'Nakemavuthondi Episode-5' New Telugu Web Series
Written By Mallavarapu Seetharam Kumar
రచన, పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
గత ఎపిసోడ్ లో...
ప్రియ అనే యువతి, తన భర్త ప్రవర్తనలో తేడా ఉన్నట్లు తండ్రి ప్రభాకర రావుకి షెడ్యూల్ చేసిన మెయిల్ పంపుతుంది.
తరువాత ఆ మెయిల్ ఆవేశంలో పంపినట్లు మరో మెయిల్ వస్తుందతనికి.
ఎస్సై రంగనాథం, రిసార్ట్ సమీపంలో పడిఉన్న శవాన్ని పరిశీలించడానికి వెళ్తాడు.
రిసార్ట్ రిజిస్టర్ లో వరుణ్, రియా అన్న పేర్లు చూసి అనుమానిస్తాడు.
ఇక ‘నాకేమవుతోంది…?’ ధారావాహిక ఐదవ భాగం చదవండి…
హాల్లో పేపర్ చదువుకుంటున్న భర్త ప్రభాకరరావు దగ్గరకు వచ్చింది ప్రమీల.
అతని పక్కనే నిల్చుని మెల్లిగా “ఏమండీ !" అని పిలిచింది.
అతను పేపర్ లో నుంచి తల పైకి ఎత్తకుండానే "ఏమిటి?" అన్నాడు.
ప్రమీల అతని చేతిలో నుంచి పేపర్ లాక్కొని పక్కనే ఉన్న టీపాయ్ మీద పెట్టింది. తెల్లబోయి తలెత్తి ఆమె వంక చూసాడు ప్రభాకరరావు ఏమిటన్నట్లు.
"ఈరోజు ఏం వారం?" అని అడిగింది సీరియస్ గా.
"అది అడగడానికి నా చేతి నుంచి పేపర్ లాగేయాలా? ఈరోజు మంగళవారం. ఇంతకీ ఏమిటి విషయం?" అన్నాడు.
"అది నాకు కూడా తెలుసు. మంగళవారం అనగానే మీకేమీ గుర్తుకు రావడం లేదా?" అడిగింది కాస్త కోపంగా.
కాసేపు బుర్ర గోక్కున్నాడు ప్రభాకరరావు. తరువాత ఏదో గుర్తుకు వచ్చి "అమ్మాయి చేత శుక్రవారం నోములు నోయిస్తానన్నావు. మంగళవారం నోములు కాదు గదా.. నాకు లాగే నీకు కూడా మతిమరుపు మొదలయిందన్నమాట" అన్నాడు.
"ఫరవాలేదు. మొత్తానికి మీకొక కూతురు ఉన్నట్లు గుర్తుకు వచ్చింది. మూడు రోజుల నుండి ఆ కూతురు ఫోన్ తీయడం లేదు అన్న సంగతి గుర్తుకు రాలేదా?" సీరియస్ గా అడిగింది ప్రమీల.
"నేను మర్చిపోయినా నువ్వు వదిలి పెట్టావు కదా.. నిన్న రాత్రి కూడా ఫోన్ తీయలేదని చెప్పావు. నిన్న కూడా రిసార్ట్ లోనే గడిపి ఉంటారు. ఈ విషయం రాత్రి నువ్వు అడిగినప్పుడే చెప్పాను కదా!" అన్నాడు ప్రభాకరరావు.
"అలాగే అనుకున్నా ఈరోజు ఉదయాన్నే ఇంటికి వచ్చేయాలి కదా! ఈరోజు ఇద్దరూ ఆఫీస్ కి వెళ్లాలి కదా" అంది ప్రమీల.
ఒక సారి టైం చూసుకున్నాడు ప్రభాకరరావు.
"ఉదయం ఎనిమిది గంటలయింది. సరేలే.. మరో గంట ఆగి నేను ఫోన్ చేస్తాను. ఈలోగా నీకు టెన్షన్ లేకుండా ఉండడానికి ఒక ఉపాయం చెప్తాను" అన్నాడు భార్యతో.
"చెప్పండి" అంది ప్రమీల అతని పక్కనే కూర్చుంటూ.
"మనసు ఆందోళనగా ఉన్నప్పుడు ఏదైనా పనిమీద కాన్సెంట్రేట్ చెయ్యాలట. అలా చేస్తే మన టెన్షన్ సగానికి సగం తగ్గుతుందట" అన్నాడతను.
