మాడ్యులర్ కిచెన్
- Madduri Bindumadhavi
- Feb 11, 2023
- 3 min read

'Modular Kitchen' New Telugu Story
Written By Madduri Bindumadhavi
రచన: మద్దూరి బిందుమాధవి
(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
“అమ్మా! ఇవ్వాళ్ళ నా ప్రాజెక్ట్ లాంచింగ్. సెలవు పెట్టలేను.
కిచెన్ రిపేర్ పని వాళ్ళొస్తారు. పదింటికి వచ్చి మా ఇంట్లో ఉండి కాస్త ఆ పని చేయించగలవా” అని కూతురు కాంచన అభ్యర్ధన విని, గబ గబా పని తెముల్చుకునే కార్యక్రమంలో పడింది శకుంతల.
కాంచన తల్లి ఆ ఊళ్ళోనే ఉన్నా... కూతురి ఇంట్లో ఎవరూ ఉండరు... అందరూ ఉద్యోగాలకి పోతారనే కారణంతో ఎక్కువగా వాళ్ళింటికి వెళ్ళదు.
తన ఇంటి పని ముగించుకుని..ఓ మెతుకు నోట్లో వేసుకుని క్యాబ్ మాట్లాడుకుని కూతురింటికి జుబిలీ హిల్స్ వెళ్ళింది.
@@@@
పని వాళ్ళు వంటగదిలో పని చేసుకుంటున్నారు. తను టీవీ చూస్తూ కూర్చుంటే వాళ్ళు సరిగా చేస్తారో లేదో అనే అనుమానంతో అక్కడే పుస్తకం చదువుకుంటూ కూర్చుంది.
మధ్యాహ్నం దాకా పని చేసి, లంచ్ కి వెళ్ళొస్తాం అని వాళ్ళటు వెళ్ళాక అప్పటి దాకా ఏం పని చేశారో చూద్దామని అటు వెళ్ళింది.
వంటింట్లోనే పని చేస్తున్నారు కనుక అక్కడ టీ పెట్టుకునే వీలు ఉంటుందో లేదో అని తనింటినించే ఫ్లాస్కులో టీ పోసి తెచ్చుకుంది.
కప్పులో టీ పోసుకుని తాగుతూ అన్నీ పర్యవేక్షించింది.
ఫ్లాట్ కొనేటప్పుడు ఉన్న కప్ బోర్డ్స్ అన్నీ పీకేసి కొత్తగా మాడ్యులర్ కిచెన్ ఫిక్స్ చేస్తున్నారు.
అన్నీ తయారుగా (pre designed) ఉన్న కింది వైపు షెల్ఫులు, చిమ్నీ, పై వరసలో షెల్ఫులు కొంతవరకు బిగించారు. మిగిలినవి ఇవ్వాళ్ళ పూర్తి చేసి రేపు వచ్చి వాష్ బేసిన్, డిష్ వాషర్ బిగిస్తాము అని చెప్పారు.
@@@@
"అమ్మా వాళ్ళు పని చేస్తున్నారా? ఎంతవరకు అయింది.
నాకు ఇక్కడ పని అయిపోయేట్టుంది. వీలైనంత త్వరగా వచ్చేస్తాలే" అన్నది కాంచన.
అన్నట్టే సాయంత్రం 5.30 కల్లా కాంచన ఇంటికి వచ్చేసింది.
అప్పటికి మాడ్యులర్ కిచెన్ లో భాగమైన 'ఫేబర్' లేటెస్ట్ మోడల్ స్టవ్, చిమ్నీ బిగించే పని చూస్తున్నారు.
"అమ్మడూ! ఎందుకే ఇప్పుడు వంట ఇంట్లో ఇంత ఖరీదైన మార్పులు చేస్తున్నారు? ఎక్కువ భాగం మీరిద్దరూ ఇంట్లో ఉండరు. సెలవు రోజున బయట తిరుగుతారు.
మీ ఇంటికి బంధువులు వచ్చే అవకాశం లేదు. ఫ్రెండ్స్ ని పిలిస్తే ఏ క్యాటరింగుకో ఆర్డర్ ఇస్తారు. ఇంట్లో ఉన్నప్పుడు వండుకునే ఇంట్రెస్ట్ లేదని, టైం ఉండదనీ తిళ్ళు స్విగ్గీ లో ఆర్డర్ ఇచ్చి తెప్పించుకుంటారు. మరింకెందుకే లక్షలు ఖర్చు పెట్టి వంట ఇంటి రిపేర్" అన్నది తన ధోరణిలో శకుంతల.
