'Naa Thappu Emiti' written by A. Annapurna
రచన : A. అన్నపూర్ణ
''అమ్మాయ్! ఏమి చేస్తున్నావ్? ఎప్పుడూ తలుపు మూయని నువ్వు ఈరోజు ఎందుకు మూసావు? ఆరోగ్యం బాగుందా.. సారధి ఇంట్లో లేడా?” అంటూ తలుపు బాదుతున్నారు కిరీటి గారు.
'కాసేపు తలుపు తీయకపోతే ఆయనే వెళ్ళిపోతారు’ అని ఊరుకుంది అవని. కానీ ఆయన వెళ్ళలేదు. వీధి మెట్లమీద అలా కూర్చునే వున్నారు. కిటికీలోంచి చూసి కన్నీరు పెట్టుకుంది అవని. పది నిముషాల తరువాత ఆమె భర్త సారధి వచ్చాడు బయటనుంచి. మెట్లమీదున్న కిరీటి గారిని చూసి,
''అయ్యో బాబాయ్! ఇలా ఇక్కడ కూర్చున్నారేమిటీ? అవని లేదా ఇంట్లో.. అంటూ తన దగ్గురున్న కీతో తలుపు తీసి ఆయనను లోపలికి తీసుకు వచ్చాడు.
అప్పడే వచ్చినట్టు అవని ఆయనను పలకరించింది. ''అయ్యో! నేను వెనుక గార్డెన్ లో వున్నాను” అంది.
''పర్వాలేదు లేమ్మా! కాసేపు మెట్లమీద కూర్చుంటే ఏమైంది? మీ అత్తమ్మకి నువ్వు చేసే రొట్టె తినాలని ఉందిట. సాయంత్రం వచ్చి తీసుకెళ్తాను. చెప్పి పోదామని వచ్చాను..” అన్నారు కిరీటి గారు.
''అయ్యో దానికేముందీ! ఈ రోజు అదే చేయమని చెబుదామనుకున్నాను. అలాగే చేస్తుంది లెండి. అందులోకి ఏ చట్నీ చేయమంటారు బాబాయ్?” అన్నాడు సారధి.
“అవనికి కొత్తగా చెప్పాలా! మామూలే.. అల్లం, ఉల్లి, టొమేటో కలిపి చేస్తుందిగా! నాకు తెలుసు” అన్నారు ఆయన. అప్పుడప్పుడు ఆయన ఇష్టమైన వంటలు అడిగి చేయించుకుంటారు.
ఆయన అటు వెళ్ళాక ''బాబాయి గారిని చూస్తే జాలివేస్తుంది. పెద్దవయసు. చేసుకునే ఓపిక లేదు. కోడలు మోహిని ఏది పెడితే అది తినాలి. మనం చేసిపెట్టడానికి బాధని కాదు.. ఆయన అడిగింది చేసి పెట్టామని తెలిసాక, మోహిని నన్ను తిడుతుంది. 'ఆయనకు రోగం వచ్చి మంచం పడితే నువ్వు చేస్తావా? మా ఇంటి విషయాలు కలుగ చేసుకోడానికి బుద్ధి వుండాలి..' అంటూ మనకు వినబడేలా అరుస్తుంది.పరమ గయ్యాళి! ఎలాగండీ? మనం మానవత్వం అనుకుంటే ఆవిడ పరువు తక్కువ అనుకుంటుంది.''
''అవును. నాకూ తెలుసు. ఆయనను చూస్తే మా నాన్నగారు గుర్తుకు వస్తారు. అంతే తప్ప బాబాయ్ గారికి లోటు అని కాదు. మోహిని కూడా ఇంత రాద్ధాంతం చేయక్కర్లేదు. స్నేహ భావంతో చేస్తారు అనుకోవచ్చు. మామూలుగా కిరీటిగారి అబ్బాయి జయరాం ఇలాంటి విషయాలు పట్టించుకోడు. కానీ మోహిని చెప్పాక నాతో ఈ విషయంలో గొడవ పెట్టుకున్నాడు. ఆ విషయం బాబాయికి చెప్పేను కూడా .
