top of page
Writer's picturePitta Govinda Rao

మట్టిలో మాణిక్యం



'Mattilo Manikyam' - New Telugu Story Written By Pitta Gopi

Published In manatelugukathalu.com On 23/06/2024

'మట్టిలో మాణిక్యం' తెలుగు కథ

రచన: పిట్ట గోపి


విజయవాడ సెంటర్ దాటాక చివర్లో మురికివాడల్లో చాలా ప్రదేశం ఖాళీగా ఉంది. అక్కడక్కడా చెదురుముదురు పేద, మద్యతరగతి గుడిసెల్లో కొందరు ఎన్నో ఏళ్ళుగా నివసిస్తున్నారు. అక్కడికి ఏనాడూ ఏ ఆఫీసర్ కూడా రాలేదు. అలాంటిది ఇప్పుడు ఒక ఐపీఎస్ విటల్ దాస్ తన పరివారంతో అక్కడికి వచ్చాడు. అది కూడా తాను ఐపీఎస్ సాధించి శిక్షణ పూర్తి చేసుకున్న మరుసటిరోజే కావటం గమనార్హం. 


ఆ మురికివాడల్లో ఈమధ్యనే కొత్తగా వచ్చిన పేదల గుండెల్లో గుబులు రేగుతుంది. ఎందుకంటే.. ! తాము లేకలేక ఖాళీగా ఉన్న మురికివాడల్లో గుడిసెలు వేసుకుని చెత్త ఏరుకుంటు ఎలాగో బతుకు నెట్టుకొస్తుంటే ఇప్పుడు ఈ ఐపీఎస్ ఆఫీసర్ కళ్ళు ఈ ప్రదేశం పై పడి ప్రభుత్వం తమ గుడిసెలు బలవంతంగా అయినా ఖాళీ చేయిస్తుందని. కానీ.. ! ఆ ఐపీఎస్ ఆఫీసర్ వచ్చింది మాత్రం ఆ పనిమీద కాదు. తన సొంత ఇంటికి. 


అవును. ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజమే. విటల్ దాస్ మట్టిలో మాణిక్యం. ఈ మురికివాడల్లో ఉంటూనే అతడు ఐపీఎస్ సాధించాడు. శిక్షణ పూర్తి చేసుకున్నాక తన ఇంటికి వచ్చి తల్లిదండ్రులు, చెల్లిని కలిశాడు. దాస్ భవిష్యత్ లో ఇక్కడ నివాసం ఉండరని అందరికీ తెలుసు. కానీ..  తాను ఎక్కడో పుట్టి ఇక్కడ మాత్రం బతుకు బండి లాగటంలో తల్లిదండ్రులకు సహయపడుతు ఈ మురికివాడల్లో నుండే ఏ సదుపాయాలు లేకపోయినా అది కూడా తొలి ప్రయత్నంలో కేవలం 21 ఏళ్ళకే ఐపీఎస్ సాధించటం అంటే మాటలా.. ? నిజంగా దాస్ కి ఎంత మేధాతనం, మరెంతో టాలెంట్ లేకపోతే ఇది సాధ్యమవుతుందా.. 


 ఐపీఎస్ హోదాలో వచ్చి కారు దిగి తల్లిదండ్రులను, చెల్లిని హత్తుకుని ఏడవటం తప్ప అతడిలో ఆనందం కనపడలేదు. అయితే. ! ఆ ఏడుపులో కూడా ఒక రకమైన ఆనందం ఉంటుందని అతడి విజయగాధ తెలిసినవారికి కనపడుతుంది. తల్లిదండ్రులు కూడా ఆనందంతో ఏడుపందుకున్నాక ఆ ప్రాంతం అంతా వారిని చూసి కన్నీటితోనే చప్పట్ల చప్పుడుతో నిండింది. 


దాస్ విజయగాధ, అతడి జీవితం గూర్చి ఒక పుస్తకం కూడా అచ్చయింది. 