"ఈ వెట్ గ్రైండర్ ఎందుకు కొన్నావు. రోజువారీ వంటే చెయ్యనప్పుడు..ఇంత గ్రైండర్లో పప్పు రుబ్బి ఏం చేస్తావ్? పైగా ఇప్పుడు ఇడ్లీ లకి, దోశలకి అదేదో బ్యాటర్లుట..అవి దొరుకుతాయిట కదా!
మా చిన్నతనాల్లో అయితే ఇడ్లీల కోసం..ఇంట్లో నలుగురికీ సరిపోవాలని మా అమ్మ కిలో పప్పు పోసి రోట్లో రుబ్బేది. అప్పుడు ఈ వెట్ గ్రైండర్లూ లేవు..ఈ బయట అమ్మటాలూ లేవు. ఇప్పుడు కుటుంబాలు చిన్నవైనాయి. సౌకర్యాలు ఎక్కువైనాయి. పని ముట్లు దొరకటమూ ఎక్కువయింది" అన్నది.
"అబ్బా అమ్మా...ప్రతి దానికీ ఒక సుదీర్ఘ ఉపన్యాసం ఇస్తావ్! అది కొన్నది కాదు. మాడ్యులర్ కిచెన్ లో భాగంగా వాడు కాంప్లిమెంటరీగా ఇచ్చాడు."
"నువ్వు మరీ బీసీ కాలంలో లాగా ఆలోచించకు. మనం ఇంట్లో వంట చేస్తేనే మాడర్న్ కిచెన్ ఉండాలా? దానికి దీనికి ఏం సంబంధం? మన సంపాదనలకి తగ్గట్టు ఇంట్లో అన్నీ లేటెస్ట్ గా ఉండాలి. ఇద్దరం సంపాదిస్తున్నాం. కిచెన్ కోసం రెండు లక్షలు ఖర్చు పెట్టలేమా? ఇంటికెవరైనా వస్తే పాతకాలం వంటిల్లు లాగా ఉంటే ఏం బావుంటుంది?"
"ఇంక వంట చెయ్యటం అంటావా..అన్నీ బయట దొరుకుతుంటే ఉన్న కాస్త టైము లోనూ చెమటలు కక్కుకుంటూ వంటెవడు చేస్తారు? హాయిగా టీవీ చూస్తూ ఆఫీసులో పడిన శ్రమ మర్చిపోక!"
"మీరు మారాలమ్మా" అని ఇప్పుడు ఇంటికెళ్ళి డిన్నర్ ఏం వండుతావ్? స్విగ్గీలో ఆర్డర్ ఇచ్చెయ్యనా" అన్నది.
"తల్లీ నీకు.. నీ స్విగ్గీకి ఒక నమస్కారం. అలా బయట నించి తెచ్చేవి నాకూ సహించవు..నాన్నా తినరు. ఆ గుప్పెడు నేను ఉడకేసుకోగలను. ఏమిటో ఈ కాలపు పిల్లలకి అంతా పటాటోపమే! వస్తా" అని శకుంతల తన ఇంటికి బయలుదేరింది.
[ వెనకటికి ఎవరో వేలుందని గారె చేసుకుంటానన్నాడుట. ఇళ్ళల్లో వంటలు మానేశాక ఆధునిక సదుపాయాలతో మాడ్యులర్ కిచెన్లు... ఆడ వాళ్ళు చీరలు కట్టటం మానేసి..జీన్ ప్యాంట్స్ వేసుకు తిరగటం మొదలుపెట్టాక..ఖరీదైన వెరైటీ చీరలు కుప్పలు తెప్పలుగా మార్కెట్లో వచ్చి పడుతున్నాయి. అదే PARADOX]
ఎం బిందుమాధవి
మద్దూరి బిందుమాధవి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
Twitter Link
Podcast Link
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

నేను బ్యాంక్ ఆఫీసర్ గా 32 సం లు ఉద్యోగం చేసి, పదవీ విరమణ చేశాక దాదాపు అరవయ్యేళ్ళ వయసులో కథలు వ్రాయటం ప్రారంభించాను. సామెతలు, శతక పద్యాల మీద ఎక్కువ కథలు వ్రాశాను.
సరదాగా కాలక్షేపానికి ప్రారంభించిన వ్యాపకం.. ఇష్టంగా మారటానికి, ప్రచురణ కర్తల ప్రోత్సాహం, పాఠకుల స్పందనే కారణం. మీ ప్రోత్సాహం ఇలాగే కొన సాగగలదని ఆశిస్తూ.. మీ కందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి బిరుదు పొందారు.


Comments