'Mogudu Urelite' Written By Ranganath Sudarsanam
రచన : రంగనాథ్ సుదర్శనం
"ఏరా.. ప్రసాదు, రేపేగా మీ ఆవిడ ఊరెళ్ళేది. తొందరపెట్టకుండా.., చెల్లాయిని ఓ నాలుగు రోజులు ప్రశాంతంగా ఉండి రమ్మనురా!, ఈ నాలుగు రోజులు మీ ఇంట్లో మనమంతా కలిసి ఫుల్లుగా ఎంజాయ్ చేద్దాం!, ఏరా..!" అన్నాడు ఆనందరావు. అందుకు ప్రసాద్ కాస్త తట పటాయించినా.. మిగిలిన మిత్రులంతా ఎగిరి గంతేసి "ఓకేరా..," అన్నారు.
ఆ రాత్రి మిత్రులెవ్వరికీ సరిగ్గా నిద్ర పట్టలేదు, కారణం? అంతా తెల్లవారి అనుభవించబోయే అమర సుఖాలను ఊహించుకుంటూ పరవశించిపోవటమే! ఈ బృందంలో ప్రసాదు ఒక్కడే కొత్త. ఇదంతా ప్రసాదుకు కొత్తగా, ఇబ్బందిగా అనిపించినా, మిగిలిన అందరూ ఒకే ఆఫీసులో పనిచేసే సీనియర్ కొలీగ్స్ కావటంతో మొహమాటానికి ప్రసాదుకు తప్పింది కాదు. రకరకాల ఆలోచనలతో ఎప్పటికో కానీ నిద్ర పట్టలేదు.
***
"హలో.. ఏయ్ వాణి, రెడీగా వున్నామే, రమ్మంటావా? లత, రాణి కూడా వచ్చారే" అని ఫోన్లో అడిగింది జయ తన స్నేహితురాలిని ఉత్సాహంగా.
"అబ్బా! కాస్త ఓపికపట్టండే, మా ఆయన ఇంకా బయలుదేరలేదు" అంది వాణి లోగొంతుకతో.
"అబ్బా.. ఇంకెంతసేపే, త్వరగా పంపించవే" అంది జయ చిరాకు పడుతున్నట్లు.
"అబ్బా.. ఆగవే తల్లి, ట్రైన్ రెండు గంటలు అలస్యమట!, అందుకే ఆయన ఇంకా స్టార్ట్ కాలేదు. అయినా ఈ రోజు వెళితే రెండు రోజుల వరకు రాడు, ఇక మనదే రాజ్యం, కాస్త ఓపిక పట్టవే” అంది వాణి, జయను సముదాయిస్తున్నట్లుగా.
"ఏయ్..వాణి డార్లింగ్! నీది 'బడ్వైజర్' బ్రాండే కదా! అందరికీ బీర్లు తీసుకుంటున్నాము ఓకేనా..” అంది జయ.
“ఛీ... వద్దే! హార్డ్ తీసుకోండి, 'పండగపూట కూడా పాత మొగుడేనా అన్నట్లు', ఇవాళ కూడా లైట్ డ్రింకేనా!సిగ్గులేదానే? అందరికి 'సిగ్నేచర్' విస్కీ తీసుకరండి, కాస్త వెరైటీగా ఉంటుంది, మంచి కిక్ ఇస్తుంది. అన్నట్లు స్నాక్స్ ఏమి తేకండే.., నేను బేజా ఫ్రై, లివర్ ఫ్రై చేసి రెడీగా ఉంచాను. నేను ఫోన్ చేయగానే, ధమ్కీ బిర్యానీ తీసుకొని బయలుదేరండి.. ఓకేనా! అన్నట్టు గోల్డ్ ఫ్లేక్ సిగరేట్స్ కింగ్ సైజ్ తేవడం మరిచిపోకండి. సరే ఉంటాను, బై!".. అని ఆర్డర్ జారీ చేసి ఫోన్ పెట్టేసింది జయ.
జయకు గాలిలో తేలిపోతున్నట్టుంది, ఈ ఆనందాన్ని భరించడం వల్ల కావడం లేదు. రాక రాక వచ్చిన అవకాశం, ఎన్నాళ్ళుగానో తీరని కోరిక, ఇన్నాళ్లకు తీరబోతున్నందుకు ఎగిరి గంతేయాలన్నంత ఆనందంగా ఉంది.
