top of page
Writer's picturePandranki Subramani

ముహూర్తం

#PandrankiSubramani, #పాండ్రంకిసుబ్రమణి, #ముహూర్తం, #Muhurtham



'Muhurtham' - New Telugu Story Written By Pandranki Subramani

Published In manatelugukathalu.com On 29/09/2024

'ముహూర్తం' తెలుగు కథ

రచన: పాండ్రంకి సుబ్రమణి

(ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత)

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



పంచాంగం టి వీ చానెల్ లో సీరియల్ పదవ అధ్యాయం సాగుతూంది మహాభారత రచనా విన్యాసాన్ని ఊహకు అందని రీతిన ఉత్కంఠ భరితంగా వినూత్నంగా సాహితీ నేపథ్యంతో మలచే కొత్త విధమైన అధ్యాయమది. దానిని నాటక రచయిత కొత్త దృక్కోణంలో నిర్వచించడానికి పూనుకున్నాడు. ద్రోణుడు భీష్మాచార్యుడు ముసి ముసి నవ్వులు కురిపిస్తూ చతురంగం ఆడుతున్నారు. నిజానికది మామూలు చతురంగం కాదు. రాజకీయ చతురంగం. ధీర గంభీర రాజకీయ చాతుర్యం. కౌరవులతో ఉంటూనే కౌరవులకు చేరువుగా ఉన్నట్లు కనిపిస్తూనే అంతర్గతంగా పాండవులకు అనుకూలంగా పాచికలు కదుపుతూన్న రాచరికపు కుమ్ములాటల అంత:పుర అంతర్నాటకం. 


ఆ టీవీ అధ్యయాన్ని చూసి మనసార తరించి మీసాల మాటున నవ్వుకుంటూ టీ వీ ని రిమూట్ తో మూసి పిదప తన బాల్య మిత్రుడు భూముల కోటేశ్వరరావుతో మరొకసారి ఫోనులో మాట్లాడటం ముగించి తిరిగి తలతిప్పి చూసాడు కాముల కామేశ్వరరా వు; చావడి మెట్లపైన పాదాల చప్పుడు వినిపించి, చప్పుడు చేయని రీతిన ఏతెంచిన విగ్రహాన్ని చూసి మరొక మారు మీసాల మాటున నవ్వుకుంటూనే ఆశ్చర్యం ప్రకటించే మోముతో అడిగాడు- “అదేమిటోయ్ ఇలా అకస్మాత్తుగా ఊడి పడ్డావు? మొన్న కూడా మీ వాళ్లతో మాట్లాడినట్టు గుర్తు. నీ రాకగురించి యెవరూ ఏమీ చెప్పలేదే—”.


 సుందరం వెంటనే బదులివ్వ లేదు. చేతిలోని ట్రావిలింగ్ బ్యాగుని గుమ్మం వద్ద ఉంచి తిన్నగా నడచివచ్చి కామేశ్వరరావు రెండుపాదాలనూ తాకాడు సుందరం. 


నెత్తిపైన కుడి చేతినుంచి లోపలకు చూపు సారించి చూస్తూ భార్యను పిలిచాడతను- “ఏమోయ్! ఇలా ఓసారి వచ్చి చూడు- ఎవరొచ్చారో--!” 


భర్త పిలుపునందుకున్న కాంతమ్మ త్వరత్వరగా అడుగులు వేసేకుంటూ వచ్చి విస్ఫారిత నేత్రాలతో చూస్తూండి పోయింది. “ఇదేమిటిరా సుందరం ఇలా ఆకాశంనుండి ఊడిపడ్డట్టు ఇక్కడ తేలావు! కబురంపితే వాసుని గాని మీ మామయ్యని గాని స్టేషనుకి పంపించమూ— నువ్విలా తోడు లేనట్టు ముఖం వ్రేలాడదీసుకుంటూ వచ్చావని తెలిస్తే మా అన్నయ్య ఎంతలా బాధ పడతాడో!” నొచ్చుకుంటూ అందామె. 


