top of page

మరువలేని బాల్యము

#PeddadaSathyanarayana, #పెద్దాడసత్యనారాయణ, #MaruvaleniBalyamu, #మరువలేనిబాల్యము, #TeluguFamilyStory, #తెలుగుకుటుంబకథ


Maruvaleni Balyamu - New Telugu Story Written By - Peddada Sathyanarayana   

Published In manatelugukathalu.com On 23/04/2025

మరువలేని బాల్యము - తెలుగు కథ 

రచన: పెద్దాడ సత్యనారాయణ

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



వేసంగి సెలవలు, దానికి తోడు ఎండలు.. ఎవ్వరూ గడపదాటి వెళ్లే పరిస్థితిలో లేరు. పిల్లలు రవి, కిరణ్ లకి ఏమి చెయ్యాలో తోచక, “మమ్మి.. మేము క్రికెట్ ఆడుకునేందుకు వెళ్లమా” అని అడిగారు. 


“క్రికెట్ ఆడుకునేందుకు సాయంత్రము వెళ్ళండి, ఇప్పుడు తాతగారితో చెస్ ఆడుకోండి” 


“ఓకే మమ్మి” అని ఇద్దరు తాతగారి దగ్గరకి వెళ్లి చెరో పక్కన కూర్చుంటారు. 


“తాతయ్యా! మీకు గెడ్డము కింద పెద్ద గీత యెందు కుంది?” అని అడుగుతాడు రవి. 


“ఆదా, చిన్నప్పుడు ఆటలాడు కునే సమయము లో దెబ్బ తగిలింది” అని జవాబు ఇస్తారు తాతగారు. 


“తాతా! మీకు చాల పెద్ద దెబ్బ తగిలిన దనుకుంటా. ఇప్పటికీ చార అలాగే ఉంది. మీ చిన్నప్పటి సంగతులు చెప్పరా, ఇంకా మీరు ఎక్కడ చదువు కున్నారు.. తాతా! మీరు స్కూల్కి మీ డాడీ తో కార్ లో లేక స్కూటర్ మీద వెళ్లేవారా” అని ఆతృతగా అడిగాడు కిరణ్. 


 “నా బాల్యము పల్లెటూరిలో బామ్మ దగ్గర గడిచింది. అప్పట్లో కార్లు స్కూటర్లు లేవు. సైకిల్, గుర్రపు బళ్ళు, ఎడ్ల బళ్ల మీద ప్రయాణించే వారు. నా బాల్యము గురించి చెప్తాను వినండి” అని గతము లోకి జారుకున్నారు. 


“మావూరు గొరగనమూడి, భీమవరానికి నాలుగు మైళ్ళ దూరములో ఉంది. పెద్ద ఇల్లు, ఇంటి వెనుక స్థలము ఉండేది. అరటి, జమ, సపోటా చెట్లు ఇంకా కూరగాయ మొక్కలు ఉండేవి. మా తాతగారు నా చిన్నప్పుడే కాలము చేసారు.

 

నాన్నగారు, అమ్మ, బాబాయ్, పిన్ని, నేను, తమ్ముడు రాజు, బాబాయ్ పిల్లలు వెంకన్న, రమ్య కలిసి ఉండేవాళ్ళము. బామ్మా మాటకి ఎవరు ఎదురు చెప్పేవారు కాదు.

 

నాకు నలుగురు అత్తయ్యలు. పెద్ద అత్తయ్య సంధ్య నిడదవోలు లో ఉండేవారు మావయ్య స్కూల్ టీచర్ అత్తయ్యకి ఇద్దరు కూతుర్లు వనజ, శైలజ. రాధిక అత్తయ్యకి ఇద్దరు కొడుకులు కమల్, విమల్ కూతురు మాలతి, మావయ్య పోస్ట్ మాస్టర్ ఉద్యోగము చేస్తూ తణుకులో ఉండేవారు. 


జమున అత్తయ్య, మావయ్య ఏలూరులో ప్లీడర్ దగ్గర జూనియర్ గా ప్రాక్టీస్ చేసేవారు. వారికి మధు, రమణ పుత్రులు. చిన్న అత్తయ్య మావయ్య రాజోలు లో ఉండేవారు. అయన స్కూల్ టీచర్ వారికి ఇద్దరు కొడుకులు సత్యం, సూర్యము. 


