top of page

నగరంలో నారాయణ

#NagaramloNarayana, #నగరంలోనారాయణ, #ChCSSarma, #చతుర్వేదులచెంచుసుబ్బయ్యశర్మ, #TeluguStory, #తెలుగుకథ


Nagaramlo Narayana - New Telugu Story Written By - Ch. C. S. Sarma 

Published In manatelugukathalu.com On 30/03/2025

నగరంలో నారాయణతెలుగు కథ

రచన: సిహెచ్. సీఎస్. శర్మ


అది అనాధల ఆశ్రమం..... 

నిర్వాహకురాలు భారతమ్మ...


ఆమె భర్త సోల్జర్.... సరిహద్దు యుద్దాలు పాక్ సైనికులను చంపి తానూ వీరమరణం పొందాడు.

బాగా ఆస్థిపాస్తులున్నాయి భారతమ్మకు. కొంతకాలం భర్త వియోగంతో ఎంతగానో బాధపడింది. ఆమె తండ్రి వారి చిన్నతనంలోనే గతించారు. తల్లి భారతమ్మ చాలా పద్ధతిగా పెంచింది. ఎం.ఎస్సీ పాసైంది భారతి. కాలక్షేపానికి స్కూల్లో ఉద్యోగం టీచరుగా భర్త సరిహద్దుల్లో వున్నందున ఉద్యోగాన్ని నిర్వహించేది. భర్త మరణానంతరం తల్లి సలహాపై అనాధ ఆశ్రమాన్ని స్థాపించింది. దాదాపు ఎనభైమంది పిల్లలు, నెలల పిల్లలనుండి నాలుగైదేళ్ళ బాలబాలికలు ఆశ్రమంలో వున్నారు.


ముగ్గురు టీచర్లలను, ఆరుగురు ఆయాలను పిల్లల సంరక్షణకు ఏర్పాటు చేసుకొని ఆశ్రమాన్ని నడుపుతూ ఉంది. 

పిల్లలను మంచి క్రమశిక్షణలో పెంచుతూ ఉంది.


ఆ పిల్లల్లో ఐదేళ్ళ నారాయణ ఒకడు. మూడునెలల ప్రాయంలో ఎవరో అతన్ని ఆశ్రమం దగ్గర వదిలేసి వెళ్ళిపోయారు. భారతమ్మ అతనికి తన ఆశ్రమంలో ఆశ్రయం కల్పించింది. నారాయణ అనే పేరు పెట్టింది.


మూడున్నర సంవత్సరం నుండి పిల్లలకు విద్యా శిక్షణను కొనసాగిస్తూ ఉంది. 

నారాయణ చాలా తెలివికలవాడు. ఏకసంతగ్రాహి. భారతమ్మ, టీచర్లు, ఆయాలు అతన్ని ఎంతగానో అభిమానించేవారు. నారాయణ ఐదవ తరగతి చదువుతున్నాడు. 


యాజమాన్య నిర్వాహకులు నారాయణ పట్ల చూపే ఆదరాభిమానాలు అదే వయస్సులో వున్న కొందరు పిల్లలకు నచ్చలేదు. ఐదారుగురు ఒకటిగా చేరి నారాయణకు వ్యతిరేకులుగా మారిపోయారు. అతన్ని హేళన, విమర్శ చేయసాగారు. అందులో వారికి ఆనందం. నారాయణకు వేదన. రాత్రి పడుకొన్న తరువాత, తనలో తాను బాధపడుతూ ఏడ్చేవాడు. కాలక్రమంలో వారి బాధ నారాయణకు మరీ ఎక్కువైంది. భరించలేని స్థితికి చేరాడు. ఆలోచించి.... ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు. ఒకరోజు రాత్రి ఎవరికీ చెప్పకుండా ఆశ్రమం నుండి పారిపోయాడు.

అప్పటికి అతని వయస్సు తొమ్మిది సంవత్సరాలు. ఆశ్రమాన్ని వదలిన సమయం రాత్రి రెండు గంటలు. దైవా దీనంగా ఆ రోజు పౌర్ణమి. ఆకాశం నుండి పున్నమి చంద్రుడు భూమిపై వెన్నెల కురిపిస్తున్నాడు.


ఆశ్రమానికి నగరానికి మూడు కిలోమీటర్లు. తారు రోడ్డుకు ఇరుప్రక్కల చింతచెట్లు. ఆ చెట్ల నీడలు రోడ్డుపై పడి నల్లని తారురోడ్డు మరీ నల్లగా అమావాస్య చీకటిలా నారాయణ కళ్ళకు కనిపిస్తూ ఉంది.


’అవును ఆ ఆరుగురి పోరు భరించలేక, వారిని ఎదిరించలేక తల్లిలాంటి ఆశ్రమాన్ని వదలి బయటపడ్డాను. ఇప్పుడు ఎక్కడికి పోవాలి! ఎవరు నన్ను ఆదరిస్తారు? కూడుగుడ్డలు ఎవరు ఇస్తారు? ఏమిటి నా భవిష్యత్తు!!!....’ అనుకొంటూ తనకు ఎంతో ఇష్టమైన వీరాంజనేయస్వామిని మనస్సున తలుచుకొంటూ, రోడ్డు ఎడమవైపున మెల్లగా నడవసాగాడు. వేసుకొని ఉన్న నిక్కరు స్ల్యాక్ షర్టు తప్ప అతని దగ్గర ఏమీలేవు. 


