ముమూర్షువు
- Sudarsana Rao Pochampalli
- Sep 20, 2023
- 6 min read

'Mumurshuvu' - New Telugu Story Written By Sudarsana Rao Pochampally
'ముమూర్షువు' తెలుగు కథ
రచన: సుదర్శన రావు పోచంపల్లి
మనిషి పుట్టిన నాటినుండి మరణమొందే కాలాన్ని జీవితమంటరు. ఆ జీవిత కాలాన్ని ప్రకృతి నిర్ణయించింది 100 సంవత్సరాలు అంటే 36525 రోజులు. ఐతె పుట్టబోయే మనిషి మాత్రు గర్భమునుండే మృతజీవిగా బయట పడవచ్చు. లేదా జన్మించిన పిదప ఏక్షణమైనా మరణించవచ్చు అది మనిషి చేతిలో లేదు. అత్యధిక జీవిత కాలము సాధారణంగా నూరు సంవత్సరాలైన ఇంకా కొంత కాలము జీవించే అవకాశాలు కూడా లేక పోలేదు.
ఇక మరణానికి కారణాలు కోకొల్లలు.
మనిషి పుట్టి తలిదండ్రుల పోషణలో పెరిగే కాలమువరకు అస్వతంత్రుడు. స్వంత బ్రతుకు బ్రతికే అవకాశము తోడుగ నేనెవరిని- నా బాధ్యతలేమిటి నా వ్యవహారమేమిటి అనే ఆలోచనా సుడిగుండములో చిక్కుకోకముందే సమాజ నడవడి మనిషికి జీవన మార్గము నేర్పుతుంది. ఐనా కొంత మందిలో ఆ ఆలోచనా ధోరణి పొడ చూపవచ్చు.
చదువు - సంస్కారము, బరువు - బాధ్యతలు, ప్రేమ - అనురాగాలు, కక్షలు - కార్పణ్యాలు.. ఇవన్ని జీవిత మార్గములో కలిగే అనుభవ సత్యాలు, ఒడిదుడుకులు.
జీవితము మీద ఏవగింపునకు కారణాలు కూడ అధికమే. తాను నమ్మిన సిద్ధాంతాలకు వ్యతిరేకంగా సమాజము నడుస్తున్నందుకు- తాను జీవితములో అప్రయోజకునని తానే నిర్ణయించుకోవడము.
అత్యంత ఆత్మీయులను కోల్పోవడము లేదా దూరము కావడము, సమాజముచే నిందించబడడము, తాను తలచిన కార్యము సిద్ధించక పోవడము, ఎక్కడో ఒక చోట మోసపోవడము, తానిచ్చిన మాట నిలబెట్టుకోలేక పోవడము, పరాధీన బ్రతుకు కావడము, చదివే చదువు ఒంటబట్టక పోవడము, తల్లి దండ్రుల దండన సహించ లేక పోవడము, భార్యా పిల్లలు తూష్ణీంభావము, నిర్లక్ష్యము చేయబడడము.
న తథా రిపు న శస్త్రం న అగ్ని న విషం న దారుణో వ్యాధి
పరితాపియత పురుషం యథా కటుక భాషిణీ వాణీ.
అంటె మనిషికి శతృవుకన్నా, ఆయుధముకన్నా, నిప్పుకన్నా, విషం కన్నా భయంకరమైన రోగముకన్నా ఒక కఠినమైన భాష వ్యాకులానికి గురిచేస్తది.
పెళ్ళి కాక పోవడము, సంతానము కలుగక పోవడము. ధనము పోగొట్టుకోవడము లెదా పంటలు పండక పోవడము. సంతానము ప్రయోజకులు కాక పోవడము. సంతానానికి పెళ్ళిళ్ళు కాకపోవడము. కొన్ని సంధర్భాలలో నిందలకు గురికావడము. ఏ పనీ చేత కాక పోవడము. సదా రోగగ్రస్తుడు కావడము. సంతానము కొని తెచ్చే అవమానాలు. అధికారి విధించే శిక్షలు. దుర్భాషలు- ఇత్యాదివన్ని మానసిక బలహీనతలకు గురియై ఆత్మ న్యూనతభావానికి లోనై ఇక ఈ లోకములో బ్రతుక కూడదను నిర్ణయానికి రావడానికి కారణ భూతములు.
