top of page
Writer's pictureMohana Krishna Tata

మిస్టర్ పర్‌ఫెక్ట్

#MohanaKrishnaTata, #తాతమోహనకృష్ణ, #మిస్టర్పర్‌ఫెక్ట్, #MisterPerfect, #TeluguComedyStories, #తెలుగుహాస్యకథలు, #పిసినారి


'Mister Perfect' - New Telugu Story Written By Mohana Krishna Tata

Published In manatelugukathalu.com On 30/10/2024

'మిస్టర్ పర్‌ఫెక్ట్తెలుగు కథ

రచన: తాత మోహనకృష్ణ

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



"స్రవంతీ.. ! ఆ చెప్పులు వేసుకుని, బయల్దేరు.. లేట్ గా వెళ్తే మళ్ళీ అక్కడ కూరలు అయిపోతాయి.. " అన్నాడు భర్త సాగర్.

 

"ఏమిటండీ.. ఆ తొందర.. ? వస్తున్నాను.. అదేమిటండీ.. హవాయి చెప్పులు వేసుకున్నారు.. ఆఫీసర్ హోదా లో ఉండి కుడా ఎందుకు ఇలా చెప్పండి.. ? ఎవరైనా చూస్తే బాగోదు.. మంచివి వేసుకోండి.. "


"నువ్వు కూడా హవాయి చెప్పులే వేసుకో.. మంచివి వేసుకుంటే, అరిగిపోతాయి.. అయినా ఎవరు ఏమనుకుంటే నాకేంటి.. ?"


"చెప్పినా వినరుకదా.. ! అయినా నా చీర చెప్పులని కవర్ చేస్తుంది.. ప్యాంటు వేసుకున్న మీకే చూడడానికి బాగోదు.. "

"ఎవరు ఏమనుకుంటే నాకేంటి.. ?"


"ఏమండీ.. ! ఈ ఆదివారం పూట చక్కగా కార్ తియ్యొచ్చుగా.. అలా సరదాగా వెళ్దాము.. "


"రెండు కిలోమీటర్లే కదా.. వాకింగ్ చేస్తూ అలా వెళ్తే ఆరోగ్యానికి చాలా మంచిది.. వాకింగ్ చేస్తే ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో నీకు తెలుసా స్రవంతి.. ?"


"అలాగే స్వామి.. ! పదండి.. వెళ్దాము.. "


"హమ్మయ్యా.. మొత్తం మీద కూరలు కొనేసాము. చూసావా స్రవంతి.. ! ఎంత తక్కువ రేట్ కి అన్ని కూరలు కొనేసామో..?"


"కొనే అరడజను కూరల కోసం ఇంటినుంచి రెండు కిలోమీటర్లు.. లోపల అన్ని షాపులు తిప్పి.. ఒక నాలుగు కిలోమీటర్లు తిప్పించారు.. మరీ అంత గీచి గీచి బేరం ఆడడానికి మీకు ఎంత ఓపికండీ.. ?"


"డబ్బులు ఎవరికీ ఊరికే రావు స్రవంతీ.. "


"మీరూ మొదలెట్టారు.. ఆపండి. ఇప్పటికే టీవీ లో రోజూ వింటూనే ఉన్నాము.. "


"ఇది ఇప్పుడు యూనివర్సల్ డైలాగ్ అయిపోయింది స్రవంతి.. ముఖ్యంగా మా మగవారికి.. "


"సంతోషించాను గానీ.. ! కాళ్ళు నొప్పెడుతున్నాయి.. ఒక ఆటో పిలవండి.. "


"డబ్బులు మిగులుతాయని రైతు బజార్ కి వస్తే.. ఆ మిగిలిన డబ్బులు ఆటో కి పోస్తే, ఏమిటి ప్రయోజనం చెప్పు.. ? నేను నీకు కొన్ని పొదుపు సూత్రాలు చెబుతాను.. అలా వింటూ నడిచేస్తే, మన ఇల్లు వచ్చేస్తుంది.. అంతే"



"ఏం చేస్తాం.. చెప్పండి.. ! " అంది స్రవంతి.


('ఈయన 'మిస్టర్ పర్‌ఫెక్ట్' గా ఫీల్ అయిపోతాడు.. కానీ ఏమాటకి ఆమాటే చెప్పుకోవాలి.. ! మా ఆయన లాంటి మనిషి చాలా అరుదుగా ఉంటారు.. ' అని మనసులో మురిసింది స్రవంతి)


"ఇల్లు వచ్చేసింది చూడు స్రవంతి.. "అని ఆనందంగా అన్నాడు సాగర్.