ఆంధ్రప్రదేశ్ లో విజయవాడ పరిధిలో ఒక చిన్న పల్లెటూరిలో విటల్ దాస్ సీమయ్య, కుమారీలకు జన్మించాడు. సీమయ్య తండ్రుల కాలంలో ఊరు వాడ అంతా వ్యవసాయ భూముల మీదే ఆధారపడి బతికేవాళ్ళు. అయితే..  కొంతకాలానికి అభివృద్ధి పేరుతో దేశంలో వచ్చిన పరిశ్రమలు, కాలుష్యం, నెట్వర్క్ ల కారణంగా వాతావరణంలో పెను మార్పులు సంభవించి రైతులు వేసిన పంటలకు అతివృష్టి, అనావృష్టి కరువుకాటకాల వలన అందరూ నష్టపోయేవారు. వాళ్ళందరి కంటే తక్కువ భూమి ఉన్న సీమయ్య రాను రాను అప్పుల్లో కూరుకుని తన పొలం కోల్పోవల్సి వచ్చింది. 


 అప్పటికే దాస్ తో పాటు చెల్లెలు రాణి కూడా పుట్టింది. ఇల్లు కూడా చిన్న పాక మాత్రమే కావటంతో ఇక్కడే ఉంటే బతుకు సాగదని భావించి సీమయ్య ఆ పాకని అమ్మేసి వచ్చిన డబ్బులతో ఒక రిక్షా కొన్నాడు. అలాగే పట్టణంలో మురికివాడకు పోయి అక్కడే గుడారం ఏర్పాటు చేసుకుని పిల్లలను బడికి పంపాడు. దాస్ బడికైతే వెళ్తున్నాడు కానీ.. ! పల్లెటూరి నుండి ఇక్కడికి రావటం, ఈ మురికివాడల్లో ఉండటం అతడికి నచ్చలేదు. పాఠశాలలో ఉపాధ్యాయులు కానీ.. , స్నేహితులు కానీ.. ఏ ఊరు అంటే దాస్ కి చెప్పటానికే సిగ్గేసేది. 


ఒకరోజు తోటి స్నేహితులు 

"మురికివాడ బిడ్డ.. మురికివాడ బిడ్డ.. " అని వెక్కిరించటం ఉపాధ్యాయులు చూసి 

"చూడండి పిల్లలు, దాస్ మురికివాడల్లో నుంచే వచ్చినా అతడి చదువుకు మీరు సరితూగటం లేదు. చిరిగిపోయిన దుస్తులు వేసుకుంటున్నాడు కానీ.. అతడి పుస్తకాలు మాత్రం ఎప్పుడూ చిన్న మడత కూడా పడకుండా ఉంచుతున్నాడు. దాస్ మట్టిలో ఉన్న మాణిక్యం. ఎప్పటికైనా ఐపీఎస్ అవుతాడు" అని చెప్పారు. 


ఆ మాటలు దాస్ తలలోకి, మనసులోకి మళ్ళాయి. అప్పటినుంచి తల్లిదండ్రులు, చెల్లి.. దాస్ లో వచ్చిన మార్పు గమనిస్తూనే ఉన్నారు. తల్లిదండ్రులకు సహాయం చేయటమే కాదు.. ! ఏ కాస్త టైం దొరికినా పుస్తకాలతో కుస్తీ పడేవాడు. మురికివాడల్లోనే కరెంటు లేనప్పుడు ఇంక గుడారంలో కరెంటు ఉంటుందా.. దీపమే అతడి చదువునకు దారి అయింది. ఇంటర్ లో అడుగు పెట్టే సరికి తండ్రి కష్టం చూసి తాను కూడా ‘రిక్షా తొక్కుతూ సంపాదిస్తూ 

చదువుకుంటా’నని చెప్పాడు. 


వయసుకు వస్తున్న కొడుకు ఆలోచన, మాటలు, తన కష్టాన్ని గుర్తించేలా ఉన్నాయని ఆనందించాడు. తండ్రి తాను సంపాదించిన దాంట్లో పొదుపు చేసిన మొత్తంతో ఒక సరుకు రిక్షా కొని మనుషుల్ని తరలించే పాత రిక్షాను దాస్ కి ఇచ్చి 

"నీకు ఎప్పుడు నచ్చితే అప్పుడు రిక్షా తోలు. లేకపోతే నేను సరుకు రిక్షాతో సంపాదిస్తాను” అని ధైర్యం చెప్పేవాడు. 


