top of page
Writer's pictureSathyanarayana Murthy M R V

ముక్కామల మామయ్య

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.




Video link


'Mukkamala Mamayya' written by M R V Sathyanarayana Murthy

రచన : M R V సత్యనారాయణ మూర్తి

వయసులో ఉన్నపుడు తన సుఖం చూసుకోడానికే సమయం చాలదు. వయసయ్యాక తన పనులు చేసుకోడానికే ఆరోగ్యం సహకరించదు. ఇది సగటు మనిషి జీవన విధానం. ఇందుకు భిన్నంగా ఏ కొద్దిమందో ఉంటారు. అలాంటి ముక్కామల మామయ్య కథని కళ్ళకు కట్టినట్లుగా చూపించారు ప్రముఖ సహజ రచయిత ఎం.ఆర్.వి. సత్యనారాయణ మూర్తి గారు. ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మీకు చదివి వినిపిస్తున్నది మీ మనోజ్.


“ఒరేయ్ కృష్ణా, లే నాన్నా , ఇవాళ మావయ్య వస్తున్నాడురా” అన్న అమ్మ మాట వినగానే మంచం మీద లేచి కూర్చున్నాను.

“నిజమేనా అమ్మా, మావయ్య ఇవాళ వస్తున్నాడా?” సందేహంగా అడిగాను.

“అవును నాన్నా, ఇవాళ తప్పకుండా వస్తానని నిన్న పెరవలిలో నరసింహం మాస్టారికి కనిపించి చెప్పాడుట. రాత్రి మాస్టారు వచ్చి చెప్పారు”నవ్వుతూ చెప్పింది అమ్మ. మావయ్య వస్తున్నాడంటే మాకంటే అమ్మకు ఎక్కువ సంతోషం. తమ్ముడు పుట్టింటి కబుర్లు బోల్డు చెప్తాడని. నేను వెంటనే మంచం దిగి బావి దగ్గరకు వెళ్లాను. అప్పటికే చెల్లాయిలు ఇద్దరూ మొహాలు కడుక్కుని నీళ్ళ పొయ్యి దగ్గర కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. నేను గబా గబా పళ్ళుతోముకుని వాళ్ళ దగ్గరకు చేరాను.


“ముక్కామల మావయ్య వస్తున్నాడట తెలుసా?”అడిగాను వాళ్ళకేసి తిరిగి. వాళ్లు నవ్వారు ఆ సంగతి మాకెప్పుడో తెలుసు అన్నట్టు. అవును వాళ్ళు ఇద్దరూ నాకన్నా ముందే లేచారుగా అన్న సంగతి గుర్తుకొచ్చి, నేనూ నవ్వాను. కాసేపు కబుర్లు చెప్పుకున్నాక, అమ్మ పిలవడంతో చెల్లాయిలు ఇద్దరూ లోపలకు వెళ్ళారు. ఈలోగా నాన్న బావి దగ్గరకు వచ్చారు స్నానం చెయ్యడానికి. నేనూ లోపలకు వెళ్లాను.


కాసేపటికి మా స్నానాలు,చద్ది అన్నాలు తినడం అయ్యాయి. నేనూ, చెల్లాయిలు సావిట్లో కూర్చున్నాం మావయ్య రాక కోసం.తొమ్మిది గంటలు అయ్యేసరికి వీధిలో సైకిల్ బెల్ వినిపించింది. అది మావయ్య సైకిల్ బెల్. నాకు బాగా గుర్తు. నేను వెంటనే వీధిలోకి వెళ్లాను. మావయ్య సైకిల్ దిగి స్టాండ్ వేస్తున్నాడు.


నన్ను చూడగానే”ఏరా కృష్ణా, బాగా చదువుకుంటున్నావా?”అని అడిగాడు.

బాగానే చదువుతున్నట్టు నేను తలాడించాను. నా దృష్టి అంతా మావయ్య మా కోసం తెచ్చే సరుకులు మీదే ఉంది. సైకిల్ కేరేజికి కట్టిన చెరుకు ముక్కలు చూడగానే నా కళ్ళు మెరిశాయి సంతోషంగా. సైకిల్ హేండిల్ బార్ కి తగిలించిన రెండు సంచులలో ఒకటి తీసి నాకు ఇచ్చాడు. నేను ఆ సంచి తీసుకుని లోపలకు వెళ్లాను. మావయ్య కేరేజికి కట్టిన చెరుకు ముక్కలకట్టను విప్పి వాటిని భుజం మీద పెట్టుకుని లోపలకు తీసుకువచ్చాడు.


“ఏరా విశ్వం బాగున్నావా?” ఆప్యాయంగా అడిగింది అమ్మ.

“ఆ బాగున్నానే అక్కా. నువ్వు ఎలా వున్నావ్?”అంటూ భుజం మీది చెరుకు ముక్కల కట్టను కిందకు దింపాడు మావయ్య. అమ్మ ఇచ్చిన మంచినీళ్ళు తాగి బయటకు వచ్చి సైకిల్ కి తగిలించిన రెండో సంచి లోపలకు తీసుకు వచ్చాడు మావయ్య. ఆ సంచి లోపలకు తీసుకురాగానే కమ్మటి వాసన సావిడి అంతా పరుచుకుంది. దాంట్లో కాల్చిన తేగలు ఉన్నాయని నాకు అర్ధం అయ్యింది. మొదటి సంచి లోని సరుకులు ఒక్కోటి బయటకు తీసాడు మావయ్య. ఒక సీసా నిండా నారదబ్బకాయ పచ్చడి, స్టీల్ డబ్బా నిండా తేనెపాకం,మరో డబ్బాలో జంతికలు ఉన్నాయి.


