'Nakemavuthondi Episode-11' New Telugu Web Series
Written By Mallavarapu Seetharam Kumar
రచన, పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
జరిగిన కథ...
కొత్తగా పెళ్ళైన ప్రియ అనే యువతిని ఆమె భర్త నిద్ర లేపి, ఆమె- తన గొంతు తనే నులుముకుని ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు చెబుతాడు.
అతన్నే అనుమానిస్తుంది ప్రియ.
అతని వల్ల తనకు హాని కలగవచ్చునని తండ్రికి మెయిల్ పెడుతుంది.
కూతురి కోసం హైదరాబాద్ బయలుదేరుతుంది ప్రియా తల్లి ప్రమీల.
ప్రియా స్నేహితురాలు.. డిటెక్టివ్ పురంధర్ గారి అమ్మాయి ప్రవల్లిక ఫోన్ చేసి హన్సిక అనే మరో ఫ్రెండ్ మూడు రోజులనుండి కనపడ్డం లేదని చెబుతుంది.
ప్రియ కూడా కాల్ లిఫ్ట్ చెయ్యడం లేదని చెబుతాడు ప్రభాకర రావు.
స్నేహితుడి రూమ్ లో ఉన్న తరుణ్ ని కలుస్తాడు ఉదయ్.
హన్సికని తను హత్య చేసినట్లు ప్రియ తనతో చెప్పిందని అంటాడు తరుణ్.
పొంతనలేని సమాధానాలు చెబుతున్న ఎస్సై రంగనాథాన్ని సస్పెండ్ చేస్తాడు ఎసిపి ప్రతాప్.
రిసార్ట్ మేనేజర్ సందీప్ ని అదుపులోకి తీసుకుంటారు పోలీసులు.
రిసార్ట్ లోని రెస్టారెంట్ మేనేజర్, తరుణ్ - హన్సికతో ఒకసారి, ప్రియతో ఒకసారి రెస్టారెంట్ కి వచ్చినట్లు ఫోటోలు గుర్తుపట్టి చెబుతాడు.
తరుణ్ ని పోలీసులు అదుపులోకి తీసుకుంటారు.
రిసార్ట్ మేనేజర్ సందీప్, ప్రియను తరుణ్ హత్య చేసినట్లు, అతను డబ్బు ఆశ చూపడంతో తామే శవాన్ని కాల్చి, రిసార్ట్ బయట పడవేసినట్లు సిఐ మురళి తో చెబుతాడు.
సస్పెండయిన ఎస్సై రంగనాథాన్ని, రిసార్ట్ మేనేజర్ సందీప్ ని విడుదల చేయమంటాడు ఎసిపి ప్రతాప్.స్టేషన్ దాటి బయటకు వెళ్ళగానే వాళ్ళను ఎవరో కిడ్నాప్ చేస్తారు.
తమను కిడ్నాప్ చేసింది మఫ్టీలో ఉన్న పోలీసులేనని అనుమానిస్తారు రంగనాథం, సందీప్ లు.
స్టేషన్ లో ప్రియా తల్లి ప్రమీల గతంలో జరిగిన సంఘటన వివరిస్తూ ఉంటుంది.
గతంలో ప్రియా ఒకసారి వైజాగ్ లోని తన మేనమామ ఇంట్లో ఉండాల్సి వస్తుంది.
అక్కడ రాత్రిపూట ఎవరో తనమీద అత్యాచార ప్రయత్నం చేసినట్లు, అందువల్ల తాను అక్కడినుండి బయటకు వెళ్లిపోయినట్లు చెబుతుంది.
ఇక నాకేమవుతోంది.. ధారావాహిక పదకొండవ భాగం చదవండి.
కాఫీ తాగాక రెస్ట్ రూమ్ కి వెళ్లి, ముఖం కడుక్కొని వచ్చింది ప్రమీల.
