top of page
Writer's pictureSeetharam Kumar Mallavarapu

నాకేమవుతోంది…?

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.







కథను యు ట్యూబ్ లో చూడటానికి క్రింది లింక్ క్లిక్ చేయండి

'Nakemavuthondi Episode-1' New Telugu Web


Series Written By Mallavarapu Seetharam Kumar



మల్లవరపు సీతారాం కుమార్ రచించిన కొత్త ధారావాహిక 'నాకేమవుతోంది' ప్రారంభం


పెళ్ళై మూడు నెలలే అయింది.

అంతలో అనుకోని సమస్యలు ఎదురయ్యాయి ప్రియ అనే అమ్మాయికి.

ఆ సమస్యలను అధిగమించే ప్రయత్నంలో ఆమె పడ్డ మానసిక సంఘర్షణను ఈ ధారావాహికలో కళ్ళకు కట్టినట్లు వివరించడం జరిగింది.

ఈ సీరియల్ ను మల్లవరపు సీతారాం కుమార్ రచించారు.

మీకు చదివి వినిపిస్తున్నది కే. లక్ష్మి శైలజ.

ఇక కథ ప్రారంభిద్దాం.


"ప్రియా... ప్రియా! మెలకువలోకి రా. ఎందుకలా కేకలు పెడుతున్నావు?" నా భుజం పట్టి కుదుపుతూ అడిగాడు నా భర్త తరుణ్.


"ఉలిక్కి పడ్డాను. నేను మంచి నిద్రలో ఉండగా తరుణ్ నన్ను లేపాడు.


"ఏమైంది తరుణ్? ఎందుకు లేపావు.." అంటూ లేచి కూర్చో బోయాను.


"వెంటనే లేవకు. కాస్త రిలాక్స్ అవ్వు" అంటూ నన్ను ఆపబోయాడు.


నేను అతని చేతుల్ని నెట్టేస్తూ బెడ్ మీద లేచి కూర్చుని "ఇప్పుడు చెప్పు తరుణ్! అసలు ఏం జరిగింది?" అని అడిగాను.


అతను నా ముఖం లోకి ఆశ్చర్యంగా చూస్తూ "అంటే.. జరిగింది నీకు నిజంగా గుర్తుకు రావడం లేదా?" అన్నాడు.


"కామెడీలు చేయకు తరుణ్. నువ్వు మరేదో ఉద్దేశంతో లేపి ఉంటావు. మంచి నిద్రను పాడు చేశావు" అన్నాను కాస్త కోపంగా.


"బీ సీరియస్ ప్రియా! మరో సారి అడుగుతున్నాను.. నిజంగా నీకేమీ గుర్తుకు రాలేదా?" అన్నాడు తరుణ్.


అతని గొంతులో తీవ్రత చూస్తుంటే నిజంగానే ఏదో జరిగి ఉంటుంది అనిపించింది.


"ప్రామిస్ తరుణ్! డిన్నర్ అయ్యాక కాస్త తల తిరుగుతున్నట్లు అనిపించింది. టీవీలో మూవీ చూద్దామని నువ్వు అడుగుతున్నా, నిన్ను చూసుకోమని చెప్పి నేను పడుకున్నాను. తర్వాత ఇదిగో.. ఇప్పుడే నువ్విలా నా భుజం కదిలిస్తూ నిద్ర లేపావు. అంతకుమించి నాకేమీ తెలియదు. మళ్లీ మళ్లీ గుర్తు లేదా అని అడక్కు. అసలు విషయం ఏమిటో చెప్పు" అన్నాను.


"సారీ డార్లింగ్! నువ్వు చేసిన పనికి నేను షాక్ తిన్నాను కాబట్టే అన్ని మార్లు అలా అడగాల్సి వచ్చింది" అంటూ పక్కనే ఉన్న వాటర్ బాటిల్ మూత తీసి, నాకు అందించాడు.


"కాస్త మంచినీళ్లు తాగి రిలాక్స్ అవ్వు. విషయం చెబుతాను" అన్నాడు తరుణ్.


"నేను నార్మల్ గానే ఉన్నాను. అయినా నువ్వు చెప్పావు కాబట్టి నీళ్లు తాగుతున్నాను" అంటూ రెండు గుక్కలు నోట్లో పోసుకున్నాను.


తరువాత అతని వైపు తిరిగి “నేను చాలా మామూలుగా ఉన్నాను. నా బీపీ చెక్ చేస్తే నార్మల్ గానే ఉంటుంది. ఇప్పుడు చెప్పు.. నువ్వు ఎలాంటి విషయం చెప్పినా నేను తట్టుకుంటాను. సరేనా? ఇక ఆట్టే నాన్చకుండా విషయానికి రా" అన్నాను.


