#YasodaPulugurtha, #యశోదపులుగుర్త, #మేనరికం
, #Menarikam, #TeluguFamilyStory, #తెలుగుకుటుంబకథ
Menarikam - New Telugu Story Written By Yasoda Pulugurtha
Published In manatelugukathalu.com On 23/11/2024
మేనరికం - తెలుగు కథ
రచన: యశోద పులుగుర్త
(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
రాజేశ్వరి కి భర్తపోయాడు.. ఇద్దరు మగపిల్లలను, ఆడపిల్లను, భర్త మిగిల్చి పోయిన రెండు ఎకరాల పొలం మీద వచ్చే ఆదాయంతోనూ, ఇంటిలో ఒక వాటా మీద వచ్చే అద్దెతోనూ, ఇంటి చుట్టుపక్కల తెలుసున్నవారికి చిన్నా చితకా పిండివంటలు చేసి ఇవ్వడం, అలాగే పచ్చళ్లు చేసి అమ్ముతూ ఉన్నంతలో పొదుపుగా ఉంటూ పిల్లలని చదివించుకుంటోంది..
పెద్దవాడు సుధాకర్ డిగ్రీ పూర్తి అయినాక కొన్ని నెలలు ఏవో కంప్యూటర్ కోర్సులు చేసాడు. అదృష్టవశాత్తూ గవర్నమెంట్ ఆఫీసులో క్లర్క్ ఉద్యోగం వచ్చింది.. రెండోవాడు పాలిటెక్నిక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. కూతురు ఇంటర్ మీడియట్ మొదటి సంవత్సరం చదువుతోంది.
సుధాకర్ ఉద్యోగంలో చేరడంతో రాజేశ్వరి కి కాస్త ఊపిరి పీల్చుకునే సమయం కలిగింది. చిన్న కొడుకు హరిక్రిష్ణ పాలిటెక్నిక్ పూర్తి చేసాకా ఇంజనీరింగ్ చదవాలని ఉబలాటపడుతున్నాడు. ఆఖరిది కూతురు మాధురి. కనీసం డిగ్రీ అయినా చదివించి మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలని రాజేశ్వరి అనుకుంటోంది. సుధాకర్ కి ఉద్యోగం వచ్చేకా ఆవిడ ఆశలూ, కోరికలూ అన్నీ సుధాకర్ మీదే పెట్టుకుంది.
అయినా ఆవిడ తన పనులను ఎప్పటిలా చేసుకుంటూ ఉన్నంతలో పొదుపుగా ఉంటోంది.
సుధాకర్ మొదటి నెల జీతం అందుకున్నాడు. ఆ రోజు రాత్రి భోజనం వడ్డిస్తున్న రాజ్యలక్ష్మి సుధాకర్ తో "నాన్నా సుధా, నీకు వచ్చే ప్రతీ నెల జీతంలో నీ అవసరాలకు కొంత డబ్బు ఉంచుకుని మిగతాది బేంక్ లో వేయి. హరి చదువు, మాధురి పెళ్లి మన ముందు ఉన్న పెద్ద సమస్యలు. ఒక నాలుగైదు సంవత్సరాలు జాగ్రత్తగా ఉంటే హరి కూడా ఉద్యోగం వచ్చి స్తిరపడ్తాడు. మాధురి కి కూడా డిగ్రీ పూర్తి అవుతుంది. ఏదైనా సంబంధం చూసి పెళ్లి చేయచ్చు".
"అమ్మా ఈ నెల జీతంలో నాకు కావలసిన బట్టలు, షూస్ కొనుక్కోగా ఒక అయిదు వేలు మాత్రమే మిగిలాయి. ఆఫీస్ కు వెళ్లడానికి సరి అయిన బట్టలు లేవు. ఇన్నాళ్లూ చెప్పులు వేసుకుని తిరిగాను. అందరూ ఎంత టిప్ టాప్ గా వస్తారో తెలుసా? షూస్ లేకపోతే బాగుండదని షూస్ కొనుక్కున్నాను. ఒక మంచి వాచ్ కూడా కొనుక్కోవాలని అనుకుంటున్నాను".
