top of page
Writer's pictureDhanalakshmi N

మాతృత్వం - ఓ భార్య మనోవేదన

వారం వారం బహుమతులలో ఎంపికైన కథ (Weekly prize winning story)


'Mathrutvam O Bharya Manovedana' - New Telugu Story Written By N. Dhanalakshmi

Published In manatelugukathalu.com On 02/04/2024

'మాతృత్వం - ఓ భార్య మనోవేదన' తెలుగు కథ

రచన: N. ధనలక్ష్మి

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



“ఏమ్మా డాక్టర్ గారు ఏమన్నారు?” అంటూ హాస్పిటల్ నుండి వచ్చిన కోడలితో వ్యంగంగా అడిగారు అరుణ గారు..


“అది.. అత్తయ్య.. ఇద్దరం హెల్తీగా ఉన్నాము. మెడిసిన్స్ 3 నెలలు వాడమని చెప్పారు”


“అనుకున్నా ఇదే జవాబు మళ్ళీ వింటానని! వెళ్ళిన ప్రతి హాస్పిటల్ డాక్టర్ ఇదే మాట అంటూన్నారు.. కానీ ఫలితం మాత్రం శూన్యం”. 


సౌమ్య కాస్త చిన్న బుచ్చుకుంది.. అది గమనించిన కిరణ్ "అమ్మా! డాక్టర్స్ చెప్పిందే కదా మేము చెప్తున్నాం. నువ్వు ఇలా వెటకారంగా మాట్లాడడము ఏ మాత్రం నచ్చడం లేదు ".. 


“ఇంకేమి చేయమంటావు నువ్వే చెప్పు కిరణ్ !? పెళ్ళై నాలుగు ఏళ్ళైనా ఎటువంటి శుభవార్త మీరు చెప్పడం లేదు. మీతో పాటు పెళ్ళి అయిన నీ ఫ్రెండ్ వర్ధన్ గాడికి ఓ కొడుకు, పక్కింటి సరోజ గారి అబ్బాయికి పెళ్ళై ఏడాది గడిచిందో లేదో వారికి కూడా కవల పిల్లలు పుట్టారు.. కానీ మన ఇంట్లో ఆ ప్రశ్నకు సమాధానం మాత్రం దొరకడం లేదు. బయటకి వెళ్ళాలంటే భయం వేస్తుంది ఎక్కడ మనవడు, మనవరాలు గురించి అడుగుతారని వారికి సమాధానం చెప్పలేక ఇంట్లోనే ఉంటున్నాను.. నా తలరాతలో రాసి పెట్టీ లేదేమో మనవడితో ఆడుకునే అదృష్టం. సర్లే, ఎన్నో అనుకుంటాము.. అన్ని అవుతాయా.. వంట సిద్దం చేసి టేబుల్ పై పెట్టాను. తినేసి నిద్ర పొండి” అంటూ తన బాధను చెప్పేసి తన రూంలోకి వెళ్తూ కోడలి సౌమ్య వైపు కోపంగా, అసహ్యంగా చూస్తూ వెళ్ళిపోయారు అరుణ గారు.. 


“అత్తయ్య పిల్లల కోసం చాలా ఆశగా ఎదురుచూస్తున్నారు అండి. కానీ మనకెందుకు ఇలా జరుగుతుంది. ఇద్దరిలోనూ ఎటువంటి లోపం లేదు. మనం రెగ్యులర్ గా కలుస్తూనే ఉన్నాము. ఎటువంటి ప్రీకషన్ వాడటం లేదు కదా. కానీ ఎందుకు నేను గర్భవతి కాలేక పోతున్నాను”


“అబ్బా!? మనకేమి వయసు దాటి పోలేదు సౌమ్య.. అమ్మ గురించి నీకు తెలిసింది కదా.. అమ్మన్న మాటల గురించి ఆలోచించి మనసును కష్ట పెట్టుకోకు..”

 

“పోనీ మీరు ఇంకో పెళ్ళి చేసుకుంటే అత్తయ్య కోరిక నెరవేరుతుందేమో కదండీ..”

