'Modern Nannamma Cheppina Socrates Katha' written by N. Dhanalakshmi
రచన : N. ధనలక్ష్మి
“హాయ్ సూర్య .. ఏంటి మూవీకి వస్తాను అని ఇంకా రెడీ అవ్వలేదు? ఇంకా ఒక గంటలో మూవీ స్టార్ట్ అవుతుంది …”
“రేయ్ ఆత్రం నారాయణ! కొంచం తట్టుకో ....నీ ఆత్రానికి తగ్గట్టు నీ పేరు నారాయణ అని బాగా సెట్ అయింది రా !!
ఈ రోజు ఒక అరగంట మా నాన్నమ్మ కు అకింతము .. అమ్మా! మా నారాయణ గాడికి నీ చేత్తో చేసిన కాఫీ అన్నా, .. నువ్వు చేసే చెక్కిలాలు అన్నా ఇష్టం. కొంచం తెచ్చి ఇవ్వు ! వాడు ఒక పట్టు పడతాడు !!”
నారాయణ, సూర్యా వాళ్ళ అమ్మ ఇచ్చిన కాఫీ తాగుతూ సూర్య ను గమనిస్తాడు ...
సూర్య వాళ్ళ బామ్మకు వాట్సాప్ లో ఫొటోస్, యూట్యూబ్ వీడియోస్ లింక్స్ ఎలా పంపించాలో నేర్పిస్తున్నాడు .. నారాయణకు అంతా వింతగా ఉంటుంది .
“బామ్మా! ఈ రోజుకి ఇంతే .. “
“అది కాదు సూర్య !!! యూట్యూబ్ లో వచ్చే శతనామావళి పాటలను, సీరియల్ పాటలను ఎలా పాటలాగా.. అదేంటి.. ఎంపీ౩ లాగా మార్చేది నేర్పిస్తాను అన్నావు గా !!”
“నా బుజ్జి నాన్నమ్మ! ఈ రోజుకి ఇది చాలు.. రేపు ఇంకోటి నేర్పిస్తాను .. నేను మూవీ కి వెళ్ళాలి. రెడీ అయి వస్తాను” అని తన రూమ్ కి వెళ్తాడు ..
మన ఆత్రం నారాయణ సూర్య నాన్నమ్మ దగ్గరకి వెళ్లి "నానమ్మా! నిన్ను ఓ విషయం అడగవచ్చా ..” అన్నాడు
"అడుగు బాబు. నువ్వు కూడా నా మనవడు లాంటి వాడివే కదా ! అనుమతి ఎందుకు అడుగుతున్నావు !!"
" నేను ఇలా అడుగుతున్నానని ఏమీ అనుకోకండి. మీరు ఎందుకు ఇవన్నీ నేర్చుకుంటున్నారు? మేము నేర్చుకున్నా ఒక అర్థము .. పరమార్థము ఉంది. ఎందుకంటే మేము యూత్. మాకు సోషల్ నెట్వర్క్ తో పని ఉంటుంది .. మీకు ఏమి అవసరం ఉంటుంది .. అసలు నేర్చుకుని ఏమి చేస్తారు ?..???”
"బాబూ !! నీకు సోక్రటీస్ తెలుసా! ..”
“హా.. తెలుసు. ఆయన గొప్ప తత్వవేత్త. పాశ్చాత్య తత్వానికి ఆద్యునిగా భావిస్తారు. ఈయన సృష్టించిన సోక్రటీసు పద్ధతి చాలా ప్రాచుర్యం .....ప్లేటో, అరిస్టాటిల్ పై ఈయన ప్రభావం ఎంతో ఉంది”.
" ఆయన గురించి కథ ఉంది. మా సూర్య వచ్చేలోపు ఆ కథ చెబుతాను. వింటావా?”
“ఆ నానమ్మా. చెప్పండి. వింటాను”.
“సోక్రటీసుకు మరణశిక్ష విధించారు. తన ఉపన్యాసాలతో యువకుల్ని నాశనం చేస్తున్నాడనే అభియోగం మీద ఆయన్ని జైల్లో పెట్టారు.