’శ్రీ ఆంజనేయం, ప్రసన్నాంజనేయం... శ్రీ ఆంజనేయం, ప్రసన్నాంజనేయం’ అనుకొంటూ ముందుకు నడవసాగాడు నారాయణ. 


నగరానికి ఒక కిలోమీటరు దూరంలో బ్రహ్మాండమైన వీరాంజనేయ స్వామి వారి విగ్రహం ఉంది. ఆ విగ్రహం ముందు నలుగురు మనుషులు యాచకులు పడుకొని నిద్రపోతున్నారు.

నారాయణ మెల్లగా విగ్రహాన్ని సమీపించాడు. విగ్రహం పాదాల చెంత పడుకొని వున్నవారిని చూచాడు. అతని మనసుకు కొంత వూరట కలిగింది.


’ఈ రాత్రికి ఈ తండ్రి పాదాల చెంత వారిలాగానే పడుకొంటాను. తెల్లవారిన తరువాత ఆలోచిస్తా. ఏం చేయాలనే విషయాన్ని గురించి’ అనుకొని ఆ నలుగురి మధ్యన పడుకొన్నాడు నారాయణ. మనస్సు తనువు అలసి వున్నందువలన వెంటనే నిద్రపోయాడు.

*

దినకరుడు తూర్పుదిశన తన దినచర్యను ప్రారంభించాడు.

సూర్య భగవానుని దివ్యతేజం ప్రకృతిని కమ్ముకొంది. ఆ నలుగురు ముందుగా లేచి వెళ్ళిపోయారు.


శరీరానికి సూర్యకిరణాలు తగలడంతోటే ఆరున్నరకు నారాయణ మేల్కొన్నాడు. చుట్టూ కలయచూచాడు ఆ నలుగురు కోసం... వారు యాచకులు. యాచకానికి బయలుదేరారు.

శ్రీ ఆంజనేయస్వామి వారి విగ్రహానికి కుడివైపున ఒక బావి, గిలక, తాడు, బక్కెటు వున్నాయి.

నారాయణ బావిని సమీపించి ఇటుక రాయిని పొడిచేసి పళ్ళు తోముకున్నాడు. బక్కెట్‍తో బావిలోని నీటిని తోడుకొని స్నానం చేశాడు. షర్టును విప్పి పిండుకొని ఒళ్ళు తుడుచుకొన్నాడు.

ఇంతలో ఒక వ్యక్తి సైకిల్ మీద అక్కడికి వచ్చాడు. వారి వయస్సు నలభై సంవత్సరాలు ఉండవచ్చు.


బస్సు వచ్చి ఆగింది. కండక్టర్ న్యూస్ పేపర్లకట్టలను ఆ సైకిల్ వాలాకు అందించాడు. ’రైట్ రైట్’ అన్నాడు కండక్టర్. బస్సు ముందుకు వెళ్ళిపోయింది.

చొక్కాను పిండి విదిలించి తొడుక్కొని ఆ సైకిల్ వాలాను సమీపించాడు.

అతను నారాయణను చూచాడు.

"ఎవరబ్బా నువ్వూ!" అడిగాడు.


"నాకు ఎవరూ లేరన్నా!" దీనంగా చెప్పాడు నారాయణ.


"ఎవరూ లేరా!" ఆశ్చర్యంతో అడిగాడు ఆ వ్యక్తి.


"అవునన్నా!"


"నాతో వస్తావా?"


"ఎక్కడికన్నా!"


"మా ఇంటికి"


"మీ ఇల్లు ఎక్కడన్నా!"


"ఈడకి ఓ రెండు కిలోమీటర్లుంటది!... కూడు గుడ్డా ఇస్తా. నేను చెప్పిన పని చేత్తావా!"


నారాయణ చెవులకు వారి పలుకులు వీణానందంగా వినిపించాయి. వదనంలో చిరునవ్వు.

"వస్తానన్నా!.... మీతోనే వుంటానన్నా!... మీరు నేను చేయగల ఏ పనిని చెప్పినా చేస్తానన్నా!"


"సైకిల్ తొక్కుతావా!"


"చేతకాదన్నా!" దీనంగా చెప్పాడు నారాయణ.


"ఫర్లేదులే. నేను నేర్పుతా! పద మన ఇంటికి పోదాం!"


"సరే అన్నా!" వంగి నేలన వున్న న్యూస్ పేపర్స్ కట్టను తన చేతికి తీసుకొన్నాడు నారాయణ.


"అవునబ్బయ్యా!... నీ పేరేంది?"


"నారాయణ!"


"నాపేరు శివయ్య. నాకు ఒక భార్య శంకరి, ఒక చెల్లి లచ్చిమి వుండారు. నాది చిల్లరసామాను అంగడి. ప్రతిరోజు బస్సులో పేపర్లు తీసుకొని వూర్లో వారందరికీ పంచుతా. నాలుగు రూపాయలు మనకొస్తాయ్. నీవు ఇయ్యాల నుంచీ ఊర్లో పేపర్లు పంచాలా. ఈరోజు ఇళ్ళు చూపించేదానికి నేనూ నీతో వస్తా. రేపటి నుంచీ బస్సులో పేపర్లు తీసుకోవడం, వూరోళ్ళకు పంచడం నీపని. అర్థం అయిందా నారాయణ!...." చిరునవ్వుతో అడిగాడు శివయ్య.