“ఎందుకురా ఇన్ని తెచ్చావ్?”అంది అమ్మ. “పిల్లలు తింటారుగా అక్కా” అన్నాడు మావయ్య నవ్వుతూ.


రెండో సంచీ లోంచి తేగలు, కరివేపాకు బయటకు తీసాడు మావయ్య. నేనూ,చెల్లాయిలు తేగల కేసి చూడటం గమనించాడు మావయ్య.


‘ఒరేయ్ కృష్ణా, చాపా పాత న్యూస్ పేపర్ పట్టుకురా’ అన్నాడు మావయ్య. నేను లోపలకు వెళ్లి తుంగచాప,రెండు పాత న్యూస్ పేపర్లు తెచ్చాను. మావయ్య చాపమీద కూర్చుని, సంచీలోంచి చిన్న కత్తి తీసి తేగల తొక్కు తీసి, తేగల్ని రెండు అంగుళాలు ఉండే ముక్కలుగా చేసి నాకూ, చెల్లాయిలకు ఇచ్చాడు. మేము వాటిని తినడానికి వరండాలోకి వెళ్ళాము. పేపర్ లో ఉన్న తుక్కు అంతా బయటవేసి వచ్చాడు మావయ్య.


అమ్మ తెచ్చిన కాఫీ తాగుతూ అమ్మ అడిగే ప్రశ్నలకు జవాబు చెబ్తున్నాడు మావయ్య. అవన్నీ వరండాలో ఉన్న మాకు వినిపిస్తూనే ఉన్నాయి.

“సింహాద్రి రత్తం గారి రెండో అమ్మాయి సుగుణ వచ్చిందా ఈ మధ్యన?”

“మొన్న అట్లతద్దికి వచ్చింది. నిన్ను అడిగింది. సుగుణ ఇప్పుడు హైదరాబాద్ నుండి చెన్నై వెళ్ళిపోయింది. నీకు చెప్పమంది. మీరు తిరుపతి వస్తే అలా చెన్నై రమ్మనమని చెప్పింది”అన్నాడు మావయ్య.

“కోమట్ల చంటి కనిపిస్తోందా? అది ఖండవల్లి లోనే పనిచేస్తోందా? దాని పిల్లలు ఏం చదువుతున్నారు?”


“ఆ. చంటి ఖండవల్లి లోనే టీచర్ గా చేస్తోంది. పెద్దపిల్ల పదవతరగతి, చిన్న పిల్ల ఏడవతరగతి చదువుతున్నారు. వాళ్ళ ఆయన తణుకు టెక్స్టైల్ మిల్లు లో పనిచేస్తున్నాడు.నిన్ను ఓ సారి ముక్కామల రమ్మనమని చెప్పింది చంటి”కాఫీ గ్లాసు కింద పెట్టి అన్నాడు మావయ్య. చెల్లాయిలు తెగలు తింటూ ఉంటె నేను కిటికీ లోంచి అమ్మా, మావయ్యా ఏం మాట్లాడుకుంటున్నారో చూస్తున్నాను.


నాన్న పూజ పూర్తి చేసుకుని సావిట్లోకి వచ్చారు.”ఏవోయ్ విశ్వం ఎలా వున్నావు?మీ ఆవిడ, పిల్లలూ కులాసానా?”అడిగారు నాన్న.

“అందరం బాగానే ఉన్నాం బావగారూ.ఈ పండగకైనా మీరూ,అక్కయ్య పిల్లలు మా ఊరు రమ్మనమని చెప్పడానికి వచ్చాను”వినయంగా అన్నాడు మావయ్య.

“అలాగే చూద్దాం”అన్నారు నాన్న.


ఇద్దరూ చాలాసేపు కబుర్లు చెప్పుకున్నారు.ఈలోగా ఎవరో పిలిస్తే “ఆ వస్తున్నా” అని

“విశ్వం నువ్వు భోంచేసి వెళ్ళు. నేను బయటకు వెళ్తున్నాను. నేను వచ్చేసరికి ఆలస్యం అవుతుంది”అని హడావిడిగా బయటకు వెళ్లారు నాన్న. అమ్మ వంట చెయ్యడానికి ఇంట్లోకి వెళ్ళింది. మేము తేగలు తినడం పూర్తిచేసి మావయ్య దగ్గర చేరాం.


“మావయ్యా, మీ ఊరికి ముక్కామల అన్న పేరు ఎలా వచ్చింది?”అడిగాను నేను.

“మా ఊరి పేరు ‘ముక్కమల’ అని ఉండేదట. అంటే మూడు కమలపువ్వులు అని అర్ధం. అది జనం పలకడంలో ‘ముక్కామల’ గా మారిందన్న మాట” నవ్వుతూ చెప్పాడు మావయ్య.


“అయితే జనం పలకడం లో తేడా వస్తే ఊరి పేరు నిజంగా మారిపోతుందా?”ఆశ్చర్యంగా అడిగింది పెద్ద చెల్లాయి.

“అవునమ్మా. ఇక్కడకు దగ్గరలోనే పాలకొల్లు ఊరు ఉందిగా..”

మావయ్య మాట పూర్తి కాకుండానే “మా పెద్ద అత్తయ్య వాళ్ళ ఊరు”అంది చెల్లాయి.


