top of page

నా కోడలు

#అత్తగారికథలు #అత్తాకోడళ్ళకథలు, #LVJaya, #LVజయ, #NaKodalu, #నాకోడలు


Na Kodalu - New Telugu Story Written By L. V. Jaya

Published in manatelugukathalu.com on 22/04/2025 

నా కోడలు - తెలుగు కథ (అత్తగారి కథలు - పార్ట్ 12)

రచన: L. V. జయ

కథా పఠనం: పద్మావతి కొమరగిరి



సమర్థ్, జాగృతిల పెళ్ళికి అన్నీ సిద్ధమయ్యాయి. పెళ్ళి ఇంకోవారంలో ఉందనగా, జాగృతిని తన ఇంటికి తీసుకువెళ్లాడు సమర్థ్. జాగృతి వద్దని చెప్తున్నా వినలేదు. 


సమర్థ్ వాళ్ళమ్మ రాధకి, కాబోయేకోడలు పెళ్ళికిముందు అత్తగారింటికి రావడం నచ్చలేదు. అలా రావడం అశుభమని జాగృతి మీద కోప్పడి, ఇంట్లోకి రానివ్వలేదు. "ఇందులో జాగృతి తప్పులేదు, తను వద్దని చెప్తున్నా, నేనే తీసుకువచ్చానని" సమర్థ్ చెప్పినా వినలేదు రాధ. రాధ కోపాన్ని చూసిన జాగృతికి, వెనక్కితిరిగి వెళ్ళిపోవాలనిపించింది. సమర్థ్, జాగృతిని వెళ్ళద్దని చెప్పి, రాధని బతిమాలుకున్నాక, చాలాసేపటితరువాత జాగృతిని ఇంట్లోకి రానిచ్చింది. 


తనకి నచ్చిన తీరులో జాగృతిని అలంకరిస్తూ, "అమ్మాయిలు ఇలా ఉంటేనే మామీనాక్షికి నచ్చుతారు. ఈ ఊరిలో అందరూ ఇలాగే తయారవుతారు. " అని జాగృతితో చెప్పింది రాధ. 

రాధ తనని తయారుచేసిన విధానం జాగృతికి నచ్చకపోయినా, అప్పుడే రాధ కోపాన్ని చూసిన జాగృతి, ఆ విషయాన్ని రాధకి చెప్పలేకపోయింది. 'ఈవిడ ఆడపడుచుకి నేను ఎందుకు నచ్చాలి? ఆవిడ కోసం నేనెందుకు మారాలి? నాలా నేనుందుకు ఉండకూడదు. ' అనుకుంటూ పక్కవీధిలోనున్న రాధ ఆడపడుచు మీనాక్షి ఇంటికి వెళ్ళింది జాగృతి, రాధతో. 


రాధని, జాగృతిని చూసి సంతోషపడింది మీనాక్షి. "నీక్కాబోయే కోడలు కదూ. ఫొటోలో చూసాను. ఆయ్. పెళ్ళికి ముందే అత్తగారింటికి వచ్చేసిందే? నువ్వెలా ఒప్పుకున్నావ్? ఇంతకీ ఇప్పుడొచ్చింది? ఆయ్. " అంటూ గోదావరియాసలో రాధని పలకరించింది మీనాక్షి. 


"ఇప్పుడే వచ్చింది. వెంటనే నీకు చూపిద్దామని తీసుకొచ్చాను. నీ అలక తీరి, ఇప్పటికైనా నాతో నవ్వుతూ మాట్లాడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది మీనాక్షీ. " అంది రాధ. 


"నీక్కాబోయేకోడలిని ఇన్నాళ్లు చూడలేదు. కోపం ఉండదా మరి? ఆయ్. " అంది మీనాక్షి నవ్వుతూ. 


