'Na Ni Kalalu' - New Telugu Story Written By Ch. C. S. Sarma
Published In manatelugukathalu.com On 07/07/2024
'నా...నీ...కలలు' తెలుగు కథ
రచన: సిహెచ్. సీఎస్. శర్మ
నా...నీ...కలలు
పెండ్లి పందిరి.... పడమటి దిశలో వేదిక. వేదికపైన పెండ్లి కూతురు నీలిమ. పెండ్లి కొడుకు నారాయణ. వేదికపై పెండ్లికూతురు తల్లి అంజలి, తండ్రి పాండురంగారావు, వారికి ముఖ్యమైన బంధువుల స్త్రీలు, వధూవరుల ముందు ఎడమవైపున పురోహితుడు వామనశాస్త్రి....
పందిట్లో కుర్చీలలో బంధుమిత్రులు. ముందు వరుసలలో పెండ్లికుమారుని తల్లి నీలిమ, తండ్రి రామారావు.
దక్షిణపు వైపున భజింత్రీలు, సన్నాయి డోలు వాయిద్యాలు జోరుగా మ్రోగుచున్నాయి. అందరి వదనాల్లో ఆనందతాండవం.
మంత్రోచ్ఛారణ చేస్తున్న వామనశాస్త్రిగారు భజంత్రీలవైపు చూచి...
‘‘గట్టిమేళం... గట్టిమేళం...’’ అన్నారు.
భజంత్రీలు వూపు అందుకొన్నారు.
మాంగల్యాన్ని వామనశాస్త్రి వరుని చేతికి అందించాడు. వరుడు లేచి వధువు ముందుకు వచ్చి ఆమె మెడలో మంగళసూత్రధారణ మూడుముళ్ళు వేశాడు.
వధువు ఆనందంగా తలను పైకెత్తి తనముందున్న వరుడి ముఖంలోకి చూచి నవ్వింది. వధువు తన స్థానంలో కూర్చున్నారు. అందరూ అక్షితలను వారి శిరస్సులపై చల్లారు. వధువు తల్లితండ్రి వేదికపైకి చేరారు.
వధూవరులు పెద్దల పాదాలు తాకి నమస్కరించారు. వారు హృదయపూర్వకంగా వధూవరులను ఆశీర్వదించారు. టపాసులు మ్రోగాయి.
మంచంపై నిద్రలో వున్న నీలిమ ఉలిక్కిపడి మేల్కొంది. చుట్టూ ఆశ్చర్యంతో కలయచూచింది.
ఆ గదిలో తను తప్ప ఎవరూ లేరు.
సమయం వేకువన ఐదు గంటలు అయింది.
తూర్పున దినకరుని అరుణకాంతులు. నీలిమ పెదవులపై చిరునవ్వు....
అది సుందరస్వప్నం...
ఆమె మస్తిష్కంలో తన మేనత్త నీలిమ కుమారుడు, తన బావ నారాయణ వెలిశాడు.
నీలిమ మంచందిగి ఎదురుగా వున్న కిటికీగుండా బయటికి చూచింది. బయట వేకువ వాతావరణం ఎంతో ప్రశాంతంగాను, హద్దుగోడ ప్రక్కన విరియపూచిన జాజిపందిరి పూల సుమధుర వాసన ఆమె నాసిక రంధ్రాలకు సోకింది. తనువు పులకరించింది. బావను గురించిన తీపిజ్ఞాపకాలు మదినిండా అలుముకొన్నాయి.
***
నారాయణ తొలిసారిగా తన మేనమామ పాండురంగారావు గారి ఇంటికి వచ్చాడు.
వరండాలోని అత్త అంజలిని చూచాడు నారాయణ.
‘‘అత్తయ్యా...!’’ ప్రీతిగా పిలిచాడు.
అంజలి నారాయణను తదేకంగా చూచింది. ఆశ్చర్యంతో ‘‘మీరు ఎవరు బాబూ!’’ అడిగింది.
‘‘నేను మీ మరదలు నీలిమ కొడుకును. నా పేరు నారాయణ’’ వందనంగా చెప్పాడు.
నారాయణ ఆరు అడుగుల అందగాడు. చిరునవ్వుతో అంజలి ముఖంలోకి చూచాడు.
