#Melukolupu, #మేలుకొలుపు, #Gorthi VaniSrinivas, #గొర్తి వాణిశ్రీనివాస్, #TeluguStory, #తెలుగుకథ, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు
వారం వారం బహుమతుల పథకంలో ఈ వారం ఉత్తమ కథగా (19/01/2025) ఎంపికైన కథ

Melukolupu - New Telugu Story Written By Gorthi VaniSrinivas
Published In manatelugukathalu.com On 19/01/2025
మేలుకొలుపు - తెలుగు కథ
రచన: గొర్తి వాణిశ్రీనివాస్
(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)
కథా పఠనం: పద్మావతి కొమరగిరి
మురారి అల్లుడు, కూతురు సంక్రాంతి పండక్కి వస్తూ వర్క్ ఫ్రమ్ హోం పెట్టుకుని లాప్ టాప్ లతో సహా వచ్చారు. వచ్చినప్పటినుంచి ఎడమొహం పెడమొహంగా వున్నారు. ఎవరి గది వాళ్లకు కావాలన్నారు.
“అదేంటి అమ్మలూ.. ఇద్దరూ ఆ పెద్ద గదిలో వుండండి. ఏసీ వుంది. గది విశాలం కూడా కదా” అన్నాడు మురారి.
“మా ఇద్దరికీ డిఫరెంట్ టైమింగ్స్ లో కాల్స్ వస్తే ఒకరివల్ల ఇంకొకరికి ఇబ్బంది కలుగుతుంది నాన్నా. నేను వేరే రూమ్ తీసుకుంటాను” అంది కూతురు సౌమ్య.
ఒకరు అమెరికన్ కంపెనీకి, ఇంకొకరు ఆస్ట్రేలియా కంపెనీకి పనిచేస్తారు. ఎవరి గదుల్లోకి వాళ్ళు, ఎవరి మటుకు వాళ్లుంటున్నారు తప్ప ఇద్దరూ మాట్లాడుకోవట్లేదని గమనించాడు మురారి.
కొత్త దంపతులకు బట్టలు కొనాలి షాపుకి వెళ్ళాలని పట్టుపట్టింది మాధవి.
“పండగ ఇంకా చాలా రోజులు వుందిగా మాధవీ, తర్వాత వెళదాం. నువ్వేం కంగారుపడకు” అన్నాడు.
“తర్వాత షాపులన్నీ రద్దీగా వుంటాయి. ఇప్పుడు కొనుక్కుంటే, బట్టలు కుట్టే టైలర్లకు వీలుదొరుకుతుంది. పండగ దగ్గర చేసి వాళ్ళూ కుట్టలేరు” అంది మాధవి.
ఆదివారం అందరూ షాపుకి బయల్దేరారు. అందరూ కారు దిగి షాపులోకి వెళుతుంటే సరిగ్గా ఆ పక్కనే డ్రైనేజ్ వుంది. దానిమీద కాగితాలు కవర్లు కప్పి ఉన్నాయి. వాటిని చూసుకోకుండా అందులో కాలేసి మొకాళ్ళ లోతు దిగబడ్డాడు మురారి. హటాత్తుగా జరిగిన ఆ పరిణామానికి అందరూ ఖంగుతిన్నారు అల్లుడు శ్రీకర్, చటుక్కున తేరుకుని మామగారిని పట్టుకుని భుజం ఆసరా ఇచ్చి మెల్లగా కాలు వెనక్కి లాగి బయటకు తీశాడు. షాపు మెట్లమీద కూర్చోపెట్టి కాలు ఒళ్ళో పెట్టుకుని సరిచేసాడు. కాలు ఒళ్ళో పెట్టుకోడం వల్ల ప్యాంట్ కి కాస్త రక్తం మరకలు అంటాయి.
“అయ్యో అల్లుడు గారూ. మీ బట్టలు పాడవుతున్నాయ్. లేవండి నేను ఆయన్ని చూసుకుంటాను” అంది మాధవి గాభరాగా.
“ఏం పర్వాలేదు అత్తయ్యా, ఆయన నా కాళ్ళు కడిగి కన్యాదానం చేసిన మామగారు. అప్పుడు నా పాదాలు పట్టుకున్నారు కదా. పిల్లనిచ్చిన మామగారి రుణం ఇలాంటప్పుడే తీర్చుకోగలం. నా భార్యకి తండ్రి నాకూ తండ్రితో సమానం” అని చెప్పి పక్క షాపులోంచి గాజుగుడ్డ, మందు తెప్పించి కట్టు కడుతూ భార్య సౌమ్య మొహంలోకి చూడగానే ఆమెలో కోటి భావాలు కదలాడడం మురారి చూశాడు.
