'Mudda Banthi Pulu' - New Telugu Story Written By Yasoda Gottiparthi
Published In manatelugukathalu.com On 05/06/2024
'ముద్ద బంతి పూలు' తెలుగు కథ
రచన: యశోద గొట్టిపర్తి
అందమైన పరికిణీ లో కాళ్ళకు వెండి పట్టీల శబ్దంతో, బుట్ట బొమ్మలా పరుగులు తీస్తూ, “నాకు ఒక బొమ్మ చేసియ్యవా? నానమ్మ!” అంటూ పచ్చితాటాకును తెచ్చి అమ్మమ్మ చేతిలో పెట్టింది మంజు.
“ఒకటేమిటి? చాలా బొమ్మలు చేసిస్తాను. వాటికి పట్టుచీరలు తయారు చేయాలి. మేర అతను ( బట్టలు కుట్టే వాళ్ళు)ఇంటికి వెళ్ళి కత్తిరించి మిగిలిన కొత్త బట్టలు తెస్తే చీరలు చేస్తాను”. అక్కడికి వచ్చిన పెళ్ళికూతురు అమ్మమ్మ, ప్రక్కన కూర్చుని, తన చిన్నతనాన్ని జ్ఞప్తికి తెచ్చుకుంది.
“అమ్మమ్మ.. నేను కూడా.. ఆడుకుంటాను నాకో బొమ్మ కావాలి..”
“ఎంత చిన్నపిల్లవే నువ్వు? రేపో మాపో అత్తగారింటికి పోవాలి. లోపలికి వెళ్ళి మీ అమ్మ దగ్గర పనులు నేర్చుకో తల్లి” అంటూ బుజ్జగించింది.
“అమ్మాయిగారూ! ఇంకో పదిరోజుల్లో మీ పెళ్ళి. ఈ ఎండలో కూర్చుని ఏమి చేస్తున్నారు?"
“చిన్నపిల్లల ఆటలు చూస్తున్న, మళ్లీ ఇంతమంచి అవకాశం దొరకక పోవచ్చు నాకు చంద్రం”.
“మీరు నీడపట్టున ఉండి, సమయానికి భోజనం చేస్తూ, నిద్రపోతూ, అలసిపోకుండా పుత్తడి బొమ్మలా తయారు కావాలి. పెద్ద చదువులు చదివినోరు.. పట్నం పోయి, పెద్ద భవంతిలో కాపురం చేస్తూ, పెనిమిటి దొరతో కాలక్షేపం కోసం, అదేదో ఒక రాజు, మంత్రి పోటీ ఆట అంటారు అమ్మాయిగారు.. సెప్పండి”
“ ఓ అదా ?చదరంగం ఆట..”
“ఆ.. ఆ చదరంగం తెలివితేటలు పెంచే ఆట ఆడుతారు.
మీ పెళ్ళి చూపులకు వచ్చినపుడు, పెద్ద అయ్య గారు మిమ్మల్ని చూసి పడిన సంబరం నా కన్ను లతో నేను చూసాను. అమ్మాయిగారూ! మీ పెళ్ళి మీ ఇంటికే కాదు, ఊరంతటికీ పండుగ”,
లోలోన సంతోష పడుతూ, ఒక్కొక్కటి చెప్తూ,
“శుద్ధదశమి నాటికి, ఈ వాకిలి యంతయు, పచ్చి తాటియాకుల పందిరిలో, బంతి పూల తోరణాలతో అలంకరించాలి అమ్మగారూ! ఆవుల పేడతో నేల అంతా అలికి ముగ్గులు వేయాలి. వంటలు చేయుటకు వంటశాల, భోజనాలు చేయుటకు ప్రత్యేక పందిళ్ళు, పెళ్ళి మండ పాన్ని రంగు రంగుల పూలతో అలంకరించి, దూర ప్రాంతాలనుండి వచ్చిన బంధువు లందరికీ విడిది గదులను, అన్ని వసతులు చూడాలి మీ పెళ్లoటే ఏమను కున్నారు అమ్మాయిగారు.. " అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు సెప్పుకోవాలి”.
“ఇంత గొప్ప, మాటలు ఎట్లా తెలిసాయి చంద్రం నీకు” అని అడిగింది నక్షత్ర.
“అయ్యగారి దగ్గర నేర్చుకున్నా అమ్మా! అదే అనుభవం, పనిలో నేర్పరితనం, పట్టు పెంచుకున్న".
కొంచెం దూరం పోయి వాసు, చంద్రం ఇద్దరూఎదురెదురుగా కూర్చుని, గుoజల మీద పచ్చి తాటాకులు కప్పడానికి, పందిళ్ళు కదలకుండా ఉండడానికి కావలసిన జనపనార తాళ్ళు పేనుతున్నారు.
