మూడు తరాల మహిళలు
- Lalitha Sripathi
- Jun 2, 2023
- 6 min read

'Mudu Tharala Mahilalu' New Telugu Story Written By Sripathi Lalitha
'మూడు తరాల మహిళలు' తెలుగు కథ
రచన: శ్రీపతి లలిత
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
ఒక ఏభై, అరవై సంవత్సరాలలో మహిళల జీవన విధానాలు బాగా మారాయి.
కట్టెలపొయ్యిలు, రుబ్బురోళ్లు, తిరగలి కాలం నుంచి గ్యాస్, ఓవెన్స్, రెఫ్రిజిరేటర్స్, డిష్ వాషెర్స్, వాషింగ్ మెషిన్ ల కాలానికి మార్పు వచ్చింది.
ఒకప్పుడు ఇంట్లో నుంచి కాలు బయట పెట్టని ఆడపిల్లలు ఈ రోజు కార్లు, విమానాలు నడుపుతున్నారు. ఏ రంగంలో చూసినా ఆడపిల్లలు ముందుంటున్నారు.
అంతెందుకు, నిన్న గాక మొన్న విడుదల చేసిన సివిల్ సర్వీసెస్ ఫలితాలలో మొదటి నాలుగు ర్యాంకులు ఆడపిల్లలే.
ఈ ఆడపిల్లల ఎదుగుదల తరాల వారీగా ఎలా ఉందో చూద్దాము.
మొదటి తరం మా అమ్మల తరం.
"ఒసేయ్ "
ఉరిమింది ఉగ్రనరసింహం గొంతు. వినగానే కుంపటి మీద ఉన్న గిన్నె పక్కకుపెట్టి
తువాలు భుజాన వేసుకుని పరిగెట్టింది శాంతమ్మ.
ఆయన చెయ్యి చాచగానే కచ్చిక వేసి, దోసిలి పడితే చెంబుతో నీళ్లు, తాటాకు, ముఖం కడగగానే తువ్వాలు అందించి, అవగానే కాళ్ళ మీద నీళ్ళుపోసి, ఆయన లోపలికి వచ్చి కుర్చీలో కూర్చోగానే కొంగుతో పట్టుకుని కాఫీగ్లాస్ అందించి, తాగేదాకా నిలుచుని గ్లాస్ తీసుకెళ్లింది.
ఆయన స్నానానికి బావిదగ్గరికి రాగానే, పాలేరు పొయ్యి మీద పెట్టిన వేడి నీళ్లు తోడి బావి దగ్గర పెడితే, ఆయన వచ్చి బల్ల మీద కూర్చుని నీళ్లు పోసుకుంటే, ఆవిడ వచ్చి వీపు రుద్ది, మొత్తం స్నానం అయ్యాక వీపు తుడిస్తే ఆయన పంచ కట్టుకొని, అప్పటికే ఆవిడ దేవుడు దగ్గర పూజకి అన్ని ఏర్పాటు చేస్తే పూజ చేసుకున్నాడు.
పూజ అయ్యి టిఫిన్కి వచ్చేసరికి పీట వేసి పళ్లెం పెట్టి టిఫిన్ వడ్డించింది. ఆయన తినేదాకా నిలుచునే ఉంది. ఆయన తిన్నాక చేయి చాపితే, చెంబుతో నీళ్లు పోస్తే చెయ్యి కడుక్కుని, తువ్వాలు ఇస్తే తుడుచుకుని తయారయ్యి బయటికి వెళ్లారు.
ఈవిడ మళ్ళీ రెండు చెంబుల నీళ్లు పోసుకుని పూజ అయ్యాక టిఫిన్ తిని వంటకి ఉపక్రమించింది.
ఈ తరములో ఆడపిల్లకి పది, పన్నెండు ఏళ్ళు వచ్చేలోగా పెళ్లి చేసేవారు. భార్య భర్తల మధ్య వయస్సు తేడా చాలా ఎక్కువగా ఉండేది. మగవారికి రెండో పెళ్లిళ్లు కూడా ఎక్కువ ఉండేవి.