వారాశి తరంగములుగా కొందరి మనో వ్యథలు వెనుకకు ముందుకు అడుగులేస్తున్నా అవి వ్యథా భరితోద్భవములేకాని అవిమృశ్యకారితనము కాదు. ముమూర్షువుది మాత్రము ఏకైక సిద్ధాంతము ఏమిటంటే ఈ జగము నుండి జారుకోవాలనే ధ్యాసమాత్రమే. అది ఒక ఉన్మాద భరిత వాంఛ. అది ఏ హితబోధకు లొంగక పోవచ్చు. కాని అతని భీరుత్వమే అతనికి ఆయుష్షు పోస్తుంది.
ఆధ్యాత్మిక భావన తో భగవంతుని సంపూర్ణంగా నమ్మినవారు ప్రాపంచిక సుఖాలకన్నా పునర్జన్మలేకుండా భగవంతునిలో లీనమవ్వాలనే తలంపు కలవారు కొందరు ఆ కోరిక తీరాలని నిత్యము భగవంతుని ప్రార్థిస్తూనే ఉండి సదా దైవపూజలో నిమగ్నమై ఐహిక సుఖాలకు దూరంగా ఉంటారు. కాని మరణము వెంటనే కోరుకోరు.
ముమూర్షువు. ముముక్షువు ఇద్దరూ నరజాతి జీవులే. ముమూర్షువు మరణాధిదేవతనారాధిస్తె ముముక్షువు మోక్షసాధనకొరకు సకల దేవతలనారాధిస్తాడు.
యమఘంటికానాదమిన కౌతూహలము ముమూర్షువుదైతె.
కోవెల గంటల శబ్ధ చింతన ముముక్షువుది.
జీవేఛ్చ గలవారు మాత్రము పురుషులైతే యుక్త వయసులో ఎన్నెన్నో ఆశా సౌధాలు నిర్మించుకుంటారు. స్త్రీల పట్ల వ్యామోహము మెండై ఏ లలనామణి కంటబడ్డా కవితలు ముంచుకొచ్చి అంగాంగ వర్ణలతో ఆత్మ సంతృప్తి చెంది ఆ మగువ తన జీవిత భాగస్వామి కావాలని తలంచుతాడు. ఆమే ఒప్పులకుప్పైతె ఇక వర్ణనకు హద్దుండదు.
పలు వలువలు బింబ ఫలములు
విశ్వంకరములు వైసారిణములు
సంఘాటిక స్థిరగంధము
ద్విజన్మములు మృగేష్టములు
చర్మజములు కలాపములు
అంతరాళము సంగ్రహ ప్రమాణము
గండములు లతామణులు
శిరోధరము షోడశావర్తము
ప్రగండములు మందార మాలలు
అభివీక్షణములు రసతూపులు
చర్పటములు సౌమ్యగంధములు
అంఘ్రిద్వయము లతాయాతకములు
ఆభాషణములు రసరమ్య గీతాలు
అందంద శృంగార రమణీ లలామ
అవతరించె మది పులకరించె
మదాస్వనితము ప్రయోషించె.
