#MachirajuKameswara Rao, #మాచిరాజుకామేశ్వర రావు, #MugisinaAdhyayam, #ముగిసినఅధ్యాయం, #TeluguKathalu, #తెలుగుకథలు

Mugisina Adhyayam - New Telugu Story Written By - Machiraju Kameswara Rao
Published In manatelugukathalu.com On 18/02/2025
ముగిసిన అధ్యాయం - తెలుగు కథ
రచన: మాచిరాజు కామేశ్వర రావు
వైజయంతి కి ఉద్వేగంగా వుంది. ఏ క్షణంలో నైనా విజయేంద్ర రావొచ్చు!
ఎప్పటి విజయేంద్ర? ముప్ఫై ఏళ్ల క్రితం తనతో పాటు బీఎస్సీ చదువు కున్నాడు. రెండేళ్ల పాటు ఇద్దరూ ప్రేమించు కున్నారు. అయితే ఒక స్నేహితురాలి పెళ్ళి లో విష్ణు తనని చూసి ఇష్ట పడ్డాడు. వాళ్ళు లక్షధికారులు. ఆ రోజుల్లో కానీ కట్నం వద్దన్నారు. అమ్మా, నాన్నా ఎగిరి గంతేశారు. విష్ణు గొప్ప అందగాడు. వాళ్ళ హోదా చూసి తను కూడా ఆ సంబంధానికి నో చెప్ప లేక పోయింది.
ఆ రోజు సాయంత్రం టాంక్ బండ్ మీద కలసిన విజయేంద్ర మొహం కోపంతో ఎర్రబడి వుంది!
“నాకు ఏదైనా ఉద్యోగం రాగానే పెళ్ళి చేసుకుందాం అనుకున్నాం కదా! నా పట్ల నీ ప్రేమ ఏమయి పోయింది? చెప్పు. నా కెందు కింత అన్యాయం చేశావ్?” తన భుజాలు కుదిపేస్తున్నాడు విజయేంద్ర.
తను, “సారీ, అమ్మా నాన్నా ల సంతోషానికి అడ్డు చెప్పలేక పోయాను. వాళ్ళు చెప్పిన మాటలు కూడా నిజం అనిపించాయి నాకు.” అంది తల దించుకుని.
“ఏం చెప్పారు వాళ్ళు?”
“జీవితం లో ఆర్థికంగా స్థిర పడని వాళ్లకి ప్రేమించే అర్హత లేదన్నారు. నిజానికి ఈ కాలేజీ ప్రేమలు నిజమైన ప్రేమలు కావని, కేవలం ఆకర్షణ అని అన్నారు. కాల క్రమంలో ఇటు వంటి ప్రేమలు ముగిసిన అధ్యాయం అయి పోతాయని, అందుకు మా ఉష జీవితమే ఒక ఉదాహరణ అన్నారు!”
“మధ్య లో ఈ ఉష ఎవరు?”
“మా పెద నాన్న కూతురు. BA లో చేరిన కొత్తల్లోనే రాజేష్ అనే అబ్బాయితో ప్రేమలో పడి, ఇంట్లో చెప్ప కుండా వెళ్ళి పొయింది. ఏడాది తిరగ కుండా వాడికి వుద్యోగం లేదని, తిండికి లేక కట కట లాడి పోతున్నామని, వాడు కుటుంబ భారం మోయలేక వాళ్ళ ఇంటికి తిరిగి వెళ్లిపోయాడని, తను ఏడుస్తూ ఒక చంటి పిల్లను చంకలో వేసుకుని ఇంటికి తిరిగి వచ్చే సింది. ఇప్పుడు మా పెద నాన్న వాళ్లకు అది ఒక గుదిబండలా తయారయింది”
“నా మీద, మన ప్రేమ మీద నమ్మకం లేదా?”
“అప్పట్లో రాజేష్ కూడా ఉష దగ్గిర ఇలాగే అని వుంటాడు.”
“మీ ఉష ను ఒక సాకు గా చూపిస్తున్నావు. నిజానికి నువ్వు విష్ణు వాళ్ళ కున్న డబ్బు చూసి పడి పోయావ్! అవునా?”
“ఏమైనా అనుకో! ఇక నన్ను మరచి పో!” బాధగా చూస్తున్న విజయేంద్ర ను పట్టించు కోకుండా, ఆ వైపు వెళుతున్న ఆటో ఎక్కేసింది తను.