ఇంటర్ నుండి గ్రాడ్యుయేషన్ వరకు దాస్ చదువు సాగిందంటే అది కుటుంబంలో ఆ నలుగురు వలనే. దాస్ టాలెంట్ ని గుర్తించిన పలు స్వచ్ఛంద సంస్థలు, పై చదువులకు సహాయం చేస్తామనే ఆఫర్ ని సున్నితంగా తిరస్కరించాడు. దాస్ లో ఐపీఎస్ సాదిస్తాననే నమ్మకం బలంగా ఉండటంతో ఇప్పటి వరకు తన కుటుంబం తన కోసం పడిన శ్రమకు, ఈ స్వచ్ఛంద సంస్థలు చేసే సహాయం వలన పెద్దగా గుర్తింపు రాదు. అందుకే ఏదైనా తల్లిదండ్రులకే ఆ క్రెడిట్ దక్కాలని దాస్ ఆలోచన. 


తల్లిదండ్రులది ఎలాగూ బాధ్యతే. పెద్ద చదువులు చదవాలంటే డబ్బులు ఎక్కువ మొత్తం ఖర్చు అవుతుంది కదా.. అన్నయ్యలో ఉన్న కసిని గుర్తించిన చెల్లెలు తాను చదవటానికి అయ్యే ఖర్చు కూడా అన్నయ్య చదువు కోసం దక్కాలని తాను చదువు మానేసి తల్లితో చెత్త కాగితాలు ఏరుకుని వచ్చే డబ్బులు కూడా అన్నయ్య ఖర్చుల కోసం వినియోగించేది. 


దాస్ కూడా ఒక్కోసారి రాత్రి పూట రిక్షా తొక్కతూ టిక్కెట్లు వచ్చే వరకు పుస్తకాలు చదువుతూ డబ్బులు సంపాదించేవాడు. 


అసలు నిజంగా దాస్ నిద్రపోవటం కూడా తల్లిదండ్రులు కళ్ళారా చూసి ఉండరు. అంతలా కష్టపడుతూ యూపిఎస్సి పరీక్ష కోసం సన్నద్ధం మొదలుపెట్టాడు. ఐపీఎస్ ల కోసం యూపిఎస్సి నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరిక్ష (cse ) కోసం కుటుంబంతో సహా హైదరాబాద్ వచ్చాడు దాస్. మనిషి ఎంత గొప్పవాడైనా.. తెలియని వారి దగ్గర ఒక సాధారణ మనిషే. దాస్ కి ఎంత మేధాతనం ఉన్నా.. పరిక్ష కేంద్రానికి రెండు నిమిషాలు ఆలస్యంగా రావటంతో లోపలికి రాకుండా సెక్యురిటి గేటు వేసేశారు. అప్పటికే గేటు బయట చాలామంది అభ్యర్థుల తరుపున వచ్చే వాళ్ళతో నిండి ఉంది. అయితే వాళ్ళంతా లోపలికి వెళ్ళిన తమ వాళ్ళని సాగనంపిన వాళ్ళే. 


దాస్ తాను మారుమూల పల్లెటూరిలో పేద కుటుంబానికి చెందిన వాడినని, వచ్చే సరికి ఆలస్యం అయిందని ఎంతోగానో విన్నవించుకున్నాడు. అయినా సెక్యురిటి కనికరం చూపలేదు. కొడుకు కష్టం కళ్ళలో మొదలుతుండగా సీమయ్య గేటు పైకి ఎక్కి సెక్యురిటి కాళ్ళు పట్టుకుని మరీ 

"అయ్యా.. ఒక్క అవకాశం ఇస్తే మా కల నెరవేరుతుం’దని, “ఉద్యోగం కోసం కంటి నిండా కునుకులేకుండా, కడుపునిండా తిండి లేకుండా చదివితే రెండు నిమిషాలు ఆలస్యం అని అనుమతించకపోతే మాలాంటి వాళ్ళం ఏమైపోవా"లని అందరి కాళ్ళు పట్టుకుని వేడుకున్నాడు. కనికరంతో దాస్ ని పరిక్ష కేంద్రంలోకి ఆనుమతిచ్చారు. 