"ఆంటీ! మీరు అవసరమైతే కాసేపు రెస్ట్ తీసుకోండి. తరువాత మాకు ఏం జరిగిందో చెప్పవచ్చు" అంది ప్రవల్లిక.
ఇందాక ప్రమీలకు టీ ఇచ్చిన కానిస్టేబుల్ మాట్లాడుతూ "మేడం గారిని చెప్పనీయండమ్మా! మనసులో ఉన్నది చెప్పేస్తే కాస్త ఊరట దొరుకుతుంది" అన్నాడు.
మనసులోనే నవ్వుకుంది ప్రవల్లిక. ఆ కానిస్టేబుల్ మాటల్లో ఒక సస్పెన్స్ థ్రిల్లర్ సగంలో ఆగిపోయిన ఫీలింగ్ కనపడుతోంది. కానీ అతను చెప్పింది కూడా నిజమేనేమో.. విషయం వివరించాక ప్రమీల ఆంటీ మనసులో ఉన్న భారం కాస్త తగ్గవచ్చు.
తరువాత జరిగిన సంఘటనలు చెప్పడానికన్నట్లు గొంతు సవరించుకుంది ప్రమీల. అందరూ ఆమె వంక ఆసక్తిగా చూస్తూ ఉన్నారు. చెప్పడం ప్రారంభించింది ప్రమీల.
"ఆ రోజు మరో గంట తర్వాత ఫోన్ చేసింది ప్రియ.
" చెప్పు ప్రియా! ఆ తర్వాత ఏం జరిగింది?" అని అడిగాను.
ప్రియ, జరిగిన సంఘటనను ఇలా వివరిస్తుంది.
“అమ్మా! నేను తలుపు కొద్దిగా తెరిచి చూశాను. మామయ్య అటువైపు తిరిగి సీసీ కెమెరా మానిటర్ దగ్గర ఏదో కదిలిస్తున్నాడు. తలుపు శబ్దం విని అతను వెనక్కి తిరుగుతుండగానే, నేను తలుపును దగ్గరకు మూసి, బెడ్ మీద పడుకున్నాను.
ఆయన ఏం చేస్తున్నాడో.. హార్డ్ డిస్క్ బయటకు తీసి పగలగొట్టేస్తాడేమో.. ఇందాక గదిలోకి వచ్చింది ఆయనే అయి ఉంటే కచ్చితంగా ఆ పని చేస్తాడు. బయట నుంచి ఏ విధమైన శబ్దం రావడం లేదు. ఎందుకు..? ఒకవేళ నేను తలుపు తెరిచి చూసినట్లు అతనికి అనుమానం వచ్చిందా.. వస్తే ఏం చేస్తాడు..? తన మీద అటాక్ చేస్తాడా.. తను తలుపు గడియ వేసుకోవడం మంచిది. ఇందాక ఆయన గడియ పెట్టుకోవద్దని చెప్పిన విషయం గుర్తుకొచ్చింది. కానీ ఎవరు ఏమనుకుంటే నాకేం.. నా మానప్రాణాలు నేను కాపాడుకోవాలి. వెంటనే బెడ్ మీద నుంచి కిందికి దిగాను.
అంతలో హఠాత్తుగా కరెంట్ పోయింది. ఒక్క క్షణం ఏం చేయాలో అర్థం కాలేదు. బెడ్ మీద పిల్లో పక్కనే ఉన్న నా మొబైల్ తీసుకోవడమా.. లేక అలాగే తడుముకుంటూ తలుపు గడియ పెట్టడమా.. నా ఆలోచన తెగేలోపే తలుపు తెరుచుకొని ఒక వ్యక్తి లోపలికి వచ్చాడు.
హాల్లోని కిటికీ నుండి వచ్చే కొద్దిపాటి వెలుతురులో అతను ముఖానికి ముసుగో లేక మంకీ క్యాప్ లాంటిదో పెట్టుకొని ఉన్నట్లు గమనించాను. నాకు ఆలోచించుకునే వ్యవధి కూడా ఇవ్వకుండా అతను నన్ను బెడ్ మీదకు నెట్టాడు.
