top of page
Writer's pictureLakshmi Sarma B

మౌన రాగం


'Mouna Ragam' written by Lakshmi Sarma B

రచన : B. లక్ష్మీ శర్మ

“ఒరేయ్ బాబూ! అన్నం తినరా! నా బంగారు తండ్రివి కదూ..రా! కడుపునిండా అన్నం తిని హాయిగా నిద్దురబోదువుగాని. ఏంటి తినవా? ఆకలిగా లేదా? అలా అనకూడదు. ఎప్పుడనగా తిన్నావో తెలుసా! రామ్మా.. మా బాబు కదా! అదిగో.. నువ్వు అన్నం తినకపోతే బూచాడు వచ్చాడు చూడు. నిన్ను ఎత్తుకెళ్ళిపోతాడు. రా.. గబగబా రెండుముద్దలు తినేసేయ్” అంటూ చేతిలో బొమ్మను పట్టుకుని మాట్లాడుతోంది పార్వతి.

“ఏయ్ పార్వతి! ఏమిటి నీ గొడవ? నువ్వు ఇలాగే అల్లరి చేసావంటే నీకు ఇంజక్షన్ ఇస్తాను. వెళ్ళు! వెళ్ళి గమ్మున పడుకో” బెదిరించింది నర్సు. అదొక పెద్ద పిచ్చాసుపత్రి. అందులో కొందరు మనసు పాడైనవారు, భర్త ఆదరణకు నోచుకోనివారు కొందరు, కడుపున పుట్టిన పిల్లలు ఆదరించక మనసు పాడైనవారు కొందరు, ప్రేమలో ఓడిపోయిన వారు.. ఇలా రకరకాల మనస్తత్వాలు కలిగిన మనుషులున్నారు. అందులో పార్వతి పరిస్థితి కూడా అలాంటిదే. ఆమెను ఎవరు హాస్పిటల్ చేర్చారో తెలియదు కానీ. ఇప్పటివరకు ఆమెను చూడటానికి వచ్చిన వాళ్ళెవరూ లేరు.

“రాజమ్మా! ఎందుకలా ఆమెను కసురుకుంటున్నావు? ఆమె మానసిక పరిస్థితి తెలిసి కూడా నువ్వు ఆమెను అలా బెదిరించకూడదు. మనం వున్నది ఎందుకు? వాళ్ళను ఆప్యాయంగా చూసుకోవడానికే కదా! వాళ్ళు బాగుపడితే మనం వుండమన్నా ఇక్కడ వుండరు. ముందు ఇక్కడ వుద్యోగం చెయ్యాలంటే మనం మానసికంగా ఎదిగి ఉండాలి. చూడు! మీరెవ్వరూ ఇక నుండి ఆమెను చూసుకోనక్కరలేదు. ఆమె బాధ్యత మొత్తం నేనే తీసుకుంటున్నాను” అంది అప్పుడే అక్కడకు వచ్చిన మానస. మానస కూడా అదే హస్పిటల్ డాక్టరుగా ఈ మధ్యనే వచ్చింది.

“అలాగే అమ్మా” అంటూ అక్కడవున్న నర్సులు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. ఆ రోజు నుండి పార్వతి బాధ్యతను తనే తీసుకుంది.

“అమ్మా! నాకు ఆకలిగా వుంది . అన్నంపెడతావా?” అడిగింది మానస, పార్వతి దగ్గర కూర్చుంటూ. పార్వతి కళ్ళు రెపరెపలాడిస్తూ ఆప్యాయంగా మానస తలనిమురుతూ. “ఆకలిగా వుందా! ఉండు తల్లీ. ఇప్పుడే పెడతాను” అంటూ తన కోసం ఇచ్చిన బ్రెడ్ తీసుకుని మానస నోటిలో పెట్టసాగింది. ఆ ఆప్యాయతకు మానస హృదయం కరిగిపోయింది.