వేసవి కాలములో అందరు బామ్మ దగ్గరకి వచ్చేవారు. దాదాపు పదమూడు మంది పిల్లలు, ఎనిమిదిమంది పెద్దలతో పెళ్ళివారి ఇల్లులా ఉండేది. అందరూ కలిసి పనులు చేసుకునే వారు. ఇంట్లో పాలేరు, పనిమనిషి కూడా ఉండేవారు. మొగపిల్లలు మావయ్యలతో, ఆడపిల్లలు అత్తయ్యలతో ఉండేవారు. బామ్మకు (అమ్మమ కొందరకి ) చెప్పకుండా ఎవ్వరు ఎక్కడకి వెళ్లేవారు కాదు. 


నా పేరు శీను. 

ఇది మీకు శీను కథగా చెబుతాను. వినండి. 


“బామ్మా!, నేను కమల్, విమల్, మధు అందరమూ విస్సాకోడేరులో సాయంత్రము తోలు బొమ్మలాట చూసేందుకు వెళ్తాము” అంటాడు శీను అనుమతి కోసము. 


“ఒరేయ్ శ్రీను, బొడ్డు ఊడని వెధవ.. నీవు అందరిని పేరు పెట్టి పిలిచే అంతటి వాడివి అయ్యావా.. పిల్లలూ.. మీకందరకి చెప్తున్నా. మీకంటే పెద్దవాళ్ళని అన్నయ్య, అక్క, వదిన, బావ అని, అదే చిన్నవాళ్లయితే పేరు పెట్టి పిలవండి. అంతేగాని ఒసేయ్, ఒరేయ్, అనే పిలవొద్దు. వరసలు ఎప్పటి కి మరవొద్దు” అని గర్జించినట్టు చెప్పింది బామ్మ. 


రెండో కొడుకు రాజుని పిలిచి “పిల్లలని పాలేరుతో పంపు, ఎడ్ల బండిలో పైన దుప్పటి కట్టమని చెప్పు, నీవు కూడా పిల్లలతో విస్సాకోడేరు వెళ్ళు” అని చెప్తుంది. 


“సరే అమ్మా!’ అని సాయంత్రము పిల్లలకి తోలు బొమ్మలాట చూపించి తీసుకు వస్తాడు. మధు కుంటుకుంటూ ఇంట్లోకి వస్తాడు. 


“ఏమయిందిరా?” అని మధుని అడుగుతుంది. 


“బామ్మా!” అని ఏడుస్తూ బామ్మని చుట్టుకుంటాడు. 


“నే చెప్తా అమ్మా, నేను యెంత చెప్పిన వినకుండా బండి మీద నుంచి దూకాడు. అప్పటికీ నే పట్టుకున్నా. అయినా మడమ బెణికినదనుకుంటా” అని రాజు చెప్పాడు. 


“సరే. వీడి కాలుకి మర్దన చేసి పట్టి కట్ట”మని రెండో కోడలికి చెప్తుంది. 


మరుసటిరోజు పిల్లలందరిని ఉద్దేశించి బామ్మ జాగ్రత్తలు చెప్తుంది. “పెద్ద వాళ్ళు చెప్పినట్టు చేయాలి. నిన్న మావయ్య చెప్పినా వినకుండా మధు బండి మీద నుంచి దుంకి దెబ్బ తగిలించుకున్నాడు”


ఇంతలో శ్రీను వచ్చి “అమ్మా! ఉండి నుంచి రామం బావ వచ్చాడు” అంటాడు. 


“రారా రామం” అని ఆప్యాయముగా పలకరించి, “కాంతము.. రామానికి కాళ్ళు కడుగు కునేందుకు నీళ్లు తీసుకొనిరా” అంటుంది. 


“ఒరేయ్ రామం! కాముడు కులాసా యేనా” అని తమ్ముడి గురించి అడుగు తుంది. 


“అత్తయ్యా! నాన్నకి బడిలో పని ఎక్కువ గా ఉన్నందువలన రాలేక పోయారు. అందుకే నన్ను పంపించారు. నాన్న పిల్లలని తీసుకు రమ్మని పంపించారు” అని అసలు విషయము చెప్తాడు.