"నా పనులు ఎప్పుడో పూర్తి చేశానండీ. మీకు కెరియర్ కట్టాలి కదా.. అందుకని వంట పూర్తి చేశాను. మీ టిఫిన్ కోసం ఇడ్లీ కూడా రెడీ చేశాను" అంది ప్రమీల.
"అలా అయితే ఆ ఇడ్లీ నువ్వే తినేసేయ్. నా కోసం ఎంచక్కా జీడిపప్పు ఉప్మా చేసి పెట్టు. ఆ పనిలో పడి టెన్షన్ మరిచిపోతావు" అన్నాడు ప్రభాకర్ రావు నవ్వుతూ.
"అమ్మాయి కోసం నేను ఇంత టెన్షన్ పడుతూ ఉంటే మీకు కనీసం చీమ కుట్టినట్లయినా లేదా?" అంది ప్రమీల కోపం నటిస్తూ.
"ఎందుకు లేదూ.. మీ ఆడాళ్ళ బయట పడతారు, మేము మనసులోనే ఉంచుకుంటాం. అంతే!" అన్నాడు ప్రభాకర్ రావు.
"నాకు వంట పని చేస్తూనే ఆలోచించడం అలవాటై పోయింది. ఏదైనా అలవాటు లేని పని చేస్తే మీరన్నట్లు టెన్షన్ తగ్గుతుందేమో.. ఒక పని చేద్దాం. ఈ పూటకి సరదాగా ఆ జీడిపప్పు ఉప్మా ఏదో మీరు తయారు చేయండి. నేను ఈ పేపర్ తిరగేస్తూ ఉంటాను. ఇద్దరికీ అలవాటు లేని పనులు కాబట్టి పని మీదే ధ్యాస ఉంటుంది. టెన్షన్ సగమేం కర్మ.. పూర్తిగానే తగ్గిపోతుంది" అంది ప్రమీల చురక వేస్తూ.
"వెటకారం బాగానే ఉంది. మొత్తానికి కంచు గంటల వారి అమ్మాయి వనిపించుకున్నావు" అన్నాడు ప్రభాకర్ రావు.
"మీరు మాత్రం తక్కువ తిన్నారా.. పేరుకే మీరు చింతకాయల వారు. కానీ చింత బరికలతో చురకలు వేస్తూ ఉంటారు" అంది ప్రమీల.
ఇద్దరూ కాసేపు సరదాగా నవ్వుకున్నారు. "సరేనండి. మీరన్నట్లు మరో గంట అయ్యాక ఫోన్ చేసి చూద్దాం. ఈలోగా మీరడిగిన జీడిపప్పు ఉప్మా రెడీ చేస్తాను" అంది ప్రమీల పైకి లేస్తూ..
"అయ్యో! ఏదో సరదాకి అన్నాను" అన్నాడు ప్రభాకరరావు ఆమెను ఆపడానికి ప్రయత్నిస్తూ.
"మనసులో లేకుండా బయటకు వస్తుందా.. అడక్క అడక్క నోరు తెరిచి అడిగారు. పావుగంటలో రెడీ చేస్తాను" అంటూ వంటింట్లోకి వెళ్ళింది ప్రమీల.
భార్య వంటింట్లోకి వెళ్ళగానే కూతురికి మెసేజ్ పెట్టాడు ప్రభాకరరావు.
'ప్రియా.. నీ గురించి మీ అమ్మ టెన్షన్ పడుతోంది. వీలుంటే ఒక్కసారి కాల్ చేయరాదూ..' అని.
మరో నిమిషం గడిచాక అతనికి కూతురి దగ్గర నుండి రిప్లై వచ్చింది
'నాన్నా! ఈ రోజు కూడా సెలవు పెట్టి ఇక్కడే ఉంటున్నాం. ఇక్కడ సిగ్నల్స్ సరిగా లేవు. కాల్ చేసినా సరిగ్గా వినపడటం లేదు. అమ్మకు ఈ విషయం చెప్పు. ఈరోజు రాత్రికి ఎంత లేట్ అయినా ఇంటికి చేరుకుంటాం. వెళ్ళగానే, అది అర్థరాత్రి అయినా సరే.. అమ్మకు కాల్ చేసే పడుకుంటాను. బై డాడీ'
మెసేజ్ చదివాక తేలికగా ఊపిరి పీల్చుకున్నాడు ప్రభాకరరావు. వంటింట్లో ఉన్న ప్రమీల దగ్గరకు వెళ్ళాడు.
"ఉప్మా నేనే చేస్తాను అన్నాను కదండీ! అయినా మీకు అంత పంతంగా ఉంటే మీరే చేయండి" అంది ప్రమీల.