అతను గొంతు సవరించుకుని "నువ్వు ఎంత చెప్పినా, జరిగింది చెప్పాలంటే నాకు భయంగానే ఉంది. నువ్వు పడుకున్నాక నేను కాసేపు టీవీ చూశాను. నువ్వు తల తిరుగుతున్నట్లు ఉందని చెప్పిన విషయం హఠాత్తుగా గుర్తుకు వచ్చింది. టీవీ కట్టేసి టాబ్లెట్ తీసుకొని గదిలోకి వచ్చాను. నువ్వు ఒకసారి కళ్ళు తెరిచి నన్ను చూసి, తిరిగి పడుకున్నావు. నన్ను ఆట పట్టించడానికి నిద్ర నటిస్తున్నావేమోనని అనుకున్నాను. పక్కన కూర్చుని టాబ్లెట్ అందించ బోతుండగా నీ తల కింద ఉన్న పిల్లోని తీసి నీ ముఖం పైన పెట్టుకున్నావు. నీ చేతులతో బలంగా అదుముకుంటూ ‘ప్లీజ్ తరుణ్! నన్ను చంపొద్దు.. వదిలేయ్!’ అంటూ కేకలు పెట్టావు.


నిన్ను కదిలించి లేపడానికి ప్రయత్నిస్తున్న నన్ను ఎంత బలంగా నెట్టావంటే.. ఆ విసురుకి నేను మంచం మీద నుండి వెనక్కి పడిపోయాను. అదృష్టవశాత్తూ పెద్ద గాయం ఏదీ తగల్లేదు. వెంటనే పైకి లేచి నిన్ను అటూ ఇటూ కదిలించడం తో, నీకు మెలకువ వచ్చింది" చెప్పాడు తరుణ్.


ఒక్క క్షణం అతడేమి చెప్పాడో నాకు అర్థం కాలేదు. అర్థమయ్యాక నా తలగడ ఎక్కడ ఉందోనని చూశాను. అది మంచానికి దూరంగా పడి ఉంది. నాకైతే ఎలాంటి కలా వచ్చినట్లు గుర్తు లేదు.


"చూడు తరుణ్! నువ్వు చెప్పినట్టు నేను అలా ప్రవర్తించి ఉంటే నా ఒంట్లో నాకు కాస్తయినా మార్పు తెలిసేది. ఒళ్ళు చెమటలు పట్టడం.. భయంతో వణికి పోవటం జరిగేవి. కానీ నాకలాంటి తేడా కనిపించడం లేదు. పైగా ఇందాక ఉన్న తల తిరుగుడు కూడా ఇప్పుడు లేదు" చెప్పడం ఆపి తరుణ్ ముఖంలోకి చూశాను.


అతను కింద పడ్డ నా తలగడను నాకు అందిస్తూ ఏదో చెప్పబోతూ ఉండగా, ఆగమని సైగ చేసి నేనే కొనసాగించాను.


"చూడు తరుణ్! ఒకవేళ ఏదైనా పీడ కల వచ్చింది అనుకున్నా ఆ భయానికి 'తరుణ్.. నన్ను కాపాడు' అని కేకలు పెడతానేమో గానీ 'నన్ను చంపొద్దు' అని అంటానా..


నా మనసు అట్టడుగు పొరల్లో కూడా నీ గురించి అలాంటి ఊహ లేదు కాబట్టి అలాంటి కల వచ్చే అవకాశమే లేదు" అంటూ నా మనసులో ఉన్నది తరుణ్ తో చెప్పేశాను.


"తరుణ్ ఒక చెయ్యి నా భుజం మీద వేసి, రెండో చేత్తో నా తల నిమురుతూ "ఓకే ప్రియా! లెటజ్ ఫర్గెట్ ఇట్ అండ్ స్లీప్. దీని గురించి రేపు ఉదయం డిస్కస్ చేద్దాం" అన్నాడు.


"తరుణ్! నా తరఫున వాదన నీకు చెప్పాను కానీ నువ్వు చెప్పేది నేను వినలేదు. బహుశా ఈ రాత్రి పూట వాదనలు ఎందుకని నువ్వు సైలెంట్ అయి ఉండవచ్చు. కానీ ఇప్పుడు నాకు ఏమని అనిపిస్తోందంటే ఒకవేళ నేను అలా చేసి ఉండకపోతే, చేసినట్లు చెప్పాల్సిన అవసరం నీకు ఏముంది?” అని అన్నాను.


తరుణ్ నా తలమీద ఉన్న తన కుడిచేతిని తీసి నా పెదవులకు అడ్డంగా ఉంచి, "ప్లీజ్ ప్రియా! ఈ విషయం ఇంతటితో వదిలేయ్. రేపు మాట్లాడుకుందాం అన్నాగా" అన్నాడు.


