కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.
'Missavutharu' Written By BVD Prasada Rao
రచన : బివిడి ప్రసాదరావు
బస్సు స్టాప్ లో కలుసుకున్నాడామెను.
తొలి చూపులోనే ప్రేమించేశాడు ఆమెని.
పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు.తన గురించి కొన్ని నిజాలు చెప్పిందామె. అయినా అతను వెనక్కి తగ్గలేదు.ఈ సరదాగా సాగే కథను ప్రముఖ రచయిత, బ్లాగర్ ప్రసాద రావు గారు రచించారు.
అలక కనిపించలేదు!
రావు తంటాలు పడుతున్నాడు.
'ఏమైంది! ... ఈ రోజు ఎందుకు ఇంకా రాలేదు?' గొణుక్కుంటున్నాడు.
అలక అతడి కంట పడిన మొదలు ప్రతి రోజూ ఆమె దర్శనం అతడికి అవుతుంది.
చాన్నాళ్ళుగా ఇది సాగుతుంది. ఏ రోజూ బ్రేక్ కాలేదు. మరి ఈ రోజు...
***
ఆ రోజు ...
తలవని తలంపుగా అలక దర్శనం రావుకి అయ్యింది.
రావు ఎప్పటిలాగే ఆ రోజు కూడా డ్యూటీకి వెళ్ళడానికి బస్ స్టాప్ లో నిల్చుని ఉన్నాడు.
అలక అక్కడికి వచ్చింది. రావు అదే అలకని తొలిసారి చూడడం.
చూడగానే రావుని అలక ఆకట్టుకుంది. ఇది అతిశయోక్తి కాదు.
రావు చూపున అలక పడగానే అతడి ఎద పత్తికాయలా విచ్చుకుంది.
ఆ ఇద్దరూ ఒకే బస్సు ఎక్కేరు.
రావు దిగే ముందు స్టాప్ లో అలక దిగేసింది. ఐనా రావు అప్పటికి తమాయించుకున్నాడు.
తర్వాత్తర్వాత అదే స్టాప్ లో వాళ్ళిద్దరూ కలవడం, ఒకే బస్సు లో
పయనించడం జరుగుతూ వచ్చాయి.
నిన్ననే రావు తెగించి చొరవయ్యాడు. తొలుత అతడే పలకరించాడు.
ఎక్కే స్టాప్ లోనే, బస్సు రాకకి మునుపు - 'మీతో మాట్లాడాలి' అన్నాడు.
అలక సాఫీగానే రావుని చూసింది. చిన్నగా నవ్వింది కూడా.
అలక చిరునవ్వు రావుకి మళ్లీ బాగా నచ్చింది.
'మాట్లాడండి' అలక తొలి మాట. నురగలా ఉంది.
'కాస్తా పక్కకి వెళ్దామా' రావు చుట్టూ చూస్తున్నాడు.
అలక అక్కడ నుండి కదిలింది. ఆ స్టాప్ కి కొంచెం దూరంగా ఓ పక్కగా నిల్చుంది.
రావు అలకని అనుసరించాడు.
'నేను మిమ్మల్ని రోజూ గమనిస్తున్నాను' రావు చెప్పేసాడు.
అలక, 'ఆహాఁ' అంది. నవ్వుతుంది.
వాటిని పట్టించుకోక, ''మిమ్మల్ని తరచి తరచి పరిశీంచాను. మీరు అవివాహితులు. కదూ'
అడిగేసాడు రావు.
అలక ఆశ్చర్యపడలేదు. ఆందోళనవ్వలేదు.
తననే చూస్తున్న అలకని చూస్తూ -
'ఏమిటి మీ రియాక్షన్ ఏమీ లేదు' రావు మాత్రం చలించాడు.
'ఏ రియాక్షన్ కావాలి' నెమ్మదిగా అడిగింది అలక. ఆమె నవ్వుతుంది కూడా.
వెంటనే ఏమీ చెప్పలేకపోయాడు రావు.
అలక అలానే నవ్వుతూ ఉంది.
'చెప్పరూ' బతిమలాటలా ఉంది రావు మాట.
