారి కవితలు చదివి చిన్న మార్పులు చేస్తే బాగుంటుందేమో అని చెప్పినందుకు కొత్తగా ఏమాత్రమూ కోపం తెచ్చుకోకుండా ఆయన కొత్తగా రాసిన కవితల సంపుటిని నాకుపంపి '' సరిచూసి ఇస్తే నేరుగా ప్రింటికి ఇస్తాను ''అని చెప్పడం వారి విజ్ఞతకు సహస్ర వందనాలు. వీరంతా నేను ఎన్నటికీ మరువలేని మహానుభావులు.
ఇంకా కొందరు వున్నారు. సమయం వచ్చినపుడు వారిని గురించి చెబుతాను.
Comments