“ఆ. అవును. అదే చెప్తున్నాను. పాలకొల్లు అసలు పేరు ‘క్షీరపురి’. జనం సరిగా చెప్పలేక పోవడంతో దానిని ‘పాలకొలను’ అని పిలవసాగారు. రాను రానూ ‘పాలకొలను’ కాస్తా ‘పాలకొల్లు’గా మారిపోయింది. మా ఊరి పేరుతోనే తూర్పు గోదావరి జిల్లాలో ఇంకో ‘ముక్కామల’ ఉంది. దానిని ఇరుసుమండ ముక్కామల అంటారు. మా ఊరిని ‘ఖండవల్లి ముక్కామల’ అంటారు. అంటే ఖండవల్లి పక్కన ఉన్న ముక్కామల అని, ఇరుసుమండ పక్కన ఉన్న ముక్కామల అని అందరికీ తేలిగ్గా అర్ధం కావడానికి అలా చెపుతారన్నమాట” వివరంగా చెప్పాడు మావయ్య.


ఆ తర్వాత చాలాసేపు మా స్కూల్ విషయాలు, పరీక్షలలో మాకు వచ్చిన మార్కులు గురించి అడిగి తెలుసుకున్నాడు మావయ్య. అప్పటికి అమ్మ వంట పూర్తి అయ్యింది.

“విశ్వం నువ్వు భోజనానికి రా. మీ బావగారు వచ్చేసరికి చాలా ఆలస్యం అవుతుంది”అంది అమ్మ. మావయ్యతో పాటు మేము ముగ్గురం కూడా అన్నాలు తిన్నాం. భోజనాల దగ్గర మావయ్య ఎన్నో జోకులు చెప్పి మమ్మల్ని ఎంతో నవ్వించాడు. అందుకే ముక్కామల మావయ్య అంటే మా అందరికీ చాలా ఇష్టం. భోజనం అయ్యాకా ఒక అరగంట ఉండి మావయ్య సైకిల్ ఎక్కి వెళ్ళిపోయాడు.

*****

పాలకొల్లు మా పెద్ద అత్తయ్యకి ఒంట్లో బాగుండలేదని కబురు రావడంతో మావయ్యని రమ్మనమని చెప్పింది అమ్మ. ఒక గంట గడిచేసరికి మావయ్య మా ఇంటిదగ్గర ఉన్నాడు.ముక్కామల నుండి అడ్డదారిలో పిట్టలవేమవరం మీదుగా వచ్చానని చెప్పాడు మావయ్య అమ్మకి.


“మా పెద్ద ఆడపడుచుకి టైఫాయిడ్ జ్వరం వచ్చిందట. ఆయన చేసుకోలేక పోతున్నారట. నేనూ, మీ బావ పాలకొల్లు వెళ్లివస్తాం. నాలుగురోజులు పిల్లల్ని కనిపెట్టుకుని ఉంటావని నీకు ఫోన్ చేసాను”అంది అమ్మ బట్టలు బ్యాగ్ లో సర్దుకుంటూ.

“విశ్వం, మా బావకి ఎవరూ లేరు. అందుకే మేము వెళ్ళకతప్పడంలేదు. నీ మీద ఇంటిభారం పెడుతున్నాను.పిల్లలకు స్కూల్ పోతుందని నీకు అప్పచెబుతున్నాను. మేము రావడం ఆలస్యం అయితే నువ్వు పిల్లల్ని తీసుకుని ముక్కామల వెళ్ళిపో. నేను తర్వాత వచ్చి వాళ్ళను ఇక్కడకు తీసుకువస్తాను” అన్నారు నాన్న.


“ఫర్వాలేదు బావగారూ, నేను పిల్లల్ని జాగ్రత్తగా చూస్తాను. మీరు వెళ్ళిరండి” అన్నాడు మావయ్య. అమ్మా,నాన్న బ్యాగులు తీసుకుని పాలకొల్లు వెళ్ళారు. వాళ్ళు వెళ్ళగానే మావయ్య వంటింట్లోకి వెళ్లి కూరలు, సరుకులు అన్నీ చెక్ చేసుకున్నాడు. తర్వాత మాదగ్గరకు వచ్చి మాకు ఇష్టమైన కూరలు అడిగి తెలుసుకుని ఒక గంటలో చక చకా వంటచేసాడు మావయ్య.


మేము ఆశ్చర్య పోయాం ఆ స్పీడ్ కి. అమ్మ కూడా అంత స్పీడ్ గా వంట చెయ్యలేదు.అప్పడాలు,వడియాలు వేయించి మమ్మల్ని భోజనానికి పిలిచాడు మావయ్య. కూరలు చాలా బాగున్నాయి. ముఖ్యంగా ములక్కాడ వేసి చేసిన పప్పు పులుసు మా ముగ్గురికీ బాగా నచ్చింది. ఆ రోజు ఆదివారం. స్కూల్ లేదు. మధ్యాహ్నం భోజనాలు అయ్యాకా కాసేపు వైకుంఠపాళీ ఆడుకున్నాము. తర్వాత ‘దాడి’ ఆట మాకు నేర్పాడు మావయ్య. సాయంకాలం బావిలోని నీళ్ళు తోడి మొక్కలకు పోశాడు. మేము కూడా చెంబులతో నీళ్ళు తీసుకువెళ్ళి మొక్కలకు పోశాం.


