కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.
Video link
'Mudda Mandaram' New Telugu Story By Madhuvani
రచన: మధువాణి
వరిమడిలో నుంచి చల్లటి పిల్లగాలి ముచ్చెమటను వెక్కిరిస్తోంది. ఎర్రటి మట్టి దారి వరిమళ్ల పచ్చదనం ముందు తలొంచక తప్పలేదు. పచ్చని కొండలు, అక్కడక్కడా చిన్న చిన్న వాగులు, పచ్చటి పొలాలు వంటి ప్రకృతి సౌందర్యాన్ని తిలకిస్తూ ఆరు మైళ్ళ దూరం నడిచినా అలసట కనబడలేదు.
‘కౌలుపల్లెకు వెళ్ళాలంటే ఇంకెంత దూరం ఉంటుందండీ ?’ అని కళ్ళంలో వేరుశనగ కట్ట పెరుకుతున్న ఒకామెను అడిగాను.
‘ఇంకెంతమ్మా! అరఫర్లాంగే ! అద్దదిగో ఆ చింతచెట్ల గుబురుల మధ్య కనబడే ఊరుండాదే అదే’ అని ఆమె అనింది.
పక్కనే ఉన్న మరొకామె ‘ఎవరక్కా ? ఎవరింటికి ?’ అని వేరుశనగ కట్టను పోగుచేస్తూ అడిగింది.
‘ఏమోనే నాకూ తెల్దు. ఎవరింటికేమో!’ అని అనింది.
కొంత దూరం నడచిన తరువాత రచ్చబండ పై బారాకట్ట ఆడుతున్న ఇద్దరు కనబడ్డారు.
ఊరిలొకి వచ్చి ‘స్కూల్ ఎక్కడండీ ?’ అని ఒక పెద్దాయనను అడిగాను.
‘ఈ సందమ్బడి బోతే కుంటొకటొస్తాది. దానెనకే బడమ్మా’ అని బీడీ పొగ వదులుతూ ఆయన చెప్పాడు.
ఆ దారిలో కొంతదూరం వెళ్లాను. అంతలో ఒక చిన్న కట్టె వచ్చి నా తలను తాకింది. రక్తం బొట బొటా కారింది. అది చూసిన ఒకావిడ ‘వొరేయ్ నాయాల్లారా కళ్ళు కనబడ్డడం లేదురా ? చిల్లా కట్టె ఇక్కడ ఆడొద్దని ఎన్ని సార్లు చెప్పాను. పోండి ఇక్కడి నుంచి. ఎప్పుడు చూసినా గోళీలు, పెంకుబిళ్ళాటలు మీరూ.’ పరిగెత్తుకొని ఇంటిలోకి వెళ్లి పసుపు తెచ్చి ‘అయ్యో ఎంతగా తగిలిందమ్మా! ఈ పిలకాయలకు చదువూ చట్టబండలు లేనే లేవు’ అని నా తలకు పసుపు అద్దింది. మంచి నీళ్ళు తెచ్చి ఇచ్చింది.
పక్కింటి వాళ్ళు వచ్చి ‘అయ్యో ఎంతపనైందమ్మా’ అని గుమిగూడారు.
కొంత సేపటికి రక్తం ఆగింది. స్కూల్ ఎక్కడ అని అడగ్గానే నేను కొత్తగా వచ్చిన స్కూల్ టీచర్నని అర్థమయ్యింది వాళ్లకు.
‘మీదేవూరు ? ఏంటోళ్ళు ? మీరెంతమంది ? పెళ్లయిందా ?’ అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. వాటన్నిటికి సమాధానం చెప్పలేక ఇబ్బంది పడుతున్న నన్ను చూసి పసుపు పెట్టిన ఆవిడ ‘అమ్మయ్యను ఊపిరైనా పీల్చుకోనీయండే.’ అని అనింది. ‘ఈ వూరి రెడ్డోరు సాలా మంచోరు. నీవెళ్ళి కలువమ్మా! నీ కేదైనా సాయం చేస్తారు.’ అని సలహా ఇచ్చి ‘ఒరే సంటోడా! ఈ అమ్మయ్యను రెడ్డోరింటికి తోడ్కబో, నేను చెలిమికి పోయి మంచినీళ్ళు తెస్తా’ అని నీళ్ళబిందె తీసుకుంది.