ఆ వివేకవంతుడంటే అందరికీ గౌరవం. పేరుకు జైల్లో పెట్టారు కానీ అందరూ వచ్చి ఆయన్ని చూసి వెళుతున్నారు. శిష్య బృందమయితే అక్కడే ఉండి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. కానీ ఆ తాత్వికుడు ఇదేమీ పట్టనట్లు నవ్వుతూ అందర్నీ పలకరిస్తూ కబుర్లూ చెబుతూ ఉన్నాడు. అందరూ ఆయన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు. మరణమంటే లక్ష్యపెట్టని ఆ మహానుభావుణ్ణి చూసి విస్తుపోతున్నారు. మరణ శిక్ష అమలు కావడానికి రెండు గంటల సమయముంది. ఆ శిక్ష విషం తాగి మరణించడం. సమయం సమీపించే కొద్దీ అభిమానుల గుండెలు కొట్టుకుంటున్నాయి.
సోక్రటీస్ ఆ సంగతే పట్టనట్లు అది తనకు సంబంధించిన విషయమే కానట్లు ఉన్నాడు. అందరి ముఖాల్లో ఆందోళన, దిగులు, ఆయన ముఖంలో ఆనందం, వెలుగు. ఆయన కిటికీలోంచి బయటికి చూస్తూ కూర్చున్నాడు. బయట ఒక చెట్టు కింద బిచ్చగాడు కూచుని లైర్ వాద్యం వాయిస్తున్నాడు. ఆ తీగల్ని మీటుతూ పాడుతున్న పాట సోక్రటీస్ మనసుని తాకింది.
పరవశంగా కళ్ళు మూసుకున్నాడు. చల్లటి గాలి ఆ పాటను మోసుకొచ్చి పరిమళంలా సోక్రటిస్ హృదయాన్ని తాకింది. ఎప్పుడూ ఆనందంగా ఉండే అతను మరింత ఆనందపడ్డాడు.
సోక్రటీస్ మెల్లగా కళ్ళు తెరచి జైలర్‌ని పిలిచాడు. జైలర్ ఎంతో గౌరవభావంతో దగ్గరికి వచ్చి ఏమి కావాలన్నాడు. సోక్రటీస్ కిటికీలోంచి చూపించి
”మీకు అభ్యంతరం లేకుంటే ఆ బిచ్చగాణ్ణి తీసుకొస్తారా?” అని అడిగాడు.
జైలర్ ”అయ్యో! దాందేముంది?” అని వెళ్ళి ఆ బిచ్చగాణ్ణి తీసుకొచ్చాడు.
సోక్రటీస్ ఆ బిచ్చగాణ్ణి తనకాపాట నేర్పమన్నాడు. అతని దగ్గర నుంచి లైర్ వాద్యం తీసుకున్నాడు. ఆ బిచ్చగాడు పాటపాడాడు.
సోక్రటీస్ ఆ పాట పాడుతూ లైర్ వాద్యం వాయించాడు. ఇట్లా అరగంట సాధన తరువాత బిచ్చగాడి సాయం లేకుండానే ఆ పాట పాడాడు.
సోక్రటీస్ కృతజ్ఞతలు చెప్పి బిచ్చగాణ్ణి పంపేశాడు. ఆయన శిష్యులు, జైలర్ ఆశ్చర్యపోయారు. మరణశిక్షకు ఇంకా గంట మాత్రమే ఉంది. కానీ సోక్రటీస్ ప్రవర్తన వాళ్లకు వింతగా అనిపించింది.
శిష్యులు “గురువుగారూ! ఇక గంటలో విషపాత్ర మీ చేతికి వస్తుంది. అది తాగి మీరు ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళబోతున్నారు.
కానీ ఇప్పుడు మీరు లైర్ వాద్యంమీద ప్రాక్టీసు చేసి పాట నేర్చుకున్నారు. ఏమిటిది?” అని కన్నీళ్ళ పర్యంతమయ్యారు.
సోక్రటీస్ నవ్వి ”జీవితమంటే నేర్చుకోవడం, మరణం గురించి ఆలోచించడం కాదు. నేను నువ్వు ఇక్కడున్న అందరం ఎప్పుడో ఒకప్పుడు చనిపోతాం. కానీ జీవించినన్నినాళ్ళు ప్రతిక్షణం విలువైందే. ఎప్పటికప్పుడు తెలియంది తెలుసుకోవడంలోనే ఆనందముంది.గంటక్రితం నాకా పాట తెలీదు. ఇప్పుడు నేర్చుకున్నాను. ఇంకా నాజీవితంలో గంట సమయముంది. అంటే ఇప్పటికీ నేర్చుకోవడానికి నాకు అవకాశముంది” అన్నాడు.
శిష్యుల నోట మాట రాలేదు. జీవితం అంటే ఏడుస్తూ కూర్చోడం కాదు., జీవితం అంటే - నాకు ఇంతే రాసి పెట్టి వుంది - అనుకుని - నా ఖర్మ ఇంతే - అంటూ నిందించడం కాదు ., జీవితం అంటే - నేర్చుకోవడం.