"చెప్పానుగా, పనిలో పడితే టెన్షన్ తగ్గుతుందని. అన్నట్లు, అమ్మాయి మెసేజ్ పెట్టింది" అన్నాడు ప్రభాకర్ రావు.
"అవునా! తెలుగులోనేనా.." ఆతృతగా అడిగిందామె.
"లేదు. కానీ తెలుగు మాటల్ని ఇంగ్లీష్ లో పెట్టింది" అంటూ ఆ మెసేజ్ ఆమెకు చదివి వినిపించాడు.
"ఫోన్ చేసి రెండు ముక్కలు మాట్లాడితే పోయేదానికి ఈ మెసేజ్ లు, మెయిల్స్ ఎందుకండీ?" అంది ప్రమీల.
"మెసేజ్ లో చెప్పిందిగా! అక్కడ సిగ్నల్స్ సరిగ్గా రావని, మాటలు కట్ అవుతూ వస్తాయని.. అందుకే మెసేజ్ పెట్టింది. రాత్రికి ఖచ్చితంగా అమ్మాయితో మాట్లాడదాం. కుదరకపోతే రేపు ఉదయాన్నే ఇద్దరం బయల్దేరి వాళ్ల దగ్గరకు వెళ్దాం" చెప్పాడు ప్రభాకర్ రావు.
"అలాగేనండి. ఫోన్ కలవకపోతే ఎంత రాత్రి అయినా సరే, బయలుదేరి పొద్దుటి కల్లా అక్కడ ఉందాం. అన్నట్లు మీకు ఒక విషయం చెప్పాలండీ" అంది ప్రమీల.
ఏమిటన్నట్లు ఆమెవైపు చూశాడు ప్రభాకరరావు.
'మన అమ్మాయికి హన్సిక అనే స్నేహితురాలు ఉంది. మన ఇంటికి కూడా రెండు మూడు సార్లు వచ్చింది. మీకు గుర్తుందా?" భర్తను అడిగింది ప్రమీల.
"ఆ.. గుర్తుకు వచ్చింది. ఆ అమ్మాయి అమెరికా అబ్బాయిని చేసుకొని పెళ్లయిన కొన్నాళ్లకే భర్తను వదిలి వచ్చేసిందని ఒకసారి అమ్మాయి చెప్పింది.."
"అవునండీ! ఆ అమ్మాయే.. వారం కిందట మన ప్రియ దగ్గరికి వచ్చిందట. అమ్మాయి ఆ సంగతి నాతో చెప్పగానే కాస్త జాగ్రత్తగా ఉండమని అమ్మాయికి సలహా ఇచ్చాను. అలా భర్తను వదిలి వచ్చిన వాళ్ళు పరాయి మగవాళ్ళ కోసం ప్రయత్నాలు చేస్తారు. అందునా మన అల్లుడు తరుణ్ సినిమా హీరో తరుణ్ లాగే చక్కగా ఉంటాడు. మంచి ఉద్యోగంలో ఉన్నాడు. కాస్త గమనిస్తూ ఉండమని అమ్మాయి కి చెప్పాను” అంది ప్రమీల.
“అలా అనకు ప్రమీలా.. పాపం ఆ అమ్మాయి ఎన్ని కష్టాలు పడి భర్తను వదిలి వచ్చేసిందో! మన అమ్మాయి మంచి మనసుతో తన దగ్గర రెండురోజులు ఉంచుకుంటే నువ్వు లేనిపోనివి చెప్పి అమ్మాయి మనసు పాడు చేసినట్టు ఉన్నావు. స్త్రీకి స్త్రీయే శత్రువు అనే మాట నిజం చేసేలా ఉన్నావు" అన్నాడు ప్రభాకర్ రావు.
"ఆ మాట నిజం చేసేది నేను కాదు. ఆ హన్సిక లాంటి అమ్మాయిలే" అంది ప్రమీల, రుసరుసలాడుతూ.
"అదికాదు ప్రమీలా! నీ మాటల వల్ల అమ్మాయి, అల్లుడు గారితో గొడవ పడినట్లు ఉంది" టక్కున అనేసి నాలుగు కరుచుకున్నాడు ప్రభాకర్ రావు.
"ఏమిటండీ.. అమ్మాయి, అబ్బాయి గొడవ పడ్డారా! అలాగని అమ్మాయి మీతో చెప్పిందా? విషయాలు దాచకుండా నిజం చెప్పండి" ఆవేశంగా అంది ప్రమీల.