"రాధా, నేనూ ఒకే వయస్సువాళ్ళం. మంచి స్నేహితులం. అన్ని విషయాలు ఒకళ్ళతోఒకళ్ళం పంచుకుంటాం. తను చూపించిన పిల్లని నేను నా కోడలిగా చేసుకున్నాను. ఆయ్. రాధ కూడా నేను ఎంచిన పిల్లని కోడలిగా చేసుకోవాలికదా. కానీ, మీ పెళ్లిచూపులు, పెళ్లిమాటలు వేరే ఊరిలో జరిగాయి. రాధ నన్ను తీసుకెళ్లలేదు. ఆయ్. అందుకే మాట్లాడడం మానేసాను. " అంది మీనాక్షి జాగృతితో. 


"మీ అత్తయ్యగారేరి? ఆవిడకి కూడా నాక్కాబోయే కోడలిని చూపిస్తాను. " అంది రాధ. 


"అత్తగారండీ. మా రాధ తనకి కాబోయే కోడలిని తీసుకొచ్చింది. " అని కూర్చున్నచోటునుండే అత్తగారిని అరిచిపిలిచింది మీనాక్షి. మీనాక్షి భర్త, ముగ్గురు కొడుకులు వచ్చారు. కానీ, మీనాక్షి అత్తగారు రాలేదు. 


"మా అత్తగారికి బ్రహ్మచెవుడు. వినపడదు. గట్టిగా అరవాలి. " అని తలకొట్టుకుంటూ అంది మీనాక్షి. మీనాక్షి ఒకళ్ళతో మాట్లాడుతూ, ఇంకొకరిని చూడడాన్ని గమనించింది జాగృతి. 'మీనాల్లాంటి కళ్ళు అన్న పేరున్నఆవిడకి మెల్లకళ్ళు. ఆవిడ అత్తగారి బ్రహ్మచెవుడని వెక్కిరిస్తోంది. ఇంతకీ ఈ అత్తాకోడళ్లు మాట్లాడుకుంటుంటే ఎలా ఉంటుందో!!' అనుకుంది జాగృతి. 


మీనాక్షి అత్తగారు కళ్లద్దాలు సరిచేసుకుంటూ, "నీకు కాబోయేకోడలు కదే రాధా. అయ్. " అని, మళ్ళీ అనుమానంగా చూస్తూ, "ఫోటోలోలాగ లేదేమిటే?" అని రాధని అడిగింది. 


"ఫోటోలో హుందాగా ఉన్న పిల్ల, ఇప్పుడు పల్లెటూరిపిల్లలా ఉందేంటి అనుకున్నాను. అప్పుడే మీ పద్ధతిలోకి మార్చేసావా?" అని రాధని అడిగాడు మీనాక్షి భర్త. 


"తప్పేముంది? కోడళ్ళని మొదటినుంచి మన పద్ధతిలోకి మార్చుకుంటేనే మంచిది. తరువాత మారుద్దామన్నా లొంగరు. నేను అనుభవిస్తున్నాను కదా. " అని తలపట్టుకుంది మీనాక్షి. 


"నీకేం తక్కువ చేసింది అది? నా పిన్ని మనవరాలిని కోడలిగా చేసుకున్నావ్. ఇంటిపనులన్నీ చక్కగా వచ్చు దానికి. " అంది రాధ, మీనాక్షితో. 


"చదువు సంధ్యా లేనిదాన్ని తెచ్చావ్. పనిసాయమైన చేస్తుందా అంటే అదీ లేదు. ఎంతసేపూ ఆ చంటిపిల్లకి పాలిస్తున్నాను అంటూ అంతపనీ నాచేతే చేయిస్తుంది. ఇంతకీ అదెక్కడ?" అని వంటిటివైపు చూస్తూ, "ఏమే, అందరికీ కాఫీలు పట్టుకునిరా. " అని అరిచింది మీనాక్షి. అందరెదురుగా మీనాక్షి తన కోడలిగురించి మాట్లాడిన విధానం జాగృతికి నచ్చలేదు. 'కూర్చున్నచోట నుండి కదలకుండా అత్తగారిని, కోడలిని పిలుస్తూ, పనులన్నీ ఈవిడే చేస్తున్నట్టు చెప్తోందేమిటి?' అనుకుంది జాగృతి. 