ఆమె ప్రస్తావించిన అన్నయ్య మరెవరో కాదు. ఆవిడ భర్త అంతకు ముందు ఫోనులో మాట్లాడిన భూముల కోటేశ్వరరావే— అప్పుడు సుందరం వినమ్రంగా బదులిచ్చాడు. “నిజమే అత్తయ్యా? కాని ఆదరాబాదరగా రావలసి వచ్చింది”.


“అంత ఆదరాబాదరాగా వచ్చానంటున్నావు- మా అన్నయ్యకు తెలియకుండానే వచ్చేసావా! ”.


సుందరం తల అడ్డంగా ఆడించి చెప్పే వచ్చానన్నాడు, కాముల కామేశ్వరరావు వేపు చూపు సారిస్తూ-- 


అది విని భార్యాభర్త లిద్దరూ ముఖాలు చూసుకున్నారు. అలా ముఖాలు చూసుకున్నారు. ఈసారి కామేశ్వరరావు అదోలా నవ్వుతూ అడిగాడు- “సరే! వచ్చేసావనుకో- అంత ఆదరాబాదరాగా రావడం ఎందుకంట?”


సుందరం తటపటాయిస్తూ బదులిచ్చాడు- “వాసుని ఊరు తీసుకెళ్ళడానికి— శారదాంబవారి జాతర జరుగుతూందిగా— అందుకని-”


ఈసారి కామేశ్వరరావు అబ్బురపడిపోయినట్టు చూసాడు- “జాతరకా! ఇప్పుడా! వాడసలే పోస్టింగు తెలుసుకునే హడావిడిలో తెగ హైరానా పడ్తున్నాడు. తిన్నగా ఇప్పుడు వాడు ఢిల్లీ వెళ్ళి అక్కడొక మూడునెల్ల ట్రైనింగు తరవాత తిన్నగా న్యూయార్క్కి వెళ్ళిపోవాలి. మరి ఇలాంటి సమయంలో వాడు జాతర సంబరాల గురించి ఆలోచించగలడంటవా!”


కాంతమ్మ కళవలపాటుని దాచుకుంటూ సౌమ్యంగా స్పందించింది. ఇదంతా ప్రక్క గదినుంచి వింటూన్న వాసుకి ఉన్నపళాన ఒళ్ళు మండిoది. సలసల కాగే నూనే ఒంటి మీద పడ్డట్లయింది. సర సరా చావిడిలోకి దూసుకువచ్చాడు. ఇప్పటికే అతడి యవ్వన ప్రాప్త మనసంతా పావని మోహిని మాలినిల శరీఛ్ఛాయ మేళవింపు సొబగులతో నిండిపోయి ఉంది. ముగ్గురూ తన ట్రైనింగు బ్యాచ్ మేట్సే— తను చొరవతో ఒకడుగు ముందుకు వేయాలే గాని- ఏదో ఒక పిట్ట తన చూపుల వలలో పడకపోదు. తన దానినవకపోదు. తనతో కలసి ఒకే డిపార్టుమెంటులో పోస్టింగు తీసుకుంటూ తనతో కలసి పని చేస్తూ ఒకే ఇంట్లో తనతో సంసారం చేయకపోదు. ఆనంద శిఖరాన్ని అందుకోక పోదు. 


ఇటువంటి బంగారు తరుణంలో వీడొకడు పానకంలో పుడకలా వచ్చిపడ్డాడు. లోలోన విసుక్కూంటూనే స్పందించాడు- “చూడరా సుందరం! నువ్వింగా అదే ప్రాతకాలంలోనే మేకు దించినట్టు నిల్చుండిపోకు. ఇటు రా! మా కొత్త ప్రపంచం వేపు రా! బ్రహ్మోత్సవాలకీ జాతర్లకీ రథోత్సవాలకీ ఒక సమయం సందర్భం ఉంటుంది, మనమింకా వానాకాలంలో దిగంబరంగా తిరుగుతూ ఆడుకునే బడిపిల్లలం కాము. మనుగడ కూల్చుకుని ఏదేవుడూ ఏ దేవతా గుడికి రమ్మనమని కోరరు. 


