'May Be' written by BVD Prasada Rao
రచన : బివిడి ప్రసాదరావు
ఆఫీస్ నుండి శ్రావణ్ వచ్చాడు.
తలుపు తీసి పక్కకి జరిగిన భార్య వల్లి డల్ గా ఉన్నట్టు గుర్తించాడు.
తలుపు మూసి భార్యతో కదులుతూ, "ఏమైంది?" అనడిగాడు.
"రిప్రెషవ్వండి. కాఫీ కలుపుకు వస్తాను" అంది వల్లి ముభావంగా వంట గది వైపు వెళ్తూ.
"ఆగాగు. ముందు చెప్పు." అన్నాడు శ్రావణ్.
వల్లి ఆగింది. తిరిగింది. "ఏమీ లేదు" అంది. ఆమె ముఖాన నవ్వులేదు.
"ముందు ఇలా రా" అంటూ సోఫాలో చతికిల పడ్డాడు శ్రావణ్.
వల్లి వచ్చి భర్త పక్కనే కూర్చుంది.
భార్య కుడి అర చేతిని తన రెండు అర చేతుల్లోకి తీసుకొని, "ఏమైంద్రా" అన్నాడు శ్రావణ్ లాలనగా.
వల్లి ఎటో చూస్తూ, "అబ్బే ఏమీ లేదు" అంది కాస్తా ఇరకాటంగానే.
శ్రావణ్ వెంటనే ఏమీ మాట్లాడలేదు. ఆమెనే చూస్తూ ఉన్నాడు. వల్లి తల దించుకుంది. ఆ ఇద్దరికీ పెళ్లై 25 రోజులయ్యాయి. వారం క్రితమే భార్యని తీసుకొని శ్రావణ్ తిరిగి వచ్చాడు తను పని చేస్తున్న ఆఫీస్ ఉన్న ఈ ఊరికి. ఇద్దరి కొత్త కాపురం సజావుగా సాగుతుంది. ఆఫీస్ కి ఉదయం వెళ్లి సాయంకాలంకి తిరిగి వస్తున్నాడు శ్రావణ్. వల్లి లంచ్ కేరేజీ ఇస్తుంది. ఇంతకు ముందు శ్రావణ్ ఒంటరిగా ఉండడంతో తన ఫుడ్ అంతా బయటనే.
"ఈ రోజు లంచ్ కర్రీ భలే బాగుంద్రా. కంగ్రాట్స్" అన్నాడు శ్రావణ్. భార్యని కూల్ చేయడానికి శ్రావణ్ యత్నిస్తున్నాడు.
వల్లి అడ్డదిడ్డంగా తలాడించింది. కానీ మాట్లాడలేదు.
"నీ వంటలు బాగుంటున్నాయి. నీకు కుకింగ్ అంటే ఇష్టమా. మీ అమ్మగారి వద్ద నేర్చుకున్నావా" అన్నాడు శ్రావణ్ కుదురుగా.
"అవును. మా అమ్మ వంటలు బాగా చేస్తుంది." చెప్పింది వల్లి గబుక్కున.
కాస్తా కుదుట పడ్డాడు శ్రావణ్. చిన్నగా నవ్వుతూ, "నిజమే. నేను మీ ఇంటిలో తిన్నాను. మీ అమ్మగారి వంటలు బాగుంటాయి" అన్నాడు.
"అవునవును. మా వాళ్లంతా అమ్మని లేడీ నలభీమ అంటుంటారు" చెప్పింది
వల్లి. భార్యలో చలాకీని తిరిగి చూడడంతో శ్రావణ్ హుషారయ్యాడు.
"నువ్వు ఇలా గలగలా మాట్లాడితేనే నాకు హాయి రా" అన్నాడు శ్రావణ్.
వల్లి భర్తనే చూస్తుంది.
"నిజంరా. నేను రాగానే నువ్వు మరోలా అగుపించావు. గుబులయ్యింది" అన్నాడు శ్రావణ్ - వల్లి నుదిటి మీది కురులను సర్దుతూ.
వల్లి మౌనంగానే ఉంది. కానీ చిన్నగా నవ్వుతుంది.
"ఏమైందిరా. నా పొరపాటు ఏమైనా ఉందా" అడిగాడు శ్రావణ్ అనురాగంగా.
వల్లి చూపు మార్చుకొని, "అబ్బే! మీరు కాదు" అంది.
"ఐతే ఇంకెవరైనా కారణమా" శ్రావణ్ అడిగాడు గమ్మున.
వల్లి చిన్నగా కదిలింది. "మా అమ్మ ఫోన్ చేసి రోజూలానే మాట్లాడింది. కానీ ఈ రోజు తను బాగా ఎమోషన్ ఐంది. నా ఎడబాటుకు ఏడ్చింది." అని చెప్పింది చాలా నెమ్మదిగా.
శ్రావణ్ మాట్లాడలేదు. భార్యనే చూస్తున్నాడు. వల్లి కళ్లల్లో నీళ్లు తిరగడం అతడి కంట బడింది. ఆమెని కూల్ పర్చాలనుకున్నాడు.
"వీలు చేసుకొని నిన్ను మీ ఊరికి తీసుకు వెళ్తాను త్వరలోనే" అని, "లే. నాకు కాఫీ ఇవ్వు. ప్లీజ్" అన్నాడు. లేచాడు. గది వైపు కదిలాడు.
వల్లి లేచి వంట గది వైపు నడిచింది.