"అండీ అత్తయ్యగారండీ. తెస్తున్నానండి. ఇప్పుడే పాలు పెట్టానండి. " అని వంటిట్లోనుంచి చెప్పింది మీనాక్షి కోడలు. 'ఒకే వాక్యంలో అండీ అని నాలుగుసార్లు అంది. మీనాక్షి కోడలు బాగా భయస్తురాలైన అయ్యిండాలి లేదా వీళ్ళు బాగా భయపెట్టి అయినా అయ్యుండాలి. ' అనుకుంది జాగృతి. 


మీనాక్షి మాటలకి, మీనాక్షి పెద్దకొడుకు మొహం మాడిపోయింది. జాగృతిని చూసి, మాట మార్చడానికి ప్రయత్నిస్తూ, "చెల్లెమ్మా నువ్వు చాలా పెద్ద ఐటీ కంపెనీలో చేస్తున్నావంట కదా? 

ఆయ్. " అని అడిగాడు. జాగృతి నవ్వుతూ అవునని చెప్పింది. "వాడు నా పెద్దకొడుకు. మా ఊళ్ళోనే తెలుగు మాస్టారుగా చేస్తున్నాడు. " అని చెప్పింది మీనాక్షి. 


"ఆయ్. నాక్కుడా చదువయ్యాక, నీలాగా, బావలాగ పెద్ద కంపెనీల్లో ఉద్యోగం చెయ్యాలనుందక్కా. " అన్నాడు మీనాక్షి మూడోకొడుకు. 


"నాకు కూడా కంప్యూటర్స్ వచ్చు అక్కా. ఇక్కడ నా ఫ్రెండ్ తో కలిసి కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ పెట్టాను. వర్డ్, ఎక్సెల్ క్లాసులు నేనే తీసుకుంటాను. ఆయ్. సంపాదనే పెద్దగా లేదు. మీ కంపెనీలో ఉద్యోగాలేమైనా ఉంటే చూస్తావా అక్కా?" అని జాగృతిని అడిగాడు మీనాక్షి రెండో కొడుకు. 


"నేను చేస్తున్న కంపెనీలో అయితే కష్టం. సి, జావా లాంటి కోర్సలు ఏమైనా చెయ్యండి. అప్పుడు తప్పకుండా ప్రయత్నిద్దాం. " అంది జాగృతి. అక్కా, చెల్లీ అంటూ వరసలు కలిపి మాట్లాడడం నచ్చింది జాగృతికి. కానీ, ప్రతిసారి ఆయ్ అని ఎందుకు అంటున్నారో, దాన్ని అర్ధం ఏమిటో తెలియలేదు జాగృతికి. 


"నువ్వు దీన్ని ఉద్యోగం అడగటం ఏమిటిరా? నీకన్నా ఎక్కువ వచ్చా దీనికి?" అని మీనాక్షి రెండో కొడుకు మీద అరిచింది రాధ. జాగృతి ఉద్యోగం గురించి అందరూ గొప్పగా మాట్లాడడం, ముఖ్యంగా మొగవాళ్ళు పొగుడుతూ మాట్లాడడం నచ్చలేదు రాధకి. 


"చెల్లమ్మ పెద్ద ఉద్యోగమే చేస్తోంది కదత్తా. ఉద్యోగం ఇప్పించగలదేమో. ఆయ్. వాడి ప్రయత్నాలు ఏవో వాడిని చూసుకొని. " అన్నాడు మీనాక్షి పెద్దకొడుకు. 