రాత్రి భోజనాలు అయ్యాక మాకు ‘పంచ తంత్రం’ కథలు చెప్పాడు మావయ్య. అవి వింటూనే మేము నిద్ర పోయాం.మర్నాడు స్నానాలు అయ్యాక చెల్లాయిలు ఇద్దరికీ మావయ్యే జెడలు వేసాడు. మావయ్యకి ఇద్దరూ మొగపిల్లలే. ఆడపిల్లలు లేరు. అదే నాకు ఆశ్చర్యం కలిగించింది.


“మావయ్యా, నీకు ఇవన్నీ ఎలా తెలుసు?” అడిగాను నేను.

“ఇదేమైనా బ్రహ్మ విద్యేమిటిరా? ఒక సారి చూసి నేర్చుకోవడమే”నవ్వుతూ అన్నాడు మావయ్య.


నేను హై స్కూల్ లో ఏడవతరగతి చదువుతున్నాను. పెద్ద చెల్లాయి అయిదవతరగతి, చిన్న చెల్లాయి మూడవతరగతి చదువుతున్నాం. ఎలిమెంటరీ స్కూల్ మా వీధి చివరే ఉంది. చెల్లాయిలు మధ్యాహ్నం భోజనానికి ఇంటికే వస్తారు. నాకు కేరేజి సర్ది ఇచ్చాడు. చెల్లాయిల్ని స్కూల్ లో దింపి వచ్చాడు. ఒక పక్క వంట, మరో పక్క మమ్మల్ని చూసుకోవడం అవలీలగా చేస్తున్న మావయ్యని చూసి నేను చాలా నేర్చుకున్నాను.

వారం రోజుల తర్వాత అమ్మా,నాన్న వచ్చారు పాలకొల్లు నుంచి. రాగానే అమ్మ అడిగింది “విశ్వం, పిల్లలు నిన్ను ఇబ్బంది పెట్టారా?”అని.


“మీ పిల్లలు బంగారం అక్కా. చాలా బుద్ధిమంతులు” అన్నాడు మావయ్య. మధ్యాహ్నం భోజనం చేసి మావయ్య యధాప్రకారం తన సైకిల్ మీద ముక్కామల వెళ్ళిపోయాడు. మావయ్య లోని ఓర్పు, పని పట్ల నిబద్ధత నాలో బలంగా ముద్ర వేశాయి.

*****

నేను డిగ్రీ పూర్తి అయ్యాక ముక్కామల స్కూటర్ మీద వెళ్ళాను. మామయ్యకు చెప్పలేదు నేను ముక్కామల వస్తున్నానని. మావయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళకుండా మావయ్య పనిచేసే పాలెం స్కూల్ కి వెళ్ళాను. మావయ్య లేడు.ఆయన అసిస్టెంట్ ఉన్నారు

“విశ్వనాధం మాస్టారు లేరా?”అడిగాను ఆయన్ని.


“లేరండి. ఈ రోజు సెలవు పెట్టారు.మీరు ...”అంటూ ఆగారు ఆయన.

“నేను ఆయన మేనల్లుడిని. మాది పెనుగొండ”అన్నాను.

“అలాగా. రండి కూర్చోండి” అని ఆహ్వానించి కుర్చీ చూపించారు. నేను కుర్చీ పక్కనే ఉన్న భోషాణం పెట్టె మీద కూర్చున్నాను.

“అయ్యో. కుర్చీ లో కూర్చోండి” అన్నారు ఆయన నొచ్చుకుంటూ.


“ఆ కుర్చీ ఉపాద్యాయులు కూర్చొనే కుర్చీ. మాలాంటి వాళ్ళు అందులో కూర్చోకూడదు” అన్నాను చిన్నగా నవ్వుతూ. స్కూల్ అంతా పరిశీలించాను. పొడువుగా ఉన్న సిమెంట్ భవనం. మధ్యలో పార్టిషన్ గా వెదురు తడకలు కట్టారు. ఆ తడకలకు న్యూస్ పేపర్లు అంటించి ఉన్నాయి. దేశనాయకుల, స్వాతంత్ర సమరయోదుల, ప్రముఖ కవుల చిత్రపటాలు అట్టల మీద అంటించి తడకలకు వేలాడదీశారు.


గోడలమీద ‘సత్యమేవ జయతే’ వంటి సూక్తులు రాసి ఉన్నాయి. నా పరిశీలన గ్రహించిన మాస్టారు “ఈ బిల్డింగ్ కోసం విశ్వం మాస్టారు చాలా కష్టపడ్డారు సార్. ఇంతక్రితం ఈ స్కూల్ సిమెంట్ రేకుల షెడ్ లో ఉండేది.వర్షాకాలం వస్తే చాలా ఇబ్బందిగా ఉండేది.కప్పుకి ఉన్న కన్నాలనుండి వర్షం నీరు లోపలకు వచ్చేది. మాస్టారు రెండు సార్లు స్వంత డబ్బులతో సిమెంట్ రేకులు మార్పించారు. పెరవలి మండల పరిషత్ ఆఫీస్ కి, ఏలూరు జిల్లా పరిషత్ ఆఫీస్ కి చాలా సార్లు తిరిగి కొత్త బిల్డింగ్ సాంక్షన్ చేయుంచుకుని వచ్చారు మాస్టారు.


‘ఎందుకు మాస్టారు ఇలా స్వంత డబ్బులు ఖర్చుపెడతారు స్కూల్ కోసం?’అని నేను ఒకసారి ఆయన్ని అడిగాను. దానికి విశ్వం మాష్టారు చెప్పిన సమాధానం నన్ను ఆశ్చర్యపరచింది”అన్నారు అసిస్టెంట్.