వీళ్ళిద్దరి మధ్యా ఏదో జరుగుతోందని అనుమానం అతనిలో బలపడింది.
____________
“నిద్రపోలేదా? కాలు నొప్పెడుతోందా?” అని లేచి లైట్ వేసింది మాధవి.
“కాలు నొప్పేం లేదుగానీ, మనసులో ఏదో అలజడిగా వుంది మాధవీ. మన సౌమ్య అల్లుడుగారితో సంతోషంగా వున్నట్టు అనిపించట్లేదు. ఆ పెళ్లి చేసి మనం తప్పు చెయ్యలేదు కదా?!” అన్నాడు మురారి మంచం మీద కూర్చుని కాలికి కట్టిన కట్టు సరిచేసుకుంటూ.
“అలాంటి అనుమానం మీకెందుకొచ్చింది?! ఇష్టమా కాదా అని అడిగే చేశాం. మీరివేం మనసులో పెట్టుకోకుండా హాయిగా పడుకోండి” అంది మాధవి.
“రేపు మనం అంతర్వేది వెళదాం మాధవీ” అన్నాడు మురారి.
“వున్నట్టుండి ఈ ప్రయాణం ఎందుకండీ?” ఆశ్చర్యంగా అడిగింది.
“నిన్న మనం షాపుకి వెళ్ళినప్పుడు నేను పడిపోయానుకదా! అప్పుడు అల్లుడు నా కాలు పట్టుకున్నాడుగా. అమ్మాయి అతన్ని అదోలా చూసింది. అల్లుడికి లేని ఇబ్బంది అమ్మాయికి ఎందుకు?! ఎందుకో కోపంగా చూసుకున్నారు ఇద్దరూ. ఎందుకలా వున్నారని అడిగితే ఏం చెబుతారో? చెప్పలేక తిరిగి వెళ్ళిపోతామంటారో? అలా కాకూడదంటే వాళ్ళకి దాంపత్యం గురించీ, వివాహ బంధాన్ని కాపాడుకోవడం గురించీకొన్ని మాటలు చెప్పాలి అందుకు ఒక కారణం కావాలి. మా కోలిగ్ కొడుకు పెళ్లికి అంతర్వేది రమ్మని పిలిచాడు. ఆ వంకతోనైనా వెళదాం. ఉభయకుశలోపరిగా కలిసి వస్తుంది. నోటితో చెప్పలేని కొన్నిటిని దృశ్యంగా చూపించి చెబితే అర్థమవుతుందేమో చూద్దాం. ” అన్నాడు. భర్త మాటల్లోని అంతరార్ధాన్ని గ్రహించి సరే అంది మాధవి.
@@@@@@@@
“మహారాష్ట్ర నాసికాత్రయంబకంలో పుట్టిన గోదావరి ఎన్నో పాయలుగా చీలి, రాజమహేంద్రవరం వరకూ ప్రవహిస్తూ వచ్చి, చిట్టచివరిగా కోనసీమ జిల్లాలో సఖినేటిపల్లి మండలంలోని అంతర్వేది చేరుకుని బంగాళా ఖాతంలో కలిసిపోవడం ఓ సుందర ఘట్టం. దాన్నే సాగరసంగమం అనిపిలుస్తారు. ఇక్కడ ఒక చిన్న ఐలెండ్ కూడా వుంది. మడ అడవులు కూడా చూపిస్తాను” అని బోట్ ప్రయాణీకులకు వివరంగా చెప్పాడు గైడ్.
మురారికి కుటుంబ సమేతంగా లాంచీ ప్రయాణం ఆనందాన్నిచ్చింది. కళ్ళు తిప్పుకోలేని ప్రకృతి రమణీయ దృశ్యాలను ఆస్వాదిస్తూ కూర్చున్నారు.
మేఘాలు నీటి అద్దంలో చూసుకుని సోకు చేసుకుంటున్నట్టు, ఆకాశం వంగి సూర్యుడ్ని అలలలో ముంచి తీస్తున్నట్టు, గగనం భువనం కలిసిపోయినట్టు రకరకాల దృశ్యాలు కనువిందు చేస్తున్నాయి. లాంచీ మెల్లగా సాగుతూ గోదావరి నది, సముద్రం కలిసి ప్రవహిస్తున్న చోటికి చేరుకుంది.
