top of page

మర్యాద - దేవతీతి

#పురాణం #ఆధ్యాత్మికం #devotional #TeluguMythologicalStories, #VagumudiLakshmiRaghavaRao, #వాగుమూడిలక్ష్మీరాఘవరావు, #MaryadaDevatheethi, #మర్యాదదేవతీతి


Maryada - Devatheethi - New Telugu Story Written By - Vagumudi Lakshmi Raghava Rao

Published In manatelugukathalu.com On 18/01/2025

మర్యాద - దేవతీతి - తెలుగు కథ

రచన: వాగుమూడి లక్ష్మీ రాఘవరావు


ప్రతిష్టాన పురాన్ని రాజధాని గా చేసుకుని సమస్త దేశాన్ని పరిపాలించే అక్రోధనుడు తన భార్య కరంభ కోరిక మీద తమ ముద్దుల కుమారుడు దేవతీతికి పట్టాభిషేకం చేసాడు. ఆ పట్టాభిషేకానికి అందరు మహారాజులు వచ్చారు. అందరూ దేవతీతి వదనంలో సుర కళ ఉందని అనుకున్నారు. దేవతీతి పేరు తలచుకుని ఏ పని చేసినా అంతా శుభమే జరుగుతుంది అనుకున్నారు. 


 దేవతీతి పరిపాలనలో ప్రజలు ధర్మార్థ కామ మోక్షాలలో మోక్షం కోసం ఎక్కువ గా సాధన చేసేవారు. 

అర్థకామాల తో సురులు ఎంతగా ఆనందిస్తున్నారో దేవతీతి ఏలుబడిలో ఉన్నవారంత అంతకు మించి ఆనందించేవారు. దేవతీతి రాజు దయ వలన తమకు అర్థ తృప్తి, కామ తృప్తి, ధర్మ తృప్తి పుష్కలంగా ఉంది అని అనుకునేవారు. 


దేవతీతిని చూసిన వారంతా దేవతీతి వదనంలో సుర కళ ఉందని భావించేవారు. తమకు తెలిసీ సుర కళ అధికంగా ఉన్న రాజు దేవతీతియే అని ఎక్కువ మంది జనం నమ్మేవారు. దేవతీతి వదనం చూడగానే ధర్మార్థకామాలలో కోరిన అందలం ఎక్కేస్తామని ప్రజలంతా బాగా నమ్మేవారు. చిత్రమైన విషయం ఏమిటంటే వారి ఆలోచనలకు తగినట్లే దేవతీతి వదనం చూసినవారంత వారు కోరుకున్న స్థాయికి ఎదిగేవారు. తమ ఎదుగుదలకు ప్రధాన కారణం దేవతీతియే అని నమ్మేవారు. 


 దేవతీతి మాత్రం ప్రజలకు దర్శనం ఇచ్చినప్పుడల్లా, "మీరు మీ శక్తిని నమ్ముకోండి. ధర్మ మార్గంలో పయనించండి. మీరనుకున్న స్థాయికి ఎదుగుతారు. నేను కేవలం మహారాజుని. మాయా మంత్రాలు తెలిసినవాడిని కాదు. దేవుడిని అంతకంటే కాదు." అని అనేవాడు. 


దేవతీతి ఎన్ని చెప్పినా ప్రజలు ఆయన మాటలు పట్టించుకునేవారు కాదు. దేవతీతిలో సుర కళ ఉంది అనుకునే వారు. దేవతీతిని దర్శించుకున్న పిదపనే తాము అనుకున్న పనిని మొదలు పెట్టేవారు. తక్కువ కాలంలో ఎక్కువ సంపాదించేవారు. మహదానందం తో మోక్ష సాధనకు శ్రీకారం చుట్టే వారు. దేవతీతి మహారాజు ఉన్నంత వరకు తమకు ఎలాంటి కొదవ ఉండదు అని అనుకునేవారు. 


ప్రజల నమ్మకం క్రమక్రమంగా వారిలో అహాన్ని పెంచసాగింది. మర్యాద మన్నన లను తగ్గించసాగింది. దేవతీతి కొందరు ప్రజలలో మర్యాద మన్ననలు తగ్గుతున్నాయని గమనించాడు. ప్రజలలో మర్యాద మన్ననలను పెంచడానికి ఏం చేయాలా? అని ఆలోచించాడు. తన ఆలోచనలను కుల గురువుల తోనూ, పండితులతోనూ పంచుకున్నాడు. 


రాజు మాటలను విన్న కొందరు పండితులు, "కొంత కాలం పాటు ప్రజలకు అసలు దర్శనం ఇవ్వకు మహారాజ!" అని అన్నారు. బాగా ఆలోచించి అదియే సరైన మార్గమని దేవతీతి అనుకున్నాడు. 


తన వంశ రాజుకు వచ్చిన సమస్య గురించి చంద్రుడు బ్రహ్మ దేవునికి చెప్పాడు. అంత బ్రహ్మ దేవుడు "చంద్ర ! నీ వంశానికి చెందిన దేవతీతి మహారాజు లో ముక్కోటి దేవతల కళ అధికంగా ఉంది. అందుకే అతనిని దర్శించుకున్నవారి కోరికలన్నీ తక్షణం నెరవేరి పోతున్నాయి. తమ తమ కోరికలు నెరవేరడం తో కొందరు ప్రజలు మర్యాద మరిచి ప్రవర్తిస్తున్నారు. మరి కొందరు ప్రజలు మోక్ష సాధన కు మంచి పథానే ప్రయత్నిస్తున్నారు. 


