top of page
Writer's pictureSeetharam Kumar Mallavarapu

నాకేమవుతోంది…? ఎపిసోడ్ 14


'Nakemavuthondi Episode-14' New Telugu Web Series



'నాకేమవుతోంది…?' తెలుగు ధారావాహిక ఎపిసోడ్ 14


జరిగిన కథ…


కొత్తగా పెళ్ళైన ప్రియ అనే యువతిని ఆమె భర్త తరుణ్ నిద్ర లేపి, ఆమె తన గొంతు తనే నులుముకుని ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు చెబుతాడు. అతన్నే అనుమానిస్తుంది ప్రియ. అతని వల్ల తనకు హాని కలగవచ్చునని తండ్రికి మెయిల్ పెడుతుంది.


స్నేహితుడి రూమ్ లో ఉన్న తరుణ్ ని కలుస్తాడు ఉదయ్.

హన్సికని తను హత్య చేసినట్లు ప్రియ తనతో చెప్పిందని అంటాడు తరుణ్.

పొంతనలేని సమాధానాలు చెబుతున్న ఎస్సై రంగనాథాన్ని సస్పెండ్ చేస్తాడు ఎసిపి ప్రతాప్. కానీ తరువాత రంగనాథాన్ని, రిసార్ట్ మేనేజర్ సందీప్ ని విడుదల చేయమంటాడు. స్టేషన్ దాటి బయటకు వెళ్ళగానే వాళ్ళను ఎవరో కిడ్నాప్ చేస్తారు.


తమను కిడ్నాప్ చేసింది మఫ్టీలో ఉన్న పోలీసులేనని అనుమానిస్తారు రంగనాథం, సందీప్ లు.

స్టేషన్ లో ప్రియా తల్లి ప్రమీల గతంలో జరిగిన సంఘటన వివరిస్తూ ఉంటుంది.

గతంలో ప్రియా ఒకసారి వైజాగ్ లోని తన మేనమామ ఇంట్లో ఉండాల్సి వస్తుంది.

అక్కడ రాత్రిపూట ఎవరో తనమీద అత్యాచార ప్రయత్నం చేసినట్లు, అందువల్ల తాను అక్కడినుండి బయటకు వెళ్లిపోయినట్లు చెబుతుంది. తన గదిలోకి వచ్చిన వ్యక్తి అతని పేరు నీలకంఠం అని చెబుతాడు.


సిసి కెమెరా ఫుటేజ్ లో ప్రియ గదిలోకి ఎవ్వరూ వెళ్లలేదని, ఆమె గాలితో మాట్లాడుతూ బయటకు వెళ్లిందని తెలుస్తుంది. మరణించిన తన స్నేహితురాలు భార్గవిని చూడటానికి తల్లిదండ్రులతో హైదరాబాద్ వెడుతుంది ప్రియ. అక్కడ భార్గవి మేనమామ పేరు నీలకంఠం అని తెలిసి ఆశ్చర్య పోతారు ప్రియా పేరెంట్స్.


తన మేనమామ తనమీద హత్యా ప్రయత్నం చేసినట్లు తనకు అనిపించడం భార్గవి విషయంలో నిజం అయివుండొచ్చని ప్రియకు అనిపిస్తుంది. ప్రియా తండ్రి ప్రభాకర రావు చొరవతో పోలీసులు నీలకంఠం ఇంట్లో సోదా చేసి హార్డ్ డిస్క్ ను స్వాధీనం చేసుకుంటారు.


ప్రియను ఆమె తల్లిదండ్రులు సైకియాట్రిస్ట్ దగ్గరకు తీసుకొని వెళ్తారు.

మేనమామ ఇంట్లో ప్రియకు కలిగిన అనుభవాలు, భార్గవి మేనమామ ఇంట్లో మరణించడం కేవలం యాదృచ్ఛికం అంటాడు సైకియాట్రిస్ట్ శ్రీనివాస్.


ప్రియకు మానసిక లోపం వల్లే జరగనివి జరిగినట్లు ఉహించుకొంటోందని చెబుతాడు.