"సుధాకర్ మాటలకు ఆవిడ తెల్లబోయిందో క్షణం. జీతం అందుకోగానే "అమ్మా జీతం అందుకున్నాను. నేను బట్టలూ అవీ కొనుక్కోవాలనుకుంటున్నానని" ఒక్కమాట తనతో ముందు చెప్పకుండా అన్నీ కొనేసుకున్నాకా తనతో చెప్పడం ఆవిడ మవస్సుకి చివుక్కుమనిపించింది. 'హరికీ, మాధురికి కూడా ఏమైనా కొని ఉంటే బాగుండేది కదా' అని మవస్సుకి అనిపించినా క్షణంలో తేరుకుంటూ "పోనీలే సుధా, ఆఫీస్ కు వెళ్లేవాడివి, నలుగురిలో నీట్ గా ఉండకపోతే ఎలాగ, మంచి పని చేసావంటూ" కొడుకుతో అంది.
ఆ తరువాత నెల జీతం అందుకున్నాకా తల్లితో అన్నాడు. "అమ్మా ఆఫీస్ కు వెళ్లడానికి బైక్ కి సగం అడ్వాన్స్ పేమెంట్ ఇచ్చి బుక్ చేసానని మిగతాది వాయిదా పధ్దతిలో చెల్లించే ఏర్పాటుమీద కొనబోతున్నానని".
సుధాకర్ కి బైక్ అంత అత్యవసరంగా కొనాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇంటికీ ఆఫీసుకీ కిలోన్నర మీటరు దూరం అంతే. అయినా రాజేశ్వరి ఏమీ అనలేకా మౌనం వహించింది.
ఎప్పుడైనా హరికృష్ణ "అన్నయ్యా నీ బైక్ ఒకసారి వాడుకోవచ్చా మా స్నేహితుల దగ్గరకు వెళ్లివస్తానంటే", వద్దురా రఫ్ గా వాడేస్తేవు, పాడయిపోతుంది బండి అంటూ ససేమిరా ఇచ్చేవాడు కాదు.
ఇంట్లో సరైన ఫర్నిచర్ లేదని, స్నేహితులు వస్తే బాగుండదంటూ కుర్చీలు, టి.వి కొన్నాడు. రాజ్యలక్ష్మి ఏమీ మాటలాడలేకపోయింది.
ఆవిడ ఆలోచనలు వేరు. సుధాకర్ జీతాన్ని దాచి పెడితే రేపు కూతురి పెళ్లి ఖర్చులకు అక్కరకు వస్తాయని.
కానీ సుధాకర్!
ఉద్యోగం వచ్చాకా అతని మనస్తత్వం పూర్తిగా మారిపోయింది. నా సంపాదన అనే స్వార్ధం అతనిలో నెమ్మదిగా చోటుచేసుకో సాగింది.
తల్లికి మాటమాత్రమైనా చెప్పకుండా ఆఫీస్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలో మెంబర్ గా చేరి మూడువందల గజాల స్తలం వాయిదా పధ్దతిలో కొన్నాడు.
సుధాకర్ ఉద్యోగంలో చేరి రెండు సంవత్సరాల కాలం పూర్తి అయింది. హరిక్రిష్ణ పాలిటెక్నిక్ పూర్తి చేసాడు. ఇంజనీరింగ్ ఎంట్రన్స్ రాస్తానన్నయ్యా అని సుధాకర్ తో అంటే ఇంజనీరింగ్ కాలేజ్ ఫీజులవీ కట్టడం కష్టమని, ఏదైనా ఉద్యోగం సంపాదించుకుని పార్ట్ టైమ్ చదవుకోమని చెప్పాడు. అన్నయ్య మాటలకు హరిక్రిష్ణ ఖిన్నుడైనాడు. తల్లి దగ్గర వాపోయాడు. రాజ్యలక్ష్మి హరికృష్ణని ఓదార్చింది. మాధురి డిగ్రీ లో చేరింది. అది డిగ్రీ చదవకపోతేనేం అని ఎగిరాడు సుధాకర్. కానీ రాజ్యలక్ష్మి గట్టిగా చెప్పింది. డిగ్రీ అయినా లేకపోతే దానికి పెళ్లి సంబంధాలు రావడం కష్టమని. ఇంకేమీ మాటలాడలేక ఊరుకున్నాడు.