మీ చంద్ర వంశంలోనే అరిహుని తలిదండ్రులు మర్యాద అవాచీనులు ఉన్నారు. ప్రస్తుతం మర్యాద నామధేయం తోనే విదేహ రాకుమార్తె మర్యాద ఉంది. ఆమె సార్థక నామధేయం తో యశసిస్తుంది. ఆమెను చూడగానే అందరిలో మర్యాద భావన జనిస్తుంది. ఆమె దేవతీతి ధర్మ పత్ని అయితే అంతా మేలే జరుగుతుంది. " అని చంద్రునితో అన్నాడు. 


దేవతీతి ప్రజలకు దర్శనం ఇవ్వక పోవడంతో కొందరు ప్రజలు మంత్రుల మీద తిరగబడ్డారు. విదేహ మహారాజు " ప్రజలు రాజులో తమ దైవాన్ని చూసుకుంటారు. ఏ రాజు పరిపాలనలో తమకు ఎలాంటి కష్టాలు కలగకుండా ఉంటే ఆ రాజు సాక్షాత్తు దైవాంశ సంభూతుడే అని ప్రజలు అనుకుంటారు. అలాంటి రాజు ప్రజలకు దర్శనం ఇవ్వకపోవడం సరైన మార్గము కాదు. " అని దేవాతీతి కి వర్తమానం పంపాడు. దేవాతీతికి విదేహ మహారాజు మాటలు సమంజసమే అని అనిపించాయి. అంత దేవతీతి మహారాజు విదేహ మహారాజు మాటలను అనుసరించి ప్రజలకు మరలా దర్శనం ఇవ్వసాగాడు.. 


 విదేహ మహారాజు చంద్రుని మాటలను అనుసరించి దేవతీతి తన కుమార్తె మర్యాదల ఇష్టం మీద మర్యాదను దేవతీతికి ఇచ్చి వివాహం చేసాడు. 


మర్యాద ప్రతిష్టాన పుర ప్రజల మనస్సును బాగా అర్థం చేసుకుంది. అధిక శాతం ప్రజలు తన భర్త దేవాతీతిని మహారాజుగా కాకుండా దైవాంశ సంభూతుని గా భావిస్తున్నారు అని అర్థం చేసుకుంది. "అదృష్టవంతుడైన రాజు అందలం ఎక్కితే ఆ రాజ్యం సమస్తం ఐశ్వర్యంతో తులతూగుతుంది. " అని అనుకుంది. అనంతరం మర్యాద బాగా ఆలోచించి ప్రజలందరి చేత అనేక రకాల వస్త్రాలను తయారు చేయించింది. వాటన్నిటికీ దేవతీతి వస్త్రాలు అని పేరుపెట్టి ఆ వస్త్రాలన్నిటిని అన్ని రాజ్యాలలో ఉన్న నిరుపేదలకు పంచమని చెప్ఫింది. 'ఒక వస్త్రం ను కూడా వ్యర్థం గా పక్కన పడవేయకండి' అని చెప్పింది. 


ప్రజలు అలాగే అని తమ దగ్గర ఉన్న వస్త్రాలను నిరుపేదలందరికి పంచసాగారు. మర్యాద తెలియని ఒక మనిషి తన దగ్గర మిగిలిన చీరను రాజ వీథిలో పక్కనే పడేసాడు. అది చూసిన మర్యాద ఆ చీరను తీసుకుని దానిని ఉయ్యాల గ కట్టి ఒక నిరుపేద స్త్రీ శిశువును ఉయ్యాలలో ఉంచి ఊపసాగింది. అక్కడి వారందరూ మర్యాద చేసే పనినే చూడసాగారు. 


శిశువు నిద్ర పోయాక మర్యాద ప్రజలతో, "ప్రజలారా! ఇప్పటివరకు మీరంతా నేను చేసే పనిని కళ్ళార్పకుండా చూసారు. మంచి పనిని పదే పదే చూడటం పదే పదే దాని గురించే ఆలోచించడం తప్పు కాదు. అలాగే మీరు చేసే మంచి పని మీద అందరి దృష్టి ఉండేటట్లు చూసుకోవాలి. అప్పుడు పదుగురిలో మీకు మంచి పేరు వస్తుంది. మహారాజు దేవతీతిని చూసి మీరు పని మొదలు పెట్టినట్లే మిమ్మల్ని చూసి మరో పదుగురు పని మొదలు పెట్టగలగాలి. అదే మోక్ష సాధన. వృత్తిని దైవంగా నమ్మినవారినే మోక్షం వరిస్తుంది. " అని అంది. 


మర్యాద మాటలను విన్న ప్రజలు అప్పటినుండి చేసే పని మీద దృష్టి ని పెట్టడమే గాక చేసే పనిలో దైవాన్ని చూడసాగారు. క్రమంగా వారు చేసే పనిలో సుర కళ కదలాడ సాగింది. 


 మర్యాద దేవతీతిలకు కొంత కాలానికి ఒక మగ సంతానం కలిగింది. అతని పేరు ఋచీకుడు. 


  సర్వే జనాః సుఖినోభవంతు 


వాగుమూడి లక్ష్మీ రాఘవరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.



రచయిత పరిచయం: వాగుమూడి లక్ష్మీ రాఘవరావు








1 Comment


మర్యాద దేవతీతి: వి.ఎల్. రాఘవ రావు


పురాణ కథలు చదువుతున్నట్టు ఉన్నది ... అమర్ చిత్ర బొమ్మల కథలు చదువుతున్నట్టు ఉన్నది ... కానీ మంచి పనులు - ఉదార తత్వం కూడా ఇమిడ్చి ఉన్నది.

పి.వి.పద్మావతి మధు నివ్రితి

Like
bottom of page