#VemuriRadharani, #వేమూరిరాధారాణి, #NaPerenti, #నాపేరేంటి, #TeluguKathalu, #తెలుగుకథలు

Na Perenti - New Telugu Story Written By Vemuri Radharani
Published In manatelugukathalu.com On 26/03/2025
నా పేరేంటి - తెలుగు కథ
రచన: వేమూరి రాధారాణి
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
సమయం రాత్రి 11 గంటలు కావస్తుంది. అప్పటి వరకు ఉరుకులు పరుగులు పెట్టిన నగర జీవనం సేద తీరుతుంది. అప్పుడప్పుడు వచ్చి పోయే బండ్ల చప్పుడు తప్ప పెద్ద జన సంచారం లేదు. నగరం నిద్రలోకి జారుకుంటుంది.
ఎదురుగా సాగరం స్థబ్దుగా ఉంది. రోజూ అలా సాగరం దగ్గర నిలుచుని చూడడం అలవాటు. కదిలే అలల్లా ఆలోచనలు మెదులుతు ఓ సారి కల్లోలం సృష్టిస్తే మరో మారు ఏదో లోకం లోకి తీసుకువెళతాయి. మెల్లగా నిట్టూర్చి తల ప్రక్కకు తిప్పి చూసాను. నాకు కాస్త దూరంలో ఓ వ్యక్తి మహా అంటే ఓ ముప్పై సంవత్సరాలు ఉంటాయనుకుంటా. బట్టలు మాసి పోయినట్లుగా ఉన్నాయి. అక్కడక్కడా చిల్లులకు తాపడం వేసినట్టు అతుకులు తన పేదరికానికి నిదర్శనంగా కనిపిస్తున్నాయి.
నేను వచ్చినప్పటి నుండీ గమనిస్తూ ఉన్నాను. అతనిలో కదలిక లేదు. ఎక్కడ కూర్చున్న వాడు అక్కడే ఉన్నాడు. ఏదో దీర్ఘంగా ఆలోచిస్తూ ఉన్నట్టు కనపడుతున్నాడు. నాకంటే దీర్ఘంగా ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారా అని ఒకసారి నవ్వుకుని ఆ వ్యక్తి వైపు అడుగులు వేశాను.
"నీ పేరేంటి?" అన్నాను, ఎలాంటి ఉపోద్ఘాతం లేకుండా.
అవతల వ్యక్తి అర్థం కానట్టు చూసి ఊరుకున్నాడు. అర్థం కాలేదో లేక నాకెంటిలే అనుకున్నాడో.
'ఏంటి పిచ్చివాడా లేదా చెమటివాడా'.. మనసులో అనుకొని "నీ పేరేంటి?" అన్నాను మళ్ళీ కొద్దిగా దగ్గరికి జరిగి.
ఆ మనిషి లో కదలిక
" ఇంతకీ మీ పేరేంటో? " అన్నాడు అసహనం గా నిర్లక్ష్యంగా.
"కోటేశ్వరరావు" అన్నాను.
నాకు తోడుగా ఓ వ్యక్తి ఉన్నందుకు కొంత ధైర్యం నా లాంటివాడే ఇతను కూడా అనుకున్నందుకు కొద్దిగా ఆనందం నా మొహంలో.
"నీకు పేరు ఉందిగా.. మరి ఎందుకు వచ్చావు? చూస్తుంటే పెద్ద మనుషి లా ఉన్నావు". అన్నాడు, డబ్బున్నోడికి దిగులేం ఉంటుందిలే అనుకోని ఉంటాడు.
"నా సంగతి తర్వాత.. నీ సంగతి చెప్పు! నీ పేరేంటి? నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి ఈ రాత్రిపూట!?” అన్నాను కొంత అనుమానంగా.
"నీ లెక్క సావ నీకైతే గాదు గానీ.. "అంటూ ఆగిపోయాడు.
“నేను చచ్చి పోడానికి వచ్చానని ఎందుకు అనుకున్నావ్. ఊరికే పొద్దుపోక వచ్చాను మరి నువ్వు?” అన్నాను.
ఓ సారి నా కళ్ళలోకి చూసి మౌనం గా ఉండి పోయాడు. నాకు ఒక్కసారిగా ఉత్సకత ఎక్కువైంది ఏం చెప్తాడా.. అని. ఓ నిమిషం ఏమీ మాట్లాడకుండా అలా నీళ్లకేసి చూస్తు ఉండి పోయాడు. మళ్లీ ఏమనుకున్నాడో
"నేను చెప్పినా అర్థం కాదులే నీలాంటోళ్ళకి కానీ.. నన్ను ఎవరు అడగలే నా పేరేంటి అని ఇయ్యాల దాకా” అన్నాడు.
"అదేంటి ఎలా? మీ వాళ్ళు ఏమని పిలుస్తారు!?” అన్నాను ఆశ్చర్యంగా.
"నన్ను కని పడేసిన తల్లి నాకు పేరు పెట్టలేదు. కుప్పతొట్టి పెట్టిన పేరు.. అనాధ.”
అతని కళ్ళల్లో ధైన్యం. మనసు ఒక్కసారిగా చివుక్కుమంది.
