#YasodaGottiparthi, #యశోదగొట్టిపర్తి, #నడవడిక, #Nadavadika
'Nadavadika' - New Telugu Story Written By Yasoda Gottiparthi
Published In manatelugukathalu.com On 29/10/2024
'నడవడిక' తెలుగు కథ
రచన: యశోద గొట్టిపర్తి
“మీ సిద్ధూ చూడండి! మా ఇంటి ముందున్న చెట్ల పూలన్ని ఎట్లా కత్తిరించాడో?” అన్నది కోపంగా పక్కింటి పిన్ని..
“ఏదో తెలియక చిన్నతనం ఆట పాటలతో చేశాడండి. ఇరుగు పొరుగు అన్నతరువాత సర్దుకు పోవాలండి. పిల్ల వాడు కదా” అని కలుపుగోలుగా చెప్పింది నానమ్మ.
“ఎంత చిన్న తనం అయితేనేమండి, చెడగొట్టుతనం ఉంటే భరించటమే కష్టం. మీరు చిన్నవాడు అని మందలించకుండా ఇలాగే గారాబం చేస్తుంటే పెరిగిన తరువాత అవస్థల పాలు చేస్తాడు. ఇప్పుడు పూలే కదా అని తేలికగా తీసుకుంటే, ముందు ముందు కోరుకున్న వాటినల్లా ధ్వంసం చేస్తాడు”.
“నానమ్మా! తాతయ్యా! పువ్వులన్ని పూలదండ చేసి ఇద్దామను కున్నా అంటీకి" అని ముద్దుగా చెప్పాడు బాబు.
“అలాటప్పుడు అడిగి కోయాలి నాన్నా! ఇపుడు సారీ చెప్పు"
“ఉహు చెప్పను. ఆ పువ్వులన్ని వాళ్ళకే ఇచ్చాను కదా!”
ఇంతలో లోపలి నుండి తల్లి లక్ష్మి వచ్చి, “క్షమించండి పిన్ని గారూ! మళ్ళీ యిలాటివి జరగకుండా చూస్తాను” అంది.
“నాన్నా సిద్ధూ! పరాయి వస్తువులను తాకరాదు, నీకు ఏది కావాలన్నా నాన్న గారు ఇస్తారు. ఇలాటి అల్లరి కదలికలు మానాలంటే నిన్ను బడికి పంపిస్తాను".
*****************
లక్ష్మి, శ్రీనాధ్ లు బ్రాహ్మణ దంపతులు. వారు చేసుకున్న కర్మో, దురదృష్టమో పుట్టినవారు పుట్టి నట్లు చనిపోయారు. ఒకరు కూడ బ్రతకలేదు.
శ్రీనాధ్ మహా పండితుడు. వేద పండిత సభలకు, సమావేశాలకు వెళ్లి బహుమానాలు తెచ్చుకునే వాడు. గ్రామ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్ధన చేస్తూ, నిత్యానుష్టానములు చేసుకుంటాడు. భార్య ఆతని అడుగుజాడల్లో నడిచేది. సంతానం దక్కట్లేదు అనే వేదన ఇద్దరిలో ప్రతిక్షణం ఉండేది.
భర్తను చూచి “నాధా! పూర్వ జన్మ సుకృతమో, దుష్కృత్తమో తెలియని ఈ కొరత మన జీవితాలలో వేధిస్తున్నది. ఇరువురం తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలు, దైవ దర్శనాలు చేసుకుంటే, పాప పరి హారమై సత్సంతానo కలుగు తుందేమో అనిపిస్తుంది. భార్య బాధను అర్ధం చేసుకుని, భార్య సమేతంగా పాద యాత్రలకు బయలు దేరారు.
తుంగ భద్ర నదిలో స్నానం చేసి అష్టా దశ శక్తి పీఠాల్లో జోగులాంబ ను దర్శనం చేసుకుని, ఆ మాతనిలా ప్రార్ధిం చింది. “తల్లీ! నా జీవితం సంతాన నష్టాన్ని తొలగించే దుష్కర్మల ను తొలిగించి, వంశోద్దారకుడైన పుత్రుణ్ణి ప్రసాదించ”మని వేడుకుంది.