 

"ఏమండీ.. ! టైం చూడండీ ఎంతయిందో.. ! ఇప్పుడు వంట చెయ్యడము నా వల్లకాదు.. ఆ కర్రీ పాయింట్ లో నాలుగు కూరలు ప్యాక్ చేయించండి.. "


"చవకగా కూరలు కొన్నది.. మళ్ళీ డబ్బులు పోసి, కర్రీస్ కొనడానికా.. ? నేను ఒప్పుకోను.. ! ఇంటికి వెళ్లి ఫ్రెష్ కూరలతో ఫ్రెష్ గా వండు.. నీ కూర రుచి ఆ కర్రీ పాయింట్ వంటలలో వస్తుందా.. ?"


"మీతో వాదించే కన్నా.. అదే బెటర్ లెండి.. నా తిప్పలేవో నేను పడతాను.. " అంటూ ఇంటి తాళం తీసింది స్రవంతి. 


('ఏం చేస్తాం.. ! ఒక హాఫ్ డే వంట తప్పుతుందని అనుకున్నా.. ఎంతైనా నా చేతి వంట తినకుండా మా ఆయన ఉండలేరు.. నాకు తెలుసు.. ' అని మురిసిందిస్రవంతి)


కొన్ని రోజుల తర్వాత.. 


"ఏమండీ.. మన పెళ్లి రోజు వస్తోంది కదా.. అలా సరదాగా సినిమాకి వెళ్దాము.. "


"అలాగే.. అప్పుడప్పుడు అలా సరదాగా సినిమా కి వెళ్ళాలి.. మంచిదే.. "


"ఇదేంటి.. మా ఆయన టక్కున ఒప్పెసుకున్నారు.. ఎలా ఒప్పుకుంటే నాకేంటి.. ఒక మంచి సినిమా చూడబోతున్నాను.. అది చాలు"


పెళ్ళి రోజు ఉదయం.. 


"ఏమండీ.. ! పెళ్లిరోజు శుభాకాంకాలు.. "


"థాంక్స్ స్రవంతి.. ! తొందరగా రెడీ అవ్వు.. మ్యాటినీ సినిమా కి వెళ్దాము.. "


"ఫస్ట్ షోకి వెల్దామండీ.. అలా వస్తూ.. కాస్ట్లీ హోటల్ లో భోజనం చేయొచ్చు.. "


"మ్యాటినీ అయితే టికెట్స్ ఫ్రీ గా దొరుకుతాయి.. రష్ ఉండదు.. పైగా.. ఇంట్లో ఫ్రెష్ గా భోజనం చేసి వెళ్లొచ్చు.. ఆ ఖర్చూ తగ్గుతుంది.. "


('పోనీలే.. ! సినిమాకి తీసుకుని వెళ్తే అదే చాలు.. ' అనుకుంటూ స్రవంతి నాలుగు రోజుల ముందు తన ఫ్రెండ్ ని కలిసిన రోజు గుర్తు చేసుకుంది.. )


"ఏమే స్రవంతి.. ! నన్ను పెళ్ళికి పిలవకుండా చేసుకున్నావు.. ఇంతకీ మీ ఆయన ఎలా ఉంటాడేమిటి.. ?" అడిగింది ఫ్రెండ్ స్నేహ.


"మా ఆయన చాలా సూపర్ గా ఉంటారు.. నాకు కావాల్సినవన్నీ కొని పెడతారు.. అసలు కాలు బయట పెట్టనివ్వరనుకో.. ! అలా చూసుకుంటారు.. ఏది చేసినా ఒక రేంజ్ లో చేస్తారు.. "


"నువ్వు చాలా అదృష్టవంతరాలివే.. " అంది స్నేహ. 


"స్రవంతి.. ! ఏమిటి ఆ పరధ్యానం.. సినిమా హాల్ దగ్గరకు వచ్చేసాము.. కార్ లో.. చూసావా.. రా ఒక సేల్ఫీ తీసుకుందాము.. "


"తీసుకుందాము.. మళ్ళీ ఎప్పుడు ఈ కార్ కి ఈ భాగ్యం కలుగుతుందో కదా.. అయినా ఇంటిపక్కనే సినిమా థియేటర్ కాబట్టి.. పెద్దగా పెట్రోల్ ఖర్చు ఏమీ అవదు.. అదే కదా మీ ధైర్యం.. "


"అయినా ఎవరు ఏమనుకుంటే నాకేంటి.. ?"


"అదేంటి.. ఈ హాల్ కి తీసుకుని వచ్చారు.. ఆ పక్కనే మల్టీప్లెక్స్ కి వెళ్దాము.. "


"ఎక్కడ చూసినా అదే సినిమా.. అక్కడ టికెట్ ఎక్కువ పెట్టి మనల్ని ముంచేస్తారు. బయటకొచ్చి, ఏమైనా కొందామన్నా.. తిందామన్నా ఆస్తులు అమ్ముకోవాల్సిందే.. ఇక్కడైతే అన్నీ చవకే స్రవంతీ.. "


"మళ్ళీ ఇదేంటండీ.. బాల్కనీ కాకుండా.. కింది క్లాసు లో టికెట్ తీసుకున్నారు.. ?"


