‘
'Nakemavuthondi Episode-3' New Telugu Web Series
Written By Mallavarapu Seetharam Kumar
‘నాకేమవుతోంది…?’ ’ ధారావాహిక మూడవ భాగం
మీకు చదివి వినిపిస్తున్నది చందన.
గత ఎపిసోడ్ లో...
కొత్తగా కాపురం పెట్టిన ప్రియ అనే అమ్మాయి తనకు ఎదురైన అనుభవాలను చెబుతోంది. ఆరోజు రాత్రి భర్త ప్రవర్తన ఆమెకు అనుమానం కలిగిస్తుంది. తనకు ఏదైనా హాని జరుగుతుందేమోనని ఆమెకు అనిపిస్తుంది. తన ఆందోళనను ఎవరితోనైనా షేర్ చేసుకోవాలని తలపోస్తుంది.
ఇక ‘నాకేమవుతోంది…?’ ధారావాహిక మూడవ భాగం చదవండి…
టీవీలో వస్తున్న ఆ మూవీలో ఆ యువతి ఇంటి డోర్ తీసుకుని వేగంగా బయటకు వెళ్ళింది. అతడు ఆమెను వెంబడించాడు. ఆమె ఇంటి బయట లాన్ లో పరుగెడుతోంది. అతడు వేగం పెంచి ఆమెను సమీపించాడు. ఆమె జుట్టు పట్టుకుని వెనక్కి లాగాడు. తన ఎడం చేత్తో ఆమె కళ్ళను వెనకనుండి మూసి కుడి చేతి లోని కత్తిని ఆమె గొంతు మీదికి తెచ్చాడు.
నా అదృష్టమేమో.. ఆ ఎపిసోడ్ అక్కడితో ముగియడంతో ఈ లోకం లోకి వచ్చాను.
టీవీ ఆఫ్ చేసి, తిరిగి ల్యాప్టాప్ వైపు దృష్టి సారించాను.
నాన్న పేరుతో ఒక మెయిల్ క్రియేట్ చేసి మర్నాడు సాయంత్రానికి చేరేలా షెడ్యూల్ చేసాను.
నేను టైపు చేస్తున్న మేటర్ ని పూర్తి చేసి ఆ మెయిల్ లో పేస్ట్ చేశాను. ఒకవేళ ఇదే నా చివరి ఉత్తరం అయితే అమ్మకూడా చదవగలుగుతుంది అని తెలుగులో టైపు చేశాను. ల్యాప్టాప్ మూసివేశాను.
అంతలో వెనకనించి ఎవరో ఊపిరి పిలుస్తున్న శబ్దం వినిపించడంతో ఉలిక్కిపడ్డాను. తల వెనక్కి తిప్పే లోగా అతను తన ఎడం చేత్తో నా రెండు కళ్ళు మూశాడు. ఆ స్పర్శ తరుణ్ దేనని తెలుస్తోంది. నా రెండు చేతులతో అతని చేతిని నెట్టేయ్యాలని ప్రయత్నించాను కానీ సాధ్యం కాలేదు.
ఇక నా పని ముగిసినట్లేనని భావించాను. చివరి ప్రయత్నంగా గట్టిగా కేకలు పెట్టాలని నిర్ణయించుకున్నాను. పక్క అపార్ట్మెంట్ నుండి గానీ ఎదురుగా ఉన్న అపార్ట్మెంట్ నుండి గానీ ఎవరైనా వచ్చి కాపాడే అవకాశం ఉంది. వాళ్లు అంత ధైర్యం చెయ్యకపోయినా, ఎవరైనా విని ఉంటే తనకు ప్రమాదమని తరుణ్ భావించి, ఈరోజుకు తననేమీ చేయకపోవచ్చు. నా ఆలోచనలు మది దాటకముందే నా కళ్ళను మూసిన అతని ఎడమ చేయి కిందికి జారి, నా నోటిని మూసేసింది.