పెద్ద పెద్ద స్తంభాలు, ఇరుపైపులా పెద్ద అరుగులతో ప్రెసిడెంట్ గారి ఇల్లు ఆ వూరిలోని అందరి ఇండ్ల కన్నా పెద్దగా ఉంది. ‘నేను ఈ ఊరికి వచ్చిన కొత్త టీచర్నండీ ప్రెసిడెంట్ గారున్నారా ?’ అని అనగానే ‘రండి లోపలి రండి’ అంటూ రెడ్డి గారి భార్య పిలిచింది. ఇంటిలోకి వెళ్లి భర్తకు చెప్పింది. ‘కుర్చీలో కూర్చోమ్మా’ అంటూ ప్రెసిడెంట్ కాఫీ ఇవ్వమని తన భార్యకు చెప్పాడు. ‘నిన్ను ఈ ఊరికి టీచర్ గా వేశారా ? మగ వాళ్ళే ఇక్కడ వుండి ఉద్యోగం చేయలేక ట్రాస్ఫర్ పెట్టుకుని వెళ్లి పోయారు, నీవు ఎలా ఉండగలవమ్మా? సంవత్సరం నుండి టీచరే లేరు. గత వారంలో ఒక రోజు నీలాగే పెళ్ళికాని ఒకామె వచ్చి టీచర్ గా చేరి ఆ రోజే వెళ్లిపోయింది. ఇంతవరకూ రాలేదు.’ అని అన్నాడు.
కొంతసేపు తరువాత భోజనం చేసి రెడ్డి గారి భార్యతో మాట్లాడుతూ ఉండగా, ప్రెసిడెంట్ వచ్చి ‘వారం క్రితం వచ్చిన టీచరమ్మ వచ్చింది’ అని ఆమెను నాకు పరిచయం చేశాడు. ఆ టీచర్ తో పరిచయం తరువాత నాకు ఇంకో తోడు దొరికినందుకు సంతోషం వేసింది.
‘మీరిద్దరూ పెళ్లి కాని వాళ్ళే. ఒక్కొకరిదీ ఒక్కక్క ఊరు. ఇక్కడికి చాలా దూరం కాబట్టి మీ ఇంటి నుంచి రావడం కుదరదు. మీరు కలిసి ఇక్కడే ఉండాలి. అయితే ఈ ఊర్లో బాడుగకు ఇల్లు దొరకవు. స్కూల్లోనే వుండాలి.’ అని ప్రెసిడెంట్ అన్నాడు.
‘స్కూల్ చూపిస్తా రండి’ అని ప్రెసిడెంట్ గారు మమ్మల్ని తీసుకెళ్ళాడు. స్కూల్ ఆవరణమంతా చెత్తగా ఉంది. ఈ స్కూల్ లో ఎలా ఉండటం అని ఆలోచిస్తూ ఉన్నాను.
‘ఒరేయ్ ఈ బరిగొడ్లను తోలకపో, రేపటి నుంచి స్కూల్ ఉంటుందని చాటింపు వేయించు.’ అని బంట్రోతుకు చెప్పాడు. ‘రేపటి కంతా స్కూల్ శుభ్రం చేయిస్తాను. మీరందరూ వుండేందుకు ఏర్పాటు చేస్తాను. అంతవరకూ మా ఇంటిలోనే ఉండండి’ అని రెడ్డి అన్నాడు.
ఆ రోజు రాత్రి ప్రెసిడెంట్ గారింటిలో భోంచేసి నేను, కొత్తగా వచ్చిన టీచర్ నిద్రపోయాము. మరుసటి రోజు స్కూల్ వద్దకు వచ్చాము. స్కూల్ ఆవరణమంతా శుభ్రం చేసేశారు. బంట్రోతుతో బెల్ పెట్టించాము. బెల్ కొట్టగానే ఏమిటా అన్నట్లు అక్కడ ఆడుకుంటున్న పిల్లలు అందరూ వచ్చారు.
‘ఈ రోజు నుంచి బడి ఉంటుంది. అందరూ పలకా బలపం తెచ్చుకోండి’ అని బంట్రోతు చెప్పి వెళ్ళిపోయాడు. కొంతసేపటికి పిల్లలంతా చేరడంతో స్కూల్ ఆవరణమంతా గలగల మనింది.
ఇద్దరం పెళ్ళికాని ఆడవాళ్ళం కావడంతో కలిసి వండుకొని, కలిసి భోంచేసి, కలిసి స్కూల్లోనే నిద్రపోయే వాళ్ళం. ప్రతి శనివారం సాయంత్రం ఇంటికి వెళ్లి సోమవారం ఉదయం వచ్చేవాళ్ళం. ఇలా కొన్ని నెలలు గడిచి పోయాయి. పిల్లలు మాపై చూపే అభిమానం రోజు రోజుకూ పెరిగింది. గ్రామస్తులు కూడా వారి కుటుంబ సభ్యుల లాగా భావించేవారు. అది ఎంతంటే సెలవు రోజుల్లో కూడా మమ్మల్ని ఇంటికి కూడా పోకుండా కట్టి పడేసింది.