కైత ఐతే అల్లిండు కాని దాని అర్థము కూడా తెలుపాలికదా. అతనికి తోచిన ఆ అందాలరాశి (ఒప్పులకుప్ప) వర్ణన- అందరికి తెలిసే విధంగా-
పలువలువలు=పెదవులు
బింబఫలములు=దొండ పండ్లు
విశ్వంకరములు=కండ్లు
వైసారిణములు=చేపలు
సంఘాటిక= ముక్కు
స్థిరగంధము=సంపెంగ పూవు
ద్విజన్మలు=దంతములు
మృగేష్టములు=మల్లెలు
చర్మజములు=కొప్పు (వెంట్రుకలు)
అంతరాళము =నడుము
సంగ్రహప్రమాణము=పిడికిలంత
గండములు=చెక్కిళ్ళు
లతామణులు=పగడాలు
ప్రగండములు=భుజములు
మందార మాలలు=మందార పూదండలు
అభివీక్షణములు = చూపులు
రస తూపులు = శృంగారబాణాలు
చర్పటములు=అరచేతులు
సౌమ్యగంధములు=గులాబీలు
అంఘ్రి ద్వయము=పాదాలు
లతాయాతకము=మృధు పల్లవములు(చిగురుటాకులు)
ఆభాషణములు=పలుకులు (మాటలు)
రసరమ్య గీతాలు=శృంగార గీతాలు
అందందం=అత్యంత
శృంగార రమణీ లలామ=కామోద్రేకము పొందే స్త్రీ
అవతరించె=ఉద్భవించె
మది పులకించె=మనసుప్పొంగె
మదాస్వనితం=నా మనసు
ప్రయోషించె=దోచుకొనియె.
లోకములో జనుల రకాలు, ఉద్దేశాలు, అలవాట్లు, ఆలోచనలు, పోకడలు, నడవడి, తెగింపు, ధైర్య సాహసాలు, జంకు, బిడియము వేరు వేరుగా ఉన్నా కలిసి మెలిసి జీవన ప్రయాణములో మమేకమై బ్రతకడము సహజము. ఐనా ఎవరి ఆలోచనలు. ఆచారాలు, వ్యవహారాలు వాళ్ళకుంటయి. ఇది జగమెరిగిన సత్యము.
కొందరి కోరికలు విచిత్రంగ కూడా ఉంటయి. సాటి మనిషికి సేవ చేసి మానవ సేవయే మాధవ సేవ అని తమ జీవితాన్ని ధారపోసేవాళ్ళు కొందరైతె. అదే సాటి మానవుని దోచుకొని బ్రతుకాలనే వాళ్ళు కొందరుంటారు. కొంత మందికి తమ ప్రాణము మీద ఎంత అపేక్ష ఉంటదో పరులకూ అట్లనే ఉంటదని భావించే వారైతె. కొందరు ఇతరుల ప్రాణాలను అవలీలగా మట్టుబెట్టాలను ఆలోచనలో ఉంటారు. పసి ముసలి, రోగిష్టి, పరోపకారి, భక్తుడు, రాజు, పేద అను భేధ భావము లేకుండా వాళ్ళను అంతమొందించాలనే దురాలోచనతో ఉంటారు. అందులో కొందరిది స్వార్థమైతె ఇంకొందరిది పైశాచిక బుద్ధి.
ఇతరుల క్షేమము కోరుతూ ధైర్య సాహసాలకొడిగట్టి వాళ్ళను ప్రాణాపాయమునుండి తప్పించి తాము తమ ప్రాణాలకు వెరువక ఆపదలో చిక్కుకొనువారూ సమాజములో కోకొల్లలు.
కొంత మంది జీవితములో ఏదో సాధిస్తామను తలంపుతో రాత్రింబవళ్ళు ఆలోచించేవారుంటె. కొంతమంది ఉన్నవి నాశనము చేద్దామను దురాలోచనలో మునిగేవారుంటరు.
ఇంకా కొంతమంది నిరాశా నిస్ఫృహలకు లోనై జీవితములో వారనుభవించిన యాతనలు భరింప శక్యము కాక బ్రతుకు దుర్భరమని తలచు ముమూర్షువులుంటారు.
తమ జీవితమంతమొందించుకొనడానికి విశ్వ ప్రయత్నం చేస్తారు. సఫలీకృతులు కాలేక ఒకసారి ప్రహ్లాదునిని హిరణ్య కశిపుడు చంపు ప్రయత్నములో నిష్ఫలమొందు విషయమాలోచించి చావులో కూడా చేతకాని తనమునకు తమను తామే నిందించుకొనుచు ప్రకృతి సిద్ధమైన మృత్యువు వరించేవరకు ఆశాపిశాచిక(నైరాశ్యము)తో కాలము గడుపుతారు.