అంతే.. ! అర్హత పరిక్షలో టాప్ ర్యాంక్ తో పాటు ప్రిలిమ్స్‌, మెయిన్, ఇంటర్వ్యూ మూడు దశలను అలవోకగా దాటి మెడికల్ టెస్ట్ పాస్ అయి బెంగళూరులో ఐపీఎస్ శిక్షణకు వెళ్ళాడు విటల్ దాస్. 


అలా ఇప్పుడు తల్లిదండ్రుల చెంతకు వచ్చి భావోద్వేగం చెందాడు. ఇప్పుడు దాస్ ఎందరికో స్ఫూర్తి. అతడి కుటుంబం గూర్చి ఒక పాఠం కూడా వచ్చిందంటే ఎంతగొప్ప విజయమో ఇట్టే అర్థం అవుతుంది. ఆస్తుల కోసం తగదాలు పడే ఈరోజులు ఎక్కడ.. ? దాస్ కోసం కుటుంబం అంత త్యాగాలు చేసిన ఆరోజులు ఎక్కడ.. ? 


ఇప్పుడు దాస్ కుటుంబం మురికివాడల్లో నుండి మహనగరానికి మారింది. 


 ఆరోజు తండ్రి వాళ్ళ కాళ్ళ మీద పడి ఏడవకపోతే ఈరోజు ఈ మట్టిలో మాణిక్యం దొరికేవాడే కాదు. ప్రపంచ అంతా నిద్రపోతున్న వేళ తన కొడుకు తిప్పిన పేజీల చప్పుళ్ళే విజయం సాధించి పెట్టాయని సీమయ్య రాణిని చూడ్డానికి వచ్చిన పెళ్లి సంబంధం వారికి చెప్పి మురిసిపోయాడు. 

**** **** **** **** **** ****


పిట్ట గోపి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం: పిట్ట గోపి ( యువ రచయిత )

Profile:

Youtube Playlist:

నా పేరు పిట్ట.గోపి నేను శ్రీకాకుళంలో అంబేద్కర్ యూనివర్సిటీలో ఎం ఏ సోషల్ వర్క్ పూర్తి చేశాను. నాకు సమాజాన్ని,సమాజంలో మనుషులను గమనించటం అలవాటు. ముఖ్యంగా సమాజంలో జరిగే ఏ చిన్న మంచి-చెడులనైనా.. మంచి కథలుగా మలచటంలో నాకు నేనే సాటి.వ్రృత్తిరిత్య నేను వ్యవసాయ కుటుంభంలో మద్యతరగతికి చెందిన వ్యక్తిని.ఇప్పటికే నేను రాసిన కథలు 90కి పైగా మన తెలుగు కథలు డాట్ కామ్ వెబ్సైట్ లో ప్రచూరితం అయ్యాయి.అలాగే ప్రతిలిపిలో కూడా నా కథలు అచ్చయ్యాయి. నా కథలు బహుమతులుకు ఎంపికకాకున్నా..(లాప్టాప్ లేదు) ఫోన్ లోనే టైపింగు చేయాలన్నా కథలు పంపాలనే ఆశక్తి తగ్గిపోతుంది. కానీ..! సమాజంలో జరిగే సంఘటనలకు అక్షరరూపం ఇచ్చి పదిమందికి తెలపాలనేదే నా అభిలాష. నా కథల్లో మంచి చెడులను పాఠకులు తెలుసుకుంటారని అనుకుంటున్నాను. ఎనిమిదో తరగతిలో జరిగిన చిన్న రోడ్డుప్రమాదంతో స్వల్ప వినికిడి సమస్య తలెత్తినా.. సామాన్యుడిగా ఉండటానికే ప్రాధాన్యతనిస్తా. ఈ రోజు మనం వేసే ప్రతి మంచి అడుగుని మనకంటే చిన్నవారు ఖచ్చితంగా అనుసరిస్తారనే ఆశ కలవాడిని. చదువుకునే ప్రతిఒక్కరు... సమాజం కోసం ఆలోచిస్తే... ఈ సమాజం అభివృద్ధి పథంలో నడువటం ఖాయం



42 views0 comments

留言


bottom of page