మాలో సంధ్య అనే టీచర్ కి పెళ్లి నిశ్చయమయ్యింది. కాబోయే భర్త కరీంనగర్ లో డాక్టర్. పెళ్లికి నేను, మా హెడ్ మాస్టర్ వెళ్ళాము. పెళ్లి ఘనంగా జరిగింది. పెళ్లి తరువాత వాళ్ళాయన స్కూల్ కు సెలవు పెట్టమని చెప్పడంతో లాంగ్ లీవ్ పెట్టింది. మంచి స్నేహితురాలు దూరం అయ్యినందుకు చాలా బాధ వేసింది.
ఈ ఒంటరి తనం దూరం కావడానికి నేను రోజూ పిల్లలతో ఎక్కువ సేపు గడిపే దాన్ని. ఒక రోజు రాముని గుడికి వెళ్లాను. అక్కడ ఒక అమ్మాయి ఏడుస్తూ కనబడింది. చింపిరి జుట్టుతో ఉంది. నల్లని కాటుక కళ్ళ కంతా అయ్యింది. దగ్గరికి పిలిచి ఒక కొబ్బరి ముక్క ఇచ్చాను. నీ పేరేంటని అడిగాను. గౌరి అని చెప్పింది. ఎందుకు ఏడుస్తున్నావని అడిగాను. మా అయ్య కొట్టిండు అని అనింది.
‘ఎందుకు కొట్టాడు ? అల్లరి చేశావా ?’ అని అడిగాను.
‘బడికి పోతాను అంటే కొట్టాడు’ అని అనింది.
‘నేను మీ ఇంటికొచ్చి మీ నాన్నతో మాట్లాడి స్కూల్ లో చేర్పిస్తాను. రోజూ వస్తావా ?’ అని అనగానే నా చేయి పట్టుకుని ‘ఇప్పుడే రండి టీచర్, ఇప్పుడే రండి’ అంటూ నా చేయి పట్టుకుని వాళ్ళింటికి తీసుకెళ్ళింది.
‘గౌరీని స్కూల్ కు పంపండి’ అని వాళ్ళ నాన్నను అడిగాను.
'మాకూ పంపాలనే ఉండాదమ్మా, కానీ ఈ సంటోడ్ని ఎవరు సూసు కుంటారు ?’ అని అన్నాడు.
‘కూలి పని చేసుకుంటూ నేను సూసు కుంటాను. దాని బడికి పంపయ్యా’ అని గౌరి అమ్మ వాళ్ళాయనను బంగపోయింది.
నేను కూడా పంపమని అడగడంతో ‘రేపటి నుండి బడికి పోవే’ అని గౌరీ వాళ్ళ నాన్న అయిష్టంగానే ఒప్పుకున్నాడు. గౌరి సంతోషంతో ఎగిరి గంతులేసింది.
గౌరి మరుసటి రోజు ఉదయాన్నే ఒక మందారం పువ్వు పెట్టుకుని స్కూల్ కు వచ్చింది. ‘పలక, బలపం తెచ్చుకోలేదే’ అని అడిగితే లేవు అన్నట్లు ఏడుపు ముఖం పెట్టింది. అది గమనించి ‘నీ మందారం పువ్వు ఎర్రగా చాలా బాగుందే’ అని అన్నాను.
‘మా ఇంటిలోదే టీచర్. రేపు నీకూ తెస్తాలే’ అని గౌరీ అనింది.
ఒక కొత్త పలక కొనిచ్చాను. దగ్గరుండి దిద్దిచ్చాను. ఒక్క రోజు లోనే అక్షరాలు దిద్దడం నేర్చు కునింది. రోజూ ఒక మందారం పువ్వు ఒకటి తెచ్చి ఇచ్చేది. నేను దగ్గరికి తీసుకోవడంతో బాగా చనువుగా ఉండేది. నాకూ ఒంటరితనం పోయింది. కొన్నాళ్ళకు నాకు ఒక పెళ్లి సంబంధం కుదిరింది. పెళ్ళికని వారం రోజులు సెలవు పెట్టాను. పెళ్లి ఘనంగా జరిగింది. మా ఆయన కూడా టీచర్ కావడంతో వారం రోజుల తరువాత నన్ను మళ్ళీ స్కూల్ కు పంపించాడు. వారం రోజుల తరువాత స్కూల్ కు రావడంతో గౌరీ పరిగెత్తుకొని వచ్చి నన్ను గట్టిగా హత్తుకుని ‘ఇంకెప్పుడూ నన్ను విడిచి వెళ్లొద్దు టీచర్. ఇక్కడే ఉండండి’ అంటూ ఏడ్చింది. ‘వెళ్ళను లే’ అని చాక్లెట్ ఇచ్చి ఓదార్చాను.
