'Nakemavuthondi Episode-6' New Telugu Web Series
Written By Mallavarapu Seetharam Kumar
రచన, పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
గత ఎపిసోడ్ లో...
కూతురు ఫోన్ తియ్యక పోవడం గురించి ఆందోళన పడుతుంది ప్రియా తల్లి ప్రమీల.
కూతురు పంపిన మొదటి మెయిల్ లోని విషయం చెబుతాడు ప్రభాకర రావు.
ఇక ఆలస్యం చెయ్యడం మంచిది కాదని కూతురి కోసం హైదరాబాద్ బయలుదేరుతుంది ప్రమీల.
దార్లో డిటెక్టివ్ పురందర్ గారి అమ్మాయి ప్రవల్లిక ఫోన్ చేసి ప్రియా ఫోన్ నంబర్ గనుక మారిఉంటే తనకు ఇవ్వమని ప్రమీలను అడుగుతుంది.
ఇక ‘నాకేమవుతోంది…?’ ధారావాహిక ఆరవ భాగం చదవండి…
భార్య చెప్పింది విన్న ప్రభాకర రావు లో కూడా ఆందోళన మొదలైంది. ఫోన్ భార్య చేతి నుండి అందుకుని, "చూడమ్మా! మా అమ్మాయి కూడా మూడు రోజుల నుండి ఫోన్ తీయడం లేదు. అయితే రెండు మార్లు మెయిల్ చేసింది. పొద్దున ఫోన్ చేయమని మెసేజ్ పెడితే సిగ్నల్స్ సరిగ్గా లేవని, రాత్రికి ఇంటికి వచ్చాక కాల్ చేస్తానని రిప్లై మెసేజ్ ఇచ్చింది" ఆందోళనగా చెప్పాడు.
"మీరు బజారులో ఉన్నట్లు ఉన్నారు. వాయిస్ సరిగా వినపడ్డం లేదు. పక్కనే ఏదైనా ఖాళీగా ఉన్న రెస్టారెంట్ ఉంటే అందులోకి వెళ్ళి కాల్ చేయండి" అంది ప్రవల్లిక.
కాస్త దూరంలో ఉన్న ఒక రెస్టారెంట్ లోకి వెళ్లి కాఫీ ఆర్డర్ ఇచ్చాడు ప్రభాకర్ రావు. తరువాత ప్రవల్లిక కి ఫోన్ చేసి "మా అమ్మాయి మొదట పెట్టిన మెయిల్ లో ఇది షెడ్యూల్ చెయ్యబడ్డ మెయిల్ అని, తను క్షేమంగా ఉంటే దీన్ని మరో తేదీకి మారుస్తానని రాసింది. ఆ మెయిల్ కనుక నాకు చేరితే తనకేదో ఇబ్బంది కలిగినట్లేనని కూడా రాసింది. కానీ తరువాతి మెయిల్లో భర్తతో చిన్నపాటి తగాదా అయిందని, ఆ ఆవేశంలో అలా మెయిల్ పెట్టానని, దాన్ని డిలీట్ చేయమని రాసింది. భర్తతో కలిసి రిసార్ట్ కి వెళ్తున్నానని, అక్కడ సిగ్నల్స్ సరిగ్గా ఉండవని, కాల్ చేయవద్దని కూడా ఆ మెయిల్లో రాసింది" చెప్పాడు ప్రభాకరరావు.
“మీరు డిలీట్ చేసిన మెయిల్ ట్రాష్ ఫోల్డర్ లో ఉంటుంది. దాన్ని రిస్టోర్ చేసి ఆ రెండు మెయిల్స్ నాకు ఫార్వర్డ్ చేయండి. అలాగే మీకు వచ్చిన వాట్సాప్ మెసేజ్ కూడా పంపండి" అంటూ తన మెయిల్ ఐడి చెప్పింది ప్రవల్లిక.