మై గాడ్! నా మనసు లోని ఆలోచనలు తరుణ్ కి తెలిసి పోతున్నాయా!
ఇప్పుడే టివిలో చూసిన దృశ్యం గుర్తుకు వచ్చింది. కత్తి పోటు పడకూడదని నా కుడిచేతిని మెడ మీద ఉంచుకున్నాను.
అతను తన కుడి చేత్తో నా చేతిని అవలీలగా పక్కకు నెట్టేశాడు.
'హమ్మయ్య! ఆ చేతిలో కత్తి లేదన్నమాట..' అని నేను అనుకున్నాను.
అంతలో అతని ఊపిరి లో వెచ్చదనం నా మెడను తాకింది. అంటే అతని తలను నా మెడ దగ్గరకు తెచ్చాడన్నమాట.
మొన్న ఒక రోజు నేను వద్దంటున్నా వినకుండా నాకు డ్రాకులా సినిమా చూపించాడు తరుణ్. అందులో ఒక వ్యక్తి ఇలానే తన భార్యను వెనుకనుండి మెడ మీద కొరుకుతాడు. నిస్సహాయ స్థితిలో ఉన్న నాకు భగవంతుని ప్రార్థించడం మినహా మరో మార్గం కనపడలేదు.మనసులోనే నా ఇష్టదైవమైన వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నాను. కానీ ఆ సమయంలోనే నాకు స్పృహ తప్పుతున్నట్లు తెలుస్తోంది.
***
ఆఫీసులో టెలికాన్ఫరెన్స్ ముగిసేసరికి సాయంత్రం నాలుగు గంటలయింది. తరువాత మరో అరగంట పాటు దాని గురించి కొలీగ్స్ మధ్య చర్చలు జరిగాయి. ఆ తర్వాత తన భార్య ప్రమీల కి కాల్ చేశాడు ప్రియ తండ్రి ప్రభాకరరావు.
"ఏమిటండీ.. ఏమైంది?" ఆదుర్దాగా ప్రశ్నించింది ప్రమీల.
"ఏమీ కాలేదు. ఎందుకంత ఆదుర్దా పడుతున్నావు?" అన్నాడు ప్రభాకర రావు.
"ఏమీ లేదండీ.. పెళ్లయిన పదేళ్ల తర్వాత ఒకసారి ఆఫీస్ నుండి కాల్ చేశారు మీరు. ఎవరిదో చావు కబురు చెప్పారు. మళ్లీ ఇప్పుడే మీరు ఆఫీస్ టైం లో నాకు కాల్ చేయడం! అందుకే ఆశ్చర్యం కలిగింది" అంది ప్రమీల.
"ఏమీ లేదు. రాత్రి ఏడుగంటల షో కి మూవీ కి వెళదాం. ముందుగా చెబితే రెడీ గా ఉంటావని కాల్ చేశాను" అన్నాడు ప్రభాకర రావు.
"ఫర్వాలేదే.. నేను ఎప్పుడో అడిగానని గుర్తు పెట్టుకొని, ఈరోజు తీసుకొని వెళుతున్నారన్న మాట" అంది ప్రమీల.
"అది కూడా ఒక కారణమే కానీ అసలు విషయం చెబుతాను విను. ఉద్యోగుల పని సామర్థ్యం పెంచడానికి మా హెడ్ ఆఫీసు వాళ్ళు ఒక టెలీ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు. అందులో మాట్లాడిన నిపుణుడు వాకింగ్, యోగ లాంటివి చేయడంతో పాటు భార్యతో సరదాగా సినిమాలకు వెళ్ళమని సూచించాడు. అందువల్ల భార్యాభర్తల మధ్య అనుబంధం పెరగడంతోపాటు, ఉద్యోగులకు ప్రశాంతత కలిగి పని సామర్థ్యం పెరుగుతుందట! ఇలా ఆయన చాలా విషయాలు చెప్పాడు. అన్నిటిలోకి మాకు సులభంగా అనిపించింది సినిమాకు వెళ్లడం. అందుకే ఈరోజు మా కొలీగ్స్ నలుగురం మాట్లాడుకొని సినిమాకు ప్లాన్ చేసుకున్నాము. సినిమా అయ్యాక ఏదైనా హోటల్ కి వెళ్లి డిన్నర్ చేసి వద్దాము" అన్నాడు ప్రభాకరరావు.