 

“పెళ్లై కదా! చేసుకుంటాను. నువ్వే అమ్మాయిని చూడు. అలాగే నీ కోసం కూడ ఓ మంచి అబ్బాయిని చూసుకో. ఇద్దరం కలిసి ఒకే మండపంలో పెళ్ళి చేసుకుందాం. ఖర్చులు కూడా కలిసి వస్తాయి. ఏమంటావు??”


“ఏవండీ! ఏంటండీ అంత మాట అన్నారు.. మీరు నా ప్రాణం అండి.. ఈ తనువు, ఈ మనసు మీదే.. మరెవరికీ చోటు ఇవ్వలేను అండి..” 

“మరెలా నేనెలా ఇంకో అమ్మాయిని నా జీవితంలోకి తెచ్చుకోగలను.. ఈ శరీరంలో ప్రాణం ఉన్నంతవరుకు సౌమ్యని మరవడం జరగదు..”

 

“క్షమించండి.. చాలా తప్పుగా మాట్లాడాను..”

 

“నేను చాలా హర్ట్ అయ్యాను.. దానికి పనిష్మెంట్ గా ఈ రోజంతా నిన్ను వదిలిపెట్టను” అంటూ సౌమ్యను అల్లుకుపోయాడు.. ఆ రోజును ఇద్దరికీ మధుర రాత్రిగామల్చుకున్నారు.. 


సౌమ్య, కిరణ్ ది ప్రేమ వివాహం.. ఇరువైపులా పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు.. ఒక్క పిల్లలు లేరన్న లోటు తప్ప వారి మధ్య ప్రేమకు ఏ లోటూ లేదు. 


అరుణగారికేమో మనవడు, మనవరాలు పుడితే వారితో సమయాన్ని గడపాలని కోరిక.. బంధువుల, ఇరుగు పొరుగువారి అందరి ఇళ్ళలో పిల్లలు ఉన్నారు.. తన ఇంట్లో లేరన్న బాధ ఒక కారణమైతే, ఎక్కడకి వెళ్తున్న అడిగే ప్రశ్నలు మరోక కారణం.. 


సౌమ్య కూడ పిల్లలు కలగాలని కనిపించిన ప్రతి దేవుడిని వేడుకుంటుంది. వాళ్ళ అత్తయ్య చెప్పినట్టుగా నోములు చేస్తూ, ఉపవాసాలు చేస్తుంది. కానీ ఫలితం మాత్రం శూన్యం.. తిరగని హాస్పిటల్ లేదు మొక్కని దేవుడు లేరు.. 

ప్రతి రోజు అరుణ గారు ఎదొకటీ పిల్లల గురించి అనడం, సౌమ్య ఏడుస్తూ ఉండటం. అది విని కిరణ్ నచ్చచెప్పడం ఇదే తంతు.. 


“ఏంటి సౌమ్య! పూరి చేసినా, ఓట్స్ తింటున్నావు..” 


“అదేమీ లేదండి. డైట్ మారుస్తున్న..”

 

“సౌమ్య..  ఇలా తిండి కంట్రోల్ చేసుకుంటే పిల్లలు పుట్టరు.. కడుపు నిండా తిని, మనం ప్రేమగా ఉంటే పుట్టేది. తిను” అంటూ బలవంతంగా పూరి తినిపించాడు కిరణ్.. 


ఆఫీసు కి వెళ్తూ "అత్తయ్యా! మీ కోసం గుత్తి వంకాయ కూర, కొబ్బరి పచ్చడి, క్యారట్ ఫ్రై చేశాను.. మీరు రైస్ ఒక్కటి పెట్టుకుంటే చాలు. ".. 


“సరే సౌమ్య.. మీరిద్దరూ రేపు ఆఫీసుకి సెలవు పెట్టండి..”

 

“ఎందుకమ్మా..”

 

“నీ చెల్లెలు అనుకి సీమంతం రా.. మొన్ననే మీ పిన్ని వచ్చి నన్ను, సౌమ్యని పిలిచి మరీ వెళ్ళింది”


“అది కాదమ్మా సౌమ్య ఇప్పటికే చాలా లీవ్స్ పెట్టుకుంది. మళ్ళీ లీవ్స్ అంటే కొంచం కష్టం అవుతుందేమో..”