"నేనెవరో తెలుసుకున్నావా.. అయితే నువ్వు ప్రాణాలతో ఉండకూడదు. ఈ నీలకంఠం నిన్ను వదిలిపెట్టడు" అంటూ దిండు నా ముఖంపై ఉంచి నాకు ఊపిరాడకుండా చేశాడు.." చెబుతూ ఉన్న ప్రియా కు నేను అడ్డు తగిలాను.
"నీలకంఠం ఎవరు? మా తమ్ముడు.. అదే మీ మామయ్య పేరు శివరావు కదా" అన్నాను.
అటువైపు నుండి ప్రియా ఆలోచిస్తున్నట్లు కొంతసేపు నిశ్శబ్దం.
తరువాత తను మాట్లాడుతూ "అమ్మా! నాకైతే అతను తన పేరు నీలకంఠం అని అన్నట్లే గుర్తుకు వస్తోంది. ఏమో.. ఆ సమయంలో నేను పొరపాటు పడ్డానో.. లేదా ఆ వ్యక్తి మామయ్య కాదేమో.. కానీ అతను 'నేనెవరో తెలిసిపోయిందా' అన్నాడు. పైగా అతను గొంతు మార్చి మాట్లాడినా నాకైతే మామయ్య గొంతులాగే అనిపిస్తోంది.
అతను నా పైకి వాలి రెండు చేతులతో నా ముఖానికి దిండును అదిమి పెడుతున్నాడు. నా రెండు చేతులతో అతన్ని నెట్టడానికి ప్రయత్నిస్తూ నా మోకాలిని పైకి మడిచి అతని డొక్కలో బలంగా తన్నాను. దాంతో అతడు దిండును వదిలేసి వెనక్కి జరిగాడు. అదే అదనుగా నేను నా మొబైల్ ని చేతిలోకి తీసుకొని ఆ గది లోంచి బయటకు వచ్చాను. ఒక్క ఉదుటున మెయిన్ డోర్ తెరుచుకొని రోడ్లోకి వచ్చి వేగంగా పరుగెత్త సాగాను. అదృష్టవశాత్తు ఆ రోడ్లో కార్లో వెళుతున్న దంపతులు నన్ను చూసి కారు ఆపి ఎక్కించుకున్నారు. ఆరాలేవీ తీయకుండా నేను ఎక్కడికి వెళ్లాలో కనుక్కున్నారు. నన్ను మా స్నేహితురాళ్ళు బస చేసిన హోటల్ దగ్గర వదిలి పెట్టారు.
నేను దారిలోనే నా ఫ్రెండ్స్ కి ఫోన్ చేసి ఉండడంతో, వాళ్లు నాకోసం హోటల్ కిందే వెయిట్ చేస్తూ ఉన్నారు. నేను రాగానే నన్ను వాళ్ల రూమ్ లోకి తీసుకొని వెళ్లారు. ఏం జరిగిందని అడిగారు. నేను విషయం చెప్పకుండా ఎందుకో అక్కడ ఉండలేక పోయానని, నా మానసిక స్థితి సరిగ్గా లేదని, రెస్ట్ తీసుకొని ఉదయం మాట్లాడతానని చెప్పాను. నాకోసం మా మేనమామ వస్తే నేనక్కడ లేనని చెప్పమన్నాను. మీరు ఎవరైనా ఫోన్ చేస్తే నన్ను డిస్టర్బ్ చేయవద్దని, ఉదయం లేచాక నేనే కాల్ చేస్తానని చెప్పాను".
చెప్పడం ముగించింది ప్రియ. కాసేపు ఇద్దరం మౌనంగా ఉన్నాం.
నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ "ఇప్పుడు నీ ఆరోగ్యం ఎలా ఉంది ప్రియా? మీ టూర్ ఇంకా మూడు రోజులు ఉంది కదా! అక్కడ ఉండగలుగుతావా.. లేదంటే మా దగ్గరకు వచ్చి రెండు రోజులు ఉండు. కాస్త స్థిమిత పడ్డాక హైదరాబాద్ వెళ్లొచ్చులే" అన్నా.
"నాక్కూడా రావాలని ఉందమ్మా. ఈరోజు అరకు వెళ్లే ప్రోగ్రాం ఉంది. ఇదొక్కటి అటెండ్ అవుతాను. రేపు ఉదయం బయలుదేరి మీ దగ్గరకు వచ్చేస్తాను" అంది ప్రియ.
"ఒక్కదానివే రాగలవా? లేదంటే మీ నాన్నను పంపిస్తాను" అన్నాను.
"అవసరం లేదమ్మా. రాగలను" అంది ప్రియ. రాత్రి పూర్తిగా నిద్ర లేకపోవడంతో ఆ రోజు ఆయన ఆఫీసుకి సెలవు పెట్టారు. ఇద్దరం గంటకోసారి ప్రియాకు కాల్ చేస్తూనే ఉన్నాం. ప్రియా కూడా మా టెన్షన్ అర్థం చేసుకుని ఓపిగ్గా మాతో మాట్లాడింది. మధ్యాహ్నం భోజనాలయ్యాక నిద్రకు తట్టుకోలేక ఇద్దరం పడుకున్నాం. కొంతసేపటికి ఎవరో ఆపకుండా కాలింగ్ బెల్ నొక్కుతూ ఉన్నారు. దాంతో ఆయన వెళ్లి తలుపు తీశారు.
వచ్చింది మా తమ్ముడు శివరావు!
హఠాత్తుగా అతను మా ఇంటికి రావడంతో ఆశ్చర్యపోయాము.
"బాగున్నావా శివరావ్" అంటూ మా వారు అతన్ని పలకరించారు.
"రారా తమ్ముడూ! రా.. కూర్చో" అన్నాను.
"నేను కూర్చోడానికి రాలేదు. మీకు ఇది ఇచ్చి వెళ్దామని వచ్చాను' అంటూ తన చేతిలో ఉన్న పెన్ డ్రైవ్ ఆయన చేతికి ఇచ్చాడు.
"ముందు కూర్చోరా తమ్ముడూ.." అన్నాను నేను.
"నీకు ఒక నమస్కారం.. నీ మర్యాదలకు ఒక నమస్కారం అక్కయ్యా! మేనకోడలు కదా అని ఆప్యాయంగా ఇంటికి పిలిస్తే అర్ధరాత్రి కేకలు పెడుతూ వెళ్లిపోయింది.నువ్వేమో నా కొడుకు తననేదో చేసినట్లు అనుమానించావు" అన్నాడు వాడు కోపంగా.
"అది కాదురా.. మీ అబ్బాయి ఊరు నుంచి వచ్చాడా అని మామూలుగానే అడిగాను. దానికి నువ్వింత కోపం తెచ్చుకుంటే ఎలాగు?" అన్నాను.
"నీ కూతురి మానసిక స్థితి సరిగ్గా లేదు. వెంటనే డాక్టర్ కి చూపించండి. రాత్రి నీ కూతురితో మా అబ్బాయి వీడియో కాల్ మాట్లాడుతుంటే వాళ్ళిద్దరి జోడి ఎంత చక్కగా ఉందో అని మా కనిపించింది. ఆరోజు రాత్రి చాలాసేపు నేను, నా భార్య వీళ్ళిద్దరి గురించే మాట్లాడుకున్నాం. చదువులు పూర్తయ్యాక వీళ్లకు పెళ్లి చేస్తే బాగుంటుందని అనుకున్నాం. అలాంటిది ఇంటికి వచ్చిన అమ్మాయి మీద మా అబ్బాయి అఘాయిత్యం చేసినట్లుగా మీరు, మీ అమ్మాయి ఊహించుకుంటున్నారు. మా ఇంట్లోని హాల్లో సీసీ కెమెరా ఉంది. పొద్దున మా అబ్బాయి రాగానే రాత్రి నుంచి జరిగినదంతా ఈ పెన్ డ్రైవ్ లోకి కాపీ చేసి ఇచ్చాడు. ఇది చూస్తే నీ కూతురికి పిచ్చి ఏ స్థాయిలో ఉందో మీకే అర్థమవుతుంది" అని చెప్పి వేగంగా బయటకు వెళ్ళిపోయాడు. మేమిద్దరం ఎంత బ్రతిమాలినా అతను ఆగలేదు.