ఒక సంవత్సరం పాటు ప్రియను మందులు వాడమంటాడు.

తనను బంధించిన కిరణ్ కి అన్ని వివరాలు చెబుతానంటాడు రంగనాథం.


ఇక నాకేమవుతోంది.. ధారావాహిక పదునాలుగవ భాగం చదవండి.


ఇద్దరు కానిస్టేబుల్స్ ని చేతిలో లాఠీలు పట్టుకొని రంగనాథం పక్కనే నిలబడమన్నాడు ఉదయ్.

తరువాత రంగనాథంతో "ఆ లాఠీల అవసరం రాదని ఆశిస్తున్నాను. కానీ నీ బుద్ధి నాకు తెలుసు. ఏదో ఒకటి అరకొరగా చెప్పి తప్పించుకోవాలని చూడొద్దు. చాల విషయాలు సందీప్ చెప్పేసాడు. ఆ విషయాలు నీ దగ్గర క్రాస్ చెక్ చేసుకోవడానికి అడుగుతున్నాం. అంతే.." అన్నాడు.


"ఉదయ్ గారూ! నాకు తెలిసిన ప్రతి విషయం మీకు చెబుతాను" అంటూ చెప్పడం ప్రారంభించాడు రంగనాథం.


"ఆ రోజు రిసార్ట్ దగ్గర పడిఉన్న శవాన్ని చూడటానికి వెళ్లాను. ఆ రిసార్ట్ మేనేజర్ సందీప్ నాకు ముందే తెలుసు. గతంలో ఒక చిన్న కేసులో అతనికి సహాయం చేసాను. ఆ పరిచయాన్ని అడ్డం పెట్టుకుని ఈ కేసులో సహాయం అడగవద్దని, అతనికి ముందే చెప్పాను. అతనితో కలిసి ఆఫీస్ రూమ్ కి వెళ్ళాను.


రికార్డ్ లు అస్తవ్యస్తంగా ఉన్నాయి.

అదేమిటని అతన్ని నిలదీసాను.

అంతలో నాకు మాజీ మినిష్టర్ కనకారావు పిఎ దగ్గర్నుండి కాల్ వచ్చింది.

ఈ కేసు విషయంలో సందీప్ కి సహకరించమని కనకారావు మాటగా అతని పిఎ చెప్పాడు.


ఇది మర్డర్ కేసని, ఏసిపి గారు నాకు కాల్ చేసి ముందుగా హెచ్చరించారని, ఏదైనా పొరపాటు జరిగితే నా ఉద్యోగం పోతుందని చెప్పాను. వినలేదతను.


సిసి కెమెరా తాలూకు హార్డ్ డిస్క్ నీ, ఆఫీస్ రికార్డ్ లను ఎవరో ఎత్తుకుపోయినట్లు సందీప్ దగ్గర కంప్లైంట్ తీసుకొమ్మని చెప్పాడు.

'ఆలా చేస్తే ఎవరూ నమ్మర'ని చెప్పాను నేను. 'నమ్మకాలతో అవసరం లేదనీ, రికార్డ్ లు మాయం కావడం ముఖ్యమ'ని చెప్పాడతను.


అంతేకాదు.కనకారావు పలుకుబడితో నాకు ఇబ్బంది లేకుండా చూస్తానని చెప్పాడు అయన పిఎ. అన్నిటికంటే ముఖ్యం.. నాకు కోటి రూపాయలు అఫర్ చేసారు" చెప్పాడు రంగనాధం.


ఆశ్చర్యపోయాడు ఉదయ్.

'అంటే.. ఈ కేసులో పెద్దల ప్రమేయం ఖచ్చితంగా ఉందన్నమాట' అనుకున్నాడు.