ఈసారి వాణి వాళ్ళ ఇంట్లోనే అందరం కలిసి నోములు నోచుకుంటున్నామని బుకాయించి, అందరం ఇంట్లో వాళ్ళను బురిడీ కొట్టించాము. రెండు రోజులు అందరం వాణి వాళ్ళ ఇంట్లో ఎంజాయ్ చేయడానికి పక్కాగా ప్లాన్ స్కెచ్ వేసుకున్నాము.
అబ్బ.. మరికొద్ది సేపట్లో అందరం వాణి వాళ్ళింట్లో కలవబోతున్నాము. ఆ తరువాత మస్తుగా తినడం, తాగడం, డాన్సులు, పాటలు అబ్బబ్బబ్బ.. తలుచుకుంటేనే.., ఒంటికి పూనకం వచ్చినట్లుగా, మనసు గాలిలో తేలిపోతున్నట్లుగా ఉంది. సన్నగా విజిల్ పాట పాడుతూ..స్నేహితురాళ్లను చూసి కనుబొమ్మలు ఎగరేసింది జయ.
***
మిత్రురాళ్ళంతా వాణి వాళ్ళ ఇంట్లోకి చేరుకున్నారు, మొదటిరౌండ్ అయిపోయింది. గుప్పు గుప్పున సిగరెట్ పొగలు వదులుతూ, కమ్మగా వండిన మెదడు, ఖార్జమ్ లొట్టలేసుకుంటూ వేళ్ళు నాకుతూ తింటున్నారు.
మూడవ రౌండుకు వచ్చేసరికి ఆనందం హద్దులు చెరిపేస్తూ ఉంటే, మనసు పొరల్లో దాగిన మాటలు మత్తుగా ప్రవహిస్తున్నాయి. ఇక్కడే కథ మలుపు తిరిగింది.
ఊరికి వెళ్తానని వెళ్లిన వాణి భర్త, టూర్ ప్రోగ్రాం క్యాన్సల్ కావడంతో ఇంటికి తిరిగి వచ్చాడు. ఇంట్లో గోల గోలగా మాటలు వినపడటంతో, అదేంటో గమనించాలని, మెల్లగా నక్కి విండో పక్కగా నిలబడి, లోపలి దృశ్యాన్ని చూసి నిర్ఘాంతపోయాడు. కళ్ళు తిరిగుతున్నట్లు, వళ్ళు తూలిపోతున్నట్లు అనిపించింది. తమాయించుకొని గోడకు అనుకొని నిలబడి, గుండె దిటవు చేసుకుని లోపలికి చూస్తూ, అక్కడే నిలబడి వారిని గమనించసాగాడు.
“ఏయ్.. వాణి! నీ మొగుడు ఊరెళ్లి మంచిపని చేశాడే!, మనమంతా ఆయనకు సన్మానం చేద్ధాం, ఏమంటారే?” అంది జయ.
మిగిలిన వారంతా “ఎక్సలెంట్, మార్వలెస్.. గుడ్ ఐడియా! తప్పకుండా చేద్దామే” అంటూ ముక్తకంఠంతో గట్టిగా అరిచారు.
“ఆయనొక్కడికే కాదే..!, మన నోముల మాటలు నమ్మి బకరాలైన మన హస్బెండ్స్ అందరికి 'బకరా' అని బిరుదు ప్రధానం చేసి అందరికి సన్మానం చేద్దామే.. అంది జయ సిగరెట్ పీకను యాష్ట్రే లో నలుపుతూ .
"ఓహో.. సూపర్ ఐడియా!" అన్నారు అందరూ గట్టిగా బల్లలు చరుస్తూ.
నాలుగవ రౌండ్ అయిపోయింది.
"ఏయ్.. వాణి! ఇదిగోవే, ఈ పెన్ డ్రైవ్ టీవీకి కనెక్ట్ చెయ్యవే, ఎంజాయ్ చేద్దాం! " అంది జయ మత్తుగా.
"అందులో ఏముందే?” అన్నారు స్నేహితులంతా ఆశ్చర్యంగా నోరెళ్ళబెట్టి.