 

“అత్తయ్యా! శ్రీను, రాజు బావ నాతో పాటు బ్రాంచ్ సైకిల్ మీద వస్తారు.. తమ్ముళ్లు జట్కా మీద వస్తే మంచిదేమో” అంటాడు. (అప్పట్లో బ్రాంచ్ సైకిల్ వ్యవస్థ ఉండేది. ఒకచోట తీసుకున్న సైకిల్ ఇంకో ఊరిలో ఇవ్వొచ్చు. ఉదాహరణకి భీమవరంలో తీసుకున్న సైకిల్ పాలకోడేరులో ఇవ్వొచ్చు. ఉండిలో తీసుకొని గొరగనమూడి లో ఇవ్వొచ్చు. ఈ బ్రాంచ్ సైకిల్ వ్యవస్థ వలన ఏ ఊరయినా సునాయాసముగా వెళ్లి రావొచ్చు.) 


“సరే అలాగే తీసుకెళ్ళు. మూడు రోజుల తర్వాత తీసుకు రా. ఎక్కువ రోజులు ఉంటె బెంగ పడతారు, ” అని పిల్లలని ఉండి పంపిస్తుంది బామ్మ. 


“ఒరేయ్ రాముడు! వచ్చేటప్పుడు కాముడుని కూడా తీసుకు రా. వాడిని చూసి చాల రోజులు అయ్యిన్ది “. 


“సరే! అత్తయ్య నాన్నని రమ్మని చెప్తా” అని బయలు దేరతాడు రామం. 


పిల్లలందరూ ఉండిలో తాత బామ్మ గారింట్లో మూడు రోజులు సరదాగా గడిపారు. రాత్రి టాకీసులో సినిమా చూసి సరదా గా మేడ మీద కబుర్లు చెప్పుకుంటూ గడిపారు. మరుసటిరోజు చెరువులో ఈత కొట్టు కుంటూ ఉత్సాహముగా తోటలో జామకాయలు కోసుకొని ఇంటికి వచ్చారు. నాలుగో రోజు అందరు గొరగన మూడి తిరుగు ప్రయాణము అయ్యారు. 


బామ్మగారి ఇంటికి వచ్చిన తర్వాత పక్క ఊర్లో బుర్ర కథ చూసేందుకు అందరు వెళ్లి తిరి గొచ్చి బుర్ర కథలో సంగతులు గురించి కబుర్లు చెప్పుకుంటూ నిద్రపోయారు. 


మరుసటి రోజు సాయంత్రము కాంతము అత్తయ్య కొడుకు సూర్యము బావ మోచేతికి గాయముతో కుంటుకుంటూ ఇంట్లోకి వచ్చాడు. 


“ఒరేయ్ సూర్యము! రక్తము కారేట్టు దెబ్బ ఎలా తగిలిందిరా” అని అడుగుతుంది బామ్మ. సూర్యము జవాబు ఇవ్వకుండా ఏడుస్తూ బామ్మని వాటేసుకుంటాడు. దెబ్బ తగిలిన చోట శుబ్రము చేసి, డాక్టర్ దగ్గరకి పంపించి కట్టు కట్టే వరకు ఎవరిని నిద్ర పోనీయలేదు. 


“శ్రీను, ఇంతకీ వాడికి దెబ్బ ఎలా తగిలిందిరా?” అని అడుగుతుంది బామ్మ. 


“అమ్మా! సూర్యానికి సైకిల్ తొక్కడము వచ్చు. కానీ సైకిల్ ఎక్కడము, దిగడము రాదు. ఎత్తయిన రాయి మీద కాలు పెట్టి సైకిల్ ఎక్కి తొక్కుతాడు. అదే విధముగా మన ఇంటి దగ్గర రాయి మీద కాలు పెట్టి దిగుతాడు. మన ఇంటి దగ్గర రాయి తీసేసారు. సూర్యానికి దిగడము చేతగాక గోడని గుద్ది కింద పడ్డాడు”. 


“ఇంతకీ రాయి ఎవరు తీశారు” అని అడుగుతుంది బామ్మ. 


“ఇంకెవరు, సత్యం, రమణలు రాయి తీశారు “ అని చెప్పాడు శ్రీను. 


“ఎందుకు రాయి తీసారురా” అని అడుగుతుంది బామ్మ. 


“మరేమో మమ్మల్ని ఎక్కించుకో లేదు, సైకిల్ ఇవ్వలేదు” అని చెప్తారు. 