మా తమ్ముడు వెళ్లిపోయాక మా వారు ఆ పెన్ డ్రైవ్ టీవీకి కనెక్ట్ చేసి, ప్లే చేశారు. మొత్తం చూడాలంటే గంటలకొద్దీ సమయం పడుతుంది కాబట్టి ఏ కదలికలు లేని చోట ఫార్వర్డ్ చేస్తూ చూశాము. ఆ రాత్రి 10 గంటలకు ప్రియ హాల్ పక్కన ఉన్న బెడ్ రూమ్ లోకి వెళ్లడం అందులో కనిపించింది. రాత్రి 12 గంటలకు తన గదిలోంచి వేగంగా బయటకు వచ్చింది. మెయిన్ డోర్ వరకు వచ్చి, ఆ తరువాత మా తమ్ముడు వాళ్ళు ఉన్న గదిలోకి వెళ్ళింది. మరికొంతసేపటికి మా తమ్ముడు హాల్లోకి వచ్చి ఈజీ చైర్ లో కూర్చున్నాడు. ప్రియ ఆయనతో మాట్లాడి తిరిగి గదిలోకి వెళ్ళింది. మా తమ్ముడు సీసీ కెమెరా లో రికార్డు అయినదాన్ని ప్లే చేయడానికి ప్రయత్నించాడు. అతని వల్ల కాలేదేమో.. పడుకున్నాడు. అలాగే నిద్రపోయాడు. మరికొంతసేపటికి ప్రియా గదిలోంచి భయపడుతూ బయటకు వచ్చింది. వెనక్కి తిరిగి చూస్తూ గాల్లోనే ఎవరో ఉన్నట్లుగా ఊహించుకొని తన చేతులతో గాలినే వెనక్కి నెట్టింది. తర్వాత మెయిన్ డోర్ తీసుకొని బయటకు పరుగెత్తింది. ఆ సమయంలో మా తమ్ముడు ఈజీ చైర్ లోనే నిద్రపోతున్నాడు. మరికొంతసేపటికి అతనికి మెలకువ వచ్చింది. మెయిన్ డోర్ తెరిచి ఉండడం గమనించాడు.
తర్వాత అతను తన సెల్ తీసుకుని నాకు కాల్ చేశాడు. జరిగింది చూసిన మాకు మతి పోయినట్లు అయింది. 'ప్రియాకి ఏమైంది? ఏమీ లేకుండానే ఏదో జరిగినట్లు ఎందుకు ఊహించుకుంది..' ఖచ్చితంగా తనను వెంటనే సైకియాట్రిస్ట్ దగ్గర చూపించాలని మేమిద్దరం అనుకున్నాం. మేము తన కొడుకుని అనుమానిస్తున్నామని మా తమ్ముడి అభిప్రాయం. అందుకే అతనికి అంత కోపం వచ్చింది. కానీ ప్రియకు అతని మీదనే అనుమానం వచ్చిందని తెలిస్తే ఇక జన్మలో మమ్మల్ని క్షమించడు.
వెంటనే మా తమ్ముడికి కాల్ చేశాను. "ఆ వీడియో చూశానురా.. అమ్మాయికి ఏమైందో తెలియడం లేదు" అన్నాను.