‘‘ఐదు సంవత్సరాల క్రింద మీరు నన్ను బిట్రగుంట తిరునాళ్ళలో చూచారు. చాలాకాలం అయిందిగా, మీకు జ్ఞాపకం వుండకపోవచ్చు’’ చిరునవ్వుతో చెప్పాడు నారాయణ.
అంజలి ఆలోచించింది. నారాయణ రూపు, మాటతీరు ఆమెకు బాగా నచ్చాయి.
‘‘రా బాబు!... రా!’’ ప్రీతిగా ఆహ్వానించింది.
‘‘అమ్మా నాన్నా బాగున్నారా బాబు!’’ అడిగింది అంజలి.
‘‘అంతా బాగున్నారత్తయ్యా. మామగారు ఇంట్లో...."
‘‘ఎవరే!....’’ లంగరు చుట్ట పొగను వదులుతూ పాండురంగారావు వరండాలోకి వచ్చారు. నారాయణను చూచాడు.
‘‘నమస్కారం మామయ్యా!... సర్పంచ్‌గా గెలిచారు కదా!... కంగ్రాచ్యులేషన్స్...’’ చిరునవ్వుతో చెప్పాడు నారాయణ.
‘‘ఎవరునువ్వు?...’’ ఆ ప్రశ్నలో అహంకారం ద్యోతకమయింది నారాయణకు.
అంజలి ఆశ్చర్యంతో భర్తముఖంలోకి చూచింది.
‘‘ఏమండీ!.... ఆ అబ్బాయి మన... అదే మీ చెల్లెలు నీలిమ కొడుకు."
నారాయణ ముఖంలోకి చూచి.... ‘‘కూర్చోబాబు!’’ ప్రీతిగా చెప్పింది.
పాండురంగారావు భార్య ముఖంలోకి తీక్షణంగా చూచాడు.
‘‘నీవు ఇంట్లోకి వెళ్ళు!...’’ శాసించాడు.
అంజలి దిగాలుపడి అతని ముఖంలోకి దీనంగా చూచింది.
‘‘చెప్పింది నీకే లోనికి వెళ్ళు" గద్దించాడు పాండురంగారావు.
అంజలి నిట్టూర్చి మౌనంగా ఇంట్లోకి వెళ్ళింది.
‘‘ఎందుకు వచ్చావ్?..’’ నారాయణ ముఖంలోకి తీక్షణంగా చూస్తూ అడిగాడు పాండురంగారావు.
‘‘మీతో మాట్లాడాలని వచ్చాను మామయ్యా!...’’ సౌమ్యంగా చెప్పాడు నారాయణ.
‘‘ఏం మాట్లాడాలి!...’’
‘‘కూర్చుందామా!...’’
ముకుందరావు కుర్చీలో కూర్చున్నాడు. నారాయణ ముఖంలోకి ప్రశ్నార్థకంగా చూచాడు.
నారాయణ వారు కూర్చోమని చెప్పకపోయినా వారి ఎదురుగా వున్న కుర్చీలో కూర్చున్నాడు.
‘‘మామయ్యా!...’’
‘‘చెప్పు!...’’
‘‘మీది అత్తయ్యదీ ప్రేమ వివాహం కదూ!... అత్తయ్యకు మీరంటే ఎంతో గౌరవం. దానికి సాక్షి మీరు ఇంట్లోంచి వెళ్ళమనగానే లోనికి మారుమాట్లాడకుండా వెళ్ళిపోయారుగా! అత్తయ్య చాలా మంచిదని మా అమ్మ చెబుతూ వుంటుంది’’ నవ్వుతో చెప్పాడు.
‘‘నీవు మా యింటికి ఎందుకు వచ్చావ్?...’’ నిరసనగా అడిగాడు పాండురంగారావు.
‘‘చెప్పాను కదా మామయ్యా!... మీతో మాట్లాడాలని’’
***
‘‘మామయ్యా!.... నేను నీలిమ ఒకే కాలేజీలో చదువుకున్నాము. నీలిమ మీ కూతురని తెలిశాక నేను ఆమెతో పరిచయాన్ని పెంచుకొన్నాను. మా ఇరువురికి ఒకరిపట్ల ఒకరికి ఎంతో అభిమానం. ప్రేమించుకొన్నాము. వివాహం చేసికోవాలని నిర్ణయించుకొన్నాము. మా అమ్మ, మా నాన్నను ప్రేమించి మీ మాటను, తను లెక్కచేయకుండా వారిని వివాహం చేసికొన్నట్లుగా తను నాకు చెప్పింది. నేను నీలిమను ప్రేమించానని, నీలిమ నన్ను ప్రేమిస్తుందని మీకు చెప్పడానికి వచ్చాను. గతాన్ని మరచి మీరు మా వివాహానికి సమ్మతించండి మామయ్యా!...’’ ప్రాధేయపూర్వకంగా చెప్పాడు నారాయణ.