"ఖర్చులు మీ ఆఫీసు వాళ్లే భరిస్తారా?" అడిగింది ప్రమీల.
"మాదేమైనా సాఫ్ట్వేర్ కంపెనీ అనుకున్నావా.. ప్రభుత్వ రంగ సంస్థ! పెట్టే ప్రతి పైసా ఖర్చుకు పదిమందికి సమాధానం చెప్పాలి. ఖర్చుల సంగతి అలా వుంచు... ఈ కాన్ఫరెన్స్ వల్ల ఆఫీసు సమయం ఒక గంట వృధా అయింది కదా.. అందుకని ఈరోజు ఒక గంట ఎక్కువ పని చేసి గాని ఇంటికి వెళ్లకూడదట" బాధగా చెప్పాడు ప్రభాకరరావు.
"అదేమిటండీ.. ఇలా వేధిస్తే ఉద్యోగులు హుషారుగా ఎలా పని చేస్తారు?" అంది ప్రమీల.
"అదే మరి! నీకు ఉన్నపాటి జ్ఞానం మా బాస్ కు ఉంటే కదా.. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే నేను ఒక గంట ఆలస్యంగా.. అంటే ఆరుగంటలకు ఇంటికి వస్తాను. నేను వచ్చేసరికి నువ్వు రెడీగా ఉంటే మనం వెంటనే సినిమాకు బయలుదేర వచ్చు" అన్నాడు ప్రభాకర్ రావు.
"అలాగేనండీ! ఒక్క మాట. వచ్చేవారం నుండి శ్రావణమాసం మొదలవుతుంది కదా. అమ్మాయిని ఇంటికి పిలిపించి నోములు నోయిద్దామనుకున్నాను. అందుకోసం ఇందాక కాల్ చేస్తే తను తీయలేదు. రెండు మూడు సార్లు ట్రై చేశాను. ఒకవేళ మీ నెంబర్ కి కాల్ కలిస్తే నాకు ఫోన్ చేయమని చెప్పండి" అంది ప్రమీల.
"ఇందాకే అమ్మాయి దగ్గర్నుండి ఇ-మెయిల్ వచ్చినట్లు నోటిఫికేషన్ కనపడింది. కాబట్టి అమ్మాయి క్షేమంగా ఉంది. నువ్వేమీ కంగారు పడకు. రాత్రి తీరిగ్గా ఆ మెయిల్ చూస్తాను. ఇప్పుడు బిజీగా ఉన్నాను. ఫోన్ పెట్టెయ్. నువ్వు కూడా అమ్మాయికి ఊరికే ఫోన్ చేసి విసిగించే వద్దు. ఏదైనా పనిలో ఉండి ఫోన్ తీసి ఉండక పోయి ఉండవచ్చు" అంటూ ఫోన్ పెట్టేసాడు ప్రభాకర రావు.
అతి కష్టం మీద సాయంత్రం ఆరు గంటలకు పని ముగించుకుని ఇంటికి వెళ్ళాడు. దారిలోనే భార్యకు ఫోన్ చేసి గేటు బయట రెడీగా ఉండమని చెప్పాడు. ఇంట్లోకి వచ్చి ముఖం కడుక్కొని కాస్త కాఫీ తాగివెళ్ళమని ప్రమీల అడిగింది. కానీ "లేట్ అవుతుంది. బయలుదేరు" అంటూ భార్యను స్కూటీలో ఎక్కించుకొని థియేటర్ కు వెళ్ళాడు. అప్పటికే అక్కడికి వచ్చిన తన కొలీగ్స్ ని భార్యకు పరిచయం చేశాడు. వాళ్ల భార్యలు ప్రమీలను పరిచయం చేసుకున్నారు.