చాలా కాలం తరువాత రాజేశ్వరి పెద్ద అన్నగారైన వాసుదేవరావు రాజ్యలక్ష్మిని చూడడానికి వచ్చాడు. రాజ్యలక్ష్మి అన్నగారిని చూసి ఆశ్చర్యపోయింది. భర్త చనిపోయాకా చుట్టపు చూపుగా వచ్చి పలకరించి వెళ్లిపోయాడు. ఇన్ని సంవత్సరాలకు మరల వచ్చాడు. చాలా సేపు మాటలు మాట్లాడుకున్నాకా తన కూతురు భ్రమరను సుధాకరానికి చేసుకొమ్మని అడిగాడు..
రాజేశ్వరి అన్నగారి రాకకు కారణం ఇదా అనుకుని ఆశ్చర్యపోయింది. ఆవిడకు మేనకోడలిని తన కొడుక్కి చేసుకోవడం ఇష్టంలేదు.. అయినా ఓ రెండు మూడు ఏళ్లు పోతేగానీ కొడుక్కి పెళ్లిచేయాలనుకోలేదు.. చిన్న వాడికి ఏదైనా ఉద్యోగం, అలాగే మాధురికి డిగ్రీ పూర్తి అయితేగానీ సుధాకర్ కి పెళ్లి చేసే తలంపులో లేదు.
అన్నగారు చాలా తరచుగా చెల్లెలింటికి రావడం మొదలు పెట్టాడు. వచ్చినప్పుడల్లా పెళ్లి ప్రసక్తి తెస్తూంటే రాజేశ్వరి ఖచ్చితంగా చెప్పేసింది.. "వద్దులే అన్నయ్యా, మేనరికాలు ఇప్పుడు ఎవరూ చేసుకోవడం లేదు. సుధాకర్ కి పై సంబంధమే చేస్తాను. అదీగాక మరో రెండు మూడు సంవత్సరాలు పోతేగానీ సుధాకరానికి పెళ్లి చేసే ఆలోచన లేదు."
ఆవిడ అలా అనడానికి కారణాలు కూడా ఉన్నాయి. అన్నగారు భలే లౌక్యుడనీ తెలుసామెకు.. భర్త పోయినపుడు చుట్టపు చూపుగా వచ్చి పలకరించి, కుటుంబ బాధ్యత తనమీద ఎక్కడ పడుతుందోనని మెల్లిగా జారుకున్నాడు.. ఏనాడూ "రాజ్యం ఎలా ఉన్నావే?" అంటూ పలుకరించని అన్నయ్య సుధాకర్ కి ఉద్యోగం వచ్చిందని తెలుసుకున్న వెంటనే వచ్చేసి, ప్రేమకారిపోతున్నట్లు తమ మీద అభిమానాన్ని, ప్రేమను వ్యక్త పరచడం గ్రహించుకోలేని అమాయకురాలేమీ కాదు రాజేశ్వరి.. పైగా మేనకోడలు భ్రమర గురించి బంధువర్గంలో అనుకోవడం వింది తాను, ఆ అమ్మాయి వట్టి అహంభావి అని, తండ్రి గుణాలన్నీ పుణికి పుచ్చుకుందని..
ఒక రోజు సుధాకరం తల్లి దగ్గరకు వచ్చి ఏదో చెప్పాలని తచ్చాడుతుంటుంటే రాజేశ్వరి గ్రహించి "ఏమిటిరా సుధా అని అడగ్గానే తను మామయ్య కూతురు భ్రమరని ప్రేమించానని, తననే పెళ్లిచేసుకుంటానని చెప్పేసరికి నిర్వీణ్యురాలైందో క్షణం". ఈ ప్రేమించడం ఎప్పుడు జరిగిందో ఆమెకు అర్ధంకాక తెల్లబోతూ అతనివైపు చూడసాగింది. తల్లివైపు సూటిగా చూడలేక తలవంచుకుని నేలచూపులు చూస్తున్న సుధాకర్ ను చూడగానే ఆవిడకేదో అర్ధం అయింది.
సుధాకరానికి ఆవిడ ఏమీ జవాబివ్వలేదు.. అయినా ఏమని సమాధానమిస్తుంది?