నేను ఊరికి వెళ్ళిన ప్రతి సారి ఈ విధంగానే జరిగేది. కొన్నాళ్ళ తరువాత ఉన్నత ఉద్యోగానికై నేను వ్రాసిన పరీక్ష పాస్ కావడంతో హైస్కూల్ టీచర్ గా ఎంపికయ్యాను. మా వారు పనిచేసే ఊరికి దగ్గరగా ఉద్యోగం రావడంతో మా వారికి ఎంతో సంతోషం వేసింది. నాకూ ఆనందంగా ఉన్నా, నేను పని చేస్తున్న స్కూల్ ను విడిచి పెట్టి రావడం కొంత బాదేసింది. ఊరి లోని వచ్చి చెప్పడంతో ప్రెసిడెంట్ గారు ‘సంతోషమమ్మా! మంచి విషయం చెప్పావు. కానీ నీ లాంటి టీచర్ మళ్ళీ ఎప్పుడొస్తారో ఏమో మా ఊరికి ?’ అని అన్నాడు. నేను వచ్చానని తెలియడంతో గౌరీ మందారం పువ్వు పట్టుకుని వచ్చింది. ‘టీచర్ నీవు మళ్ళీ ఇక్కడికి రావని అంటున్నారు. నిజమేనా టీచర్. వెళ్లొద్దు టీచర్’ అని అంటూ నన్ను గట్టిగా పట్టుకుని ఏడుస్తోంది. గౌరీని ఎలా సముదాయించడం నాచేత కాలేదు.
ఉన్నత ఉద్యోగం పొందానన్న ఆనందం కన్నా గౌరీ ఆప్యాయతే ఎక్కువనిపించింది. కాని ఈ ఆవకాశం వదులుకుంటే నేను నా భర్త పనిచేసే దగ్గరికి వెళ్ళలేను. నేను ఏమీ చేయలేని పరిస్థితి. వెక్కి వెక్కి ఏడుస్తున్న గౌరీ చేయి పట్టుకుని ‘పిచ్చి పిల్లా! నేను అప్పుడప్పుడూ వస్తుంటాగా. ఇదిగో నీకు సార్ కొత్త గౌను ఇమ్మని చెప్పి నాతో పంపించాడు. నీకు సరిపోతుందా చూడు. తీసుకో. ఏడవకూడదు. గౌరీ మంచి పిల్ల కదా! ఇంకోసారి వచ్చి మా ఊరికి తీసుకెళతాను’ అంటూ గౌరీ చెక్కిళ్ళపై కన్నీళ్లను తుడుస్తున్నా కళ్ళ నుండీ కన్నీరు కారుతూనే ఉంది.
గౌరీ వాళ్ళమ్మ వచ్చి ‘దానిని తనివి తీరా ఏడవనివ్వండమ్మా, ఏడవనివ్వండి. రొజూ మా టీచర్ ఇలా చెప్పింది. అలా అనింది అని మిమ్మల్ని గురించే చెబుతూ ఉంటుంది. మీరు ఊరు వెళ్ళిన ప్రతి ఆదివారం బువ్వే సరిగా తినదు. సోమవారం మీరు ఎప్పుడొస్తారా! అని వేయి కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటుంది. ఇక మీరు ఎప్పుడూ ఇక్కడికి రారు అని తెలిసిన ఈ పిచ్చిది ఎవరి కోసం ఎదురుచూస్తుంద. అయినా ఎప్పుడన్నా ఒకసారి వచ్చి వెళ్ళండమ్మా. అది మీపై బెంగ పెట్టుకుని ఉంటుంది’ అని అనింది.