“ముంచితి వార్థులందు. గదల మొత్తితి. శైల తటంబులందు ద్రొబ్బించితి. శస్త్రరాజ బొడిపించితి. మీద నిభేంద్రపంక్తి రొప్పించితి. ధిక్కరించితి. శపించితి. ఘోరదావాగ్నులందు త్రోయించితి. పెక్కు పాట్లనలయించితి. చావడిదేమి చిత్రమో.“
ఇటువంటి ముమూర్షువులతో(చావనిఛ్చగలవారు) ఎవరికి ఎలాంటి మేలు. గీళ్ళు గాని ఏ ఇతర ప్రయోజనములు గాని ఉండవు.
భగవత్ గీతలో గీతాచార్యుడు చెప్పిన విధముగా
“జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ |”
అంటే “పుట్టినవానికి మరణం తప్పదు; మరణించినవానికి పుట్టుక తప్పదు”
ఈ సత్యము తెలిసి కూడా కొందరు చావుకు భయపడుతూ ,కొందరు చావు కోరుకుంటూ జీవనము సాగిస్తారు.
పౌరాణిక, ఐతిహాసిక, చారిత్రక, వైయక్తిక విషయాలు ఎన్ని గ్రహించినా మనిషి తన ఆలోచనా సరళి మార్చుకొనక లేని తలంపులతో మథనపడుతూ తాను దహించుకపోతూ ఇతరులను ఆవేదనకు గురి చేస్తుంటాడు.
ఇక మనిషికి స్వభావ సిద్ధంగా వచ్చేది అహం. దానికి లోనై పాత్రాపాత్రాలను గుర్తెరుగక వ్యవహరించడము చూస్తుంటాము.
ఒక్క ముమూర్షువు మాత్రమే ఎవరికి హాని తలపెట్టడము కాని. ప్రయోజనకారిగా ఉండడం కాని చేయక సదా నిర్లిప్తతతో కాలము నెట్టుకొస్తుంటాడు. అతని ఆత్మీయులకు మాత్రమే ఆ వ్యవహార శైలి మనోవ్యథ కలిగిస్తది.
మృత్యువును ఆశించేవారు. మృత్యువుకు భయపడేవారు శివపురాణ ఘట్టము చదువుట కద్దు.
శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కరువదంటారు.
సృష్టి, స్థితి, లయ కారకులలో ముఖ్యంగా శివునికి తెలియకుండ ఏ జీవి మరణించలేదని. శివుని ఆజ్ఞ లభించిన తరువాతనే యముడు ప్రాణాలు తీసుకపోయేటందుకు వస్తాడనే విషయములో ఆ మాట చెబుతారు.
మనిషి మరణించడానికి ముందు సంకేతాలు తెలిస్తె తాను ఎప్పుడు మరణిస్తాడో తెలుసుకోవచ్చని శివుడు పార్వతికి చెబుతాడట.
1. ఎవరైనా వ్యక్తికి అతని ప్రతిబింబము నూనె, నీరు, లేదా అద్దములో కనిపించలేదంటే అతను మరో ఆరు నెలలలో చనిపోతాడని తెలుసుకోవాలి.
2. ఎవరికైతె నోరు, చెవులు, కండ్లు, నాలుక పని చేయకుండ పోతాయో వారు కూడ ఆరు నెలల లో చనిపోతారు (అదే మృత్యువు సూచన)
3. ఎవరికైనా శరీరము ఉన్నట్టుండి తెలుపు లేదా పసుపు రంగులోనికి మారుతూ శరీరముపై ఎరుపు రంగు మచ్చలు వస్తుంటె వారు ఆరు నెలల లో చనిపోతారు.