నా నోటికి అడ్డంగా ఉన్న అతని చేతి చేతిని పక్కకునెట్టి "నన్ను చెప్పనీ తరుణ్! మన ఇద్దరిలో ఎవరూ కావాలని అబద్ధం చెప్పరు. అలాంటప్పుడు మెలకువగా ఉన్న నీకన్నా, నిద్ర పోతున్న నేను భ్రమ పడడానికే ఎక్కువ అవకాశం ఉంది" అంటూ మంచం మీద నుండి కిందకి దిగాను.

ఆపబోతున్న అతన్ని విడిపించుకుని, డ్రెస్సింగ్ టేబుల్ నుండి పేపర్, పెన్ లను బయటకి తీశాను.


"నాకెందుకో నా మానసిక స్థితి సరిగా ఉన్నట్లు అనిపించడంలేదు. ఈరోజు దిండుతో నన్ను నేనే ఊపిరాడ నీయకుండా చేసుకున్నాను. ఇలాంటి పనుల వల్ల నాకేమైనా జరిగితే అందులో తరుణ్ ప్రమేయం ఏమీ లేదని అందరూ గ్రహించగలరు" - ఆ పేపర్ మీద అలా రాసి తిరిగి డ్రా లో ఉంచి మంచం మీదకి చేరుకున్నాను.


"ఏం రాశావు అందులో.." అంటూ క్రిందికి దిగబోతున్న తరుణ్ చేతిని పట్టుకొని "ప్లీజ్ తరుణ్! పడుకుందాం. నువ్వే చెప్పావుగా.. రేపు ఉదయం మాట్లాడుకుందాం అని" అన్నాను.


కానీ అతను నన్ను విడిపించుకొని, డ్రా లో ఉన్న ఆ పేపర్ బయటకి తీశాడు.


ఇంతలో బెడ్ మీద ఉన్న అతని మొబైల్ లో నోటిఫికేషన్ సౌండ్ వచ్చింది.

అప్రయత్నంగా అటు చూసాను.


'ప్లాన్ సక్సెస్ అయిందా' అంటూ వచ్చిన వాట్స్ అప్ మెసేజ్ తాలూకు నోటిఫికేషన్ అది..


“ప్రియా!” అంటూ తరుణ్ కేక పెట్టడంతో ఉలిక్కిపడి అతని వైపు చూసాను.

నేను రాసింది చదివాక అతని రియాక్షన్ అది. తరుణ్ నా వంక కోపంగా చూస్తూ "ప్రియా! ఏమిటి ఇది? ఎందుకు ఇలా రాశావు?" అంటూ ఆవేశంగా అడిగాడు.



"కూల్ తరుణ్.. కొత్తగా పెళ్లి అయిన వాళ్ళం. ఒకవేళ నేనేదైనా పిచ్చి పని చేసి చనిపోతే నిన్ను ఎవరూ అనుమానించ కూడదు" అంటూ ఇంకా ఏదో చెప్పబోతున్న నా చెంపమీద బలంగా కొట్టాడు.


"మతి ఉండే మాట్లాడుతున్నావా..? ఒకవేళ నీకు ఏదైనా జరిగితే ఈ ఉత్తరం చూపించి కేసుల నుండి బయట పడి, ఒక వందేళ్ళు నేను సుఖంగా బ్రతికేస్తా ననుకుంటున్నావా? అలా ఎన్నటికీ జరగదు. నువ్వు లేని ఈ లోకంలో నేను ఒక్క క్షణం కూడా ఉండను" అంటూ ఆ పేపర్ ను ఉండలా చుట్టి విసిరేశాడు. అది బెడ్ రూమ్ తలుపుకు కొట్టుకొని, క్రింద పడింది.


తర్వాత నా వంక చూసిన అతను, నా కళ్ళ నుంచి కారుతున్న నీళ్లను చూసి ఒక్క ఉదుటున నా దగ్గరికి వచ్చాడు. నా కన్నీళ్లను తుడిచి ‘సారీ’ చెప్పాడు.


"తరుణ్! ఈ కన్నీళ్లు నువ్వు కొట్టినందుకు కాదు. నీకు నా మీద ఉండే అభిమానం తెలుసుకొని ఏడుపు ఆపుకోలేకపోయాను. అంతే!" అంటూ అతన్ని కౌగిలించుకున్నాను. అతడు నన్ను నెమ్మదిగా పడుకోబెట్టి, నా భుజం మీద మృదువుగా తట్ట సాగాడు. చిన్నప్పుడు నన్ను అలా నిద్రపుచ్చిన మా అమ్మను గుర్తు చేసుకుంటూ నెమ్మదిగా నిద్రలోకి జారుకున్నాను.