ఆ కాలంలో ఆడవాళ్లు భర్త అంటే భయపడుతూ ఉండేవారు.
తిండి, బట్టా అమర్చేవారు కానీ మొగవాళ్ళు కూడా భార్య పట్ల ప్రేమ వ్యక్తపరిచేవారుకాదు.
ఆరోజుల్లో ఆడ వాళ్ళకి ఇంటి పని తప్ప వేరే ఏమీ లేదు. సహాయానికి పాలేర్లు, పనివాళ్ళు ఉన్నా ఎప్పటికీ తెమలని పని ఉండేది.
ఇంటి విషయాలలో కల్పించుకోడానికి లేదు. భర్త ఏమి చెప్తే మరబొమ్మలా చేయడమే. చదువుకుందామన్నా చదవనియ్యలేదు, సొంత ఆలోచన ఉన్నా అమలుపరచడానికి లేదు.
చాలామంది భార్యలని కొట్టేవారు. తిట్లు పెద్దవిషయం కానే కాదు. భర్త పోయినవారి బతుకు మరీ దుర్భరం. వాళ్లకు తిండి పెట్టడమే వృధా అన్నట్టుగా ఉండేవారు. వెట్టిచాకిరి చేయించి ఒక ముద్ద పడేసేవారు.
చాలామటుకు ఈ తరం ఆడవాళ్లు డబ్బు కోసం ఎవరో ఒకరి మీద ఆధారపడి, ఓపిక ఉన్నంతసేపు పని చేస్తూ యంత్రాలలాగా జీవించారు. చదువుకుని ఉద్యోగం చేసిన ఆడవాళ్లు బహు తక్కువ.
రెండో తరం అంటే మా తరం
అయిదు గంటలకి అలారం మోగగానే ఉష గడియారం నొక్కి, లేచి పాల
ప్యాకెట్లు లోపలకి తెచ్చి, పాలు స్టవ్ మీద పెట్టి, పేపర్ తెచ్చి టేబుల్ మీద పెట్టి,
ఒక స్టవ్ మీద పప్పు, రైస్ కుక్కర్లో అన్నం పెట్టి, బ్రష్ చేసుకొని వచ్చి ఇడ్లీకి పచ్చడి రెడీ చేసి, కూరలు తరిగి పొయ్యి మీద
పెట్టి, ఇడ్లీ కుక్కర్ లో పెట్టి పిల్లలని లేపింది.
పిల్లలు బ్రష్ చేసేసరికి పాలు రెడీగా పెట్టి, స్నానం చేసి వచ్చేసరికి వాళ్ళ డబ్బాలు ఒకదాంట్లో ఇడ్లి, పచ్చడి, ఇంకోదాంట్లో అన్నం కూర, వాటర్ బాటిల్ ఇచ్చి ఆటోలో ఎక్కించి వచ్చేసరికి భర్త నిద్రలేచి బ్రష్ చేసుకుని పేపర్ చదువుతున్నాడు.
ఇద్దరికీ కాఫీ కలిపి ఆయనకి ఇచ్చి, కాఫీ తాగుతూనే బట్టలు పెట్టుకుని, స్నానం చేసి దేవుడు దగ్గర అగర్బత్తి పెడుతుంటే,
"ఉషా! బాత్రూమ్లో టవల్ పెట్టలేదా రోజూ చెప్పాలి" భర్త అరుస్తుంటే
పరిగెత్తుకుంటూ వెళ్లి టవల్ ఇచ్చి, మంచం మీద లోదుస్తులు, లుంగీ పెడితే వచ్చి కట్టుకుని వచ్చి టేబుల్ దగ్గర కూర్చున్నాడు.
ప్లేటులో ఇడ్లి, పచ్చడి పెడితే బల్లమీద ఉన్న నెయ్యి గిన్నె వంక చెయ్యి చూపిస్తే నెయ్యి వేసింది.
"సాంబార్ చెయ్యలేదా ? "అని భర్త అరిచినట్టు అంటే "ఇవాళ పప్పు చేసానండి" నెమ్మదిగా అంది.