‘నువ్వు పట్టించుకోకు సారధీ! నువ్వు నా మనవడితో సమానం కనుక నీతో చెబుతున్నా.. వాడూ, కోడలూ, పిల్లలు శనివారం హోటల్లో భోజనం చేసి వస్తారు. మేము ఏమైనా తిన్నామో లేదో అడగరు. ఒక పండు లేదు, కాయ లేదు.. కనీసం చవకగా వచ్చే అటుకులు మరమరాలు కొని ఇవ్వచ్చు కదా! ఏనాడు ఈమాట ఎవరితో చెప్పుకోలేదు. నాకు ఆకలి చావలేదు. అదేం ఖర్మో..’ అంటూ అంత పెద్దాయన కళ్ల నీళ్లు పెట్టుకుంటే బాధ అనిపించింది. వాళ్ళు ఎన్ని అన్నప్పటికీ మనం లెక్కచేయద్దు. ఏమి జరుగుతుందో జరగనీ..’ అన్నాడు సారధి.
"సరే!” అన్నప్పటికీ మోహిని తిట్లు భరించలేక ఈ రోజు కిరీటిగారు వచ్చినా తలుపు తీయలేదు. ఇదంతా భర్తకు చెప్పింది అవని.
''ఆయన ఉదయం టిఫిన్ హోటల్లో కొనుక్కుంటున్నారు. ఆయనకు పాతకాలపు వంటలు, రొట్టెలు ఇష్టం. అవి ఎక్కడా అమ్మరు. నీకు ఆ వంటలు వచ్చు కనుక అడిగారు. కొంచెం శ్రద్ధ పెడితే చేయడం కష్టం కాదు. అదీకాకుండా ఈ దిక్కుమాలిన తిళ్ళు వచ్చాక ఆడవాళ్ళూ వంటలు చేయడం మానేశారు. ఏదో పుట్టినరోజు, పెళ్లిరోజు లాటివి చేసుకోవచ్చు. ప్రతివారం తప్పనిసరిగా బయట హోటల్లో తినడమే! వాటిలో ఆరోగ్యం లేదు, నష్టం తప్ప! వీళ్లు టీవీ సీరియళ్లు చూడటం తప్ప చేసే పనేమిటీ.. ఇంటిదగ్గిర?” అన్నాడు సారధి కోపంగా.
''అయ్యో! ఈ కాలనీలో అవి చూడని దాన్ని నేను ఒక్క దాన్నేనట! ‘సంపాదన, ఇంటిపని తప్ప ఆవిడకు మనమంటే పడదు’ అని అందరూ ఆక్షేపిస్తారు.''
''మా ఫ్రెండ్ సుదర్శన్ భార్యకి వంట పనికోసం ముగ్గురు పనివాళ్ళు. పోనీ అనారోగ్యమా.. కాదు. వుద్యోగం చేస్తోందా.. లేదు! అత్తమామలు వున్నారా.. వీళ్ళతో వుండరు. కేవలం భర్త బాగా సంపాదిస్తాడని స్టేటస్ మెయిన్ టైన్ చేయడానికి. అందుకే కొత్త రోగాలు పుడుతున్నాయి.
ఇంటిపని చేసుకోవడం చాకిరీ అంటారా? మనపని మనం చేసుకోడం మించిన ఆరోగ్యం లేదు. నా అదృష్టం బాగుంది అవనీ! నాకు తగిన పార్ట్నర్ వి దొరికావు..” అన్నాడు ప్రేమగా.
''మోహిని మనతోనే ఇంతగా పోట్లాడుతోంది. కిరీటి గారినీ, అత్తగారినీ ఇంకెంత వేధిస్తుందో పాపం.. నాకు అర్థంఅవుతోంది”.
''మనం ఏమీ చేయలేము. వాళ్ళకీ అలవాటు అయి ఉంటుంది. అలాగే ఓర్చుకుంటున్నారు.'' అన్నాడు సారధి.
సాయంత్రం కిరీటి గారు అడిగిన రొట్టెలు, చట్నీ చేసి ఉంచింది. కానీ ఆయన రాలేదు.
