top of page

మిరపకాయ బజ్జీ

Writer: NDSV NageswararaoNDSV Nageswararao

వారం వారం బహుమతులలో ఎంపికైన కథ (Weekly prize winning story)


'Mirapakaya Bajji' - New Telugu Story Written By  NDSV Nageswararao

Published In manatelugukathalu.com On 21/12/2023

'మిరపకాయ బజ్జీ' తెలుగు కథ

రచన:  NDSV నాగేశ్వరరావు

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



నాకు చిన్నప్పటి నుంచి మిరపకాయ బజ్జీ అంటే ఎంతో యిష్టం ఉన్నా, ఏదో తెలియని భయం కూడా ఉంది. నా భయం గురించి చెప్పే ముందు, అసలు మిరపకాయ బజ్జీ గొప్పతనం గురించి చెప్పాలి. 


'ఏం మాకు మాత్రం తెలియదా? నువ్వు చెప్పాలా?' అని అనకండి. దాని గురించి మాట్లాడుతుంటేనే, నాలిక ఆశగా నాలుగు వంకర్లు తిరుగుతుంది. కడుపులో జీర్ణరసం కిందా మీదా పరుగులు పెడుతుంది. మూకుడులో నూనె మరుగుతూ, దాంట్లో బజ్జీ తేలుతూ ఉంటే, చూడ్డానికి వెయ్యి కళ్ళూ చాలవు. అలాగే అది నోట్లోకి వచ్చాక, కళ్ళలోంచి నీళ్లు బయటికి రావడమూ మానవు. 


బజ్జీల్లో ఎన్నో రకాలు. మామూలు మిరపకాయలతో చేసేది ఒకటైతే, పెద్దగా ఉండే స్పెషల్ మిరపకాయలతో చేసేది మరో రకం. అలాగే బజ్జీ బయటికి తీశాక, దాన్ని చక్కగా మధ్యలో కోసి, అన్ని రకాల దినుసులు చేర్చి, ఉల్లిపాయ ముక్కలు, నిమ్మరసం జోడించి, చేతికి ఇస్తే 'నా సామిరంగా' స్వర్గం జానెడు దూరంలో కనబడుతుంది. అలాగే యీ బజ్జీలు మిగిలిపోతే సగానికి ముక్కలు కోసి, మరోసారి వేచి, 'కట్ బజ్జీ' అని అమ్ముతారు. ఇంటికి చుట్టాలు వచ్చినా, స్నేహితులు వచ్చినా, ఎవరికైనా చటుక్కున నచ్చే వంటకం యీ బజ్జీ. పెళ్లిళ్లలో యిది లేకపోతే పెళ్లి ఆగిపోయే పరిస్థితి. అలాగే దాని వాసన గట్టిగా తగిలితే, పాడి మీద ఉన్న శవం కూడా లేచి నిలబడుతుంది అని మరో ప్రశస్తి. చిన్నపిల్లలయినా, నడివయసు వారైనా, ముసలివారైనా, ఎవరినైనా తన దగ్గరికి లాక్కుంటుంది యీ మిరపకాయ బజ్జీ.


అయితే సమస్యల్లా, దీన్ని చేసే విధానం గురించే. నా భయం కూడా దాని గురించే. ఎందుకంటే నేను పదో తరగతి పాస్ అయ్యాక, మొట్టమొదటిసారి విశాఖపట్నం వెళ్లాను. అక్కడ మా చుట్టాల ఇంటి నుంచి రోడ్డు మీదకు వచ్చి నిలబడితే, ఒక మిర్చి బజ్జీ బండి కనిపించింది. జేబులో డబ్బులు లేవు కాబట్టి దూరం నుంచే చూస్తున్నాను. నేను చూస్తుండగానే ఒక పెద్ద డబ్బా తీసుకొని, దాంట్లోకి ఒక సంచిలో ఉన్న పిండి అంతా దులిపాడు. అది తెల్ల తెల్లగా, గోధుమ రంగులో, రకరకాలుగా కనిపిస్తోంది. దాంట్లో కొంచెం నీళ్లు కలిపి బాగా దగ్గరగా చేస్తున్నాడు. ఈ లోపల ఏమైందో తెలియదు, హఠాత్తుగా అది పసుపు రంగు లోకి మారడం గమనించాను. అప్పుడు అర్థమైంది చుట్టుపక్కల ఎవరూ లేరని నిర్ధారించుకుని, ఏదో పొడి కలిపాడని. 


దాంతో కొంచెం సేపటికి అది చక్కని శెనగపిండి లాగా మారిపోయింది. 'ఇది మోసమా' లేక 'ఆ బజ్జీకి చేర్చిన విశేషమా' అంటే నేనేం చెప్పలేను. కానీ ఆ రోజు నుంచి బజ్జీ తిన్న ప్రతిసారీ, అది శెనగపిండేనా, కాదా అన్న అనుమానం నన్ను వెంటాడుతూనే ఉంటుంది. అలా అని ఏ రోజు బజ్జీ తినడం మానేయలేదు. మిరపకాయ బజ్జీ గొప్పతనమే అది.