“అటు చూడండి. ఈ పవిత్ర గోదారమ్మ, ఆ కల్లోల సముద్రం కలిసే చోటు ఇది.
అటు వైపు పరవళ్ళు తొక్కుతున్న సముద్రం, ఇటువైపు ప్రశాంతంగా సాగుతున్న గోదావరి నది. రెండూ ఒక్కచోటే వున్నాయి. దూరం నుంచి చూస్తే రెండూ కలిసి పోయినట్టున్న విశాలమైన జలరాశిలా కనిపించినా రెండూ వేరువేరుగా వుంటూ కలిసి ముందుకు సాగటం చూడదగిన అద్భుతాల్లో ఒకటి. సముద్రం, నది కలిసినా వాటి గుణాలు మారలేదు చూశారా? సముద్రం నీలి రంగులో వుంది. దాన్ని ఆనుకునే నది కాస్త ఎర్రగా వుంది. అంత పెద్ద సముద్రం నదిని వెనక్కి నెట్టలేక అక్కడక్కడే అలలు కొట్టుకుంటున్నాయి. నది కూడా వెనక్కి తగ్గట్లేదు. సముద్రాన్ని ఆ గీత దాటనివ్వట్లేదు. కానీ చాలా ప్రశాంతంగా ప్రవహిస్తోంది. అందరూ నిలబడి చూడండి” గైడ్ చెప్పాడు.
“చాలా బాగుంది కదా నాన్నా. నదీ సముద్రం కలిసి ప్రవహిస్తూ వెళ్ళటం చూస్తుంటే, విభిన్న వ్యక్తిత్వాలున్న ఇద్దరు మనుషులు కలిసి వెళుతున్నట్టుగా వుంది. ఈ అంతర్వేది తీర్థానికి అందుకే అంత మహిమేమో” అంది సౌమ్య సంభ్రమంగా చూస్తూ.
“అదేనమ్మా సృష్టి చిత్రం. పురుషుడు గంభీర సముద్రమైతే, స్త్రీని ప్రశాంత నదితో పోలుస్తారు. కల్లోలం ఒకవైపు, సహనం ఒకవైపు. సరిసమానంగా సాగినపుడే ఇద్దరి ఉద్దేశ్యాలు ఫలిస్తాయి. అంత సాగరాన్ని నిలువరించి, తనతో కలుపుకుంటూ ముందుకు సాగే గుణం నదీమతల్లికి ఆభరణం. అంత ఘోషించే సముద్రుడు కూడా తన ఘోష తనదే తప్ప నదిని ఇబ్బంది పెట్టలేదు. దూడుకుతనానికి ఒడుపుగా సమాధానం చెప్పాలని ఈ గోదావరి ద్వారా ప్రకృతి చెప్పే పాఠాలు సృష్టిలో ఎన్నో వున్నాయి” చెప్పాడు మురారి.
తండ్రి తనతో చెప్పాలని తాపత్రయ పడటం చూస్తుంటే భర్తకూ తనకు గొడవలు వున్నట్టు పసిగట్టాడని అర్థమైంది.
“ఇంటికి వెళ్ళాక మీతో మాట్లాడతాను నాన్నా”అని చెప్పింది సౌమ్య. లక్ష్మీ వరాహ నరసింహ స్వామి గుళ్ళో పెళ్ళికి వెళ్లి భోజనం చేశాక తిరిగి వెనక్కి బయల్దేరారు. ఆరోజు సాయంత్రానికి ఇంటికి చేరుకున్నాక, కొద్దిసేపు ఆఫీస్ వర్క్ పూర్తి చేసుకుని తండ్రి గదిలోకి వచ్చింది సౌమ్య.
“రామ్మా!” అని లోపలికి పిలిచి కూర్చోపెట్టాడు. ఆమె ఏదో చెప్పేందుకు తటపటాయిస్తుంటే
“తండ్రి దగ్గర, భగవంతుడి దగ్గర ఏదీ దాచకూడదు తల్లీ. నీ సంతోషాన్ని నీతోనే వుంచుకోవచ్చు. కానీ బాధను నాతో పంచుకో.