“అమ్మా! ఇప్పుడు తృప్తిగా వుందా?” అడిగింది మానస మొత్తం తినేసిన తరువాత.

“ఓ! నా బిడ్డకు కడుపునిండా తినిపించాను. ఇప్పుడు హాయిగా వుంది” అంది పార్వతి.

“సరే మరి! నేను తిన్నానుగా. మరి ఇప్పుడు నువ్వు కూడా కడుపునిండా తిని మందులు వేసుకొని హాయిగా నిద్దురపోవాలి. సరేనా?” అంది మానస.

“అలాగే తల్లీ! నాకు చాలా ఆకలిగా వుంది. కడుపునిండా తింటాను” అంటూ మానస తెచ్చిన టిఫిన్ బాక్స్ తీసుకొని ఆవురావురంటూ మొత్తం తినేసింది. ఇదంతా చాటుగా చూస్తున్న నర్సులు, ఆయమ్మలకు విచిత్రంగా అనిపించసాగింది.

పార్వతిని బెడ్ మీద పడుకోబెడుతూ “అమ్మా! నువ్వు ఇక్కడకు ఎందుకొచ్చావు? నిన్ను ఎవరు తీసుకొచ్చారు చెప్పమ్మా..” బుజ్జగిస్తూ అడిగింది డాక్టర్ మానస.

“అదంతా పెద్ద కథలేమ్మా! నీకు చెబితే బాధపడతావు” అంది పార్వతి.

“మా అమ్మవు కదూ..నేనేం బాధపడనుగానీ చెప్పవా..” లాలానగా ఆమెను జో కొడుతూ అడిగింది మానస.

“నా కథ విన్న తరువాత నువ్వు నన్ను విడిచిపెట్టి వెళ్ళవుగా” అడిగింది అమాయకంగా మానస వైపు చూస్తూ.

“లేదమ్మా… నిన్ను విడిచి ఎక్కడికీ వెళ్ళను. నేను వచ్చింది నీ కోసమే! నిన్ను నాతోపాటుగా మన ఇంటికి తీసుకువెళతాను అంది. ఆనందంతో పొంగిపోయింది పార్వతి. అంతలోనే ముఖం చిన్నబుచ్చుకుంటూ అడిగింది మానసను “నేను పిచ్చిదాన్ని కదా! నన్ను మీ ఇంటికి పంపిస్తారా ఈ హస్పిటల్ వాళ్ళు? నువ్వు నిజంగా నన్ను మీ ఇంటికి తీసుకువెళతానంటే నా కథ చెబుతాను” అంటూ చెప్పడం మొదలుపెట్టింది వుత్సాహంగా.

“మా అమ్మ నాన్నలకు మొదటి సంతానం నేను. నా తరువాత తమ్ముడు. చిన్నప్పుడు బాగానే వున్నానట.పెరిగే కొద్దీ నాలో అమాయకత్వం బయటపడింది. స్కూల్ కు పంపించారు. చదువు అబ్బలేదు. అలాగే అయిదవ తరగతి వరకు ఒక్క ముక్క కూడా రాలేదు. ఒకసారి టీచర్ కి నా మీద బాగా కోపం వచ్చి నాకు వాతలు పెట్టింది. ఇక అప్పటి నుండి స్కూల్ కు పంపించండం మానిపించారు. ఇంట్లోనే ఉండేదాన్ని. సమయానికి తినడం, టీవి చూడడం ఇవే నా దినచర్యలు. ఇంట్లో అమ్మకు సహాయం చెయ్యాలని నాకు తోచేది కాదు.