గృహం లో బంధు సమాగమము, అన్న సమారాధన, భూరి దక్షిణలు, సంభావనలు, గోదానములు కూడ చేసినారు. కొద్ది రోజులలోనే లక్ష్మి మగ పిల్లవానికి జన్మ నిచ్చింది. పేరు సిద్ధూ అని పెట్టి అల్లారు ముద్దుగా పెంచుతున్నారు. పెరిగి పెద్దవాడవుతున్న కొద్దీ, అతి గారాబం తో మొండి ప్రవర్తన, చెప్పిన మాట వినకపోవడం, బడి చదువులో శ్రద్ధ పెట్టకపోవడం వల్ల ఉపనయనం చేస్తే బుద్ధి మంతు డవుతాడని అనుకుని ఇంట్లో శుభకార్యం జరిపించారు.
చాలా రోజులతరువాత శుభకార్యం జరుపుకుంటున్నారని బంధువులంతా వచ్చారు. ముహూర్త సమయంలో తండ్రి కుమారుని చెవిలో గాయత్రి మంత్ర ఉపదేశం చేస్తుంటే సిద్ధూ మాత్రం సరిగా పలుకలేక పోయాడు.
"వాడు మంద బుద్ధి అని తెలిసి చాలా ఖర్చుపెట్టి ఇంత వైభవంగా చేసినా ఒక్క మంత్రం కూడా పలుకలేక పోతున్నాడు" అని కొందరు శ్రీనాధ్ ను ఎగతాళి చేసారు.
ఎక్కడి బంధువులు అక్కడికి వెళ్లిపోయారు. అయినా కొడుకుతో ఉదయం, సాయంత్రం మంత్రాలు పలుకరింప చేసే ప్రయత్నం విడువ లేదు. కాని సిద్ధుకి మంత్రాక్షరాలు నోరుతిరుగక ఉఛ్చరించలేకపోయేవాడు. తండ్రి కోపం తో దండించే వాడు.
రోజూ కొడుతుంటే తల్లి చూచి భరించలేకపోయేది. విద్య రావాలంటే ఆమాత్రం దండించాలేమో అని ఓర్చుకున్నది.
కొన్ని రోజుల తరువాత “మీరు ఎంత కొట్టినా బుద్ధి వికసించకపోతే మంత్రాలెలా వస్తాయి? కొడుకు అమాయకుడే! అర్ధo కావట్లేదేమో? అందుకని కొట్టి చంపేస్తారా? " అంటూ భర్తను వారిస్తూ రోజూ కొడుక్కి అడ్డుగా పోయేది.
“దెబ్బలు కొడితే భయం ఉంటుంది. భయంవల్ల చదువు వస్తుంది”.
“బాగా చదువుకున్న వారు మీరు, కొట్టి చెపితే చదువువస్తుందా? అర్ధం చేసుకోండి”.
"నీవు వీడిని అతి గారాబం చేసి మూర్ఖుడి గా తయారు చేసావు" అని భార్యపై కోపగించాడు. ఈ పాఠాలు తప్పితే చాలు అని సిద్ధూ పారిపోయే వాడు. ఒకనాడు మితి మీరిన కోపం తో కొడుకును కొడుతుంటే లక్ష్మీకి బాగా కోపం వచ్చి,
"నాథా! ఇక వీడి మీద ఒక దెబ్బ పడినా నేను సహించలేను. ఆత్మహత్య చేసుకుంటాను. వీడి కర్మలో ఏది ఉన్నదో అదే జరుగుతుంది. కొట్టినంత మాత్రాన బుద్ధి రాదన్నాను కదా! ఎన్నో మొక్కులు మొక్కి ఒక్క కొడుకు దక్కితే చాలని ప్రార్ధించుకుంటే ఇలా చంపుకోవడానికా? మనకింతే ప్రాప్తి అని గమనించుకోలేరా! మీ విద్యలు కనీసం ఈ మాత్రం ఆలోచించుకోనివ్వడం లేదా? నేను వీడిని చూచుకుని మాత్రమే బ్రతుకుతున్నాను. వేద విద్య లేనంత మాత్రాన వీడు మనిషిగా ప్రపంచం లో బ్రతుక గూడదా? " అంటూ కఠినంగా మాట్లాడింది.
ఎప్పుడు భర్త మాట కెదురు మాట్లాడని భార్య ఆ విధంగా అనేసరికి బాధ పడ్డాడు. "అవును, దేవుడే ఎవరికర్మ కు వారిని వదిలేస్తాడు. నేను మాత్రం ఈ విధంగా తాపత్రయ పడాలి. ?"
లోలోపల కుమిలిపోతు, మహా పండితుని కొడుక్కి గాయత్రీ మంత్రం రావట్లేదని అపఖ్యాతి కన్నా మరణం ఏమంత గొప్ప కాదని, ఆరోజు నుండి యజ్ఞ యాగాదులకు, శుభాకార్యాలకు వెళ్లడం మానివేశాడు శ్రీనాధ్.