"ఏయ్ పిచ్చి మొద్దుల్లారా! ఎంజాయ్ అంటే అర్థం కాలేదానే? అందులో అవే ఉన్నాయి!" అంది జయ కన్ను గీటుతూ.
"ఓహో.. సూపర్!" అని అందరూ జయను గట్టిగా ముద్దుపెట్టుకున్నారు. పిచ్చి పిచ్చిగా, గోలగోలగా అరుస్తూ, నడుములు తిప్పుతూ వీరంగం వేస్తున్నారు.
“ఏయ్.. జయ! మనం చేసేది కరెక్ట్ కాదేమోనే! ఇది మగవాళ్లకు తెలిస్తే చంపుతారే.., అంది రాణి.
"ఏయ్.. నోర్ముయ్యవే! నీ సోది.. నువ్వునూ! రోజు వాళ్ళు చేసే తప్పు ఒక్కసారి మనం చేస్తే వచ్చిందా!. భార్య పక్కనుండగానే పక్కింటావిడకు లైను వేయడం, ఇంట్లో పనిమనిషిని కూడా వదిలిపెట్టకపోవడం, ఇంట్లో భార్యను తిడుతూ పక్కింటావిడను పొగడటం, అర్ధరాత్రి, అపరాత్రి అనకుండా తాగి, తప్పి, వచ్చి మనలను వేపుక తినడం ఇవన్నీ కరెక్టేనా!!.., చెప్పవే", అంది ఆవేశంగా జయ.
"అదికాదే.. వాళ్ళు మగాళ్లు, వాళ్లకేదైనా చెల్లుతుందే.., మనం అలా కాదుగా"! అంది రాణి.
"నీ బొంద.., తర తరాలుగా అడవాళ్లను బానిసలుగా చేసి, కట్టుబాట్ల సంకెళ్లలో బందీని చేసి, భర్త ఎన్ని తప్పులు చేసినా భరించమని, భర్తే ప్రత్యక్ష దైవమని, మన నరనరాల్లో ఎక్కించి, భర్త కొట్టినా.., తిట్టినా, అతని కాళ్ల దగ్గరే పడి ఉండమని చెప్పి, మన ఆత్మగౌరవాన్ని, మన స్వేచ్ఛను మగవాళ్ల కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టి, మన కళ్లముందే మగవాళ్ళు విచ్చలవిడిగా తిరిగినా, భరించమనడం, అడిగే హక్కు కూడా లేకుండా చేయడం ఇవన్నీ సబబేనా!!” అంది జయ ఆవేశంగా..
“నిజమేనే.., మహిళలు అన్ని రంగాలలో పురుషులకు సమానంగా ఎదిగినా.. ఇంకా అత్తింటి ఆరళ్లు, వరకట్నపు హత్యలు, భర్త చేతిలో చిత్రహింసలు ఎందుకు తగ్గడంలేదు?.” అంది వాణి ఆవేశంగా .
“సరిలేవే.. ఆపండి, ఈ సోది ఉపన్యాసాలతో మూడ్ పాడు చేయకండే!! ఆ బకరాల సంగతి ఇప్పుడెందుకే..., ఇప్పటి సంగతి చూడండి, ఎంజాయ్ చేయండి” అంది లత టాపిక్ డైవర్ట్ చేస్తూ.
బైట కిటికీ పక్కన నిలబడి, ఇదంతా చూస్తున్న వాణి భర్త కు మతి పోతుంది. ఏంటిదంతా! ఎంతో అణకువ, పద్ధతిగా ఉండే తన భార్యేనా..., ఇలా చేస్తుంది!!. ఇంత పచ్చిగా సిగ్గులేకుండా, ఇంత విచ్చలవిడిగా ఎలా చేస్తుంది!. తనకు కళ్ళు తిరుగుతూ, మూర్ఛ వచ్చినంత పనైంది. లేదు.. లేదు. ఏదో ఒకటి చేయాలి? ఈ అఘాయిత్యాన్ని ఎలాగైనా ఆపాలి?. అనుకోని క్షణం ఆలస్యం చేయకుండా వెంటనే, లోన ఉన్న ఆడవాళ్ళ భర్తలందరికీ ఫోన్ చేసి, అందరిని ఉన్నఫలాన అక్కడికి రావాల్సిందిగా చెప్పాడు ప్రసాద్.