సినిమా చూసి, దగ్గరలో ఉన్న రెస్టారెంట్ లో డిన్నర్ పూర్తి చేసుకున్నారు. తరువాత ఎవరి ఇళ్లకు వాళ్ళు బయలుదేరారు. ప్రభాకర్ రావు దంపతులు ఇల్లు చేరేటప్పటికి పదకొండు గంటలయింది. బాగా అలసి పోయిన ప్రభాకరరావు వెంటనే నిద్ర లోకి జారుకున్నాడు. ప్రమీల మాత్రం కూతురికి మరొకసారి కాల్ చేసింది. కానీ ప్రియ ఫోన్ తీయలేదు. ఒక్క క్షణం అల్లుడికి కాల్ చేద్దాం అనుకుంది. కానీ ఈ సమయంలో చేస్తే బాగుండదని ఊరుకుంది. అదేదో మెయిల్ వచ్చిందని భర్త చెప్పిన విషయం గుర్తుకు వచ్చింది.
భర్తను కదిలించి "అమ్మాయి పంపిన మెయిల్ చూశారా" అని అడిగింది.
"పొద్దున చూద్దాంలే. పడుకో.." అంటూ తిరిగి నిద్రలోకి జారుకున్నాడు ప్రభాకర రావు.
***
మర్నాడు ఉదయం ఆరు గంటలకే ప్రభాకర రావుని నిద్ర లేపింది ప్రమీల.
"అబ్బా.. అప్పుడే లేపావేమిటి... ఆదివారం కూడా ప్రశాంతంగా పడుకోనివ్వవా" కాస్త విసుగ్గా అన్నాడు ప్రభాకర రావు దుప్పటిని తిరిగి ముఖం మీదకు లాక్కుంటూ.
"అది కాదండీ.. ఇప్పుడు కూడా అమ్మాయి ఫోన్ లిఫ్ట్ చెయ్యడం లేదు" అంది ప్రమీల.
ముసుగు తీసి లేచి కూర్చున్నాడు ప్రభాకర రావు.
"అవునా.. ఏమైనా జరిగిందంటావా.." ఆందోళన నటిస్తూ అన్నాడు.
"అదేనండీ.. నా టెన్షన్ కూడా.."అంటూ ఏదో చెప్పబోతున్న భార్యను ఆగమన్నట్లు సైగ చేశాడు.
"మన అమ్మాయి ఏ రోజైనా ఉదయం ఎనిమిది లోపల లేచిందా?" ప్రశ్నించాడు భార్యని.
లేదన్నట్లు తల ఊపింది ప్రమీల.
"అమ్మాయి ఫోన్ తీయక పోవడంతో అల్లుడి గారికి చేసి, అమ్మాయిని పిలవమని చాలా సార్లు చెప్పాము. గుర్తులేదా?" తిరిగి అడిగాడు.
"నిజమే కానీ నిన్న కూడా తియ్యలేదు కదా.. అందుకే కాస్త టెన్షన్ పడ్డాను" అంది ప్రమీల.
వాళ్లకు నిన్నా, ఇవాళా సెలవు కదా! ఫ్రెండ్స్ తో కలిసి ఎక్కడికైనా వెళ్లి ఉంటారేమో.. అక్కడ సిగ్నల్స్ దొరికి ఉండవు" భార్యను శాంత పరుస్తూ అన్నాడు ప్రభాకర రావు.