భర్త చేతి నుండి ఫోన్ తీసుకున్న ప్రమీల "నేను ఇప్పుడే హైదరాబాద్ కి బయలుదేరుతున్నాను. ఈ లోపల నువ్వు కాస్త శ్రద్ధ తీసుకొని, మా అమ్మాయి ఎక్కడ ఉందో వాకబు చేయి. నీకు పుణ్యం ఉంటుంది" అంటూ అభ్యర్థించింది.
అటువైపు నుండి ప్రవల్లిక మాట్లాడుతూ "తప్పకుండా ఆంటీ! ఈ విషయం మీరు నాకు చెప్పాలా? ప్రియా నా స్నేహితురాలు. తను ఎక్కడ ఉందో కనుక్కోవడం నా బాధ్యత. మీరు హైదరాబాద్ కి బయలుదేరడం మంచి నిర్ణయం. ఏమీ జరక్కపోయినా ఒకసారి అమ్మాయిని చూసినట్లు ఉంటుంది. ఇక ఉంటాను. ఏవైనా విషయాలు తెలిస్తే మీకు కాల్ చేస్తాను. మీరు కూడా అవసరమైనప్పుడు కాల్ చేయండి" అని చెప్పి ఫోన్ పెట్టేసింది.
ఆ రెస్టారెంట్ లో కాఫీ తాగి బయటకు వచ్చారు ప్రభాకరరావు దంపతులు. భార్యను బస్టాండ్లో దింపి "రేపటి నుంచి లీవ్ పెట్టి నేను కూడా సాయంత్రం బయలుదేరుతాను. నువ్వు ధైర్యంగా ఉండు. అమ్మాయి అల్లుడితో కలిసి వెళ్ళింది కదా! అతను చాలా మంచివాడు. అమ్మాయికి అతని వల్ల ఏ సమస్యా రాదు" అని భార్యకు ధైర్యం చెప్పాడు.
బస్టాండ్ లో ఉన్నాం అన్న స్పృహ కూడా లేకుండా బిగ్గరగా ఏడ్చేసింది ప్రమీల. ఆమెను సీట్లో కూర్చోబెట్టి మరోసారి ధైర్యం చెప్పాడు ప్రభాకరరావు.
మరి కొద్ది సేపటికే బస్సు కదిలింది. ఉబికి వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ భర్తకు బై చెప్పింది ప్రమీల.
***
అక్కడ హైదరాబాద్ లో తన స్నేహితుడు, కాబోయే డి.ఎస్.పి ఉదయ్ కి కాల్ చేస్తాడు తరుణ్.
"చెప్పు తరుణ్! నిన్ను ఎక్కడ కలవమంటావు?" అడిగాడు ఉదయ్.
"నేను ప్రస్తుతానికి నా స్నేహితుడి రూమ్ లో ఉన్నాను. అతడు ఆఫీస్ కి వెళ్ళాడు. నేనిప్పుడు ఒంటరిగానే ఉన్నాను" అంటూ చిరునామా చెప్పాడు తరుణ్.
"ఓకే తరుణ్! ఓ అరగంటలో నేను నీ దగ్గర ఉంటాను. నువ్వేమీ టెన్షన్ పడొద్దు. చెప్పానుగా.. నీ తప్పు లేకపోతే నిన్ను తప్పకుండా కాపాడుతాను" అన్నాడు ఉదయ్.
చెప్పినట్లుగానే మరో అరగంటలో తరుణ్ ప్రస్తుతం ఉన్న అతని స్నేహితుడి గదికి చేరుకున్నాడు.
ఒకసారి తరుణ్ వంక పరిశీలనగా చూశాడు ఉదయ్. తరుణ్ ముఖం పాలిపోయి వుంది. భయంతో ఉన్నాడు.
ఉదయ్ అతని భుజం మీద మృదువుగా తట్టి, "రిలాక్స్ తరుణ్!" అంటూ అతన్ని కూర్చోబెట్టి తను పక్కనే కూర్చున్నాడు.