లోన ఆడవాళ్లు, ఒళ్ళు మరచిపోయి రెచ్చిపోతున్నారు, బూతులు దొర్లుతున్నాయి. పెద్దగా అరుస్తున్నారు. ఒకరినొకరు కౌగలించుకొని ముద్దులు పెట్టుకుంటున్నారు. బెడ్ రూమ్ కథలు చెప్పుకుంటూ నవ్వుతూ.., తుళ్ళుతూ కేరింతలతో, సిగ్గు వదిలి హద్దులు చెరిపేసుకుంటున్నారు.
"ఏయ్..జయ! ఇప్పుడు మా ఆయన కావాలనిపిస్తుందే! అబ్బా తట్టుకోలేక పోతున్నానే!", అంది వాణి జయను గట్టిగా వాటేసుకుంటూ.
"అవునే..., మాకు అలాగే వుంది. మావాడు ఇప్పుడుంటేనా ....., అబ్బా..., ఒరేయ్ ఎక్కడున్నార్రా....! ! ఇక్కడ పెళ్లాలు కాలిపోతుంటే ఏంచేస్తున్నార్రా..? వెదవల్లారా!! ఎప్పుడూ ఆ సోంబేరి అవతారాలతో, పాత చింతపండు ముఖాలూ మీరూ! భార్యలను అర్ధం చేసుకోండిరా! ఎప్పుడూ.., ఉద్యోగం డబ్బులు మాత్రమే కాదురా.., మమ్మల్ని కాస్త సుఖ పెట్టడం నేర్చుకోండిరా బాబు! మమ్ములనెప్పుడూ, ఆ కిచెన్ లో నే మగ్గబెట్టకండిరా! కాస్త గాలి పీల్చుకోనివ్వండిరా!, అరేయ్.. మీకు దమ్ముంటే రండిరా!.. రండి!. అంటూ ఏదేదో..వాగుతూ, పెట్రేగిపోతున్నారు.
ఇదంతా గమనించి, కోపంతో ఊగిపోయాడు.. వాణి భర్త ప్రసాద్, కాళ్ళ కింద భూమి కదిలి పోతున్నట్లనిపించింది. ఆకాశం బద్దలై పోతున్నట్లనిపించింది.
ఈలోగా లోన ఉన్న మిగిలిన ఆడవాళ్ళ భర్తలు కూడా వచ్చారు. అంతా కలిసి తలుపులు బద్దలుకొట్టి లోపలికి పోయారు.
అంతే .... ఢాం.. ఢాం..ఢాం...... అంటూ పిస్టల్ తీసి వాణి పైనా.., మిగిలిన వారి పైనా, విచక్షణారహితంగా కాల్పులు జరిపి అందరినీ చంపేశాడు ప్రసాదు.
అంతా రక్తం.. అందరూ రక్తపు మడుగులో శవాల్లా పడిపోయారు.
"వాణి "!!! అంటూ ఒక్కసారిగా ఉలిక్కిపడి.. నిద్ర లేచాడు ప్రసాద్!!! వళ్ళంతా చెమటలతో తడిసిపోయింది, గొంతు తడి ఆరిపోయింది. పక్కకు తిరిగి చూసాడు. పక్కన భార్య వాణి ప్రశాంతంగా నిద్రపోతుంది. హమ్మయ్య ఇదంతా కలన్నమాట! థాంక్ గాడ్ అనుకున్నాడు.
స్నేహితుల ప్రతిపాదన, వాణి ఊరెళితే చేయాలనుకున్న ఎంజాయ్, మందు పార్టీ, కాల్ గర్ల్, వగైరాలన్ని రివర్సుగా కలవచ్చిందన్నమాట! అనుకున్నాడు ప్రసాద్, వంటికి పట్టిన చెమటలు తుడుచుకుంటూ.
ప్రసాద్ కు తన తప్పు తెలిసివచ్చింది. భార్య మాత్రం పద్ధతిగా ఉండాలి, భర్త మాత్రం విచ్చలవిడిగా తిరగాలి. భార్య ఊరెళితే బాగుండు? భార్య ఇంట్లో ఉంటే అడ్డు, ఆమె లేకుంటేనే సంతోషం, అని భావించడం ఎంతో తప్పు కదా!!. భార్యకు భర్తకు వేరు, వేరు న్యాయాలు ఉండవుగా..!