"ఇడ్లి ఉన్నప్పుడు సాంబార్ చెయ్యవు" విసుక్కుంటూ లేచి పళ్లెంలో చెయ్యి కడుక్కుని వెళ్ళాడు.
టేబుల్ శుభ్రం చేసి తనకి భర్తకి డబ్బాలో అన్నం, కూర, పప్పు, పెరుగు అన్ని వేరువేరుగా చిన్న,
చిన్న డబ్బాల్లో సర్ది పెట్టి తలుపు వేసి గ్యాస్ చూసుకుని, చీర మార్చుకుని జడ వేసుకొనే లోగా,
ముందే తయారయి ముందు రూంలో ఉన్న భర్త "ఇంకా ఎంతసేపు ముస్తాబు? నిన్ను దింపి నేను ఆఫీసుకి వెళ్ళాలి అంటూ విసుక్కుంటూ స్కూటర్ స్టార్ట్ చేస్తే, లైట్లు, ఫ్యాన్లు ఆపి మంచం మీద తడి తువ్వాలు పక్కన తాడు మీద వేసి, టిఫిన్ డబ్బా బ్యాగ్లో పెట్టుకొని తలుపులు తాళం వేసి స్కూటర్ ఎక్కింది.
"ఏమిటి ఆ తల దువ్వుకోవడం అంతా చెరిగిపోయింది ముఖాన పౌడర్ ఉండదు, జిడ్డు కారుతూ పోతావు ఆఫీసుకి. పొద్దున్న లేచిన దగ్గరనించి ఏమిటి ఉద్ధరిస్తావో తెలీదు. "
ఆఫీస్ వచ్చేవరకు దారి అంతా సణుగుతూనేఉన్న మొగుడు మాటలకి మొదట్లో కళ్ళలో నీళ్లు వచ్చేవి, తరవాత వినడం మానేసి దారిలో అన్నీ గమనిస్తూ ఉండేది.
ఇప్పుడు స్వగతం లో "అవును నీకులాగా చేతికీ, మూతికీ అందించే వాళ్ళుంటే షోకులు చేస్కుంటా, ఒక్క పని చెయ్యవు, అనడానికి రెడీ " అంటూ లోపల తిట్టుకుంటూ తృప్తిపడేలోగా స్కూటర్ ఆపి
"ఇంక దిగు" అని పూర్తిగా దిగేలోగానే స్కూటర్ పోనిచ్చే మొగుడిని చూడకుండానే ఆఫీసులోపలికి వెళ్ళింది ఉష.
ఈ తరంలో ఆడవారికి చదువులు, ఉద్యోగాల ప్రహసనం మొదలైంది. దానివల్ల మధ్యతరగతి వారి బతుకులు బాగయ్యాయి.
సొంత ఇళ్ళు ఏర్పాటు చేసుకున్నారు, పిల్లలకి మంచి చదువులు చెప్పించి అమెరికాలకి పంపి వీళ్ళుకూడా పురుళ్ళు, పుణ్యాలకి అమెరికాలు వెళ్లారు.
కానీ అటు ఉద్యోగంతో, ఇటు ఇంటిపనితో, ఆడవాళ్ళ జీవితం అష్టావధానం, శతావధానం అయింది. ఎవరినీ పూర్తిగా మెప్పించలేక, ఎవరికీ ఎదురుచెప్పలేక, నలిగిపోయిన 'శాండ్విచ్ ' తరం మాది.
భర్తలకి ఇంట్లో భార్యకి సాయం చేయడం నామోషీగా ఉండేది. అమ్మలు, అత్తగార్లు అంతగా సహకరించలేదు. తమ విషయంలో పడ్డ బాధ పిల్లలు పడకూడదని పిల్లలకి ఎంత సాయం చేసినా పిల్లలు తృప్తిపొందలేదు, అది తల్లి బాధ్యత అనుకున్నారు.