"ఆఁ.... అర్థం అయిందా అన్నా!"


"అవును.... నిన్ను చూస్తుంటే చదువుకొన్నవాడిలా వుండావబ్బా. ఏ తరగతిదాకా చదివినావు?"


"ఐదు...."


"ఓ ఐదా!... నేను చదివింది మూడే. నాకంటే నువ్వు జాస్తి చదివినావ్!.." అమాయకంగా నవ్వాడు శివయ్య. 


రెండు క్షణాల తర్వాత....

"ఆఁ... సరే పద ఇంటికి...."


పేపర్లను సైకిల్ క్యారియర్‍పై పెట్టుకొని దాన్ని తోసుకుంటూ నారాయణ, శివయ్యలు వూరివైపుకు బయలుదేరారు.

*

శివయ్య, నారాయణకు రెండురోజుల్లో సైకిల్ తొక్కడాన్ని బాగా నేర్పించారు.

నారాయణ మంచి అందగాడు. శివయ్య భార్య శంకరి, చెల్లెలు లక్ష్మి నారాయణయని బాగా అభిమానించేవారు. లక్ష్మి యుక్తవయస్కురాలు. ఆమె మనస్సున నారాయణ మీద ప్రేమ అంకురించింది.


కారణం, నారాయణలో సౌమ్యత, తెలివితేటలు, కార్యదీక్ష, రంగు, శరీర సౌష్టవం....

కాలచక్రంలో ఓ సంవత్సరం రోజులు నారాయణ జీవితంలో ఎంతో ప్రశాంతంగా గడిచిపోయాయి. నారాయణ తను అంతటి మంచి జీవితాన్ని ప్రసాదించింది శ్రీ ఆంజనేయస్వామి వారే అనే నమ్మకం. ప్రతి శనివారం నారాయణ శ్రీ ఆంజనేయస్వామి వారి విగ్రహం వద్దకు వెళ్ళి నూట ఒక్క ప్రదక్షిణాలు చేసి భక్తి శ్రద్ధలతో వారికి నమస్కరించి, పూలను వారి పాదాల చెంత వుంచి సాష్టాంగ నమస్కారం చేసి, ఇంటికి తిరిగి వచ్చేవారు. రోజులు గడిచేకొద్ది లక్ష్మికి నారాయణ పట్ల ఆ శక్తి పెరిగింది.


యదార్థంగా నారాయణ లక్ష్మి కన్నా చిన్నవాడు. కానీ పుష్టిగా ఎత్తు బలంగా వుంటాడు. ఆ కారణంగా లక్ష్మి నారాయణ తనకు తగిన వాడని నిర్ణయించుకొంది. అతని పట్ల ఎంతో ప్రేమాభిమానాలను చూపేది.


ఆమె ప్రవర్తన ఒక్కోసారి నారాయణకు సందేహంగా గోచరించేది. ఆమెకు దూరంగా వెళ్ళిపోయేవాడు.


ప్రక్క వూర్లో వున్న బంధువుల ఇంట్లో వివాహానికి శివయ్య అతని భార్య శంకరి ఉదయాన్నే వెళ్ళిపోయారు.


నారాయణ బస్సు వద్దకు వెళ్ళి పేపర్లు అందుకొని, వూర్లో వారందరికి పంచి వచ్చి చిల్లర అంగడి తెరిచాడు.


లక్ష్మి, నారాయణకు దోశలు, వేరుశెనగపప్పు పచ్చడి ప్లేట్లో పెట్టి ఇచ్చింది. తాను తిని అంగట్లో కూర్చుంది.


నారాయణ వేగంగా తిని, పశువుల పాకను శుభ్రం చేసి, స్నానం చేసి దుస్తులు మార్చుకొని అంగట్లోకి వచ్చాడు.


లక్ష్మి మనస్సున, తన మనస్సులోని మాటను నారాయణకు చెప్పేదానికి అదే సరైన సమయం అని నిర్ణయించుకొంది.


"నారాయణా!" ప్రీతిగా పిలిచింది.


"ఏం లక్ష్మీ!" అడిగాడు నారాయణ.


"నా గురించి నీ అభిప్రాయం ఏమిటి?"


"నీవు నా యజమాని చెల్లెలివి. చాలా మంచిదానివి" అన్నాడు నారాయణ.


"అదికాదు!" విసుగ్గా అంది లక్ష్మి.


"మరేమిటి?"


"నేను ఎలా వుంటాను?"


"బాగుంటావు!"


"అంటే!...."


"బాగుంటావు. అంతే నాకు తెలిసింది."


"నేను నీతో ఓ విషయం చెప్పాలి!"


"చెప్పు!..."


"నీవు ఈ విషయన్ని అన్నా వదినలతో చెప్పకూడదు!"


"అది నీవు చెప్పే విషయాన్ని బట్టి ఉంటుంది!"


"సరే విను!..." నవ్వుతూ పలికింది లక్ష్మి.


నారాయణ ఆశ్చర్యంతో ఆమె ముఖంలోకి చూచాడు.