ఇక అసలు లీగల్ పాయింటుకి వస్తాను. అసలే మీ ఇల్లు మూడు దీవుల మధ్య ఉంది, గోదావరి ఒడిలో ఒదిగి కూర్చున్నట్టు-- అటు సముద్రం- ఇటేమో నదీమతల్లి. ఇది చాలదని దారిపొడవునా కొండలూ కోనలూ దొరువులూనూ—వీటి మధ్య నడుస్తూ నేనెక్కడైనా దారితప్పి దిగబడిపోతే నా కెరియర్ గతేమవుతుందో కొంచెమైనా ఆలోచించావా? నాకు మళ్ళీ గ్రేడ్- ఏ సెంట్రల్ గవర్నమెంటు పోస్టు వస్తుందంటావా! పట్నంలో చదువుకున్నవాడివి ఇవన్నీ ఆలోచించ వద్దా?మామయ్యా అత్తయ్యలకు విడమర్చి చెప్పవద్దా! వాళ్ళు నాయందేదో అభిమానంతీ జాతరకు తీసుకురమ్మనమని చెప్పినవెంటనే దూసుకు రావడమే—అదేదో కొంపలంటుకున్నట్టు--”


అప్పుడు సుందరం వెంటనే స్పందించకుండా చిర్నవ్వు చిందిస్తూ దగ్గరకు వచ్చి వాసు భుజం పైన చేయివేసాడు- “చూడరా వాసూ! ఇవన్నీ తెలియక రెక్కలు కట్టుకుని ఇక్కడ వాలలేదు. రెచ్చిపోకుండా విషయం శాంతంగా విని మాట్లాడు. మా ఇంట్లోవాళ్ళందరూ మొక్కుబడి చెల్లిస్తామని మొక్కుకున్నారు ఎందుకో తెలుసా?” 


“మొక్కబడుల గురించీ నోముల గురించీ తెలుసుకోదగ్గ తీరిక నాకు లేదురా సుందరం. మన తెలుగు వాళ్ళకు మొక్కుబడులు ఒకటా రెండా! అడగడుక్కి ఒక శుభ ముహూర్తం. ఈ రోజుల్లో అటువంటివన్నీ చేసుకుంటూ కూర్చోలేం. టైమ్ ఈజ్ మనీ. ఇక నీతో పనయిపోయింది, రెండ్రోజులు అందరితో కబుర్లాడుతూ ఊరంతా తిరిగి మ్యాట్నీ షోలతో తరించి దారి తప్పిపోకుండా నీకోసం బెంగ పెట్టుకున్న మీ ఊరికి వెళ్ళిపో-- సరేనా?”అని గిర్రున వెనక్కి తిరగబోయాడు. 


అప్పుడు చెంగున కదలి భుజం పట్టుకుని ఆపాడు సుందరం- “పూర్తిగా విని వెళ్ళు. లేకపోతే కచ్చితంగా అప్ సెట్ అవుతావు. ఇది మామూలు మాట కాదు నా హెచ్చరిక” 


“ఏమిటేమిటీ! మీ ఊరి గుడి ఉత్సవాలకు రానన్నానని నాకు హెచ్చరిక విడుస్తావా?నీ మాట విని నా కర్తవ్యం నుండి వెనుదిరగ మంటావా అస్త్ర సన్యాసం పుచ్చుకోవడానికి సిధ్ధపడ్డ అర్జునుడిలా-- ఔరా! ఔరౌరా! ఎంత శోచనీయం ఎంత శోచనీయం-- “ 


సుందరం ఊరోకోలేదు- వెనక్కి తగ్గలేదు- “ఒక్క క్షణం నీ డ్రామాటిక్ గిమ్ముక్కులు కట్టిపెట్టి నేను చెప్పబోయేది విను. మూడ్ కుదురుగా ఉంచుకుని విను. అది విన్న తర వాత నువ్వే తోక ముడుచుకుని నా వెంట వసావు. మరి వినడానికి సిధ్ధమేనా! ”