“సైకిల్ ఇవ్వక పొతే మావయ్య కయినా లేక నాకయినా చెప్పాలి. అంతేకాని హాని కలిగే పనులు చేసి శత్రుత్వాలు పెంచుకో కూడదు. మీరు అన్నయ దగ్గరకి వెళ్లి క్షమాపణలు చెప్పండి” అని సూర్యము దగ్గరకి పంపిస్తుంది. 


“రాజూ.. వీళ్ళిద్దరని రేపు సైకిల్ మీద తిప్పరా” అని పురమాయిస్తుంది. 


ఇంతలో సత్యం. రమణలు వచ్చి “ఇంకెప్పుడు ఆలా చేయము బామ్మా” అని చెప్తారు. 


“సరే రేపు మావయ్య తో సైకిల్ మీద వెళ్ళండి. ”


“థాంక్యూ బామ్మా. ” అని చెప్పి వెళ్లి పోతారు. 


మరుసటి రోజు బామ్మ.. “మీరందరు మన తోటలోకి వెళ్లి ఉయ్యాల ఊగి తొక్కుడు బిళ్ళ, దాగుడు మూతలు, ఆడుకోండి. ”


 పాలేరు తో పిల్లలని జాగ్రత్తగా చూసుకో అని, జాగ్రత్తలు చెప్పి అందరిని తోటకి పంపిస్తుంది.

 

అందరూ తోటలో సపోటా కాయలు. జామకాయలు కోసుకొని ఉయ్యాల ఊగేందుకు వెళ్లి వంతుల వారీగా ఒకరు ఊపుతూ ఇంకొకరు ఊగుతూ, ఉత్సాహముగా కేరింతలు కొడుతూ ఆడుకుంటారు. కమల్ ఉయ్యాలలో కూర్చున్నపుడు శ్రీను ఉయ్యాల ఊపుతున్నాడు. కమల్ ఉత్సాహముగా ఊగుతున్న సమయములో ఎవరో పిలిస్తే ఏమరుపాటుగా 'ఉ' అన్నాడు. 


అంతే! ఉయ్యాల గడ్డానికి గట్టిగ తగిలి కింద పడ్డాడు. భీమవరం ఆసుపత్రిలో శ్రీను కి సృహ వచ్చింది. గట్టిగా తగిలినందు వలన మచ్చ ఇప్పటికి ఉంది” అని తన కథ చెప్పడము ముగించారు తాతయ్య. 


“తాతయ్య.. ఇక్కడ మేము స్విమ్మింగ్ చేయాలంటే ఫీజు కట్టి డ్రెస్ వేసుకొని నడుముకి సేఫ్టీ వేసుకొని కోచ్ చెప్పిన విధముగా స్విమ్మింగ్ చేయాలి. మరి మీరు సేఫ్టీ కట్టుకోకుండా చెరువులో ఎలా స్విమ్మింగ్ చేసేవారు?”. 


“చెరువులు ఎక్కువ లోతుగా ఉండవు. లోతుగా ఉండే చోటుకి వెళ్ళ కూడదని పెద్ద వాళ్ళు ముందరే చెప్పి, వాళ్ళు గట్టున కూర్చొని మమ్ముల్ని గమనించే వారు. అందుకు లోతు లేని చోట ఈత నేర్చు కునే వాళ్ళము” 


“తాతయ్యా! నీకు సైకిల్ మీ డాడీ నేర్పారా” అని అడుగుతాడు కిరణ్. 


 “మానాన్న గారు సైకిల్ నడిపే విధానము చెప్పారు. మొదట్లో సైకిలిని తోసుకుంటూ వెళ్ళాలి. ఆవిధముగా చేస్తే మనకి సైకిల్ నడపగలమని నమ్మకము వస్తుంది. తర్వాత కాంచి (సైకిల్ ఫ్రేమ్ లో ఒక కాలు పెట్టి నడపడము) విధానము తో నడిపే వాళ్ళము. వెనకాల తమ్ముడు ఇంకా మిత్రులు సైకిల్ ని పట్టుకునేవారు. ఆ విధముగా కొద్ది రోజులకి సైకిల్ నడపడము వచ్చేది. ” 


“తాతయ్యా, మనము గొరగనమూడి వెళ్దామా” అని అడుగుతాడు కిరణ్. 