’ఈరోజు ఈ అమ్మాయి ఏంది? నన్ను వింతగా చూస్తూ ఉంది?... ముసి ముసి నవ్వులు నవ్వుతూ ఉంది. ఇంతకీ తనేం చెప్పబోతూ వుందో!"


నేను స్కూల్లో నేర్చుకొన్నవి... పది మంచి మాటలు అవి....

1. సత్యమునే పలకాలి

2. అబద్ధం చెప్పకూడదు

3. దొంగతనం చేయకూడదు

4. చెడును చూడకూడదు

5. చెడును మాట్లాడకూడదు

6. చెడును వినకూడదు

7. దైవాన్ని సదా నమ్మాలి

8. స్త్రీని ఎప్పుడూ గౌరవించాలి

9. ఇతరులను మోసం చేయరాదు

10. నచ్చని వారినుండి దూరంగా పోవాలి


"నారాయణా!...." పిలిచింది లక్ష్మి.


"ఆఁ......" 


"ఎంటి ఆలోచిస్తున్నావ్!"


"ఏం లేదు, నీవు చెప్పాలనుకొన్నది చెప్పు"


"మనం పెండ్లి చేసుకొందామా!"


నారాయణ ఆశ్చర్యపోయాడు. పిచ్చివానిలా లక్ష్మి ముఖంలోకి చూచాడు.

"నేను చిన్నవాడిని" అన్నాడు.


"అయితే ఏం?"


"నాది పెండ్లి వయస్సు కాదు"


"నాకు నచ్చావు!"


"నీవు నాకు నచ్చలేదు"


"నాకేం తక్కువ. క్రికెట్ సచిన్ టెండుల్కర్ భార్య అతని కన్నా పెద్దది. సీతమ్మ తల్లి శ్రీరాముడి కన్నా పెద్దది" నవ్వింది లక్ష్మి.


నారాయణ భయంతో, ఆవేదనతో తలదించుకొన్నాడు.

’తండ్రి శ్రీ ఆంజనేయ స్వామి నన్ను కాపాడు స్వామీ!... ’ దీనంగా మనస్సున వేడుకొన్నాడు.


అక్కడినుండి పశువుల పాక వైపుకు వెళ్ళాడు విచారవదనంతో.

సాయంత్రం శివయ్య, అతని భార్య శంకరి వచ్చారు. 

సమయం రాత్రి ఒంటిగంట ప్రాంతం.


అందరూ నిద్రపోతున్నారు. కానీ లక్ష్మికి నిద్రపట్టలేదు. ఆమె హృదయం నిండా నారాయణే. మనస్సున నిండా వేగం, వాంఛ. మెల్లగా మంచం దిగి నారాయణ పడుకొని వున్న చోటికి వెళ్ళి అతని ప్రక్కన కూర్చుంది.


నారాయణ గాఢనిద్రలో వున్నాడు.


లక్ష్మి అతని ప్రక్కన పడుకొంది. అతనిపై తన చేతిని వేసింది. అతనికి దగ్గరగా జరిగింది.


తన శరీరానికి తగిలిన వత్తిడికి, నారాయణ ఉలిక్కిపడి కళ్ళు తెరిచాడు. తన ప్రక్కనే వున్న లక్ష్మిని చూచాడు. చెంగున లేచి నిలబడ్డాడు.

"అరవకు..." మెల్లగా అంది లక్ష్మి.


నారాయణ తనువెల్లా చెమట. వదనంలో భయం. ఆమెకు దూరంగా నడిచాడు.


"నారాయణా!... నీవు నాకు కావాలి. బాగా ఆలోచించుకో" అంది అతన్ని సమీపించి లక్ష్మి.


నారాయణ వేగంగా గొడ్లపాక వైపు నడిచాడు.


’ఇకపై ఇక్కడే ఉంటే ప్రమాదం. లక్ష్మి నన్ను వదిలేటట్లు లేదు. ఈ విషయాన్ని నేను శివన్నకు గాని, వదిన శంకరికి గాని వేరెవరికి గాని చెప్పలేను. కాబట్టి.... ఇక్కడ నుండి పారిపోవలసిందే. దేవుడా!.... ఏమిటి స్వామీ నాకు ఈ పరీక్ష!... నేను ఇప్పుడు ఏం చేయాలి!... ఎక్కడికి పోవాలి!...’ తెగని ఆలోచనలతో నారాయణ శివయ్య ఇంటి ఆవరణం దాటి రోడ్డులో ప్రవేశించాడు. కన్నీటితో ముందుకు నడవసాగాడు. 

*

సమయం రాత్రి రెండుగంటల ప్రాంతం....

నగరంలో ప్రవేశించాడు నారాయణ. రోడ్డు నిర్మానుష్యం.... తనవైపు ఒక స్త్రీ పరుగెత్తుకొని వస్తూ ఉంది. ఆమె వెనకాల ఇరువురు మగవారు. నారాయణ ఆశ్చర్యపోయాడు. 


పరుగున ఆమె అతన్ని సమీపించింది.

"బాబూ!... నన్ను కాపాడు.... కాపాడు..." దీనంగా అరిచింది.


నారాయణకు విషయం అర్థం అయింది. రోడ్డుకు రెండువైపులా చూచాడు.