“ఏమన్నారు మా మావయ్య”ఆసక్తిగా అడిగాను నేను.


“శేఖరం గారూ, విద్యాలయం అనేది ఒక పవిత్రమైన వృక్షం లాంటిది. ఆ చెట్టు నీడలో సేద తీరేవారు విద్యార్దులు. బతికేది మనం. చెట్టు బాగుంటేనే మనం బాగుంటాం. అది మరచిపోకూడదు. నేనూ నా కుటుంబం బతుకుతున్నాం అంటే ఈ స్కూల్ వలెనే. అది నేను ఎప్పుడూ మర్చిపోను. మన ఇంట్లోకి వర్షం వస్తే మన ఇల్లు బాగు చేయుంచుకోమా? ఇదీ అంతే. అన్నారు విశ్వం మాస్టారు”ఒక విధమైన భావోద్వేగానికి లోనై అన్నారు శేఖరం మాస్టారు. నేనూ మాస్టారికేసి అలా చూస్తూ ఉండిపోయాను.స్కూల్ పట్ల అంతటి పవిత్రమైన భావం ఎంతమందికి ఉంటుంది? అనుకుని నిట్టూర్చాను.


కాసేపు మాట్లాడిన తర్వాత శేఖరం మాస్టారు అన్నారు “మీ మావయ్య గారు ఎవరికో రక్తదానం చెయ్యడానికి తాడేపల్లిగూడెం వెళ్ళారు” అని.

నేను మరింత ఆశ్చర్యపోయాను.స్కూల్ కి శెలవు పెట్టుకుని రక్తదానం చెయ్యడానికి సుమారు ముప్ఫైఐదు కిలోమీటర్లు వెళ్ళాడా మావయ్య?’ యు ఆర్ గ్రేట్ మావయ్యా ’అని మనసులోనే ఆయన్ని అభినందించాను.


ఒక అరగంట అయ్యాకా పాలెం నుంచి బయల్దేరి ముక్కామల మావయ్య ఇంటికి వచ్చాను. అత్తయ్య వంట చేస్తోంది. నన్ను చూసి చాలా సంతోషించింది.”రా కృష్ణా, బాగున్నావా?డిగ్రీ పాస్ అయ్యావుటగా.సంతోషం”అని లోపలకు వెళ్లి ఒక మినపసున్ని ఉండ తెచ్చి ఇచ్చింది. అమ్మ ఆరోగ్యం గురించి,చెల్లాయిల చదువుల గురించి వివరాలు అడిగింది.కబుర్లు చెబుతూనే వంట పూర్తి చేసింది.


“రా కృష్ణా.భోజనం చేద్దువుగాని. మీ మావయ్య గూడెం వెళ్ళారు పని ఉందని.రావడానికి ఆలస్యం అవుతుందని అన్నారు”అని నాకు భోజనం పెట్టింది అత్తయ్య. భోజనం చేసి టి.వి. చూస్తూ కూర్చున్నాను.


మధ్యాహ్నం రెండు గంటలకు మావయ్య వచ్చాడు. మావయ్య, అత్తయ్య భోజనాలు అయ్యాక మావయ్య సావిట్లోకి వచ్చి నా పక్కనే కూర్చున్నాడు.

“డిగ్రీ అయ్యింది. మరి తర్వాత ఏమి చేద్దామనుకుంటున్నావు?”నవ్వుతూ అడిగాడు మావయ్య.


“బ్యాంకు పరీక్షలు రాద్దామనుకుంటున్నాను” నెమ్మదిగా అన్నాను.

“మరి పి.జి.చెయ్యవా?”అడిగాడు మావయ్య.

“చెల్లాయిలు ఎదుగుతున్నారు.వాళ్లకు పెళ్ళిళ్ళు చెయ్యాలి. నాన్న మీద ఇంకా భారం పెట్ట దలచుకోలేదు”


“మంచి ఆలోచన. ఉద్యోగం వచ్చాకా ప్రైవేటుగా పి.జి.చెయ్యవచ్చు”అన్నాడు మావయ్య నా భుజం తట్టి. “మావయ్యా,మీ స్కూల్ చూసాను.చాలా బాగుంది”అన్నాను. నవ్వి ఊరుకున్నాడు మావయ్య. ఒక గంట ఉండి స్కూటర్ మీద ఇంటికి వచ్చేసాను.


ఒక ఆరునెలలు కష్టపడి చదివాను. బ్యాంకు పరీక్షలలో ఉత్తీర్ణత పొంది భీమవరం బ్యాంకు లో ఉద్యోగం సంపాదించాను.మావయ్య సలహా మీద సగం జీతం ఖర్చుపెట్టుకుని, మిగతా సగం బ్యాంకులో పొదుపు చేసాను. పెద్ద చెల్లాయి పెళ్ళికి నాన్నకు ఇరవైఐదు వేలు ఇచ్చాను. అలాగే చిన్న చెల్లాయి పెళ్ళికి కూడా ఇరవైఐదు వేలు ఇచ్చాను.మావయ్య చెల్లాయిల పెళ్లిళ్లకు వచ్చి చాలా సాయం చేసాడు. వాళ్ళ పెళ్ళిళ్ళు అయిన రెండేళ్లకు మా బ్యాంకు లో పనిచేసే మాధురిని పెళ్లి చేసుకున్నాను.