"నిజమే కావచ్చు. అయినా అమ్మాయి దగ్గర్నుండి మీకేదో మెయిల్ వచ్చిందని చెప్పారు కదా! కాస్త ఓపిక తెచ్చుకొని ఆ మెయిల్ చూడండి" బ్రతిమాలాడింది ప్రమీల.
"సరే.. నీ మాట ఎందుకు కాదనాలి?" అంటూ తన మొబైల్ చేతిలోకి తీసుకున్నాడు.
అరగంట క్రితమే కూతురి దగ్గర్నుండి మరో మెయిల్ వచ్చినట్లు నోటిఫికేషన్ వచ్చి ఉంది.
"ప్రియ ఇందాకే మరో మెయిల్ చేసింది. ఇక టెన్షన్ పడకు. చదివి చెబుతాను. ఈ లోపల మంచి కాఫీ చేసి తీసుకొని రా. నేనీలోగా బ్రష్ చేసుకొని వస్తాను" అంటూ బాత్ రూమ్ లోకి వెళ్ళాడు.
ఉదయాన్నే మరో మెయిల్ వచ్చిందని తెలిసి, కాస్త తెరిపిన పడింది ప్రమీల.
కాఫీ చెయ్యడానికి వంటిట్లోకి వెళ్ళింది.
దంత ధావనం ముగించుకొని, తన మొబైల్ తీసుకొని హాల్లోకి వచ్చి సోఫాలో కూర్చున్నాడు ప్రభాకర రావు.
అప్పటికే ప్రమీల అక్కడ కాఫీ కప్పుతో సిద్ధంగా ఉంది.
కాఫీ తాగుతూ ఎడం చేత్తో తన ఫోన్లోని మెయిల్ ఓపెన్ చేశాడు.
"నాన్నా! తరుణ్ తో చిన్న తగాదా..
కోపంలో నిన్న ఆ మెయిల్ పంపాను.
ఇప్పుడు కోపం తగ్గింది.
ఆ మెయిల్ చదివి వుంటే ఇగ్నోర్ చెయ్యి.
చదవకుండా వుంటే డిలేట్ చెయ్యి.
ఇప్పుడు ఇద్దరం హాలిడే రిసార్ట్ కి వెళ్తున్నాం. రేపు ఇద్దరం లీవ్ పెట్టాం.
రేపు రాత్రికి ఇంటికి వచ్చాక కాల్ చేస్తాను.
డిస్టర్బ్ చెయ్యవద్దని అమ్మకు చెప్పు. లేదా అక్కడ సిగ్నల్స్ రావని చెప్పెయ్యి.
ఏదైనా అవసరం వుంటే నీకు మెసేజ్ చేస్తాను.
బై డాడీ ..”
ఇదీ ఆ మెయిల్ సారాంశం.
వెంటనే కూతురు చెప్పినట్లు ముందు రోజు వచ్చిన మెయిల్ డిలేట్ చేశాడు.
"అమ్మాయి ఏం రాసిందండి?" ఆతృతగా అడిగింది ప్రమీల.
"అమ్మాయీ, అల్లుడుగారు కలిసి రిసార్ట్ కి వెళ్తున్నారట. అంటే ఊరికి కాస్త దూరంగా చుట్టూ చెట్లు ఉన్న ఒక హోటల్ లాంటి ప్రదేశమన్నమాట. రేపు సాయంత్రానికి తిరిగి వస్తారట. వాళ్ళు వెళ్లిన చోట సిగ్నల్స్ అందవట. అందుకని కాల్ చేయవద్దన్నారు. ఇక టెన్షన్ మానుకో.." అన్నాడు ప్రభాకర రావు.
"అలాగా! ఇంతకీ మొదటి మెయిల్ లో ఏమని ఉంది?" అడిగింది ప్రమీల.