ఈ మాటతో వాసు అదేమిటన్నట్టు కనురెప్పల్ని కదలించి చూసాడు. అప్పుడు కాంతమ్మ కూడా అలాగే కళ్ళు పెద్దవి చేసుకుని నిల్చుంది. సుందరం ఫిరంగిలా తుళ్ళాడు-- ”అద్గదీ-- అలా దిగిరా చెప్తాను. మా చెల్లెళ్లిద్దరూ మీ అత్తగారూ అమ్మవారి గుడి చుట్టూ పొర్లు దండాలు తీసారు. ఎందుకో తెలుసా? నువ్వు హై ర్యాంకింగ్ తో పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణుడివి కావడానికి. అదే రీతిన నువ్వు హైర్యాంకింగుతో సెలెక్టయావు. దానికి నువ్వు చేయాల్సింది ఒక్కటే, అమ్మవారికి పాలాభిషేకం చేసి చందన పుష్పాదు లు అర్పించి వెళ్ళాలి. ఈచిన్నపాటిది చెయలేవా? దూరా భారం గురించి తలపోస్తూ చేయకుండా ఉండిపోతే ఏమవుతుందో తెలియదా! మా ఊరి అమ్మవారి శక్తి గురించి తెలవదా! ” 


అటు తరవాత ఇంటి చావడంతా నీరవ నిశ్శబ్దం! అందరూ బెల్లం కొట్టిన రాళ్ళలా నిల్చుండిపోయారు. 


కాంతమ్మ మరుపలుకు లేకుండా లోపలకు వెళ్లి కొడుకు సూటుకేసు తీసుకుని కావలసిన వస్తువుల్ని దుస్తుల్ని దబ్బు దబ్బున కుక్కింది. మరొకమారు ఇంటిపెద్ద మీసాల మాటున నవ్వు-- చదరంగం జమిలిగా ఆడుతూ ద్రోణ భీష్మాదులు టీవీ షోలో చిలికించిన నొసటి నవ్వులా.. ఇక వాస్తవానికి వస్తే, కాముల కామేశ్వరరావు భూముల కోటీశ్వరరావులిద్దరూ స్వయాన బావామరదులు కారు. మొదట బడినేస్తాలు- పిమ్మట బాల్యపు మిత్రులు- అటుపిమ్మట వాళ్ళకు వాళ్ళుగా వరసలు కలుపుకుని బావ మరదులుగా మారిపోయారు, మరింత దగ్గరితనం పెంచుకుంటూ--


ఇక మరింత దగ్గరితనం సమకూర్చుకోవా లంటే బంధుత్వం చేకూర్చుకోవడం ఒక్కటే రాజమార్గం, మరైతే ఇద్దరికీ అది నెరవేరే పరిస్థితి కనుచూపు మేర కానరావడం లేదు. 

మొదటి కారణం- వాసుకి కార్పొరేట్ పబ్ అండ్ క్లబ్ వాతావరణంలా పట్టణపు వాసనలు బాగా వంటబట్టాయి. తద్ద్వారా మొహమాటాలకు ప్రతిరూపాలైన పల్లెపట్టు అమ్మాయిల పట్ల వాళ్ళ స్నేహాల పట్ల విముఖత పెంచుకున్నాడు. అంతెందుకు ఫస్ట్ క్లాస్ గ్రాడ్వేట్ అయిన సుందరం పట్ల కూడా అతడు అర్థానికి అందని అదో విధమైన పెడసరం చూపిస్తుంటాడు. సంస్కారవంతు డైన సుందరం ఈ పోకడ గమనించకపోలేదు. కాని— సహనం కోల్పోవడం విజ్ఞుల లక్షణం కాదు కాబట్టి అదేమీ తెలియనట్టు మిన్నకుంటున్నాడు. అతడు కూడా బావమరుదుల రాచకార్యంలో ఒక భాగమేనేమో--- 