‘అదేమిటీ.. ఆయన రాలేదు? వాళ్ళు రాత్రి టిఫిన్ చేసే టైము గడిచిపోయింది కూడాను’ అనుకుని చాలాసేపు ఎదురు చూసారు.
అర్ధరాత్రి హాస్పిటల్ అంబులెన్స్ వస్తే ఎవరికి ఏమైందో అని కంగారు పడ్డారు. అటునుంచి వచ్చిన పనిమనిషి మర్నాడు చెప్పింది. “కిరీటి బాబుగారి భార్య చనిపోయారటమ్మా! రాత్రి గుండెపోటు వస్తే ఆసుపత్రిలో చేర్చారట” అంది.
''అయ్యో పాపం! కష్టం సుఖం మాట్లాడుకోడానికి తోడు లేకుండా పోయింది. ఆయన ఎలా తట్టుకుంటారో!” అనుకున్నారు అవని, సారధి. జయరాంతో అంత సఖ్యత లేకపోయినా పలకరించి వచ్చారు. పదిహేను రోజులు గడిచి పోయాక వచ్చారు కిరీటిగారు, సారధి ఇంటికి. మనిషి బాగా కృంగిపోయారు. చిన్నతనంలో జరిగిన పెళ్ళి. డెబ్బై ఏళ్ల బంధం! ఉన్న ఒక్క కొడుకు దగ్గరా నిరాదరణ ఆయనకి. ఆవిడ బ్రతికి ఉన్నంత కాలం అంతగా బాధించలేదు.
కానీ ఇప్పుడు ‘ఎలా గడుస్తుందో’ అని దిగులుపడ్డారు.
''రండి బాబాయిగారూ! టిఫిన్ చేశారా? బంధువులంతా వచ్చారా? అంటూ అడిగాడు సారధి, ఆయన భుజం మీద చేయి వేసి సోఫాలో కూర్చోబెట్టి.
''లేదు. ఎవరికీ చెప్పలేదు! ఎందుకు వాళ్ళని శ్రమపెట్టడం? అంతా వయసు మళ్లినవాళ్ళే.'' అన్నారు కిరీటి గారు.
''ఆరోజు అసలు ఏమి జరిగింది బాబాయిగారూ? అంత హఠాత్తుగా గుండె నొప్పి ఎలా వచ్చింది? ముందు నుంచి అనారోగ్యం వుందా?” అడిగింది అవని.
''అవునమ్మా! చెప్పేది. జయరాం పట్టించుకోడు. మోహిని సంగతి మీకు తెలుసు. ఏదో చవకగా వస్తాయని హోమియోపతి మందులు తెప్పించి ఇచ్చేది. ఆరోజు రాత్రి నువ్వు చేసిన రొట్టె తీసుకుందామని రాబోతుంటే కోడలు చూసింది. అడ్డుపడి '' ఛీ! పొరుగింటి తిండి తినేకంటే విషం తాగి ఛస్తే నయం'' అంటూ చీదరించుకుంది. కాసేపు ఉండి వద్దాం అనుకున్నాను. ఆకలికి ఆగలేక వారం క్రితం నువ్వు ఇచ్చిన అటుకులు తిన్నది. అవి గొంతుకు అడ్డుపడ్డట్టున్నాయి. మింగలేక అవస్థ పడింది. కోడలిని పిలుచుకు వద్దామని వెళ్ళాను. ఆవిడ లేవలేదు. వాళ్ళు అసలు తలుపులే తీయలేదు. నేనే కాసిని మంచినీళ్లు తాగించి మెలకువగా వున్నాను. తెల్లవారు జామున గుండె నొప్పివచ్చింది..” అంటూ చెప్పారు.
''ఆవిడ అదృష్టవంతురాలు. మీరు ఒంటరి అయ్యారు..” అంది అవని.
''ఎవరికైనా తప్పదు. మంచం మీద తీసుకోకుండా పోవడమే కావాలి'' అన్నాడు సారధి.