ఆ తర్వాత జీవితం చాలా బిజీ అయిపొయింది. మావయ్య పిల్లల పెళ్లిళ్లకు వెళ్ళడమే తప్ప, మళ్ళీ ముక్కామల వెళ్ళలేదు.మావయ్య పిల్లలు ఇద్దరూ లెక్చరర్లుగా స్థిరపడ్డారు.పెద్దాడు రాజమండ్రి లో, చిన్నాడు తణుకులో. మావయ్య కూడా టీచర్ గా రిటైర్ అయ్యాడు. అయినా ప్రజా సేవ మానలేదు. ముక్కామల, నల్లకులవారి పాలెం, పెరవలి గ్రామాలలో పేద వారిచేత పోస్ట్ ఆఫీస్ లో రికరింగ్ డిపాజిట్ కట్టించి, డిపాజిట్ మెచ్యూర్ అయ్యాకా ఆ మొత్తాన్ని పొదుపు సర్టిఫికేట్ గా మార్చి వారికి ఎంతో అండగా ఉండేవాడు.ఇంటింటికీ వెళ్లి వాళ్ళ దగ్గర వాయిదాలు సేకరించే వాడు. కేవలం కూలి పనిమీదే జీవించే ఆ పేదలు ఒకోసారి వాయిదా కట్టలేకపొతే తన డబ్బులతో వారి వాయిదా తనే కట్టి, వాళ్ళు ఎప్పుడు ఇస్తే అప్పుడు ఆ వాయిదా డబ్బులు తీసుకునేవాడు.

ఒకరోజు సైకిల్ మీద నల్లాకులవారి పాలెం వెళ్లి వస్తుంటే లైట్ లేకుండా వచ్చిన మోటారిస్ట్ మావయ్యని గుద్దేసి వెళ్ళిపోయాడు. మావయ్య కుడిచేతికి ఫ్రాక్చర్ అయ్యింది. చిన్నాడు వచ్చి మావయ్యని అత్తయ్యని తీసుకుని తణుకు వచ్చేసాడు.


అప్పటి నుంచి మావయ్య సైకిల్ ప్రయాణం ఆగి పోయింది. చెయ్యి బాగా తగ్గాకా, ఆటో మీదే తణుకు నుండి వచ్చి పేదల దగ్గర పోస్టల్ ఆర్.డి.లు కట్టిస్తున్నాడని అమ్మ చెప్పింది. అప్పుడు నేను వైజాగ్ లో పనిచేస్తున్నాను. హెడ్ కేషియర్ గా ప్రమోషన్ వచ్చింది.ఖాళీ లేక వెళ్ళలేకపోయాను.ఫోన్ లోనే మావయ్యని పలకరించాను.

******

నాలుగేళ్ళు గడిచాయి. ఒకరోజు మధ్యాహ్నం రెండు గంటలకు అమ్మ దగ్గరనుంచి ఫోన్. సాధారణంగా ఆ సమయంలో అమ్మ ఫోన్ చెయ్యదు. చేస్తే ఉదయం లేదా సాయంత్రం వేళలలో చేస్తుంది.


“అమ్మా. నువ్వూ నాన్నా కులాసాయా?”అడిగాను.

“ఆ. మేం బాగానే ఉన్నాం. విశ్వం మావయ్య రైల్ ఎక్కుతూ పడిపోయాడుట. హాస్పిటల్ లో ఉన్నాడుట. నేనూ,నాన్న తణుకు వెళ్తున్నాం”కంగారుగా అంది అమ్మ.

“అయ్యో.అలాగా. మాకు బ్యాంకు లో ఆడిట్ ఇవాళా,రేపూ. నేను కదలటానికి కుదరదు. మీరు వెళ్ళిరండి.రాత్రి మాట్లాడతాను”అని ఫోన్ కట్ చేసాను. నా మనసు అంతా బాధగా ఉంది. నేను వెళ్ళలేక పోతున్నానని. కానీ డ్యూటీ తప్పదుగా. మనసు సమాధానపరచుకుని ఆడిట్ పనిలో నిమగ్నమయ్యాను.


రాత్రి ఎనిమిది గంటలకు అమ్మకు ఫోన్ చేసాను. ఫోన్ తీయగానే అమ్మ పెద్దగా ఏడుపు మొదలు పెట్టింది.”ఏమయ్యింది అమ్మా, మావయ్యకి ఎలా ఉంది?”ఆందోళనగా అడిగాను.


“ఏం చెప్పమంటావు?రైల్ ఎక్కుతూఉంటె ఎవరో గెంటుకుంటూ వెళ్ళిపోయారుట.మావయ్య రైలు కింద పడిపోయాడు. రైలు వెళ్ళిపోయింది. కుడి కాలు చితికిపోయింది. మోకాలు వరకూ తీసేసారు. వాడి బతుకు, అవిటిబతుకు అయిపొయింది”బాధగా చెప్పింది అమ్మ. నా మనసు కకా వికలం అయ్యింది.


ఆరోజు భోజనం చెయ్యలేదు. మావయ్య ఎంతో హుషారుగా సైకిల్ మీద మా ఇంటికి రావడం, మాకు కావాల్సినవి తేవడం, నన్ను సైకిల్ ఎక్కించుకుని ముక్కామల గోదావరి ఒడ్డున తిప్పడం అన్నీ గుర్తుకు వచ్చాయి. అర్ధరాత్రి దాటాకా నిద్ర పట్ట్టింది. మర్నాడు మళ్ళీ ఆడిట్ డ్యూటీ. తర్వాత మరో రెండు రోజులు గడిచాకా వైజాగ్ నుంచి తణుకు బస్సు లో వెళ్లాను.