ఎట్టకేలకు ఇద్దరూ బస్సు దిగి దొమ్మల గూడెం వేపు దారి తీసే కాలవమ్మట పుట్టిలో ఎక్కి ప్రయాణం సాగించారు. ఎందు కంటే—వర్షాల వల్ల ఏర్పడ్డ మడుగుల వల్ల అటునుంచి బస్సు కోనలమ్మట వెళ్లదు. ఎడ్లబండి కూడా ముందుకు సాగలేదు. అలా కాసేపు నడచిన తరవాత ఏదో గుండ్రటి దొరువు ఎదురైంది. వర్షం బాగా కురవరడం వల్ల బాగా నిండి ఉంది. అటు చేరాలంటే అందులో దిగాల్సిందే! ఇద్దరూ అదే పని చేసారు. నడుం వరకూ ముద్దగా తడిసిపోయారు. 


అప్పుడు నోరు తెరిచాడు వాసు- “ఇది వర్షాకాలం—చెరువులూ దొరువులూ వంకలూ నిండిపోయుంటాయన్నది మీకందరకూ తెలుసు కదా—మీ ఊరేమో దీవుల ప్రాంతాన ఉందన్నది కూడా తెలుసు కదా—మరి నా తరపున మొక్కుబడి అర్పించాలనుకోవడం ఇప్పుడా!


ఇంకా నయం—నేను తలనీలాలు అర్పించాలని గుండు కొట్టించుకోవాలని మీ వాళ్ళు మొక్కుకోలేదు—అలాగ్గాని జరిగి ఢిల్లీ ట్రైనింగ్ హాలులో కూర్చుంటే నా పరువు పూర్తిగా అటకెక్కి పోను- అన్నట్టు అడగాలనుకుంటూనే అడక్కుండా ఉండిపోతున్నాను. ఈ వర్షాకాలం లో మీ ఊరి చుట్టూ ఉత్తరపు సుడిగాలులు చెలరేగిపోతుంటాయి కదూ! ”


సుందరం బదులివ్వలేదు. వాసు సూటు కేసుని అందుకుని తన భుజానకెత్తుకున్నాడు. ఎత్తుకుని నడుస్తూనే అనుకున్నాడు- ‘సుడి గాలులు మాత్రమేనా—పోటు గాని ఎక్కితే నదీ జలాలు గలగల ఊళ్లోకే వచ్చి కంపరం కలిగిస్తాయి. ఇది గాని చెప్తే వాసు ఇంకేమై పోతాడో మరి! ’ అలా ఎక్కుతూ దిగుతూ కొండలూ గుట్టలు దాటుకుంటూ ఊరు చేరుకున్నారిద్దరూ. 


వాసు చేరుకున్న అదే రాత్రి దీవుల ప్రాంతపు చెరువు క్రింది ఊరునుండి అతి జరూరు ఫోను వచ్చింది దానిని అందుకు న్న కాంతమ్మ విషయం విని అదరిపోయింది. కాసేపు చేష్టలుడిగి నిల్చుండిపోయి గట్టిగా కేకేసింది- “ఏమండోయ్! ఇలా వస్తా రా! మీ స్నేహీతుడూ కోటీశ్వరరావు అర్జంటుగా పిలుస్తున్నారు!”


 ”ఏమిటేమిటంటూ పరుగున వచ్చాడు కామేశ్శరరావు. “ఊరు మునిగి పోయే పరిస్థితి వచ్చిందట. తుఫానుగాలులు చెలరేగిపోతూ చెట్లనూ ఇండ్లనూ విరిచేస్తున్నాయట! ” 


“ఏదీ దానిని ఇలా ఇవ్వు. తుఫాను గాలులు వీచే సమయం ఇది కాదే-- “అంటూ ఫోను అందుకున్నాడు కామేశ్వరరావు. ఎటు వంటి ఆశ్చర్యార్ధాలు గాని ప్రశ్నార్థకాలు గాని లేకుండా అంతా విని ముఖం అదోలా పెట్టి భార్య వేపు చూసాడు. 