ఏదిఏమైనా ఈ తరంఆడవాళ్లు ఆర్థికంగా కొంత నిలదొక్కుకున్నారు. చాలామటుకు మగవారి మాటే నెగ్గినా ఇంటివిషయాలలో, పిల్లల విషయాలలో వీరి మాట కూడా కొంతమటుకు చెల్లింది.
సొంత ఇళ్ళు, సరిపడా డబ్బులు ఉండి ఆర్థికంగా ఎవరి మీద ఆధారపడాల్సి రాకపోవడం తో ఆత్మవిశ్వాసం పెరిగింది. వయసు పైబడేసరికి పిల్లలు వేరే దేశాల్లో ఉండడం, అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్ల మధ్య బంధాలు బలహీనపడి ఒంటరితనము కొంత పెరిగింది.
మా 'బేబీల' తరం ( ప్రస్తుతం తరం )
పొద్దున్న ఏడు గంటలు. మెయిడ్ బెల్ కొడితే ఆకాష్ తలుపు తీసాడు. "లక్ష్మి వచ్చిందా?" నిద్ర మత్తులో అమల అడిగితే, "అవును. ఏమన్నా చెప్పాలా బేబీ" అడిగాడు ఆకాష్.
"ఏమి లేదు బేబీ! ఏమి చెయ్యాలో వాట్సాప్ లో మెసేజ్ పెట్టా,
రాత్రి కాల్స్ అయ్యేసరికి పన్నెండు అయింది, మళ్ళీ నాకు తొమ్మిదింటికి కాల్ ఉంది, లేపు" అని మళ్ళీ నిద్రపోయింది అమల.
బయటికి వెళ్లి "వాట్సాప్ మెసేజ్ చూసుకో లక్ష్మీ" అని ఆకాష్ రూంలోకి వెళ్ళాడు.
లక్ష్మి ఆ మెసేజ్ చూసుకుని ఫ్రిడ్జ్ నుంచి కూరలు తీసి, కుక్కర్ పెట్టి వంట మొదలుపెట్టింది.
ఆకాష్ గీజర్ వేసి స్నానము చేసి " లే! కాఫీ తెస్తాను"
అంటూ వంట ఇంట్లోకి వెళ్లి కాఫీ మిషిన్ లో బ్లాక్ కాఫీ చేసి రెండు కప్పుల్లో
తెస్తే అమల లేచి బ్రష్ చేసుకుని కాఫీ తాగి
జుట్టు బ్రష్ చేసుకుని, ముఖాన పౌడర్ రాసి, పెదాలకు లిప్స్టిక్ అద్ది, రాత్రి వేసుకున్న టీ షర్ట్ తీసి వేరే షర్ట్ వేసుకుని కాల్ తీసుకుంది.
కాల్ అయ్యాక బయటికి వెళ్లి లక్ష్మి చేసిన టిఫిన్ ప్లేటులో తెస్తే,
అది తిని మళ్ళీ కొంచెం పని చూసుకుని, లక్ష్మి అన్ని పనులు చేస్తోందా లేదా చెక్ చేసి, కావాల్సిన వస్తువులు స్విగ్గీ, బిగ్ బాస్కెట్, బ్లింకిట్ లో ఆర్డర్ చేసి స్నానం చేసి మళ్ళీ లాప్టాప్ ముందు కూర్చుంది అమల.
ఈలోగా ఆకాష్ కూడా టిఫిన్ తిని లాప్టాప్ పట్టుకుని వేరే రూమ్ లోకి వెళ్ళాడు.
లంచ్, డిన్నర్ వండి అన్ని బల్ల మీద సర్ది మెసేజ్ పెట్టి వెళ్ళింది లక్ష్మి.
" ఆకాష్! నాకు మళ్ళీ ఒంటిగంటకి కాల్ ఉంది, నేను లంచ్ తినేస్తాను, నువ్వు తిన్నాక అన్నీ సర్ది ఫ్రిడ్జ్ లోపెట్టు "అంటూ ఆకాష్ కి మెసేజ్ పెట్టి లంచ్ చేసింది అమల.