నాన్నకు నా పరిస్థితి అర్ధమై తట్టుకోలేక మానసికంగా కృంగిపోయి మమ్మల్ని విడిచిపెట్టి పైకి వెళ్ళిపోయాడు. పాపం! అమ్మ మాకు అన్నీ తానే అయి మమ్మల్ని పెంచింది. చాలా కష్టాలు అనుభవించింది మా కోసం. అమ్మ ఎప్పుడూ నన్ను విసుక్కునేది కాదు. తమ్ముడికి మంచి వుద్యోగం వచ్చింది. వాడికి నన్ను చూస్తే కోపంగా వుండేది. చీటికి మాటికి విసుక్కునేవాడు. అది చూసి అమ్మ వాడితో దెబ్బలాడేది.

“ఎందుకురా దాన్ని అలా కసురుకుంటావు? నువ్వేమైనా దాన్ని పెంచి పోషిస్తున్నావా? నేనే కదా దాని మంచి చెడ్డలు చూసుకుంటున్నది” అంది అమ్మ.

“అదికాదమ్మా! దానికి ఎంతసేపూ టీవి పిచ్చి తప్పితే ఇంకో ధ్యాస లేనేలేదు. అలా అయితే దానికి మంచి చెడు ఎలా తెలుస్తుంది? ఇంటికి ఎవరన్నా వస్తున్నారంటే ఇబ్బందిగా అనిపిస్తుంది. వాళ్ళు వచ్చినప్పటి నుండి తను చూసే సీరియల్స్ అన్నీ చెబుతుంది. వాళ్ళు నవ్వుకుంటుంటే నాకు తలకొట్టేసినట్టవుతుంది” కోపంగా నా వైపు చూస్తూ అన్నాడు.

“పోనీ లేరా! అది వట్టి అమాయకురాలు. దానికేం తెలుసు చెప్పు? పెళ్ళి చేసి అత్తవారింటికి పంపుదామంటే దాన్ని ఎవరు చేసుకుంటారు?” అంటూ తమ్ముడి నోరు మూయించేది.

తమ్ముడికి పెళ్ళైంది. అమ్మాయి చాలా బాగుంది. పేరు గాయత్రి. వచ్చిన కొత్తలో నన్ను బాగానే చూసుకొనేది. తరువాత మొదలైంది నన్ను చూస్తేనే విసుక్కోవడం. నాతో మాట్లాడటం మానేసింది. అమ్మ చాలా బాధపడేది. ఏమైనా అంటే ఇంట్లోనుండి వెళ్ళిపోతారేమో నని భయం. అటు వాళ్ళను అనలేక , నన్ను అనలేక తనలో తనే బాధపడేది. గాయత్రికి పెళ్ళై అయిదు సంవత్సరాలైనా పిల్లలు కాలేదు. చాలా మంది డాక్టర్ల దగ్గరకు తిరిగారు. లాభం లేకపోయింది. గాయత్రికి పిల్లలు పుట్టే యోగం లేదన్నారు. అమ్మ నిలువెల్లా కృంగిపోయింది. వంశాంకురం లేకుండా అయింది అని రోజూ బాధపడేది.

తమ్ముడు అమ్మ దగ్గరకు వచ్చి “అమ్మా నేనొకటి అడుగుతాను. ఒప్పుకుంటావా ?” అన్నాడు.

“చెప్పరా ! నీకు ఇన్నాళ్ళకు అమ్మతో విషయాలు పంచుకోవాలనిపించిందా” అంది అమ్మ.

“అలా అంటావేంటమ్మా? నేనెప్పుడైనా నిన్ను కాదని ఏ పని చేయలేదు కదా! అది సరే. నాకు, గాయత్రికి పిల్లలు కావాలని వుంది. అందుకని టెస్ట్ ట్యూబ్ ద్వారా పిల్లలను కందామని నేను గాయత్రి అనుకున్నాము. నీకు ఒక మాట చెప్పాలని అనుకున్నాము” అన్నాడు.

“అదేమిటిరా ? గాయత్రికి పిల్లలు పుట్టే అవకాశమే లేదు అన్నారు కదా! మీ నిర్ణయం మీరు తీసుకున్నారు బాగానే వుంది.మరి గాయత్రి టెస్ట్ ట్యూబ్ బేబిని కనడానికి పనికివస్తుందా?” అడిగింది అమ్మ.