అయితే ఏడాది తిరగ కుండా తను జీవితం లో ఎంత పెద్ద తప్పు చేసిందో అర్థం అయిపోయింది. విష్ణు డబ్బు లోనే పుట్టి పెరగడం తో అతనికి లేని వ్యసనం లేదు. పైగా తను ఒక శాడిస్ట్. ప్రతి రాత్రి తన ని బెల్టు తో కొట్టడమే కాదు, సిగరెట్ల తో కాల్చే వాడు కూడా.
రెండేళ్లలో ఆ ఇల్లు వదిలి వచ్చేసింది. విష్ణు తో విడాకులు తీసుకుంది. ఎన్నో పరీక్షలు వ్రాసింది. ఆఖరికి మాథ్స్ లెక్చరర్ గా స్థిర పడింది.
అమ్మా, నాన్న కారు ఏక్సిడెంట్ లో పోయాక తనకు మరో పెళ్లి చేయాలని ఆలోచించే వాళ్లే లేక పోయారు. జీవితంలో తిన్న ఎదురు దెబ్బలకు తన మనసు కూడా బండబారి పోయింది. మళ్ళీ పెళ్ళి చేసుకోవాలనే ఆలోచన తనకి కూడా ఎప్పుడూ రాలేదు. ఉద్యోగ మే తన లోకం చేసుకుంది. చాలా స్ట్రిక్ట్ లెక్చరర్ గాపేరువచ్చింది. ముఖ్యంగా ప్రేమ, దోమ అనే స్టూడెంట్స్ కి తనంటే సింహ స్వప్నం!
తన ఫ్లాట్ కింద వుండే రాజారాం గారి అమ్మాయి లీల తన స్టూడెంట్. క్రితం రోజు వాకింగ్ ట్రాక్ లో “మా మామయ్య కెప్టెన్ విజయేంద్ర మేడం!” అంటూ తన వెనక వున్న వ్యక్తి ని పరిచయం చేసింది లీల.
ఆ పేరు వినగానే త్రుళ్ళి పడి తల వెనక్కి తిప్పి చూసింది తను. సందేహం లేదు, ఆ విజయేంద్ర ఈ విజయేంద్ర ఒక్కరే!
“నమస్తే!” అంది పొడిగా.
ప్రతి నమస్కారం చేసి, జాగింగ్ చేసుకుంటూ ముందుకు వెళ్లి పోయాడు విజయేంద్ర. వయసు యాభై దాటినా వెనక నుంచి చూస్తే పాతికేళ్ల కుర్రాడిగా నే కనిపించాడు. మిలటరీ లో వుండటం వల్ల కాబోలు మనిషి మంచి ఫిట్ గా వున్నాడు.
ఈ రోజు పొద్దున్న క్రింద లిఫ్ట్ దగ్గిర కనబడి, “నీ గురించి అంతా తెలిసింది, నీతో మాట్లాడాలి! సాయంత్రం ఆరింటికి నీ ఫ్లాట్ కి వస్తాను” చిన్నగా అని, తన జవాబు కోసం ఎదురు చూడకుండా లిఫ్ట్ లో పైకి వెళ్ళి పోయాడు విజయేంద్ర.
విజయేంద్ర కి తనతో మాట్లాడ వలసింది ఏం వుంటుంది? పెళ్ళి చేసుకుందాం అంటాడు. విజయేంద్ర పెళ్ళి చేసు కోలేదని తమ క్లాస్ మెట్ రాజు ఇదివరకే చెప్పాడు. తప్పకుండా తన దగ్గిర మళ్ళీ పెళ్ళి ప్రసక్తి తీసుకు వస్తాడు.
తను మాత్రం ఈ పెళ్లికి ఒప్పుకోదు. స్ట్రిక్ట్ లెక్చరర్ గా పేరున్న తను ఈ వయసు లో మళ్లీ పెళ్ళి చేసుకుని స్టూడెంట్స్ దగ్గర చులకన కాకూడదు. తను ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పెళ్లికి ఒప్పుకోదు. అంతే!
అప్పుడు తన మనసు తన మాట వింటుందా? ఏమో? తప్పదు. తను మనసు రాయి చేసుకుని, తమ ప్రేమ ఒక ముగిసిన అధ్యాయం అని, తన దగ్గర మళ్ళీ పెళ్లి ప్రసక్తి తీసుకుని రావద్దని ఖచ్చితం గా చెప్పేయాలి.!
విజయేంద్ర గురించి ఆలోచిస్తూ అనుకోకుండా అతనికి నచ్చే పిస్తా కలర్ చీర కట్టుకుని, సోఫా లో కూర్చుని విజయేంద్ర కోసం ఎదురు చూస్తోంది.