4. ఎవరికైతె గొంతు, నాలుక మాటి మాటికి పొడిగా మారుతాయో వారు త్వరలో చనిపోతారు.
5. ఎవరైతె నొప్పి కారణంగా ఎడమ చేతిని మాటి మాటికి వెనుకకు తీసుకుంటారో. దానితో నాలుక పొడిగా మారుతున్నా వారు ఒక నెలలో చనిపోతారు.
6. సూర్యుడు లేదా చంద్రుణ్ణి చూసినప్పుడు వాటి చుట్టు ఎరుపు రంగు వలయము లాంటిది కనిపిస్తే అలాంటి వారు 15 రోజులలో మరణిస్తారు.
7. నక్షత్రాలు, చంద్రుణ్ణి అసలు చూడలేనివారు లేదా వాటి స్థానములో నల్లటి మచ్చలు కనబడే వారికి మరణం త్వరలో సంబవిస్తుంది.
8. నీలి రంగులో ఉండే ఈగలు ఎవరినైన చుట్టుముడుతుంటె వారికి నెలలో మరణము సంభవించవచ్చు.
9. రాబందు, కాకి, లేదా పావురం ఎవరి తలపైనైనా వాలితే వారికి త్వరలో మరణము సంభవిస్తది.
10. ఎవరైనా తన నీడను తల లేకుండా చూస్తె వారు త్వరలో మృత్యు కౌగిలిలోకి చేరుతారు.
11. ఎవరైనా చూపు పూర్తిగా పోయినా లేదా మంటను సరిగా చూడలేక పోయినా వారు కూడా త్వరలో మరణిస్తారు.
ఇక మరణించిన తరువాత జీవి ఎక్కడికి పోయేది ఏమేమి అనుభవాలుంటాయనడానికి శ్రీ మహా విష్ణువు ఆతని వాహనమైన గరుడుడికి చెప్పిన వివరాలు-
నరకమంటే ఏమిటి, అది ఎవరికి ప్రాప్తిస్తుంది- దానిని ఎట్లా తప్పించుకోవాలి- వైతరిణి అంటే ఏమిటి, అది ఎట్లా ఉంటుందిలాంటి వివరాలు చెబుతాడు. దీనినే గరుడ పురాణమంటారు.
పాపాత్ములు మాత్రమే యమపురి దక్షిణ ద్వారమునుండి పోవలసి ఉంటుంది. దక్షిణ మార్గములో వెళ్ళ వలసిన దుర్గతి మనిషిగా పుట్టి చేయకూడని పాపాలు చేయడమేనని పురాణాల్లో చెప్పబడింది. బ్రహ్మ హత్య, శిశు హత్య, గోహత్య, స్త్రీ హత్య చేసేవారు. రహస్యంగా పాపపు పని చెసేవారు. గురువులు, పండితులు, దేవతలు, స్త్రీ, శిశు హరించేవారు. తీసుకున్న అప్పు తీర్చనివారు. ఒకరు దాచిన ద్రవ్యాన్ని అపహరించేవారు. విశ్వాస ఘాతకులు, విషాన్నము పెట్టి ఇతరులను హతమార్చేవారు. వైతరిణి దాటి వెళ్ళవలసిందే.
దోషులను పొగిడేవారు, మంచివారిని నిందించేవారు, రుణగ్రస్తులను ఎగతాళి చేసేవారు, నీచులతో స్నేహము చెసేవారు, సత్పురుషులతో స్నేహము చేయనివారు, పుణ్య తీర్థాలనూ, సజ్జనులనూ, సత్కర్మలనూ, దేవతలనూ నిందిందించేవారు యమలోకం దక్షిణ ద్వారము నుండి నడువవలసి ఉంటుంది.