చంద్రo మాటలు విన్న నక్షత్ర లోలోపల మురిసిపోతూన్నట్లు నటిస్తూ, “నేను అత్తగారింటికి పోతే నీకు చదువు ఎవరు నేర్పుతారు?”
“నాకు ఇంకా సదువా? అమ్మాయిగారు.. మీరు పంతులమ్మ లా నేర్పించినా కూడా మీ పాదాల దగ్గర పాచిపని చేసుకుని బతికేతోనికి”.
“కేవలం పని చేస్తే బుద్ధి వికసింపదు. మన చుట్టూ ఉండే విషయాలపైనే బుద్ధి ప్రసరిస్తుంది. విషయాలను చూచి ఊరకుండక, ఆవిషయం లోని తత్వమును పూర్తిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. అందుకు చదువు కోవాలి చంద్రం.
నేను అత్తగారింటికి వెళ్లి అక్కడి ముచ్చట్లు ఎన్నో తెలియ చేయాలని అంటే నీకు ఉత్తరం వ్రాస్తాను. చదువు వస్తేనే కదా.. నువ్వు చదివి అర్థం చేసుకునేది”.
లోపలికి పోయి కొన్ని పుస్తకాలు పట్టుకొచ్చిoది నక్షత్ర.
చంద్రాన్ని కూర్చోబెట్టి కొన్ని పదాలను వల్లె ( ఒకే పదాన్ని రెండుసార్లు అనడం)వేయించింది.
‘పంతులమ్మ పాఠాలు నిజం చేయాలి, బాగా చదువుకోవాలి’ అనుకున్నాడు.. కానీ రెండు సంవత్సరాల నుండి పుస్తకాలపై మనసు పెట్టీ చదివినా, అన్ని పుస్తకాలలో మొదటి పది పేజీలు కూడా దాటలేక పోతున్నాడు.
ఎంతసేపు ఇంటిపని, వ్యవసాయo పని, ఏటి గట్టున పశువుల మేపుడు అవే గుర్తుకు వస్తున్నాయి.. కానీ పుస్తకం మీద మనసు నిలవదు లోలోపల అనుకుంటూ..
“నక్షత్ర అక్కా! నాకు అష్టా చెమ్మ ఆట నేర్పుతావా?" అంటూ వచ్చింది పిన్ని కూతురు శ్రియ.
“అమ్మాయిగారూ! నాకు చదువు రాదు కానీ మీరు పిల్లలతో ఆడుకోండి" అని తప్పించు కుంటుంటే..
“నా పెళ్లి అయ్యే లోపల నీకు చదువు నేర్పిస్తాను చంద్రం” అంటూ శ్రియ దగ్గరికి వెళ్లి..
“శ్రియ !" నువ్వు పెళ్ళి అనే శుభకార్య సమయం లో అష్టాచెమ్మా ఆటలు ఆడకూడదు. జూదం వల్ల మహాభారత యుద్ధం జరిగింది. చoపుడు పంజం అంటారు. అది చెడు పదం, పదే పదే అంటే అశుభం. "
“అయితే వద్దు నక్షత్ర అక్కా! మేము దస్తీ, బిస్తీ ఆడు కుంటాం” అంటూ లేడి పిల్లల్లా ఎగురుకుంటూ పరుగెత్తారు.
*****************
పెళ్లి ఘనంగా జరిగింది. బాజా భజంత్రీల తో ఊరేగింపు జరుగుతుంటే.. ఆకాశంలో మెరుస్తున్న తారలా పల్లకిలో ఉన్న నక్షత్రకు బంతిపూల తోరణాలు వీడలేక వీడ్కోలు చెప్తున్నట్లు, పచ్చి తాటాకు పందిళ్ళు కూడా తెల్ల బోయి చూస్తున్నాయి.
*******************
“పెద్దయ్య.. మిమ్మల్ని ఇలా ఎప్పుడూ సూడ లేదు. అమ్మాయి గారిని అత్తగారింటికి పంపించి నప్పటి నుండి అదోలా ఉంటున్నారు. మేమంతా ఉన్నాం కదా అయ్యా అంటూ అన్ని పనులు చేస్తూ సంతోష పెడుతున్నా కూడా మీ జబ్బు నయం కావడం లేదు. పైగాఆరోగ్యo క్షీణిస్తుంది”.
“అలా ఏం లేదు చంద్రం. వయసు మీద పడితే అంతే”.
“మీరు మా అందరితో సమానంగా లేచి తిరిగి నడవాలి అయ్యా. మీకు ఏం కాలేదు.. అని చెప్పు..”