“అదేంవిటండీ అలా చూస్తారు? అబ్బాయి క్షేమమే కదా! ” 


చిరుకోపంతో స్పందించాడతను- “ఛే! అవేం మాటలే?వాడు బాగానే ఉన్నాడు. మొక్కుబడి కూడా చెల్లించుకున్నాడట. ఎటొచ్చీ వచ్చిన సమస్యల్లా ఒకటే—"

 

“ఏంవిటండీ అది?” కాంతమ్మ గొంతు వణకుతూంది. 


“అమ్మవారు ఉగ్రరూపం దాల్చారట. ఆ ఉగ్రరూపానికి ఊరంతా కంపించి పోతుందట“ ఆమె కండ్లు పెద్దవి చేసుకుని చూసింది- “మరి అమ్మవారికి కోపం వచ్చిందని వీళ్ళకెలా తెలుసట?” 

“ప్రతిసంవత్సరమూ పూనకం ముంచుకు వచ్చే పుణ్యవతి పూనకంతో ఊగిపోతూ భవిష్యవాణి రూపేన చెప్పారట”


 “మరి అమ్మవారి ఉగ్రం తగ్గాలంటే ఏమి చేయాలట?” 


“అమ్మవారి ఆజ్ఞను శిరసావహించాలట లేకపోతే ఊరు ఊరుంతా కొట్టుకుపోతుందుట- ”


“మరి ఏదో ఒకటి వెంటనే చేయిపించమనండి అన్నయ్యను. ఆ తరవాత ఊరు ఏమైతుందో ఎవరు చెప్పొచ్చారు?“


“అది అంతటి తేలికైన ఆజ్ఞలా కనిపించడం లేదు కాంతం! శుభకరమైన మంగళకరమైన కార్యం జరగాలట. అదీను వెంటనే జరగాలట. అమ్మవారి గుడి ప్రాంగణాన జరగాలట-- “


“పుణ్య కార్యమేగా! పూనకం వచ్చిన పుణ్యస్త్రీ సమక్షాన తక్షణం జరిపించేయమనండి“


“చెప్తున్నాగా అది అంతటి తేలికైన వ్యవహారం కాదని. శుధ్ధమైన బ్రహ్మచారికి శుధ్ధమైన కన్యకూ పెండ్లి జరిపించాలట. ఎందుకంటే ఆ ఊళ్ళో చాలా రోజులుగా పుణ్య ప్రద మంగళ కార్యమేదీ జరగలేదని ఊరు వట్టిపోయిందని అమ్మవారి స్వరం భవిష్యవాణి లో వినిపిస్తూందట-- ” 


“దానికేముందండి?ఇప్పుడు ఊళ్ళో వధూవరుల పెండ్లి మరొకటి జరిపించేంస్తే సరి--- “ 


“నువ్వనుకుంటున్నట్టు అమ్మవారి స్వరం అలా వినిపించడంలేదని కోటీశ్వరరావు వాపోతున్నాడు. ఎందుకంటే గుడికి ముఖ్య ధర్మకర్త అతడే- ఇప్పుడు గాని ఊరికి ఉపద్రవం వస్తే అతడిపైనే పడుతుంది” 


“అన్నయ్యగారి బరువు బాధ్యతల గురించి తరవాత చెప్దురు గాని—ఇప్పుడు ఏమి చేస్తే ఊరికి కీడు తప్పుతుందంటుందా దైవ స్వరం?” 


అప్పుడు కామేశ్వరరావు ఆగాడు. భార్యవేపు నిదానంగా చూసి బదులిచ్చాడు- “చెప్తున్నది సరిగ్గా వినిపించుకోనంటావే కాంతం-- నువ్వు గాభరా పడిపోతూ నన్ను గాభరా పెట్టేస్తావు. గుడి ప్రాంగణంలో పెండ్లి ముహూర్తం జరిగి చాలా రోజులయిందట. ఇలా జరగ కుండా ఉండడమ అమంగళమట. అమ్మవారి స్వరం భరింలేనంటుంది” 