'అవును. నాకు పెళ్లి కాలేదు' మామూలుగా చెప్పింది అలక. కంటి రెప్పల్ని టపటపలాడిస్తుంది.
'మీరు నాకు నచ్చారు.' టక్కున చెప్పేసాడు రావు.
అలక నవ్వింది.
'నేను మీకు నచ్చానా' అడిగాడు రావు.
'దాని వలన ఒరిగేదేమిటి' అడిగింది అలక.
గమ్మత్తయ్యాడు రావు. దానిని చూపులతో అగుపరుస్తున్నాడు.
అప్పుడే, 'మరంతేగా. మన మధ్య ఈ నచ్చడాల గోలేమిటి' అంది అలక సామాన్యంగా.
తల గోక్కుంటున్నాడు రావు.
అలక నిలకడగానే ఉంది.
'మీరు, మీ తలంపులు నన్ను ప్రేరేపిస్తున్నాయి.'
కళ్ళెగరేసింది అలక.
'నేను అనుకున్నది చెప్పేస్తా.'
నిదానంగా ఉంది అలక.
'మీరు నాకు కావాలి. మిమ్మల్ని వదిలి నేను ఒంటరిగా ఇక ఎంత
మాత్రం ఉండలేను. సో ...' చెప్పడం ఆపాడు రావు.
విసుగుని అణచుకుంటుంది అలక.
'మనం పెళ్ళి చేసుకుందాం' చెప్పేసాడు రావు.
ఆందోళన పడలేదు అలక. అలా అని చిరాకూ పడలేదు.
రావు ఆమెనే చూస్తున్నాడు.
'అయ్యా తమరు తరచి తరచి అన్నారు. హు. నా గురించి ఏం తెలుసుకున్నారు.' ఇప్పుడు ఆశ్చర్యం అగుపర్చింది అలక.
'మీ పాదాలు చూసాను. మట్టెలు లేవు. మీ మెడ చూసాను. తాళి లేదు ...' చెప్పుతున్నాడు రావు.
'చాల్లెండి' వెంటనే అంది అలక.
చెప్పడం ఆపేసాడు రావు.
రావునే చూస్తుంది అలక. అలకనే చూస్తున్నాడు రావు.
'నేను ఒక వ్యభిచారిని' గమ్మున చెప్పేసింది అలక.
ఉలిక్కి పడలేదు రావు. సాధారణంగానే ఉన్నాడు. అలక మాత్రం హైరానా అవుతుంది.
'కూల్. నాకు అదీ తెలుసు. మీరు నన్ను పూర్తిగా చెప్పనివ్వడం లేదు.'
అలక నిజంగా అయోమయంలో పడింది. 'తెలుసా' అంది.
'ఆఁ' అన్నాడు.
'తెలిసి ... తెలిసి ... మరి పెళ్ళి అనడమేమిటి' తడబడుతుంది అలక.
'ఆఁ. పెళ్ళికి అదేం అడ్డుకాదు' స్థిరంగా ఉన్నాడు రావు.
'పెళ్ళి ... నాకు ఆ అవకాశం ఉందా ... నేను అందుకు అర్హురాలునా'
అలక గొంతు తడి ఆరిపోతుంది.
'ఏ వృత్తీ పెళ్ళికి అనర్హం కాదు ... కారాదు' నొక్కి పలికాడు రావు.
అలక అతణ్ణే చూస్తుంది.
'నాకు పెళ్ళా ... మీరు నన్ను పెళ్ళి చేసుకుంటారా ... దయా ... జాలా ... ఏమిటి ... మరి ఎందుకు ...' తికమక పడిపోతుంది అలక.
'కూల్ కూల్ ... చెప్పానుగా. మీ గురించి తరచి తరచి పరిశీలించానని. అది నిజం.' ఆగాడు రావు.
అలక అతణ్ణే చూస్తుంది.
'వృత్తి జీవనం కోసమే. ఎవరి వృత్తి పరిధి వారిది. సో, అటు వైపు పోవద్దు. తర్కించుకోవద్దు.'
అలక విస్మయం అగుపరుస్తుంది.
'మిమ్మల్ని చూసిన రోజే ... కాదు కాదు ... చూసిన క్షణమే మీ ప్రేమని ఆశించ తలిచాను. అవును.