''నిజమేనోయి..” అంటూ.. ఆవిడతో పెళ్లి, సంసారం, జయరాం పుట్టడం, ఉద్యోగంలో ఇబ్బందులు.. ఇలా ఎన్నో గుర్తు చేసుకున్నారు కిరీటి గారు, తన జ్ఞాపకాలను సారధి, అవనీలతో పంచుకుంటూ..
''మోహిని మొదటి నుంచి ఇంతేనా?” అడిగాడు సారధి.
''అంతే..! అది గ్రహించి నేను మా వూళ్ళోనే ఉండిపోయాను. జయరాం, పిల్లల పెళ్లిళ్లు అయ్యాక మావూళ్ళో ఇల్లు, పొలం అమ్మేసి తీసుకు వచ్చాడు. అదంతా వాడిపేరుతో బ్యాంకులో వేసుకున్నాడు. వెనకాల అవుట్ హవుస్ లో ఉండమని కొన్నాళ్ళు వంట మనిషిని పెట్టేరు. ఆ తర్వాత వంటమనిషి వాళ్ళింటికి మారి.. అక్కడినుంచే భోజనం తెచ్చేది. అదే ఇప్పటిదాకా జరిగింది. పెద్దవాళ్ళకి కారాలు, నూనెలు పడవని ముద్దగా చేసిన గోధుమ అన్నం జావా, చప్పిడి కూరలు మార్చింది.
అప్పుడే మీరు కొత్తగా ఈ ఇంట్లోకి రావడం, నాకు పరిచయం అవడం మీ పుణ్యాన కడుపునిండా తినడం జరిగింది. మూడేళ్లు మాకు సంతోషాన్నిచ్చారు. మా వాళ్లతో నిష్టూరాలు పడ్డారు. ఏ నాటి రుణం ఇదీ! ఇదిగో.. ఇప్పటిదాకా గడిచింది” అన్నారు కిరీటి గారు కళ్ళు ఒత్తుకుంటూ.
''అంత మాట అనకండి బాబాయిగారూ! మీరు నా తండ్రిలాటివారు. రుణాలూ, కృతజ్ఞతలూ లేవు"
అన్నాడు అయన చేతులు కళ్ళకి అద్దుకుంటూ సారధి. అవని ఆయనకు ఇష్టమైన ఉప్పుడు పిండిలో నేయి వేసి పెరుగు కొబ్బరి పచ్చడి కారం లేకుండా చేసి పెట్టింది.
పళ్లెం తీసుకుని రెండు స్పూన్లు తిన్నారు. ఇక తినలేక పోయారు కన్నీళ్లు ఉబికి వచ్చాయి. ఆవిడకు కూడా ఇష్టమే అని గుర్తుకు వచ్చింది.
అది గ్రహించి ప్యాక్ చేసి ఇచ్చింది అవని.
''వెడతాను.. నిద్రవస్తోంది.. అన్నారు కిరీటి గారు.
'' మళ్ళీ బయలుదేరారా తిండి ముష్టికి?” అంటూ మోహిని అరుపు వినిపించింది.
''పదండి దిగబెడతా” అంటూ సారధి కూడా వెళ్ళాడు.
తిరిగి వచ్చాక ''ఆవిడ పెట్టదు, మన ఇంట్లో తిననివ్వదు. ఏమి గొప్ప మనసో..” అన్నాడు సారధి.
''అదే నాకు అర్థం కాదు. ఈ విషయం మనకి తప్ప ఎవరికీ తెలియదుకదా..? ఆవిడకి బాధ ఎందుకో? కొందరు ఇంతే! మారరు..” అంది అవని కిరీటిగారి మీద సానుభూతితో.
వారానికే సారధికి ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ వచ్చాయి. అవని సెలవు పెట్టింది. తానూ ట్రాన్స్ఫర్ కి ప్రయత్నం చేయాలి అనుకుంటూ..
ఈ కబురు విన్న కిరీటి గారు దిగులుపడ్డారు. ఆయనను వదిలి పోవాలంటే సారధి, అవనీ కూడా బాధ పడ్డారు. కానీ తప్పదు!