ఎదురుగుండా కట్టెల దొడ్డి. వేగంగా ఆ దొడ్డిని సమీపించి చవక కర్రను చేతికి తీసుకొన్నాడు.

ఆమె అతని వెనుక చేరింది.


"బాబూ!... బాబూ!... వాళ్ళు నన్ను వారితో తీసుకుపోను నన్ను ఫాలో చేస్తున్నారు. నీవే నన్ను కాపాడాలి బాబూ!" భోరున ఏడుస్తూ చెప్పింది ఆమె.


నారాయణకు ఆశ్రమంలో చదివిన, విన్న సూక్తులు గుర్తుకు వచ్చాయి.

"అక్కా!.... భయపడకు. నేను వారిని ఎదుర్కొంటాను" ఆవేశంగా చెప్పాడు నారాయణ.


ఆ ఇరువురూ నారాయణను సమీపించారు. అతని వెనుక వున్న ఆమెను పట్టుకొన ప్రయత్నించారు. వారు తాగి వున్నారు. సరిగా నిలబడలేక తూలుతున్నారు.


"అన్నా!... మీరు మీ ఇళ్ళకు వెళ్ళిపోండి. ఆమెను తాకకండి." వినయంగా చెప్పాడు నారాయణ.


వారు అతని మాటలను లెక్కచేయలేదు. నారాయణను కొట్టబోయారు. ఆమెను పట్టుకొన ప్రయత్నించారు.


"వద్దన్నా!.... వద్దన్నా!... మీరు వెళ్ళిపోండి. ఆమెను ఏమీ చేయకండి" దీనంగా చెప్పాడు నారాయణ.


వారు అతని మాటలు వినలేదు. ఒకడు నారాయణ చెంపపై కొట్టాడు. 

మరొకడు, ఆమె చేతిని తన చేతిలోనికి తీసుకొన్నాడు. ఆమె భోరున ఏడుస్తూ ఉంది.


నారాయణలో చైతన్యం వేగం.... తన చేతిలోని కర్రతో ఆ ఇరువురినీ బాదాడు. తాగి వున్నందున వారు నారాయణను ఎదిరించలేక నేలకూలారు. ఆమె.... తన కన్నీళ్ళను పవిటతో తుడుచుకొని.... 

"బాబూ!... నీకు దండాలు. నీవు నన్ను కాపాడావు. నీవు నిండు నూరేళ్ళు చల్లగుండాలి బాబు" మనసారా దీవించింది.


"నిండు నూరేళ్ళు!.... ఏందక్కా ఆ దీవెన. తల్లితండ్రి లేరు. నా అనేవారు ఎవరూ లేరు. చదువు లేదు. ఉద్యోగం లేదు. నేను ఎవరికోసం బ్రతకాలక్కా!...." కన్నీటితో దీనంగా చెప్పాడు నారాయణ.


అతని మాటలకు ఆమె ఆశ్చర్యపోయింది.

"అయితే నాతో రా... మా ఇంటికి పోదాం!" అంది ఆమె.


"అక్కా!...." ఆశ్చర్యంతో అన్నాడు నారాయణ.


"అవును బాబూ!... నీవు నాతోరా... ఈ రోజు నీవు నన్ను కాపాడావు. నేను నిన్ను కాపాడుతాను. రా!..." ఆమె నారాయణ చేతిని తన చేతిలోనికి తీసుకొంది.


ఆమె స్పర్శకు నారాయణ శరీరం జలదరించింది. పరీక్షగా ఆమె ముఖంలోకి చూచాడు.

ఆమె వయస్సు ఇరవై అయిదు సంవత్సరాలు.


నారాయణకు తన కన్నతల్లి. తాను చూడని తన జన్మకారకురాలు గుర్తుకువచ్చింది.

’ఒకవేళ నేను నా తల్లిదగ్గరే వుండి వుంటే, ఆమె ఈమెలాగానే వుండి వుండేదేమో!...." మధురమైన భావన, మనస్సున పులకింత. హృదయం ద్రవించింది. నయనాల నుండి ఆశ్రుధారలు.

"ఎందుకు బాబు ఏడుస్తున్నావ్!" అడిగింది ఆమె.


"నిన్ను చూడని మా అమ్మ నాకు గుర్తుకు వచ్చింది" బొంగురుపోయిన కంఠంతో చెప్పాడు నారాయణ.


"సరే, పద. ఇంటికి వెళ్ళి మాట్లాడుకొందాం" ఆమె అతని చేతిని విడువలేదు. ముందుకు నడిచింది. ఆమె ప్రక్కన నారాయణ అయోమయ స్థితిలో మౌనంగా నడిచాడు.


ఆమె ఇంట్లో వున్న అన్నాన్ని నారాయణకు పెట్టి తనూ తిన్నది. నారాయణ కథను అడిగి తెలుసుకొంది. తన కథను నారాయణకు చెప్పింది. ఆమె చెప్పిన కథ నారాయణకు సరిగా అర్థం కాలేదు. ఆమె పేరు సంపంగి. చాప, దిండు, బెడ్ షీట్ ఇచ్చింది. వరండాలో పడుకోమంది. నారాయణను వరండాలోనికి పంపి తలుపును మూసింది.