"అసలు హన్సిక ని హత్య చేసిందెవరు? ఎందుకోసం ఆ హత్య జరిగింది? చనిపోయింది ప్రియా అని ఇంటరాగేషన్ లో సందీప్ ఎందుకు చెప్పాడు? ప్రియ ఆ రాత్రి పూట అక్కడినుంచి ఎందుకు మాయం అయింది? నీకు కోటి రూపాయలు అఫర్ చెయ్యడం ఆశ్చర్యంగా ఉంది. ఈ కేసులో కనకారావు పాత్ర ఎంత?" వరుసగా ప్రశ్నలు సంధించాడు ఉదయ్.


"శవాన్ని చూడడానికి వెళ్ళినప్పటినుండే నేను ఈ కేస్ లో ఇన్వాల్వ్ అయ్యాను. అంతకు ముందు జరిగిన విషయాలు నాకు తెలియవు. పెద్దలతో వ్యవహారం కాబట్టి వీలయినంత తక్కువ తెలుసుకుంటే మంచిదని, అవసరమయితే మరికొంత మొత్తం ఇప్పిస్తానని చెప్పాడు కనకారావు పిఎ.


కోటి రూపాయల ఆశ నా మీద పనిచేసింది. ఒకవేళ సస్పెండ్ అయినా కనకారావు అండ వుంటే ఉద్యోగం పోదని, మహా అయితే ట్రాన్స్ఫర్ అవుతుందని అనిపించింది.

రిసార్ట్ రికార్డ్ లు మాయం అయితే ఏ ఆధారాలూ ఉండవని అనుకుని ఈ పనికి ఒప్పుకున్నాను. ఎవరో రికార్డులు, సిసి కెమెరా హార్డ్ డిస్క్ దొంగిలించినట్లు సందీప్ చేత కంప్లైంట్ తీసుకున్నాను. నాతో పాటు రిసార్ట్ కి వచ్చిన కానిస్టేబుల్స్ లో ఎవరో, నేను సందీప్ తో లాలూచీ పడిన విషయం ఏసిపి గారికి చేరవేసి ఉంటారు. అందుకే అయన నా మాటలు నమ్మకుండా, నన్ను సస్పెండ్ చేశారు.


సందీప్ నాకు చెప్పిన ప్రకారం హన్సిక ఒక యువకుడితో రిసార్ట్ కి వచ్చింది. అతడే ఆవేశంలో ఆమెను హత్య చేసాడు. శవాన్ని మాయం చెయ్యమని అతను సందీప్ ని కోరాడట. మొదట ఒప్పుకోక పోయినా కనకారావు మనుషులు ఫోన్ చెయ్యడంతో సందీప్ అంగీకరించాడట. ప్రియా వెళ్ళడానికి వెహికల్ అరేంజ్చెయ్యమని కూడా కనకారావు మనుషులు చెప్పారట. ఆమెను ఎవరూ కిడ్నాప్ చెయ్యలేదు..తనంతట తనే ఎక్కడికో వెళ్లిందట.


నాకు తెలిసినది ఇంతవరకే. సందీప్ మీ దగ్గర చాలా దాచినట్లు అనిపిస్తోంది.

ప్రియా ఎక్కడికి వెళ్లిందో అతనికి ఖచ్చితంగా తెలిసి ఉంటుంది" అన్నాడు రంగనాథం.


"ఆ సందీప్ ను తీసుకొచ్చి నీ పక్కనే కట్టిపడేస్తాను. నిజాలు ఒప్పుకునేలా అతన్ని కన్విన్స్ చేయి. నీ షర్టు కాలర్ వెనుక వైపు మైక్రోఫోన్ తగిలిస్తున్నాము. నీ మాటలు మాకు వినపడతాయి. నువ్వు ఏదైనా సైగలు చేస్తే పైన ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అవుతాయి" అన్నాడు ఉదయ్.


తరువాత తన అనుచరులతో "ఆ సందీప్ ను తీసుకొచ్చి ఇతని పక్కనే కట్టిపడేయండి" అని చెప్పి వెళ్ళిపోయాడు. వాళ్లు సందీప్ ను తీసుకొని వచ్చి రంగనాథం పక్కనే మరో కుర్చీలో చేతులు కాళ్లు కదలకుండా కట్టేసి అక్కడి నుండి వెళ్లిపోయారు. దూరం నుండి వాళ్ళ మాటలు జాగ్రత్తగా వింటూ ఉన్నాడు ఉదయ్.