“ఇది కూడా పెద్ద సమస్యే—పెళ్ళీడుకొచ్చిన ఇద్దర్ని గర్భగుడి ముందు కూర్చో బెట్టితే సరి—ఇది కూడా ధర్మకర్తగా ఉంటూన్న అన్నగారికి తెలియకపోవడం విడ్డూరంలో కెల్లా విడ్డూరమే! ” 


“ఇక్కడే వచ్చిపడింది అసలు ముసలం. ఇప్పుడక్కడ చుట్టు ప్రక్కల పెళ్లీడుకొచ్చిన జంట ఎక్కడా కనిపించడం లేదట- ఇద్దరు తప్ప”


అదెవరు- అన్నట్టు చూపులు సారించి చూసింది భర్తవేపు కాంతం. 

”వాళ్ళింకెవరో కాదు- మనవాడు వాసు, వాడికి జంటగా కోటీశ్వర రావు పెద్ద కూతురు మంజులాను—”

 ఆమాట విన్నంతనే ఉలిక్కిపడిందామె. “మంజులా! పిల్ల చూడటానికి బాగున్నా పల్లెటూరు వాటం కదండీ! వాడి మాటల్ని బట్టి వాడి చూపులన్నీ ఢిల్లీవేపు ముంబాయి వేపూ హైద్రాబాదు వేపూ ఉన్నట్టున్నాయి. మాటలో మాటగా మొన్నొకసారి ఒక మాట కూడా చెప్పాడు” 

అదేమిటన్నట్టు కనుబొమలెగరేసి చూసాడు కామేశ్వరరావు. 


“వాడి బ్యాచ్ కి చెందిన ముగ్గురమ్మాయిలు వాడితో చనువుగా ఉంటున్నారట. ముగ్గురూ చాలా చలాకీగా డేషింగ్ గా ఉంటారట వాళ్ళల్లో ఒకతెను సెలెక్ట్ చేసుకుంటాడట--”


“ఇప్పుడు మనల్నీ చెరువు క్రింది ఊరునీ ఎదుర్కూంటూన్న ప్రసక్తి సెలెక్షన్ కాదు- డిస్ట్రక్షన్. ఆ డిస్ట్రక్షన్ లో వాసు కూడా ఇరు క్కున్నాడన్నది వాస్తవం” 


“ఇప్పుడు మన మాటకేం గాని—వాసు ఏమంటున్నాడు?” 


“మనిద్దరమూ లేకుండా పెళ్ళి పీటల పైన ససేమిరా కూర్చోనంటున్నాడు. నన్నడిగితే వాడు పాటించేది మర్యాదలు కావు- ముండ్ల కంపల్లాంటి నెపాలూ సాకులూను. ఇంతకీ నన్నేమి చెప్పంటావు? వాసుని రిఫ్యూజ్ చేసెయ్యమని చెప్పమంటావా!”


“వద్దు వద్దు! ఊరు బాగుకోసం వాడాపాటి చేయలేడా! ” అంటూ ఫోను తీసుకుని కొడుక్కి ఆదేశాలిచ్చింది వెంటనే పెళ్ళికి ఒప్పుకుని పెండ్లి పీటల పైన కూర్చోమని. నాశనం కొని తెచ్చుకోకని-- 


దానితో బాత్- ఖతమ్-- 

---------------------------------------------------------------- 

  

పాండ్రంకి సుబ్రమణి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ పాండ్రంకి సుబ్రమణి గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 


ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


1) పేరు-పాండ్రంకి సుబ్రమణి

2)తండ్రి పేరు-పాండ్రంకి నరసియ్య

3) తల్లిపేరు-పాండ్రంకి పైడమ్మ

4)స్వస్థలం-విజయనగరం

5)ఉద్యోగ విరమణచేసి స్థిరపడినది-హైద్రాబాదు

6)సాహితీ నేపథ్యం-కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమైనవి.ఒక నవల సాహితీ కిరణం మాసపత్రికలో మరొక నవల- ఆంధ్రభూమి మాసపత్రికలో ప్రచురించబడ్డాయి.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత బిరుదు పొందారు.






75 views0 comments

Comments


bottom of page