నిన్ను ఇంటర్ దగ్గర్నుంచి హాస్టల్ లో వుంచి చదివించాం. మాకు నువ్వు దూరంగా వున్నా మా ప్రాణాలు నీమీదే పెట్టుకుని బతికాం. చిలకా గోరింకల్లా వుండాల్సిన వాళ్ళు, ఇలా ఎడమొహం పెడమొహంగా వుండటం చూస్తుంటే మా నిర్ణయం తప్పేమో అనిపిస్తోంది” అన్నాడు బాధగా.
సౌమ్య వెంటనే లేచి తండ్రి పక్కన కూర్చుని “మీ నిర్ణయంలో తప్పు లేదు నాన్నా. ఆయనే మనల్ని మోసం చేసారు. మా అత్తగారు ఆయన సొంత తల్లి కాదని ముందు చెప్పలేదు. మా అత్తగారు శ్రీకర్ చిన్నప్పుడే పోయారుట. ఆయాగా వచ్చినామె క్రమంగా ఇంట్లో మనిషిలా మారిపోయింది. పెళ్లి చూపులకు కూడా ఆమెనే తీసుకొచ్చారు. పెళ్ళిలో నడుం కట్టి పనిచేసింది. ఇంట్లో పెత్తనం చేసింది. అంతా ఆవిడే అత్తగారనుకున్నాం. ఆయానే అసలు విషయం చెప్పింది.” చెప్పి ఆగింది సౌమ్య.
మురారి, మాధవి ఆశ్చర్యంతో విన్నారు.
“ఆవిడ మీ అత్తగారు కాదా! అతను ముందుగా చెప్పి వుండాల్సింది. చెప్పలేదని అలిగావా?”
అడిగింది మాధవి.
“అదికాదమ్మా.. నెలరోజుల క్రితం ఆవిడ బాత్ రూమ్ లో పడిపోతే నేను లేపి
తీసుకొచ్చి ఆవిడ కాలు నా ఒళ్ళో పెట్టుకుని మందు రాసి, కాపడం పెట్టాను. అత్తగారికే కదా చేస్తున్నాను అనుకున్నాను. కానీ ఆవిడ ఆయా అని చావు కబురు చల్లగా తెలిసింది. తెలిశాక కూడా ఎలా సేవలు చెయ్యను? ఆవిడ తన తల్లి కాదని చెప్పకపోవడం తప్పు కాదా? నేనెందుకు సేవలు చెయ్యాలి. నిన్న మీరు పడిపోయారు. నా కన్నతండ్రి కాబట్టి మీకు శ్రీకర్ సేవలు చేసినా తప్పులేదు. ఆయన నిన్న నా వైపు ఎలా చూశారో మీరూ గమనించే ఉంటారు. నేను మీ నాన్నను చూస్తున్నాను. కాబట్టి నువ్వు మా ఆయాను చూడాలని చెప్పకనే చెప్పినట్టు కాదా?!” ఆవేశంగా చెప్పింది సౌమ్య.
“అంటే, ఆవిడ మీ మామగారికి భార్య కాదా?” సందేహం వెలిబుచ్చింది మాధవి.
“ఆయా తనకి తల్లేనట. కానీ తన తండ్రికి భార్య కాదుట. సమాజం కోసం పసుపు తాడు కట్టినా ఆమెతో ఏ సంబంధం లేదుట. ఇవేం బంధాలో నాకర్ధం కావట్లేదు. ఆయన తల్లి మా మామగారికి భార్య కానప్పుడు నాకు అత్త ఎలా అవుతుంది? ఆయనకి తల్లి లేని లోటు తీర్చింది కాబట్టి అత్త అవుతుందని ఆయన వాదన. ఆయా ప్రమేయం మా ఇంట్లో వుండకూడదని నేనన్నాను. ‘ఆవిడ దిక్కులేనిది. ఇన్నాళ్ళూ ఈ ఇంటి కష్టసుఖాల్లో పాలు పంచుకుంది. ఇప్పుడు ఎక్కడికి పోతుంది. ఆవిడ కట్టె కాలేవరకూ మనతోనే వుంటుంది. ఆవిడ బాగోగులు నేను చూసుకుంటాను. నువ్వు ఆవిడ పనులు చేయద్దు’ అన్నారు ఆయన. అయినాగానీ ఇలాంటి బంధాలను ఎలా సమర్ధించను?! జీర్ణం చేసుకోలేకపోతున్నా. అందుకే మా మధ్య మాటలు కరువయ్యాయి” చెప్పటం ఆపింది సౌమ్య.