''వెళ్లి వస్తాము బాబాయిగారు.. ఫోను చేస్తూ వుంటాం, దిగులుపడకండి” అంటూ వీడ్కోలు తీసుకున్నారు.
బహుశా మోహిని సంతోషించి ఉండచ్చేమో !
ఇది కథ కాదు, నిజం ! కొందరు పెద్ద వయసులో ఇష్టమైనవి తినాలనుకోవడం అర్థం చేసుకున్నవారు మానవత్వంతో చేసిపెడితే జరిగే అనర్ధాలు నా స్వంత అనుభవం. పాఠకులతో పంచుకోవడమే ఈ రచన ఉద్దేశం.
***శుభం***
మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.
రచయిత్రి పరిచయం : నాపేరు అప్పాద్వేదుల అన్నపూర్ణ. నాది కాకినాడ. మా నాన్నగారు శ్రీ బులుసు వెంక టేశ్వర్లుగారు, పిఠాపురం రాజా వారి కళాశాలలో ఇంగ్లీష్ లెక్చరర్ గా పనిచేసారు. ఆయన రచయిత, కవి, పండితులు. ఇంగ్లీష్, తెలుగు, సంస్కృతం సబ్జెక్ట్స్ లో పీజీ చేసారు. ఇంటినిండా గ్రంధాలూ, ఇంటి ఎదుట నేను చదువుకునే స్కూల్ గ్రంధాలయం వున్న కారణమో, నాన్నగారి ప్రభావమో అన్ని పుస్తకాలూ చదివాను. ఆరుద్రగారు డాక్టరేటు చేసే రోజుల్లో నాన్నగారి దగ్గిరున్నగ్రంధాలు తీసుకెళ్లారు. విశ్వనాధ, దివాకర్ల వంటి దిగ్గజాలు మాఇంటికి వచ్చి కాకినాడలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొనేవారు. అలా వారిని చూసినట్టు లీలగా గుర్తు. నాన్నగారు రాసిన 150 పుస్తకాల్లో ఒకటి అప్పటి విద్యాశాఖ మంత్రి శ్రీ పీవీగారు, విశ్వనాధ, దివాకర్ల ఆవిష్కరించారు.
తరువాత మహాఋషుల చరిత్రను (పది భాగాలూ) టీ టీ డీ వారు హక్కులు తీసుకుని ప్రచురించే
అవకాశం కల్పించిన శ్రీ పీ వీ ఆర్ కె ప్రసాదుగారు.. ఇలా చాల గుర్తులు మెదులుతూనే వున్నాయి.
నాగురించి చెప్పాలంటే రచనలు చేయడం ఆలస్యంగా జరిగింది.చదువు పెళ్లి పిల్లలు బాధ్యతలు తీరి రచన పత్రికలో 'వసుంధర' గారి ప్రోత్సహంతో నామొదటి కథ ''సెలయేరులో అల'' ప్రచురించబడింది. ఆ తరువాత అన్నిపత్రికల్లో వచ్చాయి. ఎక్కువగా రచన, ఈనాడువారి చతుర, విపుల లో ప్రచురించారు. ఇటు ఈ కథలు, చతుర నవలలు రాస్తూనే లోక్ సత్తా సంస్థ స్థాపకులు డా.జయప్రకాశ్ నారాయణగారి సంస్థలో చేరాను. పార్టీలోనూ పనిచేసాను. సంస్థ పత్రికలో వ్యాసాలు రాసే అవకాశం జె పీ ఇచ్చారు. ఇరవై సం.లు వారితోపాటు పనిచేసే మహత్తరమైన అవకాశం లభించడం నాకు గర్వకారణం. ఇప్పుడూ లోక్ సత్తా లో వ్యాసాలు రాస్తూనే వున్నాను. కవితలు కూడా రాస్తూ వుంటాను. మావారు మేథ్స్ ప్రొఫసర్. మాకు ముగ్గురు పిల్లలు.అమెరికాలో వున్నారు. మేము కూడా ఎనిమిది సం.గ ఇక్కడే అమెరికాలో వుంటూ వున్నాము.
ధన్యవాదాలు.
అన్నపూర్ణ.
Commentaires