హాస్పిటల్ బెడ్ మీద ఉన్నాడు మావయ్య.నడుం వరకూ దుప్పటి కప్పి ఉంది. ఆ దృశ్యం చూడగానే నా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. “ఏరా కృష్ణా ఎలా వున్నావ్?ఆడిట్ అయిపోయిందా?” అడిగాడు మావయ్య. మౌనంగా తలూపాను. అత్తయ్య కేసి తిరిగాను ఎలా జరిగింది అన్నట్టు.


“ఏం చెప్పమంటావ్ నాయనా, భీమవరంలో ఎవరికో రక్తం కావాలని పేపర్ లో వేసారట. అందుకని బయల్దేరారు. ఇలా అయ్యారు. రిటైర్ అయ్యారు కదా. ఒక చోట కుదురుగా ఉండమంటే వినరు. అంతా మా ఖర్మ” అత్తయ్య చీర చెంగుతో కళ్ళు వత్తుకుంది.


“ఆ రోజు అలా జరగాలని ఉంది అలా జరిగింది.దానికి బాధపడి ఏం చేస్తాం?కానీ ఆ కుర్రాడికి నేను రక్తం ఇవ్వలేకపోయాను”అన్నాడు మావయ్య. నేను ఆశ్చర్యపోయాను. తన ప్రస్తుత స్థితికి చింతించడం లేదు. ఆ కుర్రాడికి తను సాయం చేయలేకపోయానని బాధపడుతున్నాడు.నిజంగా ఎంతటి ఉన్నతమైన మనస్సు. ‘నువ్వు నువ్వే మావయ్యా’ అని మావయ్యకేసి ఆరాధనా పూర్వకంగా చూసాను. ఒక గంట ఉండి , వైజాగ్ వచ్చేసాను.

తర్వాత ఎప్పుడో అమ్మ చెప్పింది.మావయ్య జైపూర్ కాలు పెట్టించుకున్నాడని, అత్తయ్య, పిల్లలు తణుకు వదిలి వెళ్ళకుండా మావయ్యని కట్టడి చేసారని. పిల్లల చదువులు హడావిడి, నాకు మేనేజర్ గా ప్రమోషన్ రావడం ఈ హడావిడిలో మావయ్య గురించి ఎక్కువ తెలుసుకోలేక పోయాను. ఏడాది గడిచాక మావయ్యని చూడటానికి తణుకు వెళ్లాను. మావయ్య ఇంటి దగ్గరలేడు.అత్తయ్యే ఉంది.


“మావయ్య ఎలా ఉన్నారు?బయటకు వెళ్ళారా?”అత్తయ్యని అడిగాను. కాఫీ

పట్ట్టుకుని వచ్చింది.


“బాగానే ఉన్నారు కృష్ణా. బయటకు వెళ్ళారు.ఒంటి గంటకు కానీ రారు.స్టేట్ బ్యాంకు దగ్గర ఉంటారు. ఇదిగో ఈసారి నువ్వు భోజనం చెయ్యకుండా వెళ్ళడానికి వీల్లేదు. పొద్దున్నే పనసపొట్టు కొన్నాను. నీ కోసం ఆవ పెట్టి వండుతాను.గుమ్మడి వడియాలు,కూర వడియాలు వేయిస్తాను”అంది నవ్వుతూ అత్తయ్య. కాఫీ తాగి బయటకు వచ్చి స్టేట్ బ్యాంకు కేసి బయల్దేరాను. తణుకు చాలా మారిపోయింది.బజార్ నిండా నాయకుల విగ్రహాలు పెట్టారు. హై స్కూల్ దగ్గర అబ్దుల్ కలాం గారి విగ్రహం చూసి అప్రయత్నంగా నా పెదవులపై చిరునవ్వు విరిసింది. భారతదేశం గర్వించదగ్గ గొప్ప శాస్త్రవేత్త, నాయకుడు అని తలుచుకుని ఒక్క క్షణం ఆగి ఆయనకు సెల్యూట్ చేసి ముందుకు సాగాను.


స్టేట్ బ్యాంకు ముందు చాలా వాహనాలు పార్క్ చేసి ఉన్నాయి. వాటి మధ్య నుంచి నెమ్మదిగా లోపలకు వెళ్లాను. పెద్ద వరండాలో చివర బెంచీ మీద కూర్చుని ఉన్నాడు మావయ్య. చుట్టూ జనం. దగ్గరకు వెళ్లి చూసాను.పెద్దగా చదువులేని వారికి డిపాజిట్ ఫారాలు, డబ్బు తీసుకునే ఫారాలు పూర్తిచేసి ఇస్తున్నాడు. ‘మాస్టారు నాది చెయ్యండి అంటే ,నాది చెయ్యండి’ అని అడుగుతున్నారు వాళ్ళు. ఇప్పటికీ చాలా మంది ఫారాలు తప్పుగా పూర్తి చేస్తున్నారు. సరిగా పూర్తి చేసి ఇవ్వండని మేము కౌంటర్ నుంచి వాళ్లకు తిరిగి ఇస్తూ ఉంటాం.