" ఇవాళ బయట డిన్నర్ ఉంది డియర్, నేను ఏడుగంటలకు వెళ్తాను, నైట్ లేట్ అవుతుంది. " ఆకాష్ మెసేజ్.
"ఓకే! నాకు రాత్రి పన్నెండు దాకా కాల్స్, తరవాత పడుకుంటా. డోంట్ డిస్టర్బ్ మీ!" అమల రిప్లై.
ఒకే ఇంట్లో, ఇంటినుంచి పని ఇద్దరికీ. రోజుకి గట్టిగా అరగంట కూడా మాట్లాడుకోరు. ఇద్దరూ వాట్సాప్ మెస్సేజిల తోనే సంభాషణ. బేబీలు పుట్టేదాకా ఒకరికి ఒకరు బేబీలు.
ఇద్దరికీ ఎవరి కార్లు వాళ్ళకి ఉంటున్నాయి. ఇద్దరూ ఇంచుమించు సమానమైన జీతాలు, కొన్నిసార్లు ఆడవాళ్లకే ఎక్కువ జీతాలు. అన్ని సదుపాయాలతో ఉన్న మంచి ఇళ్ళు కొనుక్కుంటున్నారు. వేలు, వేలు ఇచ్చి ఇంట్లో పనికి, వంటకి మనుషులని పెట్టుకుంటున్నారు. ఇన్ని ఉన్నా రకరకాల భయాలతో బతుకుతున్నారు.
పొద్దున్న లేచినదగ్గరనుంచి ఉద్యోగం ఉంటుందా, ఊడుతుందా అని ఇద్దరికీ భయం. మొగుడికి పెళ్ళాన్ని ఏమంటే 'డివోర్స్' అంటుందా అని భయం.
పెళ్ళానికి పనిమనిషి ఉంటుందా, వేరే వాళ్ళు జీతం ఎక్కువ ఇస్తే వెళ్లిపోతుందా అని భయం.
మెయిడ్ వంట బోర్ కొడితే స్విగ్గి, జొమాటో ఉన్నాయి, కానీ వాటితో అసిడిటీ కూడా ఉంది. ఈ భయాలతో నిమిషనిమిషాలకి టెన్షన్ పడుతూ, బయట భోజనాలమీద బతికేస్తూ, రోగాలు తెచ్చుకుని, మందులు తింటూ, మందు తాగుతూ బతికేస్తున్నారు.
ఇంటిపని, వంటపని మానేసి బయటవి తినితిని వెయిట్ పెరిగిపోతున్నారు.
సరి అయిన సమయంలో పిల్లలని కనడం మానేసి, పిల్లలు పుట్టకపోతే IVF ఖర్చు గురించి భయంతో పిల్లలే వద్దనుకుని, ఒకరితో ఒకరికి పడక, నిత్యం గొడవలు పడుతూ, చిన్న విషయాలకే విడాకులు తీసుకుంటూ, జీవితం కళావిహీనం చేసుకుంటున్నారు.
లక్షల్లో జీతాలు, ఏమి కావాలన్నా ఆన్లైన్ ఆర్డర్లు, వీకెండ్ పార్టీలు, ఆడ, మగ తేడాలేకుండా సిగరెట్లు, తాగుళ్ళు. ఏ తరానికి లేని స్వేచ్ఛ ఇప్పటి తరం ఆడపిల్లలకి ఉంది. కానీ ఎంతమంది దానిని విచక్షణతో ఉపయోగిస్తున్నారు.
అందరూ అలా ఉన్నారా అంటే కాదు, కానీ అటువంటివారి శాతం పెరుగుతోంది. ఈమధ్య
చాలా సినిమాల్లో, నాటకాల్లో అమ్మాయిలు ఆల్కహాల్ తాగడం అనేది చాలా సామాన్యమైన విషయంగా, స్మోకింగ్ పెద్ద తప్పు కాదు అన్నట్టు చూపిస్తున్నారు. కంటికి కనపడకుండా 'ఆరోగ్యానికి హానికరం' అని చూపిస్తే పట్టించుకునేవాళ్ళు ఎవరు.