అంజలి, నీలిమలు తలుపు ప్రక్కన నిలబడి నారాయణ ఎంతో సౌమ్యంగా చెప్పిన మాటలను విన్నారు. నీలిమ నారాయణను గురించి తన తల్లికి చెప్పింది. తన నిర్ణయాన్ని ఎరుకపరచింది. ఆ తల్లీకూతుళ్ళకు నారాయణ మాట ఎంతో ఆనందాన్ని కలిగించాయి.
పాండురంగారావులో ఎంతో ఆవేశం... చీడపురుగును చూచినట్లు నారాయణను చూచాడు.
‘‘ఒరేయ్ కోటిగా!....’’ బిగ్గరగా అరిచాడు.
పశువులశాలలో వున్న పాలేరు కోటికి అయ్యగారి సింహనాదం వినిపించింది. పరుగున వచ్చి వారిముందు నిలబడ్డారు.
‘‘రేయ్!...’’
‘‘అయ్యా!...’’
‘‘వీడు...’’
‘‘మన నీలిమమ్మగారి బాబండే. చాలామంచోడు’’ చిరునవ్వుతో నారాయణపట్ల తనకున్న అభిప్రాయాన్ని చెప్పాడు కోటి.
‘‘రేయ్!... ఎదవా!... వీడిని మెడబట్టి వీధిలోకి గెంటెయ్యి!...’’ శాసించాడు పాండురంగారావు.
నారాయణ పెదవులపై చిరునవ్వు....
పాలేరు కోటి ముఖంలో ఆశ్చర్యం.....
తలుపు ప్రక్కన వున్న అంజలి, నీలిమల వదనాల్లో విచారం. దిగాలుపడి ఒకరి ముఖాలు ఒకరు చూచుకొన్నారు.
‘‘కోటన్నా!... బాగున్నావా!...’’
‘‘బాగుండా బాబు!...’’
‘‘నీవేం శ్రమపడనవసరం లేదు. నేను వచ్చినపని అయిపోయింది. నేనే వెళ్ళిపోతాను. నీవు వెళ్ళి నీపని చూచుకో...’’ అమాయకంగా చిరునవ్వుతో చెప్పాడు నారాయణ.
కుర్చీనుండి లేచాడు. సింహద్వారాన్ని సమీపించాడు.
‘‘అత్తయ్యా!... మామగారికి విషయాన్ని చెప్పేశాను. వారు బాగా ఆలోచించుకొని ఒక నిర్ణయానికి రావాలి. వస్తారనే నమ్మకం నాకుంది. నేను వెళ్ళొస్తానత్తయ్యా!..." కాస్త హెచ్చుస్థాయిలో చెప్పి నారాయణ వేగంగా వీధివైపుకు నడిచాడు.
పాండురంగారావు లేచి నిలబడి ఆశ్చర్యంతో వెళుతున్న నారాయణను చూడసాగాడు.
***
‘‘నీలూ!..... నీ కలను గురించి నీవు నాకు మెసేజ్ చేశావు. నాకూ రాత్రి ఒక కల వచ్చింది. మామయ్య, అత్తయ్య మా అమ్మా నాన్నలు ఎంతో ఆనందంగా మన వివాహాన్ని జరిపించారు. సంవత్సరం మనం మహా జాలీగా గడిపాము. నాకు ఎస్.ఐ ఉద్యోగం వచ్చింది. నీవు గర్భవతిగా మారావు. హాస్పిటల్లో చేర్చాము. ఇరువురు కవల పిల్లలను ప్రసవించావు. ఆడ, మగ. పాపకు మా అమ్మపేరు నీలిమ, బాబుకు మీ నాన్నగారి పేరు పాండురంగారావుగా నామకరణాలు చేశాము.