ఇప్పుడు చెప్పు బాబూ! ఇంకా కొద్ది సేపటిలో తాను చనిపోతాను అని తెలిసినా సోక్రటీస్ గారు తనకు తెలియని విద్యను నేర్చుకున్నప్పుడు.. నాకు 50 ఏళ్ళు. ఇంకా ఒక 20 సంవత్సరాలు బతుకుతానూ అన్న నమ్మకం ఉన్నప్పుడు నేర్చుకోవచ్చు కదా !!"
"సారీ నానమ్మా !!!”
“పర్లేదు బాబూ! నీ అనుమానం తీరింది కదా అది చాలు నాకు !!”
“అవును బామ్మా !!! మీకు టైపు చేయడం రాదు కదా! అప్పుడు ఎలా మేనేజ్ చేస్తారు ..”
“ఇలా” అని … తనకు ఏమి కావాలో స్పీకర్లోకి వెళ్లి చెప్పుతారు .. అది ఓపెన్ అవుతుంది.
“ఈ స్పీకర్ ఆప్షన్ నా లాంటి వారికి చాలా యూజ్ ఫుల్ కదా !!” అంటారు.
“మీరు ఇంగ్లీష్ ఎలా మాట్లాడుతున్నారు!!!!”
" హా హా... సినిమాల్లోను, చూసే వీడియోలో, సీరియల్లో కూడా మాట్లాడుతున్నారు కదా ... అది విని అర్థం చేసుకోవడం, అర్థం చేసుకోలేకపోతే గూగుల్ తల్లిని అడిగి అర్థం చేసుకోవడమే!”
“నానమ్మా! చాలా థాంక్స్. నా కళ్ళు తెరిపించారు .. నేర్చుకోవాలన్న తపన ఉండాలి కానీ .. వయస్సుతో పని లేదు అని … ప్రతిరోజూ ఒక కొత్త విషయం నేర్చుకోవాలని నాకు నేర్పించారు …”
“అరే మనవడా! నాకేమీ థాంక్స్ వద్దు కానీ, ఈ వాట్సాప్లో ప్రతి ఫోన్ నెంబర్కి బ్యాక్ గ్రౌండ్ వాట్సాప్ వాల్ పేపర్ ఎలా సెట్ చేయాలో నేర్పించవా !!”
“అలాగే బామ్మా”అని నేర్పిస్తాడు .. ఆమె స్పీడ్ గా నేర్చుకోవడమే కాదు, తన ఫోన్ ప్రతి నెంబర్ కి సెట్ చేసుకుంటారు ..
“రేయ్ నారాయణ! వెళ్దామా”
“ రేయ్ మామా! మీ నానమ్మ సూపర్ రా ..”
“ మరి ఎవరు అనుకున్నావు.. ఈ సూర్య మోడరన్ నానమ్మ!” అని కాలర్ ఎగిరేసి “బాయ్ డార్లింగ్” అని వాళ్ళ నానమ్మకు బాయ్ చెప్పేసి ఇద్దరూ వెళ్ళిపోతారు …”
“ రేయ్ మామా! ఈ రోజునుంచి నేను కూడా నాకు తెలియని విషయాల్ని నేర్చుకుంటా!! నాకు డ్రాయింగ్ అంటే ఇష్టం .. ఆయిల్ పెయింటింగ్ ఎలా వేస్తారు అని ఈ రోజు నెట్లో సెర్చ్ చేసి నేర్చుకోవడానికి ట్రై చేయడమే కాదు, నాకు బాగా వచ్చిన తరవాత మన నానమ్మకు నేర్పిస్తాను. ఏమంటావు ??”
“నువ్వు సూపర్ రా మామా!” అని హైఫై ఇచ్చుకుంటారు.
***శుభం***
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.
రచయిత్రి పరిచయం :
నమస్తే. నా పేరు ధనలక్ష్మి. వృత్తి రీత్యా ప్రైవేట్ స్కూల్లో గణితం బోధిస్తాను. మాది మదనపల్లి, చిత్తూర్ జిల్లా. కథలు , కవితలు రాయడం నాకు ఇష్టమైన వ్యాపకం. ఆనందం వేసినా, బాధ వేసినా, కోపం వచ్చినా నేను పంచుకునే నా నేస్తం అక్షరం. నాలో మెదిలే భావాలను, నేను చూసిన సంఘటనలను రాయడం నాకు అలవాటు.
Comments