"నను చేరదీసిన దయున్న ముసలిది నన్ను ఒరేయ్ ఎర్రోడా అని పిలిచేది. నాకు ఆరు సంవత్సరాలు వచ్చేటప్పటికి అది కూడా దేవుడి దగ్గరికి పోయింది. దేవునికి కూడా నాలాంటి వాళ్ళని చూత్తే దయ కలగదు అనుకుంటా.
రోడ్లంపటి తిరిగేప్పుడు ఎర్రిబాగు లాడా అని పిలిచేటోళ్లు దోస్తులు. నాకా చదువు లేదాయే అందుకే.. అదే నా పేరు అనుకున్న.
పనికి పోయినప్పుడు పని పనికి ఒక పేరాయే చిన్న సేటు ఇంట్ల పనికి పోతే "ఒరేయ్" అని పిలిచిండు, పెద్దసేటింటికి పోతే ‘ఏయ్’ అని పిలిచిండు.”
నేను ఆ వ్యక్తినే చూస్తున్నాను. అతని కళ్ళలో సమాజం పట్ల హేయ భావం. కాసేపు ఇద్దరి మధ్య నిశ్శబ్దం
****
మళ్ళీ చెప్పడం మొదలు పెట్టాడు.
"నాకు నచ్చలే. పనికి పొదలుచుకోలే. వ్యాపారం చేద్దామని కూరగాయలు అమ్మినా అప్పుడు ‘ఓ కూరలు’" అంటూ ఓ అమ్మ.
‘కూరగాయలబ్బీ’ అంటూ ఒకరు పిలిచే.
అలా పోతూ ఉన్నానా 'ఒరే బాబు!ఇలా రా’ అంది ఓ తల్లి. ఇదేదో బాగుందే అనుకున్నా.
"మరి అదే ఉంచుకోలేకపోయావా!” అన్నాను కాస్త జాలి చూపిస్తూ.
"నా దోస్తులు పేర్లు సాయి, సీనయ్య, వెంకన్న అయితే నాకా పేరెట్లా అనుకుని ఆలోచన చేయ బడితిని.
ఓరోజు ఎవరో ఓ తల్లి ఇలా వచ్చి ‘పనుంది వస్తావా’ అంది. ‘డబ్బులు ఇస్తాను, తిండి పెడతాను’ అంది.
తిండి దొరుకుతుంది పైసలకి పైసలు వస్తాయి అనుకొని పోయిన.
అందరూ ‘పనోడా’ అని పిలవబట్టిండ్రు. గాడి కెళ్ళి ఏడికి పో ‘పనోడా, పనోడా’ అంటూ అందరూ ఒకటే పిలుపు. అందుకే నేను పనోడు అని పేరు పెట్టేసుకున్న. మా దోస్తులందరూ ‘ఇట్లా కాదురా మాలగా నీకు కూడా పేరుండాలే. ఆగా ఆఫీసులో పత్రం ఇస్తారట గది ఇస్తే పేరు వత్తది’ అని చెప్పిండ్రు.
అందుకే ఆడికి పోయినానా.. ‘నీ అయ్యెవరు? అమ్మ ఎవరు’ అంటా అడగబట్టే. ‘గాళ్ళే ఉంటే నీ తానికి ఎందుకు వత్తా’ అనుకొని మరల వచ్చి ఈడ కూలబడ్డ ". అన్నాడు తన విసుకునంతా మొహంలో చూపిస్తూ.
పేరు కోసం కూడా బాధ పడేవాళ్ళుంటారని అప్పుడే తెలిసింది.
"ఇంత వయసు వచ్చాక పేరు గొడవ ఎందుకు వచ్చింది " అని అడిగాను కుతూహలం చంపుకోలేక.
“మా గల్లీల లచ్చి కి నేనంటే చానా ఇట్టం, నాక్కూడా అదే” అంటూ సిగ్గుతో వంకర్లు తిరిగిపోయాడు.
"మరి పెళ్లి చేసుకోలేక పోయావా? అన్నాను నవ్వుతూ.
"గీడనే చిక్కంతామరి, ‘పేరు లేని వాడిని నేను లగ్గమాడ’ అనేసింది. అందుకే పొద్దుటికెల్లి ఈడనే గూకుని ఆలోచన చేత్తా ఉన్నా ". అన్నాడు.
వాడి కథ విన్నాక అసలు నాది ఓ బాధేనా అనిపించి "నేను పేరు పెడతాను.. మరి నాతో వస్తావా, నేను పెళ్లి కూడా చేస్తాను” అన్నాను.
మాలాటోళ్ళకి యే పేరైతే ఏముంది సారు. ఎవళ్లకి నచ్చినట్టు వాళ్ళు పిల్సుకుంటారు. గిన్ని కట్టాలుండగా పేరు కట్టాలెంటో నాకు, నేనే ఏదోటి సెప్పి లచ్చిని ఒప్పిచుకుంట వత్తా " అని వెళ్ళి పోయాడు.
అతని మాటల్లో అమాయకత్వం కంటే, సమాజం లో అతని స్థానం తలచుకుని భారంగా ఇంటి వైపు కదిలాను.
***
వేమూరి రాధారాణి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం:
రాధా రాణి. వేమూరి
స్కూల్ ప్రిన్సిపాల్
కవితలు, కథలు వ్రాస్తాను. ఇంతకు ముందు వేరే మాధ్యమాలలో వ్రాసాను.
Comentários