అన్నట్లు గానే సరిగ్గా ఆరింటికి విజయేంద్ర వచ్చాడు. అతను ఇష్టం గా తాగే బ్రూ కాఫీ కలిపి తీసుకు వచ్చింది వైజయంతి.
“థాంక్యూ” కాఫీ కప్పు అందుకుంటూ చిన్నగా నవ్వాడు విజయేంద్ర.
కాఫీ సిప్ చేస్తూ తల దించుకుని కూర్చుంది వైజయంతి. ఎన్నో అనుమానాలు! ఇప్పుడు విజయేంద్ర కి తను నో చెప్ప గలదా? చెప్పాలి. తప్పదు. తను కఠినం గానే మాట్లాడాలి.
తాగిన కప్ టీపాయ్ మీద పెడుతూ, “లీల కాలేజీ లో రాకేష్ అనే అబ్బాయితో క్లోజ్ గా ఉంటోందని మా చెల్లికి తెలిసింది. నీ లాగే నాకు కూడా ఈ కాలేజీ ప్రేమల మీద నమ్మకం లేదు. నువ్వు వాళ్ళ మీద ఒక కన్నేసి వుంచు,. వీలైతే కౌన్సిలింగ్ ఇవ్వు. ఎదైనా అనుమానం అనిపిస్తే ముందుగానే మా చెల్లికి చెప్పు. ఈ హెల్ప్ చేయమని అడగడానికే వచ్చాను. వస్తాను” వెళ్ళి పోయాడు విజయేంద్ర.
అతని మాటలకు షాక్ కొట్టినట్లు కుర్చీ లో కూర్చుండి పొయింది వైజయంతి.
విజయేంద్ర రావటం అయింది, వెళ్లి పోవడం కూడా అయింది.
మనసులో ఏదో తెలియని అసంతృప్తి, అశాంతి!కళ్ళల్లో ఆమెకు తెలియకుండా కన్నీళ్లు! ఎందుకో ఆమెకే తెలియదు.
**************
మాచిరాజు కామేశ్వర రావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
పేరు: మాచిరాజు కామేశ్వర రావు
పుట్టిన వూరు.. పత్తిపాడు, తూర్పు గోదావరి జిల్లా.
ఎప్పటి నుంచి కధలు వ్రాస్తున్నారు? మొదటి కథ సెప్టెంబరు 1969 లో చందమామ లో ప్రచురితం
ఇప్పటి వరకూ వ్రాసినవి.
1. పిల్లల కథలు. 400 పైగా( ఇందులో 256 కథలు చందమామ లో వచ్చాయి)
2. పెద్దల కథలు.. వందకు పైగా ఆంధ్ర ప్రభ, పత్రిక , జ్యోతి, భూమి. స్వాతి, విపుల వగైరా, వగైరా దాదాపు అన్ని పత్రికలలో
3. నవలలు… స్వాతి మాస పత్రిక లో 4, చతుర లో 2, సహారి లో పిల్లల నవల ఒకటి సీరియల్ గా.
4. మొత్తం వెలువరించిన కథా సంపుటాలు 5
5. గుర్తింపు తెచ్చినవి.. చందమామ లో ప్రచురితం అయిన ‘ పారి పోయిన దొంగ ‘ కథ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ వారు తీసుకున్నారు. చందమామ లో వచ్చిన “ విధి నిర్వహణ “ కథను మహారాష్ట్ర గవర్నమెంట్ వారు 6 వ తరగతి పాఠ్యాంశం గా తీసుకున్నారు. “ అడుగు కో ఆపద “ నవలకి బాలల అకాడమి వారు నిర్వ హించిన నవలల పోటీలో ప్రథమ బహుమతి వచ్చింది. ఇవి కాక కొన్ని పత్రికల వాళ్ళూ, సంస్థల వాళ్ళు నిర్వహించిన కథల పోటీల్లో 5 బహుమతులు.
6. సాహిత్యకృషి. . మాచి రాజు భాల సహిత్య పీఠం స్థాపించి ఏటా 6 నుంచి 10 వరకూ చదివే బడి పిల్లలకు కథల పోటీలు, వారికి నగదు, పుస్తకాలు బహుమతిగా ఇవ్వడం.ప్రతి ఏటా ఇద్దరు బాల సాహితీ వేత్తలకు మాచి రాజు సీతా రామయ్య, రత్న కుమారి దంపతులస్మారక పురస్కారం గా ₹ 6000/- నగదు , జ్ఞాపిక, శాలువా తో సన్మానం
Comments