కానీ అతడు కొట్టిన చెంప దెబ్బకు దవడ బాగా నొప్పి చేయడంతో కాసేపటికే మెలకువ వచ్చింది. కానీ కళ్ళు మూసుకునే ఉన్నాను.

కొంతసేపటికి తరుణ్ నా వైపు తిరిగి నా భుజాన్ని మృదువుగా తడుతూ ‘ప్రియా..’ అంటూ పిలిచాడు.


నేను ఇప్పుడు లేస్తే ఈ రాత్రంతా నాకు సారీలు చెబుతూ ఉంటాడు అని నేను నిద్ర నటించాను. కొంతసేపటికి అతను మంచం దిగుతున్నట్లు గమనించి కన్ను కొద్దిగా తెరిచి చూశాను. అతను డోర్ దగ్గరికి వెళ్లి కిందికి ఒంగి ఏదో తీసుకోవడం గమనించాను.


తరువాత ఒక సారి నా వైపు తిరిగి చూసి, బెడ్ రూమ్ డోర్ తెరుచుకుని శబ్దం కాకుండా బయటకు వెళ్లి, తిరిగి డోర్ నెమ్మదిగా మూసాడు.


అతడు వెళ్లగానే దిగ్గున పైకి లేచి డోర్ దగ్గర పడిఉన్న పేపర్ కోసం చూశాను. అది అక్కడ లేదు.


ఒక్కసారిగా నా గుండె ఝల్లుమంది.


నా ఎదురుగా ఆ పేపర్ ని నలిపి పారేసిన అతను, తిరిగి దాన్ని తీసుకొని బయటకు వెళ్ళాడు. ఎక్కడో భద్రపరుస్తాడు.


బాగా ఆవేశం తెప్పించే విషయం రాసిఉన్న పేపర్ ని ఎవరన్నా చదివితే వెంటనే ఏం చేస్తారు..

తనైతే ఏం చేస్తుంది..

చింపి పారేస్తుంది.


కానీ అతడు ఉండ చుట్టి విసిరేశాడు.

ఇప్పుడు దాన్ని తీసుకొని వెళ్తున్నాడు.

అంటే దాని అవసరం ఉందని అతడు భావిస్తున్నాడా...

ఇందాక నాతో ఏమన్నాడు మరి...


నేను లేకుండా ఒక్క క్షణం కూడా ఉండలేనని క్షణం ముందే అన్నాడు కదా...!

ఉత్తుత్తి ప్రేమేనా అది..

ఒకవేళ ఆ పేపర్ నేలమీదే ఎక్కడైనా పడి ఉందేమో..

నేను అనవసరంగా అపోహ పడ్డానేమో..


మంచం దిగి డోర్ దగ్గర మోకాళ్ళమీద కూర్చొని వెదకసాగాను.

అంతలో తరుణ్ డోర్ నెట్టడంతో వెల్లకిలా పడ్డాను.


అతను లోపలికి వచ్చి నన్ను పైకి లేపాడు.

"ఏంచేస్తున్నావు ప్రియా.." అన్నాడు నన్ను మంచం మీద కూర్చోబెడుతూ.


ఏం చెప్పాలా అని ఆలోచిస్తున్నాను.

"నువ్వు రాసిన పేపర్ కోసమేనా.." నా భుజాల మీద చేతులు వేస్తూ అడిగాడు.


అతని మొహం లో ఎప్పుడూ ఉండే నవ్వు లేదు.

నాలో టెన్షన్ మొదలైంది.


ఇంకా ఉంది...


మల్లవరపు సీతారాం కుమార్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం



మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

నమస్తే! నా పేరు మల్లవరపు సీతారాం కుమార్. శ్రీమతి పేరు మల్లవరపు సీతాలక్ష్మి. ఇద్దరమూ రచనలు చేస్తుంటాము. ఇప్పటికి దాదాపు 25 కథలు మనతెలుగుకథలు.కామ్, కౌముది, గోతెలుగు.కామ్, సుకథ.కామ్ లాంటి వెబ్ మ్యాగజైన్ లలో ప్రచురితమయ్యాయి. స్వస్థలం నెల్లూరు. తెలుగు కథలంటే చాలా ఇష్టం. మనతెలుగుకథలు.కామ్ వారికి ఎడిటింగ్ లో సూచనలు, సలహాలు ఇస్తుంటాము ( అందువలన మా రచనలు పోటీలకు పరిశీలించబడవు!).



120 views3 comments

3 Comments


Uma Rani • 1 day ago

Thank you mam

Like

plavanyakumari15
Nov 27, 2022

సస్పెన్స్ అండ్ క్రైమ్ సీరియల్ అనుకుంటాను. బాగా ఇంట్రెస్టింగా వ్రాసారు. చాలా బాగుంది సార్.

Like
Replying to

థాంక్ యు అండీ

Like
bottom of page