అమ్మ పిలుపుతో మేల్కొన్నాను. కమ్మని కల చెదిరిపోయింది. వాస్తవంలోకి వచ్చాను. మీ నాన్నగారి తత్త్వంలో మార్పులేదు. పైగా నీకు సంబంధాలు చూస్తున్నారన్నావుగా!... ఇకపై ఆలోచించే తావులేదు. నేను రేపు నీ స్నేహితురాలు వనజ ఇంటికి వస్తాను. నీవు అక్కడికి వచ్చేయి. మనం మా వూరికి వెళ్ళిపోదాం. మా అమ్మానాన్నలు మన వివాహాన్ని బ్రహ్మాండంగా జరిపిస్తారు. మన ఇరువురి కోర్కె తీరుతుంది. ‘నా...నీ కలలు’ ఫలిస్తాయి, కాలగతిలో మామయ్యగారు తప్పక మారుతారు. అత్త సరేసరి... ఎప్పుడూ మన పక్షమేగా!.... దేనికీ భయపడకు... నేను వ్రాసిన ప్రకారం నడుచుకునేదానికి సిద్ధపడు.’’
ఆ మెసేజ్ చదివి నీలిమ ఎంతో భయపడింది. తల్లికి విషయం చెప్పింది. అంజలి కూతురుకు సపోర్టుగా నిలబడింది. నీలిమ తన స్నేహితురాలు వనజ ఇంటికి చేరింది. నారాయణతో అతని వూరికి వెళ్ళిపోయింది. నారాయణ తల్లిదండ్రులు వారి వివాహాన్ని ఘనంగా జరిపించారు.
కాలగతిలో సంవత్సరం జరిగిపోయింది.
కోటేసు ఈ సంవత్సర కాలంలో ఆ యింటి విషయాలు ఈ ఇంటికి... ఈ ఇంటి విషయాలు ఆ ఇంటికి రామదూత అంజనసుతునిలా చేరవేసేవాడు.
నీలిమ కవల పిల్లలకు జన్మనిచ్చిన సమాచారం కోటి అంజలికి తెలియజేశాడు.
నారాయణ ఇంటికి (వూరికి) ప్రయాణమయింది అంజలి. భర్తను సమీపించింది.
‘‘మీకు... ఎప్పుడూ స్వార్థం. మీ దృష్టిలో న్యాయం అనేది రెండు విధాలు. మీకు ఒక న్యాయం. ఇతరులకు మరో న్యాయం. మీమీద గౌరవంతో నేను నా కూతురు వివాహానికి వెళ్ళలేదు. ఇప్పుడు నాకు మనుమడు, మనుమరాలు కలిగారు. వారిని నా కూతురుని అల్లుడిని నేను చూడాలి. మీరు మీ తత్త్వాన్ని మార్చుకొని నాతో వస్తే సంతోషిస్తాను. నేను బయలుదేరుతున్నాను’’ నిర్భయంగా చెప్పింది అంజలి.
భార్య మాటలకు పాండురంగారావు బదులు పలుకలేదు. ఆశ్చర్యంతో శిలలాగే నిలబడిపోయాడు.
అంజలి వెళ్ళిపోయింది.
పాండురంగారావు.... మనోఫలకంలో చైతన్యం, పశ్చాత్తాపపు పవనాలు, నయనాలతో కన్నీరు.
‘‘ఒరేయ్ కోటిగా! కట్రా గుర్రపుబండి!....’’ అరిచాడు.
పావుగంటలో వరండా ముందు గుర్రపుబండి సిద్ధం....
‘‘అయ్యా!...’’ పాండురంగారావును సమీపించి పిలిచాడు పాండు.
పాండురంగారావు గుర్రపుబండిలో కూర్చున్నాడు.
పాండు బండి ఎక్కి గుర్రాన్ని అదిలించాడు.
బండి వీధిలో ప్రవేశించింది.
రాజువెడలె రవితేజములలరగా!....
‘‘అయ్యా!.... ఎక్కడికి?...’’ అడిగాడు పాండు.
‘‘నా చెల్లెలి వూరు అల్లూరికిరా!...’’ చిరునవ్వుతో చెప్పాడు పాండురంగారావు.
***
సమాప్తి
సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
రచయిత పరిచయం:
పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.
కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.
బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం
విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు
ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.
తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.
Comments