"ఇదిగో మళ్లీ టెన్షన్ పడుతున్నావు. ఈసారి టెన్షన్ మరిచిపోవడానికి బిరియాని చేయాల్సిందే" అన్నాడు ప్రభాకరరావు వాతావరణాన్ని తేలిక పరచడానికి ప్రయత్నిస్తూ.
కానీ ప్రమీలలో ఆందోళన తగ్గక "మాట దాట వేయకుండా విషయం చెప్పండి. అమ్మాయి మీకు ఫోన్ చేసి ఏదైనా చెప్పిందా?" ఆతృతగా అడిగిందామె.
ఇక చెప్పక తప్పలేదు ప్రభాకర రావు కు.
"అమ్మాయి మొదట పంపిన మెయిల్లో తన మానసిక స్థితి సరిగ్గా లేదని చెప్పింది. రెండవ మెయిల్ లో తరుణ్ తో చిన్నపాటి గొడవ వచ్చిందని, అది సర్దుబాటు చేసుకుని రిసార్ట్కు వెళుతున్నామని, డిస్టర్బ్ చేయవద్దని చెప్పింది." విషయం చెప్పాడు ప్రభాకర్ రావు.
"మరి ఆ మాట నాకు ముందుగానే చెప్పాలి కదా!" అంది ప్రమీల.
"ఇదిగో.. ఇలా టెన్షన్ పడతావనే చెప్పలేదు. అయినా ఒక గంట ఆగి ఫోన్ చేస్తానని చెప్పాను కదా! ఆలోగా ఏదేదో ఊహించుకోకు" అంటూ భార్యను సముదాయించబోయాడు ప్రభాకర్ రావు.
"గంట తర్వాత కూడా అంతే.. ఫోన్ చేస్తే తీయదు. తరువాత మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ ప్రియ ఫోన్ నుండి ఎవరైనా పెట్టవచ్చుననే ఇంగిత జ్ఞానం కూడా మీకు లేకుండా పోయింది' భర్తతో ఆవేశంగా అంది ప్రమీల.
5 నిమిషాల్లో బ్యాగ్ రెడీ చేసుకొని భర్త దగ్గరకు వచ్చి, నన్ను బస్టాండ్ లో దింపేసి మీరు ఆఫీసుకు వెళ్ళండి. నేను అమ్మాయి దగ్గరకు వెళ్తాను" అని చెప్పింది.
అంతవరకు గంభీరంగా ఉన్న ప్రభాకరరావు లో కూడా ఆందోళన మొదలైంది. అది గమనించిన ప్రమీల "నాకు ధైర్యం చెప్పి మీరు డీలా పడకండి. ఏమీ జరగలేదు, జరగబోదు. నేను ఆతృత పట్టలేక వెళ్తున్నాను. అంతే." భర్తకు ధైర్యం చెప్పింది ప్రమీల.
"సరే పద. నిన్ను బస్టాండ్లో వదిలేసి నేను అలాగే ఆఫీస్ కి వెళ్తాను. రేపటికి సెలవు పెట్టి సాయంత్రం నేను కూడా వస్తాను" అన్నాడతను.
"ముందు మీరు ఉప్మా తినండి. తరువాత బయలుదేరుదాం" అంది ప్రమీల.
"ఎందుకో తిన బుద్ధి కావడం లేదు. పద, బస్టాండ్ లో వదులుతాను" చెప్పాడు ప్రభాకరరావు. ఆమె సమాధానం కోసం ఎదురు చూడకుండా బయటకు వెళ్లి తన యాక్టివా స్టార్ట్ చేశాడు.
బస్ స్టాండ్ వైపు వెళుతుండగా ప్రమీల ఫోన్ మోగింది.
"ఏమండీ! కాస్త రోడ్డు పక్కగా బండి ఆపండి. ఏదో ఫోన్ వస్తోంది" చెప్పిందామె.
తన వెహికల్ ని రోడ్డు పక్కగా ఆపాడు ప్రభాకర్ రావు. కిందికి దిగింది ప్రమీల. అప్పటికే ఆ ఫోన్ ఆగిపోయింది.
కిందికి దిగి స్టాండ్ వేసిన ప్రభాకరరావు ఎవరన్నట్లుగా భార్యవైపు చూశాడు.
"పేరు పడలేదండీ. ఫోన్ ఆగిపోయింది" చెప్పింది ప్రమీల.
ఆమె ఫోన్ అందుకుని చూశాడు ప్రభాకరరావు. అన్నోన్ నెంబర్ నుండి ఆ కాల్ వచ్చింది.