 

“అవ్వన్నీ నాకు తెలీదు. మనం ఫంక్షన్స్ కి వెళ్ళాలి అంతే..” 

“సరే రా సౌమ్య, మనకి లేట్ అవుతుంది..” బైక్ పై వెళ్తూ“అమ్మకి తోడుగా పక్కింటి సరోజ గారు వెళ్తారు లే.. ఆవిడని కూడ మా పిన్ని పిలిచింది అంటా..”

 

“ఏవండీ! నేను సర్ ని రిక్వెస్ట్ చేసి వీకెండ్స్ లో వర్క్ చేస్తానని చెప్తాను.. మనం ఫంక్షన్ కి వెళ్దాం.. అత్తయ్య బాధ పడటం నేను చూడలేను..”

 

“సరే నీ ఇష్టం..”

 

మరుసటి రోజు ఫంక్షన్ కి అటెండ్ అయ్యారు.. 

ఆ ఫంక్షన్ కి వచ్చిన వారిలో ఎవరో అబ్బాయి ఏడుస్తుంటే సౌమ్య ఎత్తుకుంది.. ఆ అబ్బాయి కూడా ఏడుపు ఆపేసి కిల కిల నవ్వుతున్నాడు.. 


అక్కడున్న కిరణ్ తరుపున బంధువులు అంతా మీరెప్పుడు శుభవార్త చెప్తారంటూ అడుగుతూనే ఉన్నారు.. కిరణ్ త్వరలోనే చెప్తానంటూ నవ్వుతూ సమాధానం చెప్తూ ఫంక్షన్ పనుల్లో సాయం చేస్తున్నాడు.


అరుణ గారిని ఇదే ప్రశ్నలు అడుగుతుంటే నవ్వుతూ సమాధానం దాటేసింది. ఎక్కడకి వెళ్ళినా ఇదే ప్రశ్న ఎదురువుతుంటే పిల్లాడిని ఆడిస్తున్న కోడలి వైపు కోపంగా చూసింది.


అత్తయ్యా తన వైపు ఎందుకు కోపంగా చూసిందో అర్థం కాక బాధగా అనిపించి ఆ అబ్బాయిని వాడి కన్నతల్లికి చేర్చి పనుల్లో సాయం చేస్తుండిపోయింది. 


సీమంతం జరగుతున్న అనూకి తాను కూడా పసుపు రాసి కుంకుమ పెట్టాలని సౌమ్య ముందుకు వెళ్తుంటే" అమ్మ! అను కిచెన్లో గిఫ్ట్స్ పెట్టాను.. ఎక్కువగా ఉన్నాయి.. కాస్త సాయంగా రామంటు "లోపలికి పిలుచుకొని వెళ్ళింది అను వాళ్ళమ్మ.. 


“చెప్పండి చిన్న అత్తయ్యా గిఫ్ట్స్ ఎక్కడ ఉన్నాయో..”

 

" గిఫ్ట్స్ అనేవి ఏమి లేవు ఇక్కడ.. అయిన ఏ మొహం పెట్టుకొని నా బిడ్డకి పసుపు రాసి ఆశీర్వదించాలనిఅనుకున్నావు. పెళ్ళై నాలుగు ఏళ్ళైనా ఇంత వరుకు ఏ శుభవార్త లేదు.. నీ మొహం చూస్తూంటే అర్థం అవుతుంది. పిల్లలూ ఇంకపై పుట్టేరేమొన్న అనుమానం వస్తుంది. నీలాంటి గొడ్రాలు నా బిడ్డని ఆశీర్వదించకూడదు".. 


ఎదో ఫోన్ వస్తే మాట్లాడుతూ కిరణ్ అటువైపుగా వచ్చి వీరి మాటలు విన్నాడు.. కోపంగా వారి వద్దకు వచ్చాడు. 