నేను స్నేహితులతో కలిసి చేయాలనుకున్నవన్నీ, నా భార్య చేస్తే భరించలేక పోయాను, తనను చంపి వేయాలన్నత కోపం వచ్చింది. కానీ...కానీ.., అదే తప్పు నేను చేయడానికి సిద్ధపడడం సమంజసమా! మరి అలాంటప్పుడు, నాకు అదే శిక్ష పడాలిగా! మనసులో ఆందోళన మొదలైంది. పశ్చాత్తాపంతో తన ప్రవర్తన పట్ల తనకే సిగ్గనిపించింది. జ్ఞానోదయమై, కర్తవ్యం బోధపడింది ప్రసాదుకు.
తెల్లవారి వాణి ఊరెళ్ళింది. కానీ ప్రసాద్ స్నేహితులనెవ్వరిని ఇంటికి ఆహ్వానించలేదు. స్నేహితులు ఎంతగా ఒత్తిడి చేసినా, ఇలాంటివి తనకు నచ్చవని తెగేసి చెప్పడమే కాక, ఇకనుండి ఇలాంటి ఆలోచనలకు , అసలు ఇలాంటి స్నేహాలకే దూరంగా ఉండాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు ప్రసాద్.
భార్య ఎలా ఉండాలని భర్త కోరుకుంటాడో.., భార్య కూడా అంతేకదా! భర్త చేస్తే తప్పుకాని దాన్ని, భార్య చేస్తే తప్పు, అని అనే నైతిక అర్హత ఏ భర్తకైనా ఎలా ఉంటుంది?.
అందుకే.., భార్య భర్త ల అలవాట్లు, పద్ధతులు ఒకరివి, మరొకరికి ఆదర్శంగా ఉండాలి లేదా ఉండేలా మార్చుకోవాలి. అప్పుడే ఆ కుటుంబములోని పిల్లలు కూడా తల్లిదండ్రుల నుండి ప్రభావితం అవుతారు అనుకున్నాడు ప్రసాద్.
భయంతోనో, అపరాధ భావంతోనో పొందే ఏ ఆనందమైనా సరి అయినది కాదు. అందుకే కష్టసుఖాలన్నింటిని భార్య భర్త లిరువురు కలిసి పంచుకుంటేనే ఆనందం.
అన్యోన్యమైన దాంపత్యంలో ఉండే ఆనందం ముందు, ఈ కక్కుర్తి సుఖాలన్నీ తక్కువే అనుకొని, గాడంగా ఒక నిట్టూర్పు విడిచి...., దానితోపాటు తనలో మిగిలిన చెడు భావాల అవశేషాలను కూడా బైటికి వదిలేసాడు ప్రసాద్.
ఇంటికి రాగానే ఊరెళ్లిన భార్య వాణిని త్వరగా రమ్మని ఫోన్ చేసి, భార్యను తలచుకుంటూ హాయిగా నిద్రకు ఉపక్రమించాడు ప్రసాద్.
***శుభం***
మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి
రచయిత పరిచయం : రంగనాధ్ సుదర్శనం
విద్యార్హతలు, MA (సోషయాలాజి)
సింగరేణి సంస్థలో అసిస్టెంట్ సూపరింటెండెంట్ గా ఉద్యోగం చేస్తున్నాను. సాహత్యాభిలాషిని, ఇప్పటి వరకు రాసిన కథలు 74. అందులో వివిధ పత్రికలలో ప్రచురితం అయినవి, సాహిత్య పోటీలలో బహుమతులు అందించిన కథలు కూడా ఉన్నాయి. ఉరిమెళ్ళ ఫౌండేషన్ వారి జాతీయ కథా పురస్కారం, ప్రతిలిపి వారి మాండలిక కథల పురస్కారం, శార్వరి కథాతోరణం, తదితర సంస్థల నుండి పురస్కారాలు, ప్రశంశలు అందుకున్నాను. సాహిత్య ప్రక్రియలో నాకు కథలు, కథానికలు, గల్పికలంటే మక్కువ.
Comments