అతనికి అర్థమైన ఆమె కథ.... ఆమె బంధువు పట్నంలో ఉద్యోగం ఇప్పిస్తానని, ఆమె తల్లిదండ్రులకు చెప్పి ఆమెను పట్నానికి తీసుకొని వచ్చాడు. ఓ బాడుగ ఇంట్లో వుంచాడు. ఆమెను పెండ్లి చేసుకొంటానని చెప్పాడు. ఆమె అతన్ని నమ్మింది. ఇరువురూ ఆనందంగా నెలరోజులు గడిపారు. ఆ తరువాత అతను ఒకరోజు మాయమైపోయాడు.


ఇంటి ఓనరు బాడుగ అడిగాడు. తన దగ్గర డబ్బులు లేవని దీనంగా ఆమె చెప్పింది. ’అయితే నేను చెప్పినట్లు చేయి’ అన్నాడు అతను. 


ఆమె అమాయకంగా తలాడించింది. అతను ఆమె జీవిత విధానాన్నే మార్చేశాడు. ప్రతి రాత్రి వేరేవాళ్ళ రూములకు ఇళ్ళకు పంపేవాడు. ఆమె జీవితం బురదలో పడింది. తొలుత చాలా బాధవేసింది. కానీ... కొన్నాళ్ళకు ఒక నిర్ణయానికి వచ్చింది.


డబ్బు సంపాదించాలి. తల్లిదండ్రులను కాపాడాలి. తన రేటును పెంచింది. ఇంటి ఓనరును బ్రోకరుగా మార్చింది. అతన్ని తన గుప్పెట్లో పెట్టుకొంది. సంపాదించిన సొమ్మును నెలనెలా తల్లిదండ్రులకు పంపేది. అనుభవరీత్యా ఇక ఇదే నా జీవితం అనే నిర్ణయానికి వచ్చింది. తనకు ఇంటి ఓనర్ చూపిన దారిన నడవసాగింది.


నారాయణ వరండాలో పడుకొన్నాడు. ఆమె పై కథను మాటలను తలచుకొంటూ అయోమయ స్థితిలో వున్నాడు.


ఎవరో వచ్చారు. కాలింగ్ బెల్ నొక్కారు. సంపంగి తలుపు తెరిచింది. అతన్ని చూచింది.

"ఓ... మీరా రండి" నవ్వుతూ చెప్పింది.


అతను లోనికి వెళ్ళాడు. తలుపు మూయబడింది. నిద్రపోని నారాయణ ఆ సన్నివేశాన్ని చూచాడు.


’ఈ అక్కలో ఏదో తేడా ఉంది. ఇలాంటి మనిషి దగ్గర ఉంటే ప్రమాదం. ఇప్పుడు ఏం చేయాలి స్వామీ శ్రీ ఆంజనేయా!...’ ఆ దేవున్ని వేడుకొన్నాడు. తెగని ఆలోచన. రాత్రంతా మేలుకొనే వున్నాడు.


కోళ్ళు కూశాయి. ’ఓ తెల్లవారబోతూ ఉంది’ అనుకొన్నాడు.


నడిరేయి ఇంట్లో ప్రవేశించిన వ్యక్తి తలుపు తెరుచుకొని బయటికి వచ్చి వెళ్ళిపోయాడు. సంపంగి నారాయణను చూచింది. నిద్రలో వున్నాడనుకొని తలుపును మూసింది. అరగంట గడచింది. పడుకొని వున్న నారాయణ లేచి కూర్చున్నాడు.


’పూర్తిగా తెల్లవారక ముందే ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి’ అనుకొన్నాడు. మెల్లగా లేచి చాపను చుట్టి గోడపక్కన వుంచి దానిపై సంపంగి ఇచ్చిన దుప్పటి మడిచిపెట్టి విచారవదనంతో వీధిలో ప్రవేశించాడు నారాయణ.

*

రోడ్లో కొంతదూరం నడిచాడు. ఏంచేయాలి.... ఎటు పోవాలి అనే ఆలోచన. ఆ డోలాయమానంలో ఎదురుగా వస్తున్న ఒక వ్యక్తికి తగిలాడు. అతను నారాయణ చేతిని పట్టుకొని....

"ఏరా వేకువనే తాగావా!" కసిరినట్లు అడిగాడు.


నారాయణ కళ్ళల్లో కన్నీరు. అతను నారాయణను పరీక్షగా చూచాడు.

"నీవెవరు?" అడిగాడు.


"నాకు ఎవరూ లేరు. అనాథను"


"ఓ... అలాగా!..." అతను కొన్ని క్షణాలు ఆలోచించాడు.


"నీ పేరేమిటి?"


"నారాయణ!"


"నాతో వస్తావా?"


"ఎక్కడికి?"


"నాతో కలిసి బ్రతికేదానికి నా ఇంటికి!" చిరునవ్వుతో చెప్పాడు ఆ వ్యక్తి.


’మనిషి చూచేదానికి బాగున్నాడు. తనతో కలిసి బతికేదానికి రమ్మంటున్నాడు. పోవడం మంచిదా కాదా!’ అనుకొన్నాడు నారాయణ.


"ఏరా!... ఏమంటావ్?" అడిగాడు అతను.


"వస్తానన్నా!" నారాయణ జవాబు.