"పిన్ని.. అసలు మీరు ఆడవారేనా. బిడ్డలు లేరన్న ఒకే ఒక్క కారణంతో నా భార్యను అవమానించే హక్కు మీకు ఏ మాత్రం లేదు. మీరే కదా మా ఇంటికి వచ్చి ఫంక్షన్ కి రమ్మని ఆహ్వానించారు. అందుకే కదా మేము ఇక్కడకి వచ్చాము.. ఇలా పిలిచి అవమానించడం సబబునేనా. ఈ ఫంక్షన్ కి రావడం కోసం మేమిద్దరం వీకెండ్స్ లో వర్క్ చేస్తామని పర్మిషన్ తీసుకుని ఇక్కడకి వచ్చినందుకు మాకు బాగానే బుద్ది చెప్పారు.. "

అరుణ గారిని, సౌమ్యని తీసుకోని ఇంటికి వెళ్లిపోయాడు కిరణ్.. 


జరిగిన దానికి ఏడుస్తున్న సౌమ్య తన మాటలతో ఒదార్చాడు కిరణ్.. 


సీమంతం ఫంక్షన్లో జరిగిన విషయం అరుణ ద్వారా విన్న పక్కింటి సరోజ గారు "సౌమ్యకి ఎదో ప్రాబ్లెమ్ ఉన్నట్టుగా ఉంది. అందుకేనేమో తనకి పిల్లలు పుట్టడం లేదు. అమ్మ కాలేని అమ్మాయి జీవితం ఎప్పటికీ అసంపుర్ణమే. తన వల్ల మీ వంశం అగిపోకూడదు. నా మాట విని కిరణ్ కి మరొక పెళ్ళి చేయండి" అంటూ ఉచిత సలహా ఇచ్చింది.. 


అప్పుడే ఆఫీసు నుండి తిరిగి వచ్చిన కిరణ్, సౌమ్య విన్నారు.. 


“వారెవ్వా  ఆంటీ! ఏం సలహా ఇచ్చారు.. సౌమ్య ప్లేస్ లో మీ కూతురు అక్షర ఉంటే ఇలాగే సలహా ఇస్తారా!?? ఒకరి జీవితంలో జోక్యం చేసుకునే హక్కు మీకు లేదు.. అయిన ప్రాబ్లెమ్ ఉండేది సౌమ్య లో కాదు నాలో.. మీరు మనిషేనా.. మొన్న మీకు జ్వరం వచ్చి చూసే దిక్కు లేకపోతే నా భార్య దగ్గరుండి సపర్యలూ చేసింది. కనీసం ఆ కృతజ్ఞత కూడ లేదు. దయచేసి మా ఇంటికి రాకండి..” 

సరోజ గారు సిగ్గుతో తలదించుకుని తన ఇంటికి వెళ్ళిపోయారు.. 


“ఏంటి కిరణ్ ఏమి అంటూన్నావు? నీలో లోపం ఉందా!??”


“అవునమ్మ. డాక్టర్ ఇందాకే కన్ఫర్మ్ చేశారు. మెడిసిన్ వాడితే ఒన్ ఆర్ టూ యియర్స్ లో నయం అయ్యే ఛాన్స్ ఉందని చెప్పారు. ఏమో.. నాకు ఎప్పటికీ నయం కాకపోతే సౌమ్య జీవితం నాశనం అవుతుందేమో కదా. అందుకే నేనొక నిర్ణయం తీసుకున్న.. సౌమ్యకి విడాకులు ఇస్తాను.. తాను ఇంకొక పెళ్ళి చేసుకొని పిల్లలను కని అమ్మ అవుతుంది. అందరి చేత మాటలు పడే కర్మ తనకుండదు..”


“అదేంటి రా.. అలా అంటావు.. అమ్మాయికి.. అందులో నీ భార్యకి మరో పెళ్ళెలా చేస్తారు”. 


“తనలో లోపం ఉంటే నేను ఇంకో పెళ్ళి చేసుకోవచ్చు. అదే లోపం నాలో ఉంటే మాత్రం తను చేసుకోకూడదు. 

వారెవ్వా, ఏమి చెప్పావు అమ్మ.