అన్నీ వాడే నిర్ణయించుకున్న తరువాత తనతో చెపుతాడు. ఇంటి పరిస్థితులను ఎన్నో సార్లు చెప్పింది వాడికి. చెల్లెలి పెళ్లి ముఖ్యమని కూడా చెప్పింది. అయినా కూడా సుధాకర్ బాధ్యతారహితంగా ప్రవర్తిస్తుంటే తనేమి అనగలదు. తనకు నచ్చనవన్నీ జరిగిపోతున్నాయి. మేనకోడలిని తన కొడుక్కి చేసుకోవడం ససేమిరా ఇష్టంలేదు.
ఆ తరువాత రాజేశ్వరి అక్కలూ, చెల్లెలూ మరో అన్నయ్యా, మిగతా దగ్గర బంధువులందరూ ఏకమై రాజేశ్వరి ఇంటికి వచ్చి మరీ ఒప్పించే ప్రయత్నం చేసారు.. మేనకోడలు, పైగా నీ ఇంటి కష్టసుఖాలను తెలుసున్న పిల్లను చేసుకుంటే నీ కుటుంబానికి చేదోడు వాదోడుగా సహకరిస్తుందని, పైగా బావా మరదళ్లు ఒకరినొకరు ప్రేమించుకున్నారని, జంట బాగుందని మరీ ఒప్పించారు.
తన ఇష్టం తో ప్రమేయం లేకుండానే వారిరువురి పెళ్లి జరిగిపోయింది.
పాపం రాజేశ్వరి ఆశించింది వేరు.. తనకా పొలం తప్పించితే మరో ఆధారం లేదు.. చక్కని పై సంబంధం చూసి కట్న కానుకలు, ఆడపడుచు లాంఛనాలూ లాంటివి తీసుకుని ముచ్చటగా మురిపంగా చేయాలన్నుకున్న పెళ్లి ఏ ముద్దు ముచ్చట్లూ లేకుండా తూ తూ మంత్రంలా జరిగిపోయిందని బాధపడింది.. కానీ దైవ ఘటన అలా ఉంటే తానేమి చేయగలననుకుంది..
పెళ్లైన నాలుగు నెలలకే సుధాకరానికి రాజమండ్రీ నుండి నెల్లూరుకి ట్రాన్స్ఫర్ అయిపోయింది.. అందరూ ఒకచోట ఉంటే ఇంటి ఖర్చులు కలసివస్తాయని, కొడుకు కోడలు సంసార బాధ్యత తీసుకుంటే తాను కాస్త సేద తీర్చుకోవచ్చని ఆశించిన రాజేశ్వరి కి కొడుకు బదిలీ అయి వెళ్లిపోవడం ఆశనిపాతంలా తోచింది.. ప్రతీనెల ఇంటి అవసరాలకు కాస్త డబ్బు పంపిస్తూ ఉంటానని తల్లితో అనునయంగా చెప్పిన సుధాకర్ నెల్లూరు వెళ్లగానే ఆ మాట పూర్తిగా మరచిపోయాడు..
అసలు సుధాకరాన్ని మేనకోడలు భ్రమరతో కలిపి ప్రేమకు బీజంవేసి నారుపోసింది అన్నగారేనని రాజేశ్వరికి తెలీదు.. పెళ్లికి ముందు ఒకటి రెండుసార్లు కావాలని రాజేశ్వరి అన్నగారు సుధాకరాన్ని సరదాగా తన ఊరికి తీసుకువెళ్లడం, కూతురు భ్రమరని అతనితో సన్నిహితంగా మెలగనివ్వడం, ఒకరి అడ్రస్సులు మరొకరికి ఇప్పించి ప్రేమలేఖలు వ్రాసుకునేలా చేయడం ఇలా ఎన్నో అన్నగారి ప్రోత్సాహం మీద నడచిపోయాయి.. అంతే కాదు బంధువులందరి దగ్గర కళ్ల నీళ్లు పెట్టుకుంటూ భ్రమరను సుధాకరాన్ని ఒకటి చేయమని, రాజేశ్వరిని ఒప్పించమని నక్క ఏడ్పులు ఏడ్చి కాణీ కట్నం లేకుండా మేనల్లుడిని అల్లుడిగా చేసుకున్నాడు. ఆ తరువాత ఇక్కడ ఉంటే తన కూతురు ఎక్కడ కష్టపడిపోతుందో, అల్లుడి సంపాదన అంతా చెల్లెలి కుటుంబానికి ఖర్చు అయిపోతుందన్న దూరాలోచనతో తనకున్న పరపతిని ఉపయోగించి సుధాకరాన్ని నెల్లూరుకి బదిలీ చేయించి హాయిగా ఊపిరి తీసుకున్నాడు..