"ఇప్పుడు చెప్పు తరుణ్.. అసలు ఏం జరిగింది? ఏదో మర్డర్ కేసులో ఇరుక్కోబోతున్నట్లు చెప్పావు. ఏమిటది? అయితే చెప్పే ముందు ఒక్క విషయం గుర్తుంచుకో.. నా దగ్గర ఏ చిన్న విషయం కూడా దాచవద్దు. పూర్తిగా జరిగింది జరిగినట్టు చెప్పు. అప్పుడే నేను నీకు సరైన సలహా ఇవ్వగలను" అన్నాడు ఉదయ్.
"అలాగే ఉదయ్! నీ దగ్గర ఏదీ దాచను. రెండు రోజుల క్రితం ప్రియా నిద్రలో దిండుతో తనకు ఊపిరాడకుండా అదుముకుంటూ మూలుగుతూ ఉంది. నేను ఆ దిండు లాగి పడేసి తనని నిద్ర లేపాను. తన మానసిక స్థితి సరిగ్గా లేక అలా చేసి ఉంటానని అంది. మరోసారి ఇలాంటి ప్రయత్నం చేసి తనకు ఏదైనా అయితే అందరూ నన్ను అనుమానిస్తారని భావించింది.
తనకు ఏదైనా జరిగితే అందులో నా ప్రమేయం లేదని ఒక ఉత్తరం రాసింది. నేను కోపగించుకొని ఆ ఉత్తరాన్ని నలిపి పడేశాను. కానీ ఏదైనా జరగరానిది జరిగితే నా నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి ఆ ఉత్తరం ఉపయోగపడుతుందని భావించి దాన్ని భద్రపరిచాను. ప్రియా కు ఎందుకో నా మీద అనుమానం కలిగింది. ప్రియను సమాధానపరచి, కాస్త రిలాక్స్ అవుదామని, ఏదైనా రిసార్ట్ కు వెళదామని చెప్పాను.
మరుసటి రోజు ఇద్దరం లీవ్ పెట్టి రిసార్ట్ కు వెళ్లాం. ఇద్దరం సరదాగానే గడిపాం. ఆరోజు రాత్రి అక్కడ ఉన్న రెస్టారెంట్ లో ఇద్దరం లంచ్ తీసుకుంటూ ఉన్నాం.
హఠాత్తుగా ప్రియ 'అదిగో.. అక్కడ చూడండి' అంటూ రెస్టారెంట్ నుంచి వెళ్తున్న ఒక జంట ను చూపించింది. నేను చూసేటప్పటికే వాళ్ళు మెయిన్ ఎంట్రన్స్ దాటుతున్నారు.
"ఎవరు వాళ్ళు?" అడిగాను నేను.
"అదేమిటి.. ఆ అమ్మాయి తెలీదా! హన్సిక" అంది.
"హన్సిక ఇక్కడ ఎందుకుంటుంది? తను బెంగుళూరు వెళ్తానని మన దగ్గర నుండి వెళ్లేటప్పుడు చెప్పింది కదా" అన్నాను నేను.
'తనతో టచ్ లోనే ఉన్నావన్నమాట. విషయం అర్థమవుతోంది' నా వంక సూటిగా చూస్తూ అంది ప్రియ.
చుట్టుపక్కల ఒకరిద్దరు మా వంక ఆసక్తిగా చూడడం గమనించి ప్రియ చెయ్యి పట్టుకుని 'పద.. హన్సిక అవునో కాదో చూద్దాం' అంటూ రెస్టారెంట్ నుండి బయటకు తీసుకొని వచ్చాను. కాస్త దూరంగా వెళుతున్న జంటను చూసి తప్పట్లు తట్టి పిలిచాను. వాళ్ళు వెనక్కి తిరిగారు. ఆమె హన్సిక కాదు. వాళ్లకు సారీ చెప్పి 'వెళ్ళండి 'అన్నాను.