పురాణాలు, వేదాలు, మీమాంస, న్యాయ శాస్త్రాలను, వేదాంత శాస్త్రాలను దూషించేవారు ఇతరులు సంతోషంగా ఉంటె దుఃఖించేవారు, ఎదుటివారు దుఃఖిస్తుంటే ఆనందించేవారు. చెడు మాటలు పలికేవారు. పెద్దల హితోపదేశాన్ని విననివారు, ఆత్మ స్తుతి చేసేవారు. పరనింద చేసేవారు. అధర్మ మార్గములో నడిచేవారు. దక్షిణ మార్గాన ఏడుస్తూ పడిపోవలసిందే.
తల్లిదండ్రులకు, గురువులకు, ఆచార్యులకు, పూజింప తగిన వారికి అవమానము కలిగించేవారు. పతివ్రత, వినయ సంపన్నురాలైన భార్యను అకారణంగా ద్వేషించి విడిచిపెట్టేవారు. ఏదైనా ఇస్తానని మాట తప్పేవారు- ఇచ్చిన దాన్ని తిరిగి తీసుకునేవారు- దానము ఇచ్చి ఇచ్చిన తరువాత బాధపడేవారు- వైతరుణి దాటక తప్పదు.
దానము చేసేవారిని ఇవ్వవద్దని ఆపేవారు, యజ్ఞ విధ్వంసకులు, హరికథలకు విఘ్నం కలిగించేవారు, పరుల భూములు సరిహద్ధులు చెరిపి భూమి ఆక్రమించేవారు-
పశువుల బీడును దున్ని వాటికి మేత లేకుండ చేసేవాడు, అనవసరంగా పశుహత్య చేసేవాడు, కపిల గోవులను దైవ కార్యాలకు తప్ప స్వంత కార్యాలకు వినియోగించేవాడు- ఇట్లాంటి పాపాలుచేసే ప్రతి మనిషి యమ లోకములో దక్షిణ మార్గాన ఉన్న వైతరుణిలో కూలబడవలసిందే.
యమధర్మరాజు ఆజ్ఞను పాటించి యమ భటులు పాపులను వైతరుణిలో తోసివేస్తారు. గోదానము చేయనివారు, ఊర్ధ దేహ క్రియలు జరుపనివారు, ఆ నదిలో అనేక బాధలు అనుభవించినా నది ఒడ్డుకి వంచన చేసి ధనము సంపాదించేవారు ఉండే బూరుగు చెట్టుకు వ్రేలాడవలసి వస్తుంది.
అబద్ధపు సాక్షము చెప్పేవారు. దొంగతనము చేసేవారు. పచ్చని చెట్లను నరికేవారు. ఫల వృక్షాలను, పూల తోటలను ధ్వన్సము చెసేవారు. తీర్థ యాత్రలు చెసే వారికి ఆటంకము కలిగించేవారు వితంతువులను మోసము చేసి మానహరణ చేసేవారు. వైతరుణిలో దుఃఖాన్ని అనుభవించి ఒడ్డున ఉన్న బూరుగు చెట్టుకు కట్టబడి యమ భటులచేత దెబ్బలు తింటూ ఉంటారు.
ఇట్లా పాపాత్ములు వైతరుణిలో పడి బాధలు అనుభవించాలని గరుడ పురాణం చెబుతుంది. గరుడ పురాణం అనేది మనిషిని సన్మార్గములో నడిపించడానికి మన పెద్దలు వ్రాసిన ఒక మహత్యమైన గ్రంథం.
దీనినిచదువుటము వలన తన జీవితాన్ని మంచి మార్గములో మలచుకోవడానికి ప్రయత్నిస్తాడు.
ముమూర్షువు ఇవి చదివినా విన్నా లక్ష్య పెట్టక తనదొకటే లక్ష్యము ఈ లోకాన్ని విడిచిపోవాలని మాత్రమే. కానున్నది కాక మానదనే సిద్ధాంతమును నమ్ముకున్నవాడగుటచే ఏలాంటి విపత్కర పరిస్థితులనైన భరించ సిద్ధమౌతాడు. ఆతని మనసులో జీవితము మీద విరక్తి కలుగడానికి బహుశ ఆతడేదో తనకు భరించ శక్యముకాని పరిస్థితుల చవిచూసి ఉండవచ్చును. అవి చెప్పుకోలేని- చెప్పరాని విషాదోద్భవ విషయాలుండవచ్చును. అతని మనో దౌర్బల్యము ఆత్మ హత్యకు మాత్రము అనుకూలించక క్షణ క్షణము మృత్యు పరిష్వంగము పొంద జూస్తాడు.