"మొగవాళ్ళకి ఉద్యోగం ఇప్పిస్తుందా? అంతుందా దీనికి? అయినా ఆడవాళ్లు, భర్తని, పిల్లల్ని చూసుకుంటే చాలు. బ్యాగులూపుకుంటూ ఉద్యోగాలకి వెళ్ళి ఎవరిని ఉద్దరించనక్కరేలేదు. " అంది రాధ కోపంగా కళ్ళెర్రజేస్తూ. రాధ ఎందుకు అలా అరుస్తోందో అర్ధంకాక, అందరూ ఒకళ్ళమొహాలు ఒకళ్ళు చూసుకున్నారు. జాగృతికి మళ్ళీ రాధ కోపాన్ని చూసి, భయం వేసింది. 'నేను ఉద్యోగం చెయ్యటం ఈవిడకి ఇష్టంలేకపోతే పెళ్ళిచూపుల్లోనే చెప్పుండాల్సింది. కొంపదీసి, పెళ్ళయ్యాక ఉద్యోగం మాన్పించేస్తారా?' అనుకుంది మనసులో. 


"ఇంతకీ నా కోడలేది?" అని వంటిటివైపు చూస్తూ, "ఏమే. ఎప్పడికి తీసుకొస్తావ్ కాఫీలు?" అని అరిచింది మీనాక్షి. 


"అత్తయ్యగారండీ. తెచ్చేస్తున్నానండి" అంటూ వచ్చింది మీనాక్షి కోడలు. ఒకచేత్తో కాఫీ కప్పులున్న ప్లేట్ పట్టుకుని, ఇంకో చేత్తో, చెంకలోనున్న పిల్ల పడిపోకుండా పట్టుకుంది. 


"ఏమే. ఏం చేస్తున్నావ్ ఇంతసేపూ?" అని కోడలిని అడిగింది మీనాక్షి. 


"పిల్ల ఇప్పుడే లేచిందండి. ఆకలికి ఏడుస్తుంటే.. " అని మొహమాటంగా, చెప్పింది మీనాక్షి కోడలు. 


"చెప్పనా. ఇదీ దీన్ని వరస. ఎప్పుడూ పని ఎగ్గొట్టడానికి, పిల్లకి పాలిస్తున్నానండి అని చెప్తుంది. " అంది మీనాక్షి కోడలిని వెక్కిరిస్తూ. మీనాక్షి కోడలు మొహం మాడిపోయింది. 'చిన్న పిల్లకి పాలిస్తుంటే కూడా వెక్కిరిస్తారా? వీళ్ళేం మనుషులు?' అనుకుంది జాగృతి. మీనాక్షి కోడలు చేతిలోనున్న కాఫీ ప్లేట్ అందుకోవడానికి వెళ్ళి, "మీ పేరేంటండి?" అని అడిగింది జాగృతి. 


"నా కోడలు అని చెప్పాను కదా? మళ్ళీ అడుగుతావేం?" అంది మీనాక్షి జాగృతితో. 'కోడలిని, అదీ, ఇదీ అని పిలుస్తున్నారు. ఆవిడ చేతిలో ప్లేట్ తీసుకోవడానికి, సాయం చెయ్యటానికి ఎవరూ వెళ్ళలేదు. కనీసం ఆవిడ పేరుని కూడా చెప్పనివ్వటం లేదు. వీళ్ళ పద్దతి ఏమీ బాగులేదు. ' అనుకుంది జాగృతి. 


అందరూ కాఫీలు తాగడం అయ్యాక, కాఫీ కప్పుల్ని తీసుకుని, మీనాక్షి కోడలితో మాట్లాడానికి వంటిట్లోకి వెళ్ళింది జాగృతి. పిల్లని ఎత్తుకుని, ఏడుస్తూ, వంటపని చేస్తోంది మీనాక్షి కోడలు. "మీరు ఒక నిమిషం కూర్చోండి. నేను చేస్తాను. " అంది జాగృతి, మీనాక్షి కోడలితో. 