"ఇదేమైనా టివి సిరియాలా.. నిన్నటి ఎపిసోడ్ చూసాకే ఈ రోజు ఎపిసోడ్ చూడటానికి? ఈ రోజు ఉదయానికి అల్లుడుగారు, అమ్మాయి క్షేమం. ఇద్దరూ కలిసి సరదాగా బయటకు వెడుతున్నారు. అంతకంటే ఏం కావాలి?" అన్నాడు ప్రభాకర రావు.
అమ్మాయి అల్లుడితో తగాదా పడ్డ విషయం భార్యతో చెప్పలేదు, ఆమెకు అనవసరంగా టెన్షన్ పెంచడం ఇష్టం లేక.
‘నిన్నటి మెయిల్ లో భర్త మీద లేనిపోని చాడీలు రాసి ఉంటుంది. ప్రియ సంగతి చిన్నప్పటి నుండి తెలిసిందే కదా! కోపం వస్తే ఎదుటివారి గురించి ఏవేవో ఉహించుకుంటుంది. తను అనుకున్నదే కరెక్టని నమ్మే మొండితనం ఆమెలో ఉంది' అనుకున్నాడు మనసులో.
మొదటి మెయిల్ డిలేట్ చెయ్యడం పొరపాటని అతనికి అప్పుడు అనిపించలేదు.
***
అది సిటీలోని ఒక పోలీస్ స్టేషన్.
ఉదయం ఏడుగంటలు.
ల్యాండ్ లైన్ మోగడంతో డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ ఫోన్ తీసాడు, ఇంత పొద్దునే ఎవరు చేశారో అనుకుంటూ.
"నమస్తే సర్! నేను సంజనా రిసార్ట్ మేనేజర్ ని మాట్లాడుతున్నాను. మీ ఎస్సై గారు నాకు బాగా తెలుసు. ఒకసారి వారిని పిలుస్తారా.. ముఖ్యమైన విషయం మాట్లాడాలి" అన్నాడు.
"సారు పది గంటలకు స్టేషన్ కి వస్తారు. డ్యూటీ ఆఫీసర్ వాష్ రూమ్ లో ఉన్నారు. విషయం చెప్పండి. అవసరమైతే ఫోన్ చేసి చెబుతాను" అన్నాడు ఆ కానిస్టేబుల్.
“మా రిసార్ట్ కి అర కిలోమీటర్ దూరంలో రోడ్ పక్కన పొదల్లో ఒక శవం కనపడింది. ఆ శవం బాగా కాలిపోయి గుర్తు పట్టడానికి వీల్లేకుండా ఉంది. కాస్త దూరంగా పడి ఉన్న చెప్పల్స్ అమ్మాయిలు వేసుకునేవిలాగా ఉన్నాయి. మా రిసార్ట్ కి ఉదయాన్నే పాలు సప్లై చేసే అతను ఆ శవాన్ని చూసి మాకు చెప్పాడు. మీకు ఇన్ఫార్మ్ చెయ్యడం నా బాధ్యతగా భావించి కాల్ చేసాను" చెప్పాడతను.
ఇంకా ఉంది...
మల్లవరపు సీతారాం కుమార్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
Podcast Link
Twitter Link
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం:
నమస్తే! నా పేరు మల్లవరపు సీతారాం కుమార్. శ్రీమతి పేరు మల్లవరపు సీతాలక్ష్మి. ఇద్దరమూ రచనలు చేస్తుంటాము. ఇప్పటికి దాదాపు 25 కథలు మనతెలుగుకథలు.కామ్, కౌముది, గోతెలుగు.కామ్, సుకథ.కామ్ లాంటి వెబ్ మ్యాగజైన్ లలో ప్రచురితమయ్యాయి. స్వస్థలం నెల్లూరు. తెలుగు కథలంటే చాలా ఇష్టం. మనతెలుగుకథలు.కామ్ వారికి ఎడిటింగ్ లో సూచనలు, సలహాలు ఇస్తుంటాము ( అందువలన మా రచనలు పోటీలకు పరిశీలించబడవు!).
Comentarios