"సరే రా!..." అతను నారాయణ చేతిని తన చేతిలోనికి తీసుకొన్నాడు. ఇరువురూ ముందుకు ఆ వ్యక్తి ఇంటివైపుకు నడిచారు. అది లేబర్ కాలని.

అతను ఒక ఇంటిముందు ఆగి, తాళం తీశాడు.


"నిర్భయంగా రా తమ్ముడూ" తను లోన ప్రవేశించి నారాయణను పిలిచాడు.


నారాయణ నలువైపులా చూచి ఇంట్లో ప్రవేశించాడు.

"అన్నా!...."


"ఏమిటి?"


"మీ పేరు ఏమిటి?"


"సత్య!"


"అమ్మా నాన్నా!...."


"నేనూ నీ మాదిరే. నాకూ ఎవరూ లేరు." నారాయణ పూర్తిగా అడగక ముందే సత్య జవాబు చెప్పాడు.


సత్య తలుపు మూశాడు.

"అన్నా!... మీరేం పని చేస్తారు?" అడిగాడు నారాయణ.


"మోసగాళ్ళను దోచుకొంటాను" విరక్తిగా నవ్వాడు సత్య.


"అంటే!...." ఆశ్చర్యంతో అడిగాడు నారాయణ.


"చెబితే నీకు అర్థం కాదులే. చేసి చూపిస్తాను. కూర్చో... టీపెట్టి తీసుకొస్తాను" వంటగదిలోకి వెళ్ళాడు సత్యా.


నారాయణ ప్లాస్టిక్ కుర్చీలో కూర్చున్నాడు.


"ఎవరు మోసగాళ్ళు... దోచుకోవడం అంటే ఏమిటి? ఈ అన్న ఎలాంటివాడు? నమ్మవచ్చునా!.... నమ్మకూడదా!..." నారాయణ మస్తిష్కంలో అన్నీ ప్రశ్నలే!!


సత్య రెండు కప్పులను చేత పట్టుకొని హాల్లోకి వచ్చాడు. ఒకదాన్ని నారాయణకు అందించాడు.

"తాగు నారాయణా!" అన్నాడు.


నారాయణ టీ త్రాగసాగాడు. కానీ... అతని బుర్రలోని ప్రశ్నలు.... అతన్ని విడిచిపోలేదు.

"నారాయణా! గీజర్ ఆన్ చేశాను. పది నిముషాల్లో నీళ్ళు కాగుతాయి. శుభ్రంగా స్నానం చెయ్యి. నేను ఈలోపల ఉప్మా తయారు చేస్తాను. నేనూ స్నానం చేసి ఇరువురం కలిసి తిందాం సరేనా!" చిరునవ్వుతో అడిగాడు సత్య.


"సరే అన్నా!..."


ఇరువురూ టీ త్రాగడం ముగిసింది.


సత్య బాత్ రూంలోనికి వెళ్ళి గీజర్‍ను ఆపి, వేడినీళ్ళను బక్కెట్‍లో నింపి బయటికి వచ్చి, టవల్ నారాయణకు ఇచ్చి స్నానం చేయమన్నాడు.


నారాయణ బాత్‍రూములో ప్రవేశించాడు.


సత్యా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి తరిగి స్టౌపై బాణలిని వుంచి నీరు పోశాడు. ఐదు నిముషాల్లో అవి బాగా తెర్లాయి. నూనె రవ్వ, వుల్లిపాయలు, పచ్చిమిర్చి అందులో వేసి పైన మూతపెట్టాడు.

కొద్ది నిముషాల్లో ఉప్మా తయారైంది.


నారాయణ స్నానం చేసి టవల్ చుట్టుకొని బయటికి వచ్చాడు. సత్య తన షర్టు ప్యాంటు నారాయణకు ఇచ్చి ’వేసుకో’ అన్నాడు. నారాయణ ఆ దుస్తులను ధరించాడు.

సత్య స్నానానికి వెళ్ళాడు. ఐదు నిముషాల్లో స్నానం ముగించి బయటికి వచ్చి డ్రస్ చేసుకొన్నాడు.


తలుపు తట్టిన శబ్దం.... సత్యా ఆవైపు చూచాడు. నారాయణ ఆశ్చర్యంతో సత్య ముఖంలోకి చూచాడు.


సత్య వెళ్ళి తలుపు తెరిచాడు. వాకిట ఇరువురు పోలీసులు.

వారిని చూచి నారాయణ బెదిరిపోయాడు.

"ఎం సార్! ఇలా వచ్చారు?" వారిని అడిగాడు సత్య.


"స్టేషనుకు నడు. అక్కడ చెబుతాం అన్ని విషయాలు!" ఒక పోలీస్ జవాబు.


సత్య నారాయణ ముఖంలోకి చూచాడు.

"వాడెవడు?" రెండవ పోలీసు ప్రశ్న.


"ఒక అనాధ... నారాయణా!... బాండిలో ఉప్మా ఉంది. నీకు కావాల్సినంత తిను. నేను ఓ గంటలో వస్తాను. రెస్టు తీసుకో. భయపడకు. ఆ.... పదండి. నారాయణ.. తలుపు మూసుకో!" ముందు సత్య అతని వెనుకాల పోలీసులు ఇంట్లో నుంచి బయటికి నడిచారు.


నారాయణ భయంతో తలుపు మూసుకొన్నాడు. కుర్చీలో కూర్చున్నాడు అతని మనస్సున ఎంతో కలవరం. భయం.