ఆ రాత్రి - మంచం మీదికి చేరగానే మరో వైపుకి తిరిగి వల్లి వెంటనే నిద్ర పోతున్నట్టు నటించింది. శ్రావణ్ గుర్తించాడు. మౌనంగా ఉండి పోయాడు. నిద్రకి నెమ్మదిగా ఉపక్రమించాడు.
మర్నాడు - ఆఫీసుకి వెళ్తూ, "సాయంకాలం త్వరగా వచ్చేస్తాను. బయటికి వెళ్దాం" అన్నాడు శ్రావణ్, వల్లితో.
అలానే ఆ సాయంకాలం త్వరగానే వచ్చేశాడు శ్రావణ్.
వల్లితో, "తయారవ్వు. అలా తిరిగి వద్దాం" అన్నాడు.
"వద్దండి. నేను రాలేను" అంది వల్లి.
భార్య ఇంకా తేరుకోలేదని గ్రహించాడు. "మా అత్తయ్యగారు ఎలా ఉన్నారు." అనడిగాడు చొరవగా.
"ఆఁ. మా అమ్మ బాగుంది." అని, "ఎక్కువ సేపు మాట్లాడలేదు. కాఫీ ఇస్తాను, రిప్రెషై రండి" అంది వల్లి. వంట గది వైపు వెళ్లిపోయింది.
ఆ రాత్రి నిన్నటి రాత్రిలానే ముగిసిపోయింది.
ఒక రోజు తర్వాత - "మా పై ఆఫీసర్ వస్తున్నాడు. నేను ఈ రోజు ఆఫీస్ నుండి రావడం లేటవుతుంది. నువ్వు డిన్నర్ చేసేయ్. ఓకే. టేక్కేర్" అంటూ వెళ్లిపోయాడు శ్రావణ్.
ఆ రాత్రి - తొమ్మిది గంటల ప్రాంతంలో డోర్ బెల్ మోగడంతో టివి చూస్తున్న వల్లి లేచి వెళ్లి తలుపు తీసింది.
ఆశ్చర్యపోయింది. ఎదురుగా తన తల్లి. ఆ వెనుక సూట్కేస్ తో భర్త. వెంటనే మాట్లాడలేక పోయింది.
ఆ ఇద్దరూ హాలు లోకి వచ్చిన తర్వాత - తనని కౌగిలించుకుంటున్న తన తల్లితో, "ఏమిటమ్మా ఈ రాక" అంది విస్మయంగా.
గది వైపు పోతున్న శ్రావణ్ ని చూస్తూ, "ఉదయం అల్లుడుగారు వచ్చారు. ఎకాఎకీన నన్ను బయలుదేరించారు. పది, పదిహేను రోజులు మీ వద్ద నేను ఉండేలా మీ నాన్నని ఒప్పించారు" చెప్పింది వల్లి తల్లి ఆనందంగా.
వల్లి మురిసిపోయింది. తల్లిని కౌగలించుకుంది.
ఆ రాత్రి - మంచం మీదికి చేరగానే భర్త వైపుకి తిరిగి, అతడి ఛాతీ మీద తలని
సుతిమెత్తగా ఆన్చి, "థాంక్సండీ" అంది వల్లి నిండుగా.
శ్రావణ్ సరదా అయ్యాడు.
వల్లి తలెత్తి భర్త ముఖంలోకి చూస్తూ, "మాట వరసకైనా చెప్పలేదేమండీ" అంది ముచ్చటగా.
"నిన్ను సర్ప్రెజ్ చేద్దామని." అని నవ్వి, "నిన్నే తీసుకు వెళ్దామనుకున్నాను. మనం వెళ్తే నా ఆఫీస్ వలన అక్కడ రెండు, మూడు రోజుల కంటే ఎక్కువ ఉండలేం. అలాగని నిన్ను అక్కడ దించేసి నేను రాలేను. నిన్ను వదిలి ఉండలేను. సో, ఇలా వెళ్లాను, అలా మీ అమ్మగారిని తీసుకు వచ్చేశాను. ఇక ఎంచక్కా మీరు కొన్నాళ్లు కలిసి మెలిసి ఉండండీ" అన్నాడు.
భర్త పెదాలపై వల్లి తన పెదాల్ని గాఢంగా ఒత్తింది. శ్రావణ్ ఉక్కిరిబిక్కిరయ్యాడు.
ఆ పిమ్మట - "నాకు తెలుసు. పెళ్లైన కొత్తలో తల్లుల క్రుంగుపాటు. మా అమ్మని చూశాను. మా అక్కకి పెళ్లి ఐన కొత్తలో అమ్మ చాలా మూడవుట్ అయ్యింది." అని చెప్పాడు శ్రావణ్.
"మీరు చాలా మంచోళ్లండీ" అంది వల్లి తనివిగా.
"ప్రతి అమ్మ ఇంతేనేమో." అని, "పెళ్లికి ముందు తల్లి, కూతురు ఎక్కువగా కలిసి మెలిసి తిరగడమే కారణం కావచ్చు" అన్నాడు శ్రావణ్.
"మే బి" అంది వల్లి చిత్రంగా కళ్లు తిప్పుతూ.
***శుభం***
మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి
రచయిత పరిచయం : బివిడి ప్రసాదరావు.
రైటర్, బ్లాగర్, వ్లాగర్.
వీరి బ్లాగ్ - బివిడి ప్రసాదరావు బ్లాగ్
వీరి యూట్యూబ్ ఛానల్ - బివిడి ప్రసాదరావు వ్లాగ్
వీరి పూర్తి వివరాలు ఈ క్రింది లింక్ ద్వారా తెలుసు కోవచ్చు.
Comentarios