***


నీరసంగా కళ్ళు తెరిచింది ప్రియ. ఒకసారి చుట్టూ పరికించి చూసింది. తాను ఎక్కడ ఉన్నాను ఆమెకు అర్థం కాలేదు. క్రితంసారి కళ్ళు తెరిచినప్పుడు తను ఒక హాస్పిటల్ లో ఉంది. డాక్టర్ శ్రీనివాస్ తన దగ్గరికి వచ్చాడు. తనను ఏవో కొన్ని ప్రశ్నలు అడిగినట్లు లీలగా గుర్తుకు వస్తోంది. కానీ ఆయన అడిగినదేమిటో అందుకు తన సమాధానం ఏమిటో ఆమెకు గుర్తు రావడం లేదు. కానీ ప్రస్తుతం తను ఉన్నది హాస్పిటల్లో కాదు. ఎవరింట్లోనో బెడ్ రూమ్ లో ఉంది.


'ఎవరైనా ఉన్నారా' అంటూ పిలిచింది కానీ తన గొంతు తనకే వినపడలేదు. బెడ్ పక్కనే ఉన్న టేబుల్ పైన ఒక విజిల్ కనిపించింది. 'బహుశా తన కోసమే దాన్ని అక్కడ ఉంచి ఉంటారు..' అనుకొని కాస్త ప్రయత్నించి అందుకుంది. నెమ్మదిగా ఆ విజిల్ ని నోటి దగ్గరకు చేర్చి తన శక్తినంత కూడగట్టుకొని గట్టిగా ఊదింది. మరికొద్ది క్షణాలకే మెడలో స్టెతస్కోప్ తో ఒక 30 ఏళ్ల స్త్రీ వచ్చింది. ప్రియాను నడుం పట్టుకొని పైకి లేపి మంచం మీదే కూర్చోబెట్టింది. తర్వాత నాడిని, హార్ట్ బీట్ ను పరీక్షించింది. ప్రియా వంక చూసి నవ్వుతూ "దాదాపుగా నార్మల్ అయ్యారు. అన్నట్లు నా పేరు శ్రీదేవి. నేను డాక్టర్ శ్రీనివాస్ గారి భార్యను. నేను కూడా డాక్టర్ నే. జనరల్ ఫిజీషియన్ ని. కేకేఆర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లోనే పనిచేస్తున్నాను" అని చెప్పింది.


ప్రియ ఆమె వంక చూస్తూ "అసలు నేను ఇక్కడికి ఎలా వచ్చాను?" అని అడిగింది.


"ముందుగా మీరు ఎగ్జైట్ కాకండి. మీకు స్పృహ వచ్చాక కాల్ చేయమని శ్రీనివాస్ గారు చెప్పారు. ఇప్పుడే కాల్ చేస్తాను. వారు వచ్చాక అన్ని వివరాలు చెబుతారు. హాస్పిటల్ లో ఉంటే మీకు ఏదైనా ప్రమాదం కలగవచ్చునని ఇక్కడికి మార్పించాము" అంటూ తన భర్తకు కాల్ చేసి మాట్లాడింది.


తరువాత ఫోన్ పెట్టేసి "మరో అరగంటలో ఆయన ఇంట్లో ఉంటారు. అన్ని విషయాలు నెమ్మదిగా చెబుతారు. ఈలోగా మీకు కాస్త ఫ్రూట్ జ్యూస్ తెచ్చిస్తాను" అని చెప్పి లోపలికి వెళ్లిందామె. కాస్త కుదుట పడింది ప్రియ. తను గౌతమ్ తో రిసార్ట్ కి వెళ్ళిన విషయం ఆమెకు గుర్తుంది. ఆ తరువాత జరిగిన సంఘటనలు ఎంత ప్రయత్నించినా గుర్తుకు రావడం లేదు..