వాడు కొద్దిసేపు మాట్లాడలేదు. తరువాత "దేవుడి దయవల్ల మా ఇంట్లో సీసీ కెమెరా ఉండబట్టి సరిపోయింది. లేకుంటే మేము జీవితాంతం మీ ముందు తల దించుకొని ఉండాల్సి వచ్చేది. ముందు మీ అమ్మాయిని డాక్టర్ కి చూపించండి" అని చెప్పి కాల్ కట్ చేశాడు.
అతని మాటల్ని బట్టి మా మీద చాలా కోపంగా ఉన్నాడనిపించింది. మర్నాడు అమ్మాయి వచ్చాక ఈ వీడియో చూపించి, తనని కన్విన్స్ చేసి హాస్పిటల్ కి తీసుకువెళ్లాలని నిశ్చయించుకున్నాము. పక్క రోజు మధ్యాహ్నం 12 గంటలకు వచ్చింది ప్రియ. మా తమ్ముడు మా ఇంటికి వచ్చి వెళ్లిన విషయం తనకు తెలియదు.
ప్రియా రిఫ్రెష్ అయ్యాక తనని హాల్లో సోఫాలో కూర్చోబెట్టాము. నేను, ఆయన చెరో పక్కన కూర్చున్నాము.
ప్రియా వాళ్ళ నాన్న వంక తిరిగి "ఈరోజు సెలవు పెట్టారా.. ఎందుకు నాన్నా! నాకేం కాలేదు. బాగానే ఉన్నాను" అంది.
"రాత్రి ఏం జరిగిందమ్మా? చెప్పగలుగుతావా.." అని అడిగారు వాళ్ళ నాన్న.
తను మాకు ఫోన్లో చెప్పిన విషయాలనే తిరిగి చెప్పింది. తను మా తమ్ముడిని అనుమానిస్తున్నట్లు కూడా చెప్పింది.
తరువాత మావారు ఆ పెన్ డ్రైవ్ ను ప్లే చేశారు. మేము ప్రియా కు ఆనుకునే కూర్చుని, ఆమె ఫీలింగ్స్ ని గమనిస్తూ ఉన్నాము. ఆశ్చర్యంగా చూస్తోంది ప్రియ.
తను గదిలోంచి బయటకు వచ్చేసరికి మెయిన్ డోర్ వేసే ఉంది. కానీ బయటి వాళ్ల మీద అనుమానం పోవడం కోసం మా తమ్ముడే ఆ డోర్ ని తీసినట్లు ప్రియాకు అంతకు ముందు అనిపించింది. అలాగే రెండవసారి ప్రియా గదిలోంచి బయటకు వచ్చినప్పుడు కరెంట్ ఆఫ్ అయినట్లు చెప్పింది. కానీ కరెంట్ ఎప్పుడూ ఆఫ్ కాలేదు. సిసి కెమెరా ఫుటేజ్ ప్రకారం ప్రియా గదిలోంచి బయటకు వచ్చేటప్పటికి మా తమ్ముడు ఈజీ చైర్ లో నిద్రపోతూనే ఉన్నాడు. తను వెనక్కి తిరిగి చూస్తూ, గాల్లో ఎవర్నో నెట్టినట్లుగా చేతులు ఊపడం ఆ వీడియోలో చూసి ప్రియా ఆశ్చర్యపోయింది.
నన్ను గట్టిగా కౌగిలించుకొని, అమ్మా! నాకేమవుతోంది…? నేను పిచ్చిదానిగా మారిపోతున్నానా.. లేని మనుషుల్ని,జరగని సంఘటనల్ని ఊహించుకుంటున్నాను. ఈ వీడియో కనుక లేకపోయి ఉంటే నేను అనుకున్నది నిజమని నమ్ముతూ ఉండేదాన్ని" అంటూ గట్టిగా ఏడ్చేసింది. నేను తన భుజం తడుతూ ఓదార్చాను.