"ఖాళీగా ఉన్న సినిమా కి ఎక్కడ కూర్చుంటే ఏమిటి చెప్పు.. బాల్కనీ కి ఇక్కడికి రెండు వరుసలే కదా తేడా.. ! అంతే.. అర్ధం చేసుకో.. "


"హమ్మయ్యా.. ! ఇంటర్వెల్ అండి.. సినిమా చాలా బాగుంది కదండీ.. ! అలా బయటకు వెళ్లి కూల్ డ్రింక్ తాగుదాం.. "


"కూల్ డ్రింక్ లో ఏముంటుంది చెప్పు స్రవంతి.. ?.. ఈ మధ్య చెత్తా చెదారం ఉంటున్నాయని టీవీ లో చూడలేదా.. ? ఇంటినుంచి తెచ్చుకున్న వాటర్ బాటిల్ మనకి చాలు.. అదే ఆరోగ్యం. ఆరోగ్యం చెడి డాక్టర్ దగ్గరకి వెళ్తే, అంతే సంగతి.. చేసిన పొదుపంతా హారతి కర్పూరమే.. !" అన్నాడు సాగర్. 


('ఇంకా ఒక డ్రింక్ లో రెండు స్ట్రాలు ఊహించుకుంది నా పిచ్చి మనసు.. ఏం చేస్తాం.. ?' అని అనుకుంది స్రవంతి )


"ఈలోపు హలో.. స్రవంతి.. !" అని బాల్కనీ నుంచి ఒక పిలుపు. తిరిగి చూసిన స్రవంతికి గొంతు లో వెలక్కాయ పడినట్టు అయ్యింది.. అక్కడికి వచ్చింది తన ఫ్రెండ్ స్నేహ.. 


"ఏమిటే.. బాల్కనీ లో నేను ఉంటే, నువ్వేమో కిందన ఉన్నావు.. ? అదేమిటి చేతిలో.. పాప్ కార్న్ ప్యాకెట్లు ఎక్కడివి.. ?" మొహమాటం లేకుండా అడిగేసింది స్నేహ.

 

"అవా.. మా ఆయన రైతు బజార్ నుంచి తెచ్చారే.. " అంటూ వాటిని కవర్ చెయ్యడానికి చూసింది స్రవంతి. 


"పాప్ కార్న్ అంటే ఇదే చూడూ.. ఎంత డబ్బాలాగా ఉందో.. "

"ఇదేనా మీ ఆయన బాగా చేసుకోవడమంటే.. ?" అంటూ వెళ్లిపోయింది స్నేహ.

 

"చూసారా.. మా ఫ్రెండ్ దగ్గర నా తల కొట్టేసినట్టు అయ్యింది.. చెబితే వినరూ.. "


"ఏమిటే వినేది.. ఆ డబ్బా పాప్ కార్న్ ఖరీదు ఎంతో తెలుసా.. ? దాని బదులు ఆ రైతు బజార్ లో కొంటే, ఒక షాప్ పెట్టుకోవచ్చు తెలుసా.. ?"


"ఎంత చెప్పినా వినరు ఈ మనిషి.. అంటూ కంట నీరు పెట్టుకుంది స్రవంతి.. "


"స్రవంతి.. స్రవంతి.. ! ఎందుకు అలా ఏడుస్తావు చెప్పు.. ? ఏం చేసినా మన కోసమే కదా.. అయినా ఎవరు ఏమనుకుంటే నాకేంటి.. "


"చాల్లెండి సంబడం.. ఎప్పుడూ అదే డైలాగ్.. "


"హమ్మయ్యా.. ! ఎలాగైతేనేం నా స్రవంతిని నవ్వించాను. రేపు సండే మా ఫ్రెండ్ మ్యారేజ్ రిసెప్షన్ ఉంది. మనల్ని రమ్మని మరీ పిలిచాడు. ఇంటికి వెళ్తూ.. మంచి గిఫ్ట్ సెలెక్ట్ చేద్దాం.. "


షాప్ దగ్గర.. 