మీరు నన్ను బాగా ఆకట్టుకున్నారు. తర్వాత్తర్వాత తెలిసింది. మీ వృత్తి. కానీ అదిరిపోలేదు.
నన్ను నేను సముదాయించుకున్నాను. కారణం నేను అప్పటికే మిమ్మల్ని మిక్కిలిగా
ప్రేమించేస్తున్నాను.' చెప్పడం ఆపాడు రావు.
అలక అతణ్ణే చూస్తూ ఉంది.
'మీ ఒళ్లు కంటే, మీ నడత నాకు బాగా నచ్చింది. మీ విధం చక్కగా ఉంది. మీ అణుకువ తెలిసింది. మీరు ప్రతి రోజూ వెళ్తున్న ఆ అనాథ ఆశ్రమంలోని మీ సేవలని గుర్తించాను. అక్కడ నుండి వెళ్ళి ఆ వృద్ధ ఆశ్రమంలోని వారికి మీరందిస్తున్న మీ చేయూతని విస్మరించలేను. ఇలా మీరు నచ్చడానికి నాకు కావలసినవి ఎన్నో మీలో నాకు దొరికాయి.' చెప్పుతున్నాడు రావు.
అలక వింటుంది.
'రాత్రులు హూనం కాబడుతున్న మీ ఒళ్లు, స్వేద తీరితే మీ ప్రవృత్తి మరింత వికసిస్తుందని తలుస్తున్నాను. అందుకు మీకు చేదోడు కావాలనుకున్నాను.'
చెప్పుతున్న రావుకి అడ్డయ్యింది అలక. 'ఎవరు మీరు' అడిగింది.
'ఓ ... నా గురించా ...' అంటూ రావు తన వివరాలు పూర్తిగా చెప్పి, 'నా మాట చెల్లనియ్యండి. పెళ్లికి సమ్మతి తెల్పండి' అని ముగించాడు.
'ఐతే అందుకు ... పెళ్లి అవసరమా!' వ్యంగ్యంగా నవ్వింది అలక.
'అవసరమే. సమాజంకి అది ముఖ్యం. పెళ్లితోనే మనం చక్కగా చిక్కగా కలిసి మెలిసి తిరగ్గలం.' రావు మాటలు ఆపాడు.
'మాటల్లో పడి మన బస్సే కాదు చాలా బస్సులు వెళ్లి పోయాయి'
అలక రోడ్డు వైపు చూస్తుంది.
'పోతే పోనీయండి.'
అలక గిర్రున తల తిప్పింది. రావుని చూస్తుంది.
'నా ప్రొపోజల్ ఒప్పుకోరా' అంటున్నాడు రావు.
అప్పుడే బస్సు ఒకటి రావడంతో అటు చరచరా వెళ్ళి పోయింది అలక.
రావు ఆమె వెనుకే పరుగు తీసాడు.
ఇద్దరూ ఆ బస్సు ఎక్కిపోయారు యాంత్రికంగా.
'హలో' - పలకరింపుతో ఆలోచనల నుండి వెలుపలికి రాగలిగాడు రావు.
చూడగా, ఎదురుగా అలక. 'హమ్మయ్య' అనుకున్నాడు.
'రండి. బస్సు వచ్చింది' అటు కదులుతుంది అలక.
'ఏమిటి' ఆత్రమవుతున్నాడు రావు.
'ఎక్కక పోతే మీరు మిస్సవుతారు' నవ్వుతుంది అలక.
రావు తెమిలి ఆ బస్సు అందుకున్నాడు.
*** శుభం ***
ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.
లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి.
రచయిత పరిచయం : బివిడి ప్రసాదరావు.
రైటర్, బ్లాగర్, వ్లాగర్.
వీరి బ్లాగ్ - బివిడి ప్రసాదరావు బ్లాగ్
వీరి యూట్యూబ్ ఛానల్ - బివిడి ప్రసాదరావు వ్లాగ్
వీరి పూర్తి వివరాలు ఈ క్రింది లింక్ ద్వారా తెలుసు కోవచ్చు.
Comments