“అమ్మా! అది.. అది.. మన పార్వతి వుంది కదా! దాని ద్వారా అయితే బావుంటుంది. ఎందుకంటే పరాయిది కాదు కాబట్టి ఏ గొడవా వుండదు” చెప్పాడు తమ్ముడు.

అమ్మ కోపంతో వూగిపోయింది. “ఓరేయ్! నీకేమైనా మతి గాని పోయిందా? ఏం మాట్లాడుతున్నావో తెలుస్తుందా? అది నీకు తోబుట్టువురా! వావి వరుసలు కనిపించడం లేదురా? కళ్ళుమూసుకపోయాయా?” అంటూ అమ్మ ఆవేశంలో చెడామడా తిట్టిపోసింది.

“అమ్మా! నేను చెప్పేది కాస్త జాగ్రత్తగా విను, ఆవేశపడకుండా. కొంత మంది తల్లులే తన కూతురు కోసం కొడుకు కోసం పిల్లలను కంటున్నారు. ఇందులో తప్పేముంది? కేవలం ఇంజక్షన్ ద్వారానే తనలో ప్రవేశపెడుతున్నారు. తొమ్మిది నెలలు మోసి కంటుంది. అంతవరకే తన బాధ్యత. తరువాత అంతా మేమే చూసుకుంటాము. ఈ విషయం ఎవరికీ తెలియనివ్వకుండా వుంటే చాలు. వేరే ఎవరి ద్వారానో అయితే వాళ్ళు ఎలాంటి వారో మనకు తెలియదు. డబ్బులకోసం మనను ఇబ్బంది పెడుతుంటారు. ఇవన్నీ ఎందుకు మనకు? మనలో మనం అయితే ఏ ఇబ్బంది వుండదు. మన వంశం నిలబడుతుంది. అంటూ అమ్మకు నచ్చచెప్పాడు.

“ పాపం పెళ్ళికాకుండానే తల్లి అయితే దాన్నీ నలుగురు నాలుగు మాటలంటుంటే పదిమందిలో తల ఎత్తుకుని తిరగగలమా.. నాకేమి అర్ధం కావడం లేదు” అంది అమ్మ .

“అమ్మా! పదిమందికి తెలిసే అవకాశం లేదు. ఎందుకంటే నేను పూణేకు ట్రాన్స్ఫర్ పెట్టుకున్నాను. మనమందరం అక్కడికి వెళ్ళిపోతున్నాము. అందుకని ఎవరికీ తెలిసే అవకాశం లేనే లేదు” అన్నాడు.

ఇక తప్పదు అన్నట్టుగా అమ్మ వూరుకుంది మౌనంగా. అనుకున్నట్టుగానే అన్నీ జరిగాయి. గాయత్రి నన్ను ఎంతో ప్రేమగా చూసుకునేది. నాకు ఏమీ అర్ధం కాకపోయేది నా కడుపు ఎందుకు ఇంత పెద్దగా అవుతుందో తెలియలేదు. తొమ్మిది నెలలు గడిచాయి పండండి కవలలకు జన్మనిచ్చాను. పాప, బాబు. నాకు తెలియకుండానే వాళ్ళమీద వాత్సల్యం పొంగిపోయింది. వాళ్ళిద్దరిని ఒడిలో పడుకోబెట్టుకుని ముద్దాడే దాన్ని టీవి సీరియల్ లో చూపెట్టినట్టుగా. అమ్మ, గాయత్రి చూసుకునే వాళ్ళు పిల్లలను. పిల్లలకు పాలు పట్టాలనే ఆలోచన కూడా నాకు రాలేదు. డబ్బాపాలు పట్టేవాళ్ళు తల్లిపాలు అలవాటు చెయ్యద్దని. పిల్లలకు మూడు నెలలు వచ్చేసరికి గాయత్రి మొత్తం మారిపోయింది. నన్ను పిల్లలను దగ్గరకు తీసుకోనిచ్చేది కాదు. అమ్మతో రోజు దేనికో ఒకదానికోసం గొడవవేసుకునేది. ఇంతకు ముందు చూపిన ప్రేమకు బదులు ఈసడించుకోవడం మొదలుపెట్టింది. పిల్లలకోసం నా మనసు ఆరాటపడుతుంటే నన్ను రెండుసార్లు దెబ్బలుకూడా వేసింది. అది చూసి అమ్మ చాలా బాధపడింది ‘దాని కడుపున పుట్టిన పిల్లలను అదిచూసుకునే అదృష్టం లేదా దానికి’ అంటూ గాయత్రితో గొడవపడింది అమ్మ.