మురారి, మాధవి కొంతసేపు అచేతనంగా వుండిపోయారు. మురారి నోరు విప్పాడు.
“అమ్మా! కొందరి జీవితాలు విచిత్రంగానే వుంటాయి. అతను ఆయమ్మ గురించి మనకు పెళ్ళికి ముందు చెప్పకపోవడం తప్పే. ఒక్కసారి మనం కూడా అటువైపు నుంచి ఆలోచించి చూద్దాం. పసిపిల్లాడిని తల్లిలా పెంచిన ఆయా తండ్రికి భార్య కాదు అని అతను చెప్పాడనుకో. మనం ఈ పెళ్లికి ఒప్పుకుంటామో లేదో అనే సందేహం కలిగి వుండొచ్చు. అందుకే చెప్పలేదేమో.
ఇకపోతే ఆవిడ నీమీద అత్తగారి హోదాతో పెత్తనం చేలాయించినప్పుడే నీకు సమస్య. లేనప్పుడు దాని గురించి సానుకూలంగా ఆలోచించి అర్థం చేసుకోడానికి ప్రయత్నించు” అని చెప్పిన తండ్రి మాటలకు సౌమ్య కన్వెన్స్ కానట్టు చూసింది.
“ఆ ఆయాను అత్తగా అనుకోలేను. ఆయన మిమ్మల్ని గౌరవంగా చూసి నన్నూ ఆమెను చూడమంటే నావల్ల కాదు. తనను ఆయాగానే చూస్తాను. నా తల్లి దండ్రుల్ని మాత్రం ఉన్నతంగా చూడాలి. అదీ నా కండిషన్” తెగేసి చెప్పేసింది సౌమ్య.
మురారి ఏదో అనబోయేంతలో మాధవి వారిస్తూ “చిన్నా! నేను రచయిత్రిని అని నీకు తెలుసుగా. నేను రాసిన వాటిల్లో ఒక కథ చెబుతాను. ఒకరోజు జోరున వర్షం పడుతోంది. ఆఫీస్ రూమ్ లో కూర్చున్న ఒక వ్యక్తికి కిటికీలోంచి చంటి బిడ్డ ఏడుపు వినిపించింది. ఈ వర్షంలో ఎవరై వుంటారా అని గొడుగుతో వెళ్లి చూశాడు. బట్టలు చినిగిపోయి, జుట్టు రేగిపోయి వున్న ఒకామె చెట్టుకింద కూర్చుని చంటి బిడ్డను ఒళ్ళో పెట్టుకుని వుంది. ఆ పరిస్థితుల్లో ఆమెను చూడగానే అతని గుండె నీరయ్యింది.
ఆ చెట్టుకింద అమ్మాయి చేతుల్లో ఓ బిడ్డ. ఆకలితో ఏడ్చి ఏడ్చి నోరెండిపోయి సొమ్మసిల్లి చేతుల్లో వాలిపోయాడు. ఆమెను అతను వుండే గదిలోకి తీసికెళ్ళి కూర్చోపెట్టాడు. వాన కొట్టి కురుస్తోంది అప్పుడు. ‘ పిల్లాడికి పాలివ్వకుండా అలా చూస్తావే’ అన్నాడు.
“వీడు మా అక్కయ్య కొడుకు. మా అక్క చనిపోతే వీడ్ని నేను తీసుకెళుతుంటే మధ్యలో గాలివాన వచ్చింది. బొమ్మలు చేసుకుని అమ్ముకునే పేద కుటుంబంలో పుట్టిన నేనూ, మా అక్క ఒకే పోలికలో వున్న కవల పిల్లలం. ఒక దుర్మార్గుడు మాయమాటలు చెప్పి మా అక్కను తీసుకెళ్ళిపోయాడు. ఆమెకు వీడు పుట్టాక వదిలేసి మళ్ళీ నాకోసం వచ్చాడు. ‘అసలు నేను ప్రేమించింది నిన్నే. నీకే నా మనసిచ్చాను. నువ్వనుకుని మీ అక్కని చేరదీసాను. కాదని తెలిసి పశ్చాత్తాపంతో కుమిలిపోయాను. నువ్వు లేకపోతే బతకలేను. చచ్చిపోతాను’, అని రైలు పట్టాలపై పడుకున్నాడు.