కాలం ఎవరికోసం ఆగనన్నట్లుగా పరుగెడుతోంది.
రాజేశ్వరి రెండో కొడుకు హరికృష్ణ పాలిటెక్నిక్ పూర్తి చేసాకా అనుభవం కోసం రాజమండ్రీ పేపర్ మిల్ లో ఒక చిన్న ఉద్యోగం సంపాదించాడు. అక్కడ చేరి ఒక సంవత్సరం పూర్తి అయింది.
ఒకరోజు హరికృష్ణ రాజేశ్వరితో "అమ్మా నేను హైద్రాబాద్ వెళ్లి ఉద్యోగ ప్రయత్నాలు చేయాలనుకుంటున్నాను. మా సీనియర్ నన్ను హైద్రాబాద్ వచ్చేయమంటున్నాడు. ఉద్యోగం దొరికే వరకు అతని రూమ్ లో ఉండమంటున్నాడు.
"వెళ్లనా అమ్మా"?
"హరీ, ఇంజనీరింగ్ చదవాలని అనుకున్నావు. మన పరిస్తితులు చూస్తే ఇలా ఉన్నాయి. మీ అన్నయ్య చూస్తే బొత్తిగా మనలను పట్టించుకోవడం మానేసాడు. వాడికి ఏదో ప్రమోషన్ కూడా వచ్చిందని అత్తయ్య బంధువు ఒకావిడ ఆ మధ్య బజారులో కనిపించి చెప్పింది. సొంత తల్లికి, తోబుట్టువులకూ తెలియని విషయం ఎవరో బయట వ్యక్తి ద్వారా తెలిసేసరికి ఎంతో బాధ అనిపించింది రా హరీ? అంత కానివాళ్లం అయిపోయామా మీ అన్నయ్యకు?"
"అమ్మా ఇలా ఉంటుందని నాకు ఎప్పుడో తెలుసు. అన్నయ్స కు ఉద్యోగం వచ్చాకా స్వార్ధం పెరిగిపోయింది. దానికి తోడు మామగారి అండదండలు, ఆయన చెప్పుడు మాటలతో అన్నయ్య పూర్తిగా మారిపోయాడు. అదే విషయాన్ని తలచుకుని బాధపడడం ఎందుకమ్మా? కనీసం ఆ రెండు ఎకరాల పొలం అన్నయ్య పరం కాకుండా చూసుకో. వాడి మామగారు ఏదో వంకతో ఆ పొలం రాబట్టుకోవాలని చూస్తున్నాడన్న విషయం నాకు తెలిసింది. జాగ్రత్తమ్మా. నేను ఉద్యోగం చూసుకున్నాకా మాధురిని నాతో తీసుకువెళ్లి చదివిస్తానంటూ తల్లికి ధైర్యం చెప్పాడు.
"పెద్దకొడుకులా కాదు హరికృష్ణ. తల్లి పడుతున్న కష్టాలను ప్రత్యక్షంగా చూస్తూ పెరిగాడు. తల్లి అన్నా, చెల్లెలన్నా అమితమైన ప్రేమ అతనికి.
హరికృష్ణ హైద్రాబాద్ వెళ్లిన ఆరునెలలకు ఒక టెలికమ్ ఫ్యాక్టరీలో ఉద్యోగం వచ్చింది. అతని స్నేహితుడు ఈ విషయంలో ఎంతో సహాయం చేసాడు.
రాజేశ్వరికి కొంచెం ఊపిరి వచ్చినట్లుగా అనుభూతి చెందింది.
హరికృష్ణ ఉద్యోగం చేస్తూనే ఏవో కంప్యూటర్ కోర్స్ లు అవీ చేస్తూ కష్టపడుతున్నాడు.