తరువాత ప్రియ వైపు తిరిగి 'చూశావా.. ఎవరినో చూసి హన్సిక అనుకున్నావు' అన్నాను. 'ఇందాక నేను చూపించింది వీళ్ళని కాదు. నువ్వు ఇంకెవరినో పిలిచి హన్సిక కాదని నన్ను నమ్మించాలని చూస్తున్నావు' అంది ప్రియ.
నేను మరేం మాట్లాడకుండా ఆమె చెయ్యి పట్టుకుని మేము ఉంటున్న కాటేజ్ లోకి తీసుకొని వెళ్ళాను. ప్రియా ను సోఫాలో కూర్చో బెట్టి 'నువ్వు నన్ను అనవసరంగా అనుమానిస్తున్నావు' అన్నాను.
' హన్సిక ఇక్కడ ఉందని తెలిసే నన్ను ఇక్కడికి తీసుకొని వచ్చావు. ఈ రాత్రికి ఆమెతో కలిసి నన్ను ఏదో చేయాలని ప్లాన్ చేస్తున్నావు' అని గట్టిగా అరిచింది.
'పిచ్చిగా ఆలోచించకు ప్రియా! అసలు నిన్ను ఏదో చేయాల్సిన అవసరం నాకు ఏమిటి? నువ్వంటే ఇష్టం లేకుంటే నీకు డైవోర్స్ ఇచ్చి వేరే పెళ్లి చేసుకో గలను. నీ దగ్గర నుండి నాకు రావలసిన ఆస్తిపాస్తులు ఏమీ లేవు. నీ ఆర్థిక పరిస్థితి తెలుసు కాబట్టి పెళ్లికి ఎక్కువ ఖర్చు పెట్టించొద్దని మా వాళ్లకు చెప్పాను' అంటూ పెళ్లయినప్పటి నుండి తనతో నా ప్రవర్తన ఎలా ఉందో గుర్తు చేశాను. తను నమ్మినట్లే నాకనిపించింది.
రాత్రి నాకు హఠాత్తుగా మెలకువ వచ్చి చూసేసరికి పక్కన ప్రియ లేదు. వాష్ రూమ్ లో ఉందేమో అని చూసాను.. లేదు! ఆ కాటేజీలో చిన్న వంటగది, ఒక హాలు ఉన్నాయి. ఎక్కడా తను కనపడలేదు. డోర్ తెరిచి చుట్టుపక్కల చెట్ల కింద పరిచి ఉన్న బెంచీల మీద కూర్చొని ఉందేమోనని వెదికాను. ఎక్కడా కనబడలేదు. తిరిగి కాటేజ్ లోకి వెళ్లాను.
బెడ్ రూమ్ తలుపు లోపలినుండి లాక్ చేసి ఉంది.
'ప్రియా.. ప్రియా..' అంటూ తలుపులు గట్టిగా బాదాను. కొంతసేపటి తర్వాత తలుపు తెరిచింది ప్రియ. ఆమె కళ్ళు నిస్తేజంగా ఎటో చూస్తూ ఉన్నాయి.
ఆమె భుజం పట్టి కుదుపుతూ 'ఇంత రాత్రి పూట ఎక్కడికి వెళ్లావు ప్రియా?'అని అడిగాను. ఆమె సమాధానం చెప్పలేదు. ఫ్రిజ్ నుండి వాటర్ బాటిల్ తీసి చల్లటి నీళ్లు ఆమె ముఖం మీద చిలకరించాను. ఉలిక్కిపడి ఈ లోకంలోకి వచ్చింది ప్రియ.
'ఇప్పుడు చెప్పు ప్రియా! బయటికి ఎందుకు వెళ్లావు?' అని అడిగాను.