ఒక్కసారిగా గౌరీని నా కౌగిలిలోకి తీసుకున్నాను. నా కళ్ళల్లో గిర్రున నీళ్ళు తిరిగాయి. ‘గౌరీ మంచి తెలివైన పిల్ల. చదువు ఆపొద్దు. గౌరీ చదువుకు అయ్యే డబ్బు నేను పంపిస్తాను. బాగా చదివించండి.’ అని చెప్పి బయలు దేరాను. ఊరి వరి మళ్ళ పచ్చదనాన్ని చివరి వరకూ ఆస్వాదిస్తూ వస్తున్నాను. ఊరి పొలిమేర వరకు ఊరేగింపుగా ప్రెసిడెంట్ గారితో సహా గ్రామస్తులంతా వచ్చి నన్ను బస్సు ఎక్కించారు. బస్సు ఎక్కేటప్పుడు గౌరీ పరిగెత్తుకొని వచ్చి మందారం పువ్వు ఇచ్చింది. ఆ పువ్వును చూసుకుంటూ గౌరీని మనసులో తలచుకుంటూ మా ఊరు వచ్చాను. కాని నా మనసు మాత్రం గౌరీ మీదే ఉంది.
కొత్త స్కూల్ లో చేరాను. హైస్కూల్ హెడ్ మాస్టర్ గారు నన్ను ఏడవ తరగతికి ఇంగ్లీష్ చెప్పమని చెప్పడంతో ఇంగ్లీష్ పాఠం చెప్పాను. మరుసటి రోజు ఆ క్లాస్ కు వెళ్ళగా, ఒక అమ్మాయి వచ్చి ‘మా ఇంటిలో పూసింది టీచర్, పెట్టుకోండి’ అంటూ ఒక మందారం పువ్వు ఇచ్చింది. ‘నీ పేరేంటని’ ఆ అమ్మాయిని అడిగితే ‘గౌరి’ అని చెప్పడంతో కౌలు పల్లె గౌరీ గుర్తుకువచ్చి అ పాపను గట్టిగా హత్తుకున్నాను.
నిజంగా జీవితం ఒక రైలు ప్రయాణం లాంటిది. ఎన్నో మలుపులు, ఎన్నో మజిలీలు, ఎందరితోనో పరిచయాలు. జీవితంలో కూడా ఎందరో తారస పడతారు. కానీ వారిలో కొందరు ఎప్పటకీ మదిలో నిలిచి పోతారు. అటువంటి వారిలో గౌరీ ఒక తీపి గుర్తు. గౌరీ లాంటి పిల్లలు ముద్ద మందారాలు.
***శుభం***
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.
ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.
లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
రచయిత పరిచయం: మధువాణి
1. శ్రీ కొమ్మలూరు హరి మధుసూధన రావు
2. శ్రీమతి భారతుల శ్రీవాణి
కొమ్మలూరు హరి మధుసూధన రావు అనే నేను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో ఉపాధ్యాయునిగా పనిచేయుచున్నాను. జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడు గా, రాష్ట్ర స్థాయిలో గురుబ్రహ్మ అవార్డ్, విశాఖపట్నం వారిచే విద్యాభూషణ్ అవార్డు అందుకున్నాను.
నా భార్య శ్రీమతి భారతుల శ్రీవాణి. ఈమె కర్నూలు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయినిగా, అలాగే రాష్ట్ర స్థాయిలో గురుబ్రహ్మ అవార్డు, జాతీయ స్థాయిలో ఆచార్య దేవోభవ అవార్డు లభించింది. చలం గారి రచనలంటే చాలా ఇష్టం. వాసిరెడ్డి సీతాదేవి, యద్దనపూడి సులోచన రాణి నవలలు అంటే ఇష్టం.
భారత దేశంలో జన్మించి నందుకు గర్వపడుతూ, చాలా మంది విద్యార్థినీ విద్యార్థులకు దేశభక్తి పాటలను నేర్పిస్తూ ఉంటాము. ఇక్కడ జరిగే సభలలో భరత మాత కన్న గొప్ప దేశ భక్తుల గురించి ఉపన్యాసం ఇస్తుంటాము. ప్రవృత్తిగా అప్పుడప్పుడూ రచనలు చేస్తూ ఉంటాము. గతం లో మేము వ్రాసిన ఆర్టికల్స్ గో తెలుగు.కామ్ లోనూ, సంచిక లోనూ, దక్కన్ ల్యాండ్ మాస పత్రిక లోనూ, జాగృతి వార పత్రిక లోనూ అనేకం ప్రచురితమయ్యాయి.
Prakash Kumar • 17 hours ago
Wow... Really it's soo emotional... 🥰🥰Great work sir... 👏
Ragavendhra Royal • 17 hours ago
Nice story uncle..👏👏👏👏
Pranavi Ammulu • 17 hours ago
Maa nanna rasina story...💕😊
harimadhusudhana rao • 18 hours ago
చక్కగా భావయుక్తంగా వినిపించారు
Nice work అభినందనలు 🎉