శాస్త్రకారుల విశ్లేషణకు ఆతడు ఒక వింత రుగ్మతచే పీడింపబడుతున్నాడంటరు. మనిషిని దాదాపు రెండు నుండి మూడు వేలదాక రక రకాల వ్యాధులు పీడిస్తుంటాయి. వాటికి తోడు కొత్త కొత్త అంటు వ్యాధులు వెంటబడుతుంటాయి. మృత్యువును కౌగలించేవి కొన్నైతె మృత్యువును జయించేవి కొన్ని. కాగా మానసికంగా పీడించే రోగాలు కొన్ని.
సృష్టిలో భూచర, జలచర, ఖేచర జీవులు ఎనుబది నాలుగు (84) లక్షలుంటాయంటరు. వాటిలో మానవ జన్మ ఉత్కృష్టమైనది. మానవునికి ఆలోచన. ఆత్మ. యుక్తాయుక్త పరిజ్ఞానము. సాధనా శక్తి. వంటి బల సంపన్నత కలిగి ఉంటాయి.
ఈ ఆలోచనే స్ఠిరత్వము కోల్పోయి అప్పుడప్పుడు విపరీత ధోరణలకు దారి తీస్తుంది.
ప్రతి జీవిలో ఒక కళ ఉండడము సహజము. మానవేతర జీవులకు ఎలాంటి ప్రోద్బలము, ప్రోత్సాహము లేకుండానే సహజ సిద్ధమైన కళలు మనకు కనబడుతుంటాయి.
ఉదాహరణకు;. పిచ్చుక గూడు ఒక అద్భుత నిర్మాణము. తేనెటీగల తెట్టెలోని అరలు షడ్భుజాకారములో కొలతలు తప్పకుండా ఉంటాయి. సాలెగూడు అల్లిక చూస్తుంటె ఆశ్చర్యము కలుగక మానదు. ఇట్ల ప్రతి జీవిలో ఒక కళ ఇమిడి ఉన్నది.
మానవులకు జన్యు పరంగా కళలు దాగి ఉన్నా వాటికి ప్రేరణ అవసరము.. మెరుగు పెట్టడానికి శిక్షణ కూడా అవసరమే.
ఇంత అందమైన సృష్టిలోని విభిన్న దృశ్యాలను. వసతులను సాటి మానవుల ప్రేమాభిమానాలను.
అభివృద్ధి మార్గాలను అనుభవించే యోగాలను వదులుకొని కొందరు నిరుత్సాహముతో నిర్లిప్తతగా ఉండి అన్ని వదులు కొని మృత్యు బాట పట్టాలని ఆలోచించడము సహేతుకముకాదు.
నిహితం గుహాయాం విభ్రాజతే =ప్రతి మానవుని హృదయ గుహలోనూ పరమాత్మ ప్రకాశిస్తాడు. అటువంటప్పుడు మనిషికి ఆరాట.- పోరాటాలెందుకు, కానున్నది కాక మానదుకదా..
సమాప్తం.
సుదర్శన రావు పోచంపల్లి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం
ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
పేరు-సుదర్శన రావు పోచంపల్లి
యాదాద్రి భువనగిరి జిల్లాలోని జిబ్లక్పల్లి గ్రామము.(తెలంగాణ.)
వ్యాపకము- సాహిత్యము అంటె అభిరుచి
కథలు,శతకాలు,సహస్రములు,కవితలు వ్రాస్తుంటాను
నేను విద్యాశాఖలో పనిచేస్తు పదవి విరమణ పొందినాను,
నివాసము-హైదరాబాదు.
Comments