తరుణ్ ఎక్కడ ఉన్నాడు.. ఆ ఆలోచన రాగానే ఉలిక్కి పడింది. ఆ రోజు ప్రియా తన తండ్రికి ఒక మెయిల్ ప్రిపేర్ చేసి దాన్ని షెడ్యూల్ చేసి ఉంచింది.


మై గాడ్..తను దాన్ని రీ షెడ్యూల్ చేయలేదు. ఆ మెయిల్ తండ్రికి చేరి ఉంటుంది. అమ్మానాన్నలు నాకోసం గాలించి ఉంటారేమో.. ఒకవేళ తరుణ్ మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం లాంటిది జరిగి ఉంటుందా.. ఆ ఆలోచన రాగానే ఆమె గుండె జల్లుమంది. వెంటనే తన తండ్రికి కాల్ చేయాలి.. తన ఫోన్ కోసం అటు ఇటు చూడ సాగింది.


ఇంతలో లోపలికి వెళ్లిన డాక్టర్ శ్రీదేవి ఒక గ్లాస్ నిండా ఫ్రూట్ జ్యూస్ తీసుకుని వచ్చింది. "టెన్షన్ పడకు ప్రియా! కాస్త ఓపిక పట్టు. ఆయన కాసేపట్లో వచ్చేస్తారు" అంది.


"నా ఫోన్ ఎక్కడ ఉంది? నేను అర్జెంటుగా కాల్ చేయాలి. నేను ఇక్కడ ఉన్న విషయం తరుణ్ తో, మా అమ్మ నాన్నలతో చెప్పాలి" అంది.


"తప్పకుండా మాట్లాడుదువులే.. కాస్త ఓపిక పట్టు. నువ్వు మా దగ్గర నుండి వెళితే నీ ప్రాణాలకు ప్రమాదం. ముందు ఈ జ్యూస్ తాగు. నీరసం కాస్త తగ్గుతుంది" అంటూ ప్రియా చేత తను తెచ్చిన జ్యూస్ తాగించింది డాక్టర్ శ్రీదేవి.


జ్యూస్ తాగాక కాస్త శక్తి వచ్చినట్లయి, ప్రియా డాక్టర్ వైపు తిరిగి "ఇప్పుడు చెప్పండి మేడం.. నేను కూల్ గానే ఉన్నాను. నా ప్రాణాలకు ఎవరి వల్ల ప్రమాదం ఉంది? నేను ఇక్కడ ఎంత కాలం ఉండాలి.." అని అడిగింది.


"అదిగో.. అలా ఆత్రుత పడుతున్నావంటే నువ్వు పూర్తిగా నార్మల్ కాలేదని అర్థం. మరో పావుగంట వెయిట్ చెయ్. ఆయన వచ్చేస్తారు" అంది డాక్టర్ శ్రీదేవి.

ఆమె చెప్పినట్లుగానే మరో పావుగంటకు డాక్టర్ శ్రీనివాస్ వచ్చాడు. ఆయన్ను చూడగానే ప్రియా సంతోష పడింది.


" మీ పేషంట్ మీకోసం ఎదురు చూస్తూ ఉంది" అని చెప్పింది శ్రీదేవి.

చిన్నగా నవ్వాడు శ్రీనివాస్. ప్రియా ఉన్న బెడ్ పక్కనే కూర్చున్నాడు.


"చూడు ప్రియా! ఆరోజు హాస్పిటల్ లో స్పృహ వచ్చాక నువ్వు నాతో మాట్లాడావు. ఆ విషయం నీకేమైనా గుర్తుకు వస్తోందా.. కాస్త ఆలోచించి చెప్పు" అన్నాడు ప్రియ వంక చూస్తూ.