ఆయన ప్రియ తల పైన చేయి వేసి మృదువుగా నిమురుతూ "బాధపడకమ్మా.. దేహానికి జ్వరం లాంటివి వస్తూ ఉన్నట్లే మెదడుకు కూడా అప్పుడప్పుడు కొన్ని సమస్యలు ఏర్పడతాయి. సరైన సమయంలో ట్రీట్మెంట్ తీసుకుంటే తప్పకుండా నయమవుతుంది. ఇందుకు సరైన డాక్టర్లు ఎవరో నేను ఎంక్వైరీ చేస్తాను" అన్నారు.
దాంతో ప్రియా కు కాస్త ధైర్యం వచ్చింది. ఆ మధ్యాహ్నం భోజనాలు చేస్తూ ఉండగా ప్రియా కు కాల్ వచ్చింది. అవతలి వైపు మాటలు విన్న ప్రియ చేతిలోని అన్నం ముద్ద జారిపోయింది. కుర్చీలోంచి లేచి నిలబడి 'అవునా.. ఎప్పుడు.. ఎలా జరిగింది?' అంటూ ఆశ్చర్యంగా అడుగుతోంది.
తరువాత ఫోన్ పెట్టేసి నిస్తేజంగా గాల్లోకి చూస్తూ ఉండిపోయింది. నేను కూడా అన్నం ముందు నుంచి లేచి చేయి కడుక్కొని తన భుజం పట్టి కుదిపాను, 'ఏమైంది ప్రియా' అంటూ.
"అమ్మా! నా క్లాస్మేట్, హైదరాబాదులో నా రూమ్మేట్ భార్గవి.. చనిపోయిందట" బాధగా చెప్పింది ప్రియ.
"ఎలా జరిగిందమ్మా?" అని అడిగాను.
"నిజానికి తను కూడా మాతో టూర్ కి రావాల్సి ఉంది. కానీ హైదరాబాద్ లోనే ఉన్న తన మామయ్య కొడుక్కి నిశ్చితార్థం ఉండడంతో అక్కడే ఉండిపోయింది. నిన్న రాత్రి వాళ్ళ మామయ్య వాళ్ళ ఇంట్లోనే పడుకుంది. పొద్దున లేచేటప్పటికి ఫ్యాన్ కి ఉరి వేసుకుందట. నేను వెంటనే బయలుదేరుతానమ్మా" అంది ప్రియ.
ఏం చెప్పాలో అర్థం కాక ఆయన వంక చూశాను.
"ఈ పరిస్థితుల్లో నిన్ను ఒంటరిగా పంపించలేము ప్రియా! అలాగని నిన్ను వెళ్ళవద్దని చెప్పలేము. ముగ్గురం హైదరాబాద్ వెళ్దాం. నిన్ను ఎలాగూ డాక్టర్ కి చూపించాలని అనుకున్నాం కదా.. సిటీలోనే ఉన్న మా అన్నయ్యకు ఫోన్ చేసి మంచి సైకియాట్రిస్టులు ఎవరో కనుక్కొని రేపటికి అపాయింట్మెంట్ తీసుకోమని చెబుతాను" అన్నారాయన.
సరేనంది ప్రియ. ముగ్గురం కారులో హైదరాబాద్ బయలుదేరాం. దారిలోనే ప్రియ తన స్నేహితురాళ్లకు ఫోన్ చేసింది. డెడ్ బాడీని పోస్టుమార్టం కోసం తీసుకొని వెళ్ళినట్లు చెప్పారు వాళ్లు. బాడీని ఏ రాత్రికో తిరిగి ఇచ్చేస్తారట. ఇక భార్గవి పేరెంట్స్ ఇద్దరూ బెంగుళూరులో ఉద్యోగాలు చేస్తున్నారు. వాళ్ళ స్వస్థలం హైదరాబాద్ కాబట్టి అంత్యక్రియలు హైదరాబాద్ లోనే చేస్తారట. వాళ్ళు కూడా బెంగుళూర్ నుండి బయలుదేరారట. ఫ్రెండ్స్ అందరూ భార్గవి వాళ్ళ మామయ్య ఇంటి దగ్గరే డెడ్ బాడీ కోసం ఎదురు చూస్తున్నారట. వాళ్లు భార్గవి వాళ్ళ మామయ్య ఇంటి లొకేషన్ ప్రియా కు షేర్ చేశారు.