'హన్సిక ఈ బెడ్ రూమ్ కిటికీ దగ్గరకు వచ్చి 'ప్రియా.. బయటికి రా! వచ్చి నన్ను కాపాడు..' అంటూ పిలిచింది. నేను నేను డోర్ తీసుకుని బయటకు వెళ్లాను. అప్పటికే ఆమె మన పక్క కాటేజీలో కి వెళుతూ ఉంది. నేను వెళ్లేసరికి డోర్ వేసి ఉంది. నేను తలుపు తట్టాను. ఒక యువకుడు తలుపు తీసి ఎవరు కావాలని అడిగాడు.
'హన్సిక అనే అమ్మాయి ఇక్కడ ఉందా' అని అడిగాను.
'ఎవ్వరూ లేరు. ఇలా రాత్రిపూట పక్క కాటేజ్ వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఏమిటి' అంటూ విసురుగా తలుపు వేసుకున్నాడు' అని చెప్పింది ప్రియ.
ఆమె చెబుతున్నది నిజమా భ్రమా నాకు తెలియలేదు. ఆమె చేతికి రక్తపు మరకలు అంటి ఉండటం గమనించాను. ప్రియాను అక్కడే ఉండమని చెప్పి నేను పక్క కాటేజ్ దగ్గరకు వెళ్లాను. తలుపులు తీసే ఉన్నాయి. లోపలికి వెళ్లి 'ఎవరిక్కడ' అని అరుస్తూ ఆ కాటేజ్ మొత్తం తిరిగాను. ఎవరూ లేరు బెడ్ రూమ్ లో పెనుగులాట జరిగినట్లు ఉంది. పిల్లో దూరంగా పడి ఉంది. నేల మీద ఎవరో శుభ్రం చేయగా మిగిలిపోయిన రక్తపు మరకలు లాంటివి కనిపించాయి. ఏం జరిగిందో అర్థం కాక వెంటనే నేను ఉన్న కాటేజ్ లోకి వచ్చాను. అక్కడ ప్రియ లేదు. బెడ్ మీద ఒక చిన్న స్లిప్ రాసి ఉంది.
'హన్సికను నేనే చంపేశాను.. ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను' అని ఆ స్లిప్ లో ఉంది" చెప్పడం ఆపాడు తరుణ్.
జరిగిన సంఘటన తాలూకు భయం ఇంకా అతన్ని వణికిస్తోంది.
ఇంతలో ఉదయ్ సెల్ మోగింది. అతని బాబాయ్ ఏసీపీ ప్రతాప్ కాల్ చేస్తున్నాడు.
"చెప్పండి బాబాయ్" అన్నాడు ఉదయ్, కాల్ లిఫ్ట్ చేసి.
"సంజనా రిసార్ట్ సమీపంలో ఒక మహిళ శవం దొరికింది. శవం పూర్తిగా కాలిపోయి గుర్తుపట్టలేని విధంగా ఉంది. ఆ రిసార్ట్ రికార్డులు మనం సీజ్ చేసే లోగా ఎవరో దొంగిలించినట్లు వాళ్లే కంప్లైంట్ ఇచ్చారు. సీసీటీవీ తాలూకు హార్డ్ డిస్క్ కూడా దొంగతనం జరిగినట్లు వాళ్ళు కంప్లైంట్ చేశారు. మొదటగా విచారణ కోసం వాళ్ల దగ్గరకు వెళ్ళిన ఎస్ఐ రంగనాథం వాళ్లతో లాలూచీపడి ఉంటాడని నా అనుమానం.
సీఐ మురళి ఆధారాలు సేకరించడానికి స్పాట్ కి వెళుతున్నాడు. ఇప్పుడే డిటెక్టివ్ పురంధర్ గారి అమ్మాయి ప్రవల్లిక కాల్ చేసింది. తన స్నేహితురాలు ప్రియ, హన్సిక అనే ఇద్దరు కనిపించడం లేదని చెప్పింది. రిసార్ట్ దగ్గర దొరికిన శవం ఆ ఇద్దరిలో ఎవరో ఒకరిది కావచ్చు.