"ఏమండీ.. ! ఇది చూడండి.. ఎంత బాగుందో.. ఇది తీసుకోండి మీ ఫ్రెండ్ కి.. "


"రేట్ చూసావా.. ? ఎందుకు చెప్పు.. పక్కనే ఒక డూప్లికేట్ బజార్ ఉంది.. అక్కడ ఏదైనా పది, ఇరవై అంతే.. నువ్వు ఇక్కడ చూసినదీ అక్కడ దొరుకుతుంది.. "


"బాగుండదేమోనండి.. "


"ఎందుకోయ్.. ! వాడికి వచ్చిన గిఫ్ట్స్ ఓపెన్ చెయ్యడానికే వాడికి టైం ఉండదు.. ఎక్కడో అటక మీద పడేస్తాడు.. అలాగే కొంతకాలానికి అది పడైపోతుంది.. దానికోసం అంత ఖరీదు పెట్టి ఎందుకు కొనడం చెప్పు.. గిఫ్ట్ ఓపెన్ చేసే టైం కి లుక్ ఉంటే చాలదూ.. "


"మిమల్ని.. మెచ్చుకోవాలా.. తిట్టుకోవాలా.. అర్ధం కావట్లేదండీ.. "


"ఏమో నీ ఇష్టం.. అయినా ఎవరు ఏమనుకుంటే నాకేంటి.. ?"

"మళ్ళీ అదే డైలాగ్.. "


"పక్కనేదో డిస్కౌంట్ సేల్ ఉంది పద.. పద.. ఆ సూపర్ మార్కెట్ లో ఒక మూల చూడు.. అక్కడ యాభై నుంచి ఎనభై శాతం డిస్కౌంట్ పెడతారు. ఎలాగో మనం కొన్నవి ఒక వారంలో వాడేస్తాము కదా.. దాని కోసం ఎక్కువ రేట్ పెట్టి ఎందుకుకొనడం చెప్పు. మొన్న రేషన్ బియ్యం తేలేదు కదా.. వెంటనే వెళ్ళాలి లేకపోతే స్టాక్ అయిపోతుంది.. "


"అయినా.. రేషన్ బియ్యం ఏమిటండీ మరీనూ.. కొత్తగా ఇదేమిటి.. ?"


"ఈ రైతు బజార్, రేషన్ బియ్యం, డిస్కౌంట్ సేల్ మన పాలిట వరం స్రవంతి.. వాటిని వాడుకోవాలి.. అయినా ఎవరు ఏమనుకుంటే నాకేంటి.. ?"


('బాస్మతి రైస్ తో రిచ్ గా తింటూ.. రిచ్ గా ఉండడం నా కలే ఇక.. ' అనుకుంది స్రవంతి )


"మొన్న మీ ఫ్రెండ్ పోయాడని మీరు వెళ్లారు. మీది ఎంత గొప్ప ఫ్రెండ్షిప్ అండి.. మీది చాలా జాలి మనసు.. "


"అవును.. అక్కడందరూ వాడి చితి మీద వాడికి బాకీ ఉన్న డబ్బులు పెట్టి నమస్కరించారు తెలుసా.. ?"


"మరి మీరేమి చేసారో.. ?"


"నాకు వాడు బతికుండగా చాలా బాకీ ఉన్నాడు. అక్కడ అందరూ పెట్టిన డబ్బులు నుంచి నా బాకీ వసూలు చేసుకున్నాను.. "


"ఛీ.. అదేం పని.. ?"


"ఎందుకు అంత మాట చెప్పు.. చనిపోయిన తర్వాత కుడా నా బాకీ తీర్చగలిగినందుకు వాడు పై లోకంలో కుడా చాలా హ్యాపీ గా ఉంటాడు.. "


"చుట్టూ చూసిన వారు ఏమనుకున్నారో.. ఏమిటో?"


"మా ఫ్రెండ్షిప్ గురించి వేరే వారికి ఎందుకు.. ? అయినా ఎవరు ఏమనుకుంటే నాకేంటి.. ?"


మొగుడు తెలివిని చూసి ఏడవాలో, నవ్వాలో తెలియక.. 'మిస్టర్ పర్‌ఫెక్ట్' అనుకుని.. నవ్వుతూ బతికేస్తోంది స్రవంతి.. 


*********


తాత మోహనకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ తాత మోహనకృష్ణ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 

ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

Profile Link:



Youtube Play List Link:

నా పేరు తాత మోహనకృష్ణ. నాకు చిన్నతనం నుండి కథలంటే ఇష్టం. చందమామ, వార పత్రికలలో కథలు, జోక్స్ చదివేవాడిని. అలా, నాకు సొంతంగా కథలు రాయాలని ఆలోచన వచ్చింది. చిన్నప్పుడు, నేను రాసిన జోక్స్, కథలు, కొన్ని వార పత్రికలలో ప్రచురింపబడ్డాయి. నేను వ్రాసిన కధలు గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్ లాంటి వెబ్ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. బాలల కథలు, కామెడీ కథలు, ప్రేమ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.


ధన్యవాదాలు

తాత మోహనకృష్ణ


134 views0 comments

Comentários


bottom of page