’అంటే ఈ అన్న దొంగ అన్నమాట!’ అనుకొన్నాడు మనస్సున.


అతని శరీరం నిండా చెమట, ఎదలో భయం.


’ఈ అన్నతో వుంటే పోలీసులు నన్నూ దొంగగా అనుకొని స్టేషనుకు లాక్కొని పోతారు. చేయని దొంగతనాన్ని గురించి నన్ను అడిగి, నిజం చెప్పమని చితకబాత్తారు. అబ్బో ఆ మాటలు ఊహలోనే ఎంతో భయంగా వున్నాయి. ఇది ప్రమాదకరమైన స్థలం. ఇక్కడనుంచి వెంటనే పారిపోవాలి. పారిపోవాలి...’ అనుకొన్నాడు నారాయణ.


వేగంగా బయటికొచ్చాడు. తలుపుకు గడియపెట్టాడు. వీధిలో ప్రవేశించి పరుగులాంటి నడకతో మెయిన్ రోడ్డుకు వచ్చాడు. తిరువన్నామలై సర్వేశ్వరుల సందర్శనం కోసం పదిమంది కాలినడకతో ’ఓం తిరువన్నామలై సర్వేశ్వరాయ... ఓం నమో భగవతి శ్రీ రమణాయ, నామాల సంకీర్తన చేస్తూ ముందుకు నడుస్తున్నారు. నారాయణ వారిని చూచాడు. వారు చేయు నామాల పలుకులు చెవులకు ఇంపుగా వినిపించాయి.


నారాయణ వారిని సమీపించాడు.

ఒకరికి నమస్కరించాడు.

"ఎవరు బాబు నీవు?" అడిగాడు ఆ వ్యక్తి.


"నేను ఒక అనాధను స్వామీ!...."


"ఈ లోకంలో ఎవరూ అనాధలు కారు బాబు. ఆ సర్వేశ్వరుడు మనందరికీ తండ్రి. మేము కాలినడకతో ఆ తిరువన్నామలై సర్వేశ్వరులను, శ్రీ భగవాన్ రమణ మహర్షుల ఆశ్రమాన్ని దర్శించేటందుకు వెళుతున్నాము. నీవూ మాతో వస్తావా!... వారి దర్శన భాగ్యం వలన గిరి ప్రదక్షిణం చేయడం వలన, నీకు భవిష్యత్తులో మంచిదశ కలుగుతుంది" చిరునవ్వుతో చెప్పారు వారు.


"వస్తాను స్వామీ!..." ఆనందంగా పలికాడు నారాయణ.


"సరే రా...!" అన్నారు ఆ స్వామి.


నారాయణ వారితో కలిసి వారు పలికే దివ్య నామాలను పలుకుతూ ముందుకు నడిచాడు. మధ్య మధ్య విశ్రాంతి తీసుకుంటూ వారు వారంరోజుల్లో తిరువన్నామలై చేరుకున్నారు. అన్నపానీయాలు వారు నారాయణకు సమకూర్చారు.


శ్రీ తిరువన్నామలై శివ ఆలయం సందర్శనం (ఆ మహా శివలింగం అగ్నిలింగం) శ్రీ భగవానుల ఆశ్రమ దర్శనం, 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణం వారితో కలిసి చేశాడు నారాయణ. 

మనస్సున ఎంతో ఆనందం, ప్రశాంతత....


భగవాను ఆశ్రమాన్ని రెండవసారి దర్శనం చేసే సమయంలో ఇరువురు దంపతులు నారాయణను చూచారు. అతని భక్తిశ్రద్ధలను వారు గమనించారు. వారు అతన్ని సమీపించారు. ధ్యానం నుండి కళ్ళు తెరిచిన నారాయణను...

"బాబూ!... నీ పేరు ఏమి?" ఆ పెద్దాయన ప్రశ్న.


"నారాయణ స్వామి"


"నీవు ఎవరు? ఏ వూరు?"


"నేను అనాధను. నాకు ఎవరూ లేరు స్వామీ!" విచారంగా చెప్పాడు నారాయణ.


"సరే!... మాది నెల్లూరు. మాకు పిల్లలు లేరు. నీవు మాతో వస్తావా! సొంత బిడ్డలా చూచుకొంటాం. చదివిస్తాం ఏమంటావ్?" చిరునవ్వుతో అడిగారు.


నారాయణ కళ్ళల్లో ఆశ్చర్యం... పెదాలపై చిరునవ్వు....

"నేను చెప్పింది నిజం. మాతో రా బాబూ!..."


నారాయణ మంత్రముగ్దుడిలా తలాడించాడు. పరుగున వెళ్ళి తనను తిరువన్నామలైకి నుంచి తీసుకొచ్చిన పెద్దలకు చెప్పి, నమస్కరించి ఆ దంపతులను సమీపించాడు. పెద్దాయన నారాయణ చేతిని తన చేతిలోనికి తీసుకొన్నాడు. ఆ ముగ్గురూ వారి కారువైపుకు నడిచారు.

సమాప్తి

*


సమాప్తి


సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 

ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

రచయిత పరిచయం:

 పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.

 కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.

 బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం

విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు

ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.

తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.


Comments


bottom of page