ప్రియా కు కొద్దిగా గుర్తుకు వచ్చింది. "గుర్తుకు వస్తోంది డాక్టర్ గారూ! ఆరోజు రిసార్ట్ లో నా పరిస్థితి దాదాపు పిచ్చి పట్టినట్లు ఉంది. ఆ సమయంలో రిసార్ట్ మేనేజర్ సందీప్ నా దగ్గరకు వచ్చి నేను హన్సిక ను హత్య చేసినట్లు చెప్పాడు. నన్ను వెంటనే అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళమన్నాడు. బయట వెహికల్ సిద్ధంగా ఉందని, వాళ్లు నన్ను మీ దగ్గరకు చేరుస్తారని చెప్పాడు. తరుణ్ నా గురించి వెతక్కుండా అతని కోసం ఒక స్లిప్ రాసి పెట్టమన్నాడు. అతను చెప్పినట్లుగానే హన్సికను నేనే హత్య చేశానని, నాకోసం వెతక వద్దని ఒక పేపర్లో రాసి గదిలో ఉంచి నేను బయటకు వచ్చేసాను. రిసార్ట్ గేట్ దగ్గరే నా కోసం రెడీగా ఉన్న కారులో కూర్చున్నాను.


వాళ్లు నన్ను మీ హాస్పిటల్ కి తీసుకొని వచ్చారు. కనకారావు గారు పంపించారు అని వాళ్లు హాస్పిటల్ రిసెప్షన్లో చెప్పడం విన్నాను. హాస్పిటల్ వాళ్లు వెంటనే నన్ను అడ్మిట్ చేసుకొని ఒక రూమ్ లో ఉంచారు. నా ఒళ్ళు స్వాధీనం తప్పుతూ ఉన్నా బలవంతంగా స్పృహ నిలుపుకొని ఉన్నాను. మీరు వచ్చేసరికి మిమ్మల్ని విష్ చేస్తూ స్పృహ కోల్పోయాను. ఆ తరువాత కొన్ని గంటల తర్వాత లేక రోజుల తర్వాత నాకు స్పృహ వచ్చింది. అప్పుడు మీరు నా దగ్గర ఇలాగే కూర్చుని ఏం జరిగిందని అడిగారు. నేను మీతో మాట్లాడుతూ ఆరోజు తరుణ్ నన్ను నిద్రలో లేపడం నేను ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు చెప్పడం మీకు చెప్పాను. హాల్లో కూర్చుని మా నాన్నకు మెయిల్ పెట్టడం ఇంతలో వెనక నుండి తరుణ్ వచ్చి నా కళ్ళు మూయడం గురించి కూడా మీకు చెప్పాను" అంది ప్రియ.


"వెరీ గుడ్! ఆ తర్వాత ఏం జరిగిందో గుర్తు చేసుకుని చెప్పు" అన్నాడు డాక్టర్ శ్రీనివాస్.

జరిగిన సంఘటనలు గుర్తు చేసుకుంటూ చెప్పడం ప్రారంభించింది ప్రియ. ఆరోజు తరుణ్ సోఫా వెనక నుండి వచ్చి నా కళ్ళు మూయడంతో, అసలే భయంతో ఉన్న నాకు స్పృహ తప్పింది. కళ్ళు తెరిచేసరికి నా ముఖం మీద నీళ్లు జల్లుతూ కనిపించాడు తరుణ్. స్పృహలోకి వచ్చిన నేను తరుణ్ ని అనుమానించినందుకు సిగ్గుపడ్డాను. నాకు గతంలో జరిగిన సంఘటనలు.. మీ దగ్గర ట్రీట్మెంట్ తీసుకోవడం గుర్తుకు వచ్చాయి. ఇన్నాళ్లకు నాకు మళ్ళీ మునుపటిలా భ్రమలు కలుగుతున్నాయి. గతంలో నాకు కలిగిన ఊహలకు,నాకు తెలిసిన వారి జీవితంలో జరిగిన సంఘటనలకు సారూప్యత ఉంది. మరి ఇప్పుడు కూడా అలాంటిదేమైనా ఉందా.. అనిపించింది.


నాకెందుకో హఠాత్తుగా హన్సిక గుర్తుకు వచ్చింది.