"వద్దు వదినా. నేను చేసుకుంటాను. " అని కళ్ళు తుడుచుకుంటూ, "సారీ. మిమ్మల్ని వదిన అని పిలుస్తున్నాను. కానీ, మిమ్మల్ని నా పరిస్థితుల్లో ఊహించలేకపోతున్నాను. " అంది మీనాక్షికోడలు. 


"అదేమిటి అలా అంటున్నారు?" అంది జాగృతి అనుమానంగా. 


"నాకైతే, చదువు పెద్దగా అబ్బలేదు కాబట్టి, ఇలాంటి సంబంధం చేసుకున్నాను. మీరు ఇంజనీరింగ్ చదివి, పెద్ద పొజిషన్లో ఉన్నారని విన్నాను. మీరెలా ఈ సంబంధం ఒప్పుకున్నారో అర్ధం కావటంలేదు. " అని మొహమాటంగా అడిగింది మీనాక్షి కోడలు. 


"మీరేం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి. మొహమాటపడద్దు. " అంది జాగృతి. 


"మా అన్నయకి మీరు నచ్చారని, ఈ పెళ్ళికి ఒప్పుకుందిట మా పెద్దమ్మ. మీరు ఉద్యోగం చెయ్యటం ఆవిడకి అస్సలు ఇష్టం లేదు. బ్యాగులూపుకుంటూ ఆఫీసులకి వెళ్ళే ఆడవాళ్లంటే నాకు ఇష్టం లేదని నాతో సార్లు చెప్పింది మా పెద్దమ్మ. మీతో పెళ్ళికి ఎలా ఒప్పుకుందా అనుకున్నాను. పెళ్ళి తరువాత మీ ఉద్యోగం మాన్పించేస్తానని మా అత్తగారికి చెప్పింది. " అంది మీనాక్షి కోడలు. 


"ఈ విషయం మీ అన్నయ్యకి తెలుసా?" అని అడిగింది జాగృతి. 


"తెలియదు. తెలిసినా అన్న ఏమీ చెయ్యలేడు. మా పెద్ధమ్మంటే అన్నకి చాలా భయం. ఇంట్లో అందరూ మా పెద్దమ్మ మాటే వింటారు. " అని చెప్పింది మీనాక్షి కోడలు. 


జాగృతికి తన భవిష్యత్తు, మీనాక్షి కోడలి రూపంలో కళ్ళముందు కనపడింది. ఈ పెళ్ళి అయితే, ఈ అత్తగారికి కోడలిగా మాత్రమే మిగిలిపోతానని, "నా కోడలు" అనిపించుకుంటూ, తనని, తన వ్యక్తిత్వాన్ని పూర్తిగా కోల్పోతానని జాగృతికి అర్ధం అయ్యింది. 


'ఇలాంటి సంబంధం చేసుకుని, జీవితాంతం ఏడ్చేకంటే, చేసుకోకుండా ఉంటేనే మంచిది. ' అని నిర్ణయించుకుని, తన ఇంటికి వెళ్తూనే, ఈ పెళ్ళి కాన్సల్ చెయ్యమని ఇంట్లోవాళ్ళకి చెప్పింది. 


పేరు కూడా తెలియని మీనాక్షి కోడలికి, పెళ్ళికిముందే తన ఇంటికి తీసుకువెళ్లిన సమర్థ్ కి మనసులోనే ధన్యవాదాలు తెలుపుకుంది. 

***

L. V. జయ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం

మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం : LV జయ

నా పేరు LV జయ. 
https://www.manatelugukathalu.com/profile/jaya

నాకు చిన్నప్పటి నుండి తెలుగు కథలు, పద్యాలూ, సాహిత్యం, సంగీతం అంటే చాలా ఇష్టం. 
ఏ విషయాన్ని అయినా సరదాగా తీసుకునే అలవాటు. అదే నా కథల రూపంలో చూపించాలని చిన్న ప్రయత్నం చేస్తున్నాను. మీరు ఆదరిస్తారని కోరుకుంటున్నాను.

ధన్యవాదాలు



Comments


bottom of page