. సౌమ్య ప్లేసులో నీ కూతురి ఉంటే ఇలాగే అలోచిస్తావా!? లేదుగా.. అత్తగా కాకుండా అమ్మగా ఆలోచించు అమ్మ.. అది కుదరదా కనీసం ఓ ఆడదానిగా తన బాధను అర్థం చేసుకో అమ్మ..”

 

అరుణ గారికి తను చేసిన తప్పుమిటో అవగతం అవ్వడంతో బాధపడుతూ తన రూంలోకి వెళ్ళిపోయారు.. 

“ఏవండీ!? ఎందుకు మీలో లోపం ఉన్నట్టుగా చెప్పారు..”

 

“కావాలనే చెప్పాను సౌమ్య.. నాలో లోపం ఉందంటే నిన్ను పిల్లల గురించి పదే పదే అడుగుతూ విసిగించండం మానేస్తారు.. ఆడవారిలో లోపం ఉంటే వేలెత్తి చూపే సమాజం అదే లోపం మగవారిలో ఉంటే సైలెంట్ గా ఉంటారు..”

 

‘దేవుడు బిడ్డ విషయంలో నన్ను చిన్న చూపు చూస్తున్న భర్త విషయంలో మాత్రం చాలా గొప్ప వరాన్నే ఇచ్చాడు’ అంటూ సౌమ్య కన్నీరు పెట్టుకుంది.. 


కిరణ్ ప్రేమగా తనని గుండెలకు హత్తుకుని "చూస్తుండు సౌమ్య త్వరలో మన జీవితంలో కూడా దేవుడు సంతోషాలను తీసుకోని వస్తాడు".. 


కిరణ్ మాటల ప్రభావం అరుణ గారి మీద బాగానే పని చేసింది. సౌమ్యను ప్రేమగా చూడటం మొదలు పెట్టారు.. 

కిరణ్ కూడ వాళ్ళమ్మలో వచ్చిన మార్పుకు ఆనందపడ్డాడు.. 

రోజులు అలా సరదాగా దొర్లి పోతుండగా.. 


ఒక రోజు టీవీలో ఎవరో అప్పుడే పుట్టిన పసికందును చెత్త కుప్పలో వదిలిపెట్టి వెళ్ళారు అని న్యూస్ టెలికాస్ట్ చేస్తున్నారు.. 


“నాకు బిడ్డలు పుట్టరని తెలిసి ఎంత బాధ పడుతున్న.. అలాంటిది ఆ పసికందును ఎలా అండి చెత్త కుప్పలో విసిరేసి వెళ్ళారు.. వాళ్ళకి కొంచం కూడా పాపం అనిపించలేదా.. ఏవండీ! మనం ఆ బిడ్డను తెచ్చుకుందామా.. !??” అని సౌమ్య అడగడంతో..  “తప్పకుండా ! రా ఇప్పుడే వెళ్దాము. ఇంకా నుంచి మన బిడ్డగా తను పెరుగుతుంది” అంటూ నేరుగా న్యూస్ ఛానల్ దగ్గరికి వెళ్ళి వివరాలు తెలుసుకున్నారు.. 


కిరణ్, సౌమ్య కావాల్సిన ఫార్మాలిటీస్ అన్నిటినీ పూర్తి చేసి పాపని తెచ్చుకున్నారు.. ఆనాటి నుండి పాపే వారి లోకం అయింది.. కంటికి రెప్పలా చూసుకుంటూ ఉన్నారు.. 

ప్రతి నెల సౌమ్యను, పాపని కలిపి రకరకాలుగా ఫోటోలు తీసి వాటిని గోడలపై అందంగా అలకరించేవాడు కిరణ్. 


 తమ జీవితాల్లో వెలుగులు నింపిన పాప అంటే ఇద్దరికీ పంచప్రాణాలు.. పాపకి శిశిర అని పేరు పెట్టుకున్నారు. ఎన్నో ఏళ్లుగా కోర్ట్ లో మగ్గుతున్న తమ పూర్వీకులకు సంబంధించిన ఆస్తి ఇకపై సౌమ్యదేనని తీర్పు ఇచ్చారు. 