'ఒకవేళ ఆమెకు ఏదైనా ప్రమాదం జరగబోతూ ఉందా.. ఆమె భర్త అమెరికాలో ఉన్నాడు కదా! మరి అతను ఆమెను ఎలా చంపుతాడు..?' ఆలోచిస్తున్న నన్ను తరుణ్ కుదుపుతూ "ప్రియా.. ఆర్ యు నార్మల్..?" అని అడిగాడు.


" ఐ యాం సారీ తరుణ్! లేనిపోని ఆలోచనలతో నిన్ను ఇబ్బంది పెట్టాను" అన్నాను.


"పరవాలేదు ప్రియా! నేనేమీ తప్పుగా అనుకోను. మనం రేపు ఉదయాన్నే రిసార్ట్ కి వెళదాం. అక్కడ ఈ వీకెండ్ సరదాగా గడుపుదాం. అవసరమైతే మండే కూడా లీవ్ పెడదాం. అన్నీ మర్చిపోయి హాయిగా ఉందాం" అన్నాడు తరుణ్.


అలాగేనని చెప్పాను నేను. తర్వాత ఇద్దరం బెడ్ రూమ్ లోకి వెళ్లి పడుకున్నాం. తరుణ్ కొంతసేపటికి నిద్రపోయాడు. నాకు నిద్ర పట్టలేదు.


' ప్లాన్ సక్సెస్ అయిందా' అని హన్సిక మెసేజ్ పెట్టడం.. దాని గురించి తరుణ్ నాకు వివరణ ఇవ్వడం గుర్తుకు వచ్చింది. ఒకసారి తరుణ్ వంక చూశాను. అతను మంచి నిద్రలో ఉన్నాడు. నెమ్మదిగా అతని మొబైల్ తీసుకున్నాను.


'భార్యాభర్తల మధ్య రహస్యాలు ఉండకూడదు' అని నా ఫింగర్ప్రింట్ అతని మొబైల్ లో ఎప్పుడో ఇన్సర్ట్ చేశాడు. అది ఉపయోగించి అతని ఫోన్ అన్లాక్ చేశాను. అతనికి వచ్చిన అన్ని మెసేజ్ లు చెక్ చేశాను.


ఎక్కడా 'ప్లాన్ సక్సెస్ అయిందా' అని హన్సిక పంపిన మెసేజ్ కనపడలేదు. ఆ మెసేజ్ నేను చూడడం జరిగిపోయింది కాబట్టి తరుణ్ కి దాన్ని డిలీట్ చేయవలసిన అవసరం లేదు. అంటే ఆమె నుండి మెసేజ్ రావడం, తరుణ్ వివరణ.. అంతా తనకు కలిగిన ఉహేనా. గొంతు నులిమి చంపబడడం అనేది హన్సిక విషయంలో జరగబోతోందా ? అందుకు తనకు ఏదైనా హింట్ వచ్చిందా అనిపించింది" చెప్పడం ఆపింది ప్రియ.

================================================

ఇంకా ఉంది...

================================================

మల్లవరపు సీతారాం కుమార్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

Podcast Link


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

నమస్తే! నా పేరు మల్లవరపు సీతారాం కుమార్. శ్రీమతి పేరు మల్లవరపు సీతాలక్ష్మి. ఇద్దరమూ రచనలు చేస్తుంటాము. ఇప్పటికి దాదాపు 25 కథలు మనతెలుగుకథలు.కామ్, కౌముది, గోతెలుగు.కామ్, సుకథ.కామ్ లాంటి వెబ్ మ్యాగజైన్ లలో ప్రచురితమయ్యాయి. స్వస్థలం నెల్లూరు. తెలుగు కథలంటే చాలా ఇష్టం. మనతెలుగుకథలు.కామ్ వారికి ఎడిటింగ్ లో సూచనలు, సలహాలు ఇస్తుంటాము ( అందువలన మా రచనలు పోటీలకు పరిశీలించబడవు!).











74 views1 comment

1 Comment


Acharyulu NCHB • 12 days ago

15‌వ ఎపిసోడ్ రావడం లేదేమి?

Like
bottom of page