“అమ్మా… వాళ్ళు మా పిల్లలు. నీకు ఆ రోజే చెప్పాను కదా! కనేంతవరకు మాత్రమే తను అని” అన్నాడు తమ్ముడు అమ్మ మీద కోపానికి వస్తూ. అంతేకాదు! అమ్మను, నన్ను అక్కడనుండి పంపించివేశారు మా ఇంటికి. అమ్మ కుమిలి కుమిలి మంచాన పడి చివరకు నన్ను ఒంటరిని చేసి వెళ్ళిపోయింది. తమ్ముడు వాళ్ళు వచ్చారు. నాకు చాలా ఆనందంమేసింది. పిల్లలను చూడగానే. అమ్మ పోయిన బాధకంటే పిల్లలను చూసానన్న ఆనందమే ఎక్కవయింది. అందరు నన్ను పిచ్చి మాలోకం అనుకున్నారు. తల్లిపోయిందన్న బాధనే లేదు దీనికి చిన్నపిల్లలతో ఆడుకుంటుంది అని నవ్వుకున్నారు. . గాయత్రి చూసిందంటే పిల్లలను నా దగ్గర్నుండి తీసుకొనిపోయేది. అలా అప్పుడు నన్ను పిచ్చిదానిగా అందరిముందు జమకట్టి.ఇదిగో ఈ పిచ్చాసుపత్రిలో వేసారు. నాకు పిచ్చిలేదమ్మ. నాకు అన్నీ అర్ధమయ్యేటివి. కానీ ! చెప్పడానికి సరిగా చెప్పలేకపోయేదాన్ని. నేను ఏదైనా చెప్పాలనుకున్నా నా మాట ఎవరూ వినిపించుకునే వాళ్ళు కాదు మొదటినుండి. అంతే! అందుకే అలా తయారయ్యాను” అంటూ కళ్ళుతుడుచుకుంది పార్వతి.

మానసకు పార్వతి కథ విన్నాక కళ్ళనీరు ఆగలేదు.

“డాక్టరమ్మా! నా పిల్లలు నా దగ్గరకు వస్తారంటావా? నేను చనిపోయేలోగా వాళ్ళను చూస్తానా” అడిగింది మానస చేతులుపట్టుకుని.

“అమ్మా! తప్పకుండా నువ్వు నీ పిల్లలను చూస్తావు. ఆ దేవుడు నీయందు వున్నాడు నీకు నీ పిల్లలను కలిపిస్తాడు. నిన్ను మన ఇంటికి తీసుకు వెళ్ళాక అక్కడ నీ పిల్లలను నువ్వు చూద్దువుగానీ! సరేనా?” అంది పార్వతిని గుండెలకదుముకుంటూ.