“పోయిన సారి వేసవి సెలవల్లో వెళదామంటే పల్లెటూరు ట్రాష్ అని వద్దన్నారు కదా” అంటారు తాతగారు. 


“తాతయ్యా! అప్పుడు పల్లెటూరు గురించి మాకు ఏమీ తెలియదు, ఇప్పుడే కదా మాకు వివరముగా చెప్పారు, అందుకే మాకు వెళ్లాలని ఉంది. ”


సరే అని, కొడుకు కోడలి తో మాట్లాడి కోడలు, ఇద్దరు పిల్లలు, తాతగారు రైల్ లో భీమవరం వెళ్లి అక్కడనుంచి బస్సు లో గొరగనమూడి వెళ్ళారు. 


తాతగారి తమ్ముడి కొడుకు శివుడు, “రండి పెదనాన్న” అని అందరిని ఆహ్వానించి కాళ్ళు కడుక్కునేందుకు నీళ్లు ఇచ్చి ఇరువురు అందరిని, పలకరించి భోజనాలు వడ్డించారు. అందరు పీట మీద కూర్చొని అరిటాకు లో భోజనము చేస్తారు. భోజనాలు అయిన తర్వాత తాతయ్య కూడా శివుడిని వ్యవసాయము గురించి అడిగి తెలుసు కున్నారు.

 

 మరుసటి రోజు శివుడి ఇద్దరు కొడుకులతో రవి కిరణ్ తోటకి వెళ్తారు. అందరు జామ చెట్టు, మామిడి చెట్లు ఎక్కి ఆడుకుని ఉయ్యాల ఊగేందుకు వెళ్ళారు. రవి, కిరణ్ కి చిన్నప్పుడు తాతయ్యకి దెబ్బ తగిలిన విషయము తోటి తమ్ముళ్ళకి చెప్పి జాగ్రత్తగా ఆడుకున్నారు. 


ఇంటికి వచ్చిన తర్వాత, ”బాబయ్యా.. ఇక్కడ రోడ్డులు శుభ్రముగా ఉన్నాయి, ఎక్కడ మాన్ హోల్స్ లేవేంటి” అని అడిగాడు కిరణ్. 


“ఇక్కడ అందరి ఇళ్లలోనూ వాడిన నీరు పెరట్లో చెట్లకి వాడతారు కొబ్బరి, అరటి చెట్లకి చాల నీళ్లు అవసరము. అదే విధముగా చెత్తని కూడా చెట్లకి ఎరువు తయారు చేసి వాడతారు” అని వివరముగా చెప్తాడు శివుడు. 


“సాయంత్రము అందరు పొలము గట్ల మీదుగా పక్క ఊరు గుడికి వెళ్తారు. “తాతయ్యా! మనము హాలిడేస్ లో ఇక్కడకి వద్దాము” అంటాడు రవి. 


***

పెద్దాడ సత్యనారాయణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం

మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


రచయిత పరిచయం:

 మన తెలుగు కథలు పాత్రికేయులకి, పాఠకులకు   నా  నమస్కారములు.

పేరు: పెద్దాడ సత్యనారాయణ   B .A  విశ్రాంత సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్                                                               

డిఫెన్స్ అకౌంట్స్ డిపార్టుమెంట్   

విద్యాభ్యాసము సికింద్రాబాద్                                                                    

సాహిత్య పరిచయము: 6 వ్యాసాలు, ఆంధ్రభూమి  4 కధలు 1 నాటిక                                                

వ్యాసాలకి పారితోషికం  మరియు కమలాకర్ ట్రస్ట్ వారితో సన్మానము జరిగినది.                                            

సంఘసేవ:  గత మూడు సంవత్సరాలు నుంచి పది వృద్ధాశ్రమాలకి బాలబాలికల వసతి గృహాలకి   మరియు ఒక పాఠశాల ,జూనియర్ కళాశాలకు అనేక వస్తవులు అందచేయడము జరిగింది. దాదాపు రెండు లక్షల రూపాయల విలువైన సామాన్లు మరియు తొంభై విలువైన ఉపయోగకరమయిన వాడేసిన వస్తువులు అనగా మంచాలు ,ఫ్రిడ్జిలు , టి.వీ.లు. కుర్చీలు .మొదలగున్నవి పరిచయస్తుల దగ్గరనుంచి సేకరించి ఆశ్రమాలకు అందచేసాను.


 


bottom of page