వాడి మాటల్లో మోసం వుందని తెలిసినా, అక్క ఎక్కడుందో తెలుసుకునేందుకు వాడి వెంట వెళ్ళాను. అక్క మురికి వాడలో దుర్భరమైన జీవితం గడుపుతూ కొడుకుని కని కన్నుమూసిందని తెలిసి కుళ్లి కుళ్లి ఏడ్చాను. వాడు అక్కకి చేసిన మోసమే నాకూ చేయాలని చూస్తున్నాడని గ్రహించి అతని కన్నుగప్పి బాబుని తీసుకుని పారిపోయేందుకు ప్రయత్నిస్తుంటే అతను నన్ను వెంబడించి, నా జీవితాన్ని నాశనం చేసి వెళ్ళిపోయాడు.
నా బతుకు పాడైపోయినా మా అక్క కొడుకుని తీసికెళ్ళి అమ్మానాన్నలకు అప్పగించాలని చేసిన ప్రయత్నం విఫలమైంది.” అని చెప్పి భోరున ఏడ్చింది.
అప్పటికే బాబు ఆకలితో ఏడ్చి కన్ను మూశాడు. తన ప్రయత్నం వృధా అయిందని, ఇక ఇంటికి తిరిగి వెళ్ళలేనని రైలు పట్టాలపై పరిగెడుతూ ఆత్మహత్యకు పాల్పడింది. ఆమెను వారించి, నచ్చచెప్పి ఇంటికి తీసుకొచ్చి ఆశ్రయం ఇచ్చాడు. అప్పుడు ఆమె వయసు పద్దెనిమిది. అతని వయసు పాతిక. ‘ఒకే ఇంట్లో ఏ బంధం లేకుండా ఎలా వుండను?’ అని అడిగింది. బాగా ఆలోచించి ఆమె మెడలో పసుపుతాడు కట్టి భార్యగా చేసుకున్నాడు. కానీ ఆ దుర్మార్గుడు చేసిన పాపానికి ఫలితం ఆమె కడుపులో మోస్తోందని కొన్ని నెలలకి తెలిసి ఆ గర్భాన్ని పోగొట్టుకునేందుకు ప్రయత్నించింది.
అలా చేస్తే తల్లి ప్రాణాలకు ప్రమాదం అని డాక్టర్ గట్టిగా చెప్పడంతో, అతను ఆమెకి ఎన్నో విధాలుగా నచ్చచెప్పి, ఆ ప్రయత్నాన్ని విరమింపజేశాడు. తొమ్మిది నెలలు నిండాక ఆడపిల్ల పుట్టింది. ఆమెతో పాటు, ఆమె కూతుర్ని కూడా బాగా చూసుకున్నాడు. ఎందుకంత త్యాగం చేశారని ఆమె ఎన్నోసార్లు అడిగింది. ఒక్కటే సమాధానం. అందరి జీవితాలు ఒక్కలా వుండవు. యదాతధంగా స్వీకరించడం మనిషి కర్తవ్యం’ అనినమ్మిన వ్యక్తి నీడన ఆమె జీవితం పుణీతమయ్యింది. ” మాధవి చెప్పడం ఆపింది.
“అమ్మా, అంత గొప్ప మనుషులు వుంటారా? అసలు ఇది కథా? నిజమా?”అనడిగింది ఆశ్చర్యంగా.
“నిజం లాంటి కథ. నొప్పించక తానొవ్వక జీవితాన్ని సాఫీగా నడుపుకోవాలి తప్ప, ప్రతి విషయాన్నీ భూతద్దంలో పెట్టి చూడకూడదు. నీ భర్తను పెంచిన ఆయా విషయంలో పెద్ద మనసుతో ఆలోచించి చూడు. మనసు విశాలం చేసుకుంటే మీ ఇద్దరి అన్యోన్యతకు లోటురాదు. ” తల్లి చెప్పింది కేవలం కథ అని విని మార్చిపోయేది కాదు. ఆలోచించేలా చేసి వెంటాడే కథ.
“లోకంలో ఎందరో గొప్పవాళ్ళు వున్నారు. మనం ఎంతవాళ్ళం అనిపిస్తోంది. ఒక తల్లిగా కూతురికి అర్థమయ్యేలా మంచి కథ రూపంలో చక్కగా చెప్పావు. శ్రీకర్ ని అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తానమ్మా. చాలా థాంక్స్ నీకు. పొద్దుపోయింది పడుకోండి నాన్నా. శుభరాత్రి” అని చెప్పిన సౌమ్య భర్త గదిలోకి వెళ్ళటం చూసిన మురారి దంపతులు సంతోషించారు.