తీర్థ యాత్రలు, శుభాకార్యాల ఖర్చులతో ధనమంతా ఖర్చయి పోయి ప్రయోజనం చేకూర్చలేదు. బాలుడు విద్యావంతుడు కాలేక పోయాడని, వంశ గౌరవం నిలబెట్ట లేదని క్రుంగి కృశించి కొద్ది రోజుల లోనే మరణించాడు. లక్ష్మి కి భర్త మరణం తో, కొడుకు ఉండీ సంపాదన లేక ఊరిలోనూ వారందరు భిక్ష కూడ వేయలేదు.
రాను రాను ఇంట్లో ఉన్న సామాగ్రిని విక్రయించి, పొట్ట పోసుకున్నారు. కొడుకు మూలంగా ఆతల్లికి ఏవిధమైన రాబడి ఆగ్రామంలో రాలేదు. ఇంట్లో గాదెలన్నీ ఖాళీ అయినవి. ఎన్నడు కష్ట మంటే తెలియని ఆమె ఆపరిస్థితుల్లో కాయకష్టం చేసి జీవించ వలసి వచ్చింది.
"పూలమ్మిన చోట కట్టెలమ్మినట్లు " ఆ గ్రామం లో బాగా బ్రతికి ఏపని చేయలేక, కొన్ని రోజులు తాను ఉప వాసములుంటూ, కొడుకు కి అన్నం పెట్టింది. అయినా కొడుకులో ఏ మార్పురాక, ఆ ఊరిలో ఇద్దరికీ స్థానం లేదని ఆలోచించి గ్రామాన్ని విడిచిపెట్టింది. కృష్ణా నదిని దాటి చుట్టుప్రక్కల గ్రామాలలో బ్రాహ్మ ణుల ఇళ్లలో వంటపనులు చేస్తూ కొడుకుని పోషించుకుంది.
ఎవరు ఆదరిస్తే వారింట్లో తల దాచుకుంటూ, సొంత ఊరు వదిలిన తర్వాత ఏ ఊరు ఐతేనేమి, ఆదరణ దొరికితే సరిపెట్టు కుంటూ భగవంతుని ప్రార్ధిస్తూ, ఏనాటికైనా మంచి రోజులొస్తాయని, వాడినొక ఇంటి వాడిని చేయాలనీ కలలు కనేది పిచ్చితల్లి.
తల్లి తన గురించి ప్రార్ధిస్తుందని తెలుసుకొని, తల్లికి చెప్పకుండా తీర్థ యాత్రలు చేస్తున్న భక్త బృందం తో పాదయాత్రలు చేస్తూ, అక్కడ వారు వృద్ధులకు, వికలాంగులకు చేసే సేవలు కళ్లారా చూసాడు. కాళ్ళు లేని వారిని భుజాలపై మోస్తున్నప్పుడు తాను సహాయం చేసాడు. చిన్నతనంలో తల్లి చెప్పిన శ్రవణ కుమారుడు కథలో తల్లి తండ్రులకు తీర్థ యాత్రలు చేయించిన విధము గుర్తుకు వచ్చినది. వారంతా ఆశ్రమాలకు వెళ్ళాక తాను ఏడు రోజుల తర్వాత ఇంటికి చేరుకున్నాడు.
కొడుకు కనిపించడం లేదని ఎవరినన్నా అడగాలన్నా ఈసడిం చుకుంటారని భయం. బాధపడుతూ అందరిని అడిగితే ఎగతాళి చేస్తూ, "ఎందుకమ్మా! అప్రయోజకుడైన కొడుకు ఉండి నిన్నేమి ఉద్ధరిస్తాడు? నీవు సంపాదిస్తే తినేవాడే కానీ నీకు పెట్టే ఆశ ఎలాగూ లేదుగా! పోనీ! ఎటైనా పోయి వాడి పొట్టయినా పోషించుకుంటే సంతోషించరాదా! " అని ఎగతాళి చేసారు.
లక్ష్మి మనసు ఎంతో గాయపడింది. దేవుని ప్రార్ధించింది. పెళ్లి చేయాలనుకున్నాను, ‘తల్లీ, జోగులాంబా! నీవు ప్రసాధించిన పుత్రుని వంశాభివృద్ధి లేకపోతే ఈ వరం నాకిచ్చి ఏమి ప్రయోజనం తల్లి” అంటూ ప్రార్ధించింది. తల్లిని కదా! ఓపిక ఉన్నన్ని రోజులు వంటలు చేస్తూ, నీరు మోస్తూ వాడికన్నం పెట్టుకుంటుంటే, చూచే వాళ్ళు ఓర్చుకోలేక పోతున్నారే! భగవాన్! ఇదేమి లోకం? మా బోటి వాళ్ళు బ్రతికేటందుకు కూడా అర్హత లేదా’ అంటూ దుఃఖిస్తూ నిదురించింది.