మెల్లగా వెళ్లి డాక్టర్ తో మాట్లాడి అసలు విషయం తెలుసుకున్నాడు.
“మీ అయ్యగారు మానసిక క్షోభ అనుభవిస్తున్నాడు. అది ఏమిటో తెలుసుకొని తగిన మందులు ఇచ్చినా లేదా ఆ బాధ ఏమిటో తీసివేసినట్లయితే అయినా ఆయన వ్యాధి నయం కావచ్చు”.
ఒకరోజు పెద్దయ్య చేతిలో ఒక ఉత్తరం కనిపించింది. అది చదువుతూ కన్నీళ్లు పెట్టుకుంటు న్నాడు. తనకేమో సదువు రాదు.. అయినా సరే ఏమిటో తెలుసు కుందాం అని..
“అయ్యగారూ” అని పిలవగానే అనగానే కళ్ళు తుడుచు కున్నాడు.
“ఎవరయ్యా ఆ ఉత్తరం రాసింది? చదివి బాధపడుతున్నారు మీరు..”
“బాధ కాదు ఆనందభాష్పాలు” అని జీవం లేని నవ్వు నవ్వాడు.
చంద్రానికి అర్థమయింది. ఏదో దాస్తున్నాడని..
“ఎంత ఆస్తిపరుడ నయినా అమ్మాయికిమంచి జీవితం ఇవ్వలేకపోయాను. సవతి తల్లి పోరుతో తన బంధువుల అబ్బా యికే ఇవ్వాలని కోరుకోవడంతో కాదనలేక బాగా ధనవంతులే కదా అని వెళ్లి చేశాను.
“నాన్న నన్ను వచ్చి తీసుకపో” అని కూడా రాయలేదు. తన జీవితం వాడిపోతున్నా కూడా..
వెళ్లి చూసి వద్దామని అనుకున్నా తను మంచానికి అంటుకపోవడం ఏమీ చేయలేని పరిస్థితి.. అనే దీర్ఘాలోచనతో రోజులు గడిచిపోతున్నాయి.
భర్తకు క్యాన్సర్ వ్యాధి ముదిరింది .ఇంకా వారం పది రోజుల కంటే ఎక్కువ కాలం బ్రతకడం అని వైద్యులు చెప్పారు.. అని తలుచుకుంటూ మళ్లీ కళ్ళ నీళ్లు కారుతున్నాయి.
తన వైధవ్యం తండ్రికి చూపించి బాధ పెట్టడం కూడా ఇష్టం లేన ట్టుంది నా తల్లికి.. నిండు జీవితం నిస్సారo చేశాను” అని తప్పు తనదే అని కృషించి పోయాడు.
*********************
అమ్మాయిగారు తండ్రిని కడ చూపు చూసుకోవడానికి కూడా రాలేదు అని ఆలోచిస్తుంటే..
కొన్ని దినాల తరువాత పెద్ద ఉత్తరం వచ్చింది చంద్రానికి. పూర్తిగా అర్ధమయ్యేట్లు చదవలేక పాయినా, ఒక్కొక్క అక్షరం ఒత్తులు దీర్ఘాలతో ఉచ్చరించి నక్షత్ర అమ్మాయిగారికి తీరని బాధ మిగిలింది అనితెలుసుకున్నాడు.
ప్రయాణం మధ్యలో గబ గబ వచ్చి ‘అమ్మాయిగారు’ అంటూ చేతికి బంతిపూవు ఇస్తుండగా బండి చక్రం కింద నలిగిన బంతి పూవు గుర్తుకు వచ్చింది.
నక్షత్రo కాంతివంతం కావాలి అంటే చంద్రుని రాక తప్పనిసరి అన్నట్లు చంద్రం, నక్షత్ర వద్దకు బయలుదేరాడు.
ఏనాడో చదివిన చదువు సార్థకo చేసుకుంటూ పాఠశాల ప్రారంభించింది. పాప ను ఎత్తుకుని ఉన్న ఫోటోలను చూసి కళ్లు చెమర్చాయి.
నా భర్త నాకు మిగిల్చిన ఈ జ్ఞాపకం తో కొత్త జీవితం ప్రారం భించాను అని గర్వంగా చెప్పింది. జరిగిందంతా తెలుసుకుని తనూ ఒక విద్యార్థి అయి, లా చదివి పట్టభద్రుడు అయ్యాడు. నక్షత్ర కు మంచి జీవితాన్ని ఇచ్చాడు.
సమాప్తం.
యశోద గొట్టిపర్తి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత్రి పరిచయం: యశోద గొట్టిపర్తి
హాబిస్: కథలు చదవడం ,రాయడం
Comments