ఇలా అప్రతిహతంగా బజ్జీలు తింటూ, బ్యాచిలర్ లైఫ్ నడుపుకుంటున్న నాకు, మా తల్లిదండ్రులు పెళ్లి సంబంధాలు చూడటం మొదలెట్టారు. ఎన్ని సంబంధాలు చూసినా, ఏదో ఒక అభ్యంతరం వస్తూనే ఉంది. చివరికి ఓసారి పెళ్లి చూపులకి వెళ్తే మిరపకాయ బజ్జీలు పెట్టారు. 'ఎవరు చేశారా?' అని కనుక్కుంటే, పెళ్లికూతురు చేసిందన్నారు. అంతే సంబంధం ఫిక్స్ అయిపోయింది, నా పెళ్లి అయిపోయింది. ఆ తర్వాత తెలిసింది, సంబంధాలు అన్ని నేను తిరగ్గొడుతున్నాను అని మా పెళ్లిళ్ల పేరయ్య గారికి కోపం వచ్చి, నా వీక్నెస్ మీద దెబ్బ కొట్టి, ఈ మ్యాచ్ ఫిక్సింగ్ చేయించారు అని. 


విషయం ఏంటంటే, నా భార్యకి మిరపకాయ బజ్జీలంటే యిష్టం లేదట, అంతే కాదు అవి చేయడం అసలు రాదుట. అన్నేళ్ల నా జీవితంలో మిరపకాయ బజ్జీలు నచ్చని వాళ్ళని మొదటిసారి చూసాను. నా పరిస్థితి మిరపకాయ నోట్లోకి వెళ్ళాక, మంచినీళ్లు దొరకనట్లు అయిపోయింది. ఏం చేస్తాం, ఆమెకు తెలియకుండా అక్కడక్కడా చాటుమాటుగా మిరపకాయ బజ్జీలు తింటూ కాలక్షేపం చేస్తున్నాను. 


ఈమధ్య కరోనా వచ్చాక, వయసు మీద పడ్డాక, బయట తినాలంటే మరీ భయమేస్తోంది. అలాగని బజ్జీలు వదిలేయలేం. అందుకే మా కవి మిత్రుణ్ణి, బజ్జీ మీద ఒక పద్యం రాయవయ్యా అని అడిగా. ఆయన ఇలా రాసిచ్చాడు


పచ్చి మిరపకాయలతో

మచ్చలు లేనట్టి శెనగ మలిపిన తోడన్

నచ్చెరువును గలిగించుచు

పచ్చగ నూనెన వెడలును బజ్జీలహహో!


ప్రస్తుతం ఈ పద్య పారాయణతోనే నా కడుపు నిండుతోంది. మంత్రాలకి చింతకాయలు రాలతాయంటారు. ఏదైనా తీవ్రంగా పఠిస్తే, వాటికి శక్తులు వస్తాయంటారు. ఏమో ఈ పద్య పఠనం ప్రభావంతో మా ఆవిడలో మార్పు వచ్చి, తనే బజ్జీలు వేయడం ప్రారంభిస్తుందేమో. ఆశకి అంతు లేదు కదా. ఆశ పడటంలో తప్పు లేదు. అందులోనూ బజ్జీల విషయంలో అస్సలు తప్పులేదు.

************

NDSV నాగేశ్వరరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం

మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:

నా పేరు NDSV నాగేశ్వరరావు.

వృత్తి రీత్యా ప్రభుత్వ రంగ బ్యాంకులో జనరల్ మేనేజర్ గా ముంబై లో పనిచేస్తున్నాను.

పదిహేనేళ్ల వయస్సు నుంచి రచనా వ్యాసంగం ప్రారంభించాను.

కథలు, కవితలు, పద్యాలు, నాటికలు వ్రాసాను, వ్రాస్తున్నాను. కంద పద్యం అంటే ఇష్టం. వారానికో వాట్సాప్ కథలుగా అరవైకి పైగా కథలు వ్రాసాను. తెలుగులోనే కాకుండా ఇంగ్లీషు, హిందీ, తమిళంలో కథలు వ్రాసాను.

సాహితీ బృందావన జాతీయ వేదిక మరియు 'నేను సైతం' యూ ట్యూబ్ ఛానల్ వారు నిర్వహించిన జనవరి 2022 సంక్రాంతి కథల పోటీ లో ప్రోత్సాహక బహుమతి మరియు 'సంక్రాంతి సాహిత్య కథా రత్న' పురస్కారం లభించింది. స్టోరీ మిర్రర్ వారి ఇంగ్లీషు కథల పోటీల్లో పలు బహుమతులు లభించాయి. గత ముప్పై ఏళ్లుగా అడపా దడపా ఏదో ఒక బహుమతి వచ్చింది.

నటన నా మరో ప్రవృత్తి. ఆల్ ఇండియా రేడియో నాటకాలలో, స్టేజి మీద మరియు టివీ ఛానళ్లలో నటించాను.

మీ

NDSV నాగేశ్వర రావు



 
 
 

3 Kommentare


Mana Telugu Kathalu
Mana Telugu Kathalu
23. Dez. 2023

@Navaduri

• 23 hours ago

హ....హ......హ.......

Gefällt mir

Mana Telugu Kathalu
Mana Telugu Kathalu
23. Dez. 2023

@sria2265

• 1 day ago

నా పరిస్తితి భజ్జీ తిన్నాకా నీళ్ళు దొరకని స్థితి

Gefällt mir

Mana Telugu Kathalu
Mana Telugu Kathalu
23. Dez. 2023

@kumariramana6525

• 20 hours ago nice

REPLY1 reply

1

Mirapakaya Bajji | మిరపకాయ బజ్జీ | Telugu Short Stories | Telugu Kathalu | ManaTeluguKathalu.com

@Navaduri

• 16 hours ago

ధన్యవాదాలు

Gefällt mir
bottom of page