“ఆ విధి వంచిత తన తల్లే అని తెలిస్తే సౌమ్య ఎంత బాధపడుతుందో తెలీదుగానీ, ఆ గొప్ప మానవతా వాది తన తండ్రి అని తెలిస్తే పొంగిపోయేదేమో. కానీ చెప్పలేకపోయానండీ” అంది మాధవి కళ్ళు తుడుచుకుంటూ.
“అవసరం లేదు మాధవీ. మన మౌన భాష అమ్మాయి మనసుకు చేరింది. ఇక మీదట తన భర్తతో ఎలాంటి సమస్యలొచ్చినా తెలివిగా పరిష్కరించుకుంటుంది. ” అన్నాడు మురారి.
సన్నని మంచుతెరలు కప్పుకున్న జగతికి నులివెచ్చని కిరణాలు మేలుకొలుపు పాడాయి.
***
గొర్తి వాణిశ్రీనివాస్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం : గొర్తి వాణిశ్రీనివాస్(గృహిణి)
నా పేరు గొర్తివాణి
మావారు గొర్తి శ్రీనివాస్
మాది విశాఖపట్నం
నాకు ఇద్దరు పిల్లలు
కుమార్తె శ్రీలలిత ఇంగ్లండ్ లో మాస్టర్స్ చేస్తోంది
అబ్బాయి ఇంజనీరింగ్ చదువుతున్నాడు.
రచనల మీద ఎంతో మక్కువతో
కవితలు, కథలు రాస్తున్నాను.
విశాలాక్షి, సాహితీకిరణం, సాహో,సహరి,విశాఖ సంస్కృతి,సంచిక,
ప్రస్థానం, కథా మంజరి, హస్యానందం, నెచ్చెలి, ధర్మశాస్త్రం, ఈనాడు,షార్ వాణి తెలుగుతల్లి కెనడా, భిలాయి వాణి, రంజని కుందుర్తి వంటి ప్రముఖ సంస్థలు నిర్వహించిన పలు పోటీలలో బహుమతి అందుకోవడం ఒకెత్తైతే మన తెలుగు కథలు. కామ్ వారి వారం వారం కథల పోటీలలో బహుమతులు అందుకోవడంతోపాటు
ఉత్తమ రచయిత్రిగా ఎంపిక కాబడి రవీంద్రభారతి వేదికగా పురస్కారం దక్కడం నా రచనా ప్రస్థానంలో ఒక మైలురాయిగా నిలిచింది.
మానవ సంబంధాల నేపథ్యంలో మరిన్ని మంచి రచనలు చేసి సామాజిక విలువలు చాటాలని నా ఈ చిన్ని ప్రయత్నం. మీ అందరి ఆశీర్వాదాలను కోరుకుంటూ
గొర్తివాణిశ్రీనివాస్
విశాఖపట్నం
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి బిరుదు పొందారు.

@vijayasreemukhi3817
• 1 hour ago
వాణి గారి కథ మేలుకొలుపు అర్థవంతంగా చాలా బాగుంది. పద్మావతి గారు మరింత భావయుక్తంగా చదివితే మరింతగా బాగుండేది. ఇద్దరికీ అభినందనలు!❤️❤️
@BhagavathulaBharathi-x5t
• 4 hours ago
మేలుకొలుపు కథ అనేక మలుపులతో ఉత్కంఠ భరితంగా సాగింది. వాణీకి అభినందనలు.చదివిన పద్మావతి గారికి....❤️
@vanigorthy6887
• 6 hours ago
పద్మావతి గారు బాగా చదివారు. కానీ....కొన్ని అక్షరాలు మరికొంచెం బాగా చదవాలి....ణి, ళ్ళు... ళ్ళ లాంటి అక్షరాలను ల గా పలక కుండా వుంటే మిగిలినదంతా అద్భుతం అన్యధా భావించకండి ️
@vanigorthy6887
• 7 hours ago
శుభోదయం.మేలుకొలుపు కధ చాలా బాగుంది.ముఖ్యంగా మానవత్వ విలువలు లేకుండాపోతున్న ఈ రోజుల్లో నేటి యువతకు వాటిగురించి తెలిసేటట్టుగా వుంది. జయశ్రీ శాస్త్రి
@srinivasgorty3375
• 8 hours ago
బాగుంది