మరో రెండు సంవత్సరాలలో ఒక సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగ అవకాశం వచ్చి అందులోకి మారిపోయాడు.
మంచి ఉద్యోగంతో బాటూ ఆదాయం కూడా పెరిగింది. ఒక టూ బెడ్ రూమ్ ఫ్లాట్ అద్దెకు తీసుకుని వెంటనే రాజమండ్రీ వచ్చి ఇంటిని పూర్తిగా అద్దెకు ఇచ్చేసి తల్లినీ చెల్లెలినీ తనతో హైద్రాబాద్ కు తీసుకు వచ్చేసాడు.
మాధురి డిగ్రీ పూర్తి చేసిన మూలాన ఎమ్.బి.ఏ చదవమని ప్రోత్సహించాడు. ఎంట్రెన్స్ పరీక్షలో మంచి రేంక్ తెచ్చుకుని మాధురి ఎమ్.బి.ఏ లో చేరిపోయింది.
ఒకరోజు సుధాకర్ చెప్పా పెట్టకుండా హైద్రాబాద్ వచ్చాడు. అన్నయ్యను చూడగానే హరి, మాధురి సంబరపడిపోయారు. రాజేశ్వరి ఆనందం వర్ణనాతీతం. సుధాకర్ కి ఒక ఆరుసంవత్సరాల అమ్మాయి, నాలుగు సంవత్సరాల అబ్బాయి.
"అదేమిటిరా సుధా, భ్రమరని, పిల్లలను తీసుకురాకుండా వచ్చావంటూ తల్లి అడిగిన ప్రశ్నకు "అందరినీ ఫొలో మంటూ తీసుకురావడానికి ఖర్చులు అవవా అమ్మా!" కొడుకు మాటలకు రాజేశ్వరి తెల్లబోయింది. కొడుకుది సెంట్రల్ గవర్న్ మెంట్ ఉద్యోగం. దగ్గరగా పది సంవత్సరాలనుండి పనిచేస్తున్నాడు. బాధ్యతలను ఏమీ పట్టించుకోకుండా దూరంగా ఉంటున్నాడు. భార్యా, పిల్లలను తీసుకొచ్చి చూపించలేని స్తితిలో ఉన్నాడా అనుకుంటూ మవసులో బాధపడింది.
సుధాకర్ కి తమ్ముడిని చూస్తుంటే ఒకలాంటి అసూయకలుగుతోంది. నెలకు అరవై, డభైవేలు జీతం వస్తోందని తెలుసుకున్నాడు. హైద్రాబాద్ మహానగరంలో సౌకర్యంగా ఉండే ఫ్లాట్ లో అద్దెకుంటున్నారు. అక్కడ రాజమండ్రీలో తమింటికి అద్దె పది, పన్నెండు వేలు వరకూ వస్తుంది. పైగా పొలం మీద ఆదాయం. రాజేశ్వరికి టైలరింగ్ వచ్చిన మూలాన అక్కడ చుట్టుపక్కల ఉన్న అపార్ట్ మెంట్ లోని కుటుంబాలకు బట్టలవీ కుడుతూ తృణమో ఫణమో సంపాదిస్తూ వేణ్నీళ్లకు చన్నీళ్లు తోడు అన్నట్లు కష్టపడుతోంది. అసలు రాజేశ్వరిది మొదటినుండీ కష్టపడే నైజం. రాజమండ్రీ లో ఉండగా కూడా పచ్చళ్లూ, పిండివంటలూ చేసి అమ్ముతూ ఉండేది.
ఇవన్నీ చూస్తూ తట్టుకోలేకపోతున్నాడు సుధాకర్. తన భార్య భ్రమర మహా బధ్దకస్తురాలు. ఉద్యోగం చేయకపోయినా ఇంట్లో మహారాణిలా ప్రవర్తిస్తుంది. అన్ని పనులకూ పనిమనిషిని పెట్టింది. ఇంట్లో వంటచేయడం తక్కువ. బయట హొటళ్లనుండి ఫలహారాలూ, కూరలూ తెప్పిస్తుంది. జల్సాలు ఎక్కువ.
ఆరోజు అందరూ భోజనాలు చేసాకా హాల్ లో కూర్చున్నారు. సుధాకర్ మాట్లాడడం మొదలు పెట్టాడు.