ప్రియ దాన్ని తండ్రికి షేర్ చేసి "నాన్నా! మనం నేరుగా యూసఫ్ గూడా లో ఉన్న భార్గవి వాళ్ళ మామయ్య ఇంటికి వెళ్దాం" అని చెప్పింది.
మరో అరగంటకు యూసఫ్ గూడా లోని ఆ ఇంటికి చేరుకున్నాం. అది ఒక ఇండివిడ్యువల్ హౌస్. ఇంటి చుట్టూ కాంపౌండ్ వాల్ ఉంది. ముగ్గురం కారు దిగాం. ప్రియ క్లాస్మేట్స్ మా దగ్గరికి వచ్చారు. కాంపౌండ్ వాల్ లోపల ఖాళీ స్థలంలో షామియానాలు వేసి కుర్చీలు వేసి ఉన్నారు. అవి చూపిస్తూ మమ్మల్ని లోపల కూర్చోమన్నారు వాళ్లు.
మేమిద్దరం లోపలికి వెళ్ళబోతూ కాంపౌండ్ వాల్ గోడ మీద రాసి ఉన్న పేరును చూసి ఆగిపోయాం. దానిమీద 'నీలకంఠ నిలయం' అని ఉంది. అది చూడగానే నాకు ఒళ్ళు గగుర్పొడిచింది. ఆ పేరు ఎక్కడో విన్నట్లు అనిపించింది. నిన్న ఫోన్లో అమ్మాయి మాట్లాడుతూ తన గదిలోకి వచ్చిన వ్యక్తి 'ఈ నీలకంఠం నుండి తప్పించుకోలేవు' అన్నాడని చెప్పింది. కానీ దానికి దీనికి ఏం సంబంధం ఉంటుందని అనిపించింది. లోపలికి వెళ్లి వరండాలో వేసి ఉన్న కుర్చీల్లో కూర్చున్నాం. అక్కడ ఒకచోట అమర్చి ఉన్న సిసి కెమెరాను చూపించారు ఆయన.
"ఇప్పుడు సిటీలో అందరూ సీసీ కెమెరాలు పెట్టుకుంటున్నారు" అన్నాను నేను.
"అమ్మాయి చెప్పిన సంఘటనలకు ఇక్కడ చూసిన వాటికి ఏదో సంబంధం ఉందని పిస్తోంది" అన్నారాయన.
చెప్పడం ఆపింది ప్రమీల.
================================================
ఇంకా ఉంది...
================================================
మల్లవరపు సీతారాం కుమార్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
Podcast Link
Twitter Link
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం:
నమస్తే! నా పేరు మల్లవరపు సీతారాం కుమార్. శ్రీమతి పేరు మల్లవరపు సీతాలక్ష్మి. ఇద్దరమూ రచనలు చేస్తుంటాము. ఇప్పటికి దాదాపు 25 కథలు మనతెలుగుకథలు.కామ్, కౌముది, గోతెలుగు.కామ్, సుకథ.కామ్ లాంటి వెబ్ మ్యాగజైన్ లలో ప్రచురితమయ్యాయి. స్వస్థలం నెల్లూరు. తెలుగు కథలంటే చాలా ఇష్టం. మనతెలుగుకథలు.కామ్ వారికి ఎడిటింగ్ లో సూచనలు, సలహాలు ఇస్తుంటాము ( అందువలన మా రచనలు పోటీలకు పరిశీలించబడవు!).
Commenti