వీలుంటే వెంటనే బయలుదేరి నువ్వు కూడా రిసార్ట్ దగ్గరకు వెళ్ళు. పురంధర్ గారి అమ్మాయి ఆల్రెడీ అక్కడికి బయలుదేరింది. ఆమెకు కాస్త సహాయం గా ఉండు. పురంధర్ గారు బెంగళూరు నుండి రేపు రిటర్న్ అవుతారు. అన్నట్లు నువ్వు పెట్టిన మెసేజ్ చూశాను. అలాగే కానిద్దాం" అని చెప్పి కాల్ కట్ చేశాడు ప్రతాప్.
తరుణ్ వంక చూస్తూ "నువ్వు, ప్రియ వెళ్ళిన రిసార్ట్ సమీపంలో ఒక మహిళ శవం దొరికింది. ఆ శవం పూర్తిగా కాలిపోయి ఉంది. నన్ను అర్జెంటుగా ఆ స్పాట్ కి వెళ్ళమని ప్రతాప్ గారు చెప్పారు. కాబట్టి నేను వెంటనే బయలుదేరుతున్నాను. తిరిగి వచ్చాక నిన్ను కలుస్తాను' అన్నాడు.
"నేను ఇక్కడ ఉన్నట్లు మీ బాబాయ్ కి చెప్పావా?" అడిగాడు తరుణ్.
అవును. మెసేజీ పెట్టాను. ప్రస్తుతానికైతే నిన్ను ఎవరూ అరెస్టు చేయరు. కానీ నీ మీద నిఘా ఉంటుంది. నువ్వు తప్పించుకోవాలని చూస్తే మాత్రం ఖచ్చితంగా నిన్ను అరెస్ట్ చేస్తారు" అని చెప్పి అక్కడి నుంచి బయల్దేరాడు ఉదయ్.
"నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను ఉదయ్! నువ్వు తప్ప నన్ను ఎవరూ కాపాడే వారు లేరు" అంటూ ముఖాన్ని రెండు చేతుల్లో పట్టుకొని బిగ్గరగా ఏడ్చాడు తరుణ్.
"రిలాక్స్ మై బాయ్.." అంటూ అతని భుజం తట్టి, బయటకు వెళ్ళాడు ఉదయ్.
అతను వెళ్ళిన కాసేపటికి తన రూమ్ డోర్ తెరుచుకొని అటూ ఇటూ పరిశీలించాడు తరుణ్. కుడివైపున ఉన్న బడ్డీ కొట్టు సమీపంలో ఇద్దరు వ్యక్తులు నిలుచుని సిగరెట్లు కాలుస్తూ మధ్య మధ్యలో తన రూం వైపు చూడడం గమనించాడు. అలాగే ఎడమ వైపు ఉన్న టీ స్టాల్ దగ్గర మరో ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటూ మధ్య మధ్యలో తన రూం వైపు చూడడం కూడా అతని కంట్లో పడింది.
=====================================
ఇంకా ఉంది...
=====================================
మల్లవరపు సీతారాం కుమార్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
Podcast Link
Twitter Link
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం:
నమస్తే! నా పేరు మల్లవరపు సీతారాం కుమార్. శ్రీమతి పేరు మల్లవరపు సీతాలక్ష్మి. ఇద్దరమూ రచనలు చేస్తుంటాము. ఇప్పటికి దాదాపు 25 కథలు మనతెలుగుకథలు.కామ్, కౌముది, గోతెలుగు.కామ్, సుకథ.కామ్ లాంటి వెబ్ మ్యాగజైన్ లలో ప్రచురితమయ్యాయి. స్వస్థలం నెల్లూరు. తెలుగు కథలంటే చాలా ఇష్టం. మనతెలుగుకథలు.కామ్ వారికి ఎడిటింగ్ లో సూచనలు, సలహాలు ఇస్తుంటాము ( అందువలన మా రచనలు పోటీలకు పరిశీలించబడవు!).
Comments