ఎందుకో నాకో చిలిపి ఆలోచన వచ్చింది. బెంచీ కి ఈ చివర కూర్చుని కొంత మంది దగ్గర ఫారాలు తీసుకుని పూర్తిచేసి ఇవ్వడం ప్రారంభించాను. మావయ్యకు నా మొహం కనిపించకుండా అడ్డం తిరిగి కూర్చున్నాను. అరగంట గడిచేసరికి జనం తగ్గారు.నా దగ్గర ఇద్దరు వున్నారు. మావయ్య దగ్గర ఒక్కరే ఉన్నారు. అతనికి ఫారం పూర్తిచేసి ఇచ్చి మావయ్య బాటిల్ లోంచి మంచినీళ్ళు తాగుతున్నాడు.నేను ఆ ఇద్దర్నీ పంపేసి మావయ్యకేసి తిరిగాను. నన్ను అక్కడ చూసి ఆశ్చర్యపోయాడు.


’కృష్ణా నువ్వా?’అన్నాడు. నవ్వుతూ మావయ్య దగ్గరకు వెళ్లాను. హ్యాండ్ స్టిక్ గోడకు చేర్చి ఉంది. వదులుగా ఉన్న ఫాంట్ లోంచి జైపూర్ కాలు కనపడగానే నా మనసు బాధగా మూలిగింది.


“ఎప్పుడు వచ్చావ్?”ఆప్యాయంగా భుజం మీద చేయివేసి అడిగాడు.’ఒక గంట అయ్యింది.ఇంటికి వెళ్తే అత్తయ్య చెప్పింది నువ్వు ఇక్కడ ఉంటావని. ఎలా వుంది ఆరోగ్యం?’అడిగాను. బాగుంది అన్నట్టు తలాడించాడు. కాసేపు కబుర్లు చెప్పుకున్నాక మళ్ళీ జనం వచ్చారు. నేను కూడా ఫారాలు నింపుతుంటే ‘నువ్వు ఇంటికి వెళ్ళిపో కృష్ణా, నేను తర్వాత వస్తాను’అన్నాడు మావయ్య. నేను ఏం మాట్లాడకుండా ఫారాలు నింపి ఇస్తున్నాను. అలా ఒంటి గంటవరకూ జరిగింది. ఇద్దరం కల్సి ఆటోలో ఇంటికి వచ్చాం.

మావయ్య కొడుకు రామం నా కోసం ఎదురుచూస్తున్నాడు. ‘బావా, కులాసానా?’అని పలకరించాడు. అందరం కలిసి భోజనాలు చేసాం. రామం కాలేజీ కి వెళ్ళిపోయాడు.

“పొద్దున్న కాలక్షేపం బాగుంది. మరి సాయంత్రం ఏం చేస్తావ్?లైబ్రరీ కి వెళ్తావా?”అడిగాను.


“సాయంకాలం పార్క్ కి వెళ్తాను. అక్కడికి వచ్చే పిల్లలకు దేశభక్తి గీతాలు నేర్పుతాను.కృష్ణా, మనిషి రాను రానూ స్వార్ధ జీవి అయిపోతున్నాడు.తనూ,తన కుటుంబమే బాగుంటే చాలు ననుకుంటున్నాడు.దేశం గురించి అస్సలు పట్టించుకోవడం లేదు. అందుకే ,చిన్నతనం నుండే దేశభక్తి భావాలు పిల్లలలో నాటుకునేటట్టు చేయాలని సంకల్పించాను” గోడకున్న భారతమాత పటం కేసి చూస్తూ అన్నాడు.


ఈరోజుల్లో కొంతమంది వృద్ధులు పార్క్ కి వస్తారు. అనవసరపు మాటలు, తమ గత జీవిత వైభవాలు, తమ పిల్లల గొప్పలు, షేర్లు గురించి, బ్యాంకు వడ్డీల గురించే మాట్లాడుకుంటారు. ఎదుటివారి సంసారాల లోని లోటుపాట్లు గురించి విమర్శిస్తూ ఉంటారు. చీకటి పడగానే ఇళ్ళకు వెళ్తారు.అలా కాలం వెళ్లదీస్తున్నారు. కాలాన్ని వృధా చేస్తున్నామని అనుకోరు. మరి మావయ్య? తన గురించి ఆలోచించడు.


సమాజం గురించి ,దేశం గురించి ఆలోచిస్తాడు. కాలాన్ని సద్వినియోగం చేస్తున్నాడు. నిజమే మావయ్య అంటే కాలాన్ని జయించిన మనిషి. ‘హేట్సాఫ్ మావయ్యా‘ అనుకుంటూ మావయ్యకేసే చూస్తూఉండిపోయాను నేను.


***శుభం***

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలు :


రచయిత పరిచయం : సత్యనారాయణ మూర్తి M R V


ఎమ్. ఆర్. వి. సత్యనారాయణ మూర్తి. పెనుగొండ. పశ్చిమ గోదావరి జిల్లా. కవి, రచయిత, వ్యాఖ్యాత, రేడియో ఆర్టిస్టు. కొన్ని కథల పుస్తకాలు, కవితల పుస్తకాలు ప్రచురితం అయ్యాయి. కొన్ని కథలకు బహుమతులు కూడా వచ్చాయి. రేడియోలో 25 కథలు ప్రసార‌మయ్యాయి. 20 రేడియో నాటికలకు గాత్ర ధారణ చేసారు. కవితలు, కథలు కన్నడ భాషలోకి అనువాదం అయ్యాయి.



80 views0 comments

Comments


bottom of page