"మనమే చేసి చూద్దాం. తన సెల్ లో సిగ్నల్ లేక అమ్మాయి వేరే ఫోన్ నుండి మిస్డ్ కాల్ ఇచ్చిందేమో.." అంటూ ఆ నెంబర్ కు కాల్ చేశాడు ప్రభాకరరావు.
"అటువైపు నుండి "నమస్తే ఆంటీ! నా పేరు ప్రవల్లిక" అన్న మాటలు విని ఫోన్ భార్య చేతికి అందించాడు, ‘ఎవరో ప్రవల్లిక అనే అమ్మాయి మాట్లాడుతోంది’ అంటూ.
ఫోన్ తీసుకున్న ప్రమీల, "నేను ప్రమీలను మాట్లాడుతున్నాను. ఎవరమ్మా నువ్వు?" అని అడిగింది.
అటువైపునుంచి "ఆంటీ! నేను మీ అమ్మాయి క్లాస్మేట్ ను. హైదరాబాద్ లో డిటెక్టివ్ పురంధర్ గారి పేరు వినే ఉంటారు.. నేను వారి అమ్మాయిని" చెప్పింది ప్రవల్లిక.
"అలాగా.. మీ నాన్నగారి గురించే కాదు, నీ గురించి కూడా తెలుసమ్మా. అప్పట్లో అవేవో మత్తుమందుల ముఠాను పట్టించడంలో నాన్నగారికి సహాయం చేశావని టీవీలో చూపించారు. విషయం చెప్పమ్మా" అంది ప్రమీల.
"ఏం లేదు ఆంటీ! ఆ మధ్య మా క్లాస్మేట్ హన్సిక అనే అమ్మాయి అమెరికా నుండి ఇండియాకు వచ్చిందట. ఇక్కడకు వచ్చాక టెంపరరీ గా ఏదో నెంబర్ వాడుతోంది. కానీ ఇప్పుడు ఆ నెంబర్ కు వాళ్ళ పేరెంట్స్ కాల్ చేస్తే వెళ్లడం లేదు. వేరే నెంబర్ ఏదైనా ఉందేమోనని వాళ్ళు నన్ను అడిగారు. ఆ అమ్మాయి ఇక్కడ ఎవరి దగ్గరకు వెళ్ళిందో వాళ్లందరికీ కాల్ చేశాను. అందరూ ఆ నెంబరే చెప్పారు.
ఆ అమ్మాయి చివరగా వచ్చింది ప్రియా దగ్గరకే కాబట్టి కొత్త నెంబర్ ఏదైనా ప్రియా దగ్గర ఉందేమోనని రెండు రోజుల నుండి తనను కాంటాక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. కానీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినట్లు వస్తోంది. నా దగ్గర అందరు ఫ్రెండ్స్ వి ఆల్టర్నేట్ నంబర్లు ఉంటాయి. అలాగే ప్రియా నంబర్ తో పాటు మీ నెంబర్ కూడా నా దగ్గర ఉంది. ఒకవేళ ప్రియ ఫోన్ నెంబర్ మారి ఉంటే మీరు చెప్తారేమో అని కాల్ చేశాను" అంది ప్రవల్లిక.
వెంటనే భర్త వైపు తిరిగి "ఏవండీ! ఇందాక హన్సిక అనే అమ్మాయి గురించి చెప్పాను కదా.. ఆ అమ్మాయి కూడా ఫోన్ తీయడం లేదట" ఆందోళనగా అంది ప్రమీల.
=====================================
ఇంకా ఉంది...
=====================================
మల్లవరపు సీతారాం కుమార్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
Podcast Link
Twitter Link
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం:
నమస్తే! నా పేరు మల్లవరపు సీతారాం కుమార్. శ్రీమతి పేరు మల్లవరపు సీతాలక్ష్మి. ఇద్దరమూ రచనలు చేస్తుంటాము. ఇప్పటికి దాదాపు 25 కథలు మనతెలుగుకథలు.కామ్, కౌముది, గోతెలుగు.కామ్, సుకథ.కామ్ లాంటి వెబ్ మ్యాగజైన్ లలో ప్రచురితమయ్యాయి. స్వస్థలం నెల్లూరు. తెలుగు కథలంటే చాలా ఇష్టం. మనతెలుగుకథలు.కామ్ వారికి ఎడిటింగ్ లో సూచనలు, సలహాలు ఇస్తుంటాము ( అందువలన మా రచనలు పోటీలకు పరిశీలించబడవు!).
Comments