ఎన్నాళ్ళుగానో తల్లికోసం ఎదిరిచూసిన మానసకు. తల్లి పిచ్చిదికాదు అని తెలిసినందుకు మనసు పరవళ్ళుతొక్కుతుంది. తనను కన్నతల్లిని తాను రక్షించుకోగలిగినందుకు చాలా ఆనందంగా వుంది. ఇకనుండి అమ్మకు కష్టాలన్ని తీరిపోయినట్టే. అమాయకురాలైన ఆ మాతృమూర్తికి అన్నీ ఆనందాలే ఇక . నన్ను తొమ్మిదినెలలు మోసి కన్నందుకు ఆమను కంటికిరెప్పాలా కాపాడుకుంటాను అనుకుంటూ పార్వతిని ఇంటికి తీసుకువచ్చింది మానస.

పార్వతి వర్ణించలేని అనుభూతి పొందుతోంది. మనసంతా దూదిపింజలా ఎగురుతోంది. త్వరలోనే తన పిల్లలను చూడబోతున్నానన్న ఆనందం నిలువనీయడం లేదు.

“అమ్మా! ఈ ఫోటోలో వున్నవాళ్ళు నీకు తెలుసా? అడిగిందొకరోజు మానస

ఒక ఫోటో చూపెడుతూ. కొంచెం పరీక్షగా చూసింది. ముఖంలో వెలుగులు

ప్రసరించాయి. చిరునవ్వుతో చెప్పింది.

“మా అమ్మ,నేను, తమ్ముడు, మరదలు గాయత్రి” అని చెబుతూ, “ఇది నీ దగ్గర ఎందుకుంది? మావాళ్ళు ఎక్కడున్నారు? నన్ను వాళ్ళదగ్గరకు తీసుకవెళతావా! ఒక్కసారి నా పిల్లలను చూసుకుంటాను” అడిగింది ఆర్తిగా, ఆత్రుతగా.

“అమ్మా ! అలాగే తీసుకు వెడతాను ఒక్కసారి నన్ను చూడు నేనెవరినో గుర్తుపట్టగలవా” అంటూ పార్వతి ముఖంలో ముఖం పెట్టి అడిగింది మానస.

మానస వైపు, తన చేతిలో వున్న ఫోటో వైపు మార్చి మార్చి చూసింది. తను చిన్నప్పుడు వున్నట్టుగానే వుంది. అర్ధం కాక మానస వైపు చూసింది.

“గుర్తు పట్టడం లేదు కదా ! నేనేనమ్మా.. నువ్వు ఎవరికోసం ఆరాట పడుతున్నావో.. నువ్వు కన్నకూతురిని” అంది తల్లిని గాఢంగా కౌగిలించుకుంటూ.

“నిజంగా నువ్వు నా కన్నబిడ్డవేనమ్మా! నేనిళ్ళాళ్ళుగా ఎదురుచూసిన నా ప్రాణానివి” అంటూ మానసను ముద్దులతో ముంచేసింది.

“ చూసావా తల్లీ! నేను పిచ్చిదాన్ని కాదు. నా బిడ్డను నేను గుర్తుపట్టగలిగాను. నువ్వు నన్ను విడిచి వెళ్ళిపోవు కదూ!” అంటూ మానసను గట్టిగా కౌగిలించుకుంటూ బావురుమంది పార్వతి.

“అమ్మా ! నిన్ను విడిచి ఇంకెక్కడికీ వెళ్ళను. నీతోనే వుంటాను. ఇంకా ఏడుస్తున్నావా! చూడు.. నువ్వు ఆనందంగా వుండాలి నాకోసం” అంటూ తల్లి కళ్ళు తుడిచింది.

“మరి ..మరి.. నిన్ను మీ నాన్న వాళ్ళు వచ్చి తీసుకువెళ్ళరు కదూ!” ఇంకా నమ్మకం కుదరక అడిగింది భయంతో.