అదంతా శిశిర తమ జీవితంలోకి రావడం వల్లే అని తమ ఇంటి మహాలక్ష్మి గా భావించారు. అరుణ గారు కూడా కొడుకు, కోడలి సంతోషమే ముఖ్యమని భావించి పిల్లల గురించి ఏ రోజు ప్రస్తావించలేదు.. 


పాప అమ్మ అంటూంటే సౌమ్య ఎంతో పొంగిపోయేది. పాపకి మూడు ఏళ్ళు ఉన్నప్పుడు సౌమ్య కళ్ళు తిరిగి పడిపోయింది.. కంగారు పడిన కిరణ్, డాక్టర్ దగ్గరికి తీసుకొని వెళ్ళారు.. 


 సౌమ్య నెల తప్పిందని చెప్పారు డాక్టర్.. రెగ్యులర్ చెకప్ చేయించుకోవాలి.. ఈ మందులు ప్రతిరోజూ క్రమం తప్పకుండా వాడండి అని డాక్టర్ సూచనలు ఇచ్చారు.. 

 ఇంటికి చేరుకొని శిశిరను తీసుకొని ముద్దులతో ముంచెత్తి రేయ్ కన్న నువ్వు అడుకోవడానికి తమ్ముడూ రాబోతున్నారు అని ఆనందపడ్డారు ఇద్దరు.. అరుణ గారు కూడ ఎంతో సంతోషించారు.. 


మాతృత్వంలోని ప్రతి క్షణాన్ని ఎంతో ఆనందంగా ఆస్వాదిస్తోంది సౌమ్య.. 


 శిశిర వల్లే తమకి ఈ అదృష్టం దక్కిందని వాళ్ళ నమ్మకం. కొన్ని నెలల తరువాత సౌమ్యకి కవలలు పుట్టారు ఆ పిల్లలను చూసి ఎంతో ఆనంద పడ్డారు. 


 శిశిర అయితే తన తమ్ములను ఇద్దరినీ చూసితెగ ముద్దులు పెడుతూ మమ్మీ నా కోసమే ఇద్దరు వచ్చారు.. థాంక్స్ మమ్మీ అంటూ సౌమ్య మొహానికి ముద్దులు పెట్టింది.. 


మరి పప్ప కు లేదా అని అనడం ఆలస్యం కిరణ్ చేరి ముద్దులు పెట్టింది శిశిర. 


 దీక్షిత్, దక్షిత్ అని పేర్లూ పెట్టారు పిల్లలకి.. పిల్లల ప్రతి పుట్టిన రోజుకి కొంతమంది పిల్లల్ని దత్తత తీసుకొని చదివిస్తున్నారు.. 


దీక్షిత్, దక్షిత్ ను ఎవరైనా ఏమైనా అంటే శిశిర అసలు ఊరుకోదు.. చివరకి అమ్మ, నాన్న అయిన సరే.. శిశిర కు తన తమ్ముళ్ళ పైనున్న ప్రేమను చూసి మురిసిపోయే వారు సౌమ్య, కిరణ్.. 


శిశిర, దీక్షిత్, దక్షిత్ అల్లరి కేరింతలతో ఆనందంగా వారి జీవితం సాగిపోతుంది.. 

*****

N. ధనలక్ష్మి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం :

నమస్తే. నా పేరు ధనలక్ష్మి. వృత్తి రీత్యా ప్రైవేట్ స్కూల్లో గణితం బోధిస్తాను. మాది మదనపల్లి, చిత్తూర్ జిల్లా. కథలు , కవితలు రాయడం నాకు ఇష్టమైన వ్యాపకం. ఆనందం వేసినా, బాధ వేసినా, కోపం వచ్చినా నేను పంచుకునే నా నేస్తం అక్షరం. నాలో మెదిలే భావాలను, నేను చూసిన సంఘటనలను రాయడం నాకు అలవాటు.  


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ యువ రచయిత్రి బిరుదు పొందారు.









92 views0 comments

Comments


bottom of page