"అమ్మా, హరి ఇక్కడ సెటిల్ అయిపోయాడు కదా. రాజమండ్రీ లో మన ఇల్లు, పొలం ఇంకా ఎందుకమ్మా"? అమ్మేయచ్చుకదా అంటూ సడన్ గా మాట్లాడేసరికి రాజేశ్వరి, హరి తెల్లబోయారు.
"సుధాకర్ రాకలోని అంతర్ధానం ఇదా అనుకుంటూ" రాజేశ్వరి బాధపడింది.
"అదేమిటిరా సుధా, ఇప్పుడు వాటిని అమ్మడమేమిటి”? మాధురి చదువు పూర్తి అవగానే పెళ్లి చేసి పంపద్దా"? పెళ్లి ఖర్చులు, కట్నకానుకలూ వీటి గురించి ఏమైనా ఆలోచిస్తున్నావా"?
"నేనెందుకు ఆలోచించాలి? ఇన్నాళ్లూ ఇంటిమీద వస్తున్న అద్దె, పొలం మీద వచ్చే రాబడిలో నాకేమైనా వాటా ఇచ్చావా? ఆ డబ్బంతా ఏమి చేస్తున్నట్లో"?
"ఏరా హరీ, ఆ డబ్బంతా బేంక్ లో సేవ్ చేసుకుంటున్నావా"? సుధాకర్ మాటలకు హరికృష్ణ తెల్లబోయాడు.
"నేనెందుకు మాధురి పెళ్లికి సహాయం చేయాలి"? ఇద్దరు పిల్లలను పెంచి పోషించుకోవాలి నేను. నేను దాని పెళ్లికి ఒక్క పైసా సాయం చేయలేను".
"హరి బోల్డంత సంపాదిస్తున్నాడు. ఏం వాడికి లేదా బాధ్యత"?
"నాకు ఖర్చులు పెరిగిపోతున్నాయి. ఆదాయం తక్కువ. అందుకే ఇంటిని, పొలం అమ్మేసి నా వాటా నాకు ఇచ్చేయమని అడగడానికి వచ్చాను'.
సుధాకర్ మాటలకు రాజేశ్వరి కి దుఖం ఆగలేదు.
ఆవిడ దుఖంతో బాటూ ఆవేశంతో చెలరేగిపోతూ......
"ఇంటికి పెద్ద కొడుకువి, నాకు ఎంతో ఆసరాగా ఉంటావనుకున్నాను. నీవు ప్రేమించావని మామయ్య కూతురు భ్రమరనిచ్చి పెళ్లి చేసాను. సొంత మేనకోడలు భ్రమర, ఏ నాడైనా నాలుగు రోజులు వచ్చి నాతో ఉందా? ఎలా ఉన్నావత్తయ్యా అంటూ ఏనాడైనా అభిమానంగా పలకపించిందా"? నీవు ఎలా ఉన్నావో, ఏమి చేస్తున్నావోనన్న సంగతులు నీ ద్వారా కాదు, ఊళ్లో ఎవరి ద్వారానో తెలుస్తాయి. అంత పనికిమాలిన వాళ్లం అయిపోయామా సుధా"?
"ఆస్తి పంపకాల విషయంలో మీ మామగారి ప్రోధ్భలంతో వచ్చి ఉంటావు. ఆయన చెప్పుడు మాటలు విని డూడూ బసవన్నవి అయిపోయావు. ఆయన అధీనంలోకి పూర్తిగా వెళ్లిపోయావు". ఆయన తెరవెనుక ఉండి నడిపించే నాటకాలకు ఏదో రోజున నీవే మోసపోతావురా".
"మీ మామగారికి చెప్పు, ఇది నా ఆస్తి. మీ నాన్నగారు విల్లు నా పేరు మీదే వ్రాసారు. నేను బ్రతికున్నంతవరకు నా ఆస్తిని పంచేది లేదు. ఇటువంటి నాటకాలు నా దగ్గర సాగ"వని మరీ మరీ చెప్పంటూ ఆవిడ ఉగ్రరూపంతో ఊగిపోయింది.