మరునాడు వచ్చిన కొడుకుని చూచి, "నాయనా సిద్దు! ఏడురోజులనుండి కనపడకపోతే ఏమైపోయావో ? అని బాధ పడుతున్నానురా! నాకు చెప్పకుండా ఎక్కడికి పోయినా”వని అడగగానే అప్పడు “అదిగో నువ్వుకూడా అదే ప్రశ్న వేస్తున్నావు? ఎదురింటాయన అడిగితే ‘యాత్రికులతో పాదయాత్ర చేస్తూ నదులలో స్నానం చేశాను. స్వాముల దర్శనాలు చేసుకున్నాను’ అని చెప్తుంటే ‘అక్కడిదాకా వెళ్లినావు కదా! ఆ నదిలో పడి చావక పోయావా? మళ్లేందుకు వచ్చావు?’ అన్నాడమ్మా! నువ్వు అలాగే అంటావు కదా! అందుకే నీకేమి చెప్పలేదు. నేను చెప్పను” అన్నాడు.
దగ్గరికి తీసుకుని గారంగా తల్లి ఇలా అన్నది "కృష్ణా నదిలో స్నానం చేస్తే మంచిదే నాయనా! రోజు నీ తండ్రి నేను చేసేవారం. ఆస్వామి వరం వల్ల నువ్వు పుట్టావు”.
“అక్కడ స్వామి వారుకూడా అదే చెప్పారు. కర్మలు పోతాయన్నారు. నాకు కొంచెం కొంచెమే అర్ధం అయింది”.
"మంచిదేలే నాయనా! ఇతరులతో మనకెందుకు? నీవు తిరిగొచ్చావు నాకదే చాలు. "
******************
మరునాడు ఒకరింట్లో తద్దినం వంట చేయడానికాని తొందరగా లేచి వెళ్ళిపోయింది. యాత్రలలో ఉన్నన్నాళ్ళు స్నానం చేయగానే బొట్టు పెట్టుకోవాలని తెలుసు కున్నాడు. అలవాటు మరవకుండా దేవుడి దగ్గర గంధం, కుంకుమ తీసుకుని బొట్టు ధరించాడు.
అంతకుముందు ఎవ్వరు చెప్పిన ధరించలేదు, స్వామి మాటలు మదిలోకి వచ్చి గురువు యొక్క గొప్పదనం గురించి, గురువు సాక్షాత్ పరమేశ్వరుడే నని, గురువు లేనిది ఈ ప్రపంచంలో ఏది లేదని ఆజ్ఞానులు చెప్పుకొన్నవన్ని జ్ఞప్తికి వచ్చింది. సిద్దుకు మామూలుగా జరిగిన విషయాలు గుర్తుండవు. అందువల్లనే పాఠాలు చదవ లేకపోయాడు. మతిమరుపు వల్ల గుర్తుండేవి కావు.
ఇంటికీ వచ్చిన తల్లి అస్వస్థత తో బాధ పడుతుంటే, దగ్గరికి వెళ్లి జ్వర బాధ అని గుర్తించి కషాయం చేసి తగ్గేంత వరకు కంటికి రెప్పలా చూచుకున్నాడు. కొడుకులో వచ్చిన మార్పు గమనించి తాను ప్రార్ధించిన భగవంతుడే, యాత్రల మూలంగా కొడుకును ఆశీర్వదించాడు, ప్రయోజకుడయ్యాడు అని ప్రార్ధించింది.
మరునాడు పెళ్లి వంటలు చేయడానికి, నీరు మోయడానికి తానే వెళ్తానని తల్లిని ఒప్పించాడు.
లోకమంత ఒక్కటైనా తల్లి తనకు నీడలా తన నడవడికలో సన్మార్గాన్ని చూపించిన "మొదటి గురువు "అని తల్లి పాదాలకు నమస్క రించాడు.
"మాతృ దేవో భవ"
అమ్మలందరికి వందనములు.
శుభం
యశోద గొట్టిపర్తి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత్రి పరిచయం: యశోద గొట్టిపర్తి
హాబిస్: కథలు చదవడం ,రాయడం
Comentários