ఇప్పటి తరం వాళ్ళు, వాళ్ళ ఆరోగ్యాలని వాళ్లే సరిగా పట్టించుకోవడం లేదు. వేరే కుటుంబ సభ్యులని ఏమి పట్టించుకుంటారు.
అన్నీ మాకు తెలుసు అనే తత్త్వం. ఏది కావాలన్నా గూగుల్, యూ ట్యూబ్ లో తెలుసుకోవచ్చు అనే మూర్ఖత్వం.
డబ్బు దండిగా ఉన్నా కావాల్సినవి వండుకు తినే ఓర్పు, సమయం రెండూ లేవు. పెద్దవాళ్ళు చెపితే విని పాటించే సహనం లేదు.
పిల్లలని కనాలన్నా భయం, పెంచగలమా, లేదా? అని భయం. అన్ని బంధాలు డబ్బుతో ముడి పెడుతున్నారు. ఈ భయాలు ఎక్కువై మానసిక సమస్యలు పెరిగాయి.
'మరక మంచిదే' అన్నట్టు కరోనా వచ్చాక ఇంట్లో శుభ్రాలు పెరిగాయి, పొయ్యిలు వెలుగుతున్నాయి, కూరలు, పళ్ళు వాడకం పెరిగింది. ఆరోగ్యం మీద, వ్యాయామం మీద దృష్టి పెడుతున్నారు.
ఇలాగే కొనసాగితే డబ్బుకి ప్రాముఖ్యత తగ్గి, కుటుంబం ప్రాముఖ్యత పెరుగుతుందని, శారీరిక, మానసిక ఆరోగ్యం మెరుగు పరుచుకుని మంచి విలువలతో జీవితం కొనసాగిస్తారు అని, మంచి పౌరులని దేశానికీ అందిస్తారని ఆశిద్దాము.
ఎవరినీ విమర్శించడం కాదు కానీ తగ్గిపోతున్న ఆరోగ్యాలు, మానవ సంబంధాలు చూసిన ఆక్రోశం.
***
శ్రీపతి లలిత గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం:
నా పేరు శ్రీమతి శ్రీపతి లలిత.
నేను ఆంధ్రా బ్యాంకు లో ఆఫీసర్ గా పని చేసి పదవీ విరమణ చేశాను.
నా భర్త గారు శ్రీపతి కృష్ణ మూర్తి గారు కేంద్ర ప్రభుత్వం లో గెజెటెడ్ ఆఫీసర్ గా పని చేసి పదవీ విరమణ చేసారు.
నాకు చిన్నప్పటి నుంచి పుస్తక పఠనం , శాస్త్రీయ సంగీతం , లలిత సంగీతం వినడం ఇష్టం.
అరవై ఏళ్ళ తరవాత జీవితమే మనకోసం మనం బతికే అసలు జీవితం అనుకుంటూ రచనలు మొదలు పెట్టాను.
నా కధలు ఫేస్బుక్ లోని "అచ్చంగా తెలుగు " , "భావుక " గ్రూప్ లో , " గోతెలుగు. కం" లో ప్రచురించబడ్డాయి.
ప్రస్తుత సమాజం లో ఉన్న సమస్యల మీద , ఏదైనా పరిష్కారం సూచిస్తూ కధలు రాయడం ఇష్టం.
నేను వ్రాసిన కధలు ఎవరైనా చదువుతారా !అని మొదలు పెడితే పాఠకులనుంచి మంచి స్పందన, ప్రోత్సాహం , ఇంకాఉత్సాహం ఇస్తుంటే రాస్తున్నాను.
పాఠకుల నుంచి వివిధ పత్రికల నుంచి ప్రోత్సాహం ఇలాగే కొనసాగగలదని ఆశిస్తూ.. మీకందరికీ ధన్యవాదాలుతెలుపుతూ మళ్ళీ మళ్ళీ మీ అందరిని నా రచనల ద్వారా కలుసుకోవాలని నా ఆశ నెరవేరుతుంది అనే నమ్మకం తో ... సెలవు ప్రస్తుతానికి.
Comments