"తను అడగ్గానే తల్లి మెత్తబడిపోయి సరే నంటుందని ఎన్నో ఊహించుకుని వచ్చాడు సుధాకర్. ముఖం మాడ్చుకుని తిరిగి వెళ్లిపోయాడు.
సుధాకర్ వెళ్లిపోయిన తరువాత రాజేశ్వరి దుఖం కట్టలు తెంచుకుంటూ ప్రవహించసాగింది. తల్లిని ఆ స్తితిలో చూసిన హరి తల్లి భుజం చుట్టూ చేతులు వేస్తూ "అమ్మా బాధ పడకు". ఇప్పుడు కాకపోయినా ఎప్పుడైనా ఆస్తి పంపకాలు చేసి అన్నయ్యకు చెందాల్సిన వాటా ఇవ్వాలసిందేకదా. ఇవ్వకపోతే వాడు ఊరుకుంటాడా? నీకు మనశ్శాంతి లేకుండా చేస్తాడు. అస్తమానూ నీవు రాజమండ్రీ వెళ్లి ఇంటినీ, పొలాన్ని చూసుకోవడం కష్టం అవుతోంది. నా ఆఫీస్ పనిలో నేను బిజీగా ఉండి నీకు నేను ఏమీ సహాయపడలేకపోతున్నాను. వీలు చూసుకుని శెలను పెడ్తాను. మనిద్దరం వెళ్లి ఇంటినీ పొలాన్ని అమ్మి వేద్దాం. అన్నయ్యను అక్కడకు పిలిచి వాడికి రావాలసిన వాటా ఇచ్చేయి. నాకు ఏమీ వద్దమ్మా. చెల్లాయ్ పెళ్లికి కొంత ఉంచి మిగతాది నీ పేరు మీద బేంక్ లో ఫిక్స్ డు డిపాజిట్ చేస్తాను.
నీకు నేను ఉన్నాను. నీవు ఎప్పటికీ నాతోనే ఉంటావు. మాధురికి చక్కని సంబంధం చూసి పెళ్లి చేద్దాం. ఏదోనాటికి అన్నయ్య మవస్సు మారి మన దగ్గరకు వస్తాడులే అమ్మా. మనకూ మంచి రోజులు వస్తాయన్న ఆశావాదంతో ఉండమ్మా" అంటూ తల్లిని అనునయించాడు.
***
యశోద పులుగుర్త గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత్రి పరిచయం :
నా పేరు యశోద పులుగుర్త, మా వారి పేరు శ్రీ కైలాసపతిరావు ! నేను ఒక ప్రభుత్వరంగ సంస్తలో మార్కెటింగ్ విభాగంలో సీనియర్ మేనేజర్ గా 35 సంవత్సరములు పనిచేసి రిటైర్ అయ్యాను.. నా విద్యార్హతలు M.A (Pub. Admn.) & M.B.A (Marketing ). రిటైర్ అయ్యాక పూర్తిగా తెలుగు సాహిత్యం పట్ల , రచనల పట్ల ఆసక్తి కలిగింది.. చిన్నతనంనుండి మంచి మంచి రచయితలు, రచయిత్రుల కధలు, సీరియల్స్ చదువుతూ పెరిగినదాన్ని! నాకు చిన్నతనంనుండి మంచి మంచి కధలు వ్రాయడానికి ప్రయత్నించేదాన్ని.. కాని చదువు, ఉద్యోగం, పిల్లల పెంపకం బాధ్యతలలో నా కోరిక తీరలేదు.. ప్రస్తుతం మా అబ్బాయిలిద్దరూ వాళ్లు కుటుంబాలతో అమెరికాలో స్తిరపడ్డారు.. నేను ప్రస్తుతం రచనా వ్యాపకంలో ఉంటూ కధలూ, వ్యాసాలూ వివిధ పత్రికలకు పంపుతూ ఇలా అప్పుడప్పుడు పోటీలలో పాల్గొంటున్నాను.. నేను వ్రాసిన రెండుకధలు పుస్తక రూపంలో ప్రచురితమైనాయి.. ప్రస్తుతం హైదరాబాద్ లో నేనూ, మా శ్రీవారూ విశ్రాంతి జీవితాన్ని గడుపుతున్నాం.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి బిరుదు పొందారు.
Comments