“అమ్మా! నీకా భయం అక్కరలేదు. ఎందుకంటే నీ గురించి తెలిసిన తరువాత నేను చాలా పట్టుదలగా నిన్ను చూడాలని అడిగాను. ఇష్టం లేకున్నా నా బలవంతం మీద వస్తుంటే పెద్ద యాక్సిడెంట్ అయింది. నేనొక్కదాన్ని ప్రాణాలతో. అమ్మా నాన్న వెంటనే చనిపోయారు. వాళ్ళకు చేయవలసిన కార్యక్రమాలన్నీ మా మేనమామ వచ్చి దగ్గరుండి అన్నీ చేయించారు. తరువాత నీ కోసం ఇక్కడకు వచ్చాను.తమ్ముడేమో చిన్నప్పుడు పోలియో వచ్చిపోయాడు. ఇక నాకున్న తోడు నువ్వే కదా! అంతేకాదు..నేను మానసిక వైద్యురాలినే కాబట్టి నా స్నేహితురాలు ద్వారా ఉద్యోగం సంపాదించాను” అంది, కళ్ళల్లో నీళ్ళు ఉబికిరాగా.

“అయ్యో! ఎంతపని జరిగింది? నా వాళ్ళందరు లేకుండా పోయారు” అంది బాధతో పార్వతి.

“అమ్మా! ఇప్పుడు ఇన్ని మాటలు మాట్లాడుతున్నావు కదా ! మరి ఎందుకు అలా అమాయకురాలిలాగా వుండిపోయావు?”

“ఏం చెప్పమంటావు? చిన్నప్పటినుండి అమాయకురాలని నన్ను ఏదీ చెప్పనిచ్చేవారు కాదు. మనసులో ఎన్ని ఆలోచనలు వున్నా బయటకు చెప్పడానికి భయమేసేది. ఎలా చెప్పాలో తెలిసేది కాదు పొరబాటున ఏదైనా మాట్లాడితే అందరు నవ్వేవారు. అలా ఎగతాళి చేసేసరికి ఏదీ చెప్పలేకపోయేదాన్ని. అమాయకురాలని అమ్మ గారాబం చేసి నాకు ఒక్కపనీ నేర్పించలేదు. పని లేక, చదువు లేక టీవి చూడడంలో మునిగిపోయాను. నిజానికి నాకు ఈ మాత్రం తెలివి కూడా అప్పుడు లేదు. మానసికంగా కృంగిపోయిన నాకు ఈ పిచ్చాస్పిటల్ చాలా అనుభవం నేర్పింది. నన్ను ఇంతగా మాట్లాడేలా చేసింది” అంటూ ఆనందపడుతూ చెప్పింది పార్వతి.

“పోనీలే అమ్మా! నువ్వు ఇప్పటికైనా మంచి మనిషిలా మారావు. నాకు అంతే చాలు” అంటూ ఆప్యాయంగా గుండెలకదుముకుంది మానస. గువ్వపిట్టలా ఒదిగిపోయింది పార్వతి.

***శుభం***

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.


రచయిత్రి పరిచయం : B.లక్ష్మి శర్మ


నా గురించి కొన్ని విషయాలు ప్రస్తావిస్తాను, నేను సికింద్రాబాద్ లాలాపేటలో వుంటాను,

నాకు చిన్నప్పటి నుండి కథలు రాయడమన్నా,చదవడమన్నా చాలా ఇష్టం. 1991 నుండి రాయడం మొదలుపెట్టాను. ఎక్కడ ఏ పేపర్ కనిపించినా రాసాను. కానీ ఎవరికి చూపలేదు, చెప్పుకోలేదు. ఈమధ్యనే మా అమ్మాయిలు, మావారు చూసి కథలు బాగున్నాయి కదా, ఏదైనా పత్రికకు పంపమంటే పంపిస్తున్నాను, కర్నూలు గణేశ్ పత్రికలో నేను రాసిన కవితలు, కథలు చాలా వచ్చాయి. నాకు ఇద్దరమ్మాలు, ఒక బాబు. అందరూ విదేశాల్లోనే వున్నారు. ప్రస్తుతం నేను, మావారు కూడా అమెరికాలోనే వుంటున్నాము



303 views0 comments

Comments


bottom of page